N. Sairam Garu : +91 7901268716 || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.Sunday, 6 October 2013

SwamiNarayan - Episode 1

జై శ్రీ స్వామినారాయణ్

ఉద్ధవ సాంప్రదాయానికి ప్రతినిధిగా ఉన్న శ్రీ రామానందస్వామి సాక్షాత్తు ఉద్ధవ అవతారమే. ఆయన 21 సంవత్సరాల వయసున్న శ్రీ స్వామి నారాయణ్ వారిని తమ ఉత్తరాధికారిగా  సౌరాష్ట్రలోని జెట్ పూర్ అనే గ్రామంలో క్రీ.శ.1802 విక్రమశకం 1858 కార్తిక మాసంలోని ఏకాదశినాడు నియమించారు. సన్యాస దీక్షనిచ్చిన గురువు ఆ యువ బ్రహ్మచారికి స్వామి సహజానంద మరియు నారాయణ మునిగా పేరు పెట్టారు. ఉత్తరాధికారిగా నియమింపబడిన తర్వాత వారు ఉద్ధవ సాంప్రదాయాన్ని సంస్కరించి, స్వామినారాయణ సంప్రదాయాన్ని ఏర్పరిచారు. ప్రపంచవ్యాప్తంగా 4000 పైచిలుకు శ్రీ స్వామినారాయణ ఆలయాలు నెలకొల్పబడ్డాయి. కొన్ని కోట్లమంది స్వామినారాయణ్ భక్తులు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు.


శ్రీ స్వామి నారాయణ్ (పూర్వనామము నీలకంఠవర్ణి) వారు సద్బ్రాహ్మణ కుటుంబంలో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యనగరానికి దగ్గరలోని చపయ్య అనే గ్రామంలో చైత్ర మాసం శుద్ధ నవమినాడు, క్రీ.శ.1781 విక్రమశకం 1837 ఏప్రిల్ 2న హరిప్రసాద్ పాండే, ప్రేమావతి దంపతులకు జన్మించారు. ఈ దంపతులు శ్రీ కృష్ణపరమాత్ముని పరమ భక్తులు. వారే తరువాత ధర్మదేవ్ మరియు భక్తిమాతగా, శ్రీ కృష్ణుని ఆంతరంగిక భక్తులుగా ప్రఖ్యాతిగాంచారు. తల్లిద్తండ్రులు పరమపదించిన తరువాత స్వామి వారు 11 సంవత్సరాల చిరుప్రాయంలోనే భక్తిమార్గాన్వేషణలో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది, జనులనుద్ధరించడానికి తీర్థ యాత్రలు చేసాడు. భారత దేశమంతటా కాలినడకన 12 వేల కిలోమీటర్లు పర్యటించారు. ఈ యాత్రను పూర్తిచేయడానికి ఆయనకు సుమారు 7 సంవత్సరాల ఒక నెల 13 రోజులు పట్టింది.  చపయ్య నుంచి మొదలైన వారి ఆధ్యాత్మిక ప్రయాణం ఉత్తరాదిన హిమాలయాల నుండి దక్షిణాదిన కన్యాకుమారి వరకు, ఇటు తూర్పు నుండి పడమరవరకు మొత్తం భారత దేశ పర్యటన చేసారు. చివరగా సౌరాష్ట్రలోని లోజ్ అనే గ్రామంలోని శ్రీ రామానంద వారి ఆశ్రమాన్ని చేరుకున్నారు.

ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో అనుభవాలను పొందారు, అనేక కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. జటిలమయిన యోగ సాధనాలు, తీవ్రమయిన తపస్సును చేసారు. ఎంతో మంది సాధువులను, తాంత్రికులను, కపట సన్యాసులను తన ఆధ్యాత్మిక శక్తితో సజ్జనులుగా మార్చారు. సాధారణ మానవుని వలె ఉత్తమమయిన ఆధ్యాత్మిక గురువుల వద్ద శిష్యరికం చేసారు. చివరగా ఆయన గుజరాత్ లోని సౌరాష్ట్రలో స్థిరనివాసమేర్పరచుకున్నారు. అక్కడనుంచి ప్రధానంగా గుజరాత్ రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో, గ్రామాలలో పర్యటిస్తూ లక్షలాదిమంది మనసులలో ధృడమయిన దైవభక్తిని, ఆధ్యాత్మిక భావనలను పెంపొందించారు. బీడీ, చుట్ట, గంజాయి, చిలుము తాగడం వంటి వ్యసనాల బారిన పడిన లక్షలాదిమందిని విముక్తుల్ని చేసారు. మద్యమాంసాలను సేవించే వారిని కూడా మార్చగలిగారు. అంతేకాక సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు ముఖ్యంగా స్త్రీ, భ్రూణ హత్యలు, సతీ సహగమనం, బాల్యవివాహాలు వంటివి నిర్మూలించారు. స్త్రీవిద్యను ప్రోత్సహించారు. సత్సంగాలు, సామూహిక భోజనాలను ఏర్పాటు చేసారు. యజ్ఞాలలో జరిగే జంతుబలులను నిరోధించి, అహింసా మార్గంలో యజ్ఞయాగాదులను నిర్వహించారు. చర్చల ద్వారా గ్రామాలలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారాలు చూపారు. 

ఐకమత్యాన్ని అభిలషించారు. సమిష్టి కృషికి ప్రాధాన్యమిచ్చారు. వారి 49 ఏళ్ళ జీవిత కాలంలో 28 సంవత్సరాలు సమాజ శ్రేయస్సు కోసం అనేక విధాలుగా శ్రమించారు. అన్య మతస్థులయిన ఎంతోమంది మహమ్మదీయ రాజులు, నవాబులు, ఆంగ్లేయ అధికారులు  మరియు క్రైస్తవ మతాధికారులను సైతం ప్రభావితం చేసినటువంటి విశేషమయిన అవతారమే స్వామినారాయణ్. క్రమక్రమంగా ఆయన ఖ్యాతి గుజరాత్ ను దాటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు అనేక ఇతర ప్రాంతాలలో కూడా వ్యాపించింది. ప్రజలందరి చేత వారు భగవాన్ శ్రీ స్వామినారాయణ్ గా కీర్తింపబడ్డారు, సాక్షాత్తు నరనారాయణ అవతారంగా ఆయనను భావించారు. వారి బాల్యం నుండి చివరి వరకు జరిగిన అనేక అద్భుత లీలలు, సన్నివేశాల సమాహారమే శ్రీ భగవాన్ స్వామినారాయణ్ పావన చరిత్ర. వారి ఒక్కొక్క లీల పరమాద్భుత హేల, సందేశాల మాల. చదివి తరించండి.


శ్రీ భగవాన్ స్వామి నారాయణ్ యొక్క పావన పుణ్య కథ నాంది

17వ శతాబ్దం చివరి భాగం భారతదేశంలో శ్రీ కృష్ణ భగవానుడు అవతరించినటువంటి పుణ్యభూమి గుజరా దేశంలో (రజో భూమి) ప్రస్తుతం గుజరాత్ లో విపరీతమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. అప్పుడప్పుడే మొగలాయి చక్రవర్తులు, తురుష్కులు వారి రాజ్యాలని మెల్లమెల్లగా భారతదేశంలో విస్తరింప చేసుకుంటున్నటువంటి రోజులు. ఎటు చూసిన అరాచకమే.మరాఠా దేశం నుంచి కొంతమంది తమ అనుచరులతో మెరుపు దాడి వలె గుజరాత్ లోని ముఖ్యంగా సౌరాష్ట్ర మరియు తదితర ప్రాంతాల మీద దాడి చేసి విచక్షణా రహితంగా అక్కడి ప్రజలనుంచి, వ్యాపారస్తుల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ ప్రజలు వారి గాయాల నుంచి పూర్తిగా కోలుకోకుండానే మరొక  మరాఠా ముఠా వారిని పన్నులు చెల్లించమని వేధిస్తూ ఉండేవారు. అప్పటికే సర్వం కోల్పోయిన ప్రజలు ఎంత ప్రాధేయపడ్డ ఆ కర్కశ హృదయులకీ ఏ మాత్రం జాలి కలిగేది కాదు.

