N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 7 December 2015

SwamiNarayan - Episode 62

జతిన్ బా

 జతిన్ బా మరియూ స్వామి నారాయణ గారి మధ్య పోటి


స్వామి నారాయణ గారు సత్సంగం చేస్తూ ధర్మ ప్రవచనాలు చెప్తున్నారు. ధర్మ ప్రవచనాలు వింటున్నప్పుడు మన మనస్సుకి మంచి మార్గం వైపు వెళ్ళాలి అని అనిపిస్తుంది. కాని వారు ఆ మార్గం వైపు వెళ్ళితే కదా వాళ్లకి తెలిసి వచ్చేది. ఇలా మంచి మాటలు చెప్తుండగా ఒక వార్తాహరుడు వచ్చి వేణి దాస్ పటేల్, వారి కుమార్తె జతిన్ బా మీ దర్శనం కోసం వేచి ఉన్నారని చెప్పాడు. వెంటనే వారిద్దరిని లోపల ప్రవేశ పెట్టమని స్వామి నారాయణ గారు ఆనతిచ్చారు. వారిద్దరూ లోపలకి రాగానే ఆదరంగా వారిని పలకరించారు. వేణి దాస్, వారి కుమార్తె జతిన్ బా స్వామి నారాయణ గారి పరమ భక్తులు. వారిద్దరూ వచ్చిఆయన పాదాలకి నమస్కరించారు. స్వామి నారాయణ గారు  “చెప్పండి ఏమిటీ విశేషాలు?” అని ప్రశ్నించారు. వెంటనే జతిన్ బా రెండు చేతులు జోడించి “ప్రభుశ్రీ  ! మీరు మా ఇంటికి భోజనానికి రావాలి” అని అభ్యర్థించింది. స్వామి నారాయణ గారు నవ్వుతూ “దానికేముంది? తప్పకుండా వస్తాను కాని నాకేం వడ్డిస్తావు? ఏం వంటకాలు చేసి తినిపిస్తావు?” అని అడిగారు.

 “మా ఇంట్లో పాలకి, నెయ్యికి కొదవలేదు. మీకు ఎంత కావాలంటే మేము అంత సమర్పించుకుంటాం” అని జతిన్ బా అంటే దానికి వత్తాసుగా ఆమె తండ్రి కూడా “అవునవును’’ అని చెప్పాడు.

“వేణీ దాస్ గారూ ! నేనెక్కడికి వెళ్ళినా ఒక్కడినే వెళ్ళను. నాతోపాటు నా శిష్యులు, అనుచరులు, నా భక్తులు అందరూ కూడా వస్తారు. మరి మీకు సమ్మతమేనా?” అని అడిగారు.

జతిన్ బా “స్వామీ ! మీరు ఎంత మంది అంటే అంత మందిని తీసుకుని రండి. ఫరవాలేదు’’ అని అంది.
“జతిన్ బా ! మరి నీవేమైనా తప్పు చేశావనుకో మరి అందరికి నిరాశే మిగులుతుంది కదా !” అని సందేహం స్వామి నారాయణ గారు వెలిబుచ్చారు.

ఈ సంభాషణ అంతా స్వామి నారాయణగారి శిష్యులు చాలా ఆసక్తిగా వింటున్నారు. “అంతా మేము బాగా చేస్తాం మీకా సందేహం వద్దు” అని జతిన్ బా చెప్పింది. “అయితే నాదొక విన్నపం మీకు ఎంత కావాలో అంత తినాలి అలాగే మీ శిష్యులు కూడా. ఒక వేళ ప్రసాదం కనుక అయిపోతే మీరు గెలిచినట్టు లేకపోతె నేను గెలిచినట్టు మరి మీరు ఒప్పుకుంటారా?” అని జతిన్ బా అడిగింది. స్వామి వారు నవ్వుతూ “జతిన్ బా ! అలాగే ! నీ ఒప్పందాన్ని నేను స్వీకరిస్తున్నాను. నేను తప్పకుండా మీ ఇంటికి వస్తున్నాను. ఒక వేళ నేను ఓడిపోతే నీవే శిక్ష విధిస్తే అది నేను స్వీకరిస్తాను. అలా కాకుండా నీవు ఓడిపోతే నేనే శిక్ష విధిస్తే అది నీవు స్వీకరించాలి మరి  నీకు సమ్మతమేనా?” అని అడిగారు స్వామి నారాయణ గారు. “తప్పకుండా నేను స్వీకరిస్తాను. నాకు సమ్మతమే” అని చెప్పి వారిద్దరూ “జై స్వామి నారాయణ” అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోయారు. ఈ విచిత్ర సంభాషణ విన్న శిష్యులకి చాలా ఆశ్చర్యం కలిగింది.

