N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 24 August 2015

SwamiNarayan - Episode 54,

కుశాల్ భట్టు అభ్యర్థన  

కుశాల్ భట్టు గారు రాజు గారి దర్శనానికి లోపలి ప్రవేశిస్తుండగా రాజు గారి చుట్టూ ప్రక్కల ఉండేవాళ్ళంతా మనస్సు విరిచే మాటలు మాట్లాడ సాగారు. కుశాల్ భట్టుగారు చాలా చమత్కారి అని విన్నాము. అయన బ్రహ్మాణుడు కదా ! మిమ్మల్ని బాగా పొగడ్తల్లో ముంచేసి భారీగా దక్షిణలు వసూలు చేసుకుంటాడేమో అని ఒకళ్లూ, ఏమైనా సరే మీరు అతని మాయలో పడకండి అని ఇంకొకళ్ళూ, బ్రాహ్మణులమీద విధించిన పన్ను రద్దు చేయవద్దని ఇంకొకళ్ళూ ఇలా రాజు గారిని ఎగదోయ సాగారు. అప్పుడే లోపలకి వచ్చిన కుశాల్ భట్టుగారు ఈ సంభాషణంతా వింటూ ఏమీ తెలియనట్టుగా మహారాజు గారికి నమస్కారం చేశారు. ఎంతో వినయంగా మహారాజు గారూ ! మీకు మంగళమగు గాక ! అని అనగానే అందరూ ఆయన్ని తేరిపారగా చూడ చూశారు. మహారాజు గారు కూడా ఆయన వైపు గంభీరంగా చూస్తూ ఉండిపోయారు. మెల్ల మెల్లగా రాజు గారిని సమీపించి మళ్ళీ నమస్కరించి ఇంకొకసారి ఆయన్ని మీకు శుభమగు గాక ! అని దీవించాడు. మహా రాజు గారు చాలా కఠిన స్వరంతో ఏం కావాలి? ఎందుకొచ్చావు నీవు? అని అడిగారు.
 

దానికి సమాధానంగా బీదర్ నగరంలో ఉన్న బ్రాహ్మణులు దక్షిణగా స్వీకరి౦చే, దానంగా స్వీకరించే పిండి మీద మీరు విధించిన పన్ను అని చెప్పుతుండగా ఆ పరివారంలో ఉన్న ఒకతను చాలా వెటకారంగా ఆ పన్నును రెట్టింపు చేయమంటారా? అని అనగా అక్కడ ఉన్న మిగతావారందరూ పక పకా నవ్వ సాగారు. ఎంతో ప్రశాంతంగా కుశాల్ భట్టుగారు మహా రాజా ! మీరు ఆ పన్నుని మినహాయించాలి, ఆ పన్నుని రద్దు చేయాలి అనే ఒక అభ్యర్థన తీసుకుని వచ్చాను, దయ చేసి ఆ పన్నుని రద్దు చేయండి అని చెప్పగానే ఆ రాజు గారికి చాలా కోపం వచ్చింది. ఆయన వెంటనే లేచి, “నీవెవరివి నాకు సలహా ఇవ్వడానికి? రాజ్యం నేను చేస్తున్నానా లేక నువ్వు చేస్తున్నావా? ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు నేను చేయవలసి వస్తుంది. వాటి కోసం అయ్యే ఖర్చులని నేనేక్కడనుంచి తీసుకుని రావాలి? అందుకనే ఇటువంటి పన్నులు నేను విధించక తప్పలేదు. వారు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు మీరు దూతగా వచ్చారువారి తరఫున