N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Saturday, 2 May 2015

SwamiNarayan - Episode 46


ఫిర్యాదు 
 
సురా కాచర్  లాడు దాంజి (Ladu Danji) వెనక స్వామి నారాయణ గారి దర్బారులో ఉండిపోవడం గమనించి అతన్నే అనుక్షణం వెంటాడుతూ అతను ఏం చేస్తున్నాడా అన్నీగమనిస్తూ ఉన్నాడు. అతనికి లాడు దాంజి (Ladu Danji) వ్యవహారం ఏమీ అంతు పట్టలేదు. ఏమైనా సరే ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకుని ఒక సారి స్వామి నారాయణ గారు విశ్రమిస్తున్న చోటికి వెళ్ళాడు. అక్కడ ఆయన శిష్యులతో స్వామి నారాయణ గారిని కలవాలని చెప్పి వారి అనుమతి కోరాడు. దానికి వాళ్ళు ప్రస్తుతం స్వామి నారాయణ గారు విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి మీరు తర్వాత రండి అని చెప్పారు. దాంట్లో ఒకడు భగవంతుడికి విశ్రాంతి ఏమిటీ? భక్తుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు, మీరువెళ్ళండి అని చెప్పి అతన్ని లోపలకు పంపించారు. సురా కాచర్ లోపలకి వెళ్లేసరికి అక్కడ స్వామి నారాయణ గారు కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నట్టుగా కనిపించారు. అయితే ఇతను కొంచెం తొట్రుపాటు పడ్డాడు.


“అయ్యో ! విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వచ్చానే అని అనుకుంటుండగా “సురా కాచర్ గారూ ! ఏమిటి విశేషాలు? ఇలా వచ్చారు అని స్వామి నారాయణ గారు అడిగారు.

స్వామీ ! “మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు కదా ! నేను మరి చాలా నిశ్శబ్దంగా వచ్చాను మీకు నిద్రా భంగం అవకూడదని. మీకు వచ్చింది నేనే సురా కాచర్నే నని ఎలా తెలిసింది?” అని అడిగాడు.
ఆయన కళ్ళు తెరవకుండానే “సురా కాచర్ గారూ ! నాకు అన్నీ తెలుసు. మీరెందుకు వచ్చారో కూడా నాకు తెలుసు” అని అన్నారు.

“స్వామీ ! నేనెందుకు వచ్చానో చెప్పండి” అని సురా కాచర్ అన్నాడు.“మీరు లాడు దాంజి (Ladu Danji) గారి మీద ఫిర్యాదు చేయడానికే వచ్చారు కదా ! అయినా అతను డాబూ దర్పంతో సాధు సన్యాసుల మధ్య తిరుగుతున్నాడు” అని చెప్పడానికే వచ్చారు కదా ! అని స్వామి నారాయణ గారు అన్నారు.

“అవును స్వామీ ! మీరు చాలా ఖచ్చితంగానే చెప్పారు. ఆయన ఇంకా లౌకిక ప్రపంచంలోనే ఉన్నాడు. డాబూ దర్పం వదిలి పెట్ట లేదు. ఆయన వేసుకునే ఖరీదైన దుస్తువులు,సాధువులతో కలిసి మెలిసే తిరగడము, వారితో పాటు భోజనం చేయడం ఇదంతా ఏమీ బాగా లేదు ప్రభూ ! అదే మీకు నేను చెప్దామని వచ్చాను అని అన్నాడు.
మరి ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పండి పోనీ లాడు దాంజి (Ladu Danji) గారిని వెళ్ళిపొమ్మని చెప్దామా అని అడిగారు స్వామి నారాయణ గారు.

ప్రభూ ! అలా చెప్పకండి. అలా చెప్పితే మీమీద అనవసరంగా లేనిపోని అపవాదు వస్తుంది అని సురా కాచర్ అన్నాడు. లాడు దాంజి (Ladu Danji) వ్యవహారం కాకుండా మీ మనస్సులో ఏదో వేరే ఆలోచన కూడా ఉంది. అదే అభయ కాచార్ గారి పుత్రికలు వివాహం చేసుకోకుండా కన్యలుగా ఉంటామని చెప్పుతున్నారు, సన్యాసినిలుగా ఉండడానికి నిశ్చయించుకున్నారు కదా ! వారి గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు. వారి గురించి మీకు చింతగా ఉంది కదా! అని స్వామి నారాయణ గారు ప్రశ్నించారు.

