N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 10 October 2013

SwamiNarayan - Episode 3

ధర్మదేవ్, భక్తిమాతల కష్టాలు - కాళిదాసు పగ

తనకి జరిగిన అవమానానికి కాళిదాసు ఆ దంపతులిద్దరి మీద ద్వేషభావంతో పగ బట్టాడు. ఆ గ్రామస్తులలో కొందరిని గూఢచారులుగా పెట్టుకుని ధర్మదేవ్ కుటుంబం యొక్క కార్యకలాపాల గురించి సమాచారాన్ని సేకరిస్తుండేవాడు. ఆ గ్రామస్తులలో చాలామందికి ఆ దంపతులంటే అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నపటికీ ఈ కాళిదాసుకి భయపడి ఎవరు వారితో మాట్లాడడం మానేసారు. దానికి తోడు ఒకరోజు ధర్మదేవ్ ఇంట్లో లేని సమయంలో కొంతమంది కాళిదాసు అనుచరులు వారి ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న సర్వస్వము, ధాన్యంతో సహా దోచుకుపోయారు. భక్తిమాత అసహాయురలై ఏమి చెయ్యలేకపోయింది. మట్టితో చేసినటువంటి పొయ్యి మాత్రం ఇంట్లో మిగిలింది. ఆకలి బాధ తట్టుకోలేక  చిన్నవాడైన రామ్ ప్రతాప్ విలవిలలాడుతుండగా ఊరిలోని ఇంటింటికి వెళ్లి భక్తిమాత కన్నీరు మున్నేరుగా ఏడుస్తూ కొంచెం ఆహరం పెట్టమని ప్రాధేయపడింది. కాళిదాసు నియమించిన గూఢచారులు ఉండటం మూలంగా లోపల ఆమెకు సహాయం చెయ్యాలనే ఉన్న కూడా కాళిదాసు భయంతో ఎవరు ముందుకు రాలేకపోయారు. ఇల్లిల్లు తిరిగి ఏమి దొరకక అలసిపోయి ఇంటికొచ్చిన భక్తిమాత ధర్మదేవ్ రాక కోసం ఎదురు చూసింది. అతను వచ్చిన వెంటనే జరిగినదంతా వివరించింది. అప్పుడు ధర్మదేవ్ మళ్లీ వెళ్లి ఊరిలోని వర్తకులను ఎంత ప్రాధేయపడినా కూడా ఎటువంటి సాయం దొరకలేదు. కాని ధర్మదేవ్ కి  భగవంతుని మీద అపారమైన భక్తి, విశ్వాసాలు ఉండడం కారణంగా ఇటువంటి కష్టాలని ధైర్యంగా ఎదుర్కొనగలడు.

కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది, ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నా ఆకలికి చిన్న పిల్లవాడు ఎన్ని రోజులు ఉండగలుగుతాడు. భక్తిమాతను ఓదారుస్తూ ధర్మదేవ్ మనం భగవంతుడునే నమ్ముకోవాలి అని శాంతివచనాలు పలుకుతూ భగవంతుడినే ధ్యానిస్తూ ఉండిపోయాడు. ఒకరోజు చివరి ప్రయత్నంగా ధర్మదేవ్ వర్తకులను యాచించడానికి వెళ్ళగా అదే సమయంలో భక్తిమాత యొక్క సోదరుడు వర్షురాం ఇంటికి వచ్చాడు. రాగానే ఇల్లంతా కలియ తిరిగి "అంతా ఖాళీగా ఉందేమిటి, కనీసం తాళం కూడా వెయ్యకుండా ఉన్నారేమిటి? ఐతే నేను విన్నది నిజమేనా, ఆ కాళిదాసుతో మీరు వైరం పెట్టుకున్నారు. అయితే నాన్నగారు నీ వివాహం చేసినపుడు నీ భర్తని ఇల్లరికానికి పంపమన్నారే కాని ఈ ఇంటిని మీకు రాసివ్వలేదు. మీ ఇద్దరు మర్యాదగా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే బాగుంటుంది, లేదంటే కాళిదాసు పగకు ఈ ఇల్లు కూడా దహనం అయిపోగలదు, అప్పుడిక నాకు మిగిలేది ఏమి ఉండదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. భర్త రాగానే విషయం వివరించి భక్తిమాత తమ కష్టాలను తలచుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ధర్మదేవ్ "మన హృదయంలో భగవంతుని పట్ల భక్తి, విశ్వాసం ఉంటే మనం ఆకలితో చావటం జరగదు. ఏ భక్తులు ఆకలితో చావకుండా భగవంతుడు వారికి ఏదో రకంగా ఆహరం అందిస్తాడు, ఆ విశ్వాసం ఉంచుకో" అని ధైర్యం చెప్తుండగా ఇంతలో బయట ఎవరో తలుపు తట్టినట్లు వినిపించింది.

