N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 27 February 2014

SwamiNarayan - Episode 16

ఘనశ్యాంమహరాజ్ దినచర్య - విధ్యాభ్యాసం

ఉపనయనం జరిగిన తరువాత ఘనశ్యాంమహరాజ్ ప్రాతఃకాలం నందు సరయునది వద్దకు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న రాంమందిర్, హనుమాన్ ఘఢి తదితర దేవాలయముల వద్ద ధ్యానం చేసుకునేవాడు. ఎక్కడ హరికథా కాలక్షేపం జరిగినా, పురాణ శ్రవణం జరుగుతున్నా అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉండిపోయేవాడు.

అయోధ్యానగరంలో హతేరాం అనే పండితుడు ఉండేవాడు, ఘనశ్యాంమహరాజ్ అతని వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆయన వద్ద జ్యోతిష్యశాస్త్రం, ఖగోళశాస్త్రం ఇత్యాది శాస్త్రాలు చాలా శ్రద్దగా నేర్చుకున్నాడు. ఇంతేకాక హనుమాన్ ఘఢి వద్దకు వెళ్ళి అక్కడ మోహనదాస్ అనే ఆయన చెప్పే విషయాలను చాలా శ్రధ్ధగా వినేవారు. పలురకాల విద్యలను శ్రద్దగా నేర్చుకోవడం గమనించిన గురువుగారు చాలా ఆనందించారు.   

ఘనశ్యాంమహరాజ్ కి చిన్నప్పటి నుండి పురాణ గాథలు, సత్పురుషుల కథలు వినే అలవాటు ఉండేది. ఏదైనా సరే ఘనశ్యాం మహారాజ్ చాలా తొందరగా అర్ధం చేసుకునేవారు. భగవంతుని రూపమైన ఘనశ్యాంమహరాజ్ కొంతమంది మానవమాత్రులైన గురువుల వద్ద శిష్యరికం చేయడం వంటి లౌకిక ధర్మాన్ని పాటించటం చాలా గొప్ప విషయం.

ధర్మదేవ్ అంతిమయాత్ర

ధర్మదేవ్ తన భార్య భక్తిమాత మరణానంతరం నిర్లిప్తంగా ఉండేవారు.  ఆయనకి పూర్తిగా బాహ్యస్మృతి పోయింది. అన్నపానీయాల మీద శ్రద్ధ పూర్తిగా తగ్గిపోయింది. నిరంతరం భగవద్ధ్యానం లోనే గడిపేవారు. ఒకరోజు సుహాసిని మామగారిని సమీపించి "అత్తగారు పోయినప్పటినుంచి మీరు బొత్తిగా ఆహారం తీసుకోవడం మానేశారు. రోజంతా కూడా మీరు పూజామందిరంలోనే ఉండిపోతున్నారు. బాధ్యతలన్నీ రాంప్రతాప్ మీదే వదిలేసారు  దయచేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు దయచేసి భోజనానికి లేవండి" అని ప్రార్ధించింది. ధర్మదేవ్ "ఘనశ్యాం మహారాజ్ వచ్చాడా, ఎక్కడున్నాడు?" అని అడిగాడు. 

దానికి సమాధానంగా సుహాసిని "ఈ పాటికి ఇంటికి వోచేస్తూ ఉంటాడు, మీరు భోజనానికి లేవండి" అని ప్రార్ధించగా ధర్మదేవ్ నిర్వేదంగా "నాకేమి ఆకలి లేదు, ఒక గ్లాసు పాలు చాలు" అన్నాడు. సుహాసిని అదే ప్రకారం పాలు ఇస్తూ మీరు ఇదే విధంగా చేస్తే మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దీనివల్ల అత్తగారి ఆత్మ శాంతిస్తుందా అని ఎంతో వినయంగా ధర్మదేవ్ ని ప్రశ్నించింది. దానికి సమాధానంగా ధర్మదేవ్ "అమ్మా, భక్తి ధర్మం రెండు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటాయి మరి భక్తి లేకుండా ధర్మం ఉండలేదు" అని నిర్లిప్తంగా జవాబు చెప్పాడు. తరువాత రాంప్రతాప్, ఇచ్ఛారామ్ ని తన దగ్గరకు పిలిపించి ఘనశ్యాంమహరాజ్ యొక్క జన్మ రహస్యం వెల్లడించారు. “సాక్షాత్తు నరనారాయణుల అవతారమే ఘనశ్యాంమహరాజ్. అతనిని మామూలు మనిషిగా చూడరాదు, భగవంతునిగానే ఎల్లప్పుడూ చూడాలి. 

