N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Sunday, 6 October 2013

SwamiNarayan - Episode 2

చపయ్య గ్రామము

చపయ్య  గ్రామము ఎంతో సుందరమైన, సశ్యశ్యామలమయిన పల్లెటూరు. ఆ ప్రదేశం ఎంత మహత్తు కలిగిందంటే సాక్షాత్తు సూర్య భగవానుడు కూడా ఆ ప్రదేశానికి సేద తీరడానికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. అటువంటి గ్రామంలో ప్రేమావతి (ఈమెనే అందరూ భక్తిమాత అని పిలిచేవారు) జన్మించింది. ఆమె తల్లితండ్రులు భక్తిమాతకి తగిన వరుడిని వెతికే పనిలో ఉండగా ఒక రోజు వారి ఇంటికి గొప్ప మహత్తు కలిగిన పురోహితుడు వచ్చారు. ఆయనను వీరు తమ బిడ్డకు మంచి సంబంధం చూసిపెట్టవలసినదని ప్రార్థించారు. ఆ పురోహితుడు భక్తిమాతను చూడగానే "ఆహ ఎంతటి సౌందర్యము, ఈమెలో ఆత్మసౌందర్యము మెండుగా ఉన్నది. ఈమె శక్తి ముందు భగవంతుడయిన తలవంచ వలసిందే" అనుకుని ఆమెకి నమస్కరించగా, ఆమె తల్లితండ్రులు ఆయనను "స్వామి మీ అంతటి గొప్పవారు చిన్నపిల్ల అయిన మా అమ్మాయికి నమస్కరించడం తగునా" అని వారించారు. దానికి ఆయన " మీ అమ్మాయి కారణ జన్మురాలు, ముందు ముందు ఆమె చరిత్ర ప్రసిద్ధికి ఎక్కుతుంది" అని చెప్పారు. దానికి ఆమె తల్లితండ్రులు తమ పుత్రిక కుండలిని ఆయనకు ఇచ్చి తగిన వరుడిని వెతకవలసిన బాధ్యత మీదేనని చెప్పారు. దానికి ఆయన తప్పకుండా నేనా పని చేస్తానని అంగీకరించి, వరుడి అన్వేషణలో ఉండిపోయారు.

ఈ గ్రామానికి దగ్గరలోనే "ఇటార్" అని మరొక గ్రామం ఉంది, అక్కడ కృష్ణ శర్మ, బాగ్యవతి అనే దంపతులకి హరిప్రసాద్ పాండే (ఈయననే ధర్మదేవ్ అని పిలిచేవారు) అనే ఒక మగ సంతానం ఉన్నది. వారు సంపన్నులు, ధార్మికులు. ఒకనాడు భక్తిమాతకి  పెళ్లి సంబంధం వెతుకుతున్న పురోహితులు కృష్ణశర్మ ఇంటికి రావడం జరిగింది. వారు ధర్మదేవ్ కుండలిని ఆయనకు యివ్వగా దానితో భక్తిమాత కుండలిని జతచేసి, వారిరువురికి వివాహం చేస్తే బాగుంటుందని ఆయన చెప్పగా ధర్మదేవ్ తల్లి తండ్రులు ఆ వివాహానికి సంతోషంగా అంగీకరించారు. అటు పిమ్మట ధర్మదేవ్, భక్తిమాతల వివాహం చపయ్య గ్రామంలో చాలా ఆడంబరంగా జరిగింది.   అయితే ఇదివరకు బదరికావనంలో సాక్షాత్తు నరనారాయణుడు తాను చపయ్య గ్రామంలో భక్తిమాత గర్భాన జన్మిస్త్తానని చెప్పడం జరిగింది, మరి ధర్మదేవ్ యొక్క నివాసం ఇటార్ గ్రామంలో. మరి వివాహం అయ్యాక దంపతులిద్దరూ ఇటార్లోనే ఉండాలి కదా, మరి నరనారాయణుడు చెప్పిన మాట ఎలా సాధ్యపడుతుంది అని కాలపురుషుడు ఆశ్చర్యపోతుండగా దానికి సమాధానం ఈ విధంగా దొరికింది. అప్పగింతల సమయంలో కృష్ణశర్మ భక్తిమాత తల్లితండ్రులను ఉద్దేశించి, "వివాహం చాలా ఘనంగా చేసారు, మమ్మల్ని మీరు ఎంతో ఆదరంగా చూసుకుని మాకెటువంటి ఇబ్బంది కానీ, లోటు కానీ రానీయలేదు. మీరు మాకు భక్తిమాత అనే చక్కని కానుకని కూడా ఇచ్చారు, మీకు ఏమి కావాలో కోరుకోండి" అని అన్నారు. దానికి భక్తిమాత తండ్రి "నాదొక చిన్న కోరిక ఉన్నది, మన్నిస్తారా" అని అడిగారు. దానికి "తప్పకుండా, సెలవియ్యండి" అని కృష్ణశర్మ అన్నారు. దానికి భక్తిమాత తండ్రి "మీ అబ్బాయిని మాకు ఇల్లరికం పంపండి" అని అడిగాడు. ఆయన కోరిక విని ధర్మదేవ్ బంధుమిత్రులు ఆశ్చర్యపోగా, కృష్ణశర్మ " వాగ్దానం మేరకు నా కొడుకుని తప్పకుండా పంపుతాను, వాడు నా ఒక్కడికే కాదు ఈ రోజు నుండి మీకు కూడా పుత్రుడే" అని చెప్పి, భార్యని ఊరడించి కొడుకుకి, కోడలికి కొన్ని గృహ ధర్మాలు వివరించి వారిని సాగనంపారు. ఆ విధంగా ధర్మదేవ్ దంపతులు ఇటార్ గ్రామం నుంచి చపయ్య గ్రామంలో స్థిరపడటం జరిగింది.