భక్తి – విశ్వాసం
జతిన్ బా ఇంటికి రాగానే ఇరుగు-పొరుగున ఉన్న వాళ్ళు, స్నేహితులు అందరు “జతిన్ బా ! ఏమిటీ నీవు స్వామి వారితో పందెం వేశావట నిజమేనా ? స్వామి వారు స్వయంగా పాత్రని ఖాళీ చేయలేరని. కాని భగవాన్ స్వామి నారాయణ గారు తలుచుకుంటే క్షణంలో అంతా ఖాళీ చేస్తారు కదా ! మరి ఇంత మంది శిష్యులు వస్తున్నారు కదా ! నీవెంత చేసినా ఏం సరి పోతుంది?” అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా “స్వామి నారాయణ గారు తన చేత్తో స్పర్శించిన పాత్రతో నేను వడ్డిస్తానని చెప్పినప్పుడు ఆ పాత్ర అక్షయంగా ఉంటుంది అని నమ్మకం నాకుంది. నేను మా దగ్గర పాలు, నెయ్యి  సమృద్ధిగా ఉన్నాయని అహంకారంతో నేను పందెం వేయలేదు. కేవలం స్వామి వారి మీద ఉన్న భక్తి విశ్వాసాల మూలంగానే  నేను ఈ పందెం వేశాను.” అని జతిన్ బా ఎంతో ధైర్యంగా, నమ్మకంగా చెప్పింది.

అనుకున్నట్టుగానే స్వామి నారాయణ గారు తన శిష్య బృందంతో వేణీ దాస్ గారి ఇంటికి వచ్చారు. వారిని సగౌరవంగా ఆహ్వానించి , అతిథి సత్కారాలు చేసి వడ్డనకు ఏర్పాట్లు చేశారు. ఒప్పందం ప్రకారం అక్కడ కూర్చున్న వాళ్ళందరికి వడ్డన మొదలు పెట్టారు. పాత్ర ఖాళీ చేసి, “జతిన్ బా ! ఇంకా తీసుకుని రా” అని చెప్పడం , జతిన్ బా మళ్ళీ ఆ పాత్రను దూధ్ పాక్ తో నింపి తీసుకుని రావడం, స్వామి నారాయణ గారు స్వయంగా తన చేతులతో అక్కడ కూర్చున్న వాళ్లందరికి వడ్డించడం అందులో కొంత సరదాగా నేల పాలు చేయడం. “అయిపోయింది ఇంకా తీసుకుని రా!” అని చెప్పడం నిరంతరం జతిన్ బా ఖాళీ పాత్రను నింపి మళ్ళీ తీసుకుని రావడం ఇదే జరుగుతూ ఉండాలి . అక్కడున్న జతిన్ బా బంధువులందరు “ ఈ రోజు జతిన్ బా ఓటమి ఖాయం !”అని అనుకున్నారు ఎందుకంటే స్వామి నారాయణ గారు కొంత వృధాగా నేల పాలు చేస్తున్నారు. ఆఖరికి వేణీ దాస్ గారు కూడా  “ఏమ్మా! మనం ఓడిపోయేటట్టే ఉన్నాం. దూధ్ పాక్ అంతా ఖాళీ అయినట్టే ఉంది. స్వామి నారాయణ గారు కూడా మన భావాలని పరీక్షిస్తున్నట్టున్నారు.” అని అన్నారు.

