N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Saturday, 12 December 2015

SwamiNarayan - Episode 63

స్వామి నారాయణ్ ఎపిసోడ్ -63
స్వామి నారాయణ గారి పరీక్ష
ఆమె ప్రశ్నకి జవాబుగా “అమ్మా ! స్వామి నారాయణ గారు వచ్చి పదిహేను రోజులైంది వెళ్తాను అని అనడం లేదు. ధాన్యాగారమంతా ఖాళీ అయిపోతుంది. ఏం చేయాలి ?అని ఆలోచిస్తున్నాను. చూడమ్మా! నాదొక చిన్న సలహా విను. ఒక వేళ ఆయన కనక నేను వెళ్లి పోతాను అని అంటే నీవు మాత్రం మీరు వెళ్ళవద్దు ఇంకా కొన్ని రోజులు ఉండ౦డి అని మాత్రం అనవద్దు. ఎందుకంటే ధాన్యాగారం ఖాళీ అయిపోతుంది. నీకు తెలుసు కదా ! కావాలంటే శ్రీ వారు మళ్ళీ ఇంకొకసారి రావచ్చును. ఈ విషయమే నేను ఆలోచిస్తున్నాను” అని చెప్పి మెల్లగా అక్కడనుంచి వెళ్లి పోయారు. వారిద్దరూ కూడా స్వామి నారాయణ గారు వారి వెనకనే ఉన్నారని కాని వారిద్దరి  మాటలు విన్నారని కాని గమనించ లేదు. జతిన్ బా అలాగే ఆలోచిస్తూ నిలబడి పోయింది. ఈ లోగా స్వామి నారాయణ గారు  మెల్లగా మెట్లు దిగి జతిన్ బా దగ్గరకి వచ్చి “ఏమ్మా ! ఏం జరుగుతుంది? 


నాన్నగారు ఏం మాట్లాడారు?” అని ఆరా తీశారు. దానికి జతిన్ బా తడబడుతూ “ ప్రభుశ్రీ ! ఏం లేదు, ఏం లేదు. ప్రభుశ్రీ మన ఇంటికి వచ్చారు, మన ఆతిథ్యం స్వీకరించారు, ఆయన దర్శనం కావడమే దుర్లభం. అందులో ఆయన తన శిష్య బృందంతో మన ఇంటికి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించడం మన అదృష్టం. మన ధాన్యాగారం అక్షయంగా ఉంది. ఇంకా మిమ్మల్ని కొన్ని రోజులు ఉండమని మా నాన్న గారు అంటున్నారు” అని సెలవిచ్చింది. ఆ మాటలు విని స్వామి నారాయణ గారు మనస్సులోనే కాకుండా బయటకి కూడా నవ్వి “ వేణీ దాస్ గారూ !” అని ఆయన్ని పిలిచారు. లోపల ఎక్కడో ఉన్న వేణీ దాస్ గారు ఆ పిలుపు విని బయటకి వచ్చి స్వామి నారాయణ గారికి చేతులు జోడించి నమస్కరించి అక్కడ నిల్చుండిపోయారు.

“వేణీ దాస్ గారూ ! మీరు  జతిన్ బా తో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. కాని జతిన్ బా నన్ను అర్థం చేసుకున్నంతగా మీరు నను అర్థం చేసుకోలేక పోయారు. మీరెప్పుడు మీ నోటితోటి ఇక మీదట గోధుమలు, బియ్యం వగైరా వగైరా అయిపోయినాయి అని అనవద్దు. నేను ఎవరింట్లో భోజనం చేస్తానో వారింట్లో భోజనానికి కొరత ఉండదు. ధాన్యాలన్ని ఎప్పుడు అక్షయం గానే ఉంటాయి. ఏ ఇంట్లో నేను నీళ్ళు త్రాగుతానో ఆ ఇంట్లో గంగ నిరంతరం ఉంటూనే ఉంటుంది. జతిన్ బా నేనెవరో తెలుసుకుంది. ఆమె ముక్తాత్మ. ఇటువంటి కూతుర్ని కన్నందుకు నీవు గర్వ పడాలి. జతిన్ బా మంచి భక్తురాలు. ఇటువంటి కూతురు నీ ఇంట్లో ఉన్నంత కాలం అన్నీ అక్షయంగా ఉంటాయి సుమా !” అని చెప్పారు.

