N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 7 November 2013

SwamiNarayan - Episode 7

దివ్యశిశువు జననం

1781వ సంవత్సరం ఏప్రిల్ 2, రాత్త్రి 10 గంటలకి అద్భుతమైన తేజస్సు చపయ్య గ్రామంలోకి ప్రవేశించి భక్తిమాత యొక్క గర్భాన ప్రవేశించింది. ఆ క్షణంలో సాక్షాత్తు నరనారాయణుడు తన 16 కళలతో ముందు చెప్పినట్లుగా ఉత్తరప్రదేశ్ లో అయోధ్య నగరానికి దగ్గరలో ఉన్నటువంటి చపయ్య గ్రామంలో అవతరించడం జరిగింది. ఈ అవతారం చాలా విశిష్టమైనది, గుహ్యమైనది. దాని అర్థం ఏమనగా ఆత్మజ్ఞానం కలిగినవారికే ఈ అవతారం యొక్క విశేషాలు తెలుస్తూ ఉంటాయి. ఎక్కడో హిమాలయ ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి  మహర్షులు, సిద్ధులు, యోగులు వారందరికీ కూడా ధ్యానస్థితిలోనే భూమి మీద నరనారాయణుడు అవతరించాడు అని తెలిసి అదృశ్య రూపంలో చపయ్య గ్రామానికి విచ్చేసి ఆయన మీద పూలవర్షము కురిపించారు. గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు అక్కడకి వచ్చి నరనారాయణుడు పావనం చేసిన ఆ గృహాన్ని, ఆ దంపతులని ఆశీర్వదించారు. భూమాత ఆయన జననంతో ఎంతో సంతోషంతో పులకించిపోయింది. ఈ విధంగా నరనారాయణుడు అందరిని ఆకర్షించి ఆ గ్రామంలోని జనులందరికి ముద్దుబిడ్డగా జన్మించాడు. 

గ్రామంలోని స్త్రీలందరూ అక్కడకి వచ్చి ఆ ముగ్ధమోహన రూపాన్ని చూసి పులకించిపోయారు. వీరందరూ కూడా పూర్వజన్మలలో నరనారాయణుడు బదరికావనంలో ఉన్నపుడు అక్కడికి ఆయన అనుగ్రహం కోసం వచ్చినవారే. ఇలా ధర్మదేవ్ కుటుంబం ఆ ఊరి ప్రజల మన్నన పొంది, ఆ గ్రామం అంతా కూడా ప్రేమభావంతో, భక్తిభావంతో అన్నదమ్ముల వలె కలిసిపోయి జీవించసాగారు.

ఒకరోజు ధర్మదేవ్, భక్తిమాత ఏకాంతంగా ఉన్నపుడు తమ కుమారుడిని ఎంతో ప్రేమతో తదేకంగా చూస్తున్నారు. ఆ జగన్మోహనాకారుడు చిరునవ్వులు చిందిస్తూ  తన వాణిని వారిద్దరికీ మాత్రమే వినపడేట్లుగా "మీ ఇద్దరికీ నేను ఇదివరకే నా జన్మరహస్యం గోప్యంగా ఉంచాలి అని చెప్పాను. నేను ఎవరిని అనేది మీకు మాత్రమే తెలియాలి, జాగ్రత్త సుమా" అని మరొక్కమారు వారిని హెచ్చరించారు. ఒకనాడు సాక్షాత్తు శ్రీ నరనారాయణుడి అవతరమైన ఆ శిశువుని దర్శించడానికి విధాత భార్య అయిన సరస్వతిదేవి అక్కడ ప్రత్యక్షమయ్యింది. "స్వామీ, సాధారణంగా నరులు జన్మించినపుడు వారి లలాటం మీద వారి విధిని రాయటానికి నేను సిద్ధమవుతాను, కాని నేను ఈ రోజు ఆ పని చెయ్యటానికి రాలేదు. అనంతకోటి సూర్యప్రభల తేజస్సుతో వెలిగిపోతున్న మీ మోహనాకారాన్ని దర్శించుకోవటానికే నేను వచ్చాను. నరనారాయణుల అంశతో అవతరించిన నీ జన్మ విశేషం నాకు స్పష్టంగా తెలుసు స్వామి.

