N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 31 October 2013

SwamiNarayan - Episode 6

చపయ్య ఆగమనం

ధర్మదేవ్, భక్తిమాత తమ కుమారుడైన రాంప్రతాప్ తో కలిసి తమ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ చపయ్య గ్రామ పొలిమేర చేరేసరికి అక్కడ వారు గతంలో సాయం చేసినటువంటి ఉన్మాద స్త్రీ యొక్క మాతృమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చి భక్తిమాతతో "అమ్మా ఎందుకు మీరు మళ్లీ ఈ గ్రామానికి వచ్చారు, ఇక్కడ మీకేమున్నదని వచ్చారు, ఎవరున్నారని వచ్చారు? ఈ చపయ్య గ్రామం మీరున్నప్పుడు ఎంతో పవిత్రభూమిగా ఉండేది, మీరు వెళ్ళిపోయాక ఈ గ్రామం చాలా అపవిత్రం అయిపోయింది. 

మీరు ఇక్కడనుంచి వెళ్ళిపొండి, వెళ్ళిపొండి" అని ఒక ఉన్మాద స్థితిలో గద్దించసాగింది. కాసేపటికి ఆమె తేరుకుని, తన దుఃఖాన్ని దిగమింగుకుని "తల్లి మీరు ఈ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో ఘోరాలు జరిగాయి. ఆ కాళిదాసు ఎన్నో అకృత్యాలు చేసాడు. గ్రామస్తులందరిని రెచ్చగొట్టి నా కూతురుని రాళ్ళతో కొట్టించి చంపించాడు ఆ దుర్మార్గుడు. ఈ చపయ్య గ్రామాన్ని భగవంతుడు కూడా ఎందుకు ఇలా వదిలివేసాడో, ఈ కాళిదాసు అఘాయిత్యాలు ఇంకెన్నాళ్ళు జరుగుతాయో నాకేమి అర్థం కావట్లేదు తల్లి. పాపపంకిలమైన ఈ చపయ్య గ్రామాన్ని నేనొక చీపురు కట్టతో శుభ్రం చెయ్యగలను కాని ఈ గ్రామస్తుల యొక్క మనసులో ఉన్న మలినాన్ని ఏ భగవంతుడు కూడా ఎంత పెద్ద చీపురుకట్ట తెచ్చినా శుభ్రం చెయ్యడం అసాధ్యం అనిపిస్తోంది తల్లి.పుణ్య దంపతులు మీరు, పాప పంకిలమైన ఇటువంటి గ్రామస్తుల మధ్య ఎలా ఉండగలుగుతారు తల్లి, అందుకని దయచేసి నా మాట విని మీరు ఈ చపయ్య గ్రామాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికైనా వెళ్ళిపొండి" అని ప్రాధేయపడింది. 

అపుడు భక్తిమాత ఆమెను శాంతపరచి "ఈ చపయ్య గ్రామంలోనే నేను పుట్టి పెరిగాను, తప్పకుండా భగవంతుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు, నువ్వేమి చింతించకు" అని ఓదార్చి పంపివేసింది.  కాని మనసులో ఆమెకి ఒక సందేహం వేధించసాగింది. ధర్మదేవ్, భక్తిమాత ని ఉద్దేశించి "మనం చపయ్య గ్రామం వచ్చాము, మన ఇంటి దిశగా ప్రయాణం చేస్తున్నాం, కాని అక్కడ మీ సోదరుడు వర్షురాం ఇంటికి తాళం పెట్టి ఉంటాడేమో, అతడేమైనా మనం అక్కడ నివసించడానికి అభ్యంతరం చెప్తాడో ఏమో మనకి తెలియదు" అని వారిద్దరూ ఆ విషయం గురించి చింతించసాగారు. చివరకి “ఆ భగవంతుడి ఆదేశం ప్రకారంగా ఈ చపయ్య గ్రామం వచ్చాము, అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు” అని అనుకుంటుండగా ఇంతలో వర్షురాం అక్కడికి వచ్చి తన సోదరిని ఉద్దేశించి "సోదరీ నీకు తీరని అన్యాయం చేసాను, రాఖీ పౌర్ణమినాడు అక్కలు కాని, చెల్లెళ్ళు కాని తమ సోదరులకి రక్షరేఖలు ఎందుకు కడతారు, సోదరులు సోదరికి రక్షగా ఉంటారనే కదా, కాని నేను నీకు ఉన్న రక్షణను కూడా తీసివేసి మిమ్మల్ని నిరాశ్రయులని చేసి ఊరి నుంచి వెళ్లగొట్టాను. నేను చేసిన పనికి ఎంతో పశ్చాత్తాప పడుతున్నాను. నీకు నా మొహం చూపించడానికి కూడా అర్హతలేదు.

