N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 8 February 2016

SwamiNarayan - Episode 69



బ్రహ్మోపదేశం అంటే గాయత్రి మంత్రం ఉపదేశం

స్వామి వారి ఆజ్ఞ ప్రకారంగా భిల్లక్ దేవ్ , అతని అనుచరులందరూ కలిసి స్నానం చేసి, మంచి దుస్తులు వేసుకుని స్వామి వారు చెప్పినట్టుగా రాగానే వారందరినీ ఒక క్రమపద్ధతిలో కూర్చో బెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గరకి వెళ్లి స్వయంగా వారి నుదుటి మీద విభూతి రేఖలు దిద్ది, యజ్ఞోపవీతాన్ని, గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటూ వారి చేత యజ్ఞోపవీతాన్ని ధరింపచేశారు. ఇదంతా చూస్తున్న స్వామి నారాయణ గారి శిష్యులకి, మిగతా అనుచరులకి, ఆ గ్రామాధికారికి కూడా చాలా ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి. ఎక్కడో అరణ్యంలో నాగరికులం అనుకునేవారికి  దూరంగా ఉంటున్న ఈ ఆదివాసులని స్వామి వారు తీసుకుని వచ్చిఎంతో ప్రేమగా స్వయంగా యజ్ఞ స్థలంలో ఆహ్వానమిచ్చి, స్వయంగా గాయత్ర్రి మంత్రం ఉపదేశం చేసి వారికి ఉపనయన కార్యక్రమాలు చేయడం నిజంగా ఆనందబాష్పాలని తెప్పించింది. దగ్గర్లో ఉన్న సమయ దేవత కూడా చూసి ఎంతో సంతోష పడ్డాడు. భగవంతునికి  మనుష్యుల పట్ల, అన్ని ప్రాణుల పట్ల ఒకే విధమైన భావం ఉంటుంది. వారికి ఎటువంటి భేదభావాలు ఉండవని, అదే భగవంతుని నిజమైన తత్వమని, స్వయంగా ఈ భూలోకంలో స్వామి నారాయణుడిగా అవతరించిన ఆ నారాయణుడు ఎంత చక్కగా చెప్పారు. 



ఆ స్వామి వారి సమక్షంలో ఈ ప్రాణమయశరీరం, ఈ ఆదివాసుల ప్రాణమయ శరీరం లోని మాలిన్యాలన్నీ ఎలా ఒక నల్ల తేజస్సుతో బయటకి వెళ్లి పోయి ఎలా కాలగర్భంలో కలిసిపోయాయో అక్కడే ప్రక్కన ఉన్న అగ్నికి అదృశ్యంగా ఆహుతి కావడం అక్కడే ఆదివాసుల సూక్ష్మ శరీరాల్లో , ప్రాణమయ శరీరాల్లో ఒక అద్భుతమైన నల్ల తేజస్సు ఆ మాలిన్యం వదిలి వెళ్ళిపోయిన ప్రదేశాన్ని ఆక్రమించుకుని అద్భుతమైన ఒక విధమైన తేజస్సువాళ్ళ ప్రాణమయ శరీరంలో ఎలా ప్రవేశించిందో ఈ అద్భుత దృశ్యాన్ని ఆ సమయ దేవతయే కాకుండా పైనుంచి సమస్త దేవతలు ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా తిలకించ సాగారు
గాయత్ర్రి మంత్రోపదేశం కాగానే, స్వామి వారి స్పర్శ తగలగానే అక్కడ ఆదివాసుల యొక్క సూక్ష్మ శరీరంలో , సూక్ష్మ భూమికల్లో చెప్పలేనటువంటి, అద్భుతమైనటువంటి మార్పులు వారికి కలిగినాయి. వారి ప్రారభ్ద కర్మలు అన్నీ కూడా క్షణంలో దహించివేయబడ్డాయి. అవి అగ్నికి ఆహుతి కాబడ్డాయి. అంతే కాకుండా ఆ నల్లని మాలిన్యం ఎప్పుడైతే ఆ అగ్నిలో దహనం అయిపోయిందో వారి సూక్ష్మ శరీరంలో ఒక దివ్యమైన తేజస్సు కలిగి , ముఖంలో చెప్పలేనటువంటి దివ్య తేజస్సు రావడం, పాత,చెడు  సంస్కారాలన్ని నశించి మంచి సంస్కారాలతో, మంచి భావాలతో భౌతికంగానే కాకుండా మానసికంగానూ, ప్రాణమయ శరీరంలోను అన్ని కోశాలలో కలుగుతున్నటువంటి మార్పులను వాళ్ళు గమనించ కలిగారు. అక్కడ ఉన్న పరివారం కూడా వాళ్ళలో నూతనంగా కనిపిస్తున్నటువంటి తేజస్సుని కూడా వాళ్ళు ఈ ఆదివాసుల్లో చూడ గలిగారు.
