N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Friday, 15 November 2013

SwamiNarayan - Episode 8

ఘనశ్యాంని ఎత్తుకొచ్చిన ఆ ముగ్గురు క్షుద్రశక్తులు ఆ బాలుడిని ఒక బంతిలా గాలిలో ఎగరేసి ఒకరి మీదకి ఒకరు విసురుకుంటూ వికటాట్టహాసాలు చేస్తున్నారు. అయినప్పటికీ 6 రోజుల వయసు కల ఆ స్వామి నవ్వుతూ అలాగే ఉన్నారు. ఈలోగా భక్తిమాత, ధర్మదేవ్ ల కులదైవమయిన హనుమాన్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. తన పొడవయిన వాలంతో ఆ ముగ్గురుని గట్టిగా బంధించి, పీడించసాగారు.స్వామి మాత్రం నిమిత్తమాత్రులుగా అలాగే చూస్తుండి పోయారు. ఆ ముగ్గురు శతవిధాల ప్రయత్నం చేసినా, ఆంజనేయుని పట్టునుంచి విడిపించుకోలేకపోయారు. వారిని ఇలా కాసేపు బాధించిన తరువాత వారిని సంహరించడానికి సిద్దమయిన హనుమంతునితో ఘనశ్యాంమహారాజ్ "హనుమా, దయచేసి వీరిని చంపద్దు, నేను కృష్ణుడి అవతారంలో ఉన్నపుడు పోతన నన్ను చంపడానికి వచ్చింది, అలాగే రామావతారంలో ఉన్నప్పుడు వీరిలో ఒకరు తాటకి రూపంలో నాతో యుద్ధం చేసారు. వారిద్దరిని కూడా ఆ అవతారాలలో సంహరించాను. కాని నా ఈ అవతారం చాలా విశిష్టమైనది, ఈ కలియుగంలో మానవుల యొక్క దుష్టత్వాన్ని సంహరించడానికే నేను పూనుకున్నాను. దానివల్ల దుష్టులు వారి పాపాలు తొలగిపోగా, పుణ్యాత్ములవుతారు. ఇక్కడ మనుషులలోని అరిషడ్వర్గాలని సంహరించి వారిని నేను సన్మార్గులుగా మార్చాలనే ఉద్దేశంతో అవతరించాను కనుక దయ ఉంచి వారిని విడిచిపెట్టు" అని ఆదేశించగా హనుమ వినయంగా స్వామి ఆజ్ఞ శిరసావహించి వారిని విడిచి పెట్టి, స్వామిని తీసుకుని అదృశ్యం అయ్యాడు.  ఇక్కడ ధర్మదేవ్ దంపతులు రోదిస్తూ తమ బిడ్డ యొక్క దుస్థితిని తల్చుకుని కుమిలిపోసాగారు. 

భక్తిమాత "మనం ఇక జీవించి లాభామేమున్నది, మన ముద్దుబిడ్డ అయిన ఘనశ్యాంమహారాజ్ ని ఏవో క్షుద్రశక్తులు ఎత్తుకునిపోయాయి కనుక మనిద్దరం ఆత్మహత్య చేసుకుని మరణిద్దాము" అని చెప్పగా ధర్మదేవ్ "మనమొకసారి ఘనశ్యాంమహారాజ్ ని వెతికే ప్రయత్నం చేద్దాము, అపుడు కూడా దొరకకపోతే నీవన్నట్లుగానే మరణిద్దాము" అని అంటుండగా వారి ముందు హనుమంతుడు ప్రత్యక్షమయ్యి  ఘనశ్యాంమహారాజ్ ని వారికి అందించారు. వారిద్దరూ సంభ్రమాశ్చర్యాలతో హనుమంతుని స్తుతించారు. అపుడు ఆయన వారిని ఉద్దేశించి “మీకు నేను కులదేవతను, కాబట్టి  మిమ్మల్ని రక్షించడం నా కర్తవ్యం కాని సాక్షాత్తు నరనారాయణుడి అవతారమైన ఈ బిడ్డ తనను తాను సులభంగా రక్షించుకోగలడు, అయిన కూడా ఆ పని ఆయన బదులు నేను చెయ్యవలసివచ్చింది. మీరు కూడా మామూలు మానవుల వలె రోదించడం తగునా? సాక్షాత్తు నరనారాయణుడే మీ ఇంట వెలసినపుడు మీరు అదంతా మరచిపోయి ఇలా రోదిస్తూ కూర్చుంటారా?" అని ప్రేమగా మందలించారు. అపుడు ఘనశ్యాంమహారాజ్ హనుమంతునితో "హనుమా చాలా మంచి పని చేసావు. నా తల్లితండ్రులకి నేను నర నారాయణుడి అవతారమని చక్కగా వివరించావు, వారిని ఆ భావనలోనే ఉండనివ్వు,  అది ముందు ముందు నాకెంతో పనికి వస్తుంది"  అని చెప్పగా హనుమాన్ ఆయనకి మరొక్క మారు నమస్కరించి అక్కడ నుంచి అదృశ్యం అయిపోయాడు. 