స్వామి నారాయణ గారు తన శిష్య బృందం తోటి వేణీ దాస్ గారింటి నుంచి వెళ్లి పోతుండగా జతిన్ బా చేతులు జోడించి “ప్రభు శ్రీ ! మా ఆతిథ్యంలో ఏవైనా లోపాలు జరిగి ఉంటె మమ్మల్ని క్షమించండి” అని అంది.

“జతిన్ బా ! ఎందుకమ్మా? ఎందుకలా మాట్లాడుతున్నావు?” అని ప్రభుశ్రీ అన్నారు. “ప్రభుశ్రీ ! నాకు తెలుసు శ్రీ కృష్ణ పరమాత్మునికి విదురుడు ఇచ్చినటువంటి మంచి భోజనం, కుచేలుడు ఇచ్చినటువంటి అటుకులు, శబరి ఇచ్చినటువంటి ఆ ఎంగిలి రేగుపళ్ళు ఇవన్నీ కూడా వారికి  సమానమే. వారు ఎటువంటి భేదభావం  చూపరు. ఆ భక్తుల యొక్క భావనల కే వారు ప్రాధాన్యం ఇస్తారు కాని వారి ఆతిథ్యంలోని పదార్థాల గురించి వారు ఆలోచించరు. నేను మీ అనుగ్రహం వల్ల ఇంత చేయగలిగాను ఇందులో కష్టమేముంది ప్రభుశ్రీ ?నాకు ఏమీ కష్టమనిపించ లేదు. నేను చాలా సంతోషంగా ఆతిథ్యమిచ్చాను” అని అంది. అయితే “జతిన్ బా ఒక ప్రశ్న అడగనా?” అని స్వామి నారాయణ గారు అన్నారు. “అడగండి తప్పకుండా “ అని జతిన్ బా సమాధానం ఇచ్చింది.

“నీకు ఇలాంటి భావన అందరి పట్లా ఉందా? ఎంతో మంది అన్నార్తులు ఉన్నారు. వారిపట్ల కూడా నీకు ఇలాంటి భావం ఉందా?” అని ఆయన ప్రశ్నించారు.

అక్కడ ఉన్న శిష్యులు, మిగిలిన వాళ్ళందరు వీరి  మధ్య జరుగుతున్న సంభాషణలను కుతూహలంగా వింటున్నారు. స్వామి వారు ఇంకొక లీలేదో చేయబోతున్నారని గ్రహించి పరమానంద స్వామి గారు, ముక్తానంద స్వామి గారు నవ్వుకున్నారు.

“ప్రభుశ్రీ ! ఈ భావన మీ పట్లనే కాదు అందరి పట్లా ఉంది. ఎందుకంటే ప్రతి ప్రాణిలో మీరే ఉన్నారు కదా  స్వామి ! అన్నార్తులకి నేను భోజనం పెట్టినప్పుడు అది మీకు చేరుతుందని నాకు దృఢ విశ్వాసం ఉంది. వాళ్ళిచ్చే ఆశీర్వాదాలను కూడా మీరు ఇచ్చినట్టుగానే నేను భావిస్తాను. కాబట్టి నాకు మీ పట్లనే కాదు అన్ని జీవుల పట్ల ఇలాంటి భావనే ఉంది” అని ఆమె సెలవిచ్చింది.

జతిన్ బా ఇచ్చిన సమాధానానికి ఆయన ఎంతో సంతోషించి “ సరే ! నేనొక పని చెప్తాను. చేస్తావా ?” అని అడిగారు.

