N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Saturday, 9 July 2016

SwamiNarayan - Episode 84



సాంఘిక దురాచారాలు – సమాజ సంస్కరణలు
శ్రీ స్వామి నారాయణ గారు, ఆయన శిష్యులు గ్రామగ్రామాలు తిరిగి ప్రజల్లో ఉన్న మూఢచారాలు, మూఢ విశ్వాసాలని అరికట్టి మంచి సంస్కరణలు చేసి వారిని దారిలోకి తీసుకుని వస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో భ్రూణ హత్యలు, ముఖ్యంగా స్త్రీ శిశు భ్రూణ హత్యలు సర్వసామాన్యంగా ఉండేవి. బాల్య వివాహాలు, సతీసహగమనం ఇవన్నీ సాధారణ కృత్యాలుగా జరిగిపోతుండేవి. పుట్టిన ఆడపిల్లల్ని మరుగుతున్న పాలల్లో ముంచి చంపేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలంటే సమాజంలో చిన్నచూపు ఉండేది. పురుషాధిక్యం ఎక్కువగా ఉండేది. 



చిన్నప్పుడే బాల్య వివాహం చేసేసి, భర్త చనిపోగానే అభం శుభం తెలియని ఆ బాలికల శిరోముండనం చేసి, తెల్ల వస్త్రం కట్టి, పసుపు-కుంకుమ చెరిపేసి, గాజులు బద్దలు కొట్టి , భర్తతో పాటు చితి మీద కోర్చోబెట్టి సజీవ దహనం చేస్తుండేవాళ్ళు. దానిమూలంగా ఆ అమ్మాయి స్వర్గానికి వెళ్ళుతుందని ప్రచారం జరుగుతుండేది. ఒక వేళ సహగమనం జరగకపోతే ఆ పిల్ల అత్తగారింట్లోనో, పుట్టింట్లోనో శిరోముండనం చేసుకుని ఒక తెల్ల చీర కట్టుకుని ఒక గదిలో పడి ఉండేది. ఎండిపోయిన రొట్టెలు, నీళ్ళు, చాలీ చాలని తిండి, ఇంట్లో పనులన్నీ ఆ పిల్ల నెత్తిమీద పడి ఉండేవి. సరే ! ఇంక చదువు అనేది ఎలాగో చెప్పించే వాళ్ళు కాదు.

ఇదంతా చూసి భగవాన్ శ్రీస్వామి నారాయణ గారి ఆదేశం ప్రకారం ఆయన శిష్యులందరు కూడా ఈ మూఢాచారాలని నిర్మూలించే ప్రయత్నంలో ప్రజలందరినీ కూడా ఉద్రేకపరుస్తుండేవాళ్ళు. ముఖ్యంగా స్త్రీలలో దాదా ఖాచర్  ఇద్దరు కూతుళ్ళు కూడా ఈ పనిలో ముందుకు వెళ్ళుతుండేవాళ్ళు.  ఆడపిల్లలకి చదువులు చెప్పించడం, బాల్య వివాహాలని రద్దుచేయడానికి ప్రయత్నాలు చేయడం, సతీసహగమనాన్ని కూడా నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు. వారికి ప్రజలనుండి చాలా కష్టాలు, విపత్తులు కలుగుతుండేవి. అక్కడికి స్త్రీలందరూ పరుగు పరుగునా రావడం, అక్కడ సతీ సహగమనం జరుగుతుందని చెప్పడం , ఈ సోదరులిద్దరు, లాడు గాంజి అక్కడికి వెళ్ళడం, గ్రామస్థులని వారించే ప్రయత్నం చేయడం, వాళ్ళు వీరి మాటలు వినకపోగా దుడ్డు కర్రలతో కొట్టడానికి ముందుకి రావడం, అప్పుడు వీళ్ళు కూడా ఆ చితి మీద కూర్చుని వాళ్ళని కూడా సజీవ దహనం చేయమని చెప్పడం   ఇలా రకరకాలుగా వాళ్లకి ఇబ్బందులు కలుగుతుండేవి. చివరకి ఆ స్త్రీ కూడా నేను బ్రతికి ఏం లాభం?నేను సతి అయి వెళ్ళిపోతాను. బ్రతికినందువల్ల నాకు శిరోముండనం చేసి ఒక గదిలో పడేసి, ఇంటి చాకిరంతా నా నెత్తి మీద పడేసి, సమాజమంతా నన్ను అవహేళన చేస్తుంది. బ్రతికి చచ్చే బదులు నేను చచ్చి బ్రతుకుతాను అని చెప్పడం జరుగుతుండేది. అటువంటి వారినంతా శ్రీ స్వామి నారాయణ గారి రక్షణలో రమ్మని చెప్తుండేవాళ్ళు.
              వార౦దరు ఇదివరకే స్వామి నారాయణ గారి గురించి విని ఉండడం వల్ల ఆ గ్రామ ప్రజల్లో కూడా చైతన్యం రాసాగింది. ఈ విధంగా భగవాన్ శ్రీ స్వామి నారాయణ గారు అనేక దురాచారాలని, మూఢ నమ్మకాలని నిర్మూలించి ప్రజల్లో మంచి చైతన్యాన్ని కలిగించారు. వారికి ప్రత్యేకంగా స్త్రీలంటే యెనలేని గౌరవం,ఆదరణ, ప్రతి స్త్రీని కూడా మాతృమూర్తిగానే భావిస్తూ ఉండేవారు. ఇలా ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు.