N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Saturday, 21 February 2015

SwamiNarayan - Episode 41



మలిన వస్త్రం కథ

ఇలా స్వామి నారాయణ గారి శిష్యులు జట్లు జట్లుగా విడిపోయి ధర్మ ప్రచారం చేయడానికి వెళ్ళసాగారు. అందులో ఒక జట్టు ధర్మ ప్రచారం కోసం  ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఒక మహిళ తన ముందు ఉన్నఅంట్లు  తోముతూ విసుక్కుంటూ ఉంది . ఆవిడ నిరుపేద. పనిమనిషిని పెట్టుకునే స్తోమత లేదు. ఆవిడ “ఒక్క పనిమనిషి లేదు, ఒక్క నగ కాని నాణ్యంకాని లేదు ఎప్పుడూ ఇలా అంట్లు తోముతూ కూర్చోవాలి” అని ఇలా విసుక్కుంటూ, గొణుక్కుంటూ అంట్లు తోముతుండాలి. ప్రక్కనే ఉన్న ఆవిడ భర్త నీకన్నా పనిమనిషి నయం. ప్రతిదానికి తిట్టుకుంటూ ఉంటావు అని అన్నాడు. 


దానికి ఆవిడ నన్ను ఎప్పుడూ సాధించడం తప్ప నీకు వేరే పని పాటా లేదు అంటూ ఆ భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. భర్తకి విసుగు పుట్టి ఇంట్లోంచి గబ గబా విసుగ్గా వెళ్ళిపోయాడు. ఆవిడ తిట్టుకుంటూ, గొణుక్కుంటూ, తన కోపమంతా ఆ గిన్నెల మీద చూపించసాగింది. ఇల్లంతా గిన్నెల చప్పుళ్ళతో రణగొణ ధ్వనితో నిండి పోయింది. అదే సమయంలో స్వామి  నారాయణగారి భక్తుడొకడు వచ్చి “భిక్షాం దేహీ” ,“భిక్షాం దేహీ” ,“భిక్షాం దేహీ”అని అరవసాగాడు. ఈ మహిళ ప్రొద్దున్నుంచి పని చేస్తుంది, భర్తతో తగాదాలు, మనస్సు స్తిమితంగా లేదు పైగా పట్టు వదలకుండా “భిక్షాం దేహీ” “భిక్షాం దేహీ” అని అరుస్తున్న స్వామి నారాయణుడి భక్తుని మీద బాగా  కోపం వచ్చింది. ఏం పని పాటా లేదు “భిక్షాం దేహీ” “భిక్షాం దేహీ” అంటూ ఎప్పుడూ వస్తుంటాడు అని చెప్పేసి బాగా కోపం మీద బయటకి వచ్చి, “నీకేం పని పాటా లేదు “భిక్షాం దేహీ” “భిక్షాం దేహీ” అంటూ అరుస్తున్నావు కదా ! ఇదిగో తీసుకో!” అని అంటూ బక్కెట్టు తెచ్చి అంట్లు తోమిన మలిన వస్త్రాన్నిఅందులోనుంచి తీసి  ఆయన ముఖంమీద కొట్టింది. అనుకోని ఈ సంఘటనకి ఒక్క క్షణం ఆ సాధువు నిశ్చేష్టుడయ్యాడు. ఆ సాధువుకి స్వామి నారాయణ గారు చెప్పిన మాటలు “ధర్మ ప్రచారం కోసం మీరు గ్రామ గ్రామలకి తిరుగుతున్నప్పుడు ఎన్నో కఠినమైన పరిస్థితులు మీరు ఎదుర్కుంటారు. మీరు ఏగృహానికి బిక్ష కోసం వెళ్ళినా ఆ గృహిణి మీకు ఏమిస్తే అది మీరు భగవంతుడే ఇచ్చినట్టుగా భక్తి భావంతో స్వీకరించండి” అని చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయి. అలా చేసినప్పుడు ఆ గృహస్తులకి ఎంతో పుణ్యం వస్తుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్లకి రక రకాలుగా ప్రోత్సాహమిస్తూ చెప్పారు. అవన్నీ కూడా ఆ సాధు మహారాజుకి గుర్తుకి వచ్చాయి. ఆ గృహస్తురాలిచ్చినది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అనే  పవిత్ర భావంతో ఆ మలిన వస్త్రాన్ని ఎంతో జాగ్రత్తగా తన జోలెలో తన దగ్గరే పెట్టుకున్నాడు. సాయంత్రమయ్యేసరికి ఆ సాధువు తానూ బస చేసిన ప్రదేశానికి వెళ్ళాడు. తనతో పాటే మిగతా సాధువులందరూ అక్కడే ఉన్నారు. 

