N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Wednesday, 7 October 2015

SwamiNarayan - Episode 56


అహ్మదాబాదు వర్తకుల ఫిర్యాదు రాజావారి కుట్ర

ఆ మర్నాడు స్వామి నారాయణ గారు అనుకున్న ప్రకారంగా తన అనుచరులతోపాటు ఆ పీష్వా రాజా గారిని కలుసుకోడానికి బయల్దేరారు. రాజభవనానికి చేరుకోగానే అక్కడ ఉన్న సైనికులు మీరందరూ ఇక్కడే ఉండండి, లోపలకి వెళ్ళడానికి వీల్లేదు , స్వామి వారు ఒక్కరే లోపలకి వెళ్తారు, ఇది రాజావారి ఆజ్ఞ అంటూ వారిని అడ్డగించారు. సరేనని స్వామి నారాయణ గారు ఒక్కరే లోపలకి ప్రవేశించారు. శిష్యులంతా చాలా ఆందోళనలో పడిపోయారు. ప్రభుశ్రీ ఒక్కరే వెళ్ళారు, ఏ ఆపదలో పడిపోతారో అంటూమనస్సులో  చాలా మధన పడసాగారు. స్వామి నారాయణ గారు ఒక్కరే లోపల ప్రవేశించాక ఒక అధికారిని కలిశారు. ఆయన స్వామి నారాయణ గారిని సాదర౦గా ఆహ్వానించారు. ఇంతలో పీష్వా గారు స్వామి నారాయణ గారి దగ్గరకి వచ్చి మీరు ఈ నగరంలో ప్రవేశించే ముందు ఇక్కడ అధికార్ల దగ్గర్నుంచి అనుమతి పత్రం తీసుకున్నారా?” అని అడిగారు.  


దానికి సమాధానంగా స్వామి నారాయణ గారు మాకు ఈ నగరంలో చాలా మంది అనుచరులున్నారు. మా గురువైన శ్రీ రామానంద స్వామి వారు ఈ పట్టణానికి ఎన్నో సార్లు వచ్చారు. కాని ఎప్పుడు కూడా ఈ అనుమతి పత్రాల ప్రసక్తి రాలేదు, ఎప్పుడూ తీసుకోలేదు అని చెప్పారు. “అయితే మీరు ఇక్కడే ఉండండి” అని పీష్వాగారు అన్నారు. “అది అసంభవం” అని స్వామి నారాయణ గారు అనడంతో ఆ పీష్వా గారు వెనక్కి తగ్గి సరే ! ఈ చర్చలన్నీ ఇప్పుడు అనవసరం. మీరు రండి, నేను మీ కోసం ప్రత్యేకమైన ఆసనాన్ని ఏర్పాటు చేశాను ఆసీనులు కండి అని అన్నారు. నాకోసం అంత ప్రత్యేకంగా ఆసనం ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? నేను మామూలు వ్యక్తినే కదా ! మీరేమో మహారాజులు!” అని అన్నారు. “మీలాంటి పెద్దవారిని గౌరవించడ౦ మా కర్తవ్యం కదా!” అని పీష్వా గారు అంటే “అవును, మీలాంటి వారి మనస్సులోని భావనలను గమనించి మెసలుకోవడం మరి మా కర్తవ్యం కదా!” అని స్వామి నారాయణ గారు సమాధానం చెప్తూ ఆ సింహాసనం వైపు నడవసాగారు.

అక్కడ వర్తకులంతా చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్లిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ స్వామి నారాయణ గారి శిష్యులలో ఆందోళన పెరిగి వాళ్ళు ఆ భటులని త్రోసివేసి లోపలకి పరిగెత్తుకుంటూ స్వామి నారాయణ గారి దగ్గరకి రాసాగారు.  

అక్కడ స్వామి నారాయణ గారు మెట్లెక్కి ఆ సింహాసనం మీద ఎప్పుడు కూర్చుంటారా, ఆయన ఎప్పుడు ఆ సింహాసనం క్రింద ఉన్న బావిలో పడిపోతారా అని వర్తకులందరు ఎదురు చూస్తున్నారు. ఆ సమమయంలో స్వామి నారాయణ గారి శిష్యులు రానే వచ్చారు. ప్రభుశ్రీ ! దయ చేసి మీరు ఆ ఆసనంలో కూర్చోవద్దు’’ అని చెప్పారు. ఆ మాటలకి ఆ వర్తక సమూహంతో పాటు పీష్వా గారు కూడా ఉలిక్కిపడ్డారు. “ఎందుకు ప్రభుశ్రీ సింహాసనం మీద కూర్చోవద్దు? మేమెంతో కష్టపడి, ఎంతో ప్రేమతో ఆయనకి ఈ  సింహాసనం ఏర్పాటు చేశాము” అని ప్రశ్నించగా “ స్వామి నారాయణ గారు భక్తుల హృదయ సింహాసనం మీద విరాజిల్లుతూనే ఉన్నారు.

