N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Saturday, 1 August 2015

SwamiNarayan - Episode 52



కుశాల్ భట్టు రాక
కుశాల్ భట్ అనే స్వామి నారాయణ గారి భక్తుడు రాగానే స్వామి నారాయణ గారు తన శిష్యులందరితో మాట్లాడుతుండగా ఆయన దృష్టి కుశాల్ భట్ మీద పడింది. వెంటనే ఆయన అక్కడనుంచి లేచి గబ గబా కుశాల్ భట్ గారి దగ్గరకి వెళ్లి ఆయనని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. అక్కడ ఉన్న సమస్త శిష్యులు, అనుచరులు అందరూ కూడా ఆశ్చర్య పడిపోయినారు. గబుక్కున స్వామి వారు లేచి గబ గబా వెళ్లి ఆలింగనం చేసుకోవడంతో అతనెవరో గొప్పవాడని గ్రహించారు. కుశాల్ భట్టుగారూ, మనం ఎలాగో ఇక్కడ కలవాలని నేను అనుకున్నాను. మీరు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది “రండి”,”రండి” అని చేయి పట్టుకుని ఆయన్ని తన ప్రక్కనే కూర్చుండ బెట్టుకున్నారు. ఈయనే ఇక్కడే నా ప్రక్కనే కూర్చుంటారు అని అక్కడ ఉన్న వారందరికీ చెప్పారు.


ఆ రోజు 18వ రోజు. ఈ రోజే యజ్ఞం ఆఖరి రోజు. యజ్ఞం అయిపోయింది. పూర్ణాహుతి కూడా అయిపోయింది. అందరూకూడా అక్కడ సమావేశమై ఎంతో సంతోషపడుతున్నారు. స్వామి ముక్తానంద గారు, స్వామి సుఖానంద గారు, స్వామి బ్రహ్మానంద గారు, స్వామి వేణీ గారు, ఇంకా ప్రముఖులెంతో మంది కూర్చుని యజ్ఞం సఫలమైంది అని సంతోష పడుతున్నారు. ఈ 18 రోజుల పర ఆఖరి రోజు అయ్యేసరికి అకాల పరిస్థితులన్నీ మారిపోయినాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇదే వారు ముచ్చటించు కుంటూ స్వామి నారాయణ గారిని వేనోళ్ళ పొగుడుతూ సాక్షాత్తు హీరా బాయి లాంటివారికి సాక్షాత్తు భగవాన్ అయిన స్వామి నారాయణ గారు మోక్షాన్నే ప్రదానం చేశారు. ఎంతో జయప్రదంగా ఈ యాగాన్ని నిర్వర్తించారు. ప్రభుశ్రీ మన కోసం ఎన్ని పనులు చేశారు, ఈ కార్యాన్ని నిర్వహించారు. ‘’ప్రభుశ్రీ నాదొక విన్నపం అని అనగా ఏమిటా విన్నపం? అని బ్రహ్మానంద గారు అడిగారు.  ఏమీ లేదు స్వామి వారు మన  కోసం ఇంత చేశారు కదా! స్వామి వారు మా ఇళ్ళకి కూడా వచ్చి మా ఆతిథ్యం తీసుకుంటే బాగుంటుంది కదా ! దయ చేసి మీరే స్వామి వారితో మా మాటగా చెప్పండి. మా ప్రార్థనలు ఆయనకి విన్నవించండి అని అందరూ కూడా ఒకే  మాటగా ఆయన్ని అభ్యర్థించారు. దానికి ముక్తానంద గారు, మిగతా ప్రముఖులందరూ కూడా మధ్యలో  మేమెందుకు రాయబారం చేయడం? మీరే స్వామి నారాయణ గారిని అడగవచ్చు కదా ! ఆయన తప్పకుండా మీ అభ్యర్థనని అంగీకరిస్తారు అనే విశ్వాసం  మాకుంది అని చెప్పారు. 

