N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Sunday, 11 January 2015

SwamiNarayan - Episode 36



కూరగాయల వ్యాపారి
ఒక సారి స్వామి నారాయణ గారు పంచకోట అనే ఒక చిన్న గ్రామం ప్రక్కన ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళడం జరిగింది.ఆయన అక్కడ తన పరివారంతో సత్సంగ్ చేస్తుండేవారు. ఆ గ్రామంలోనే కచరాభగత్ అనే కడ జాతికి చెందిన వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తుండేవాడు. ప్రక్కనే ఉన్న పట్టణానికి వెళ్లి కూరగాయలు కొని , వాటిని పడవలో పెట్టుకుని ఇంకొక గ్రామానికి చేరి  అక్కడనుంచి వాటిని గాడిదలమీదో లేక గుర్రాల మీదో పెట్టి తన గ్రామానికి చేరుకొని కూరగాయలు అమ్ముతూ పొట్ట నింపుకునేవాడు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి అతనిది. కాని అతను స్వామి నారాయణ గారి పరమ భక్తుడు. ఒక రోజు భార్యని పిలిచి , శ్రీ స్వామి నారాయణ గారు మన ప్రక్క గ్రామానికి విచ్చేశారు. నేను ఆయన దగ్గరకి వెళ్లి మన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాను అని చెప్పాడు. ఆ మాటలకి అతని భార్య ఆశ్చర్య పోయింది, ఆనందించింది కూడా. మనం కడజాతికి చెందినవాళ్లము. ఆయన నిజంగానే మన ఇంటికి భోజనానికి వస్తారా? అని తన అనుమానాన్ని వ్యక్త పరచింది. ఎందుకు రారు ? ఆయన సాక్షాత్తు భగవంతుడు. వారికి మన లాగా కులమతాల పట్టింపులు కాని గొప్పా బీదా అనే తారతమ్యం కాని ఉండవు. కాబట్టి తప్పకుండా ఏ భక్తుడు పిలిచినా ఆయన తప్పకుండా వస్తారు, మన ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తారు అని అన్నాడు.

అతను ఎంతో దృఢ విశ్వాసంతో శ్రీ స్వామి నారాయణ గారి దర్శనానికి వెళ్ళాడు. అదే సమయానికి స్వామివారు దర్బారులో ఉండి ఏవో  ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్నారు. ఆయన కచరా  భగత్ ని చూసి , మీరా ! “రండి,” “రండి” అని ఆదరంగా పిలిచి మాట్లాడారు. అతను ఎంతో వినయంగా చేతులు జోడించి నమస్కరించి , ప్రభూ ! “మీ దయ వల్ల మేము అంతా బాగానే ఉన్నాము దేనికీ లోటులేకుండా,” అని అన్నాడు. అంత దూరం నుంచి ఎందుకు నన్ను కలుసుకోవడానికి వచ్చారు? అని అడగ్గా ప్రభూ ! “నాదొక చిన్న కోరిక మీరు ఈరోజు మా ఇంటికి అతిథిగా వచ్చి నేను సమర్పించేప్రసాదాన్ని స్వీకరించాలి” అని ఎంతో వినయంగా ప్రార్థించాడు.దానికి సమాధానంగా స్వామివారు చిరు నవ్వు నవ్వుతూ, “దానికేం భాగ్యం ? నేను తప్పకుండా మీ ఇంటికి వస్తాను . కాని నేనొక్కడినే రాలేను కదా ! నాతో పాటు ఇంతమంది సత్సంగులు ఉన్నారు వీరందరితో కలిసి నేను తప్పకుండా నీ దగ్గరకి వస్తాను” అని అనగా మిగతా అనుచరులు , సహచరులూ అందరూ కూడా అవును స్వామి ! “మేము కూడా తప్పకుండా వస్తాము” అని చెప్పడం జరిగింది .
