N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 7 March 2016

SwamiNarayan - Episode 75

జునాగడ్ కి స్వామి నారాయణ గారి రాక    
ఘన సత్కారాలతో, మంగళ వాయిద్యాలతో, భజన కీర్తనలతో, నృత్య గానాలతో ప్రభుశ్రీ స్వామి నారాయణ గారిని ఎంతో వైభవంతో సాదరంగా జునాగడ్ నగరానికి స్వామి నారాయణ గారి భక్తులు తీసుకుని వచ్చారు. ఒక పెద్ద ఊరేగింపుగా ఆ జన సందోహమంతా జునా గడ్ లోనికి ప్రవేశించింది. భక్తులంతా ఎంతో పారవశ్యంతో చక్కటి కీర్తనలు పాడి ఆనందించ సాగారు.


పండితుల యొక్క ఫిర్యాదు
ఈ పండితులంతా కలిసి మళ్ళీ ఇంకొకసారి నవాబు గారి దగ్గరకి వెళ్ళారు. నవాబు గారు వీరిని చూస్సి మళ్ళా ఏమైంది? ఎందుకు వచ్చారు?ఏమిటీ సంగతి? అని ప్రశ్నించగా “ నవాబు గారూ ! స్వామి నారాయణ గారు మన నగరానికి వచ్చేశారు. రాగానే న్యాయసూత్రాలని ఆయన ఉల్లంఘించారు. మీ ఉత్తరువులనే ఆయన ధిక్కరించారు” అని చెప్పారు. నవాబు గారు “ అలాగా ! ఏం చేశారు ఆయన?” అని ప్రశ్నించారు. “ ఏమీ లేదు . మసీదు ప్రక్కనుంచి వెళ్ళుతున్నప్పుడు ఎవ్వరు కూడా ఎటువంటి వాయిద్యాలని మోగించకూడదు , ఊరేగింపులు చేయకూడదని మీరు ఒక కఠినమైన ఉత్తరువు జారీ చేశారు కదా ! ఆ నియమాన్ని మీ ఉత్తరువుని వాళ్ళు ఉల్లంఘించారు. మేళతాళాలతో, వాయిద్యాలతో, కీర్తనలతో, భజనలతో పెద్ద ఊరేగింపుగా మీ మసీదు ముందర్నుంచే వాళ్ళు వెళ్ళారు. ఈ రకంగా మీ ఆగ్నని వాళ్ళు ధిక్కరించినట్లే కదా ! కాబట్టి మీరు వారికి కఠినమైన దండన విధించాలి. అలా కనుక మీరు చేయకపోతే మీరు చూస్తూ ఉంటారు. స్వామి నారాయణ గారు మీ సింహాసనం మీద కూర్చుని మీ రాజ్యం ఏలుతుంటారు” అని వాళ్ళు ఎంతో ఆందోళనతో ఫిర్యాదులు చేయసాగారు.