శ్రీ స్వామి నారాయణ గారు తన శిష్యులందరితోటి ఈ యజ్ఞం సంపూర్ణంగా విజయవంతం కావడానికి మీ అందరి సహాయ సహకారాలు తోడ్పడ్డాయి. మీరు చేసిన ఈ మేలు ... అని చెప్పుతూ ఉండగా ముక్తానంద గారు చేతులు జోడించి నమస్కరించి భుశ్రీ ! ఇక్కడి వారంతా తమకి ఒక విన్నపం చేసుకుంటు న్నారు. ఈ గ్రామంలో ఉన్న పెద్దలంతా మీరు వారింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని వేడుకుంటున్నారు అని చెప్పారు. దానికి సమాధానంగా స్వామి నారాయణ గారు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళడంలో ఇబ్బంది ఏమీ లేదు, వారి ఆతిథ్యం స్వీకరించడంలో కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కాని ఈ 18 రోజులు కూడా వారి ఆతిథ్యాన్ని నేను స్వీకరిస్తూనే ఉన్నాను కదా ! నేనే  కాదు నా శిష్యులంతా, నా అనుచరులంతా,చుట్టుప్రక్కల గ్రామస్తులంతా జేతల్పూర్ గ్రామం యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తూనే ఉన్నాం కదా ! మళ్ళీ ప్రత్యేకంగా ఈ ఆతిథ్యం ఎందుకు? నేను అనుకున్న కార్యం నెరవేరింది. ఇంకా నేను రోజూ ఒక్కొక్కళ్ళ ఇళ్ళకి వెళ్ళాలంటే మీరే లెక్క వేయండి ఎన్ని రోజులు పడుతుందో. నాకు ఇక్కడ్నుంచి వేరే చోటకి వెళ్ళే కార్యక్రమం ఉంది కాబట్టి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించడం నేననుకున్న ప్రణాళికకి అడ్డం వస్తుంది కదా ! మనం చేయ వలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ వదులుకుని కేవలం మనం భోజనం కోసమే రోజులు వ్యర్థం చేయడం ఏమన్నా బాగుంటుందా? ముందు పని ముఖ్యం కదా ! మొదలే చెప్పాను మనం ఈ 18 రోజులూ భోజనం చేస్తూనే ఉన్నాము , మీరే ఆలోచించండి అని చెప్పారు. ఆ జేతల్పూర్ గ్రామంలోని ఒక ముఖ్యుడు ధైర్యం చేసి “ప్రభుశ్రీ ! నాకు ఒక ఉపాయం తోస్తుంది. అదేమిటంటే మేమందరమూ మా ఇళ్ళలో ఏదో ఒక వంటకం చేసుకుని మీ దగ్గరకు వస్తాము. మేము తెచ్చిన వంటకాల్లో మీకు ఇష్టమైనది స్వల్పంగా తీసుకోండి. ఈ రకంగా కనక చేస్తే మీరు అనుకున్నప్రకారంగా మీ కార్యక్రమాలు చేసుకో వచ్చును.