అవును ప్రభూ ! మీరు నా మనసులోని విషయాలు సరిగ్గా కనుక్కున్నారు. ఆ విషయం కూడా నేను మీతో మాట్లాడాలని అనుకున్నాను అని సురా కాచార్ చెప్పాడు.

లాడు దాంజి (Ladu Danji) గారు ఇక్కడ సత్సంగుల మధ్యలో ఉన్నాకూడా ఆయన ఇంకా లౌకిక ప్రపంచం లోనే ఉన్నాడు. ఆయనకి  వాక్చాతుర్యం కూడా బాగా ఉంది కదా! ఆయన ఇద్దరు సోదరీమణుల దగ్గర మంచిగా మాట్లాడి వారి నిశ్చయాన్ని మార్చ వచ్చును కదా అని చెప్పడానికి నేను వచ్చాను అని అన్నాడు. గృహస్థుల మాదిరిగా ఉండి కూడా ఆ భగవంతుని ధ్యానం చేసుకోవచ్చును కదా, అందుకని లాడు దాంజి (Ladu Danji) తన వాక్చాతుర్యంతో వారి మనస్సుని మార్చగలిగితే బాగుండును.

ప్రభూ ! మీరు స్వయంగా కనక లాడు దాంజి (Ladu Danji) తో చెప్పితే ఆయన కాదని అనడు. ఆయన సుఖాలని, వ్యామోహాలని వదిలి పెట్ట లేకున్నా ఇక్కడ సన్యాసులు, సత్సంగులతో పాటు సత్సంగిలాగా ఉంటున్నాడు కదా ! అలాగే గృహస్థాశ్రమములో ఉండి కూడా భగవంతుని ధ్యానం చేసుకోవచ్చునని ఆయన సోదరీమణులని మార్చగలుగుతాడు. మీ మాట అతను కాదనలేడు కాబట్టి మీరే ఆయనకి చెప్పండి అని అన్నాడు. స్వామి నారాయణ గారు ‘సరే’ “అలాగే” అని చెప్పి అతన్ని పంపించి వేశాడు.

                                       లాడు దాంజి (Ladu Danji) హిత బోధ    

సురా కాచార్ తన పథకం పారిందని చాలా సంతోష పడిపోయాడు. “ చూద్దాం ! లోహాన్ని లోహమే కత్తిరిస్తుంది” అని అంటారు. మరి లాడు దాంజి (Ladu Danji) హిత బోధ విని మరి సంఖ్యా యోగంలోనికి వెళ్ళదాము అని అనుకుంటున్నఆ సోదరీమణులు సంసారయోగం లోనికి వస్తారా? లేదా? లాడు దాంజి (Ladu Danji) తన డాబూ, దర్పాన్ని వదిలి వేసి నిజమైన సత్సంగి లాగా మారతాడా? చూద్దాం తమాషా! అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. జరగబోయే కార్యక్రమాన్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. చూద్దాం ! చూద్దాం ! వీళ్ళిద్దరి మధ్య సమావేశం ఎటుమలుపు తిరుగుతుందో చూద్దాం ! అని ఆయనా అనుకుంటూ ఉన్నాడు. ఒక రోజు లాడు దాంజి (Ladu Danji) ఆ ఇద్దరు సోదరీమణుల దగ్గరకి వచ్చాడు. ప్రణామాలు అయ్యాక ఆ అక్కా చెల్లెళ్ళు అతన్ని గౌరవించి కుశల ప్రశ్నలు వేశారు. లాడు దాంజి (Ladu Danji) నేను  మీ ఇద్దరితో మాట్లాడడానికి  వచ్చాను. మరి నేను చెప్పేది మీరు వింటారా? అని అడగ్గా ఓ ! దానికేముంది? తప్పకుండా మీ మాట మేము వింటాము అని వాళ్ళు బదులిచ్చారు. మీరేం చెప్పినా మా హితం కోరే చెప్పుతారు కదా ! చెప్పండి అని అన్నారు.

