N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Friday, 25 October 2013

SwamiNarayan - Episode 5

ఒక రోజు సాక్షాతూ ఆ నరనారాయణుడు ఆ విష్ణు యాగం చేస్తున్న భక్తులందరికీ ప్రత్యక్షమయినాడు. భక్తులందరికీ చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగి ఆయనని ఎంతో భక్తి శ్రద్ధలతో స్తుతించారు. అపుడు నరనారాయణుడు వారిని ఉద్దేశించి "ఎంతో భక్తితో మీరు ఈ విష్ణుయాగాన్ని చేసారు, దాని ఫలితంగానే నేను మీకు ప్రత్యక్షం అయ్యాను. మీరందరూ పూర్వ జన్మలలో నాతో పాటు ఉన్నవారే, మీరందరూ మీకు నిర్దేశించిన ప్రదేశాలకి వెళ్ళండి. నేను త్వరలో చపయ్య అనే గ్రామంలో ధర్మదేవ్, భక్తిమాత అనే వారి ఇంట్లో జన్మిస్తాను.

మీరు ఇక మీ ప్రదేశాలకి ప్రయాణంకండి" అని ఆదేశించారు. నరనారాయణుడు ఆ మాటలు చెప్పి అదృశ్యమయ్యాక  ధర్మదేవ్ దంపతులు ఇద్దరూ కూడా ‘ఇది కలా, నిజమా’  అనే ఆశ్చర్యంలో ఉండి పోయారు. భక్తిమాత ధర్మదేవ్ తో "స్వామి ఇదేమిటి, ఇదంతా నిజమేనా? మనం అంత పుణ్యం చేసుకున్నామా, సాక్షాత్తు నరనారాయణుడు మన ఇంట్లో జన్మిస్తానని చెప్పారు" అనగానే మరల నరనారాయణుడు ప్రత్యక్షమయ్యి " తల్లి, మరల మీకు నేనెందుకు దర్శనమిచ్చానంటే ఇక్కడేమి సందేహం లేదు, ఇది కల కాదు. మీ ఇంట నేను రెండవ పుత్రునిగా జన్మిస్తాను. కాబట్టి మీరిక చపయ్యకి ప్రయాణం కాగలరు, అయితే నేను చెప్పిన విషయం మీ హృదయంలోనే పెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితులలో ఇది బయటికి తెలియకూడదు. అలా జరిగితే మాత్రం ఇంతకాలం మీరు చేసుకున్న పుణ్యానికి ఫలితం ఉండదు. కోరి ఆపదలు తెచుకోవద్దు, కాబట్టి నేను చెప్పినది రహస్యంగా మీ హృదయంలోనే పెట్టుకోండి. ఇక మీరు బయల్దేరండి, మీకు శుభమగు గాక" అని అదృశ్యం అయిపోయారు.