మీరు ఎక్కువ రోజులు కూడా ఇక్కడ ఉండవలసిన అవసరం ఉండదు” అని విన్నవించుకున్నాడు. స్వామి నారాయణ గారు అక్కడ చేరిన వారందరినీ పరిశీలనగా చూస్తూ తన అంగీకారాన్ని తెలిపారు. అందరూ వారి వారి ఇళ్ళకు వెళ్ళిపోయి వంట ప్రయత్నాల్లో మునిగిపోయారు. అనుకున్న ప్రకారంగా ఆ మరునాడు వారు తయారు చేసిన  ప్రత్యేక వంటకాలని తీసుకుని స్వామి నారాయణ గారు ఉన్న ప్రదేశానికి వచ్చిఆయన కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఒకళ్ళతోఒకళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు స్వామి నారాయణ గారికి నేను హల్వా తెచ్చాను అది వారికి చాలా ఇష్టం అని ఒకరంటే ఇంకొకరు నేను కేసరి వేసి జిలేబీ తెచ్చాను అది ఆయనకి చాలా ఇష్టం అంటే  , మరొకరు నేను లడ్డు తీసుకుని వచ్చాను ఇలా వాళ్ళు వారు తెచ్చిన పదార్థాల గురించి చెప్పుతూ ఇవి తప్పకుండా స్వామి వారికి నచ్చుతాయి , అవి తీసుకుని తింటారు అని ఎంతో నమ్మకంగా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా స్వామి నారాయణ గారు వింటున్నారు, గమనిస్తున్నారు. జీవన్ భగత్ గారూ ! మీరేం తెచ్చారు? అని జీవన్ భగత్  గారిని ప్రశ్నించారు. జీవన్ భగత్ గారు వీళ్ళందరిలాగా శ్రీమంతుడు కాదు. కడు బీదవాడు. ఈ విధంగా అందరూ జీవన్ భగత్ ని ఏం తెచ్చారో చెప్పమని బలవంత పెట్ట సాగారు, మొహమాట పెట్ట సాగారు. కాని జీవన్ భగత్ వీళ్ళందరూ తెచ్చిన వంటకాల ప్రస్తావన రాగానే అతనికి ఏదో చెప్పలేనంత జంకు వచ్చింది. అయ్యో ! వీళ్ళంతా మంచి మంచి తినేపదార్థాలు తీసుకుని వచ్చారు కదా ! మరి నేను తెచ్చింది వారికి ఇస్తే అది చాలా లోకువగా ఉంటుంది అని ఆయన తటపటాయిస్తుంటే అతని అవస్తని చూసి వారు ఇంకా హేళనగా, వెటకారంగా ఇదేమిటీ జీవన్ భగత్ గారూ దాచి పెడ్తున్నారు? మేమంతా స్వామి వారికి చూపించా౦ కదా ! మీరు కూడా చెప్పండి, స్వామి వారికి ఏం తెచ్చారో మాకు చూపండి అంటూ ఆయన వెంట పడ్డారు. జీవన్ భగత్ గారు పాపం తత్తరపాటు పడ సాగారు. ఏం చెప్పాలో తెలియక ఆయన గుడ్లు మిటకరిస్తూ నిలబడి పోయాడు. ఈలోగా స్వామి నారాయణ గారు వచ్చారు. ఆయన అంతా గమనిస్తూనే ఉన్నారు. వారి మధ్యలోంచి మెట్లెక్కుతూ వారి కోసం పెట్టిన ఆసనం మీద కూర్చోబోతూ ప్రేమపూర్వకంగా జీవన్ భగత్ ని చూస్తూ , “జీవన్ భగత్ గారూ ! మీరేం తీసుకుని వచ్చారో, తీసుకుని పైకి రండి” అని ఆహ్వానించగా చేసేది లేక జీవన్ భగత్ ఆయన దగ్గరకి తానూ తెచ్చిన వంటకాన్ని పట్టుకుని వెళ్ళాడు. ఆయన మిగతా వారందరినీ కూడా తన దగ్గరకి రమ్మని ఆహ్వానించారు. వాళ్ళంతా వారు తెచ్చిన వంటకాలని పట్టుకుని స్వామి నారాయణ గారి దగ్గరకి వెళ్ళుతూ స్వామి నారాయణ గారికి చాలా ఇష్టం కాబట్టి ఆయన తప్పకుండా నేను తెచ్చిన ప్రసాదాన్నే స్వీకరిస్తారు అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ చుట్టూ మూగారు. మీరేం తెచ్చారు అని ఒక్కొక్కళ్ళని అడగ్గా ఒకడు లడ్డు, ఇంకొకడు జిలేబీ మైసూర్ పాక్  అని వారు తెచ్చిన మధుర పదార్థాల గురించి చెప్పారు. మీరు స్వీకరించండి, స్వామీ, అని ప్రాధేయ పడ్డారు. జీవన్ భగత్ అందరికంటే ఆఖరున నిల్చున్నాడు.