నేను మీకు  ఒక సలహా ఇవ్వడానికి వచ్చాను. మీరు ఇంకా చిన్న వయస్సులోనే ఉన్నారు. మీరు ఆడుతూ-పాడుతూ ఉల్లాసంగా ఉండవలసిన రోజులు. పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా అత్తవారింట్లో సంసారం చేసుకునే రోజులు. మీరు అవన్నీ వదిలివేసి, సాధారణమైన వస్త్రాలు ధరించి, ఎటువంటి అలంకారాలు లేకుండా విరాగినిల్లాగా ఉండడం ఏం బాగుంటుంది చెప్పండి అని ఆయన సలహా ఇచ్చాడు. బాబాయ్ ! మీరు చెప్పింది చాలా బాగుంది. మేము ఆడంబరమైన వస్త్రాలు ధరించి, బాగా అలంకారాలు చేసుకుంటే ఇక్కడ ఉన్న పురుషులందరి దృష్టి మా మీదే పడుతుంది. వాళ్ళ మనస్సులో లేని పోనీ విషయవాసనలకు సంబంధించిన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. పురుషుల దృష్టి అంతా మామీద,మా అందం మీద ఉండి వాళ్ళలో లేని పోనీ మనో వికారాలు కలుగుతాయి కదా ! అందుకని మేము ఈ ఆడంబరమైన దుస్తువులని, అలంకారాలని త్యజించాము. స్త్రీలు మామూలు దుస్తులు ధరించి ఎటువంటి అలంకారాలు లేకుండా సహజ సౌందర్యంతో ఉన్నప్పుడు పురుషుల దృష్టి అటువంటి స్త్రీల మీద పడదు. తర్వాత వారిలో ఎటువంటి మనో వికారాలు కలగవు కదా ! అందుకనే మేము ఈ ఆడంబరాలన్నీ త్యజించి మామూలు స్త్రీల మాదిరిగానే ఉంటున్నాము. దీని మూలంగా మాకు, ఆ పురుషులకి కూడా ఎంతో మేలు జరుగుతుంది ఆడంబరంగా ఉండి, ఆకర్షణీయంగా ఉండి పురుషులలో లేని పోనీ మనో వికారాలన్నీ కల్పించి ఆ పాపాన్నిమేము మూట కట్టుకో దలచలేదు అని ఎంతో వినయంగా చెప్పారు. ఆ సమాధానం విని లాడు దాంజి (Ladu Danji) నిర్ఘాంత పోయాడు. తానూ కూడా మరి అటువంటి వస్త్ర ధారణ చేసుకుని ఉన్నాడు కదా ! ఆడంబరమైన దుస్తులు, ఎంతో విలవైనట్టి ఆభరణాలు వేసుకుని తానూ వీరందరి మధ్య తిరుగుతున్నాడు కదా! అదే విషయం అతని మనస్సుకి సూటిగా తగిలింది. అలా కాదంటే మేము మీరు చెప్పినట్టుగానే వస్త్ర ధారణ చేసుకుంటాము , మరి దాని వల్ల కలిగే పాపాలు మీరు భరించ గలరా? అని సూటిగా ప్రశ్న వేసేసరికి లాడు దాంజి (Ladu Danji) చాలా గాభరా పడిపోయాడు. అలా “వద్దు”, “వద్దు” అని చెప్పి ఆయన వారించాడు.బాబాయ్ ! భగవంతుడు మమ్మల్నిఇలాగే సృష్టించాడు, సహజ సౌందర్య మైనటువంటి ఆకృతిని అందరికీ ఇచ్చాడు. భగవంతుని సృష్టిలో మరి ఎటువంటి లోపం ఉండదు కదా! దానికి కృత్రిమమైన అలంకారాలు చేసుకోవడం అవసరమా? సీదా సాదాగా అంటే మామూలుగా ఏ అలంకారాలు లేకుండా ఉండే స్త్రీలలో ఆత్మ సౌందర్యం లేదా? భగవంతుడు తన సృష్టితో మాకు సహజ సౌందర్యాన్ని ప్రసాదించాడు. ఆ ప్రకృతి మాత ఇచ్చినట్టి ఈ శరీరానికి లేనిపోని కృత్రిమమైన అలంకారాలు చేసి ఆ భగవంతుని సృష్టిని, ఆ ప్రకృతిమాతని అవమానం చేయడం భావ్యమా? మీరే చెప్పండి అని అడగ్గా అతను దీర్ఘంగా ఆలోచనలో పడిపోయాడు. “అవును”, మీరు చెప్పింది నిజమే అని అన్నాడు. మీరు చెప్పిన విధంగానే మేము చేస్తాము. కాని మేము భగవంతునిలో ఐక్యమయి పోయాము. ఆ గిరిధర్ ని పూజ చేస్తున్నాము. నిరంతరమూ ఆయన ధ్యానంలోనే ఉంటాము. ఒక వేళ మాకు వివాహమైతే నా భర్తకి నేను చేసే పని ఇష్టంగా ఉంటుందా? అలాగే మా అత్తగారు కాని, మా మామగారు కాని అభ్యంతరాలు చెప్పరా? నిరంతరమూ భగవంతుడి ధ్యానంలో, ఆయన ధ్యాసలో, ఆయన ఆలోచనల్లోనే మేము అంకితమై ఉండడం మరి గృహస్థాశ్రమం లోఉన్న వారికి ఇవన్నీ నచ్చుతాయా? మీరే చెప్పండి అని ఎదురు ప్రశ్న వేశారు. మేము మా భక్తిని వదిలి ఉండలేము. అలాగే ఆ సంసారంలో కూడా మేము ఇమడలేము. మేము బాధ పడవలసి వస్తుంది, మా అత్తగారు, మామగారు, నా భర్త కూడా బాధ పడవలసి వస్తుంది. ఇది భావ్యమే నంటారా?అని ఇంకొక సోదరి ప్రశ్నించింది. ఇలా అంతమందిని కష్టపెట్టడం పాపం కాదా? మీరే చెప్పండి. బాబాయ్ !  మీరు కనక చెప్పితే మీ ఇష్ట ప్రకారమే, మీ మాట ప్రకారమే, మీ సలహా ప్రకారమే మేము వివాహం చేసుకుంటాము. కాని ఒక షరతు ఏమంటే ఈ పాప భారాన్ని కూడా మరి మీరే మోయ వలసి వస్తుంది మరి దీనికి మీరు ఒప్పుకుంటారా? అని అడిగారు. దానికి సమాధానంగా “లేదు”,”లేదు”, “కాదు”, “కాదు” “వద్దు”, “వద్దు” అని అంటూ ఏం జవాబు చెప్పాలో తెలియకుండా లాడు దాంజి (Ladu Danji) తత్తర పడిపోయాడు. మేమిద్దరమూ కూడా పరమేశ్వరుడికి అంకితమైపోయాము. కాబట్టి పతి పరమేశ్వరుడికి సేవ చేసుకోలేము. పరమేశ్వరునికి అంకితమైపోయిన మాకు ఎటువంటి అలంకారాలతో ఆయన్ని సంతోష పెట్టవలసిన అవసరం లేదు. 

