N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 25 July 2016

SwamiNarayan - Episode 85



అహంకార పరాజయం
ఒక సారి ప్రభుశ్రీ తన దర్బారులో కూర్చుని ధర్మ ప్రవచనాలు చెప్తుండగా ఒక వ్యక్తి వచ్చి తనని తాను పరిచయం చేసుకుంటూ “మహారాజా ! నేను గ్వాలియర్ నుంచి వచ్చాను. గొప్ప విద్వాంసుడ్ని. నేనే౦తోమంది రాజుల ఆస్థానాలకి వెళ్లి అక్కడ సంగీతంలో విద్వా౦సులనందరినీ ఓడించి గెలిచి వచ్చాను. ఎన్నో సాధించాను. మీ గురించి విని నేను ఈ రోజు మీ దర్బారు కి వచ్చాను. నన్ను సంగీతంలో ఓడించేవాళ్ళు మీ శిష్యులలో ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పాటు పందెం ఏర్పాటు చేయండి” అని కోరాడు. అతని మాటల్లో అహంకార ధోరణి కనిపించింది. ప్రభుశ్రీ నవ్వుతూ “అయ్యా ! ఇది సంగీత విద్వాంసులు నిర్వహించే పాట కచేరి కాదు . ఇక్కడ మేము కేవలం భగవంతుడి మీద మాత్రమే  కీర్తనలు పాడుతాం, వింటాం, అంతే కాని ఎటువంటి పందాలు మేము ఏర్పాటు చేయం” అని చెప్పగా “అలా అయితే మీరు ఓడిపోయినట్టుగా భావి౦చవచ్చునా?” అని ఆ విద్వాంసుడు అడిగాడు. 


అప్పుడు స్వామీజీ నవ్వుతూ “మాకు జయాపజయాలతో నిమిత్తం లేదు. ఆ రెండింటికి మేము అతీతులం. ఇటువంటి పోటీలు మేము నిర్వహించం. కాని నీవు మాకు అతిథిడువై వచ్చినందువల్ల నీ కోరిక మేము నేరవేరుస్తాం” అని చెప్పి ఆయన ప్రేమానంద గారి వైపు చూసి ఆయనని ఆశీర్వదించారు. అప్పుడు ప్రేమానంద గారు ఒక అద్భుతమైన కీర్తన భగవంతుడి మీద మైమరచిపోయి, తన్మయత్వంతో, ఒక భక్తి  భావంతో ఆలాపించారు. ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. ఆ కీర్తన విన్న సభికులందరు ఒక తన్మయావస్థలోకి వెళ్ళిపోయారు. సంపూర్ణంగా భక్తిభావంలో మునిగిపోయి పాడిన ఆ కీర్తన విన్న భక్తులంతా ధ్యానావస్థలోకి వెళ్ళిపోయారు. ఆ కీర్తన అయిపోయినాక అందరు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. అప్పుడు గ్వాలియరు నుంచి వచ్చిన ఆ సంగీత విద్వాంసుడు “మహా ప్రభూ ! ఇంత అద్భుతంగా నేను పాడలేను. నా వల్ల కాదు. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. ఎంతో అహంకారంతో వచ్చాను.నా ఆహంకారం మీ భక్తి ముందు పరాజయమై పోయింది’’ అని ఎంతో నిజాయతీగా చేతులు జోడించి స్వామి నారాయణ గారితో విన్నవించుకున్నాడు. ప్రభుశ్రీ నవ్వుతూ, “నాయనా ! నీ అహంకారాన్ని నీవు భగవంతుడి పాదాల మీద పెట్టావు కాబట్టి ముందు ముందు నీకు విజయ౦ ప్రాప్తి అవుతుంది” అని చెప్పి ఆశీర్వదించి ఆయన్ని పంపించివేశారు.