ప్రభుశ్రీ ఒక్కక్కరినీ దాటుకుంటూ వెళ్ళుతుంటే మా ప్రసాదాన్ని స్వీకరించండి అని అభ్యర్థిస్తున్నా ఏమీ వినిపించుకోకుండా ఆయన జీవన్ భగత్ దగ్గరకి వచ్చి నిలబడ్డాడు. ఈ లోపల స్వామి నారాయణ గారి శిష్యులంతా అక్కడ చేరి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు. మరి స్వామి నారాయణ గారు ఆయన కోసం తెచ్చిన మధుర పదార్థాలన్నీ వదులుకుని జీవన్ భగత్ దగ్గరకు వచ్చి నిలబడ్డం చూశారు, స్వామి నారాయణ గారు జీవన్ భగత్ వైపు చూస్తూ మీరేం తెచ్చారు? అని ప్రశ్నించగా అతను చాలా సిగ్గు పడ్డాడు. అతని అవస్థ కృష్ణావతారం లోని సుదాముని అవస్థలాగా ఉంది. మిగిలిన మధుర పదార్థాలన్నీ వదులుకుని తానూ తెచ్చింది స్వామి వారు స్వీకరిస్తారా లేదా తానూ బీదవాడిని కదా అని అనుకుంటున్నాడు. చివరకి స్వామి నారాయణ గారే అతను తెచ్చిన వస్త్రపు మూటను విప్పుతూ ఆశ్చర్యంగా జీవన్ భగత్ గారూ ! (ఈ మకయీ కీ రోటీ) ఈ మొక్కజొన్న రొట్టె , ఈ కూరా నాకు ఇష్టమని మీకెలా తెలుసు? అంటూ ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా ప్రశ్నించారు. జీవన్ భగత్ కి నోట మాట రాలేదు. మిగతా వారందరూ కూడా నిశ్చేష్టులై పోయారు. తాము ఎంతో కష్టపడి తెచ్చిన మధుర పదార్థాలన్నీ కాదని సాధారణ మైన ఆ రొట్టేని ప్రశంసించడం వారందరికీ అర్థం కాలేదు. అలాగే స్వామి నారాయణ గారి శిష్యులకి కూడా ఈ వింత ఏమిటో అర్థం కాలేదు. ప్రభుశ్రీ మొహమాట పడిపోతున్న ఆ జీవన్ భగత్ చేతిలోంచి రొట్టెని తీసుకుని మెట్లెక్కుతూ తన స్థానానికి వెళ్లి పోయి ఎంతో ప్రేమతో ఆ రొట్టె ముక్కను చేతిలో పట్టుకున్నారు. ఎంతో శ్రేష్టమైన మధుర పదార్థాలను తెచ్చిన వారంతా ప్రభుశ్రీ ! ఇంత మధురమైన పదార్ధాలని మేము తెచ్చాం కదా ! అవి కాదని  మీరు అదేమిటీ అతను తెచ్చిన మామూలు రొట్టె , ఆ కూరని తింటున్నారు? అని ప్రశ్నించారు. మీరందరూ తెచ్చిన మధుర పదార్ధాలని కాదని నేను ఈ జీవన్ భగత్ తెచ్చిన రొట్టెని ఆస్వాదిస్తున్నాను ఎందుకు అని మీరు అడుగుతున్నారు కదా ! దానికి కారణం చెప్పమంటారా అని మెట్లు దిగి వచ్చి జీవన్ భగత్ ప్రక్కన నిల్చుకుని చెప్పండి జీవన్ భగత్ గారూ ! మీరు ఈ రొట్టె ని పాలతో చేశారు కదా ! ఆ పిండిలో పాలు కలిపి ఈ రొట్టె ని చేశారు కదా !