N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Sunday, 1 November 2015

SwamiNarayan - Episode 58

జోగన్ పాగి  - బందిపోటు దొంగ – అతని పథకం (continuati౦n of 57th Episode)

గుఱ్ఱాన్ని దొంగిలించాలనే ఉద్దేశంతో జోగన్ పాగీ ఆ శాంతియజ్ఞానికి మారువేషంలో వచ్చి ఆ జనంలో కలిసిపోయాడు. అప్పుడే స్వామి నారాయణ గారి సమక్షంలో ఆయన శిష్యుడు ప్రవచనాలని చెప్తున్నాడు. మనుష్యుడు తనకు ఏదో కావాలని, అది పొందినందు వల్ల ఏదో శాంతి కలుగుతుందని భగవంతుని ప్రార్థనలు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తాడు. ఒక వేళ అతనికి కావలసి౦ది కనుక  లభించితే ఈశ్వరుడు తన మీద దయ చూపాడు అని అనుకుంటాడు లేనిపక్షంలో  ఈశ్వరుడు తన మీద అనుగ్రహం చూపలేదని భావిస్తూ ఉంటాడు. తానూ పొందలేని దానికోసం బాధ పడుతూ ఉంటాడు. దేవుడ్ని నిందిస్తూ ఉంటాడు. కాని నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా అసత్యాలే. తాను ఏం పొందితే సుఖంగా ఉంటాడో, ఏది పొందకపోతే బాధ పడతాడో తనకి ఏం కావాలో, ఏం వద్దో ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉంటాడు. ఒకప్పుడు ఇష్టమైనది మరొకప్పుడు అయిష్టంగా ఉండవచ్చును. 


అయితే భగవంతుడు తన భక్తునికి ఏది శ్రేష్టమో దాన్ని మాత్రమే ప్రసాదిస్తూ ఉంటాడు. దానివల్లే మానవులకు శాశ్వత సుఖం, శాంతి లభిస్తూ ఉంటాయి అని ఈ విధంగా స్వామి నారాయణ గారి శిష్యుడు ప్రవచనాలు చెప్తుంటే ఇక్కడ ఈ దొంగ జోగన్ పాగి మెల్లగా స్వామి నారాయణ గారి శిష్యులతో పరిచయం పెంచుకున్నాడు “జై స్వామి నారాయణ” అంటూ. ఎలాగైనా సరే ప్రభుశ్రీ పాదస్పర్శ కలగాలని అనుకుంటున్నాను అని ఒక శిష్యుడితో  చెప్పాడు. ఇంత దూరం నుంచి ఆయన్ని చూడడమే అతి కష్టంగా ఉంది. పైగా అంతమంది జనాల్ని త్రోసుకుంటూ ఆయన దగ్గరకి వెళ్లి ఆయన పాదాల్ని స్పర్శించడం అంతకన్నా కష్టం అని ఆ శిష్యుడు సమాధానం చెప్పాడు. నా ప్రయత్నం నేను చేస్తాను . ఎంతవరకు నేను ముందుకి  వెళ్ళగలనో, ఆ స్వామి వారి దయ నా మీద ఎప్పుడు పడుతుందో చూస్తాను అని చెప్పి జనాల్ని త్రోసుకుంటూ జోగన్ పాగి ముందుకి చొచ్చుకుని పోసాగాడు.