అక్కడ ఈ ముగ్గురు క్షుద్రశక్తులు కాళిదాసు వద్దకు వెళ్లి జరిగిన ఉదంతాన్ని అతనికి మొరపెట్టుకున్నాయి. కాళిదాసు "6 రోజుల పసిబాలుడిని కూడా చంపలేకపోయారా" అని వారిని ఎన్నో దుర్భాషలాడాడు. అపుడు కృత్య "కాళిదాసు, మన క్షుద్రశక్తులు ఆ దైవికశక్తుల ముందు ఎందుకూ పని చెయ్యవు. మన క్రూరత్వం మనుషులని బాధిస్తుంది, చంపుతుంది. కాని దైవికశక్తి మనుషులని  కాపాడుతుంది, బతికిస్తుంది. సరిగ్గా ఇదే మాకు జరిగింది. చంపగలిగి ఉండి కూడా మమ్మల్ని చంపకుండా, మా క్రూరత్వాన్ని అణచివేసి మాకు జీవనదానం చేసింది ఆ దైవికశక్తి. అటువంటి శక్తిని నువ్వు సంహరించాలి అనే ప్రయత్నం మానుకోవటం మంచిది. నువ్వు ఎలాగైనా ఆయన శరణు వేడుకో. అనవసరంగా నువ్వు దుష్టమయిన ఆలోచనలు చేసి, తప్పు చెయ్యకు. ఆయనని శరణు వేడు, అది నీకు తప్పక శుభాన్ని కలిగిస్తుంది" అని వారు అతనికి హితబోధ చేసి వెళ్ళిపోయారు. కాని దుష్టస్వభావం  అణువణువునా వ్యాపించిన కాళిదాసు మాత్రం ఎలాగైనా సరే ఆ బాలుడిని చంపితీరాలనే పట్టుదలతో తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

బాల్య లీలలు

గ్రామస్తులు కూడా ఆ బాలుడిని "ఘనశ్యాం మహారాజ్"  అని పిలుస్తుండేవారు. ఆయన బాల్యంలో చేసిన లీలలు చాలా అద్భుతంగా ఉండేవి. ఒకరోజు వారింటికి ధర్మదేవ్ మిత్రుడైన రామదయాళ్ అనే ఒక సజ్జనుడు రావటం జరిగింది. భక్తిమాత, ధర్మదేవ్, రామదయాళ్ ముగ్గురు సద్గోష్టిలో ఉండగా రామదయాళ్ కి ఉయ్యాలలో పడుకున్నటువంటి రెండున్నర నెలల వయసుకల  ఘనశ్యాంమహారాజ్ చాలా నేర్పుగా తను పడుకున్న ఉయ్యాలలోంచి కిందకి దిగి అక్కడ ఉన్న ఆటవస్తువు వైపు వెళ్ళడం, దానిని అందుకోవడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. కేవలం రెండు నెలలు వయసున్న శిశువు అంత పెద్ద ఉయ్యాలలోంచి దిగటం, ఆట వస్తువుని పట్టుకోవటం చూసి ఈ బాలుడు సామాన్యుడు కాదు, గొప్ప దైవాంశతో  పుట్టినవాడని ఆయన భావించాడు. ఒకసారి ఘనశ్యాంమహారాజ్ కి నామకరణం చెయ్యతలచి ఎంతో పేరుప్రఖ్యాతలుకల జ్యోతిష్య శాస్త్రజ్ఞుడైన మార్కండేయ మహర్షిని ఆహ్వానించడం జరిగింది. 

