N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Friday, 13 June 2014

SwamiNarayan - Episode 22

వర్ణిరాజ్ పాదయాత్ర

స్వామినారాయణ్ తన 11 ఏట అంటే 1792 సంవత్సరంలో గృహ త్యాగం చేసినపుడు అందరు ఆయనను నీలకంఠ్ లేక వర్ణిరాజ్ అని పిలుస్తుండేవారు. ఆయన లోకాన్ని ఉద్ధరించడానికి, పాపులను మంచి మార్గంలో తీసుకురావడానికి, కొన్ని వేలమంది ముముక్షువులను ఉద్ధరించడానికి యావద్భారత దేశమంతా ఆయన కాలి నడకన ప్రయాణం చేసారు. తన మార్గమధ్యంలో కలిసినటువంటి ఎంతోమంది సాధువులను, సజ్జనులను, దుర్మార్గులను ఆయన సన్మార్గంలోకి తీసుకురావడం జరిగింది.
ఆయన సాక్షాత్తు నరనారాయణుడి అవతారం అయ్యుండి కూడా ఒక గురువుగారి కోసం వెతుక్కుంటూ భారత దేశంలోని అన్ని తీర్థ క్షేత్రాలు దర్శించుకుంటూ చివరికి తన గురువుగారైన రామానంద గారి ఆశ్రమం లోజ్ ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. ఆయన యావత్ భారతదేశాన్నిసందర్శించడానికి దాదాపు 7 సంవత్సరాల ఒక నెల 13 రోజులు సమయం పట్టింది. భయంకరమైన అడవులను, అతిశీతలమైనటువంటి హిమాలయాపర్వతాలను, నదులను, కొండలను, గుట్టలను ఒకటేమిటి ఏది ఎదురొచ్చినా కూడా వెనుతిరగకుండా ఎంతో ధైర్యంతో  పాదయాత్ర చేసారు. మార్గమధ్యంలో ఆయన ఎన్నో మహిమలు చూపడం జరిగిందిఉత్తర భారత దేశంలో అడుగుపెట్టి మొదటగా నైమిశారణ్యంలో ప్రవేశించి అక్కడొక నాలుగు రోజులు ధ్యానం చేసుకున్నారు. అక్కడనుంచి హరిద్వార్ వెళ్లి   అక్కడ 5 రోజులు ఉండి, అటునుంచి హృషికేష్, కేదారనాధ్ వెళ్లారు. అతికష్టమైన కేదారనాధ్ ప్రయాణం ఆయన ఒక్కరే కాలినడకన పూర్తిచేసారు.