“ఆహా ! మహానుభావుల యొక్క సన్నిధిలోనే మనకి వారి దివ్యమైన శరీరం లో నుంచి , సూక్ష్మమైన శరీరంలో నుంచి అదృశ్యంగా ఉండి బయటకి ప్రసరిస్తున్నట్టి ఆ దివ్యమైన కాంతి కిరణాలు సాధారణమైన మానవుని శరీరానికి తగిలినప్పుడు, వారి శరీరంలో ప్రాణమయ కోశాన్ని తగిలినప్పుడు వారిలో ఎటువంటి మార్పులు వస్తాయో అవి కొంత మంది ప్రత్యక్షంగా చూడగలిగారు. అటువంటప్పుడు స్వామి నారాయణుడు సాక్షాత్తు  భగవంతుడైన నరనారాయణుని సమక్షంలో సాధారణమైన మానవులు దేవ మానవులుగా మారడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా ! పై భూమికలో ఉన్న వాళ్ళందరు కూడా ఎంతో సంతోష పడ్డారు. ఆ అద్భుత లీల ఈ ఆదివాసులందరూ పూర్వ జన్మలో చేసుకున్న ఎంతో పుణ్యం వల్లే సాక్షాత్తు స్వామి నారాయణ గారి ద్వారా బ్రాహ్మణులకి జరగవలసిన రెండు ఉపనయన సంస్కారాలు అన్నీ జరిగాయి అని వాళ్లందరుఆనందించారు.

బడా గడ్కి  వారి యొక్క క్రోధం

ఈ సమాచారమంతా తెలుసుకోనిన బడా గడ్కి  బ్రాహ్మణులంతా అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. “ఎంత ధైర్యం ! ఆదివాసులని, అంటరాని వాళ్ళని తీసుకుని వచ్చి, వాళ్లకి గాయత్రి మంత్రం సంస్కారాన్ని చెప్పి వాళ్లకి యజ్ఞోపవీతం ధారణ చేస్తారా?” “అలా చేసినందు వల్ల వాళ్ళు బ్రాహ్మణులై పోతారా?” అని ఒకళ్ళు, “ బ్రాహ్మణుడు కావాలంటే బ్రాహ్మణుని కుటుంబం లోనే పుట్టాలి కదా !, అప్పుడే కదా బ్రాహ్మణునికి కావలసిన సంస్కారాలు అలవడతాయి, అంతే కాని ఎవరినో, ఏ జాతి వారినో  తీసుకుని వచ్చి, వారికి యజ్ఞోపవీత సంస్కారం చేసినంత మాత్రాన బ్రాహ్మణులెలా అవుతారు? ” అని ఒకరు , “ ఇది ఏమైనా సరే ! మనం సహించ కూడదు, ప్రతిచర్య తీసుకోవలసిందే !’’ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు క్రోధంగా తర్కించుకో సాగారు.

