N. Sairam Garu : +91 7901268716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.Tuesday, 17 November 2015

SwamiNarayan - Episode 60సులేమాన్   
ఆ రోజు రాత్రి సులేమాన్ ఒంటరిగా కూర్చుని గంభీరంగా ఏదో ఆలోచిస్తున్నాడు. అతని కుమార్తె నగ్మా అతన్ని సమీపించి “అబ్బాజాన్ ! ఏమిటి మీరంతగంభీరంగా దేన్నీ గురించి ఆలోచిస్తున్నారు?” అని ప్రశ్నించింది.
ఆ ! ఏముంది? ఇంకొక రెండు రోజులు పోతే నీవు వివాహం చేసుకుని అత్తగారింటికి వెళ్లిపోతావు. ఇదే విషయాన్ని నేను ఆలోచిస్తున్నాను అని బదులు చెప్పాడు.

“అబ్బా జాన్ ! నాకు వివాహం వద్దు. నేనసలు పెళ్ళే చేసుకోను. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను” అని నగ్మా అంది.
“లేదమ్మా ! నీవు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళాలి. అదే ధర్మం.నీవు  మా గురించి చింతించ వలసిన అవసరం లేదు” అని చెప్పాడు.  నగ్మా వెళ్ళిపోగానే సులేమాన్ భార్య వచ్చింది. “నాకేం చేయాలో తోచడం లేదు. చాలా బాధగా ఉంది. సరిగ్గా నెల రోజులకి నగ్మాది నిక్కా ఉంది కదా ! మన దగ్గర ఏమాత్రం డబ్బు లేదు. మనం ఎలా ఈ నిక్కా చేస్తామో అన్న చింత నన్ను పీడిస్తుంది. నిద్ర కూడా పట్టడం లేదు’’ అని చెప్పింది.‘చూడు నీవేమాత్రం దిగులు పడవద్దు. అంతా ఆ అల్లానే చూసుకుంటాడు. అని చెప్పాడు. అవుననుకొండి. అన్నీ భగవంతుడే చూసుకుంటాడు అని అనుకున్నా మన ప్రయత్నాలు మనం చేయాలి కదా! ఇప్పట్నుంచే మనం పెళ్లి సన్నాహాలు చేయాలి కదా ! బట్టలు, నగలు కొనాలి, విందు భోజనాలకి ఏర్పాట్లు చూసుకోవాలి అని అంది. సరే ! రేపే నేను వెళ్లి కిరాణ కొట్టు, నగల, బట్టల వర్తకులని కలుసుకుని వస్తాను అని ఆయన చెప్పాడు. ఆ మర్నాడే సులేమాన్ ఆ ఊళ్ళో ఉన్న ఆలయానికి వెళ్ళాడు. తానూ కలవాలనుకున్న వర్తకులందరూ అక్కడ కలవడంతో వారిని పలకరించి మీరంతా ఇక్కడ కలుస్తారని నాకు తెలుసు. అందుకనే నేను ఇక్కడకి వచ్చాను. సరిగ్గా నెల రోజులకి నా కూతురు నిగ్మాది నిక్కా పెట్టుకున్నాను. నాకు మీ దగ్గర్నుంచి కొంచెం సహాయం కావాలి. మీ దగ్గరనుండి కొన్ని వస్త్రాలు, కొన్ని బట్టలు, కొంత కిరాణా వస్తువులు కావాలి. నేను మెల్లగా మీ అప్పు తీరుస్తాను అని వారికి విన్నవించుకున్నాడు. మీ అమ్మాయి నిగ్మా పెళ్లి అవుతుందంటే మా అందరికి చాలా సంతోషం. అమ్ముకోవడమే మా వ్యాపారం. మేము తప్పకుండా నీకు అప్పు ఇస్తాము.

కాని ఇంత పెద్ద మొత్తాన్ని నీవెలా తీరుస్తావు? నీకా ఉద్యోగం లేదు. నీవు చేసేది గస్తీ, పహారా మాత్రమే. మరి ఏ రకంగా నీవు ఈ సొమ్ముని చెల్లిస్తావు? పోనీ ఇంట మొత్తాన్ని దానంగా స్వీకరిస్తావా? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా సులేమాన్ మీరన్నది నిజమే. నేను ఈ గ్రామానికి ఏ కొత్తవాళ్ళు వచ్చినా వారిని కాపలా కాస్తాను, వారి సొమ్ముని రక్షిస్తాను రాత్రంతా వారినే కాదు అందరికీ కాపలా కాస్తూ దానికి బదులుగా వారి దగ్గర్నుంచి ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటాను అని చెప్పాడు. అదే మేం చెప్తున్నది ఇంట చిన్న మొత్తంతో నీవు నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, అందులో ఏం మిగులుతుంది?అప్పేలా తీరుస్తావు?అందుకనే దానంగా కావాలా అని అడుగుతున్నాం అని అన్నారు. దానికి సులేమాన్ నాకు దానంగా అక్ఖర్లేదు.