 అక్కడ కాళిదాసు తాను ప్రయోగించిన శక్తులేవి వీరిమీద పని చేయకపోవటం గ్రహించి "నన్ను చంపబోయే నా శత్రువు ధర్మదేవ్, భక్తిమాత ఇంట్లో చపయ్య జన్మిస్తాడంట,  అది ఎలా సాధ్యమవుతుందో నేనూ చూస్తాను. వారిని ఈ చపయ్య గ్రామానికే రాకుండా చేస్తాను " అని తన తాంత్రిక ప్రయోగంతోటి వాళ్ళు చపయ్య గ్రామం రాకుండా దారి తప్పించాడు. ఇక్కడ వీరిద్దరూ ఆ తాంత్రిక ప్రయోగానికి లోనై దారి తప్పి ఒక స్మశాన ప్రాంతంలో తిరుగుతున్నారు, ఎక్కడ చూసినా చితిమంటలు కనిపిస్తున్నాయి. అటువంటి స్థితిలో భక్తిమాత, ధర్మదేవ్ "మనం చపయ్య ఎలా వెళ్ళాలి?, ఎవరిని అడగాలి? మనం దారి తప్పినట్లున్నామే" అని గ్రహించారు. సరైన దారి ఎటో తెలియక అక్కడక్కడే తిరుగుతుండగా వారికి ఒక సాధువు కనిపించాడు. అపుడు వారు ఆయనకి నమస్కారం చేసి "స్వామి మీరు మాకు దేవుడిలా కనిపించారు, మేము దారి తప్పి ఇక్కడ తిరుగుతున్నాము" అని అనగా ఆ సాధువు " మీరెవరు? మీరెక్కడకి  వెళ్ళాలి" అని అడిగారు. “మేము చపయ్య గ్రామానికి వెళ్తున్నాము, సాక్షాత్తు నరనారాయణుడే మా ఇంట్లో జన్మిస్తాను అని వాగ్దానం చేసారు. ఆయన ఆజ్ఞ మీద మేమిప్పుడు చపయ్య్య గ్రామం వెళ్తున్నాము". ఆ సాధువు వికటాట్టహాసంతో " అలాగా, నేను అశ్వద్ధామని. నరనారాయణుడు బద్ధశత్రువుని. అతను మీ ఇంట్లో జన్మిస్తున్నాడా, ఇదే నేను శాపం ఇస్తున్నాను ఈ జన్మలో ఆ నరనారాయణుడు ఎటువంటి అస్త్రాలు, శస్త్రాలు ధరించిన కూడా అతనికి అపజయం తప్పదు. నేను దుర్యోధనుడి మిత్రుడిని, నేను నా అసురశక్తులతో కలిసి నరనారాయణుడితో పోరాడతాను" అని చెప్పి అదృశ్యమైపోయాడు.  అపుడు ధర్మదేవ్, భక్తిమాత తాము చేసిన తప్పిదాన్ని తెలుసుకుని చాలా బాధపడ్డారు. “అయ్యో, భగవంతుడు మనకి ముందే చెప్పాడు ఇది రహస్యమని. ఐనా కూడా మనం అత్యుత్సాహంతో అనవసరంగా ఈ రహస్యాన్ని బయటపెట్టాము. దానికి ఫలితం అనుభవించక తప్పదు” అని పరిపరివిధాలుగా పశ్చాత్తాపపడుతూ అక్కడే కూర్చుని భగవంతుని ప్రార్ధిస్తూ ఉండిపోయారు.

అక్కడ నారదుడు నరనారాయణుని కలిసి "భగవాన్ మీ లీలలన్ని చాలా విచిత్రంగా ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు. అక్కడ మీ తల్లితండ్రులు మీ అన్నగారితో పాటు స్మశానంలో దిక్కుతోచక తిరుగుతున్నారు. మరి మీరేమిటి స్వామి నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు". "నారదా, నీకు తెలియనిది ఏమున్నది, మానవులు ఎప్పుడు తమ సంయమనాన్ని కోల్పోతుంటారు, నేను ఎంతో ముందు జాగ్రత్తగా వారిని హెచ్చరించాను నా జన్మరహస్యం ఎవరికీ చెప్పకూడదని, చెప్తే ఆపదలు వస్తాయని. అయినా కూడా వారు తమ సంయమనాన్ని కోల్పోయి నా జన్మరహస్యం అశ్వద్ధామకి చెప్పేశారు, ఇలా ఆపద తెచ్చుకున్నారు. దానికి నన్నేమి చెయ్యమంటావు. ఈ మనుషుల యొక్క ప్రవ్రుత్తి అలాగే ఉంటుంది. వారు చేసిన తప్పిదానికి వారే అనుభవించాలి కదా, నేనేమి చెయ్యగలను" అని నర్మగర్భంగా నవ్వడం జరిగింది.