ప్రజలని భయపెట్టడానికి అక్కడ ఎదురుపడిన వారి మస్తిష్కాన్ని పదునైన ఒక కరవాలంతో దేహం నుంచి ఒకే ఒక వేటుతో తెగ నరికేవారు. అందినకాడికి దోచుకుపోవటం, ఇళ్ళు తగలపెట్టడం, స్త్రీలని చెర బట్టడం వంటి పరమ నీచమయిన పనులకి పాల్పడుతూ ప్రజలని భయభ్రాంతులని చేస్తుండేవారు. ఇదే కథ గుజరాత్ లో ప్రతి చోట నిత్యం జరుగుతుండేది. ఈ దుర్మార్గులు సామాన్య ప్రజలనే కాక సత్పురుషులను, పుణ్య స్త్రీలను కూడా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్దేవారు. అక్కడ రాజ్యాదికారులు కూడా ఏమి పట్టనట్లు ఉండేవారు. ఎవరికి ఫిర్యాదు చెయ్యాలి, ఎవరి దగ్గిరకి వెళ్లి రక్షణ కోరాలి అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కొంతమంది ధైర్యం చేసి వారి యొక్క నాయకుల దగ్గరకి వెళ్లి తమ గోడు వినిపించిన కూడా ఏమి పట్టించుకునేవారు కాదు; వాళ్ళు కూడా ఈ చిన్న దొంగలతో చెయ్యి కలిపి వారు అక్రమంగా సంపాదించిన ధనంలో వాటాలు పంచుకోవడం వల్ల ఈ రకంగా వచ్చినవారిని అధికంగా శిక్షిస్తూ ఉండేవారు.

ఈ విధంగా రాజ్యమంత అల్లకల్లోల స్థితిలో ఉంది. దీనికి తోడు తురుష్కుల యొక్క దాడి, హిందువులలో అనైక్యత ఎక్కడ స్త్రీలని గౌరవించక పోవటం లాంటి అకృత్యాలు జరుగుతుండేవి. ఆ కాలపు సాంఘిక పరిస్థితులు కూడా స్త్రీలకి వ్యతిరేకంగా ఉండేవి. బాల్య వివాహాలు, విధవలను చీకటి కొట్లో బంధించడం, వారికి చాలీచాలని ఆహరం ఇచ్చి శుష్కింపచెయ్యడం, వారిని జీవితాంతం పని మనుషులుగా చూడడం జరిగేది. పైగా భర్త చనిపోతే భార్యను వారికి ఇష్టం ఉన్నా, లేకపోయినా సతి సహగమనం చేయిస్తుండేవారు. మగవారు మాత్రం భార్య చనిపోతే వేరే స్త్రీలను ఎంతమందినైనా వివాహం చేసుకునే అర్హత కల్పించారు. ఈ రకంగా గుజరాత్ రాష్ట్రమంతా శాంతి భద్రతలు కరువై కొట్టు మిట్టాడుతూ ఉండేది. ప్రజలు దిక్కుతోచని పరిస్థితులలో తమను రక్షించుకోటానికి తాంత్రికులని (వామాచారం పద్ధతులలో పూజలు చేసేవారు)  ఆశ్రయిస్తుండేవారు. వారిలో దుర్మార్గులయిన కొంతమంది తాంత్రికులు వారిని ఆశ్రయించిన ప్రజలను దోచుకునేవారు. స్త్రీలను వశపరచుకుని వారిని శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ఉండేవారు. 

ఇటు దక్షిణాచార పూజారులు తమ పూజకు ఆవు నెయ్యి, పాలు, తేనె, పెరుగు, చక్కర, తదితర మిగతా సుగంధాలు వాడితే వామాచార తాంత్రికులు ముఖ్యంగా రక్తాన్ని, మాంసాన్ని ఉపయోగించేవారు. అప్పుడప్పుడు నరబలులు కూడా ఇస్తుండేవారు. ఈ రకంగా గుజరాత్ రాష్త్రం చాల దయనీయ పరిస్థితిలో ఉంది. భగవంతుడు తమను రక్షించడానికి ఎప్పుడు వస్తాడా అని ప్రజలు అహర్నిశలు ఆయనను ప్రార్థిస్తూ ఉండేవారు. ఈ పరిస్థితులలో ఆ కృష్ణ పరమాత్ముడు తను ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడని అందరు భావిస్తూ ఉండేవారు.
"యదా యదా హి ధర్మస్య, గ్లానిర్వ  భవతి  భారత |
అభ్యుథానం అధర్మయ్స్య తదాత్మానం శ్రిజమి అహం ||"

దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ కోసం తను ప్రతి యుగంలో ను అవతరిస్తానని ఆయన మాట ఇచ్చారు. కాని పరిస్థితి ఇంత విషమంగా మారి ప్రజలు బ్రతకలేక, చావలేక ఇన్ని ఇక్కట్లు పడుతున్నపుడు, ఎవరు ఆయన వాగ్దానాన్ని గుర్తుచేస్తారో, కాలమే దానికి జవాబు చెప్పవలసి ఉంటుంది.   కాలచక్రం ఈ విధంగా సాగిపోతోంది. పాపాత్ముల యొక్క వికృత చేష్టలు మితిమీరి పోతున్నాయి. భ్రూణ హత్యలు సర్వసాధారణం అయిపోయాయి. సమాజంలో ఉన్న విపరీత పరిస్థితులు, అనాచారాల వాళ్ళ తల్లితండ్రులు తమకు పుట్టిన శిశువు ఆడ పిల్ల అయితే వారిని మరుగుతున్న పాలల్లో ముంచి మృత్యు లోకానికి పంపిస్తున్నారు. ప్రజల హాహాకారాలు మిన్నుముట్టి అవి బదరికా వనానికి చేరుకున్నాయి.

బదరికావనం - దూర్వాసుని ఆగమనం

పుణ్యక్షేత్రమయిన బదరికావనంలో నరనారాయణులు తపస్సు చేసుకుంటూ నిరంతరం సమాధి స్థితిలో ఉండేవారు. అలాంటి సమయంలో ఒకసారి కొంతమంది మహర్షులు, యోగులు, పుణ్య పురుషులు, స్త్రీలు కలసి అక్కడకు చేరుకొని, స్వామీ సమాధి స్థితి నుంచి బయటకు రాగానే అందరు ఒక్కపెట్టున తమ గోడుని  విన్నవించుకున్నారు. వారు ఇలా ప్రార్ధించారు " భగవాన్ మీరు లోగడ  వాగ్దానం చేసి ఉన్నారు, భూలోకంలో పాపం పెరిగి పుణ్యం అడుగంటినప్పుడు దుష్టులను శిక్షించడానికి, శిష్టులను అనుగ్రహించడానికి అవతారిస్తానని చెప్పారు. ఇపుడు భారత దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ పుణ్యాత్ములకి ఎటువంటి రక్షణ లేకుండా పోయింది, ఎక్కడ చూసిన అరాచకమే, భూమాత కూడా ఈ బాధను ఓర్చుకోలేక దుఃఖపడుతున్నది. ఈ పాపాత్ముల యొక్క భారము ఆవిడ భరించలేకపోతున్నది, ఆవిడ ప్రార్థన కూడా మీ చెవికి చేరలేదా ప్రభు?" ఈ సమూహంలోనే ఉన్న ధర్మదేవ్ అనే పుణ్య పురుషుడు చేతులు జోడించి "స్వామి సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితి ఉన్నది, ధర్మ మార్గంలో ప్రయాణించడమే అక్కడ పాపం అని భావిస్తున్నారు. మీరు మరి తప్పకుండా మీ అవతారాన్ని భూలోకంలో ప్రవేశపెట్టి మమ్మల్ని రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాము" అని అన్నాడు.   అందరు ఇలా స్వామిని ప్రార్థిస్తూ ఉండగా అప్పుడే అక్కడకు వచ్చిన దూర్వాస మహర్షిని ఎవరు గమనించలేకపోయారు.