మాట్లాడడానికి. ప్రజా హిత కార్యక్రమాలు చేయాలంటే నేను అప్పు ఎక్కడ్నుంచి కూడా తీసుకోవడం లేదు. మరి నాకు మాత్రం ఎక్కడ్నుంచి వస్తుంది డబ్బు? తెలిసిందా నీకు? అని గద్దించి అడిగారు. కాబట్టి బ్రాహ్మణులంతా ఈ పన్ను తప్పకుండా కట్టాలి. అయినా మీరు వచ్చిన పని ఇంకా ఏమైనా చెప్పాల్సినది ఉందా? అని అడిగారు. ఆనికి కుశాల్ భట్టు వినయంగా మహారాజా ! నేను చెప్పవలసింది ఏమీ లేదు. కానని మహారాజా ! నా మనస్సులో ఒక సందేహం ఉత్పన్నమౌతుంది. అదేమిటంటే మీరు అనుభవించే ఈ భోగాలు, ఆహార పానీయాలు, రుచికరమైన పదార్థాలు, సేవకులు, ఇన్ని ఉండి మరి మీకు ఎలా జీర్ణమవుతున్నాయి? నాకర్థం కావడం లేదు. మీరు ప్రజల యొక్క సేవకులు కదా ! వారిచ్చిన ధనం తోటి, కట్టే పన్నులతోటే కదా మీరు ఇంత ఆడంబరంగా ఉన్నారు మీ చుట్టూ ఉన్న ఈ మధుర పదార్థాలు  ఇవన్నీ ఎక్కడ్నుంచి వస్తున్నాయి అన్న ఆలోచనమాత్రం  నాకు ఉంది. మీ ఆడంబర రాజోచిత దుస్తులకి, ఈ భవనానికి  వీటికి అయ్యే ఖర్చు మీకు ఎవరిస్తున్నారు మహారాజా?  అని ఎంతో ధైర్యంగా అడిగాడు.
ఏమిటీ? ఏం మాట్లాడుతున్నారు మీరసలు? అంటూ హుంకరించిఆ రాజుగారు కుశాల్ భట్టు మీదిమీదికి వచ్చారు. కుశాల్ భట్టుగారు చెక్కు చెదరకుండా బ్రాహ్మణులకి దక్షిణాలు ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది అని మన పెద్దలు చెప్పారు. భగవంతుడు కూడా బ్రాహ్మణులకి దక్షిణ తీసుకునే హక్కుని ఇచ్చాడు. రాజు గారి శక్తి కన్నా భగవంతుడు ఇచ్చే శక్తి చాలా గొప్పది అని నేను గ్రహించాను. కాబట్టి నేను ఆ ఈశ్వరుడినే ప్రార్థిస్తాను. ఈ క్షణ౦ నుంచి మీరు తీసుకునే పానీయాలు, భోజన పదార్థాలు కూడా మీరు తినలేని పరిస్థితిలో ఉంటారు. చూడండి ఆ ఈశ్వర శక్తిని అని ఎంతో ధైర్యంగా చెప్పి కుశాల్ భట్టు గారు ఆ సభ నుంచి నిష్క్రమించారు. రాజావారు కూడా ఇది చూసి నిర్ఘాంత పోయారు. ఇంతవరకు ఎవ్వరు కూడా ఇంట ధైర్యంగా ఆయన ముందు నిలిచి మాట్లాడలేదు. రాజావారు కొంత ఆలోచనలో పడడం వాస్తవమే కాని చుట్టూ ప్రక్కల ఉన్నవాళ్ళు ఆహా ! ఈశ్వరుడు  మీ అన్న పానీయాలని   ఈ బ్రాహ్మణులంతా ఇంతే ఇస్తేనేమో ఆశీర్వాదాలు లేకపోతే శాపాలు. అయినా కుశాల్ భట్టు శాపం పని చేస్తుందా? అంటూ ఒకళ్ళనొకళ్ళు పరిహాసాలు చేసుకుంటూ కుశాల్ భట్టుని నిందించసాగారు.