మాణిక్ - గురుదేవుల వారి వాహనం- అశ్వం

ఆ యజ్ఞాన్ని చూడడానికి గురుదేవుల గ్రామం నుంచి చాలామంది శ్రీమంతులు, గ్రామాధికారులు, సామాన్య జనులు ఎంతోమంది విచ్చేశారు. ప్రతివాళ్ళు వాళ్ళ గుఱ్ఱాలతో అక్కడకి వచ్చారు. ఈ గుఱ్ఱాల కోసం ప్రత్యేకంగా గుడారాలను వేయించి కాపలదార్లను నియోగించారు. జోగన్ పాగి ఆరాలు తీసుకుంటూ ఆ గుడారాలవైపు వెళ్ళాడు. అయితే అన్ని గుఱ్ఱాల మధ్యలో మాణిక్ ని అంటే స్వామి నారాయణ గారి గుఱ్ఱాన్ని గుర్తు పట్టడం అతనికి సాధ్యం కాలేదు. అక్కడ ఉన్న కాపలాదారుని వశం చేసుకుని అతని ద్వారా మాణిక్ ని గుర్తు పట్టాలని నిశ్చయించుకుని ఆ కాపలాదారుని దగ్గరకు వెళ్లి అమాంతంగా అతని కాళ్ళ మీద పడిపోయాడు. 

ఇదేమిటీ? ఎవరో వచ్చి నా  కాళ్ళ మీద పడడం ఏమిటీ? అని దెబ్బకి ఆ కాపలాదారుడు ఉలిక్కి పడ్డాడు. ఎవరు నీవు ? ఎందుకు నా కాళ్ళ మీద పడుతున్నావు? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నేను స్వామి నారాయణగారి ని కలవాలని ఎంతో దూరం నుండి కష్ట పడి వచ్చాను. కాని ఇక్కడ లక్షలాది ప్రజల మధ్య వారున్నారు. ఆయన చరణస్పర్శ దొరకడం కూడా దుర్లభం. వారిని దూరం నుంచి కూడా నేను సరిగ్గా చూడలేకపోయాను. మీరు స్వామి నారాయణ గారి భక్తులు కదా ! కనీసం మీ చరణ స్పర్శ చేసినా నాకు ఎంతో కొంత పుణ్యం వస్తుందని అనుకుని మీ చరణ స్పర్శ చేస్తున్నాను, నా జన్మ ధన్యమయింది అంటూ భక్తి ప్రేమలను ఒలకపోస్తూ సమాధానం చెప్పాడు. మీరు నాకన్నా ఎక్కువ భక్తుల్లాగా కనిపిస్తున్నారు అని ఆ భక్తుడంటే  నేను స్వామి నారాయణ గారిని దగ్గరనుంచి చూడలేక పోయాను కనీసం ఆయన స్వారీ చేసే మాణిక్ ని దర్శనం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాడు. దానికి ఆ కాపలాదారుడు నవ్వి నీవు చాలా తమాషా అయిన వ్యక్తి లాగా కనిపిస్తున్నావు , దానికేముంది నీవు మాణిక్ ని చూడవచ్చును అని అన్నాడు. జోగన్ పాగి చుట్టుతా చూశాడు కాని ఆ గుఱ్ఱాలలో మాణిక్ ని గుర్తుపట్టలేక ఆ కాపలాదారున్ని మాణిక్ ని చూపించమని ప్రాధేయపడ్డాడు. సరే అని ఆ కాపలాదారుడు స్వామి నారాయణ గారి వాహనమైనటువంటి ఆ మాణిక్ అనే అశ్వాన్ని చూపించాడు. జోగన్ పాగి దాన్ని చూడగానే సర్వశ్రేష్టమైన ఆ గుఱ్ఱం నా స్వంతమౌతుంది కదా అని విపరీతంగా సంతోషపడి ప్రతిమ లాగే దాన్నే చూస్తూ ఉండిపోయాడు. 
అతని కళ్ళని అతను నమ్మలేక పోయాడు జీవితంలో మొట్టమొదటిసారిగా అంత అద్భుతమైన గుఱ్ఱం చూడడం జరిగింది. అతను నెమ్మదిగా మాణిక్ వైపు వెళ్లి ఎంతో ప్రేమగా దాన్ని నిమరసాగాడు. కాపలాదారునికి ఈ వ్యక్తి యొక్క ధోరణి, అతని చూపులు  చాలా విచిత్రంగా అనిపించింది. జోగన్ పాగి అలాగే ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఏమిటీ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నావు ఏమైంది అని ఆ కాపలాదారుడు అడిగాడు. దానికి ఏమీ లేదు సోదరా నేను చూస్తున్నది కలో, నిజమో నాకు తెలియడం లేదు ఇంత అందమైన అశ్వాన్ని నా జనంలో చూడడం ఇదే మొట్టమొదటిసారి “ఆహా ! ఏమి అందం ఏమి ఠీవి అని అంటూ పొగడ సాగాడు. చాలా విచిత్రమన మనిషివి నీవు అని అంటూ ఆ కాపలాదారుడు అక్కడనుంచి వెళ్ళిపోయాడు. జోగన్ పాగి నిన్ను ఎలాగైనా సరే నేను ఇక్కడ్నుంచి తీసుకుని వెళ్తాను అ ని మనస్సులో అనుకుంటూ దాన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించాడు.