భగవంతున్ని నమ్ముకున్న వాళ్ళు దానధర్మాల మీద ఆధారపడి ఉండడు అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఇటువంటి వ్యవహారాల్లో మేము నిక్కచ్చిగానే ఉంటాము. ఎందుకంటే డబ్బు రాదు. సంబంధాలు చెడిపోతాయి. కావాలంటే ఒక పని చేస్తాం. మేమేమి లాభాలు పెట్టుకోకుండా కొన్న ధరకే వస్తువుల్ని నీకు అమ్ముతాం అని అన్నారు. ఇక్కడ సాధు-సంతువుల సమూహమొకటి మన గ్రామానికి వచ్చిందని నేను విన్నాను. అక్కడ నాకేమన్నా పని దొరుకుతుందేమో వెళ్లి కనుక్కుంటాను. దేవుడి దయ ఉంటె రోజు నాకు కొంత డబ్బు వస్తుంటే నేను నా కూతురి వివాహం జరిపిస్తాను మీ అందరికి నా నమస్కారాలు అని చెప్పి సులేమాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
స్వామి నారాయణ – రక్షకుడు
స్వామి నారాయణ గారు , ఆయన అనుచరులు ఉన్న గుడారానికి సులేమాన్ వచ్చి వాళ్లకి నమస్కరించి ఇక్కడ అధికారి ఎవరు అని ప్రశ్నించాడు. మీరెందుకు అధికారిని కలవాలనుకుంటున్నారు అని ఒక శిష్యుడు అడిగాడు. నా పేరు సులేమాన్. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన వారికి కాపలా కాస్తుంటాను. మీరంతా ఈ ఊరికి కొత్తగా వచ్చారు కదా ! నేను రాత్రి నిద్ర పోకుండా మీ అందరికి కాపలా కాస్తాను, మీకు రక్షణ ఇస్తాను. మీరు తెచ్చుకున్న సామాగ్రినంతా జాగ్రత్త గా చూసుకుంటాను అని చెప్పాడు. స్వామి నారాయణ గారి శిష్యుడు దానికి సమాధానంగా సులేమాన్ గారూ ! మేము సాధువులం, మా దగ్గర ఏముంటుంది నుదుట తిలకం, మెడలో తులసీ మాలలు తప్ప?మా దగ్గర ధనమేమీ ఉండదు. కాబట్టి మాకు ఎటువంటి రక్షణ అవసరం ఉండదు అని చెప్పారు.

దానికి సులేమాన్ ఓ సాధు పురుషుల్లారా ! మీరు ఈ గ్రామానికి కొత్తగా వచ్చినట్టున్నారు. ఈ గ్రామంలో ఉన్న దొంగల సంగతి మీకు తెలియదు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఒక వేళ మీ దగ్గర ఏం దొరక్కపోతే వాళ్ళు మీ ప్రాణాలనే తీసేస్తారు కాబట్టి మీరు నా మాట వినండి అని చెప్పాడు. ఇదంతా వింటున్న స్వామి నారాయణ గారు మెల్లగా వచ్చి ఏమిటీ సంగతి అని అడిగారు. సులేమాన్ నేను మీకు రాత్ర౦తా కాపలా కాసి మిమ్మల్ని రక్షించుకుంటాను. కేవలం మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వండి. దానికన్నా  ఒక్క పైస ఎక్కువ కాని ఒక్క పైస తక్కువ గాని నాకక్ఖర్లేదు. సరిగ్గా ఒక్క రూపాయి చాలు. నేను మీకు రక్షణ ఇస్తాను ఆలోచించుకోండి.