 కుశాల్ భట్టు గారి ఆర్తి
సభనుంచి బయటకి వచ్చిన కుశాల్ భట్టు గారు బ్రాహ్మణ సమూహాన్ని చేరుకొని ఆ క్షణం నుంచి శ్రీ కృష్ణ పరమాత్ముని విగ్రహం ముందు కూర్చుని భగవాన్ ! మీరు ఇక్కడ ఈ బ్రాహ్మణ సముదాయానికి జరుగుతున్నఅన్యాయాన్ని అరి కట్టండి , వీరి బాధని నివారించండి అని సంకల్పం చెప్పుకుని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. “శ్రీ కృష్ణం శరణం మమ”  అని ఆ బ్రాహ్మణులంతా కూర్చుని ఎంతో భక్తి  శ్రద్ధలతో , ఎంతో ఆర్తిగా శ్రీ కృష్ణున్ని ప్రార్థించ సాగారు. కుశాల్ భట్టు గారు అహర్నిశలూ “శ్రీ కృష్ణం శరణం మమ” అని నామజపం చేస్తుంటారని తెలిసిన ఆ బ్రాహ్మణ సముదాయమంతా , అక్కడ ఆ ఊళ్ళో ఉన్న ప్రజలంతా ఈ భజనలో పాల్గొన్నారు. “శ్రీ కృష్ణం శరణం మమ” అనే ధ్వని దశదిశలా వ్యాపించి ఆకాశమంతా నిండిపోయింది. ఇక్కడ అకస్మాత్తుగా రాజు గారికి కడుపు నొప్పి ప్రారంభమయింది. ఆ నొప్పి భరించలేక ఆయన గట్టిగా ఆర్తనాదాలు చేయ సాగారు. మల మూత్ర విసర్జన కూడా ఆగిపోయింది. ఆయన ఏమీ తినలేక పోతున్నారు. ఆయన నొప్పితో పట్టుపానుపు పైన అటూ ఇటూ దొరల సాగారు. రాజ వైద్యుడు వచ్చి ఆయన నాడీని పరీక్షించి మీకు నేను అద్భుతమైన మందు ఇస్తాను అని చెప్పి మంచి మందు ఇచ్చాడు కాని దానితో రాజుగారి  బాధ ఏమాత్రమూ తగ్గలేదు. అది చూసి ఆ రాజ వైద్యునికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే  ఈ మందు ఏనుగులాంటి పెద్ద పెద్ద జంతువుల నొప్పులు కూడా క్షణంలో పోగొట్టింది మరి ! నా కున్న విజ్ఞానమంతా ఉపయోగించి మందు తయారు చేసి రాజు గారికి ఇచ్చాను ఇంక నా వల్ల కాదు, నన్ను క్షమించండి అని చెప్పి ఆ రాజవైద్యుడు  అక్కడనుంచి వెళ్ళిపోయాడు.  రాజా వారు  మాత్రం నొప్పి భరించలేక  ఇంకా మూలుగుతూనే ఉన్నారు. ఇంకా లాభం లేదని ఆ ఊళ్లోనే ఉన్న ఇంకొక వైద్యుడు హకీమ్ ని తీసుకుని వచ్చారు. ఆయన రాజు గారిని చూసి మీ బాధేమిటీ? అంతా క్షణంలో తగ్గుతుంది. “అల్లా మీకు స్వస్థతని చేకూర్చుతాడు”. మీకు ఒక అద్భుతమైన మందు ఇస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పి  ఆ హకీ౦ ఒక మందు ఇవ్వగా రాజుగారు దాన్ని త్రాగారు. కొంచెం సేపయినాక కూడా రాజుగారి మూలుగులు తగ్గ లేదు పైగా  నాకేమీ నొప్పి తగ్గ లేదు అలాగే ఉంది అని రాజు గారు చెప్పడంతో ఆ హకీ౦ ఆశ్చర్య పోయాడు. ఎంతో మంచి మందు ఇచ్చాను అయిన ఆ మందు మన రాజుగారి మీద ఏమాత్రం పని చేయలేదు, ఇక నేను చేయగలిగింది ఏం లేదు క్షమించండి అని చెప్పి ఆ హకీం ఆ రాజభవనం నుంచి వెళ్ళిపోయాడు. రాజుగారు మరియూ  కుశాల్ భట్టు మధ్య జరిగిన సంభాషణ, రాజుగారి అనారోగ్యం,రాజవైద్యుడు కాని హకీం కాని ఆ జబ్బుని నయం చేయలేక పోవడం  ఈ వార్త  ఆ రాజ్యంలో వ్యాపించి ప్రజలందరూ ఏమవుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు “రాజుగారికి ఒంట్లో బాగా లేదట, ఈ రోజు కూడా ఆస్థానానికి రాలేదుట, నిన్న కూడా రాలేదుట” అని ఒకళ్ళతో ఒకళ్ళు గుసగుసలు చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా కుశాల్ భట్టు గారు చేస్తున్న భజన చూడడానికి వెళ్లి ప్రేక్షకులుగా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు.