దుర్వాసుడు మహా కోపంతో "నేను ఎంతోసేపటి నుంచి ఇక్కడే ఉన్నా, నన్ను మీరెవరు పట్టించుకోలేదు. ఇంత అహంకారమా మీకు, మీరందరూ కూడా మృత్యు లోకానికి వెళ్ళిపోతారు" అని అక్కడ ఉన్నా యోగులని, మహర్షులని శపించారు. అలాగే అక్కడ ఉన్న పుణ్య పురుషులను, స్త్రీలను "మీరు కూడా భూలోకానికి వెళ్లి నానా కష్టాలు పడుదురుగాక" అని శపించారు. అప్పుడు అక్కడే ఉన్న భక్తిమాత అనే పుణ్య స్త్రీ వినయంగా, "మహర్షి మేము ఇప్పటికే భూలోకంలో ఎన్నో కష్టాలు పడుతున్నాము. మా కష్టాలని మేము స్వామికి స్వయంగా విన్నవించుకుని తరుణోపాయం అడగడానికి వచ్చాము. మీరు ఇటువంటి శాపాలు ఇస్తే ఇక ముందు ముందు ఎవరికి మా బాధలు చెప్పుకోవాలి. ఇలాంటి శాపాలు ఇవ్వడం వాళ్ళ మీకేమి లాభము, మీరే చెప్పండి" అని అడిగింది. దానికి దూర్వాసుడు ఇలా అన్నారు, "నా శాపాలు మీ అందరికి మంచి పరిణామాన్నే ఇస్తాయి, నేను నారాయణుడు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుచెయ్యడానికి వచ్చాను మీరేమి భయపడకండి. స్వామి తగిన సమయానికి భూలోకంలో అవతరిస్తారు. శిష్టులను రక్షించి, దుష్టులను ప్రేమపూర్వకంగా వారిలో మార్పు తెచ్చే ఒక నూతన అవతారంతో వస్తారు. ఆయన అవతరించిన తక్షణమే నేను శపించిన యోగులు, మహర్షులు కూడా మరల పుణ్యలోకానికి తిరిగి వచ్చేస్తారు. అలాగే మీరు కూడా ఆ స్వామి వారి అవతారంతో ధన్యులవుతారు". దూర్వాసుడు నరనారాయణుడిని ఉద్దేశించి "స్వామీ, తమరెప్పుడు మీ అవతారాన్ని భూమి మీద ప్రవేశ పెడతారు. ప్రజలంతా మీ రాక కోసం ఎదురుచూస్తున్నారు" అని అడిగాడు. 

అపుడు నారాయణుడు జనులను ఉద్దేశించి "దూర్వాసులు లాంటి గొప్ప మహర్షులు ఇచ్చే శాపాలు నిజానికి శాపాలు కావు, అవి ఏదో రకంగా లోకకల్యాణం కొరకే పనికి వస్తాయి. ఆ మహర్షుల సంకల్పము చాల మంచిదే, నేను తప్పక సమయము చూసుకుని భూలోకంలో అవతరిస్తాను, మీరు కూడా భూలోకంలో రకరకాల పాత్రల్లో జన్మించి నా కృపకు పాత్రులవుతారు. మీరేమి భయపడకండి" అని శాంతవచనాలు చెప్పారు. అపుడు వారందరూ ఏక కంఠంతో "భగవాన్ మీరు ఎప్పుడు, ఎక్కడ అవతరిస్తారు, ఎవరికీ జన్మిస్తారు దయ చేసి మాకు చెప్పవలసినది" అని ప్రార్థించారు. దానికి నారాయణుడు ప్రశాంతంగా “నేను ఇక్కడే ఉన్న ధర్మదేవ్, భక్తి మాత అను పుణ్య దంపతులకు  ఉత్తరప్రదేశ్ లోని మఖోడా కి ఉత్తరంగా ఉన్న కోసల దేశంలో మనోరమా నదీ తీరంలో ఉన్న చపయ్య అనే గ్రామంలో జన్మిస్తాను. అది ఎంతో పవిత్రమయిన ప్రదేశము. అక్కడ ఎవరు అడుగుపెట్టిన కూడా వారికి సుఖశాంతులు అనుభవానికి వస్తాయి. కాబట్టి మీరేమి చింతించనవసరం లేదు" అని అభయమిచ్చి పంపించి వేసారు.