నవాబు గారు వారు చెప్పిందంతా విని “అవును ! నిజమే! మనుష్యుల కోసం నేను చేసిన న్యాయసూత్రాలు, ఉత్తర్వులు ప్రతివాళ్ళు పాటించక తప్పదు. ఎవరైతే దాన్ని పాటించరో వారికి కఠినమైన శిక్ష విధించడం అవసరం, అది మా కర్తవ్యం కూడా”  అని చెప్పగానే పండిత శ్రేష్టులంతా ఎంతో సంతోషించారు. “ఆహా ! మనం వచ్చిన పని అయింది కదా ! ఇక స్వామి నారాయణ గారి పని కూడా అయిపొయింది కదా !’’ అని వాళ్ళు భావించారు. అయితే నవాబు గారు ఇంకొక విషయం చెప్పారు. “నేను చేసిన న్యాయ సూత్రాలు కాని ఉత్తర్వులు కాని కేవలం మనుష్యులని ఉద్దేశించి చేసినవి మాత్రమే. భగవంతుడికి నేనెటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. సాక్షాత్తు భగవంతుని అవతారమైన శ్రీ స్వామి నారాయణ గారు ఏం చేసినా మనం దాన్ని న్యాయసూత్రంగా భావించవచ్చు. కాబట్టి వారు చేసిన న్యాయసూత్రాలని మనం పాటించాలి. అల్లాయే కాని భగవంతుడే కాని ఎవరైనా సరే ! ఏం చేసినా మన శ్రేయస్సు కోసమే చేస్తారని మీరు కూడా నమ్ముతారు కదా ! కాబట్టి భగవాన్ శ్రీ స్వామి నారాయణ గారు స్వయంగా అల్లాయే కాబట్టి ఆయన ఏం చేసినా మనందరి మంచి కోసమే చేస్తారు సుమా !” అని చెప్పగా ఆ పండిత శ్రేష్టులందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. ఏం జవాబు చెప్పాలో తెలియక వారందరూ నిరుత్తరులైపోయారు. మౌనంగా అక్కడనుంచి బయటికి వెళ్ళక తప్పలేదు. రెండవ ప్రయత్నం కూడా ఇంత ఘోరంగా విఫలమైపోయింది అని వారు భావించారు.
మరొక ఫిర్యాదు
అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ పండిత సముదాయమంతా శ్రీ స్వామి నారాయణ గారు బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఆ నగర వీథుల్లో వెళ్తుండగా వందలాది, వేలాది భక్తజనులు ఆయన మీద పుష్ప వర్షం కురిపిస్తుండగా, వారి ఇంటి కిటికీలోంచి, వరండాలో నుంచి , మిద్దెల మీద నుంచి వాళ్ళు శ్రీ స్వామి నారాయణ గారి మీద ఎంతో భక్తిభావంతో పువ్వులను చల్లుతూ, ఊరేగింపుగా వెళ్ళుతున్నటువంటి స్వామి నారాయణ గారు మరి యొక సామాన్యమైన బాలుడు, విగత స్థితిలో ఉన్న బాలుడు తానూ తింటున్న ఆహారాన్ని స్వామి వారికి సమర్పించగా దాన్ని ఆయన అందరి సమక్షంలో స్వీకరించడం గమనించిన పండితులకి స్వామి నారాయణ గారి  మీద నింద మోపడానికి అవకాశం దొరికింది. వాళ్ళంతా ఒక్క పరుగున నవాబు గారి దగ్గరకి వెళ్ళారు. నవాబు గారు ప్రశాంతంగా “ పండితులారా ! ఈసారి ఏం జరిగింది?” అని ప్రశ్నించారు. “అయ్యో ! అయ్యో ! ఎంత అపచారం ! ఎంత అపచారం ! భగవంతుడు ఇలా చేస్తాడా? భగవంతుడు ఎవరైనా మామూలు వ్యక్తుల దగ్గర్నుంచి ఎంగిలిని ప్రసాదంగా తీసుకుంటాడా? ఎటువంటి భగవంతుడు ఈ స్వామి నారాయణ? ఎంత ఘోరం జరిగిపోయింది?” అంటూ ఆందోళన పడసాగారు. అది కూడా ఒక చిన్న బాలుని దగ్గర్నుంచి తీసుకున్నారు అని అనగా నవాబు గారు ప్రశాంత స్వరంతో “భగవంతుడికి అలాంటి భేదభావాలు ఉండవు కదా ! అందులో భగవంతుడు భక్తుడు ఇచ్చే ప్రసాదం ఎటువంటిదా అని  ఆలోచించడు దాని వెనక ఉన్న ఆ భావన యొక్క  పరిశుద్ధత మాత్రమే చూస్తాడు” అని మీకు తెలుసు కదా ! అందులో మరి చిన్న పిల్లవాడు చేశాడు అని అంటున్నారు. అమాయకంగా ఉండే చిన్న పిల్ల హృదయాల్లో భగవంతుడు ఉండడా?” అని ఆయన తిరుగు ప్రశ్న వేశాడు. ఇటువంటి సమాధానాన్ని నవాబు దగ్గర్నుంచి ఆశించని ఆ పండిత సముదాయానికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక వెనక్కి తిరగవలసి వచ్చింది.