అందుకనే మేము ఈ అలంకారాలని, ఆడంబరాలన్నీత్యాగం చేసేశాము. కాని మీరు  మాత్రం ఈ అలంకారాలతోనే ఉన్నారు. కాబట్టి మీరు ఒక పని చేయండి అని చెప్పి వారు ప్రక్కనే ఉన్న వారి అలంకార రూపంలో ఉన్నవారి అన్ని నగల పెద్ద మూటని ఇస్తూ మాకు ఎటువంటి అలంకారాలతో పని లేదు. భగవంతుని నామ స్మరణమే మాకు ఒక పెద్ద అలంకారము. దానికి మించిన అలంకారము ఏదీ లేదు. ఈ అలంకారాలతో, ఈ ఆడంబరాలతో మాకు ఎటువంటి పని లేదు. కాని మీరు అలంకార ప్రియులు కాబట్టి మీకు ఇవన్నీ కూడా పనికి వస్తాయి కాబట్టి మీరు వీటిని స్వీకరించి అలంకరించుకోండి అని ఆ సోదరీమణులు చెప్పారు. ప్రభూ నామస్మరణంలో ఉన్న మెరుపులు ఈ నగలలో ఉన్న మెరుపుల కన్నా ఎంతో గొప్పవి. లాడు దాంజి (Ladu Danji) కి ఇటువంటి అనుభవం జీవితంలో ఎప్పుడూ కలగలేదు. ఆయన చాలా ఆశ్చర్యపడిపోయాడు, నిర్ఘాంత పడిపోయాడు. ఏదో దీర్ఘాలోచనలో పడిపోయాడు. మనస్సులో,హృదయంలో ఏదో ఒక తెలియని వ్యథ, ఒక ఆలోచన ఆయన్ని కలవర పెట్ట సాగింది. పరధ్యానంలోనుంచి బయట పడి, “వద్దు”, “వద్దు”  అని అనుకుంటూ ఎంతో వినయంగా చెప్పి చేతులు జోడించి వారిద్దరికీ నమస్కరించి అక్కడనుంచి మెల్లగా నిష్క్రమించాడు. కాని అతని అంతరాత్మలో ఒక పెద్ద మధనం జరగసాగింది. తానూ స్వామి నారాయణగారి దర్బారుకి వచ్చి ఆయనకీ సాష్టాంగ దండ ప్రణామం చేసి నా కవితా గానం దేవుడి మీదే ప్రదర్శిస్తానని చెప్పినా కూడా నాలో ఈ అలంకారాల పట్ల, ఈ ఆడంబరాల పట్ల వ్యామోహం ఏమాత్రం తగ్గ లేదు. నేను ఈ సాధు సత్సంగులతో ఉండి కూడా నాలో ఎటువంటి మార్పు కలగలేదు. వారిని చూసి కూడా నేనేమీ నేర్చుకోలేదు. ఇందరి మధ్యలో ఉండి కూడా నాలో ఉన్నటువంటి సహజమైన స్వభావాన్ని నేను  మార్చుకోలేక పోయాను. “ఆహా!” స్వామి నారాయణా ! నీ చమత్కారం నేనిప్పుడు గమనించాను. నాకు ఈ రకంగా సంయక విచారణ, విమర్శన చేసుకునే అవకాశం ఈ ఇద్దరి సోదరీమణుల ద్వారా కలిగించావు అని అనుకుంటూ ఆయన రకరకాల ఆలోచనల్లో మునిగి పోయినాడు. లాడు దాంజి (Ladu Danji) మెల్లగా ఆ సోదరీమణుల కుటుంబ సభ్యుల దగ్గరకి వెళ్లి వారికి చేతులు జోడించి నమస్కరించి  నేను ఈ రోజు వాళ్ళని సమాధాన పరచి వారిద్దరినీ మార్చుదాము అని కొంత గర్వంతో, అహంకారంతో వెళ్లాను, కాని వారే నాకు చక్కగా హితబోధ చేశారు అని వినయంగా చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఆ కుటుంబ సభ్యులంతా ఆశ్చర్య పడిపోయారు.