జతిన్ బా “చేస్తాను స్వామి !”అని అనగానే అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ ధాన్యాగారంలో ఉన్న అన్ని తలుపులను మూసి కేవలం ఒక్క కిటికినీ మాత్రం తెరచి ఉంచి, అందులోనుండి మీకు కావలసిన ధాన్యాలన్నిఎప్పుడు కావాలన్నా ఆ కిటికీ నుండే తీసుకోండి. ఇలా చేస్తే మీ ధాన్యాగారమెప్పుడు అక్షయం లాగానే ఉంటుంది. అంతే కాదు కరువుకాటకాలు వచ్చినప్పుడు మీరు ఈ ధాన్యాగారం నుంచి తీసిన వస్తువులతో వంట చేసి అన్నార్తులకి భోజనం పెట్టండి. ఎప్పుడైతే ధాన్యాగారపు పెద్ద తలుపులు మూసుకుంటాయో అప్పుడు భక్తుల ఆకలి తీరుతుంది మీ ధాన్యాగారం అక్షయం లాగా ఉంటుంది” అని ఆశీర్వదించి ఆయన తన శిష్య బృందంతో వెళ్ళిపోయారు. జతిన్ బా భక్తి శ్రద్ధలతో స్వామి వారికి ధన్యవాదాలు చెప్పి వారు నడిచిన నేల మీద ఉన్న పవిత్ర ధూళిని తన నుదుట దిద్దుకుంది.

పరమానంద స్వామి వారు స్వామి నారాయణ గారు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి “ ఆహా ! స్వామీ ! ఏం లీల చేశారు మీరు ! అని అన్నారు.

 “ పరమానంద గారూ ! నేనేం లీల చేశాను?” అని స్వామి నారాయణ గారు ప్రశ్నించారు.

“ రాబోయే కరువు కాటకాల పరిస్థితి గమనించి ఆ తండ్రి కూతుళ్ళని ఎన్నుకుని మీరు వాళ్లకి పరీక్షా పెట్టారు కదా స్వామీ !  మీ లీలలు మాకు తెలియవా?” “ మీరే ఆ తండ్రి కూతురికి పరీక్ష పెట్టారు, మీరే వాళ్ళని ఉత్తీర్ణులు గా, కృతార్థులుగా చేశారు. ఇదంతా మీ లీల కాదా స్వామి?” అని బ్రహ్మానంద గారు అన్నారు.

 “పరమానంద నంద గారూ ! ఆ తండ్రి కూతుళ్ళు స్వతహాగా కరుణ, దయ కలవారు. అన్నార్తులకి భోజనం పెట్టాలి అనే కోరిక వాళ్ళ మనస్సులో ఉంది. వాళ్లిద్దరు ధన్యజీవులు” అని సెలవిచ్చారు.

వేణీ దాస్ గారు స్వామి నారాయణ గారు చెప్పినట్లే ధాన్యాగారపు ప్రధాన ద్వారం మూసివేసి కేవలం ఒక కిటికీని మాత్రమే ఏర్పాటు చేశారు.  

జతిన్ బా అన్నదానం.
జతిన్ బా, వేణిదాస్ ఉన్న ఊళ్ళో కాని ఆ చుట్టూ ప్రక్కల్ ఉన్న గ్రామాల్లో కాని ఎవరు కూడా ఈ కరువు రోజుల్లో ఆకలితో అలమటి౦చరు అని నాకు పూర్తిగా నమ్మకముంది ఈ జతిన్ బా మీద అని స్వామి నారాయణ గారు ముక్తానంద గారితోనూ, సుఖానంద స్వామి వారితోనూ అన్నారు.

ప్రభుశ్రీ ఆశీర్వాదం – జతిన్ బా  నిర్ణయం

ఇక్కడ ఒక రోజు జతిన్ బా తండ్రిని ఉద్దేశించి “నాన్నా! ప్రభుశ్రీ చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? ఆయన మన ధాన్యాగారం ఎప్పుడు అక్షయం లాగా నిండి ఉంటుంది. అకాల పరిస్థితులు వచ్చినప్పుడు అన్నదానం చేయమని కూడా చెప్పారు. ఇంత మంచి పని మనం ఇప్పుడే మొదలు పెట్టితే బాగుంటు౦ది కదా !  మన ఇంటిలోనే  మనం అన్నక్షేత్రం ఎందుకు మొదలు పెట్టకూడదు? మనం అన్నదానం ప్రారంభిద్దాం” అని అడిగింది.
“అలాగే, తప్పకుండా మనం ప్రభుశ్రీ ఆజ్ఞని పాటించి అన్నదానం చేద్దాం. అయన కృప మన మీద ఎప్పుడు ఉంటుంది. అమ్మాయి ! చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు” అని వేణి దాస్ అన్నాడు.

