N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Tuesday, 2 February 2016

SwamiNarayan - Episode 68



బ్రహ్మ భోజనం ఏర్పాట్లు

శ్రీ స్వామి నారాయణ గారు స్వయంగా బ్రహ్మ భోజనానికి కావలసిన ఏర్పాట్లని పర్య వేక్షించ సాగారు. పలురకములైన వంట పదార్థాలు తయారవుతున్నాయి. బ్రాహ్మణులకి ఇష్టమైన మోదకాలు కూడా తయారుగా ఉన్నాయి. అయితే ఆ బ్రాహ్మణుల జాడ మాత్రం వారికి కనిపించడం లేదు.”ఏమిటీ వీళ్ళు ఇంకా రాలేదేమిటీ? ఇక్కడ వంట ప్రయత్నాలన్నీ బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి” అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటుండగా స్వామి నారాయణ గారు “ వాళ్లకి ఏదో పని ఉండి ఉంటుంది బహుశా ! ఆ పని అయిపోగానే వాళ్ళు వస్తారు” అని అన్నారు. 


గ్రామాధికారి మాత్రం “ ఇంత మంది బ్రాహ్మణులకి ఒక్కసారే పని తగులుతుందని అంటారా ? ఏమీ లేదు ! ఏదో గడబిడ జరిగింది. వాళ్ళు వస్తారో లేదో తెలియదు” అని సందిగ్ధం వెలిబుచ్చాడు.
“గ్రామాధికారి గారూ ! మనం ఏదో మంచి పని చేద్దామని తలబెట్టి నప్పుడు ఎందుకు అశుభమైన మాటలు మనం మాట్లాడుకోవాలి? వస్తారు లెండి ! ఏదో పనిలో ఉంది ఉంటారు “ అని స్వామి నారాయణ గారు సర్ది చెప్పారు.

“స్వామి నారాయణ గారూ ! మీరు ఒక పని చేయండి. మీలో ఇద్దరు మళ్ళీ ఆ బ్రాహ్మణుల దగ్గరకి వెళ్లి స్వయంగా రమ్మని ఆహ్వానం చేయండి అని చెప్తుండగా జటా శంకర్  గారు “ఆ అవసరం లేదు, నేనే వచ్చాను” అని చెప్పారు.
“అదేమిటీ మీరొక్కరే వచ్చారు? మీ సముదాయం వారెవరు రాలేదా? అని అడిగారు
“అదే నేను మీకు చెప్దామని వచ్చాను. మేమెవ్వరం మీరు చేసే బ్రహ్మ భోజనానికి రావడం లేదు” అని జటా శంకర్ గారు చెప్పారు. స్వామి నారాయణ గారు ఎందుకు? అని ప్రశ్నించారు.
ఎందుకంటే మాకు చోటా గడ్కి బ్రాహ్మణుల తో పాటు కూర్చొని తినడానికి ఇష్టం లేదు కనుక మేమేవ్వరం రా దలచుకోలేదు” అని ఆయన నిష్కర్షగా చెప్పారు.
స్వామి నారాయణ గారి శిష్యుడొకడు మేము వంటలన్నీ చేసేశాం. అంతే కాకుండా మేము చోటా గడ్కి బ్రాహ్మణ సముదాయానికి కూడా ఆహ్వానం పంపాము. ఇన్ని ఏర్పాట్లు మేము చేశాము అవన్నీ వ్యర్థం అయిపోవా? అని అడిగాడు.
మీరు ఆ చోటాగడ్కి వాళ్ళని కూడా పిలిచారు. వాళ్ళ ప్రక్కన కూర్చుని మాకు భోజనం చేయడం ఇష్టం ఉండదు కాబట్టే మేము రావడం లేదు. ఏమైనా కానీయండి.” అని చెప్పి నమస్కారం చేసి ఆయన విసురుగా అక్కడనుంచి వెళ్ళి పోయారు.
సరే ! ఇక గిరిజా శంకర్ గారు రావాలి అని స్వామి నారాయణ గారు అన్నారు. ఈ లోపల గిరిజా శంకర్ గారి ప్రతినిధి వచ్చి మేము మీ బ్రహ్మ భోజనానికి రాదలచుకోలేదు. మీరంతా ఎదురు చూస్తు౦టారని చెప్పడానికి వచ్చాను. “ఎందుకు?’’ అని స్వామి నారాయణ గారు అడిగితే “ మేము బడా  గడ్కి వారి ప్రక్కన కూర్చుని భోజనం తినడం
ఏమిటీ ? నిల్చోడానికి కూడా ఇష్టపడం. కాబట్టి మేము మీ బ్రహ్మ భోజనానికి రాదల్చుకోలేదు అని నిష్కర్షగా చెప్పాడు. అప్పుడు స్వామి నారాయణ గారు “బ్రాహ్మణ వర్గమంతా ఒకటేకదా ! ఎందుకు నాయనా మీరంతా ఇలా రెండు వర్గాలుగా చీలిపోయారు? దీనికి కారణమేమిటీ ?” అని అడిగారు. “ అబ్బో ! దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఈ సందర్భంలో అవన్నీ నాకు చెప్పవలసిన అవసరం లేదు.” అని వచ్చినాయన నిష్కర్షగా చెప్పాడు. దానికి సమాధానంగా స్వామి నారాయణ గారు కాదు కాదు ! ఇలా బ్రాహ్మణు లంతా రెండుగా చీలిపోవడం బాగుండదు. మీఇద్దరి మధ్య నేను మధ్యవర్తిత్వం చేస్తాను. మీ ఇద్దర్నీ కలపడానికి ప్రయత్నం చేస్తాను. అందుకనే అడుగుతున్నాను నాయనా !” అని అన్నారు.  
“మీ మధ్యవర్తిత్వం మాకేమీ అక్ఖర్లేదు. మేము మీ బ్రహ్మ భోజనానికి రావడం లేదు అని చెప్పి, నమస్కరించి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న పరివారమంతా ముందేం జరగబోతుందో అని ఆందోళన పడసాగారు.
“ప్రభుశ్రీ ! బ్రాహ్మణులు రాకుండా ఈ బ్రహ్మ భోజనం ఎలా జరుగుతుంది?ఈ వంటకాలన్నీ మనం పెద్ద ఎత్తున తయారు చేశాం కదా ! అవన్నీ వ్యర్థం అయిపోతాయి కదా ! ఇప్పుడు ఏం చేద్దాం ప్రభూ  మనం?” అని ఆందోళన పడుతుండగా స్వామి నారాయణ గారు ప్రశాంతంగా “మీరేమీ గాభరా పడవద్దు ! బ్రాహ్మణులు వస్తారు” అని చెప్పారు.
 “ప్రభుశ్రీ ! ఎక్కడ్నుంచి వస్తారు బ్రాహ్మణులు? ఆ పెద్ద గడ్కీ, చిన్న గడ్కీకి చెందిన బ్రాహ్మణులు మేం రామని ఖచ్చితంగా  చెప్పి పోయారు కదా !” అని అడిగారు.
‘బ్రాహ్మణులు ఆరణ్యం నుంచి వస్తారు. మనం అరణ్య మార్గం నుండి వచ్చాం కదా ! అక్కడ మనం భిల్లుల్ని, అరణ్య వాసుల్ని చూశాం కదా ! వెళ్లి వాళ్ళని ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానించు” అని చెప్పి ఒక శిష్యుడ్ని ఆయన పంపించారు. “అలాగే ప్రభుశ్రీ !” అని చెప్పి ఆ శిష్యుడు అరణ్యానికి బయల్దేరాడు. 
భిల్లుల ఆగమనం