మార్పు
లాడు దాంజి (Ladu Danji) ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళ సంభాషణ విన్నాక తన మనస్సులో జరిగిన మార్పులన్నీ సమీక్షించుకుని తాను చేసిన పెద్ద పొరబాటుని గ్రహించాడు. సత్పురుషుడు కనుక తన అహంకారాన్ని త్యాగం చేశాడు. అలాగే తాను వేసుకున్న విలువైన, ఆడంబరమైన దుస్తులన్నీత్యజించి వేశాడు. వైరాగ్య భావంతో అతను నిజమైన స్వామి నారాయణుడి భక్తుడిగా మారి మామూలు దుస్తులు ధరించి స్వామి నారాయణ దర్శనానికి ఒక రోజు వెళ్ళాడు. స్వామి నారాయణ గారు అతన్ని చూసి లాడు దాంజి (Ladu Danji) గారూ ! ఏమిటీ మీరింత మారిపోయారు?మామూలు దుస్తులు ధరించి ఇలా వచ్చారేమిటీ? అని ప్రశ్నార్థకంగా చూశారు. సర్వ సమర్థులైన మీకు అన్నీ తెలుసు. ఆ సోదరీమణులు ఇద్దరూ కూడా నన్ను పూర్తిగా మార్చి వేశారు. నేను చేస్తున్నతప్పు నాకు తెలిసేలాగా చేశారు ప్రభూ ! అని అన్నాడు. ప్రభూ ! మిమ్మల్ని నాకు దీక్ష ఇవ్వమని అడిగినప్పుడు కొన్ని రోజులుండి హృదయాన్ని పరిశుద్ధం చేసుకోమని చెప్పారు. దాని అర్థం నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. సాధు-సత్సంగుల మధ్య ఉండి కూడా నాలో వైరాగ్య భావం కలగలేదు. నేను వారి దగ్గరనుంచి ఏమీ నేర్చుకోలేదు. ఇంకొక రకంగా మరి నాకు తెలిసి వచ్చేటట్టుగా మీరు చేశారు. ఈ నాటకంలో సూత్రధారులైనటువంటి ఆ ఇద్దరు సోదరీమణుల మాటల వల్ల, బోధనల వల్ల నా హృదయం పరిశుద్ధమై పోయింది స్వామీ ! నేను నిజంగా పశ్చాత్తాప పడుతున్నాను, మీ పాదాల వద్ద నన్ను చేర్చుకుని నాకు దీక్షను ప్రసాదించండి అని కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాల మీద పడిపోయాడు. ఆ ప్రభువు ఆయనని ఆదరంగా లేపి మీరెలాగంటే అలాగే, మీ ఇష్టం బ్రహ్మానంద స్వామీ ! అని అనగానే ఆయన ఉలిక్కి పడ్డాడు. అప్పట్నుంచి ఆయన పేరు బ్రహ్మానంద స్వామిగా స్థిర పడిపోయింది. ఈ రకంగా స్వామి నారాయణ గారు తన నాటకాన్నిసాగించి అతనిలో పరివర్తన వచ్చేలాగా చేశారు. ఇవన్నీ గమనిస్తున్నటువంటి దేవతలు ముఖ్యంగా సమయ దేవత కూడా చాలా ఆశ్చర్య పడిపోయింది. 