దాని ముందు ఈ సింహాసనం ఏపాటి?” అని తెలివిగా ఆ శిష్యుడు సమాధానం చెప్పాడు. వారికి ఈ సింహాసనం మీద కూర్చోవాలనే వ్యామోహం లేదు, ఈ సింహాసనం తాత్కాలికమే. కాని ఈ సింహాసనం కన్నా స్వామి వారు భక్తుల హృదయ సింహాసనాల మీద కూర్చుని ఉన్నారే  ఆ సింహాసనాలే శాశ్వతం” అని వివరించాడు. దానికి పీష్వా గారు “ కేవలం ఈ సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన ఆ సింహాసన౦ యొక్క ప్రాముఖ్యత తగ్గదు కదా !” అని స్వామి నారాయణ గారి వైపు తిరిగి “ప్రభుశ్రీ ! మీరు ఈ సింహాసనం మీద కూర్చోండి” అని మరొక్క సారి అభ్యర్థించారు. ఇటు స్వామి నారాయణ గారి శిష్యులు వద్దని, పీష్వా గారు కూర్చోమని అంటుండగా స్వామి నారాయణ గారు నవ్వి , “సరే ! మనం మధ్య మార్గంగా ఒక పని చేద్దాం. దాని వల్ల పీష్వా గారి మాట విన్నట్టుగా ఉంటుంది, మా శిష్యుల మాట కూడా మన్ని౦చినట్టుగా ఉంటుంది మధ్య మార్గంగా నేను ఉపాయం చెప్తాను” అని ఆయన మెల్లగా మెట్లెక్కి ఆ సింహాసనం వైపు వెళ్ళసాగారు . ఏం జరగబోతుందో అన్నది ఆ వర్తక సమూహానికి ముందే తెలుసు కాబట్టి వాళ్ళంతా చాలా ఆత్రుతగా ఉన్నారు. స్వామి నారాయణ గారి శిష్యులు కూడా స్వామి వారు ఏ మధ్య మార్గం అవలంబించబోతున్నారు అనే ఆలోచనలతో వారి వైపే చూస్తూ ఉన్నారు. స్వామి నారాయణ గారు చివరి మెట్టు దాకా వెళ్ళారు. అందరూ ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందా? అని చూస్తున్నారు. స్వామి నారాయణ గారు పీష్వా గారని తదేకంగా చూశారు. అలాగే ఆయన చూపు ఆ వర్తక సమూహం మీద కూడా పడింది. వాళ్ళందరినీ సాలోచనగా చూస్తూ, ముఖ్యంగా పీష్వా గారిని తదేకంగా చూస్తూ ఆయన తన చేతిలోని కఱ్ఱని సింహాసనం మీద పెట్టి గట్టిగా నొక్కారు. అంతే  ......... ! అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఆ వెదురుకఱ్ఱతో సహా ఆ సింహాసనం  చప్పుడు చేస్తూ దభేలుమని ఆ కూపంలో పడిపోయింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడి పోయారు. స్వామి నారాయణ గారి శిష్యుడు ఊపిరి పీల్చుకున్నాడు.