అతను మన పరివారానికే కాదు, ఈ ప్రపంచానికంతటికి తల్లి,తండ్రి కాబట్టి అతని పట్ల సోదరభావంతోనే కాకుండా భగవంతునిగా భావించి, సేవించి తరించండి. స్వామి వారు జన్మించిన కారణం మన ఇంటికే పరిమితం కాకూడదు, ఆయన కారణజన్ముడు.  ఈ లోకాన్ని ఉద్దరించడానికి ఆయన ఈ అవతారం ఎత్తాడు. కాని నేను పుత్రవాత్సల్యంతో స్వామి వారు గృహత్యాగం చేస్తానంటే  వద్దన్నాను. అదే విధంగా తండ్రిగా నా మాటకు కట్టుబడి ఘనశ్యాం మహారాజ్ కూడా గృహత్యాగం చెయ్యలేదు. ముందు ముందు ఆయన గృహత్యాగం చేస్తానంటే మీరెవరు ఆయనకు అడ్డు చెప్పద్దు, వారి ఇష్ట ప్రకారమే వెళ్లనియ్యండి.

దాని వల్ల లోకోద్ధరణ జరుగుతుంది" అని ధర్మదేవ్ చెప్పాడు. క్రమేపి ధర్మదేవ్ ఆరోగ్యం క్షీణించసాగింది, మందులు వేసుకోడానికి కూడా నిరాకరించేవారు. తరువాత ఒకరోజు ఘనశ్యాంమహరాజ్ ని పిలిచి, “స్వామీ! సాక్షాత్తు నరనారాయణ రూపంలో నా ఇంట జన్మించావు. నాకు నీ నరనారాయణుడి రూపాన్ని చూడాలని ఉందని ప్రార్ధించగా ఆయనకు మాత్రమే కనపడేట్లుగా తన నరనారాయణ స్వరూపాన్ని చూపించారు. ధర్మదేవ్ కొంత ఉద్రేకంతో “స్వామి నాకు, మీ తల్లిగారికి సదా నీ సాన్నిధ్యంలో ఉండేటట్లు వరం ప్రసాదించు” అని ప్రార్ధించగా “తండ్రీ! ఎక్కడ భక్తి,ధర్మం ఉంటాయో అక్కడ నేను తప్పకుండా ఉంటాను. 

స్వయంగా మీరు ధర్మానికి, తల్లిగారు భక్తికి ప్రతీక కాబట్టి ఎల్లప్పుడూ మీరిద్దరూ సూక్ష్మరూపంలో నాతోనే ఉంటారు. నా సోదరులైనటువంటి రాంప్రతాప్, ఇఛ్ఛారాం, సుహాసిని వదినల గురించి మీరు దిగులుపడవద్దు, మీరు నిశ్చింతగా ఉండ”మని చెప్పెను. అపుడు ధర్మదేవ్ గారు "జై స్వామినారాయణ్" అని ముమ్మారు ఉఛ్ఛరించి ప్రాణాలు విడిచారు.
           
గృహ త్యాగం

ధర్మదేవ్ మరణానంతరం అతని అంత్యక్రియలు ముగియగానే ఆ రోజు రాత్రి ఘనశ్యాంమహరాజ్ తన చేతిలో  ఒక జపమాల, ఒక సాలిగ్రామం, ఒక సద్గ్రంధం పట్టుకుని ఎవరికీ చెప్పకుండా ఆ నిశీధిలో సరయూనది వద్దకు వచ్చారు. ఒక పిలుపు విని వారిని అనుగ్రహించడానికి తన ఇల్లు వదిలి బయట ప్రపంచంలోనికి అడుగుపెట్టారు. ఆ సమయంలో సరయూనది మహోగ్రంగా ఉంది. 