గంభీర సింగ్ రాజు గారి అహంకారం ఏమాత్రం తగ్గలేదు. ఆయన రాజ్యంలో దండోరా వేయించాడు. ప్రతి గ్రామంలో, పట్టణంలో డప్పులు కొట్టుకుంటూ “మన రాజుగారైన గంభీర సింగ్ గారికి ఎవరైనా వైద్యం చేసి ఆయన నొప్పిని కనక తగ్గించితే వారికి 5 బంగారు నాణాలు బహుకరించబడును” అని అన్ని వీధుల్లో తిరిగి దండోరా వేశారు. అక్కడ ఉన్న ప్రముఖులందరూ మన రాజుగారిని ఎవరూ నయం చేయలేరు , ఆయన బాధని ఎవరూ తగ్గించ లేరు , ఆయన బాగుపడరు అని అన్నారు. ఎందుకు నయం కాదు, ఎందుకు ఆయన జబ్బుని ఎవరూ తగ్గించలేరు? అని ప్రశ్నించగా  మరి ఆయన స్వయంగా కుశాల్ భట్టుగారితోనే వైరం పెట్టుకున్నారు కదా అందుకు అని జవాబిచ్చాడు. ఇక్కడ రాత్రింబవళ్ళు “శ్రీకృష్ణం మమ శరణం” అనే జపం సాగుతూనే ఉంది.

మాంత్రికులు, తాంత్రికులు, వైద్యులు మొదలైన వారనదరూ మహారాజైన గంభీర్ సింగ్ గారి జబ్బు తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అయినా ఏమీ లాభం లేకపోయింది ఆయన జబ్బు ఏమాత్రం తగ్గలేదు. పైగా ఆయన ఆర్తనాదాలు రోదన క్రింద మారిపోయాయి. ఆయన రాత్రింబవళ్ళూ బాధతో మెలికలు తిరిగిపోతూ, ఏడుస్తూ ఆర్తనాదాలు చేయసాగారు. ఈ విధంగా వారం రోజులు గడిచిపోయాయి. ఏడవరోజు మహారాజు గారు ముక్కుతూ, మూలుగుతూ అయ్యో ! 7 రోజులు అయిపోయినాయి. నా శరీరంలోనికి ఏవీ వెళ్ళడం లేదు, బయటకి ఏవీ రావడం లేదు. అయినా బయటకి వెళ్ళడానికి నా ప్రాణాలు తప్ప ఇంకా ఏమున్నాయి అని అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగారు. అప్పుడు ప్రక్కనే ఉన్న మహారాణి గారు మహారాజా ! మీరు ఇంతగా బాధ పడుతున్నారు. గుర్తు తెచ్చుకోండి మీరు కుశాల్ భట్టుగారితో వైరం తెచ్చుకున్నారు. ఆయనతో వైరం పెట్టుకోవడం అంటే భగవంతునితో వైరం పెట్టుకున్నట్లే. అమాయకులైన బ్రాహ్మణులమీద అన్యాయంగా మీరు పన్ను విధించారు. కుశాల్  భట్టు గారు చెప్పినా మీరు వినిపించుకోలేదు” అని అన్నారు. అప్పుడు వెంటనే మహారాజుగారికి కుశాల్  భట్టు గారి మాటలు, ఆయన పెట్టిన శాపం “మహారాజా! మహారాజుల శక్తి కన్నా  భగవంతుని శక్తి గొప్పది. అటువంటి భగవంతున్నేనేను ప్రార్థిస్తున్నాను.