పాపం ! కచరా భగత్ నోట మాట రాకుండా అలాగే మాన్పడి పోయాడు, ఎందుకంటే అతను చాలా బీద వాడు. స్వామి ఒక్కరు కనుక వస్తే ఆతిథ్యం ఇవ్వగలడు కాని ఇంత మందికి ఆతిథ్యం ఇచ్చే ఆర్ధిక స్తోమత అతనికి లేదు. అందుకనే ఏం చెప్పాలో తెలియక అలాగే ఉండి పోయాడు . మెదడు కూడా ఏమాత్రం కూడా పని చేయడం మానేసింది. అప్పుడు స్వామి వారు అతన్ని ఉద్దేశించి కచరా భగత్ గారూ ! “ఏమయింది మీకు? అలా నోట మాట రాకుండా ఉన్నారెందుకూ?”అని అనగా అతను స్పృహలోకి  వచ్చి చేతులు జోడించి, నమస్కరించి ప్రభూ ! “నాదొక చిన్న విన్నపం. దయ చేసి మీరొక్కరే మా ఇంటికి భోజనానికి రావలసింది” అని ప్రార్థిస్తున్నాను.
అప్పుడు స్వామి వారు చిరునవ్వు నవ్వుతూ “నీకు తెలుసు కదా ! నేనేవరింటికి భోజనానికి వెళ్ళినా ఒక్కడినే వెళ్ళను . నాతోబాటు నా సహచరులు , అనుచరులూ అందరూ ఉంటారు . నేను మీ ఇంటికి ఒక్కడినే వస్తే లోకం ఏమనుకుంటుంది ? కచరా భగత్ స్వామి వారిని ఒక్కడినే పిలిచాడు అని అనుకుంటారు కదా!” అని ఆలోచిస్తున్నాను అని అనగా కచరా భగత్  తన తెలివి తేటలు ఉపయోగించి “మీరు వస్తున్నారంటే మీరు ఒక్కళ్ళే వస్తున్నట్టుగా నేను భావించను. మీలోనే సకల జనులు ఉన్నారు మా అందరికీ యజమానులు మీరే కదా ! మీరు ఒక్కళ్ళు వస్తున్నారంటే మీరు ఒంటరిగా వస్తున్నట్లు ఎలా అవుతుంది? ఈ విశ్వమంతా మీలోనే ఉంది మీరు సాక్షాత్తు భగవంతుని అవతారమని భావిస్తున్నాం కదా ! కాబట్టి మీరు ఒంటరిగా రావడం ఏమిటీ ప్రభూ !” అని చెప్పి వినయంగా నమస్కరించాడు. 
ప్రభు లోలోపల అతని చమత్కారానికి ఎంతో సంతోషించి కచరా భగత్ గారూ ! “నేను తప్పకుండా మీ ఇంటికి వస్తాను . మీరు నిశ్చింతగా వెళ్ళండి” అని ఆయన్ని ఆశీర్వదించి పంపించి వేసారు. స్వామి వారి అనుచరులు కొంత మంది ఏమిటీ ?ఈ కచరా భగత్ గారు ఇంత పిసినారి ? స్వామి వారినొక్కడ్ని మాత్రమే పిలిచాడు అని పరిహాసంగా వాళ్ళలో వాళ్ళు అనుకోవడం జరిగింది.
అక్కడ కచరా భగత్ కాలి నడకన ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు . తీరా ఇంటికి చేరేసరికి అతని భార్య కనిపించ లేదు. ఏదో అత్యవసర పరిస్థితి రావడంతో ఆవిడ ప్రక్కగ్రామంలోనే ఉన్న తన పుట్టింటికి వెళ్ళింది . కచరా భగత్ వెంటనే తన వ్యాపారాన్ని కొన సాగించడం మొదలు పెట్టాడు. ఆ కూరగాయల తట్ట పట్టుకుని వచ్చి పోయే వాళ్ళందరికీ కూరగాయలు  అమ్ముతూ తన పనిలో  తానూ  నిమగ్నమై  పోయాడు. అతని ధ్యాసంతా కూరగాయల వ్యాపారం మీదనే మాత్రం ఉన్నది.