నవాబు గారి అర్పణ
వెంటనే ఆ నవాబు గారు స్వయంగా ఆ ఊరేగింపుని చూడడానికి తన రాజభవనం బయటకి వెళ్లి అంతా గమనించ సాగారు. కొన్ని వేలాదిమంది జనులు అందరు కూడా చాలా నిబ్బరంగా, నిశ్చింతగా స్వామి వారి వెనక వెళ్ళుతున్నారు. ఇది చూసిన ఆయన పరమ భక్తుడు కనుక , సాధు సజ్జనుడు కనుక వెంటనే గబగబా పరుగు పరుగున తన భవనపు మిద్దె మీదనుంచి మెట్లన్నీ దిగి, ఆ పండిత సముదాయం దాటి స్వామి నారాయణ గారికి స్వాగతం చెప్పడానికి హుటాహుటీగా బయలుదేరాడు. ఇదంతా చూస్తున్న నవాబుగారి అనుచరులకి , ఈ పండిత సముదాయానికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది. స్వామి నారాయణ గారి దగ్గరకి వెళ్ళిన నవాబు గారు ఆయనకీ  నమస్కారం చేశారు. “ స్వామి  నారాయణ గారూ ! మీ గురించి ఉన్న చిన్న సందేహం కూడా నాకు తీరిపోయింది. వేలాదిమంది చక్కగా, నిశ్చింతగా మీ వెంట ఊరేగింపుగా, మిమ్మల్ని జయజయ ధ్వానాలతో కీర్తిస్తూ మీతోపాటు  హాయిగా ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ ఆకలిగా ఉన్న వారు కూడా స్వేచ్చగా వాళ్ళ ఆకలిని తీర్చు కుంటున్నారు. ఇటువంటి వ్యక్తిత్వం కేవలం భగవంతుడికే ఆ ఖుదాకే ఉంటుంది. భగవాన్ స్వామి నారాయణా ! మీరే నా అల్లా ! మీరే నా ఖుదా !” అని వినయంగా శిరస్సు వంచి ఆయనకి నమస్కారం చేశారు. ఈ ద్ర్శ్యాన్ని చూస్తున్న ఆ ప్రజా సమూహమంతా, ఆ పండిత శ్రేష్టులంతా చాలా ఆశ్చర్య పడిపోయారు. ప్రజలు, భక్తులంతా స్వామి వారికి జయజయ ధ్వానాలు చేస్తూ ఉండిపోయారు. ఆ విహంగా ఆ నవాబు గారు తన భక్తిశ్రద్ధలని ప్రకటించి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.