  తలుపు తీసి చూడగా ఆ రోజు తను కాపాడిన మతిస్థిమితం లేని అమ్మాయి యొక్క తల్లి వచ్చింది. ఆమె లోపలి వచ్చాక " అమ్మా, ఈ గ్రామంలో నీకిన్ని కష్టాలు కలిగాయి, నేనవి చూడలేకుండా ఉన్నాను. మీకెవరు సహాయం చేయలేకపోతున్నారు. మీకోసం నేను కొన్ని రొట్టెలు, బెల్లం, ఉప్పు తీసుకొచ్చాను. నాయందు దయ ఉంచి ఈ ఆహారాన్ని మీ బాబుకి పెట్టండి" అని ఎంతో వినయంగా ఆవిడ తను తెచ్చిన మూటను ఇచ్చింది. అప్పుడే భర్త చెప్పిన మాటలు భక్తిమాతకి స్ఫురణకు వచ్చాయి, భగవంతుడు తనను నమ్ముకున్న భక్తులను ఏదో రకంగా కాపాడతాడు అని. తరువాత ఆమెతో "అమ్మా, ఎందుకింత కష్టపడి మా కోసం ఇంత దూరం ఈ ఆహరం తీసుకువచ్చావు. గ్రామస్తులందరూ కూడా కాళిదాసుకి భయపడి మాకు సాయం చేయలేకపోతున్నారు. నువ్వు ఏ ఆశ్రయం లేని దానివి, అటువంటి నీకు మా మీద ఎందుకు ఇంత దయ కలిగింది" అని కన్నీరు కారుస్తూ గొంతు గద్గదమైపోగా భక్తిమాత అడిగింది. దానికి ఆమె చేతులు జోడించి "తల్లి ఈ గ్రామస్తులు అందరు ఉండి కూడా ఆ రోజు నా బిడ్డని రాళ్ళతో కొట్టినపుడు నువ్వే వారిని ధైర్యంగా అడ్డుకున్నావు, ఆ కాళిదాసుని ఎదుర్కుని నాకు, నా కూతురుకి ప్రాణదానం చేసారు. అటువంటి మిమ్మల్ని నేనెలా మరువగలను. ఈ గ్రామంలో బ్రాహ్మణ స్త్రీవైన నువ్వింత బాధపడటం ఈ ఊరికే క్షేమం కాదు. అయితే నువ్వేమి సందేహించకుండా ఈ పదార్థాలను తీస్కో తల్లి.

ఒక బ్రాహ్మణ స్త్రీ చేతనే ఈ పదార్థాలను చేయించాను, నేను వాటిని ముట్టుకుని అపవిత్రం చేయలేదు, నువ్వు చేసిన ఉపకారానికి ఎంతో కొంత ప్రత్యుపకారం చేసినట్లు ఉంటుంది" అని ఎంతో ఆర్ద్రంగా తీసుకోమని ప్రార్ధించగా వారు ఆ ఆహారాన్ని స్వీకరించడం జరిగింది. ఆమె వెళ్ళాక వారిలో కృతజ్ఞతా భావంతో కన్నీరు ధారగా వచ్చింది. ఈ గ్రామంలో ఎంతోమంది ధనికులు, వ్యాపారులు ఉండి కూడా చేయలేని పనిని ఒక బీదరాలు, కూలి, నాలి చేసుకుని బ్రతికే ఒక విధవరాలు తనకి ఉన్న కొద్దిపాటి ధనంతో ఒక బ్రాహ్మణ స్త్రీ చేత ఆహరం వండించి తమకు తెచ్చివ్వటం నిజంగా ఆమెను దైవ దూతలా  భావించి, ఆమె ఇచ్చిన ఆహారాన్ని తమ బిడ్డకు తినిపించటానికి ఆహారపు మూటను విప్పారు. 