   అక్కడ స్వామి నారాయణ గారు ఇచ్చిన మాట ప్రకారంగా చాలా నిరాడంబరంగా మామూలు దుస్తులు వేసుకుని కాలి నడకన కచరా భగత్ ఉండే పంచకోట గ్రామానికి బయల్దేరారు. అలా ఒంటరిగా వస్తూ దారిలో కనిపించిన ఒకరిద్దరిని కచరా భగత్ ఉండే చోటు కనుక్కుని నిదానంగా కచరా భగత్ ఉండే ఇంటి సమీపానికి వచ్చి నిల్చుండి పోయారు. అక్కడ కచరా భగత్ కూరగాయలు అమ్మే పనిలో నిమగ్నమైపోయాడు. ఒక్క క్షణం తీరిక దొరకగానే చూస్తే ఆయన ఇంటి ముందు స్వామి నారాయణ గారు నిలబడి ఉండడం కనిపించింది. ఆయన తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు, మెదడు మొద్దుబారి పోయింది అనేక భావాలు ఒక్కసారిగా కలిగాయి. సంతోషము, ఆశ్చర్యము కలిగి ఏం చేయాలో తోచలేదు. కాసేపటికి తేరుకుని ఆయన వెంటనే పరుగు పరుగున తన గద్దెమీద నుంచి లేచి స్వామి వారి దగ్గరకి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభూ ! “నిజంగానే మీరు మా ఇంటికి వచ్చారా ? నా కళ్ళని నేనే నమ్మలేక పోతున్నాను. మీకు నామీద ఎంత దయ !” అంటూ ఇంకా ఏవిధంగా ఆయన్ని స్తుతి చేయాలో తెలియక అలాగే చేతులు కట్టుకుని నిల్చుండి పోయాడు. కాసేపటికి కచరా భగత్ గారి ఆవేశం చల్లారాక స్వామి వారు చాలా ప్రశాంతంగా,కచరా భగత్ గారూ ! “నేను మండుటెండలో పడి నడుచుకుంటూ మీ ఇంటికి వచ్చాను. నాకు చాలా ఆకలిగా ఉంది . చక్కటి భోజనం ఏర్పాటు చేయి. జొన్నరొట్టెలు, వంకాయ కూర ఈ రెండూ అంటే నాకు చాలా ఇష్టం కదా ! తొందరగా ఏర్పాటు చేయి” అని చెప్పారు.
ఆ మాటలకి కచరా భగత్ గతుక్కుమన్నాడు. ఇంట్లో భార్య లేదు. అదే విషయం ఆయన స్వామి వారికి చెప్పాడు.
ప్రభూ ! “నా భార్య అనుకోకుండా పక్క గ్రామానికి వెళ్ళింది. నేనొక్కడినే ఉన్నాను. అదే సమస్య. ఏం చేయాలా” అని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు.
“నేను మీ ఇంటికి భోజనానికి వచ్చాను కనుక భోజనం చేయకుండా వెళ్ళే ప్రసక్తి లేదు. ఎలాగైనా సరే ఈ రోజు మీ ఇంట్లో భోజనంచేసే వెళ్ళతాను. కానీ నీసమస్య కూడా నేనర్థం చేసుకున్నాను. వంట చేయడానికి మీ శ్రీమతి లేదు కదా ! అందుకని మనం ఒక ఉపాయం ఆలోచిద్దాం. అదేమిటంటే నీవు వంట ప్రయత్నంలో ఉండు. నేను ఇక్కడ కూర్చుని నీకు కూరగాయలు అమ్మి పెడతాను. ఈ రకంగా మనం అనుకున్న ప్రకారంగా అన్నీ జరిగి పోతాయి అని తన ఉద్దేశ్యాన్ని కచరా భగత్ గారికి చెప్పారు.”