మరల మీరు చపయ్య గ్రామానికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇదిగో ఈ తాళం చెవులు తీస్కోండి" అని ఇంటి తాళాలు ఇచ్చి తన మొహం చాటువేస్కుని కనుమరుగయ్యాడు. జరిగిన ఈ వింత అనుభవానికి వారిద్దరికీ భగవంతుని యొక్క లీల ఎలా ఉంటుంది అనేది అవగతమయ్యింది. ఇలా వాళ్ళు ప్రయాణం సాగిస్తూ వారి ఇంటికి చేరుకున్నారు. ఈ పుణ్యదంపతుల ఆగమన వార్త విని ఊరిలోని కొంతమంది సజ్జనులు, చుట్టుపక్కల స్త్రీలు వారిని పలకరించడానికి వచ్చి, వారికి కావలసిన వస్తువులు సమకూర్చిపెట్టారు. వారు ఇంటిలో అడుగుపెట్టగానే ఇల్లంతా కళకళలాడిపోయింది. ఇంటిలో వారు పెంచుకున్న గోమాత వారిని చూసి పరుగు పరుగున వచ్చింది. అలాగే పెరట్లో ఉన్న తులసిమాత పచ్చటి ఆకులతో వారికి స్వాగతం చెబుతున్నదా అన్నట్లుగా ఆనందంగా ఊగసాగింది. ఒకప్పుడు ఎవరైతే వీరిని కాళిదాసు భయం వల్ల అనాదరించారో, వారిలో కొంతమంది ఇప్పుడు వీరి ఇంటికి రావటం, పలకరించటం అంతా శోభాయమానంగా ఉన్నది.

పూర్వ వైభవం
ధర్మదేవ్, భక్తిమాత, వారి కుమారుడు చపయ్యభూమి మీద అడుగుపెట్టగానే వారి పాదస్పర్శకి భూమాత పులకించిపోయింది. సాక్షాత్తు నరనారాయణుడికి తల్లితండ్రులుగా, అగ్రజులుగా ఐనటువంటి ఈ ముగ్గురు మహానుభావుల పాదస్పర్శతో భూమాత ఎంతో పులకించిపోయింది. పాత శత్రువులంతా  కూడా మిత్రులుగా మారిపోయారు, మరల పూర్వవైభవం సంతరించుకుంది. కాళిదాసు చేసిన తాంత్రిక ప్రయోగాలు ఏమి ఫలించలేదు, మెల్లమెల్లగా కాళిదాసు యొక్క ప్రాభవం తగ్గిపోసాగింది. గ్రామస్తులు కూడా ఎంతో మర్యాదతో, ప్రేమతో ధర్మదేవ్ కుటుంబాన్ని చూడసాగారు. మళ్లీ వారి ఇల్లు లక్ష్మి సౌభాగ్యంతో కళకళలాడసాగింది. కాలమిలా గడుస్తూ ఉన్నది. అక్కడ కాళిదాసు తన ఉపాసనని ఉధృతం చేసాడు. రేయింబవళ్ళు ఆ వింధ్యావాసిని ఉపాసన చేస్తూ ఆవిడ అనుగ్రహం కోసం తపించసాగాడు. అయితే అది అంతా పగ, ద్వేషంతో కూడినటువంటి ఉపాసన. ఇలా జరుగుతుండగా అతని కఠోరమైన ఉపాసనకి ఒక రోజు రాత్రి వింధ్యావాసిని ప్రత్యక్షమయ్యింది.  అప్పుడు ఆ ధూర్తుడు "తల్లి, ఎంతో కాలంగా ఎంతో భక్తితో నీ ఉపాసన చేస్తున్నాను, మరి నాకు శత్రువైనటువంటి బాలుడు ఈ గ్రామంలో భక్తిమాత, ధర్మదేవ్ ల ఇంట్లో జన్మించబోతున్నాడని తెలిసి నాకు మనశ్శాంతి లేకుండాపోయింది. అతనిని సంహరించే శక్తిని నాకు ప్రసాదించవలసినది" అని ప్రార్ధించాడు. అపుడు ఆమె "ఓరి మూర్ఖుడా, దివ్యమైన తేజస్సు ముందు ఏ విధంగా అంధకారం పటాపంచలు అవుతుందో, అలాగే దివ్యమయినటువంటి తేజస్సుతో ఉన్నటువంటి ఆ భగవంతుడి ముందు నీవు చేసే పూజలు ఎందుకూ పనికి రావు. 

