N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 17 October 2013

SwamiNarayan- Episode 4

SwamiNarayan - Episode 4

వెళ్ళిపోతున్న వారిని ఆపి " తల్లీ నువ్వు మాతృమూర్తివి, ప్రతి మాతృ హృదయంలో సరస్వతి దేవి ఉంటుంది కాబట్టి అటువంటి మాతకి నేను తప్పక సహాయం చేస్తాను. మీ అబ్బాయిని ఆ మంచం మీద పడుకోపెట్టండి" అని చెప్పడం, వారు అదే ప్రకారం చెయ్యడం జరిగింది. ఇంత విషాదంలో భక్తిమాతకి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి, "తల్లి, మానవజన్మ ఎత్తాక కష్టసుఖాలు వెలుగు, నీడలాగ మన వెంట పడుతుంటాయి. అటువంటి కష్టాలు వచ్చినపుడు మన కులదైవమైన హనుమాన్ ని మాత్రం తప్పక ధ్యానించు, నీ కష్టాలన్నీ కడ తేరుతాయి". ఆమె సూచనని గ్రహించిన ధర్మదేవ్ దగ్గరలోనే ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కుమారుడికి సేవ చేస్తూనే భక్తిమాత మనసులో హనుమాన్ ని ప్రార్ధిస్తోంది. ధర్మదేవ్ అక్కడ ఎంతో ఆర్తితో హనుమంతుని ప్రార్థిస్తూ ఉండిపోయాడు. తలను ఆయన పాదాలకు కొట్టుకుని "స్వామి ఎలాగైనా సరే నా కొడుకుని కాపాడాలి" అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ విలపించసాగాడు. కాసేపటికి అతను తెప్పరిల్లి భక్తిమాత వద్దకు రాగానే ఆవిడ ఎంతో సంతోషంతో "ఆ హనుమంతుని దయవలన మన కుమారుడు లేచాడు" అనగా, ఆ బిడ్డను హృదయానికి హత్తుకుని ఇద్దరూ ఎంతో ఆర్తితో హనుమంతుని స్తుతించారు.

అపుడు హనుమంతుని యొక్క వాణి వారికి ఇలా వినిపించింది " నాయనా ధర్మదేవ్, మీ ఇద్దరి కష్టాలు నాకు తెలియనివి కావు, నేను మీ కుల దేవతను. విధి రాతను ఎవరు తప్పించలేరు, అవి అనుభవించక తప్పదు. ఇప్పటికి మీ ప్రారబ్ధకర్మలన్నీ తీరిపోయాయి, ఇక మీకంతా మంచే జరుగుతుంది. మీరిక్కడ నుండి ప్రయాగ వెళ్ళండి. అక్కడ రామానందతీర్థులు అనే మహానుభావుడు ఉన్నాడు, ఆయనను దర్శించి, ఆయన ఆశీర్వాదం తీసుకుని  అక్కడ నుంచి మీరు బృందావనానికి వెళ్ళండి. మీతో పాటు జన్మించినటువంటి మరి కొంతమంది భక్తులు కూడా మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ మీరు విష్ణుయాగం చెయ్యండి, మీకంతా శుభమగుగాక". అపుడు ధర్మదేవ్, భక్తిమాత హనుమంతునికి సాష్టాంగ ప్రణామం చేసారు. ఆయన చెప్పిన విధంగానే ఎంతో ఆనందంగా ప్రయాగకు ప్రయాణం సాగించారు.   