ఆ సాధువు ఎంతో శ్రద్ధా భక్తులతో తన జోలెలో ఉన్న మలిన వస్త్రాన్ని శుభ్రం చేయ సాగాడు. మహాత్మా! ఏం చేస్తున్నారు? ఈ కంపు కొడుతున్న మలిన వస్త్రాన్ని మీరు ఎంత శుభ్రం చేసినా అది అలాగే ఉంటుంది కదా ! అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా చూడండి నిజమే నేను ఈ మలిన వస్త్రాన్ని తెచ్చినప్పుడు కంపుతో, మలినం తో నిండి పోయింది. దీన్ని నేను ఎంతో శ్రద్ధా భక్తులోతో నేను దీన్ని శుభ్రం చేస్తే దాని దుర్వాసన అంతా  పోయింది, మలినం కూడా పోయింది దీనివల్ల ఏం ప్రయోజనం అని మీరంటున్నారు కదా! ఈ మలిన వస్త్రానికున్న మాలిన్యం మెల్లగా మెల్లగా శుభ్ర పడుతూ ఏ గృహిణయితే నాకు ఈ వస్త్రాన్ని దానం చేసిందో వారి మనస్సులో ఉన్నమాలిన్యం కూడా తొలగిపోయి ఇదే విధంగా శుభ్ర పడుతుంది. ఇదే మనకు మన గురువు స్వామి నారాయణ గారు చెప్పిన విషయం కదా ! అని వాళ్ళతో విన్నవించుకున్నాడు.

అక్కడ ప్రొద్దున సాధు ముఖం మీద మలిన వస్త్రాన్ని విసిరివేసిన మహిళ ఆ రోజు చాలా ప్రశాంతంగా తన భర్తకు భోజనం వడ్డిస్తూ ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉంది. మొట్టమొదటిసారిగా అంత ప్రశాంతంగా తనకి భోజనం వడ్డిస్తున్న తన భార్యని చూసి అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు చిరాకుగా, మటమటలాడుతూ,తిడుతూ, విసుగ్గా గొణుక్కుంటూ  ఉండే  ఆవిడకి ఈ రోజు ఏమైంది? అంత ప్రశాంతంగా ఉంది ఏదో ఆలోచనలో మునిగి పోయింది, ఎంతో శ్రద్ధగా నాకు భోజనాన్ని వడ్డిస్తుంది. సూర్యుడేమిటి ఈ రోజు గతిని తప్పాడా? అని ఆలోచిస్తూ అదే మాట అతను తన భార్యకి చెప్పాడు. దానికి ఆవిడ ఎంతో ప్రశాంతంగా  చాలా ఏళ్ళ తరవాత ఈ రోజు నా మనస్సెంతో ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంది ఎందుకో నాకే తెలియదు అని అంది. సరిగ్గా అదే సమయానికి మలిన వస్త్రాన్ని శుభ్రం చేసిన ఆ సాధు మహాత్ముడు దానితో స్వామి నారాయణ విగ్రహాన్ని తుడిచే ప్రయత్నంలో ఉన్నాడు. అదే సమయానికి ఆ గృహిణి మనస్సులో మార్పు రా సాగింది. అక్కడ స్వామి నారాయణ గారి శిష్యులందరూ చేరి కీర్తనలు, భజనలు చేస్తున్నారు. ఇక్కడ ఆ  మహిళ ఉండ పట్ట లేక తన భర్తతో, ఏమండీ ! నేను ఈరోజు చాలా పెద్ద పొరబాటు చేశాను. దానికి నేను చాలా బాధ పడుతున్నాను అని చెప్పితే అతను చాలా ఆశ్చర్య పడ్డాడు ఎందుకంటే అతనికి తన భార్య బాధ పడడం అనేది ఇప్పటి దాకా ఎప్పుడూ అనుభవంలోనికి రాలేదు. ఆవిడకి ఇంకొకళ్ళని బాధ పెట్టడం తప్ప బాధ పడడం తెలియదే ! మరి ఈ రోజు ఇంత మార్పు ఎలా వచ్చింది? అని అనుకుంటూ  అసలేం జరిగింది? అని ప్రశ్నించాడు. 