ఇప్పట్నుంచి మీకు ఆహార పానీయాలు తీసుకోవడం అసాధ్యమవుతుంది” గుర్తుకి వచ్చిఆయనలో పశ్చాత్తాపం కలిగింది. మహారాణి ! నేను మీరు చెప్పినట్లే చేస్తాను. ఈ  బాధను భరించలేక పోతున్నాను. ఈ క్షణం నుంచే ఆ పన్నుని రద్దు చేస్తున్నట్టుగా దండోరా వేయిస్తాను అని చెప్పి ఆజ్ఞ జారీ చేశారు. వీధి వీధినా, ప్రతి గ్రామంలో “ బ్రాహ్మణోత్తములారా ! వినండి మీకు మంచి జరిగే సూచనని మహారాజు గారు ఉత్తరువు జారీ చేశారు. మీరు యాచించే ధనమ్మీద విధించిన పన్నుని రద్దు చేశారు, ఇక ముందెప్పుడూ మీ యాచక వృత్తి మీద పన్ను విధించడం జరగదు” అంటూ దండోరా చేశారు. ఇది విన్న బ్రాహ్మణ సమూహమంతా ఎంతో సంతోషించారు. వార౦తా కుశాల్ భట్టు గారితో మీరు చేసిన ప్రార్థనల వల్లే మాకు ఇంత మేలు కలిగింది అని అన్నారు. దానికి కుశాల్ భట్టు గారు నేనెవరినీ ఇంత పని చేయడానికి? అంత సామర్థ్యం నాకెక్కడ ఉంది? ఇదంతా ఆ కృష్ణ పరమాత్ముని యొక్క లీలయే. అదే మనని కాపాడింది. ఎప్పుడైతే మనం నిష్కల్మష మనస్సుతో, భక్తితో, మంచి సంకల్పంతో మంచి పని కోసం భగవంతున్ని ప్రార్థిస్తామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మన కోరికను తీరుస్తాడు” అని చెప్పారు. అందరు కూడా భక్తి- శ్రద్ధలతో శ్రీకృష్ణునికి జయజయధ్వానాలు చేశారు.

పశ్చాత్తాపం- రాజ సత్కారం
ఎప్పుడైతే ఈ దండోరా వేయించారో అప్పుడు వెంటనే మహారాజైన గంభీర సింగ్ గారి కడుపునొప్పి పూర్తిగా  నయమై పోయి స్వస్థత చేకూరింది. మహారాణి గారు, మిగతా పరివారమంతా ఎంతో సంతోషించారు. తానూ చాలా పొరబాటు చేశానని ఆయన పశ్చాత్తాపం చెందాడు. మహారాజు గారు కుశాల్ భట్టు గారిని తన దగ్గరకు తీసుకుని వచ్చి తనని క్షమించమని ప్రార్థించారు. అంటే కాకుండా ఆయనకి ఎన్నో బహుమానాలు ఇచ్చి, ఉండడానికి ఒక రాజప్రాసాదం ఏర్పాటు చేస్తాను స్వీకరించండి అని ప్రాధేయ పడ్డారు. కాని కుశాల్ భట్టుగారు దాన్ని తిరస్కరించారు. రాజుగారిని పూర్తిగా క్షమించారు. అంతే కాకుండా ఆ రాజ్యంలో ఉన్న కరువు కాటక పరిస్థితులని ఆయన సరిదిద్దారు. సంతానం లేని ఆ రాజు గారికి సత్సంతానం కలిగేటట్టుగా ఆశీర్వదించారు. త్వరలోనే గంభీర సింగ్ మహారాజుగారికి సుపుత్రుడు జన్మించాడు.
విన్నావా గంగమ్మా కుశాల్  భట్టు గారి సంగతులు . అతను ఒక యోగే కాదు , మహాత్ముడు . అయన రాజు గారు ఇచ్చిన బహుమానాలన్నీ తిరస్కరించారు. ఎప్పుడు లోక కల్యాణం కోసమే పాటు పడ్డారు. తల్లిదండ్రులు ఎంత ప్రాధేయ పడ్డా ఆయన వివాహం చేసుకోలేదు.