నారద మహాముని - దూర్వాసుని సంవాదం

ఇలా ఉండగా తనిచ్చిన వాగ్దానము నరనారాయణుడు ఇంకా నెరవేర్చలేదని ఒక రోజు నారదులవారు  దూర్వాసుని ఆశ్రమానికి వెళ్లి, ఆయనతో " నరనారాయణుడు భూమి మీద అవతరించడానికి ఎందుకో జాప్యం చేస్తున్నారు, ఎందుకో తెలియడం లేదు. మీరు యోగులను, మహర్షులను మృత్యు లోకంలో ఉండమని శపించారు, మరి వారి శాప నివృత్తి జరగాలంటే నరనారాయణుడు అవతరించాలి కదా” అని చెప్పగా దూర్వాసుడు యమునా నది తీరంలో ఉన్న నరనారాయణుడు దగ్గరకు వెళ్లారు. అక్కడ యమునా తీరంలో నరనారాయణుడు ఎంతో తన్మయత్వంగా పిల్లనగ్రోవి వాయిస్తుండగా పక్కన అర్జునుడు దానిని ఆస్వాదిస్తూ కనిపించారు. దూర్వాసుడు వస్తూనే నరనారాయణుడు ఈ విధంగా నిష్టూరమాడాడు "మీరెందుకు ఇంత జాప్యం చేస్తున్నారు, అక్కడ పుణ్యాత్ములు ఎంతో కష్టపడుతున్నారు, పాపం పెరిగిపోతోంది, సర్వ మునులు మృత్యు లోకంలో ఉండిపోయారు. నువ్వు త్వరగా భూలోకంలో అవతరిస్తే బాగుంటుంది ". దానికి నరనారాయణుడు "పాపం పరాకాష్టకు రాగానే నేను ధర్మదేవ్ దంపతులకు 2వ పుత్రుడిగా అవతరిస్తానని, కొంచెం ఓపిక పట్టమని"  ధైర్యం చెప్పారు. దానికి శాంతించిన దూర్వాసుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
చపయ్య గ్రామంలో భక్తిమాత, ధర్మదేవ్ చాలా ప్రశాంతమయిన జీవనం సాగిస్తున్నారు. రోజు నదిస్నానం, తమ కులదైవమయిన హనుమంతుని పూజించటం, తీర్థ ప్రసాదాలను గ్రామం అంతా పంచడం వారి దినచర్యగా అయి పోయింది.  ఇలా రోజులు గడుస్తున్నాయి.

కాల భైరవ ఉపాసకుడు కాళిదాసు

ఆ గ్రామంలోనే కాళిదాసు అనే కాలభైరవ ఉపాసకుడు ఒకడు ఉండేవాడు. ఆ రోజుల్లో తాంత్రిక విద్యలు బాగా ప్రాచుర్యంలో ఉండేవి. అతను పరమ దుర్మార్గుడు, అమాయక స్త్రీలను ఎందరినో తన మంత్రాలతో వసపరచుకుని వారి శీలాన్ని దోచుకుని వారి జీవితాలను నాశనం చేసాడు. అంతే కాకుండా ఆ గ్రామస్తులను తన విద్యలతో భయభ్రాంతులను చేసి ఆ గ్రామాన్ని పీడిస్తుండేవాడు. ఎవరు అతనిని ఏమి చెయ్యలేని అసహాయ స్థితిలో ఉండేవారు. ఒకరోజు కాళిదాసు అర్థరాత్రి సమయములో కాలభైరవ పూజలో ఉండగా అతనికి ఆకాశంలో ఒక దివ్య తేజస్సు చపయ్య గ్రామంలోకి రావడం కనిపించింది. అతను వెంటనే తన పరివారంలో వారిని దాని గురించి ప్రశ్నించగా వారెవరు తమకు ఆ తేజస్సు కనపడలేదని చెప్పారు. ఆ తేజస్సు కనపడినప్పటి నుంచి కాళిదాసు ముఖములో ఆందోళన కనపడటం అతని శిష్యులు గమనించి కారణమడుగగా కాళిదాసు "నేను కేవలం ఆ దివ్య తేజస్సునే కాదు, నా మృత్యువుని కూడా చూసాను. ఈ గ్రామంలో ఎవరయినా పుణ్యదంపతులు ఉన్నారా" అని వారిని ప్రశ్నించాడు. "మన గ్రామంలో ధర్మదేవ్, భక్తిమాత అను పుణ్య దంపతులు ఉన్నారు, వారికి రామ్ ప్రతాప్ అనే 8 సంవత్సరాల వయస్సు కల మగ సంతానం ఉన్నాడు" అని చెప్పగా కాళిదాసు "ఆ కుటుంబం మీద ఒక కన్ను వేసి ఉంచండి" అని తన అనుచరులకి చెప్పాడు.