చేసేదేమీ లేక కచరా భగత్ “అలాగే”, అని వినయంగా చెప్పి వంట ఇంటివైపు  వెళ్లి పోయాడు. కాని అతని మనస్సులో మాత్రం సందేహం పురుగులాగా తొలుస్తుండాలి.ఎందుకంటే స్వామి కరుణామయుడు. ఆయనకి వ్యాపార పద్ధతులు తెలియవు. మరి కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూరగాయలు ధారాళంగా ఇస్తారేమో ! దాని వల్ల నాకు భారీ నష్టం కలుగుతుంది . మరి ఆ నష్టాన్ని నేనెలా భరించ గలుగుతాను ? స్వామివారు అమాయకులు. చాలా మంచివాళ్ళు అంటూ చాలా మధన పడ సాగాడు. కాని అతనేమీ చేయలేడు .  పరధ్యానంగానే వంట పనిలో మునిగి పోయాడు. కాని ఒకవైపు మనస్సు బయట స్వామి వారి మీదనే ఉంది. ఈ లోగా స్వామి వారు చీపురు కట్ట పట్టుకుని కూరగాయల దగ్గర ఉన్న నేలంతా శుభ్రంగా ఊడ్చి , తరాజుని కూడా తుడిచి, శుభ్రం చేసి ఆయన కూరగాయల వ్యాపారం సాగించారు. ఆయన కూర్చున్న కొద్ది సమయంలోనే చాలా మంది వచ్చి కూరగాయలు కొనుక్కోవడం మొదలు పెట్టారు. అందులో ఒకావిడ అన్నీ ఆరాలు తీయడం మొదలు పెట్టింది .
“మీరెవరో ? కొత్తగా కనిపిస్తున్నారు. కచరా భగత్ గారు మాకు కూరలు తూకం వేసినప్పుడు ఎక్కువగా వస్తుండేవి. మీరెందుకు అంత  తక్కువగా తూకం వేస్తున్నారు ? అదేమిటీ మీరు ఈ వంకాయలని బంగారంలాగా తూకం వేస్తున్నారు ? ఇంత పిసినారితనం చూపిస్తున్నారు  మీ కన్నా ఆ కచరా భగత్ చాలా నయం”, అని చెప్పగా అప్పుడు స్వామి వారు ఆవిడతో ఎంతో ప్రశాంతంగా ఇలా అన్నారు చూడండి ! "మీకు ఇష్టం ఉంటే కూరగాయలు తీసుకోండి. లేకపోతె మీరు ఇక్కడ్నుంచి వెళ్లి పోవచ్చు. మేము ఈ కూరగాయల్ని ఎక్కడో బయటనుంచి పడవలమీద ,గుర్రాల మీదో లేక గాడిదల మీదో పెట్టుకుని ఎంతో శ్రమ పడి అంచెలంచెలుగా  ఇక్కడకి తీసుకు వస్తూ ఉంటాము. మీరు ఇవన్నీ ఆలోచించాలి కదా ! ఎంతో శ్రమ పడితే కాని ఏ కార్యక్రమం జరగదు.కాబట్టి నేను కూడా సరిగ్గానే తూకం వేసి ఇస్తాను. ఎక్కువ ఇచ్చే ప్రసక్తి లేదు", అని అంటే  ,"సరే ! కానివ్వు " అని చెప్పేసి ఆ కూరలు కొనుక్కుని వెళ్లి పోయింది . లోపలనుంచి ఈ మాటలు విన్న కచరా భగత్ కి చాలా సంతోషం వేసింది . అమ్మయ్య ! స్వామి వారికి వర్తక వ్యాపారం తెలియదు అని అనుకున్నాను కాని ఆయన నాకన్నా పిసినారితనంగా ఉన్నారు అని నిశ్చింతగా వంట పనిలో నిమగ్నమై పోయాడు. స్వామి వారు కూర్చున్న కొద్ది సేపట్లోనే కకూరలన్నీ అమ్ముడు పోయినాయి. ఆ కూర గాయ బుట్టలన్నీ సరిగ్గా అమర్చి చీపురు కట్టతో మళ్ళీ ఆ ప్రదేశాన్నంతా శుభ్రంగా ఊడవసాగారు.