ఇక్కడ కాళిదాసు చాలా కోపంతో అటు ఇటు తిరుగుతూ "మొత్తానికి నా వైరి భక్తి మాత, ధర్మదేవ్ ఇంట్లో జన్మిస్తాడుట. నన్ను ఆనాడే ఆ పిచ్చిదాని విషయంలో ధర్మదేవ్ హెచ్చరించాడు, “నువ్వు  అనవసరంగా ధర్మం తప్పి అందరికి హాని చేస్తున్నావు, నువ్వు చివరికి నాశనం అయిపోతావు” అని. నన్ను బెదిరించడానికే మళ్లీ చపయ్య గ్రామానికి వస్తున్నాడు. చూస్తాను ఇక్కడ అతనికి ఇల్లు లేదు, వస్తువులు లేవు ఇక్కడకి వచ్చి ఎన్ని రోజులు ఉండగలుగుతాడో నేను చూస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నేను నా శత్రువుని తప్పక సంహరిస్తాను" అని ప్రగల్భాలు పలుకుతున్న అతన్ని, అతని అనుచరులలోని ఒక తాంత్రికురాలు, " గురువుగారు మనం ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళని కష్టపెట్టాము, వారిని ఈ గ్రామంలో ఉండనివ్వకుండా నిరోధించాము. ఎంత చేసినా ధర్మదేవ్ యొక్క శక్తి, భక్తి మాత యొక్క భక్తీ ముందు మన శక్తి ఎందుకు పనికి రాలేదు. వారిక్కడికి రాబోతున్నారు కదా, మరి మన తదుపరి కార్యక్రమం ఏమిటి"? "నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళు ఈ చపయ్య గ్రామంలో ఎంతకాలం ఉంటారో నేనూ చూస్తాను" అని కాళిదాసు వికటాట్టహాసం చేసాడు.

ఇక్కడ దిక్కుతోచని పరిస్థితుల్లో భక్తిమాత, ధర్మదేవ్ భగవంతుడిని ప్రార్థిస్తూ తాము చేసిన తప్పుకి క్షమించమని పశ్చాత్తాపపడసాగారు. ఇంతలో అనూహ్యంగా వారికి అక్కడ ఒక మహాపురుషుడు కనిపించాడు. వారు చేతులు జోడించి "మహానుభావా మేము ఇలా దారి తప్పి, రాత్రంతా ఇక్కడే తిరుగుతున్నాము. మేము చపయ్య అనే గ్రామం వెళ్ళాలి, దయచేసి మాకు మార్గనిర్దేశం చెయ్యండి" అని ప్రార్థించగా అతను ఏమి మాట్లాడకుండా ముందుకు సాగాడు. వారు అతని వెంట వెళ్ళసాగారు. అక్కడ నారదుడు నరనారాయణుడిని "భగవాన్, మీరే స్వయంగా మీ తల్లితండ్రులకి మార్గనిర్దేశం చెయ్యడం చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా ఉంది. ప్రభూ, మరి మీరు ఏ విధమైన అస్త్రాలు, శస్త్రాలు ధరించకూడదని అశ్వద్ధామ ఇచ్చిన శాపం సంగతి ఏమిటి? ఈ కలియుగంలో అసురులు చాలా ప్రమాదకారులు, వారిని మీరు ఏ ఆయుధాలు లేకుండా ఎలా ఎదుర్కుంటారు" అని ప్రశ్నించగా దానికి నరనారాయణుడు "నారదా నాకు అస్త్రాలతో పని ఏమున్నది. నేను కేవలం సారదిగానే ఉంటాను" అనగా  "మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, దయచేసి కొంచెం వివరంగా చెప్పండి" అని నారదుడు ప్రార్ధించగా " ఈ అవతారంలో నేను ప్రతి ఒక్కరి హృదయంలో కొలువై వారి మనస్సుకి సారధిగా ఉంటాను. మనసుని ఆధీనంలో ఉంచుకోని మానవులే కదా తప్పిదాలు చేసేది, మాయకి లోనై వారు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వంటి అసురీశక్తులతో మిత్రుత్వాన్ని పెంచుకుంటారు. అటువంటి వారి హృదయంలో నివసించి, వారి మనసుకి సారధిగా ఉండి, వారిలో మార్పు తెస్తాను. దానికోసం నాకు ఏ అస్త్రం, శస్త్రం అవసరం లేదు. ఇది ఒక విన్నుత్నమైన అవతారము, ఐనా నువ్వే చూస్తావుగా" అని నారదుడికి చెప్పడం జరిగింది.