గృహ త్యాగం 
స్వామి నారాయణ గారు ఇంకా ఇలా చెప్ప సాగారు. ఎంత చెప్పినా కూడా కుశాల్ భట్టు గారు వివాహం చేసుకోడానికి అంగీకరించలేదు. ఆయన ఒక రోజు తల్లిదండ్రులకి చెప్పకుండా వారికి నమస్కారం చేసి గృహ త్యాగం చేశారు. తల్లిదండ్రులు ఆయన కోసం ఊరంతా వెదికారు. ఇలా కుశాల్ భట్టు గారు  గృహ త్యాగం చేయడం ఇది మొదటిసారి కాదు రెండవసారి. అందరూ కూడా చుట్టుప్రక్కల ఉన్న అన్ని గ్రామాలు వెతికారు. ఇలా కుమారునికోసం వెతుకుతూ ఉంటె “మీ పుత్రుడు ఇక్కడ మహాదేవుని ఆలయంలో పూజ, జపం  చేసుకుంటున్నాడు” అని ఠాకూర్ గారు కబురు చేసారు. వారంతా హుటాహుటిగా బయలు దేరి మహాదేవుని ఆలయానికి వెళ్లి అక్కడ ధ్యాన స్థితిలో ఉండి “ఓం నమఃశివాయ” అంటూ జపం చేసుకుంటున్న కుశాల్ భట్టుగారిని చూసిన ఆ తల్లి దండ్రులు వెళ్లి ఆయన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. నాయనా కుశాల్ ! పద ! మనం ఇంటికి వెళ్ళదామని అన్నారు. దానికి సమాధానంగా కుశాల్ భట్టు గారు తండ్రీ ! నాకు ఈ సంసారం , సంతానం పట్ల కొంచం కూడా ఆసక్తి లేదు. నా సోదరుడు ఇచ్చారాం  ఉన్నాడు కదా కాబట్టి నన్ను వదిలివేయండి.

ఈ సంసార ఝంజాటంలో పడదలచుకోలేదు అని సమాధానం చెప్పారు. నాయనా ! ఇలా తల్లిదండ్రులని  బాధించి, కాదని ఇల్లు విడిచి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడంలో ఏం ఫలితముంది చెప్పు. తల్లిదండ్రులని బాధించి నీవేం సాధిస్తావు ? అని తండ్రిగారు అడిగారు. ప్రక్కనే ఉన్న ఠాకూర్ గారు కూడా కుశాల్ ! తల్లి దండ్రులని బాధ పెట్టి నీ లక్ష్య సాధన కోసం నీవు వెళ్ళుతున్నావు దానిలో ఏం ప్రయోజనముంది? అని అడిగారు. దానికి కొద్దిగా ఆలోచించి కుశాల్ భట్టు గారు సరే ! మనం కొంచెం కందమూలాలు ఏవో తిని తర్వాత ఇంటికి వెళ్ళదామని అనుకుని అవి తిన్నాక బయల్దేరి ఇంటికి వెళ్ళారు. తల్లిదండ్రుల కోరిక మీద  వివాహం చేసుకుని గృహస్థుల య్యారు . వారికి ఒక పుత్రిక కూడా కలిగింది. ఈ విధంగా కుశాల్ తన తల్లిదండ్ర్రుల మాట జవదాటలేదు.పుత్రుడి ధర్మాన్ని చక్కగా నిర్వహించారు. ఒకసారి వారి తండ్రి మోతీలాల్ తీవ్రంగా జబ్బుపడి మరణావస్థలో ఉంటే కేవలం కుశాల్ భట్టు గారి హస్త స్పర్శతో ఆయనకి స్వస్థత చేకూర్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకి కుశాల్ భట్టు గారు తీవ్రమైన వైరాగ్యంతో ఆ గ్రామస్థులందరికి వీడ్కోలు చెప్పి ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాని ఈసారి మాత్రం ఆయన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. గంగమ్మా ! ఇది కుశాల్ భట్టుగారి జీవిత చరిత్ర. ఆయన నిస్వార్థంగా లోక కల్యాణం కోసం, లోకోద్ధారం కోసం తన శక్తినంతా ధారపోశారు. ఇటువంటి మనిషి ప్రక్కన