అని ప్రశ్నించారు. జీవన్ భగత్ తత్తర పాటు పడుతూ లేదు స్వామి అని చెప్పాడు. అయితే మీకు కూడా ఈ విషయం తెలియదన్న మాట. అయితే సరే ! నేను చూపిస్తాను అని చెప్పి ఆయన ఆ రొట్టె ముక్కని చేతిలో తీసుకుని అందరు చూస్తుండగా దాన్ని గట్టిగా పిండారు. దాని నుండి స్వచ్చమైన పాలు ధారగా క్రింద పడసాగాయి. ఇదంతా చూస్తున్న స్వామి నారాయణ గారి శిష్యులు, వంటకాలు తెచ్చిన మిగతా వారందరూ దిగ్భ్రాంతి చెందారు. స్వామి నారాయణ గారి శిష్యులంతా ఆయనకి ఎంతో గౌరవంగా నమస్కరించారు. జీవన్ భగత్ కి నోట మాట రాలేదు. ఆయన చాలా ఆనంద పడిపోయాడు. ఏం చెప్పాలో తెలియక, తన మనస్సులో ఉన్న భావాల్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక అలాగే నిల్చుని “ప్రభుశ్రీ”, “ప్రభుశ్రీ”  అంటూ ఉండి పోయాడు.ఇప్పుడు అర్థం అయిందా ఈ రొట్టేని నేనెందుకు తింటున్నానో జీవన్ భగత్ ఎంతో కష్ట పడి, చెమటోడ్చి వచ్చిన డబ్బుతో ఈ రొట్టేని చేసి నాకు సమర్పించాడు. న్యాయంగా ఎవరైతే కష్టపడి, చెమటోడ్చి పని చేస్తారో వారో ఒక్కొక్క స్వేద బిందువు ఆహారంలో అమృతప్రాయంగా మారుతుంది. ఇప్పటికైనా మీకు ఇది అర్థం అయిందా నేనెందుకు నీ రొట్టెని తినాలని అనుకుంటున్నానో? సరే ! మీరేం తీసుకొచ్చారు ? అంటూ ఇంకొక మధుర పదార్థాన్ని చేతిలో తీసుకుని ఆయన దాన్ని కూడా గట్టిగా పిండారు. అందరూ చూస్తుండగా దానిలో నుంచి రక్తపు ధార క్రింద పడసాగింది. అందరూ దిగ్భ్రాంతి చెందారు. అక్కడ మధుర పదార్థాలు తెచ్చిన వారనదరి గర్వ౦, అహంకార౦ అణిగిపోయింది. వారంతా సిగ్గుతో తల ది౦చుకున్నారు. ఇదంతా చూసిన స్వామి నారాయణ గారి శిష్యులందరూ స్వామి వారి లీలను చూసి చాలా ఆనంద పడిపోయారు. దానితో పాటు రెట్టింపు ఆశ్చర్యం కూడా వారికి కలిగింది. చూశారా! మీరు తెచ్చిన పదార్థాలు నేనెందుకు స్వీకరించ లేదో ! ఇటువంటి పదార్థ౦ నాకు విషతుల్యంగా ఉంటుంది. ఎందుకంటే మీరు బీద వాళ్ళ రక్తాన్ని పీల్చి, పిప్పి చేసి సంపాదించి, కూడబెట్టుకున్న ఆ ధనాన్ని ఖర్చు పెట్టి ఈ పదార్థాల్ని మధుర పదార్థాలుగా భావించి తీసుకుని వచ్చారు. కాని దీంట్లో చూశారా? బీద వాళ్ళ రక్తమే ఉంది. ఇప్పటికైనా తెలిసిందా మీకు మీరు ఏం పని చేస్తున్నారో? మీరు  మీ శక్తిని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో తెలిసింది కదా ! అలా శక్తిని మంచి వాటికి వినియోగించకుండా దుర్వినియోగం చేస్తే పాపం అని ఆయన తీవ్రమైన స్వరంతో వారందరిని మందలించారు. భక్తి భావంతో న్యాయంగా సంపాదించిన డబ్బుతో చేసిన ఆహారం మాకు ప్రీతికరం. అతి గర్వం, అహంకారం , అన్యాయంగా, అవినీతిపరంగా సంపాదించిన డబ్బుతో చేసిన ఆహారం మాకు విష తుల్యం. అది మేము ఎప్పటికీ కూడా స్వీకరించ లేము, స్వీకరించము.