ఒక్క రూపాయి మీ ప్రాణాల కన్నా ఎక్కువా?అని ప్రశ్నించాడు. దానికి స్వామి నారాయణ గారు నవ్వుతూ అయితే నీవు మాకు రక్షణ కల్పిస్తావా ?అని అన్నారు. “అవును, నేను మీకు రక్షణ కలిపిస్తాను ఒక్కటే ఒక్క రూపాయి ఇప్పించండి అని సులేమాన్ అన్నాడు. స్వామి నారాయణ గారు అతని ప్రస్తావనకి అంగీకారం తెలిపారు. అలాగే ! అలాగే చేస్తాం ఇంకా మీరందరూ వెళ్లి విశ్రమించండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి సులేమాన్ చేతిలో కర్ర పట్టుకుని గస్తీ చేస్తూ, అటు-ఇటు పచార్లు చేస్తూ వారికి రక్షణ గా ఉండి పోయాడు.

ఇలా పచార్లు చేస్తుండగా స్వామి నారాయణ గారి గదిలోనుంచి ఆయనకీ కొంత వెలుగు కనిపించింది. అదేమిటో చూద్దాం అని లోనికి ప్రవేశించగా స్వామి నారాయణ గారి పాదాలు స్పష్టంగా కనిపిస్తూ, ఆ పాదాల యొక్క కాంతిలో కొన్ని మంగళకరమైన చిహ్నాలు, గుర్తులు కనిపించాయి. సులేమాన్ ఒక ధార్మికుడు, సత్ప్రవర్తన కలిగినవాడు. వెంటనే చేతులు జోడించి నమస్కరించి “ఆహా ! ఏమి నా అదృష్టం!  నాకు స్వయంగా దేవుడ్ని రక్షించే బాధ్యతే కలిగింది కదా! ఈయన ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుడే” అని అనుకుని చాలా సంతోషించాడు.

మర్నాడు ప్రొద్దున్నే స్వామి నారాయణ గారు, ఆయన అనుచరులు వారి వారి కాలకృత్యాలు తీర్చుకుని బయటకి వెళ్ళడానికి సిద్ధపడి బయటకి రాగానే ఆయన సులేమాన్ ని పలకరించారు. సులేమాన్ చేతులు జోడించి ఆయనకి నమస్కారం చేశాడు. ప్రభూ ! మీ ముఖంలో నాకు సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క కళలన్నీ కనిపిస్తున్నాయి. మీ పాదాల్లో కూడా నాకు భగవంతుని పాదాల్లో ఉండే  మంగళకరమైన చిహ్నాలు కనిపించాయి. మీరు సాక్షాత్తు మా అల్లాయే, ఆ ఖుదాయే అని స్తుతించాడు. స్వామీ ! ఇక నాకేమీ అక్ఖర్లేదు. మీరు ఒక్కసారి మా ఇ౦టికి రావాలి అని ఆయన కాళ్ళ మీద పడి ప్రాధేయ పడ్డాడు. స్వామి నారాయణ గారు నవ్వుతూ సులేమాన్ ! ప్రస్తుతం నా దగ్గర కొంచెం కూడా సమయం లేదు. నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నీవు ఎంతో భక్తి శ్రద్ధలతో నీ విధిని నిర్వర్తి౦చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ్నుంచి బిజాపూర్ కి త్వరగా చేరుకోవాలి. కాబట్టి ఇంకేమన్నా కావాలా కోరుకో అని చెప్పారు.

వెంటనే  సులేమాన్ “ప్రభూ ! అలాగైతే నాకొక చిన్న బహుమానం ఇవ్వండి” అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక తెల్లని వస్త్రాన్ని నేల  మీద పరిచి దయ చేసి “మీరు దీనిమీద మీ పాద ముద్రలు వేసి ఇవ్వండి” అని ఎంతో వినయంతో ప్రార్థించాడు. స్వామి నారాయణ గారి శిష్యులంతా ఎంతో ఆశ్చర్య పడ్డారు. ఇంత బీదవాడు ఏ డబ్బులో లేక ఇంకేమైనా విలువైన వస్తువులేమైనా అడుగుతాడేమో అని అనుకుంటే అవేవి అడక్కుండా ప్రభుశ్రీ పాదముద్రలడుగుతున్నాడు. పైగా అన్య మతస్థుడు అని తమలో తాము కొంతమంది అనుకున్నారు. స్వామి నారాయణ గారు చిరునవ్వు నవ్వి తన పాద ముద్రలని ఆ వస్త్రం పై ఉంచి మరేమీ మాట్లాడకుండా ముందుకి సాగి పోయారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వస్త్రాన్ని తీసుకుని సులేమాన్ తన ఇంటికి వెళ్లి పోయాడు.