జోగన్  పాగి ఎప్పుడు చీకటి పడుతుందా ఎప్పుడు ఆ మాణిక్ ని దొంగిలిద్దామా, ఆ కాపలాదార్లు ఎప్పుడు నిద్రపోతారా అని సరైన అవకాశం కోసం ఎదురుచూడ సాగాడు. అర్ధరాత్రి అయింది. గాఢా౦ధకారం కమ్ముకుంది. అక్కడక్కడ కాగడా దీపాలు వెలుగుతున్నాయి. జోగన్ పాగి లేచి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మాణిక్ ఉన్న చోటికి వెళ్ళాడు. అదృష్టవశాత్తు ఆ కాపలాదారుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. ఒక వేళ ఆ కాపలాదారుడు కనక మెలకువగా ఉంటె వాడిని హతమార్చే పథకం ముందే వేసుకున్నాడు. బ్రతికి పోయావురా నీవు నిద్ర పోయి లేకపోతె నేనే నిన్ను శాశ్వత నిద్రలోకి పంపేవాడిని  అని అనుకుంటూ అటువైపు చూస్తె అశ్వం ఒంటరిగా కనిపించింది. అమ్మయ్యా ! ఎవ్వరూ లేరు ఇక్కడ అందరు గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. ఇక మాణిక్ నా స్వంతమే. నేను దేని మీద మనస్సు పడతానో దాన్ని చేజిక్కించుకోగలను అని మనస్సులో అనుకుంటూ ఆ అశ్వం దగ్గరకి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఆ గుఱ్ఱం దగ్గర తేజస్సు కనిపించింది. ఇక్కడ ఇంత వెలుగు ఎందుకు కనిపిస్తుంది అని చూస్తుండగా అతనికి ఆ గుఱ్ఱం దగ్గర స్వామి నారాయణ గారు దాన్ని ప్రేమగా నిమురుతూ కనిపించారు. అందుకు సంతోషంగా మాణిక్ సకిలించ సాగింది. స్వామి నారాయణ గారు ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నారని అతను విభ్రాంతి చెంది, కొంచెం సేపయ్యాక తిరిగి వద్దామని తన రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు.