వర్ణిరాజ్ చూపిన మహిమ :
కేదారనాధ్ వెళ్తున్న మార్గంలో శ్రీపురం అనే గ్రామాన్నిదర్శించారు. గ్రామంలో ఒక పెద్ద ఆలయం ఉంది. అది భయంకరమైన అరణ్యంలో ఉంది. గ్రామప్రజలు ఎంతో తేజస్సుతో ఉన్న బాలసన్యాసిని చూసి ఎంతో సంతోషపడి ఆయన చుట్టూ చేరారు. ఆలయ పూజారి వర్ణిరాజ్ ను చూసి ఈయన ఎవరో సామాన్యుడు కాదనే అభిప్రాయానికి వచ్చాడు. రాత్రి ఆయనను వారి గ్రామంలోనే బస చేయమని ప్రార్ధించగా వర్ణిరాజ్ తాను ఆలయ ప్రాంగణంలోనే విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. దానికి ఊరి ప్రజలందరూ భయపడి పోయారు. పూజారి ఎంతో వినయంతో వర్ణిరాజ్ దగ్గరకు వచ్చి ఊరిలో రాత్రి పూట ఒక సింహం సంచరిస్తూ ఉంటుందని అది మనుషులు కనపడితే తినేస్తుందని  చెప్పారు. అందుకనే వారు ఆయనని గుడి లోపలే విశ్రమించమని ప్రార్థించారు. కాని వర్ణిరాజ్ వారి మాట వినలేదు, తను గుడి ఆరుబయటే విశ్రమిస్తానని చెప్పారు. చేసేది ఏమిలేక అందరు ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా వారందరూ ఎంతో ఆదుర్దాగా వర్ణిరాజ్ ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ పూజారి  గుడి లోపలకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకుని కిటికిలోంచి చూడసాగాడు. ఇవేమీ పట్టని వర్ణిరాజ్ ఆ గుడి ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెట్టు కింద విశ్రమించారు. అర్థరాత్రి సమయంలో భయంకరమైన అరుపులతో ఆ సింహం రానే వచ్చింది. ఊరి జనమంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వింటూ ఉన్నారు. ఈ పూజారి గారు కిటికిలోంచి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నాడు. ఈ లోగా ఆ సింహం మెల్లగా వర్ణిరాజ్ విశ్రమించిన ప్రదేశానికి రాసాగింది. వర్ణిరాజ్ మాత్రం ఎంతో ప్రశాంతంగా, నిర్వికారంగా ఆ సింహం వైపు చూస్తూ ఉన్నారు. పూజారి ఎంతో ఆదుర్దాగా చూస్తున్నవాడు తన ముందు కనిపిస్తున్న దృశ్యం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అంత భయంకరమైన, క్రూరమైన సింహం వర్ణిరాజ్ దగ్గరకు వచ్చేసరికి ఒక పిల్లిలాగా తోక ఊపుతూ ఆయన పాదాల చెంత తన తలను పెట్టింది. వర్ణిరాజ్ ఎంతో ప్రేమగా దాని తలను నిమరసాగాడు. ఈ దృశ్యాన్ని చూసిన పూజారి దిగ్భ్రాంతి చెందాడు. ఈయన సామాన్య మానవుడు కాదు, ఎవరో మహానుభావుడు అని తను అనుకున్న అభిప్రాయానికి ఇప్పుడు నిర్ధారణ జరిగింది. ఆ రాత్రి గడిచాక తెల్లరుఝామున ఊరి ప్రజలంతా ఆ గుడి దగ్గరకు పరుగున వచ్చారు. పూజారి కూడా లేచి బయటకు వచ్చి వర్ణిరాజ్ ని సమీపించి ఎంతో వినయంగా నమస్కరించి "మహానుభావా, మీరు మామూలు మనుషులు కారు. అతి భయంకరమైన ఆ సింహం కూడా మీ దగ్గరకు వచ్చేసరికి పిల్లి లాగ మారిపోయింది” అని స్తుతించారు. ఊరి జనం వర్ణిరాజ్ క్షేమంగా ఉండటం చూసి, రాత్రి జరిగింది పూజారి ద్వారా విని చాలా ఆశ్చర్యపోయారు. అందరు ఆయనను తమతో పాటే ఆ ఊరిలో ఉండిపోయి, ఆ గుడి బాధ్యతలు తీసుకోమని ఎంతసేపు ప్రార్థించినా ఆయన వారి అభ్యర్ధనను వినయంగా తిరస్కరించి తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ విధంగా ఆయన కేదారనాధ్ చేరుకున్నారు. అటునుంచి ఆయన బద్రినాథ్ ప్రయాణమయ్యి 9 రోజులులో బద్రినాథ్ చేరుకున్నారు.  

బద్రినాథ్ చేరినటువంటి వర్ణిరాజ్ తన కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్కడ ఆలయానికి వెళ్లారు. ఆలయంలోని వృద్ధ పూజారి 12 ఏళ్ళ వర్ణిరాజ్ ను చూసి ఎంతో సంతోషపడ్డారు. బాల ముని యొక్క మొహంలోని తేజస్సు చూసి  ఆయన సామాన్య మానవుడు కాదని ఆయనకు అర్థమైపోయింది. సాక్షాత్తు నరనారాయణులకు సమర్పించిన  నైవేద్యాన్నిఆయన ఎంతో భక్తిశ్రద్ధలతో వర్ణిరాజ్ కు సమర్పించారు. బద్రినాథ్ లో దాదాపు 3 నెలలు ఆయన గాఢమైన తపస్సులోకి వెళ్ళిపోయారు. దాని తరువాతే ఆయన అతికష్టమైనటువంటి  మానససరోవరం యాత్ర మొదలుపెట్టారు. అక్కడకు  చేరి కైలాసపర్వతానికి   ప్రదక్షిణాలు చేసి మానస సరోవరంలో స్నానం చేసి అక్కడ కొన్ని రోజులు ఆయన ధ్యానం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి తెల్లటి హంసలను ఆయన పరామర్శించారు. అక్కడ నుండి ఆయన తిరిగి బద్రినాథ్ ప్రయాణమయ్యారు. ఇదంతా ఆయన 12 ఏళ్ళ వయసులో కేవలం ఒక కౌపీనాన్ని ధరించి యాత్రను చేసారు. బద్రీనాథ్ నుండి గంగోత్రి, అటునుండి హరిద్వార్, అటునుండి భూటాన్, నేపాల్ మీదుగా గండకీ నదిని చేరుకోవడం జరిగింది. మార్గం చాలా కష్టసాధ్యమైనది.మానవమాత్రులెవ్వరు  సాహసం చెయ్యలేనటువంటి ప్రయాణాన్ని ఆయన వంటరిగా అంత చిన్నవయసులోనే చెయ్యడం జరిగింది.