ఇక్కడ కాళిదాసు పంపిన రెండవ తాంత్రికుడు ఆంజనేయుడి శక్తికి తట్టుకోలేక, తను ప్రయోగించిన శక్తి తిరిగి అతని మీదే దాడి చేయగా అక్కడికక్కడే మరణించడం జరిగింది. కాళిదాసుకి అక్కడ తన మనోనేత్రానికి తాను పంపిన తాంత్రికుడు ప్రయోగించిన సర్పం తిరిగి అతని వెంటేపడడం, అతను పరిగెట్టడం, అంతకన్నా వేగంతో ఆ సర్పం అతనిని వెంటాడి కాటువేయటం, అతను హాహాకారాలతో మరణించడం కనిపించాయి. దానితో అతని కోపం, పగ రెట్టింపయ్యాయి. అపుడు అతని పక్కన ఉన్న పరివారంలోని తాంత్రికురాలు  కాళిదాసుతో " నువ్వు పంపిన శక్తి కన్నా ఆ భక్తిమాత యొక్క శక్తి ఎక్కువగా ఉంది, మరిప్పుడు ఏం చేస్తావు" అని అడిగింది. కాళిదాసు " లేదు, ఎలాగైనా నా కాలభైరవుడి శక్తే ఆమె యొక్క భక్తి కన్నా చాలా ఎక్కువ అని నేను నిరూపిస్తాను. ఏ విధంగానైనా సరే వాళ్ళని మార్గమధ్యంలోనే సంహరిస్తాను, చూస్తూ ఉండు" అని ప్రగల్భాలు పలికాడు.

ఇక్కడ ఏమి తెలియని ధర్మదేవ్ దంపతులు తమ కుమారుని తీసుకుని ప్రయాగ వైపు ప్రయాణం చేస్తున్నారు. నిరంతరం హృదయంలో హనుమంతుని ధ్యానిస్తూ ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో అనుకోకుండా భయంకరమైన అగ్ని జ్వాలలు వారిని చుట్టుముట్టాయి. అవి భగభగా మండుతూ వారిని సమీపించసాగాయి. వారు ఏ మాత్రం చెలించక భక్తిశ్రద్దలతో హనుమంతుని ధ్యానించసాగారు. హనుమంతుడు అదృశ్యరూపంలో ఆ అగ్నిజ్వాలను ఆర్పివేసాడు. అపుడు కాళిదాసు పంపిన అనుచరుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇవేమీ పట్టించుకోక ఆ దంపతులు భగవన్నామ స్మరణ చేస్తూ మెల్లగా కొద్ది రోజులకి ప్రయాగ చేరుకున్నారు.

ఆశ్రమ దీక్ష - విష్ణు యాగం

అక్కడ రామానందతీర్థులవారు తమ శిష్య బృందానికి భాగవతంలోని 15వ అధ్యాయం చదివి వివరణ ఇస్తుండగా, ధర్మదేవ్ దంపతులు తమ కుమారుడితో కలసి ఆయనకి సాష్టాంగ దండప్రణామం చేసి, వారిని పరిచయం చేసుకున్నారు. అపుడు ధర్మదేవ్ ఏ విధంగా అయితే దేశంలో ఎన్ని తీర్థాలు దర్శించినా ప్రయాగ దర్శించకుంటే ఫలితం రాదో, అదే విధంగా శాంత చిత్తులయిన మీ దర్శనం కలిగితే కానీ మనుష్యులకి భగవంతుని కరుణ, కటాక్షం రాదు" అని ప్రార్ధించాడు. భక్తిమాత కూడా “ఏ సాధువు దగ్గరకి వెళ్తే నిజమైన శాంతి కలుగుతుందో వారే నిజమయిన సాధకులు, వారే భగవంతునికి భక్తునికి అనుసంధాన కర్తగా ఉంటారు. స్వామీ, మమ్మల్ని కరుణించి మీ శిష్యులుగా స్వీకరించండి" అని ప్రార్ధించింది.  దానికి రామానందతీర్థుల వారు వాళ్ళని ఎంతో ప్రేమగా ఆదరించి ఇలా అన్నారు " ఏ విధంగా అయితే భగవంతుడు సృష్టించిన ఈ మానవుడు తనకి కావలసినవి భగవంతుడిని కోరుకుంటున్నాడో, అదే విధంగా భగవంతుడు కూడా ఏదో కొంత భక్తిరూపంలో, ప్రేమ రూపంలో మనుషులనుంచి ఎదురుచూస్తుంటాడు. మానవ జన్మ రావడమే కష్టసాధ్యము, ఆ వచ్చిన జన్మకు  సార్ధకత రావాలంటే ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తూ హృదయంలో నిరంతరం ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే ఏదో ఒకరోజు మనం తప్పక ఆయన సాయుధ్యం పొందుతాము". దానికి ధర్మదేవ్ "స్వామీ మమ్మల్ని దయచేసి మీ శిష్యులుగా స్వీకరించండి, మీరు చెప్పిన సూచన ప్రకారం మా జీవితాన్ని గడుపుతాము" అని ప్రాధేయపడగా, రామనందులవారు అలాగే అని ఆశీర్వదించి "రేపు ప్రాతఃకాలమే నా ఆశ్రమానికి రండి, నేను మీకు తప్పక దీక్షను ఇస్తానని" వారిని ఆశీర్వదించి పంపారు. 