అలాగే ప్రభుశ్రీ చెప్పినట్టుగానే వాళ్ళ ధాన్యాగారం ప్రధాన ద్వారం మూసివేసి కేవలం ఒక చిన్న కిటికిని ఏర్పాటు చేసి ఆ ధాన్యాగారం నుంచి ధాన్యాన్ని కిటికీ ద్వారానే వాళ్ళు తీసుకోవడం మొదలు పెట్టారు. ఆపాటికే అక్కడ కరువు మొదలై బీదవాళ్ళుతినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. అలా ఆలోచించిన తక్షణమే వాళ్ళు కార్యరూపం దాల్చారు. వెంటనే వేణీ దాస్ గారింట్లో అన్నదానం మొదలయింది. మామూలు భోజనమే కాకుండా మధుర పదార్థాలతో వారింటికి వచ్చిన అన్నార్తులకి ఎంతో శ్రద్ధా భక్తులతో అన్నదానం చేయ సాగారు. ఈ వార్త చుట్టూ ప్రక్కల గ్రామాల్లో పాకేసరికి అక్కడ వర్షాలు లేక, పంటలు పండక తిండికి అలమటిస్తున్న అనేక వేలమంది జనం  వేణీ దాస్ గారింటికి రావడం  మొదలు పెట్టారు.

ఈర్ష్య – అసూయలు
జతిన్ బా చేస్తున్నటువంటి మహత్తరమైన సేవా కార్యక్రమం వల్ల ఆమె పేరు ప్రఖ్యాతులు గ్రామ గ్రామాల్లో వ్యాపించాయి. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు దుష్ట శక్తులు, అసుర శక్తులు రెట్టింపు ఉత్సాహంతో ఆ మంచి పని జరగకుండా ఉండాలని విజ్రు౦భిస్తుంటాయి. అదే విధంగా ఆ గ్రామంలోని వర్తకులందరు ఇటువంటి అకాల పరిస్థితుల్లో తమకున్న ధనంతో ముందే ఈ ధాన్యాలన్ని చవగ్గా పెద్ద మొత్తంలో కొని వారి గిడ్డంగుల్లో పెట్టుకుని, అధిక ధరలకి అమ్ముకుని చాలా ధనం అక్రమంగా సంపాదించుకోవాలని వారు అనుకున్నారు. కాని ఇప్పుడు వారి వ్యాపారమంతా మూల పడిపోయింది. ఆ వర్తక సమూహానికి నాయకుడైనవాడు వారందరినీ పిలిచి “ మన పరిస్థితి ఏమిటీ ఇంత అధ్వానంగా తయారైంది? ఆ జతిన్ బా ఇలాంటి పరిస్థితుల్లో రోజు అన్నివేలమందికి అన్నదానం ఎలా చేస్తుందో ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. మన సరుకులన్నీ అలాగే నిలవ ఉండి  పోయాయి. అంతే కాకుండా జతిన్ బా , వేణీ దాస్ ని వాళ్ళంతా ఆకాశం లోకి ఎత్తేస్తున్నారు. “ఆహా” , “ఓహో” అని అంటున్నారు. మనం మాత్రం ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. మన ఏదో ఒకటి చేయాలి. అంత ధాన్యం ఆవిడ దగ్గరకి ఎలా వస్తుందో నాకర్థం కావడం లేదు” అని చెప్పి వారందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.

 “ఎలాగైనా సరే వాళ్ళు నిలవ ఉంచిన ధాన్యమంతా మనం ఎత్తుకెళ్ళి పోదాం. అక్కడ ఎటువంటి కాపలా ఏర్పాట్లు లేవు. తలుపులు తెరిచే ఉంటాయి. కాబట్టి మన పని సులభంగా అయిపోతుంది. వాళ్ళంతా స్వామి నారాయణ గారి మీదే నమ్మకం పెట్టుకుని నిశ్చింతగా ఉండి ఏ కాపలా ఏర్పాట్లు చేసుకోలేదు. కాబట్టి మనం ఈ రోజు రాత్రే ఆ ధాన్యాగారాన్ని కొల్లగొట్టుదాం. తర్వాత చూద్దాం రేపు ప్రొద్దున తమాషా. ఈ దెబ్బతో వాళ్లకి ఖ్యాతి  బదులు అపఖ్యాతి కలుగుతుంది’’ అని చెప్పి ఆ రాత్రి కి ఏం చేయాలో పన్నాగం వేశారు.