ఆ నదిని ఆ సమయంలో దాటటానికి ఎవరూ సాహసించరు. అప్పుడు 8 ఏళ్ళ బాలుడైన ఘనశ్యాంమహారాజ్ కి సరయూమాత ప్రత్యక్షమై, “మహానుభావా! నేను మీకు ఏ రకంగా సహాయం చేయగలను, మిమ్ములను అవతలి ఒడ్డుకి క్షేమంగా చేర్చమంటారా” అని కోరింది. ఇంతలో కాళిదాసు శిష్యుడైన ఒక మాంత్రికుడు వికటాట్టహాసంతో నా శత్రువైన నిన్ను ఇప్పుడే యమపురికి పంపిస్తానని” గర్జిస్తూ ఘనశ్యాం మహరాజ్ వైపుకు రాసాగాడు. ఘనశ్యాంమహరాజ్ సరయూమాతతో “నన్ను అవతలి ఒడ్డుకు చేర్చేవాడు వస్తున్నాడు, నీవు నిశ్చింతగా ఉండు” అని అన్నారు. కాళిదాసు శిష్యుడు ఘనశ్యాంమహరాజ్ ని అమాంతంగా ఎత్తి సరయూనది మధ్యలోనికి విసిరేసాడు.  ఇంతలో ఎవరో ఘనశ్యాం మహారాజ్ సరయూ నది వద్ద కనిపించారని చెప్పగా విని చీకట్లో ఘనశ్యాంమహరాజ్ ని వెతుకుతూ అన్నావదినలు, బంధువులందరూ అక్కడకు వచ్చారు.  

ఘనశ్యాం మహారాజ్ కనిపించకపోయేసరికి వారంతా ఘనశ్యాం మహారాజ్ నదిలో మునిగిపోయుంటాడని భావించారు. వారంతా అలా దుఃఖిస్తుండగా హనుమంతుడు ప్రత్యక్షమై, “నరనారాయణ అవతారమైన ఘనశ్యాం మహరాజ్ గురించి తెలిసి కూడా మీరంతా ఎందుకు దుఃఖిస్తున్నారు. 

ఆయన 6 నెలల వయసులోనే కృత్య అనే రాక్షసిని ఎదుర్కున్నారు, 3 ఏళ్ళ వయసులో కాళిదాసుని హతమార్చారు, మల్లయోధులని ఎదుర్కున్నారు. ఆయన శక్తి మీద మీకింకా అనుమానమా, ఆయన మానవమాత్రుడు కాదు, సాక్షాత్తు నరనారాయణుడి అవతారమే. స్వామికి ఎటువంటి అపాయం రాదు, ప్రభువులు క్షేమంగానే ఉన్నారు. ఆయన లోక కల్యాణార్ధం భక్తులను రక్షించడానికి ఈ విశ్వంలోనికి వచ్చిన అవతారం. ఆయన గురించి  దుఃఖించటం మాని మీ ఇంటికి వెళ్ళిపొమ్మని” చెప్పి అదృశ్యమయ్యాడు. హనుమంతుని స్వాంతవచనాలతో అందరూ ఇంటికి వెళ్ళిపోయినారు. కాని సుహాసిని వదినగారు తన మరిదిలోని దైవాంశను గ్రహించి కూడా, అతని ఎడబాటును తట్టుకోలేక విలపిస్తూండేది. రాంప్రతాప్, ఇచ్చారాం కూడా చాలా దిగులుపడ్డారు. కాని తండ్రిగారు చెప్పినట్లుగానే నరనారాయణ రూపమైన ఘనశ్యాంమహరాజ్ ను ఇంటి మనిషిగా భావించడం మంచిది కాదు. అతడు లోకకల్యాణానికై అవతారమెత్తిన మహాపురుషుడు కనుక అతను పుణ్యాత్ములను, భక్తులను ముక్తిమార్గంలో నడిపించడానికి, పాపులను మంచిగా మార్చడానికి గృహత్యాగం చేయవలసి వచ్చింది కనుక దుఃఖపడకుండా వారి దైనందిన కార్యక్రమంలో మునిగిపోయినారు.