         ఒక రోజు ధర్మదేవ్ దంపతులు తమ పూజా కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఒక దారుణమయిన సంఘటన చూడటం జరిగింది. అక్కడ మతిస్థిమితం లేని ఒక అమ్మాయిని, ఆమె తల్లిని గ్రామస్తులు "పిచ్చిది వచ్చిందిరా, కొట్టండి. ఈ ఉన్మాదిని ఇలాగే ఊరిలోనికి రానిస్తే మన పిల్లలకు హాని తల పెడుతుంది" అని రాళ్ళతో తరిమి కొట్టటం కనిపించింది. వెంటనే ధర్మదేవ్ దంపతులు గ్రామస్తులను వారించి, వెనక్కి పంపివేశారు. తమకు తగిలిన గాయాలకు బాధపతున్న ఆ తల్లికూతుళ్ళను కూర్చోపెట్టి, వారి గాయాలకు భక్తిమాత కట్లు కట్టి, హనుమాన్ తీర్థ ప్రసాదాలు ఇచ్చి వారిని అనునయించారు. "మీ అమ్మాయికి ఇలా మతిస్థిమితం లేకపోవటానికి కారణమేమని" ఆమె తల్లిని అడుగగా ఆమె జవాబు ఇచ్చేలోగా, కాళిదాసు అక్కడకి వచ్చి ధర్మదేవ్, భక్తిమాతలను ఆ  మతిస్థిమితం లేని అమ్మాయిని చేరదీసినందుకు నిందించటం జరిగింది. అంతేకాక ఇలాంటి పిచ్చివారు మన గ్రామంలో ఉండడం వాళ్ళ మనకు హాని కూడా కలుగుతుందని అక్కడ ఉన్న గ్రామస్తులను రెచ్చగొట్టాడు. అపుడు ఆ అమ్మాయి తల్లి చాలా ధైర్యంగా, ఆవేశంగా కాళిదాసుని ఉద్దేశించి "దుర్మార్గుడా, నీవల్లనే నా కోడలు ఆత్మహత్య చేస్కోవటం జరిగింది. నీ మాయమాటలకి మోసపోయి ఆమె తన శీలాన్ని పోగొట్టుకున్న కారణంగా ఆమె చనిపోవటం, అది భరించలేక నా కుమారుడు ఆత్మహత్య చేస్కోవటం అది చూసి నా కూతురు ఇలా పిచ్చిది అయ్యింది. దీనంతటికి కారణం నువ్వే, అటువంటి వాడివి నువ్వు మమ్మల్ని నిందించటమే కాక మాకు సహాయం చేసిన ఈ పుణ్యాత్ములని కూడా దుర్భాషలాడతావా" అని గద్దించి చెప్పింది. అపుడు కాళిదాసు ఎంతో ఆవేశంతో ఆ తల్లిని కొట్టబోగా ధర్మదేవ్ అడ్డువెళ్లి కాళిదాసు చెయ్యి పట్టుకుని ఆపి, అతనికి శాంతివచనాలు చెప్పి వెనక్కి పంపే ప్రయత్నం చేసాడు. కాని కాళిదాసు ధర్మదేవ్ యొక్క చర్యకి మరింత కోపంతో, తనకి ఎదురులేని ఆ గ్రామంలో మొట్టమొదటి సారి ధర్మదేవ్ గ్రామస్తులందరి ముందు తనకి ఎదురు చెప్పడం జీర్ణించుకోలేక, ధర్మదేవ్ తో " నువ్వు అనవసరంగా నాకు అడ్డు తగిలి, నాలోని పగను రెచ్చగొట్టావు, నీ సంగతి చూస్తాను" అని శపధం చేసి గ్రామస్తులను ఉద్దేశించి " ఈ ధర్మదేవ్ కుటుంబానికి ఎవరు ఎటువంటి సహాయం చెయ్యడం కానీ, కనీసం వారితో మాట్లాడడం కానీ చెయ్యకూడదు, అలా చేసినచో ఆ వింధ్యావాసినికి మిమ్మల్ని బలి ఇవ్వగలను జాగ్రత్త" అని హెచ్చరించగా అక్కడ చేరిన గ్రామస్తులు భయంతో అలాగే అని చెప్పి కాళిదాసుని శాంతపరిచారు.