ఊరడింపు
 
ఎభాల్ కచార్ కుటుంబ సభ్యులంతా ఆ ఇద్దరు సోదరీమణుల నిర్ణయం విన్నాక ఏం చేయాలో తెలియక దిగాలు పడిపోయి ఉండగా  లాడు దాంజి (Ladu Danji) వారికి ధైర్యాన్ని చెప్పాడు. మనం అన్నీ స్వామి నారాయణ గారికే అప్ప చెప్పాం కదా ! ఏది మంచో ఏది చెడో మనకి కాని మన పుత్రికలకు కాని అర్థం కాదు అవి అన్నీ ఆయనకే తెలుసు. అందుకని అన్నీ ఆయన మీదే వదులుదాం. అది కాకుండా మనకు స్వామి నారాయణ గారు కూడా సలహా నిచ్చారు కదా ! ఏ పరిష్కారానికయినా సమాధానం సమయమే చెప్పుతుంది అని ఆయన చెప్పారు కదా ! అటువంటప్పుడు ఎందుకు మనం విచారపడడం?అనవసరం ! అన్నీ కూడా మనం ఆయనకే నివేదించుకుందాం. అన్నీ ఆయనే చూసుకుంటారు అని ఆయన ఆ కుటుంబ సభ్యులతో ధైర్య వచనాలు చెప్పడంతో వాళ్ళు  అంతా శాంతించారు.