కాని గమ్మత్తైన విషయం ఏమిటంటే ప్రభుశ్రీ ఇంత వివరంగా చెప్పుతున్నప్పటికీ కూడా వారికేమీ అర్థం కాలేదు ఆయన ఏం చెప్పదలచుకున్నారో, ఏం చెప్పారో . అంతా ఏక కాంతంతో ప్రభుశ్రీ ! మీకు రొట్టెలే ఇష్టం అని తెలిసుంటే మేము రొట్టెలే తీసుకుని వచ్చే వాళ్ళం అని ముక్త కంఠంతో అనగా ఆయన వారివైపు చూస్తూ నేను చెప్పింది ఏమిటో మీకు ఏమాత్రమూ అర్థం కాలేదు. నేను మీరు తీసుకొచ్చిన పదార్థాలకి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు, భావాలకి నేను ప్రాముఖ్యత ఇస్తున్నాను. భావ శుద్ధి లేకుండా భోజన శుద్ధి అంటే ఆహార శుద్ధి ఎలా కలుగుతుంది? ఆ విషయాన్ని మీరెవ్వరూ గమనించడం లేదు. నేను చెప్పిన దాన్నిమీరు శ్రద్ధగా ఆలోచించండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. నేను ఈ పదార్థం తియ్యగా ఉందా లేదా అన్నది చూడడం లేదు. మీరు ఎటువంటి భావనతో ఆహారం తయారు చేశారు అన్నది నేను గమనిస్తూ ఉంటాను అని ఆయన వివరిస్తూ ఉండగా బ్రహ్మానంద గారు స్వామి నారాయణ గారి దగ్గరకి పరుగు పరుగున వచ్చారు. ఏమిటండి బ్రహ్మానంద గారూ ! ఇలా పరిగెత్తుకుని వచ్చారు?అని అడిగారు. ప్రభుశ్రీ ! ప్రసాదమేది? దివ్యమైన ప్రసాదం ! భగవంతుడికి చెందవలసిన ప్రసాదం మాకు కూడా ఇవ్వండి. అని చెప్పి స్వామి నారాయణ గారు ఇచ్చినటువంటి జీవన్ భగత్ గారు నైవేద్యంగా సమర్పించిన దాన్ని కొంచెం తీసుకుని తన తోటి మితృలందరికీ, సాధువులందరికీ తలా ఒక ముక్క పంచారు. మిగతా వారంతా సిగ్గుతో తల వంచుకున్నారు.

సమయ దేవత ఇదంతా గమనిస్తూ మరొక్క సారి ఈ మనుష్యుల మూర్ఖత్వం చూసి ఆశ్చర్య పడిపోయింది. ప్రభుశ్రీ ఇంత చక్కగా వారి ఆహారాన్ని ఎందుకు స్వీకరించ లేదో, ఎందుకు జీవన్ భగత్ తెచ్చిన ఆహారాన్ని తానూ స్వీకరిస్తున్నానో వివరించి చెప్పుతున్నా కూడా వారికి ఏమీ అర్థం కాలేదు. ఛ ! ఈ  మ. . . ను . . . ష్యు . . . . లు . ..!      ఎంత మూర్ఖులు కదా ! స్వామి నారాయణ గారి తత్వాన్నే అర్థం చేసుకోలేక పోతున్నారే ! అని కొంత బాధ పడింది.

ఈ విధంగా స్వామి నారాయణ గారు ఆహార శుద్ధి గురించి, భావ శుద్ధి గురించి , నిజాయితీ గురించి తన సహచరులందరికి, తన భక్తులందరికి ఈ రకంగా చెప్పారు.