దంపతులిద్దరూ రామనందులవారు చెప్పిన విధంగానే తెల్లవారు ఝామునే ఆశ్రమంలో ఆయనను కలిసి వారి దగ్గర విష్ణుమంత్రాన్ని దీక్షగా  తీసుకోవడం జరిగింది. స్వామి వారు మంత్ర దీక్ష ఇచ్చిన తదుపరి వారిద్దరికీ రక్షరేఖలు ప్రసాదించి, "ఈ రక్షరేఖలు సదా మిమ్ము రక్షిస్తుంటాయి, మీరు చేస్తున్నటువంటి సాధన మీ మనసులోనే పెట్టుకోవాలి, అది బయటికి మాత్రం రాకూడదు. మీకు ఇక ఎటువంటి కష్టాలు రావు, వచ్చినా తొలగిపోతాయి ఈ రక్షా బంధనం మిమ్మల్ని సర్వదా కాపాడుతూ ఉంటుంది. బృందావనంలో మీకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, మీరిక అక్కడికి ప్రయాణంకండి, మీకు అన్ని వేళలా విజయం కలుగుగాక" అని ఆశీర్వదించి వారిని పంపించారు. దంపతులిద్దరూ తమ కుమారుడితో సహా మెల్లగా మధుర వైపు వారి ప్రయాణం సాగించారు.
ఇక్కడ కాళిదాసు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. వాడికి ఒక భయంకరమయిన స్వప్నం వచ్చింది. పక్కన ఉన్నవారు, "ఏమైంది గురువుగారు, ఏదైనా కల వచ్చిందా?" అని అడగుగా "అవును, నేను స్వప్నంలో నా మృత్యువును చూసాను. ఎవరో దివ్య పురుషుడు నన్ను సంహరిస్తూ కనిపించాడు. ప్రతి యుగంలో రాక్షష సంహారం జరుగుతుంది కాని ఈ యుగంలో మాత్రం నేను ఎట్టి పరిస్థితులలో చావాలనుకోవట్లేదు. ఏదో ఒక రకంగా ఆ అవతారం తీస్కోబోయే శక్తిని నేను సంహరిస్తాను, ఈ ప్రయత్నంలో నేను పంపిన 2వ తాంత్రికుడు కూడా వీరమరణం పొందాడు. కాని నేను మాత్రం ఎలాగైనా నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను" అని పలికాడు.

ఆ దంపతులిద్దరూ బృందావనానికి వెళ్లి అక్కడ మిగిలిన భక్తులతో కలిసి విష్ణుయాగం చేయటం మొదలుపెట్టారు. విష్ణుయాగం అనగా రోజు పొద్దున్నంతా విష్ణు సహస్రనామం కొంతమంది చదువుతుంటే, కొంతమంది రామాయణం చదువుతారు, కొంతమంది భాగవతం చదువుతారు. ఇలా అందరు పొద్దున్నుంచి రాత్రి వరకు స్వాధ్యాయంలో గడుపుతారు. దీనిలో పఠనం, శ్రవణం, మననం, చింతనం ఇవన్ని జరుగుతుంటాయి. రాత్రి కాగానే విష్ణువుని అన్ని రకాలుగా కీర్తించడం చేస్తుంటారు. ఇలా రాత్రింబవళ్ళు చేస్తుంటారు, దీనినే విష్ణుయాగం అంటారు. దీనివల్ల ఆ విశ్వంలో ఉన్న వాయుమండలం అంతా తేజస్సుతో నిండిపోయి, పాపం అనే మలినాన్ని పూర్తిగా తుడిచివేస్తుంది. అదే దీని యొక్క అద్భుత ఫలితం. ఇలా రాత్రింబవళ్ళు భక్తి మాత, ధర్మదేవ్ భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్నారు.