అంధకారమనే అజ్ఞానంలో నువ్వుండి, మద్యమాంసాలతో, నరబలులతో, జనుల్ని హింసించి, వారిని నానావిధాలుగా కష్టాలు పెట్టి నాకు నువ్వు పూజ చేసినంత మాత్రాన నేను అనుగ్రహిస్తాను అనుకోవడం కానీ, నాకు సంతోషం కలుగుతుందని అనుకోవడం కానీ నీ అవివేకం. ఇప్పటికైనా నా మాట విని నీ దుష్క్రుత్యాలు మానుకో. మంచివారి జోలికి వెళ్ళకు, ఆ నరనారాయణుడి శరణు కోరు, దానిలోనే నీకు క్షేమం ఉంది. అంతే కానీ నువ్వు నన్ను ఎన్నివిధాల ఉపాసన చేసినా నీ వెనక నువ్వు పెంచుకుంటున్న పాపలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

నీ పుణ్యరాశి లేశమాత్రం కూడా లేకుండా తరిగిపోయింది. ఇప్పటికైనా నా మాట విని నువ్వు చేసే దుర్మార్గపు పనులు మానుకుని, భగవంతుని శరణు వేడుకో" అని హితబోధ చేసి ఆ వింధ్యావాసిని అంతర్ధానం అయిపోయింది. కాని రాక్షస గుణాలతో నిండిపోయిన ఆ దుర్మార్గుడు ఆ తల్లి మాటలను లెక్క చెయ్యలేదు. పైగా ఇంకా కాలభైరవ ఉపాసన ఉధృతం చెయ్యడానికే నిర్ణయించుకున్నాడు. కాని అతను చేస్తున్నటువంటి తాంత్రిక ప్రయోగాలేమి ధర్మదేవ్ ని కాని, భక్తిమాతని కాని ఏ మాత్రం బాధ పెట్టలేకపోయాయి. వారి దైవికశక్తి ముందు ఈ తాంత్రిక ప్రయోగాలేమి నిలవలేకపోయాయి. ఒకరోజు కాళిదాసు రాత్రి పూట ఒక బ్రహ్మాండమైన తేజస్సుని దర్శించడం జరిగింది, అది కేవలం అతనికి మాత్రమే కనపడింది. ఆ దివ్య తేజస్సు ఆకాశంలోంచి చపయ్య గ్రామంలోకి ప్రవేశించినట్లుగా, వాడికి చెడు కాలం మొదలైనట్లుగా మరియు వాడికి మృత్యు గడియలు దగ్గరపడినట్లుగా అనుభవానికి వచ్చింది.