పవిత్రమైన అయోధ్యనగరానికి దగ్గరలో ఉన్న ఈ చిన్నగ్రామంలో చైత్ర మాసం వసంత ఋతువు శుద్ధ నవమి రోజు, రాత్రి పది గంటలకు నీ తేజస్సు ఇక్కడ ప్రసరించినది. నీ ప్రభావంతో ఇక్కడ కలిపురుషుడి ఉనికి లేకుండాపోయింది. పవిత్రమైన అయోధ్యనగరంలో శ్రీ రాముడు మధ్యాన్నం జన్మించాడు. సాధారణంగా మధ్యాన్న సమయంలో ప్రజలు వారి వారి పనుల్లో నిమగ్నమయిపోతుంటారు. కాబట్టి వారికి శ్రీ రాముడి యొక్క జన్మము అంత పెద్దగా పట్టించుకుని ఉండరు. అదే శ్రీ కృష్ణ పరమాత్ముడు అయితే రాత్రిలో జన్మించాడు. అది కూడా కారాగారంలో జన్మించాడు. ఆ సమయములో సమస్త ప్రజలు కూడా నిద్ర అనే మాయలో తామేమిటో కూడా తెలియకుండా వళ్ళు మరచి నిద్రపోతుంటారు. అటువంటి వారినందరినీ కూడా తట్టి లేపి వెలుగు వైపు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసారు శ్రీ కృష్ణ పరమాత్ముడు. మరి నీవో, అంకెలలో అతి పెద్ద అంకె అయిన నవమినాడు జన్మించావు. ఈ నవమి అనే సంఖ్య సాక్షాత్తు భగవంతుడి యొక్క గుణగణాలకి ప్రతీక. 9 తరువాత ఇంకా ఏమి లేదు కదా ప్రభు. నీవు సాక్షాత్తు జనుల హృదయాలకి  ఒక రధసారధి లాగ ఉండి జీవాత్మ, మరియు పరమాత్మ మధ్యలో ఉండే మాయను తొలగించి వారినందరినీ కూడా జీవన్ముక్తులుగా మార్చడానికి వచ్చినటువంటి మహావిశేషమయిన అవతారమని నేను గ్రహించాను ప్రభు. జీవుడు జన్మించినపుడు 9 నెలలు తల్లి గర్భంలో ఉండి, తాను ఒక దివ్యశిశువుని అనే సత్యాన్ని మరచి ప్రేమ, అనురాగం, మాయ, రోగాలు అనే రకరకాల బంధనాలలో చిక్కుకునిపోతాడు. అటువంటి మనిషిని ఆ మాయ బంధనాలనుంచి విముక్తుడిని చేసి, నరులని నారాయణునిగా చేసే ప్రక్రియలో నీకు ఎంతో సంతోషం ఉంటుంది అని నేను గ్రహించాను స్వామి. ఈ చపయ్య ప్రజలందరు కూడా నీ రాకతో పవిత్రాత్మలుగా మారారు అని గ్రహించాను స్వామి" అని భక్తితో నరనారాయణునికి నమస్కరించి ఆమె అదృశ్యమయ్యింది.


ఇలా ఆనందంగా సమయం గడుస్తూ ఉన్నది. అక్కడ కాళిదాసు తన కాలభైరవ ఉపాసనని తీవ్రం చేసాడు. ఒకరోజు అతని ముందు క్షుద్రశక్తులైన  కృత్య, తన ఇద్దరి తాంత్రిక శక్తులతో ప్రత్యక్షమయింది. కాళిదాసు వారి ముగ్గురితో "నా శత్రువైన నరనారాయణుడు భక్తిమాత, ధర్మదేవ్ ఇంట్లో జన్మించాడు. ఎందుకో మరి వింధ్యావాసిని నన్ను కరుణించలేదు, అతనిని చంపే శక్తులు నాకు ప్రసాదించలేదు. 

ఆవిడని ప్రసన్నం చేసుకోవాలంటే ఆ శిశువు యొక్క రక్తంతో ఆమెకి తర్పణం చెయ్యాలి. కాబట్టి మీరు వెంటనే ఆ శిశువుని సంహరించండి" అని ఆజ్ఞాపించాడు. అతని మంత్రతంత్రాలకి బందీలయిన ఆ ముగ్గురు భయంకర మైన ఆకారాలతో స్వామికి 6 రోజుల వయసు ఉండగా భక్తిమాత ఇంట్లో ప్రవేశించారు. అపుడు భక్తిమాత తమ పిల్లవాడిని ముద్దుగా ఘనశ్యాం మహారాజ్ అని పిలుచుకుంటూ అతన్ని లాలించే పనిలో ఉన్నది. అదే క్షణంలో ఆమె ఈ ముగ్గురుని చూసి భయకంపితురాలయ్యింది. "ఎవరు మీరు?" అని భయంగా అడుగగా "మేము నీ పుత్రుని యొక్క మృత్యువులం, అతనిని చంపటానికి వచ్చాము" అని బలవంతంగా ఆ బాలుడిని లాక్కుని అదృశ్యం అయిపోయారు. ఈ పరిణామానికి భక్తిమాత బిగ్గరగా అరవసాగింది. 

ఆ అరుపులు విని ధర్మదేవ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. " స్వామీ, ఎవరో ముగ్గురు భయంకరాకారులు మన ఘనశ్యాం మహారాజ్ ని ఎత్తుకుని అదృశ్యం అయిపోయారు, ఇపుడు మన గతి ఏమిటి" అని రోదించసాగింది. ధర్మదేవ్ కూడా ఏమి చెయ్యాలో తెలియక రోదించసాగాడు . అలా వారు మామూలు మనుషుల్లాగ ఏడుస్తూ కూర్చుండిపోయారు.