“మంచిదే కదా నాన్నగారూ !” అని జతిన్ బా ఎంతో ధైర్యంతో అంది. ఒక వేళ స్వామి నారాయణ గారు  మన భావనల్ని పరీక్ష చేయాలనుకుంటే ఫరవాలేదు. అయినా దేవుడెప్పుడు తన భక్తులు ఓడిపోవడానికి కాని , అవమాన పాలు కావడానికి కాని ఇష్ట పడడు” అని ఎంతో ధైర్యంగా చెప్పింది. ఇంతలో స్వామి నారాయణ గారు “జతిన్ బా ! ఇంకాస్త దూధ్ పాక్ పట్టుకుని రా!” అని ఆజ్ఞ జారీచేశారు. ఎప్పుడైతే ఈ పరమ భక్తురాలు భక్తి విశ్వాసంతో తన తండ్రికి చెప్పి వంట ఇంట్లోకి వెళ్లి దూధ్ పాక్ తెచ్చి స్వామి వారికి వడ్డించడానికి ఇచ్చిందో అప్పుడు ఆయన శిష్యులంతా “ఇంక మాకు చాలు ,  మేము తినలేము, మా కడుపు నిండి పోయింది” అని చెప్పారు. అప్పుడు జతిన్ బా స్వామి నారాయణ గారితో “ప్రభుశ్రీ ! మీరు నాకు మూడు సార్లు దూధ్ పాక్ తీసుకుని రా అని చెప్పారు. నేను మూడు సార్లు దూధ్ పాక్ తీసుకుని వచ్చాను. ఇంకా అక్కడ మిగిలి ఉంది” అని అన్నది.  “జతిన్ బా ! అవును నిజమే ! ఇక్కడ అందరు నీవు ఇచ్చిన ప్రసాదాన్నితృప్తిగా కడుపు నిండా తిన్నారు. మన ఒప్పందం ప్రకారం నేను పందెం ఓడి పోయాను. చెప్పు నాకేం శిక్ష విధి స్తావు?” అని అన్నారు.

“ప్రభూ ! నేను అదే చెప్తున్నాను. మీరు నేను వేసే శిక్షకి తయారుగా ఉన్నారా ?” అని ప్రశ్నించింది. స్వామి నారాయణ గారు నవ్వి “ నేను సిద్ధంగానే ఉన్నాను” అని చెప్పారు. జతిన్ బా స్వామి నారాయణ గారికి ఎలాంటి శిక్ష విధిస్తుందా అని శిష్యులందరు ఆశ్చర్యంగా చూసున్నారు. భగవంతుడికి భక్తురాలికి జరుగుతున్న సంభాషణంతా స్వామి  నారాయణ గారి శిష్యులు అంతో ఆసక్తిగా వింటున్నారు చూస్తున్నారు.

“ప్రభుశ్రీ  ! ఒక  భక్తురాలు తన ప్రభువుకి ఏం శిక్ష విధిస్తుంది చెప్పండి అయినా ఒప్పందమంటే  ఒప్పందమే. కాబట్టి మీరు ఈ పాత్రలో ఉన్న దూధ్ పాక్ అంతా త్రాగి వేయాలి” అని నవ్వుతూ చెప్పింది. అంత పెద్ద పాత్రలో ఉన్న దూధ్ పాక్ అంతా స్వామి నారాయణ గారు ఖాళీ చేశారు. ఇదంతా చూసి అందరు ఆశ్చర్య పోయారు, సంతోషించారు.
ఒక్క రోజు ఆతిథ్యం కోసం వచ్చిన స్వామి నారాయణ గారు తన శిష్య బృందంతో వేణీ దాస్ గారింట్లోనే ఉండి పోయారు. ప్రతి రోజు స్వామి నారాయణ గారికి, ఆయన శిష్యులకే కాకుండా అసంఖ్యాకంగా వచ్చిన ఆయన అను చరులందరికి ఎన్నో మధుర పదార్థాలతో ఆతిథ్యం ఇచ్చారు. ఇలా దాదాపు పదిహేను రోజులు గడిచి పోయినాయి. ఒక రోజు వేణీ దాస్ గారు ఇలా మనస్సులో అనుకుంటున్నారు. పదిహేను రోజులైపోయాయి. ఇంకా స్వామి నారాయణ గారు వెళ్తాను అని చెప్పడం లేదు. ధాన్యాగారంలో ఉన్న ధాన్యాలన్నీ అయిపోవడానికి వచ్చాయి. “భగవంతుడా ! ఏమిటీ ఇలాంటి పరీక్ష పెట్టావు? అని చింతాక్రాంతుడై ఉండగా  జతిన్ బా వచ్చి నాన్నగారూ ! ఏమిటీ ఆలోచిస్తున్నారు? అని ప్రశ్నించింది.