 ఈలోగా స్వామి నారాయణ గారి శిష్యుడు ఆ అరణ్య వాసులకి, భిల్లులకి నాయకుడైన భిల్లక్  దేవ్ ని తీసుకుని వచ్చి స్వామి నారాయణ గారికి పరిచయం చేశాడు. స్వామి నారాయణ గారు ఆదరంగా వారితో “నందోల్ లో జరుగుతున్న ఈ యజ్ఞ స్థలానికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. మేం పిలవగానే మీరందరూ మీ పరివారంతో సహా ఇక్కడకి వచ్చినందుకు మా అందరికి  ఎంతో సంతోషంగా ఉంది’' అని చెప్పారు. భిల్లక్ దేవ్ ప్రభుశ్రీ పాదాలకి వినయంగా నమస్కరించి “ ప్రభుశ్రీ ! ఎక్కడో అరణ్యంలో ఉంటాం మేము అరణ్యవాసులం. ఎవరూ మమ్మల్ని పట్టించుకోరు. అలాంటిది మీ అటువంటి సాక్షాత్తు మహనీయులు శిష్యుడ్ని పంపి, మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి రప్పించినందుకు మేము మీకు సదా కృతజ్ఞులమై ఉన్నాం” అని చెప్పాడు. “ భిల్లక్ దేవ్ ! నేను మిమ్మల్ని ఇక్కడికి ఒక పని మీద తీసుకుని వచ్చాను. నేను మిమ్మల్ని బ్రాహ్మణులుగా మార్చదలచుకున్నాను. మీ చేత ఈ యజ్ఞంలో పూజలు చేయించ దలిచాను. అలాగే మేం చేయబోయే ఈ చౌరాసి వ్రతంలో బ్రహ్మ భోజనం కూడా స్వీకరించమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను” అని చెప్పారు. ఆ మాటలకు భిల్లక్ దేవ్, ఆ పరివారం, శిష్యులు ,అక్కడ ఉన్న వారంతా చాలా ఆశ్చర్య పోయారు. భిల్లక్ దేవ్ “ ప్రభుశ్రీ ! మేం ఆదివాసులం. మాకేమీ తెలియదు. అటువంటి మేము బ్రాహ్మణులం ఎలా అవుతాము? మాకు మంత్రాలేం వచ్చు? మేము పూజలేలా చేయగలుగుతాం? మాకేమీ అర్థం కావడం లేదు” అని అన్నాడు. స్వామి నారాయణ గారు “భిల్లక్ దేవ్! ఆ సంగతంతా నామీద వదిలేయ్ ! నేను చూసుకుంటాను. నేను దగ్గరుండి యజ్ఞోపవీత సంస్కారం చేయిస్తాను. మీకు ఉపనయనం చేసి గాయత్రి మంత్రాన్ని నేను ఉపదేశిస్తాను. మీ చేత యజ్ఞం, పూజ అన్నీ చేయించి మీలో బ్రాహ్మణత్వాన్ని నేను తెస్తాను. మీరేం సందేహించ వద్దు” అని చెప్పారు.