చోటా  గడ్కి  వారి ఆలోచన

అదే విధంగా గిరిజా శంకర్, చోటా గడ్కి  బ్రాహ్మణు లందరు “ఇంత అవమానం చేస్తున్నారు. మనం సహించేది లేదు.    వాళ్లకి ఎట్లాంటి గుణ పాఠం చెప్పాలంటే యజ్ఞానికి కూడా వాళ్ళు ఉండకుండా ఈ గ్రామం నుంచి పారిపోవాలి. మళ్ళీ ఈ గ్రామం ముఖం కూడా చూడకుండా ఉండాలి” అని ఒకడు, “సరే ! ఏదో గాయత్రి మంత్రోపదేశం చేశాడు, వాళ్ళని బ్రాహ్మణులుగా మార్చి, బ్రహ్మ భోజనం లో వాళ్ళని బ్రాహ్మణులు గా కూర్చోబెట్టి వారికి అన్న సంతర్పణ చేశారు. రేపు పూజా కార్యక్రమం , యజ్ఞం చేస్తాం అని అంటున్నారు కదా ! అహింసా యజ్ఞంలో వీళ్ళకి మంత్రాలెలా పలుకుతాయి? ఈ ఆదివాసులకి భాషె సరిగ్గా రాదు, ఉచ్చారణ సరిగ్గా ఉండదు. వాళ్ళు ఇటువంటి పూజా కార్యక్రమాలు ఎలా చేస్తారు?బ్రాహ్మణులు లేకుండా ఇవన్నీ జరిగే పనులేనా?” అని ఒకడు, “ఏది ఏమైనా రేపు జరగబోయే పూజా కార్యాక్రమాలు ఎలా చేస్తారు? యజ్ఞంలో ఎలా కూర్చుంటారు వాళ్ళు?మంత్రాలు ఎలా చదువుతారు? మనం ఇవన్నీ రేపు చూద్దాం. మనం లేకుండా అక్కడ ఏ పనులు జరగవు కదా ! రేపు జరగబోయే అవమానం మనం దగ్గరుండి చూద్దాం లే !’ అని చోటా గడ్కి  వాళ్ళు నిర్ణయించుకున్నారు.
ఇక్కడ యజ్ఞోపవీత సంస్కారం జరిగిన వందలాది మంది భిల్లక్ దేవ్ సహచరులు, ఆదివాసులందరు కూడా సంతోషంగా వారికి వడ్డించి నటువంటి పదార్థాలు ఎంతో ఆనందంగా తిన సాగారు. స్వయంగా స్వామి నారాయణ గారి పర్యవేక్షణలో వండబడిన ఆ వంటకాలు, వారి చేతి స్పర్శ , వారి ఆశీర్వాదాన్ని పొందినట్టి ఆ ప్రసాదం అద్భుత ప్రసాదంగా మారిపోయింది. వారు, భోజనానికి కూర్చున్న ప్రతి బ్రాహ్మణ ఆదివాసి ఎప్పుడైతే ఆ భోజనాన్ని నోట్లో వేసుకున్నారో వాళ్ళ అన్నమయ, ప్రాణమయ, కామమయ, జ్ఞానమయ,ఆనందమయ కోశం అన్నీ కూడా అద్భుతంగా మారిపోయాయి. వారిలో దివ్యమైనటువంటి తేజస్సు కణ మంతా నిండి పోయింది. ఆ ఆహారం కూడా అద్భుతమైనట్టి దైవ ప్రసాదం గా మారి ఆ ఆదివాసులని దేవ మానవులుగా మార్చి వేసే ప్రక్రియ భౌతిక మరియూ ప్రాణమయ శరీరంలో కలుగుతున్న మార్పులని చూసినటువంటి సమయ దేవత మరియూ ఇతర దేవతలు కూడా చాలా చాలా  ఆనంద పడ్డారు. ఇలా వారంతా తృప్తిగా, కడుపు నిండా  స్వామి వారు పెట్టిన ప్రసాదాన్ని ఎంతో భక్తి భావంతో, ఎంతో ఆనందంతో  ఆ ఆదివాసులు పరిపూర్ణ మైనట్టి సంతోషంతో హృదయ పూర్వకంగా వారు ఆరగించారు. ప్రతి ఒక్కరికి కూడా స్వామి నారాయణ గారి ఆశీర్వాదం లభించింది. “ ఆహా ! ఎంద్ద్త అదృష్టం చేసుకున్నారు ఈ ఆదివాసులు ! ఎంత పుణ్యం చేసుకున్నారు వీళ్ళు ! అని అందరు మనస్సులో అనుకున్నారు. బయటకి కూడా అన్నారు. భిల్లక్ దేవ్ కూడా అతని సంతోషాన్ని పట్టలేక పోయాడు. వాళ్ళందరికీ స్వామి నారాయణ గారి పట్ల ఎంతో భక్తి, ప్రేమ, అనురాగాలు కలిగాయి. వాళ్ళ సంస్కారాలన్నీ క్షణంలోనే మారి పోయి మంచి సంస్కారాలతో దివ్యమైన తేజస్సుతో వాళ్ళు అందరికీ కనిపించ సాగారు.