దానికి ఆ రోజు జరిగిన వృత్తాంతమంతా చెప్పి, ఆ స్వామి నారాయణ భక్తుడు నేను ఇంత అవమానించినా ఏమీ మాట్లాడ లేదు. వారి దగ్గరకి వెళ్లి  నేను క్షమాపణ చెప్పుకోవాలి. అంతవరకూ నా మనస్సు ఊరట చెందదు. కనుక ఏమండీ ! మనం ఎలాగైనా వారి దగ్గరకు వెళ్ళదాము అని అన్నది. ఇంత రాత్రి మనం ఆయన్ని ఎలా , ఎక్కడున్నాడని వెతుకుతాం? అని అంటే ఆవిడ, నాకు తెలుసు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో. ఈ ఊరి చివర ఉన్నారు. ఏమైనా సరే మనం వెళ్ళవలసిందే అని ఆవిడ పట్టు బడింది. అంత రాత్రైనా సరే ఆవిడ తన భర్తను తీసుకుని ఆ సాధువున్న ప్రదేశానికి బయల్దేరింది. ఆ దంపతులిద్దరూ ఆ సాధువు ఉండే ప్రదేశానికి వచ్చి ఆ సాధువుతో స్వామీ ! ప్రొద్దున మలిన వస్త్రాన్ని మీ ముఖాన కొట్టింది నేనే. ఆ చేసిన పనికి నేను చాలా బాధ పడుతున్నాను. చాలా పొరబాటు చేశాను. వెధవ పని చేసి చాలా పాపాన్ని నేను మూట కట్టుకున్నాను. దయ చేసి నన్ను క్షమించండి అని ప్రాధేయ పడింది. దానికి సమాధానంగా ఆయన తల్లీ ! క్షమించడానికి నేనెవరినీ? అంతా ఆ స్వామి నారాయణే చూసుకుంటాడు. అయినా నీవేం తప్పు చేశావు? చూడు ! ప్రొద్దున నీవు దానం చేసిన ఆ మలిన వస్త్రాన్ని నేను శుభ్ర పరచి దాన్ని ఈ దేవుని విగ్రహాన్ని తుడవడానికి ఉపయోగిస్తున్నాను. దానికి ఎంత పవిత్రమయిన స్థానం కలిగిందో చూశావా? అది విని ఆవిడ ఒక్క క్షణ తెల్లపోయి “అయితే నాకు క్షమాపణ దొరకదా? మీరు నన్ను క్షమించరా ?” అని ఎంతో ఆత్రుతగా అడిగింది. దానికి ఆ సాధు మహాత్ముడు “తల్లీ! నేను మీకు మళ్ళీ చెప్తున్నాను నీవేం అపరాధం చేయలేదు. నీకు మనఃశాంతి కావాలంటే ఒక పని చేయి. రోజు ప్రొద్దున, సాయంత్రం ఒక సారి స్వామి నారాయణ గారి జపం ఒక మాల చొప్పున చేయమ్మా! నీకు శాంతి , సుఖము, ఐశ్వర్యము అన్నీ కలుగుతాయి. నాతో పాటు “జై స్వామి నారాయణ” అను అని చెప్పి ఆవిడతో మూడు సార్లు అనిపించి, ఆవిడని ఆశీర్వదించి వెనక్కి పంపించేశాడు.
           
ఇదంతా చూస్తున్న సమయ దేవత ఆశ్చర్య పోయింది. మలిన వస్త్రాన్ని భగవంతుని నామం జపిస్తూ శుభ్ర పరచినప్పుడు ఆ మహిళ మనస్సులోని మాలిన్యమంతా తుడుచుకు పోయి ఆవిడ మనస్సు నిర్మలం ఎలా అయిపొయింది ?మనస్సు నిర్మలమైపోయి, ఆవిడ పశ్చాత్తాప పడి, అంత రాత్రి తన భర్తతో వెళ్లి ఆ సాధువుని క్షమాపణ కోరడం ఇదంతా చూసి సమయ దేవత ఎంతో ఆనంద పడింది.