స్వామి నారాయణ గారి శిష్యుని ఆగ్రహం – స్వామి వారి శపథం

పాప౦ ! ఈ పరిణామానికి అందరూ హడలి పోయారు. ఎవ్వరికీ నోట మాట రాక, నిశ్చేష్టులై  ప్రతిమల్లాగా నిల్చుండిపోయారు. వర్తక సమూహం సిగ్గుతో తల ది౦చుకున్నారు. ఈ సంఘటనకి ఏవిధంగా స్పందించాలో వారికి అర్థం కాలేదు. స్వామి నారాయణ గారి శిష్యుడు మాత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు. చాలా క్రోధంగా “ పీష్వా గారూ ! ఇదేనా మీరు చేయాల్సిన మర్యాద ? స్వామి వారిని హత్య చేసే పన్నాగం పన్నుతారా? అందుకేనా స్వామి వారిని ఒంటరిగా రమ్మని మీరు బలవంతం చేశారు, మమ్మల్నందరినీ ప్రవేశ ద్వారం దగ్గరే ఆపి వేశారు. మీరు ఇంత నీచమైన హత్యాప్రయత్నం చేస్తారని మాకు ముందు నుంచే అనుమానంగా ఉండాలి. అందుకనే మేము కూడా స్వామి వారితో పాటు ఉంటామని చెప్పవలసి వచ్చింది. ఇంత నీచమైన పని చేసినందు వల్ల మీకేం లాభం? ఇంత ఘోరమైన కృత్యానికి  పాలుబడతారా? పీష్వాగారూ ! అసలు మీ గురించి  మీరే౦ అనుకుంటున్నారు? మీరు నిధిపతే కాని అధిపతి కారు. మీ దగ్గర డబ్బు ఉండవచ్చు. కాని అది అశాశ్వతం. నిజపతి సాక్షాత్తు భగవాన్  శ్రీస్వామి నారాయణే. నిజపతి అయిన ఈశ్వరుడే నిధిపతి అయిన మిమ్మల్ని  శిక్షించగల శక్తి ఉన్నవాడు. నేను మిమ్మల్ని దండి౦చబోతున్నాను. నేను మీ అందరినీ ఆ భగవంతుని శక్తితో  సర్వ నాశనం చేయగలను, ఈ క్షణమే నేను మీకు ఘోరమైన శాపం ఇవ్వబోతున్నాను”  అని ఆగ్రహంతో ఊగిపోతూ శాపం ఇవ్వబోతుండగా స్వామి నారాయణ గారు జోక్యం చేసుకుని “దేవానంద గారూ ! ఒక్క క్షణం ఆగండి. మహారాజు గారు దోషో, నిర్దోషో అన్న సంగతి నిజపతి చూసుకుంటారు. ఇది ఆయన కర్తవ్యం. దయ చేసి నీవు ఇందులో జోక్యం చేసుకోవద్దు. మహా రాజు గారికి శాపం ఇవ్వవద్దు. సాక్షాత్తు ఆ భగవంతుని మీదే నిర్ణయం ఆధార పడిఉంది. ఏ శిక్ష వేయాలో అన్నది ఆయనే చూసుకుంటారు.” అని శిష్యుణ్ణి సమాధాన పరిచారు.

“పీష్వాగారూ ! మీకు ఈ మాత్రం కూడా తెలియదా? అన్నిటికీ సాక్షిభూతుడైన ఆ భగవంతుడే మీరు చేస్తున్న ఈ పాప కృత్యాలన్నీ గమనిస్తూ ఉంటాడని మీరు గ్రహించ లేరా? నా లాంటి వారితోనే మీరే ధూర్త వ్యవహారం  నడుపుతారా?మీ రాజ్యంలో ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, జరుగుతున్నాయి. మీ శక్తిని ఉపయోగించి ఆ కృత్యాలన్నింటినీ అరికట్టాలి కాని మా లాంటి సాధువుల మీద ఉపయోగించడానికి కాదు. ఎవరైతే ప్రజలని ధర్మ మార్గంలో నడిపించడానికి పాటు పడుతున్నారో, సదాచారాలని నేర్పుతున్నారో, ప్రజలని వ్యసనముక్తుల్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారో, అలాంటి మమ్మల్ని చంపించడానికి ప్రయత్నం చేస్తారా? మిమ్మల్ని భగవంతుడు కూడా ఎప్పటికీ  క్షమించడు, మీకు తప్పకుండా తగిన శిక్ష విధిస్తాడు” అని స్వామి నారాయణ గారు ఆ పీష్వాతో అన్నారు. ఆ ధూర్తులకి, పీష్వాగారికి చాలా కోపం వచ్చింది, అహంకారం ఏమాత్రం తగ్గలేదు. ఆయన  స్వామి నారాయణ తో “ నేను ఇక్కడ మహారాజుని , తక్షణమే మిమ్మల్ని మా నగరం నుంచి బహిష్కారం చేస్తున్నాను. మీరు కనుక అహ్మదాబాదుకు వస్తే మృత్యుదండన విధిస్తున్నాను. కాబట్టి మీరు మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపొండి. మీరు మా అహ్మదాబాదు నగరాన్ని తిరిగి చూడడానికి వీల్లేదు” అని తీవ్రమైన స్వరంతో చాలా అవమానంగా మాట్లాడారు. పీష్వాగారి మాటలకి స్వామి నారాయణగారి శిష్యుడికి కోపం వచ్చింది కాని ఆయన గురువుగారి ఆజ్ఞననుసరించి ఏమీ మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు.