జనా బాయి ప్రార్థన 
మర్నాడు జునాగడ్ లోని ప్రముఖులందరూ, స్వామి నారాయణ్ గారిని గౌరవించే వాళ్ళందరు ఒక సమావేశాన్ని  నిర్వహించారు. వారందరిలో జనాబాయి ప్రభుశ్రీ ! మేమందరం ఎంతో భక్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు మా ఆహ్వానాన్ని అందుకుని ఈ జునాగడ్ భూమిని మీ పాద స్పర్శతో పవిత్రం చేశారు. స్వామీ ! మా అందరి మనస్సులలో ఒక చిన్న కోరిక ఉంది స్వామి నారాయణ గారి మందిరాన్ని నిర్మించాలనే అభ్యర్థనని మీరు స్వీకరించాలి. స్వామి నారాయణ గారి ప్రముఖ శిష్యుడు ఒకాయన మీ సంకల్పం మరి బాగానే ఉంది. కాని మీరు మీ సంకల్పం గట్టిగా చేసుకోవాలి. మరి దీనికి స్వామి నారాయణ గారి సంప్రదాయం వాళ్ళు ఏదో రకంగా చేయూత నివ్వాలి. మంచి భూమిని చూసుకోవాలి. మిగతా సదుపాయాలన్నీ మనం చూసుకోవాలి. మన సంకల్పం కనుక గట్టిగా ఉంటె మందిర నిర్మాణం తప్పకుండా జరుగుతుంది. వెంటనే జనాబాయి ప్రభుశ్రీ ! నా హవేలిని మందిరంగా మార్చడానికి ఇప్పుడే నేను మీకు సమర్పిస్తున్నాను. అని అనగా జనాబాయి ! మందిర నిర్మాణం నీ మనసులో ఉండగానే జరిగిపోయింది (౪౩.15 )తప్పకుండా మందిర నిర్మాణం అవుతుంది అనగా జనాబాయి ఆయన్ని ఈవిధంగా అభ్యర్థించింది ఈ మందిర నిర్మాణం పూర్తీ అయ్యేంతవరకు మీరు జునాగడ్లోనే ఉండవలసింది అని నేను  మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పింది. దానికి స్వామి నారాయణ గారు మందిర నిర్మాణం ప్రారంభం అవగానే నేను ఆ మందిర నిర్మాణాన్ని బ్రహ్మానంద స్వామి వారికి అప్పగిస్తాను. ఆయన పర్యవేక్షణలోనే ఈ మందిర నిర్మాణం జరుగుతుంది. ఈ మందిర నిర్మాణం పూర్తయ్యేంత వరకు బ్రహ్మానంద స్వామి వారు ఇక్కడే ఉంటారు అని చెప్పి ఆ పనిని బ్రహ్మానంద స్వామి గారికి అప్పగించారు. దానితో అక్కడ చేరిన వారందరూ సంతోష పడ్డారు.
నవాబు గారితో బ్రహ్మానంద స్వామి వారి భేటి   
బ్రహ్మానంద స్వామి వారు ఇదివరకే కవి రాజుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కాబట్టి ఆయనకి ఈ రాజులు, రాణులు, నవాబుల పరిచయాలు ఉన్నాయి. దానిని పురస్కరించుకుని ఆయన ఒక సారి నవాబు గారి కోరిక ప్రకారం ఆయన దర్బారుకి వెళ్లి ఆ నవాబు గారికి ఎంతో మర్యాదగా నమస్కారం చేశారు. నవాబు గారు ఆయన్నెంతో ఆదరం గా సాదరంగా ఆహ్వానించారు. ఆయన్ని కూర్చుండబెట్టి “బ్రహ్మానంద గారూ ! మీరెంతో బాగా పాటలు పాడతారు, ఎంతో బాగా కవిత్వం చెప్తారు. మీరు ఈ రోజు మాకు ఒక పాటను వినిపించి మా అందరినీ ఆనంద పరచాలి అని ప్రార్థించారు. బ్రహ్మానంద స్వామి గారు తన గాన మాధుర్యంతో  భగవంతుని గుణాలమీద మీద భక్తిశ్రద్ధలతో ఒక చక్కటి పాట పాడి అందరినీ సంతోష పరిచారు.  అందులో భగవంతుని శక్తిని, భగవంతుని ప్రేమ, కరుణ ని  వర్ణిస్తూ అతను పాడిన పాట అందరికీ సంతోషం కలిగించింది.  