సర్వస్వ శరణాగతి – భక్తి - శ్రద్ధ, విశ్వాసం  
సులేమాన్ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి నారాయణ గారు తన పాద ముద్రలు ప్రసాదించినత్తి ఆ వస్త్రాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్లి అతని భార్యకి చూపించాడు. అదేమిటో ఆవిడకి అర్థం కాక “ఏమిటిదీ?”ఏం తీసుకుని వచ్చారు? అని ప్రశ్నించింది. ఎమనుకున్తున్నావు? ఇవి సామాన్య మానవుని యొక్క పాద ముద్రలు కావు సాక్షాత్తు అల్లా యొక్క పాదముద్రలే. చూస్తూ ఉండు. మన నగ్మా పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది అని ఆయన తన అపారమైన విశ్వాసాన్ని, భక్తి శ్రద్ధలని బయటకి ప్రకటించాడు. అంతా భగవంతుని మీద పడేస్తే ఎలాగా? మన ప్రయత్నం మనం చేయాలి. నేను ఇదివరకే మీకు చెప్పినట్టుగా పెళ్లి కోసం నగలు, మంచి బట్టలు, విందుకి కావలసిన సంబారాలు అన్నీ అమర్చుకోవాలి అని అతని భార్య అంది. ఎందుకంత దిగులు పడతావు? అల్లాయే అంతా చూసుకుంటాడు.

ఆ దేవుని మీదే నమ్మకం పెట్టుకో’ అని అంటుండగానే బయట నుండి ఆ వర్తకుల మాటలు వినిపించాయి. ఆ వర్తకులు వచ్చి సులేమాన్ గారూ !  మీ అమ్మాయి పెళ్ళికి కావలసిన వస్తువులన్నీ బళ్ల మీద మోసుకేని మేం తీసుకుని వచ్చాం. మీరు నిరభ్యంతరంగా అవన్నీ వాడుకోండి. ఆ భార్యాభర్తలిద్దరూ చాలా ఆశ్చర్య పోయారు. సులేమాన్ మిత్రులారా ! ఏను పేదవాన్ని. నా దగ్గర చెల్లించడానికి సొమ్ము లేదు అని అన్నాడు. అరె సులేమా భాయి మేము మిమ్మల్ని డబ్బు అడిగామా ? మీరు ఏం డబ్బు ఇవ్వనక్ఖర్లేదు. రాత్రి స్వామి నారాయణ గారు ...... ఆ మాటలు పూర్తి కాకముందే సులేమాన్ మరి నిన్న మీరు అలా మాట్లాడారు కదా అని అంటే ఆ మాకు తెలియదు. మేము వ్యాపార రీత్యా అలా మాట్లాడాము. కాని రాత్రి స్వామి నారాయణ గారు మా కలలో కనిపించి నగ్మా మన ఊరి బిడ్డ కాబట్టి మీరందరూ ఆమె వివాహానికి స్వచ్చందంగా సహాయం చేయాలి అని ఆజ్ఞాపించారు. అందుకనే మేం వచ్చాం. నగ్మా మా కూతురి లాంటిదే కదా ! మన గ్రామానికే బిడ్డ కాబట్టి మీరు నిస్సంకోచంగా,నిరభ్యంతరంగా మీకేం కావాల్ చెప్పండి. అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా నగ్మా వివాహం చేద్దాం అని చెప్పారు. సులేమాన్ దంపతులు ఆ వర్తకులందరికి నమస్కరించి వారు వెళ్లి పోగానే “జై స్వామి నారాయణ్’ అని స్వామి నారాయణ గారికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఇదంతా విన్న గ్రామస్థులు ఆశ్చర్య పడిపోయారు. గ్రామస్తులందరూ కలిసి ఒకే కుటుంబ సభ్యుల్లాగా నగ్మా యొక్క వివాహం దగ్గరుండి బ్రహ్మాండంగా జరిపించారు. ఇదే వ్యవస్థ, ఇదే రకం బాంధవ్యాలు ప్రతి గ్రామంలో ఉంటె ప్రపంచమంతా సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది. అన్ని రకాల కులస్థులు, మతస్థులు కుల మత జాతి భేదాలు లేకుండా ఉంటారు కదా ! అని అందరు అనుకున్నారు. భక్తుని మనస్సులో భక్తి, శ్రద్ధ మొదలగు పరిశుద్ధమైన భావనలు కనుక ఉంటె సాక్షాత్తు భగవంతుడే వారి హృదయాల్లో ఉండిపోతాడు. భక్తునికి కావలసినవి అన్నీ ఆయనే సమకూరుస్తాడు అని అందరు  అనుకున్నారు.