అహింసా యజ్ఞం
మర్నాడు జరగబోయే యజ్ఞానికి కావలసినవన్నీ తయారైపోయినాయి. స్వామి నారాయణ గారి శిష్యులలో కొంత ఆత్రుత, ఆందోళన పెరిగిపోయాయి. వారు ప్రభుశ్రీ దగ్గరకి వచ్చి “ప్రభుశ్రీ ! ఇప్పుడు యజ్ఞం ప్రారంభం కాబోతుంది. పూజ కూడా చేయాలి. సంస్కృతంలో శ్లోకాలు కూడా చదవాలి. ఆహుతులు అగ్ని దేవునికి సమర్పించాలి. మరి బ్రాహ్మణులు లేకుండా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ?” అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా స్వామి నారాయణ గారు “మన బ్రహ్మ దేవతలు, బ్రాహ్మణదేవతలు ఉన్నారు కదా ! వారిని పిలిపించండి, ఫరవా లేదు” అని అన్నారు. స్వామి నారాయణ గారి ఇంకొక శిష్యుడు “అలాగే స్వామీ ! వాళ్ళందరినీ తప్పకుండా పిలుస్తాం. కాని సంస్కృతంలో మంత్రాలు అవన్నీ చదవాలి కదా ! అవన్నీ వారికి సాధ్యమవుతాయా?” అని అన్నాడు. “నిన్నటి ఆ బ్రాహ్మణులు ఉన్నారు కదా ! వాళ్ళందరినీ పిలుచుకుని రండి”  అని స్వామి నారాయణ గారు మళ్ళీ చెప్పారు. అక్కడ అప్పుడే వచ్చిన జటా శంకర్ గారు , గిరిజా శంకర్ గారు, వారి మొత్తం బ్రాహ్మణ సముదాయం అంతా వచ్చేసి గిరిజా శంకర్ గారు స్వామి నారాయణ గారి శిష్యుడితో ఇలా అన్నారు. “ఇప్పటికే మీ గురువైన స్వామి నారాయణ గారు వాళ్ళని తీసుకు రమ్మని రెండు సార్లు చెప్పారు. అయినా మీరెందుకు సందేహిస్తున్నారు? వెళ్లి పిలుచుకుని రండి”. స్వామి నారాయణ గారు జటా శంకర్ , గిరిజా శంకర్ గార్లని ఉద్దేశించి “ నాయనా ! మీరిద్దరూ, మీ సమస్త బ్రాహ్మణ సముదాయాన్ని తీసుకుని ఇక్కడకి వచ్చారు. నాకుచాలా సంతోషంగా ఉంది. అప్పుడు గిరిజా శంకర్ గారు , “ భగవాన్ గారూ ! మాకు ఎప్పుడు ప్రసన్నత కలుగుతుందంటే ఎప్పుడైతే ఆ బ్రాహ్మణులు వచ్చి, కూర్చొని పూజలు చేస్తారో, ఎప్పుడైతే సంస్కృతంలో ఆ మంత్రాలు చదువుతారో, ఆ తంతు అంతా చూసినప్పుడే మాకు అప్పుడే నిజమైన సంతోషం కలుగుతుంది’’ అని కాస్త వెటకారంగా అన్నారు. దానికి స్వామి నారాయణ గారు “ సరే ! మేం అలాగే చేసి మిమ్మల్ని ప్రసన్న పరుస్తాం” అని చెప్పి ఆయన  ఆనంద్ దిఘే తో “ ఆనంద్ దిఘే గారూ ! మీరు వెళ్లి ఆ భిల్లక్ దేవ్ ని   ఆ మిగతా పరివారాన్ని తీసుకుని రండి’ అని ఆజ్ఞాపించారు. “అలాగే ప్రభూ !” అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణులంతా వెటకారంగా “ వెళ్ళండి ! వెళ్ళండి “ వెళ్లి ఆ బ్రాహ్మణ సముదాయాన్ని తీసుకుని త్వరగా రండి “ అంటూ గట్టిగా నవ్వుతూ వికటాట్టహాసం చేస్తూ మాట్లాడారు. ఈ లోపల భిల్లక్ దేవ్ తన అనుచరులందరితో వచ్చి వినయంగా స్వామి నారాయణ గారికి నమస్కరించి అక్కడే నిల్చున్నాడు. జటా శంకర్ గారు, గిరిజా శంకర్ గారు వాళ్ళని చూసి కొంత ఆశ్చర్య పడిపోయారు. “ ఇదేమిటీ చూడ్డానికి వీళ్ళు బ్రాహ్మణుల్లాగే ఉన్నారు? “ అని ఒకడు , “ అవును ! చూడ్డానికి బ్రాహ్మణుల్లాగానే ఉన్నారు మరి ! చూద్దాం ! మంత్రాలెలా చదువుతారో!”  అని ఇంకొకరు ఇలా వాళ్ళు మాట్లాడ సాగారు. స్వామి నారాయణ గారు భిల్లక్ దేవ్ ని , ఆయన అనుచరులందరినీ ఉద్దేశించి భిల్లక్ దేవ్ గారూ ! మీరందరూ కూడా పూజ చేయాలి, స్తోత్రాలు చదవాలి, యజ్ఞం చేయాలి కాబట్టి మీరంతా సంసిద్ధులు కండి’’ అని చెప్పి వారివైపు కరుణా రస దృష్టితో చూశారు. అక్కడే ఉన్న సమయ దేవతకి, మిగతా దేవతలకి అద్భుతమైన దృశ్యం కనిపించింది. స్వామి నారాయణ గారి నయనాల నుండి ఒక కాంతిపుంజం లయాకారంలో బయల్పడి , ఆ కాంతి కిరణాలన్నీ భిల్లక్ దేవ్ మరియూ ఆయన అనుచరులందరి దేహాల చుట్టూ వలయాకారంగా ఏర్పడి మెల్ల మెల్లగా వారి దేహంలోకి సూక్ష్మ శరీరంలోని చొచ్చుకు పోయాయి. వాళ్లకి ఒక అద్భుతమైనటువంటి కాంతి గోచరించింది. ఆ విజ్ఞాన మనబడే కాంతి ఆ క్షణంలో వారి భౌతిక శరీరంలోనే కాకుండా వారి ప్రాణమయ శరీరం, వారి సూక్ష్మ శరీరమంతా నిండుకుపోయింది. భిల్లక్ దేవ్ , మిగిలిన అనుచరులందరూ కలిసి “ అలాగే స్వామి !” అని చెప్పి పూజకి ఉపక్రమించారు. ఈ అద్భుత దృశ్యాన్నంతా చూస్తున్న దేవతలు, సమయ దేవత అందరూ ఆశ్చర్య పోయారు, సంతోషించారు. భిల్లక్ దేవ్ , అతని అనుచరులందరూ వినాయకుని స్తుతి చేసి మిగతా పూజ అంతా చేశాక , యజ్ఞం చేస్తూ , యజ్ఞంలో ఆహుతులు సమర్పిస్తూ ఎంతో మధురంగా, శ్రావ్యంగా వేద మంత్రాలు ఉచ్చరిస్తూ, అంతా తెలిసిన బ్రాహ్మణు ల్లాగా ఆ యజ్ఞ తంతు అంతా నిర్వహిస్తుంటే అక్కడ చేరిన బ్రాహ్మణ సముదాయానికి చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళందరికీ నాయకులైన జటా శంకర్, గిరిజా శంకర్ గార్లు స్వామి నారాయణ గారి దగ్గరకు వచ్చేసి ఒక్కసారిగా ఆయన పాదాల మీద పడిపోయినారు.