కొంచెం సేపయ్యాక, ఇంకా అంధకారం దట్టంగా పెరిగి పోగానే మంచి అవకాశం దొరికిందని జోగన్ పాగి సంతోషిస్తూ మళ్ళీ ఆ గుఱ్ఱం దగ్గరకి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్య పోయాడు. మళ్ళీ అదే దృశ్యం ! స్వామి నారాయణ గారు నవ్వుతూ అశ్వాన్నిప్రేమగా  నిమరడం , అది సంతోషంగా సకిలించడం చూసి విభ్రాంతి చెందాడు. ఏం చేయాల్లో తోచలేదు సరే మళ్ళీ కొంచెం సేపయ్యాక వస్తాను అని మళ్ళీ తన రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయి కాసేపయ్యాక మళ్ళీ వచ్చి చూస్తె మళ్ళీ అదే దృశ్యం స్వామి నారాయణ గారు అక్కడ కనిపించారు. ఆయన తేజస్సు అతను చూడలేక కళ్ళు మూసుకున్నాడు.ఇదేమిటీ ఎప్పుడు చూసినా స్వామి నారాయణ గారు ఇక్కడే కనిపిస్తున్నారు? ఇది కలా లేక నిజమా? అంటూ ఒక అయోమయ స్థితిలో ఉండి పోయాడు. స్వామి  నారాయణ గారితో పాటు ప్రయాణం చేస్తున్న సమయ దేవత ఇదంతా ఒక ప్రేక్షకుడిలాగా గమనిస్తూ ఉండాలి. స్వామి నారాయణ గారి దేహం నుండి అద్భుతమైన కాంతి కిరణాలు ఆ చుట్టు ప్రక్కలా వ్యాపించి   జోగన్ పాగి శరీరాన్ని తాకి అక్కడ మాయమవుతూ ఉన్నాయి. ఆహా ! ఏమిటీ స్వామి నారాయణ గారి లీల ! అని సమయ దేవత ఆశ్చర్య పడి పోతున్నది, ఆనందపడి పోతున్నది. అయితే జోగన్ పాగికి ఈసారి మాత్రం మనస్సులో అతనికి తెలియని పరివర్తన అవుతున్నట్టుగా అనిపించింది. మాటిమాటికి కళ్ళు నులుపుకుంటున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు. ఎటు చూసినా అతనికి స్వామి నారాయణ గారే ప్రేమగా చూస్తూ కనిపిస్తున్నారు. ఆయన తననే చూస్తున్నాడా అనే భయం కూడా అతనికి కలిగింది. ఏం చేయాలో
తోచక అతను అలాగే ఒక ప్రతిమలాగా నిశ్చేష్టుడై నిల్చుండిపోయాడు. అంధకారం పటాపంచాలైపోయి సూర్యుడు మెల్లగా ఆకాశంలో కనిపించసాగాడు. జోగన్ పాగి స్వామి నారాయణ గారు ఉన్న చోటికి వెళ్ళాడు. అప్పటికే ఆయన చుట్టూ జనం పోగయ్యారు,. ఆయన చిరునవ్వు నవ్వుతూ కనిపించారు. అతను మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్వామి నారాయణ గారి వైపు వెళ్ళుతుంటే  అక్కడ ఉన్న కాపలాదారుడు నీవు ఇక్కడే ఉండు , ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అంటూ అడ్డగించాడు. ఈ గొడవంతా వింటున్న స్వామి నారాయణ గారు ఆ కాపలదారున్ని ఉద్దేశించి దర్వాన్  గారూ ! అతన్ని లోనికి రానివ్వండి అని ఆదేశించారు. దానికి దర్వాన్గారు ప్రభుశ్రీ ! ఇతను జోగన్ పాగి అనే బందిపోటు దొంగ. వీడిని కనక లోనికి రానిస్తే ఏం చేస్తాడో తెలియదు. మిమ్మల్నే హత్య చేయడానికి ప్రయత్నించవచ్చును, మీ మీదే దాడి చేయవచ్చు, అందుకనే ఆపాను అని చెప్పాడు. దర్వాన్ గారూ ! ఇతను  మీకు తెలిసిన జోగన్ పాగి కాదు ఇతను వేరే. ఇతన్ని లోనికి రానివ్వనీయండి అనిఆదేశమిచ్చారు. ఏమీ చేయలేక మారు మాట్లాడకుండా దర్వాన్ అతన్ని లోనికి వెళ్ళ నిచ్చాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఈ జోగన్ పాగి ఏం చేస్తాడో అక్కడ ఏం జరుగుతుందో అని భయంతో ఆతృతతో చూడసాగారు. ఈ వార్త తెలియగానే చుట్టుప్రక్కలనుంచి  అందరూ ఏం జరుగుతుందా అని ఆశ్చర్యంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారు. ఈ జోగన్ పాగి ఇప్పటిదాకా ఇలా బాహాటంగా ఇంత మంది జనం మధ్య ఎప్పుడు రాలేదు. అతనికి కూడా మనస్సులో ఏదో పశ్చాత్తాపం కలుగుతుంది.
                                                                                  ....... contd .. . . . . . .