అప్పటికే ఈ విషయం తెలుసుకున్న కాళిదాసు తన మాంత్రిక శక్తితో వారు ఆ ఆహారాన్నితెరిచేలోపు దానిని మాంసపు ముద్దలుగా మార్చివేసి, వికటాట్టహాసంతో "ఈ చపయ్య గ్రామంలో మీరు ఆహరం దొరకక చావవలసిందే, మిమ్మల్ని బ్రతకనివ్వను" అని అనుకున్నాడు. దంపతులిద్దరూ ఈ పరిణామానికి ఆశ్చర్యపోయారు కాని వారికి భగవంతునిపై విశ్వాసం ఉండడం కారణంగా వారు ఏ మాత్రం చలింపక ఆ క్షుద్భాదని భరిస్తూ భగవన్నామం చేసుకుంటూ ఉండిపోయారు. కొంత సేపటికి భక్తిమాత ధర్మదేవ్ తో "మనం చపయ్య విడిచి వెళ్లిపోదాము, ఇక్కడ మనకు ఎవరు లేరు, మనకెవరు సహాయం చెయ్యరు. మన కుమారుడి కోసమైనా మనం ఈ ఊరు వదిలిపొదాము" అని అడుగగా చివరకు వారు అక్కడకు దగ్గరలోని "అయోధ్య" అనే గ్రామానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. “ఆ శ్రీ రాముడు జన్మించిన అయోధ్యకు వెళ్లిపోదాము, మనకు అక్కడ ఆకలి బాధ ఉండదు” అని అనుకున్నారు. అక్కడ కాళిదాసు ఈ విషయం గ్రహించి తన దగ్గర మంత్రాలు నేర్చుకున్న ఇద్దరు శిష్యులను ముందే అయోధ్య వెళ్ళే మార్గం దగ్గరకి పంపటం జరిగింది.

అయోధ్యా నివాసం

ధర్మదేవ్ దంపతులు తమ కుమారుడిని తీసుకుని తాము నిశ్చయించుకున్న ప్రకారం అయోధ్య నగరానికి ప్రయాణమయ్యారు.  వారు అక్కడే నివసిస్తూ ధర్మదేవ్ కి  తెలిసిన పౌరోహిత్యంతో జీవనం సాగిస్తూ వచ్చారు. కాని కాలం చాలా విచిత్రమైనది. ఒక రోజు బ్రాహ్మణులకి అన్నసంతర్పణ చెయ్యాలని నిశ్చయించుకున్న ధర్మదేవ్ దంపతులు ఆ చుట్టూ పక్కల ఉన్న బ్రాహ్మణులను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించి మధుర పదార్థాలు చేసి వడ్డించడానికి ఉపక్రమించారు. కాని ఆశ్చర్యంలో ఆశ్చర్యం ఏమిటంటే ఆ భోజన పదార్థాలన్నీ మాంసపు ముద్దలుగా, తాగటానికి పెట్టిన నీరంతా మద్యంగా మార్చివేశాడు కాళిదాసు పంపిన తాంత్రికుడు. అది చూసిన అతిధులు ఆగ్రహంతో లేచి మీరు కావాలనే మమ్మల్ని అవమానించారని చెప్పి, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మొత్తం బ్రాహ్మణ సమాజం అంతా వీరిని వెలివేయడం జరిగింది. ఆ తాంత్రికుడు అంతటితో ఆగలేదు, వారి కుమారుడైన రామ్ ప్రతాప్ పై సర్ప ప్రయోగం చెయ్యడం, ఆ బాలుడు పాము కాటుకి గురి కావడం సంభవించింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ బాలుడిని చేతిలో పట్టుకుని అయోధ్యలోని ప్రతి వైద్యుడి ఇంటి చుట్టూ తిరిగినా, వారందరూ వీరిని వెలివేసిన కారణంగా ఏ మాత్రం వైద్య సహాయం చేయలేదు. ఒక వైపు భక్తిమాత కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే, ధర్మదేవ్ చేతిలో స్పృహలేని కుమారుడిని పట్టుకుని వీధి వీధి గాలిస్తున్నారు.