ఇది చూసి కచరా భగత్ గబా గబా పరిగెత్తుకుని వచ్చి నేను మీచేత ఇదంతా ఊడిపిస్తున్నాను. దయ చేసి మీరు ఇలాంటి పని చేయ వద్దు అని ప్రాధేయ పడి బలవంతంగా ఆయన చేతిలోనుంచి చీపురు కట్టని లాగేసుకుని ఆ మిగిలిన ప్రదేశమంతా ఊడవ సాగాడు. ఆ తర్వాత స్వామి వారు లెక్క కట్టి కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బంతా అతనికి ఇచ్చేసారు.
వేడి వేడిగా జొన్న రొట్టెలు , వంకాయ కూర తింటూ స్వామి వారు ఆనందించ సాగారు. భోజనమై పోయినాక స్వామి వారు , కచరా భగత్ గారూ !" మీ ఆతిథ్యానికి చాలా సంతోషం . మీ వంట చాలా పౌష్టికంగా, చాలా బాగుంది. నాకు మీరు పడే కష్టాలు తెలుసును . మీ కష్టాలు నివారించడానికే నేను వచ్చాను. మీరు ఈ రోజు రాత్రికి రాత్రే ఈ గ్రామాన్ని వదిలి పెట్టి ప్రక్క గ్రామానికి వెళ్లి పోండి . ఇక్కడ ఏమాత్రం ఉండ కూడదు ",అని చెప్పగా కచరా భగత్ గారు ఆయనకి నమస్కరించి ప్రభూ ! “మీరు ఎలా చెప్పితే మేము అలాగే చేస్తాము. ఈ క్షణమే తట్టా-బుట్టా సర్దుకుని వెళ్లి పోతాను” అని చెప్పగా స్వామి వారు అతన్ని ఆశీర్వదించి  తన నివాసానికి కాలి నడకన వెళ్లి పోయినారు.
అయితే ఇక్కడ కచరా భగత్ కి విశ్వం అనే తరాజులో సాక్షాత్తు స్వామి నారాయణ గారే తూకం వేస్తున్నప్పుడు జనుల యొక్క కర్మ ఫలాన్ని సమతూకంగానే , న్యాయబద్ధం గానే తూకం వేస్తున్న మహా ప్రభువుగా కనిపించారు.  సాక్షాత్తు భగవంతుడైన వీరికి ఎలాంటి కుల మత భేదాలు, గొప్పా-బీదా అనే తారతమ్యాలు గాని లేనే లేవు. ఎవ్వరు పిలిచినా సరే అందరితో ఆయన ఒక్కలాగే ప్రవర్తిస్తుంటారు కదా ! ఆహా ! ఏమిటీ ఈ దేవుని తత్వం ! అని మనస్సులో అనుకో సాగాడు. స్వామి వారు చెప్పినట్లు గానే రెండో ఆలోచన లేకుండా తనకున్న కొద్ది పాటి సామాన్లని సర్దుకుని ఆ రోజు సాయంత్రానికల్లా ఆ గ్రామాన్ని విడిచి ప్రక్క గ్రామానికి వెళ్ళిపోయాడు.