నవాబు గారి ప్రస్తావన
బ్రహ్మానంద స్వామి గారు దర్బారు లో ప్రవేశించినప్పుడు ఆయన పాట పాడక మునుపు మందిర నిర్మాణం ఎలా జరుగుతుంది అని దాని గురించి ఆయన ప్రశ్నించగా బ్రహ్మానంద స్వామి గారు స్వామి నారాయణ సంప్రదాయాన్ని పాటించే భక్తులంతా వారికి తోచిన ధన సహాయం ఇంకా రకరకాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో మందిర నిర్మాణానికి సేవ చేస్తున్నారు. ఏవో కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నామని సెలవిచ్చారు. దాని తర్వాతనే పాట పాడడం జరిగింది. పాట పూర్తయ్యాకనే నవాబు గారు ఒక ప్రస్తావన తెచ్చారు. “బ్రహ్మానంద గారూ ! మీరు మమ్మల్ని స్తుతిస్తూ ఒక పాట పాడి మమ్మల్ని ఆనంద పరచండి” అని చెప్పారు. “అలా కనుక మీరు చేయగలిగితే జోలె పట్టుకుని వాళ్ళని వీళ్ళని భిక్ష అడగక్ఖర్లేదు. మీకు అయ్యే ఖర్చు అంతా మేమే భరిస్తాం” అని చెప్పారు. దానికి బ్రహ్మానంద గారు “నేను కేవలం అందరికీ యజమాని అయిన ఆ భగవంతున్ని మాత్రమే స్తుతిస్తూ పాటలు పాడతాను, రచనలు రచిస్తాను. కాని నవాబుగారూ ! మీరు అందరికీ మాలిక్ (యజమాని) కాదు కదా ! అటువంటప్పుడు మీమీద  నేను ఎటువంటి కీర్తనలు రచించడం కాని పాడడం కాని చేయలేను”  అని సమాధానం చెప్పారు. ఆ సమాధానం విని సభికులందరు కూడా చాలా ఆందోళన పడ్డారు. “అమ్మో ! ఇప్పుడేమవుతుంది?” సాక్షాత్తు నవాబుగారినే ధిక్కరించాడు కదా !” అని వాళ్ళు ఏం జరుగుతుందా అని చెప్పి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నవాబు గారు అంతకుమునుపు కఠినంగా మాట్లాడి చిన్న పరిక్షకి గురి చేశారు. ఈ సమాధానం వినగానే ఆయనకి సంతోషం కలిగింది. ఎంతో నమ్రతా భావంతో ఆయన “ మీరు నా ఎదురుగా నా అధికారాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇంత ధైర్యంగా సమాధానం చెప్పారు. మామూలు మనుష్యులైతే ఇంత ధైర్యంగా సమాధానం చెప్పగలిగే వాళ్ళు కానే కారు. కాబట్టి మీరు కూడా మహాత్ములే. ఆ భగవాన్ స్వామి నారాయణ గారికి నిజమైన భక్తులే మీరు. అందుకనే అంత ధైర్యంగా మీరు నాకు సమాధానం చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మానంద స్వామి గారూ !

చెప్పండి ! ఈ సారి నేను నిజంగానే అడుగు తున్నాను. ఈ మందిర నిర్మాణానికి నా దగ్గర్నుంచి మీకెటువంటి సహాయం కావాలన్నా సరే  నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని ఎంతో సంతోషంగా చెప్పారు. దానికి సమాధానంగా బ్రహ్మానంద స్వామి గారు “నవాబు గారూ ! అవసరమైతే మీ సహాయ సహకారాలు తప్పకుండా మేము మిమ్మల్ని అడుగుతాం. కాని ప్రస్తుతం ఈ మందిర నిర్మాణం స్వామి నారాయణ గారి సత్సంగుల యొక్క  భక్తి , శ్రద్ధ, సమర్పణ భావంతో  జరుగుతుంది. అంతే కాని శాసనపు దానానికి ఎటువంటి ఆవశ్యకత లేదు”. “జై శ్రీ కృష్ణ” , “జై స్వామి నారాయణ” అంటూ నవాబు గారికి నమస్కారం పెట్టి ఆయన అక్కడనుంచి నిష్క్రమించారు. నవాబు గారు ఎంతో గౌరవంతో “ఆహా ! ఎటువంటి దేవుడు! ఆయనకి తగినటువంటి ఎటువంటి శిష్యుడు ! “ అంటూ ఆ గురు శిష్యులైన స్వామి నారాయణ గారిని, బ్రహ్మానంద స్వామి గారిని ఎంతో మెచ్చుకున్నారు.