“మహారాజా !  మీరు చెప్పినట్లే నేను ఈ అహ్మదాబాదు విడిచి పెట్టి వెళ్ళిపోతాను. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఈ అహ్మదాబాదు భూమిని, ప్రజలని మీరు సరిగ్గా గుర్తించే ప్రయత్నం చేయండి. ఇక్కడ భూమికి, మనుష్యులకి సహన శక్తి ఎంత ఉందో అవసరం వస్తే  మీలాంటి వారిని కూకటి వేళ్ళతో సహా పెరికి పారేయగల శక్తి కూడా ఉంది. నేను మీ ధాత్రికి రాకుండా ఎన్ని రోజులు మీరు నన్ను  నిరోధించగలరు?” అని స్వామి నారాయణ గారు ప్రశ్నించారు. ‘’నేను ఈ దేశానికి  మహారాజుగా ఉన్నంత కాలం నిన్ను ఇక్కడకి రానివ్వను” అని పీష్వాగారు అహంకారంగా సమాధానం  చెప్పారు. స్వామి నారాయణ గారు కాసేపు మౌనం వహించి శిష్యులతో “పదండి, వెళ్ళిపోదాం” అని అక్కడ్నుంచి  మౌనంగా వెళ్ళిపోయారు.

స్వామి నారాయణ గారు వెళ్ళిపోగానే అక్కడున్న ధూర్తులందరూ వికటాట్టహాసం చేస్తూ, “అతని అదృష్టం బాగుంది కాబట్టి మృత్యువాత నుంచి తప్పించుకుని  ఇక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఒక మంచి పని జరిగింది. ఇంక మళ్ళీ ఆయనకి అహ్మదాబాదు వైపు తిరిగి చూడడానికి కూడా ధైర్యం ఉండదు. మనం హాయిగా మన వ్యాపారాలు చేసుకుంటూ ఉండవచ్చును. మనకి ఇంకా అడ్డే లేదు” అంటూ నవ్వుకోసాగారు. అహ్మదాబాదులోని స్వామి నారాయణ గారి శిష్యులు, భక్తులు, అనుచరులందరూ ఆయన దగ్గరకి వచ్చి, “ప్రభుశ్రీ ! మీరింత తొందరగా అర్థాంతరంగా వెళ్ళిపోతున్నారు. మేము తలచుకుంటే తిరుగుబాటు చేసి ఆ పీష్వాగారితో యుద్ధం చేయగలం. మళ్ళీ మీరు ఎప్పుడు ఈ భూమికి మీ పాద స్పర్శని అనుగ్రహిస్తారో తెలియదు కదా!” అని ఎంతో విచారంతో ఆయనకి చెప్పారు. “ఇక్కడ్నుంచి వెళ్లి పోవడంలో అర్థం ఏమిటీ? మళ్ళీ రావడమే కదా ! నేను ఇక్కడ్నుంచి మళ్ళీ రావడానికే వెళ్తున్నాను” అంటూ మర్మగర్భంగా చెప్పారు. మీరు ఎంతకాలం ఇక్కడకి రాకుండా ఉంటారు? అని వాళ్ళు అడిగినప్పుడు, “మీకు తెలుసు కదా ! పీష్వా గారి రాజ్యాధికారం ఉన్న౦త కాలం నేను వేచి ఉండక తప్పదు” అని స్వామి నారాయణ గారు సమాధానం చెప్పారు.

 “స్వామీ! అది ఎంత కాలానికి అవుతుంది?” అని ఒక అనుచరుడు అడగ్గా  “ నేను త్వరలోనే వస్తాను” అని సమాధానం చెప్పారు. నేను సరిగ్గా ఒక నెల తర్వాత వస్తాను” అని వాగ్దానం చేసి తన శిష్యబృందంతో అక్కడనుంచి వెళ్ళిపోయారు.