మరునాడు కొత్త గ్రామంలో తన భార్యని ఉద్దేశించి , చూశావా ! “మన స్వామి వారు మరి నేను చెప్పినట్టుగానే మన ఇంటికి వచ్చారు. మనం కడ జాతి అయినా మన ఇంట్లో భోజనానికి వస్తానని చెప్పి అన్న మాట ప్రకారమే వచ్చి,చక్కగా భోజనం చేసి వెళ్లి పోయారు. ఆయన ఆదేశం ప్రకారమే మనము ఆ గ్రామాన్ని వదిలి ఇక్కడకి వచ్చేశాము.”
 నిన్న మనం బయలుదేరి వచ్చేశాక రాజభటులు వచ్చారుట !  పన్నులు కట్టలేదని ప్రజలందరి ఇల్లూ-వాకిలి జప్తు చేసుకుని , ధ్వంసం చేసి , నానా గొడవ చేసి అక్కడనుంచి వెళ్లి పోయారుట ! మనం ఆ సమయానికి కనుక అక్కడ ఉంటే మనది కూడా అలాగే అయ్యేది. క్షామం(famine) వల్ల చాలా మంది పన్నులు కట్టలేక వారి దాడికి గురి అయ్యారు. స్వామి వారు ఏం చెప్పినా నీవు  రెండో ఆలోచన లేకుండా , సంకోచం లేకుండా వారి మాట విన్నావు కాబట్టి  మనం సుఖంగా ఉన్నాము అని చెప్పి , "ఏమండీ !" , "అన్నీ బాగున్నాయి. మీకు స్వామి వారి పట్ల ఎంతో భక్తి భావం ఉంది దానికి మించిన పిసినారితనం ఉంది . సాక్షాత్తు స్వామి వారు తన సహచారులతో భోజనానికి వస్తానంటే అందరూ రావద్దు. మీరు ఒక్కరే రండి అని చెప్పారు కదా !" ఎందుకలా చెప్పారు? అంత మహాద్భాగ్యం మనకి పోయింది కదా!    నా దురదృష్టం ఏమిటంటే ఆ సమయానికి నేను అక్కడ లేకుండా పోవడం. స్వామిని నేను దర్శించలేక పోవడం అని కాస్త బాధ పడింది.
అప్పుడు కచరా భగత్ ఒసే ! పిచ్చిదానా! “స్వామి నారాయణ గారు ఒక్కడే రావడం ఏమిటీ ? ఆయనలోనే సర్వ జగత్తు నిండి ఉన్నది కదా ! ఈ సృష్టి అంతా ఆయనలోనే ఉంది. మనమందరమూ కూడా ఆయనలోనే ఉన్నాము. ఆయన ఒక్కడిని పిలిస్తే మొత్తం ప్రపంచమంతా పిలిచినట్లే కదా ! మరి ఆ భగవంతుడంటే నీకేం తెలుసు? అని చెప్పి మన కథ కూడా ఆయన చరిత్ర లాగే ఖ్యాతి చెందుతుంది అని ఆయన అన్నారు. సాక్షాత్తు భగవాన్ అయిన స్వామి నారాయణ అంటరాని వాడయినటువంటి కచరా భగత్ ఇంటికి స్వయంగా కాలి నడకన బయలుదేరి, సామాన్య మానవుడి లాగా వచ్చి ,కూర గాయాలు అమ్మి, ఆ దుకాణమంతా శుభ్రం చేసి , వాడు పెట్టినట్టి జొన్న రొట్టెలు,వంకాయ కూర తిని ఎలా ఆశీర్వదించారొ ! అని అందరూ రాబోయే కాలంలో మన గురించి చెప్పుకుంటారు తెలుసా నీకు? అని చెప్పి నీకు ఆయన్ని అంత చూడాలని ఉంటే మనిద్దరమూ కలిసి ఇంకొకసారి ఆయన దర్బారుకి వెళ్లి ఆయన దర్శనం చేసుకుందాము అని ఆవిడని సముదాయించాడు. ఈ విధంగా భగవంతుని యొక్క తత్వం వారి చర్యల వల్లే  మనం అర్థం చేసుకొన గలుగుతాము.