ఇదంతా గమనిస్తున్న నారదుడు దుర్వాసుని ఆశ్రమానికి వెళ్లి "మహానుభావా ఒకసారి భూలోకంలో చూడండి, మీరిచ్చిన శాప ఫలితంగా ధర్మదేవ్, భక్తిమాతల కుమారుడు పాము కాటుకి గురి కావటంతో ఆ ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం వారు అయోధ్యలో ప్రతి వైద్యుని ఇంటికి పరిగెడుతున్నారు చూడండి. ఇందుకోసమేనా మీరు శపించారు, ఆ పుణ్య దంపతులు మీ శాపం మూలంగానే ఇన్ని ఇక్కట్లు పడుతున్నారు" అని మెత్తగా మందలించాడు. "ఈ సంగతి అంతా నీవు నారాయణుడికే చెప్పు, అతనే మార్గం చూపిస్తారు. ప్రతి వారికి వారి ప్రారబ్ధకర్మలు అనుభవించక తప్పదు, దానికి విధాత కూడా ఏమి చెయ్యలేడు" అని చెప్పగా నారదుడు నారాయణుడి వద్దకు వెళ్ళడం జరిగింది. "భగవాన్ మీ లీలలన్ని విచిత్రం, మీరు తల్లితండ్రులుగా ఎంచుకున్న ధర్మదేవ్, భక్తిమాత మరియు మీ అన్నగారైన రామ్ ప్రతాప్ కింద ఎంత అవస్థ పడుతున్నారో చూడండి, ఎక్కడకి వెళ్ళిన వారికి నిరాదరణ, దుష్ట శక్తుల ప్రభావమే ఎదురవుతోంది. మరి ఏమిటి స్వామి మీ లీల, నాకేమి అర్థం కావట్లేదు. మీ తల్లితండ్రులు, మీ సోదరుడు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారని తెలిసి కూడా మీరు నిమిత్త మాత్రులుగా ఒక ప్రేక్షక పాత్రని వహిస్తున్నారు" అని చెప్పగా నారాయణుడు చిరునవ్వు నవ్వి, "నారదా నీకు తెలియనిది ఏమున్నది, ప్రకృతి ధర్మాలబట్టే అన్ని జరుగుతుంటాయి, ప్రారబ్ధ కర్మలు ఎవ్వరైనా సరే అనుభవించక తప్పదు. అది వారికి మంచి ఫలితాన్నే ఇస్తుంది, మొదట్లో కొంచెం కష్టాన్ని భరించక తప్పదు. ఎంతటి వారికైనా, చివరికి భగవంతునికైనా మనుష్య జన్మ ఎత్తినప్పుడు కష్టాలు అనేవి అనుభవించక తప్పదు సుమా.

నువ్వు చెయ్యగలిగిన పనులు కూడా నాతోనే చేయించదల్చుకున్నావా" అని నర్మగర్భంగా పలకటం జరిగింది. ఆ సూచన గుర్తించిన నారదుడు అక్కడ అయోధ్యలో ఒక వైద్యుని ధర్మదేవ్ దంపతులకి సహాయం చేయడానికి ప్రేరేపించి, ఆ దంపతులను ఆ వైద్యుడి ఇంటికి మార్గ నిర్దేశం చేసాడు. ఆ దంపతులిద్దరూ ఆ వైద్యుడి తలుపు తట్టడం, ఆ వైద్యుడు తలుపు తీసి వీరిని గుర్తుపట్టి "మీరే కదా బ్రాహ్మణులను భోజనానికి పిలిచి వారికి మద్యమాంసాలు సమర్పించినది" అని అడగ్గా  వారిద్దరూ తమకు అక్కడ కూడా సహాయం అందదని నిరాశగా వెనుదిరిగారు.