ఆయన ఆ బాలుడిని చూసి, అతని జన్మ వివరాలు అడగగా భక్తిమాత ఘనశ్యాంమహారాజ్ చైత్రమాసం శుద్ధ నవమి రోజున జన్మించాడని చెప్పగా, ఆయన ఈ బాలకుడు కర్కాటక రాశిలో ఒక గొప్ప దైవాంశ సంభూతుడిగా ఇతడిని గుర్తించాడు. ఆ బాలుడిని ప్రజలు రకరకాల పేర్లతో పిలుస్తారని, ఘనశ్యాంమహారాజ్ అనే పేరు మాత్రమే కాకుండా, హరికృష్ణ అని, సహజానంద స్వామి అని, కూడా పిలవబడటాడని ఆయన చెప్తూ ఘనశ్యాంమహారాజ్ ని చూడగా ఆయన ఈ మహర్షిని చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. దానితో ఆ మహర్షి ఏదో తెలియని ఒక తన్మయావస్థలోకి వెళ్ళిపోయారు. కాసేపటికి తేరుకుని భక్తిమాతతో "తల్లి నీ జన్మ ధన్యమయ్యింది, సాక్షాత్తు నరనారాయణుడి అంశతో జన్మించినటువంటి శిశువు ఇతను. ఇతని కీర్తి ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తుంది. ఇతను మనుషుల్లో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను పారద్రోలి వారందరినీ సన్మార్గంలో పెట్టడానికి అవతరించాడు" అని చెప్పి “నీలకంఠవర్ణి” అని నామకరణం చేసారు. ఈ నామకరణ మహోత్సవం 12 జూలై 1781న జరిగింది.

రోజులు గడుస్తుండగా ఒకసారి ధర్మదేవ్, భక్తిమాత తమ కుమారుని ముందు ఒక ఖడ్గము, ఒక బంగారు నాణెము, ఒక పుస్తకము పెట్టి ఆ శిశువు ఏ వస్తువు పట్టుకుంటాడా అని ఆసక్తిగా గమనిస్తుండగా ఘనశ్యాం మహారాజ్ మెల్లమెల్లగా పాకుతూ వెళ్లి పుస్తకాన్ని పట్టుకోవడం జరిగింది. దాని అర్థం ఏమిటంటే ఖడ్గం పట్టుకుంటే అతను ఒక దేశపు రాజుగా అవుతాడు, బంగారు నాణాన్ని గ్రహిస్తే మంచి వ్యాపారవేత్త అవుతాడని, పుస్తకాన్ని పట్టుకుంటే మంచి విద్వాంసుడు అవుతాడని నమ్మకం ఉంది. 

అయితే ఘనశ్యాం మహారాజ్ పుస్తకాన్ని పట్టుకుని తాను సకల శాస్త్రాలు చదివి మంచి విద్వాంసుడుగా ఎదుగుతానని వారికి సూచనలిచ్చాడు. భక్తిమాత ఘనశ్యాం మహారాజ్ కోసం ఆభరణాలు తయారు చేయించింది. పిల్లవాడికి చెవి కుట్టించడం కోసం ఊరిలోని నాయి బ్రాహ్మణుడిని పిలిపించింది. ఇది అక్టోబర్ 2, 1781న జరిగినది. ఆ రోజున పెరట్లో ఉన్న పెద్ద చింతచెట్టు కింద ఒడిలో ఘనశ్యాంమహారాజ్ ని కూర్చోపెట్టుకుని, ఆ మంగళివాడు చెవి కుట్టడానికి సిద్ధపడగా, ఆరు నెలల వయసులో ఉన్న ఘనశ్యాంమహారాజ్ అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయి ఆ చింతచెట్టు మీద ఒక కొమ్మ మీద విలాసంగా కూర్చుని ఉండడం చూసి అందరు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఘనశ్యాంమహారాజ్ అన్నగారైన రాంప్రతాప్ వచ్చి ప్రాధేయపడగా నెమ్మదిగా కిందకి దిగి చెవి కుట్టించుకోవడం జరిగింది.