“ప్రభూ !  “మమ్మల్ని క్షమించండి”. “మమ్మల్ని మన్నించండి” అంటూ స్వామి నారాయణ గారి పాదాల మీద పడిపోయారు. స్వామి నారాయణ గారు వారిని లేవ దీసి  వారిద్దరినీ ఉద్దేశించి జటా శంకర్ గారూ, గిరిజా శంకర్ గారూ ! మీ సమస్త బ్రాహ్మణ సముదాయమంతా ఎంతో పూజనీయులు. మీరంతా గౌరవనీయులు. ఉత్తమమైన, గౌరవించదగిన   బ్రాహ్మణ కుటుంబాలలో పుట్టారు . మీరంతా ఏదో చిన్న అభిప్రాయ భేదంతో  విడిపోయి ఇలా దెబ్బలాడుకోవడం, తర్వాత అహంకారం మీలో ప్రవేశించడం ఏ మాత్రం మంచిది కాదు. బ్రాహ్మణ కులంలో పుట్టినంతమాత్రాన బ్రాహ్మణుడు కానే కాడు. బ్రాహ్మణుడు చేయ వలసిన స్వచ్చమైన  కర్మని, ధర్మాన్ని ఎవరైతే చేస్తారో వారే నిజమైన బ్రాహ్మణులు. అహంకార రహితంగా ఉంటూ సమాజానికి ఆదర్శప్రాయ౦గా ఉండాల్సిన మీరు ఏదో చిన్న భేదాభిప్రాయంతో, దురహంకారాలతో మీరు బ్రాహ్మణత్వానికే దూరంగా వెళ్ళిపోవడం మంచిది కాదు. ఉత్తమమైన సంస్కారాలు మనం  కలిగి ఉండాలి. సదాచారాలు చేస్తూ ఉండాలి. అహంకారానికి మనమెప్పుడూ దూరంగా ఉండాలి. కేవలం యజ్ఞోపవీత ధారణ తోటి బ్రాహ్మణులు కాలేరు. శ్రద్ధ, సదాచారం, భక్తి, శుద్ధమైనటువంటి కర్మ, ధర్మం ఇవన్నీ చేసినప్పుడే మనం యజ్ఞోపవీతం ధరించిన బ్రాహ్మణులమౌతాం అని వారందరికీ ఉపదేశించారు. వాళ్ళందరూ పశ్చాత్తాప పడి, మేమంతా మా భేద భావాలు మర్చిపోయి మీరు చెప్పిన మార్గం లో నే నడుస్తాం అని చెప్పారు.
ఈ విధంగా స్వామి నారాయణ గారు సమాజం మొత్తానికి ఒక సందేశాన్ని అందించారు. ఇది చూసిన సమయదేవత, దేవతలు, మానవులు అందరూ “స్వామి నారాయణ కీ జై” , “స్వామి నారాయణ కీ జై’’ అంటూ స్వామి నారాయణగారికి జయజయ ధ్వానాలు చేశారు.