కూర్చునే భాగ్యం ఎంతమందికి దొరుకుతుంది చెప్పు గంగమ్మా ! అది నా అదృష్టం కాదా అని అంటూ ఆయన కథలన్నీ చెప్పాక అవి విని గంగమ్మ ఎంతో ఆశ్చర్యపడిపోయింది. అది చూసి సమయదేవతలు కూడా ఈ వింత దృశ్యాన్ని చూసి స్వామి నారాయణ గారిని ఎంతో మెచ్చుకోసాగారు. ఆహా ! మనుష్యుల తత్త్వం అంటే ఇది. ఆయన ఎంత చక్కగా వాళ్లకి బోధించారు. ఈ మనుష్యులు భగవంతున్ని పూజిస్తూ ఉంటారు. భగవంతుని గుణగణాలు పొగుడుతూ ఉంటారు. నానా రకాలుగా ప్రార్థిస్తూ ఉంటారు. ఇదేమిటీ ఇక్కడ సాక్షాత్తు నరనారాయణుడి అవతారం,సాక్షాత్తు శ్రీ కృష్ణుని అవతారమైనట్టి శ్రీ స్వామి నారాయణ గారు తన భక్తుడైన ఒక మానవుని గురించి ఇంత వివరంగా పూస గుచ్చినట్టుగా గంగమ్మకి చెప్పడం అనేది ఎప్పుడూ జరగలేదు ఇది మొట్టమొదటిసారి కదా ! భగవంతుడు అంటే ఎన్నో నిర్వచనాలు చెప్పుకుంటారు ఎన్నో రకాలుగా వర్ణిస్తూ ఉంటారు. కాని నిజంగా భగవంతుని తత్వాన్ని స్వామి నారాయణ గారు వీరికి ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు చేశారు. ఇప్పుడైనా ఈ కథను విన్న ముందు తరం వాళ్ళు భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటారేమో అని అనుకున్నారు. చమర్చిన కళ్ళతోభక్తి భావంతో గంగమ్మ ఉండ౦డి ఒక్క క్షణంలో మీకోసం ఉచితాసనంభోజనం తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది. భగవాన్ స్వామి నారాయణ గారు కుశాల్ భట్టు గారి ప్రక్కనే కూర్చుని భోజనం చేశారు.    

తర్వాత ఆయన వెళ్లి పోయే సమయం వచ్చేసరికి గంగమ్మ కన్నీరు కారుస్తూ భగవాన్ ! మీరు వెళ్ళిపోతున్నారుఇప్పుడు నేనెవరికి పూజ చేసుకోవాలిఅని ప్రశ్నించగా ఆయన నవ్వుతూ ఆ ప్రక్కనే ఉన్న శ్రీ కృష్ణ పరమాత్ముని ప్రతిమను చూపిస్తూ "నేనెక్కడికి పోతున్నానమ్మాఇక్కడే ఉన్నాను నీవు పూజ చేసుకోవచ్చును కదా!" అని జవాబిచ్చారు. "మళ్ళీ నేను తిరిగి వచ్చేంతవరకు నీవు ఈయన్ని పూజ చేస్తూ ఉండవచ్చు  అని అన్నారు. భక్తికి ఒక భాష అంటూ ఉండదు.దేవుని పట్ల భక్తుడు తన భక్తిని ఎన్నో రకాలుగా ప్రకటించ వచ్చును అంతే కదా గంగమ్మా! " అని ఆయన తన పరివారంతో అక్కడనుంచి నిష్క్రమించారు.ఇక్కడ గంగమ్మ ఎంతో బాధతో ఆయనకి వీడ్కోలు ఇచ్చింది. యథాప్రకారంగా శ్రీ కృష్ణ భగవానుని ప్రతిమకి పూజ చేశాక ఆవిడ నైవేద్యాన్ని సమర్పించింది. కళ్లు మూసుకుని రకరకాలుగా స్తుతించాక ఆవిడ  కళ్లు తెరిచి ఆ ప్రతిమకి నమస్కారం చేస్తుండగా ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. స్వామి వారికి నైవేద్యంగా పెట్టిన ఆ ప్రసాదం అంతర్ధానమై పోయింది. స్వామి నారాయణ గారు తానూ చెప్పినట్లే ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ విధంగా గంగమ్మని స్వామి వారు కటాక్షించారు.