ఆ స్వామి బాల్య లీలలు చూడటానికి చాలా మంది దేవతలు అదృశ్యరూపంలో ఘనశ్యాంమహారాజ్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఆయన బాల్య క్రీడలు, లీలలు చూసి వాళ్ళు చాలా మురిసిపోతుండేవారు. ఒకరోజు శ్రీమహాలక్ష్మి తన చెలికత్తెలతో అక్కడకి రావటం, ఒక చెలికత్తెని పిచుక రూపం ధరించి ఘనశ్యాంమహారాజ్ తో ఆడుకోమని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ పిచుక ఘనశ్యాంమహారాజ్ చుట్టూ ఎగురుతూ, తిరుగుతూ ఆయన దానిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఎగిరిపోవడం, అయినప్పటికీ ఘనశ్యాంమహారాజ్ ఎంతో నేర్పుగా దానిని పట్టుకోవడం, ఆ తరువాత భక్తిమాత ప్రాధేయపడగా దానిని వదిలెయ్యడం, అది తన అసలు రూపాన్ని ధరించి ఘనశ్యాంమహారాజ్ కి నమస్కరించి అదృశ్యం అవ్వటం చూసి భక్తిమాత చాలా ఆశ్చర్యపోయింది.

ఒకరోజు భక్తిమాతకి చాలా ఆకలిగా ఉంది, ఆవిడ వదినగారైన లక్ష్మిభాయి ఇంకా వంట చేసే ప్రయత్నంలోనే ఉన్నది. భక్తిమాతకి ఆకలి మితిమీరి స్పృహ తప్పిపోతుండగా ఆమె ఎదురుగా ఎనిమిదిమంది అద్భుతమైన సౌందర్యవతులు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరి చేతులలో రకరకాల మధుర పదార్థాలు, పానీయాలు ఉన్నాయి. "ఎవరు మీరని" అడుగగా, "మేమందరం అష్టసిద్దులం, మీ కుమారుడి ఆదేశానుసారమే మీ ఆకలి తీర్చడానికి మేము ఈ పదార్థాలు తీసుకోచ్చాము, దయచేసి వీటిని ఆరగించండి" అని వారు చెప్పారు. ఈ లోపు ఘనశ్యాంమహారాజ్ వచ్చి ఆ మధుర పదార్థాలను స్వీకరించడం జరిగింది. 

ఇవన్ని చూసాక భక్తిమాత తమ కుమారుడు సామాన్యుడు కాదని ఇంకొక్కసారి తెలియవచ్చింది. ఇంకొకసారి ఘనశ్యాంమహారాజ్ కి స్వయంగా పాలు ఇవ్వాలని సంకల్పించి ఒక పాత్రలో వారి ఇంటి గోమాత అయిన గోపి దగ్గరకి వెళ్లి పాలు పిండటానికి ప్రయత్నించగా ఒక్క చుక్క పాలు కూడా రాలేదు. ఆమె వెనక్కి రాగానే ఘనశ్యాంమహారాజ్ చిన్న పాత్ర పట్టుకుని ఆవుపొదుగు కింద ఆ పాత్రను ఉంచగానే క్షీరంతో ఆ పాత్రంతా నిండిపోయింది.  అది చూసి భక్తిమాత చాల ఆశ్చర్యపడి దేవతలే కాదు, ప్రకృతి, జంతువులూ కూడా ఈ బాలుడిని సేవించడానికి ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తున్నాయని భావించింది.