గవర్నర్ డన్లప్ గారి ఆహ్వానం
అహ్మదాబాదు నగరానికి రాజైన సుబ్బారాజు  తన రాజ్యాన్ని కోల్పోయినాక అహ్మదాబాదు ఆంగ్లేయుల పరిపాలనలోకి వచ్చింది. అక్కడ ఆంగ్లేయుల దర్బారులో మోతీరాం అనే ఒక ఉద్యోగి ఉండేవాడు.  ఒకనాడు ఆ దర్బారులో ఉన్న ఒక ఆంగ్లేయుడు వీధిలో వెళ్ళుతున్న స్వామి నారాయణ గారి భక్తుల యొక్క వేషధారణ చూసి ఎంతో ఆసక్తిగా మోతీ రాం ని “ఇలా ప్రత్యేకంగా కనిపిస్తూ వెళ్ళుతున్న ఈ సాధువులంతా ఎవరు? వారు వేసుకున్న దుస్తుల తీరు బాగు౦ది” అని అడిగారు. మోతీరాం, “అయ్యా ! వీళ్ళంతా భగవాన్ శ్రీ స్వామి నారాయణ గారి భక్తులు. వాళ్ళంతా సాధువులు, సత్పురుషులు” అని చెప్పాడు. భగవాన్ శ్రీ స్వామి నారాయణ గారు ఎవరు ? అని  అతను అడిగాడు. ఆయన సాక్షాత్తు భగవంతుడి అవతారమని అందరు నమ్ముతారు. ఆయన సామాజిక సేవ ఎంతో చేస్తూ ఉంటారు. ప్రస్తుతుం ఆయన సౌరాష్ట్ర లో తిరుగుతూ ఉన్నారు అని చెప్పాడు. “మన నగరానికి స్వామి నారాయణ గారు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా?” అని అడిగాడు. మీ పరిపాలనకు ముందు సుబ్బ రాజు అనే పీష్వా పరిపాలి౦చే వాడు. ఒక సారి స్వామి నారాయణ గారు అహ్మదాబాదు కి రాగా ఆయన రాకని ఆయన నిషేధించారు. మళ్ళీ అప్పట్నుండి స్వామి వారు అహ్మదాబాదు వైపు రానే రాలేదు అని విన్నవించుకున్నాడు. నీకు ఈ ఊళ్ళో స్వామి నారాయణ గారి భక్తులెవరైనా తెలిసినవాళ్ళు ఉన్నారా? అని అతను ప్రశ్నించాడు. నా తమ్ముడు ఉదయ్ స్వామి నారాయణ గారికి పరమ భక్తుడు అని విన్నవించాడు. “సరే ! రేపు మన గవర్నర్ డన్లప్ గారు అత్యవసరమైన సమావేశం ఏర్పాటు చేశారు. దానికి మీరు మీ సోదరున్ని తీసుకుని ఈ అత్యవసర సమావేశానికి హాజరు కావల్సిందిగా ఆదేశించాడు. మోతీరాం తన తమ్మున్ని తీసుకుని తప్పకుండా వస్తానని హామీ ఇచ్చాడు.

మర్నాడు గవర్నర్ డన్లప్ గారు ఏర్పరచిన అత్యవసర సమావేశానికి మోతీ రాం తమ్ముడైన ఉదయ్ కూడా వచ్చాడు. గవర్నర్ గారి ముఖం అంతప్రసన్నంగా లేదు.  “ఈ అత్యవసర సమావేశాన్ని నేను ఎందుకు ఏర్పాటు చేశానో మీకు తెలుసా?” అని అడిగారు  నేను ఇక్కడ గవర్నర్ గా ఉన్నా కూడా నేను అవమానంతో తల దించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన అహ్మదాబాదులో నేరాలు, ఘోరాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మరి మన దగ్గర చాలా మంది పోలీసువాళ్లు, సైనికులు కూడా ఉన్నారు. అయినా ఇంత మంది ఉండి కూడా ఈ అహ్మదాబాదులో నేరాలు, ఘోరాలు  ఎందుకు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి?  మనం ఈ నేరాల్ని ఎందుకు అరి కట్ట( control) లేకపోతున్నామో అన్నది నాకేమీ అర్థం కావడం లేదు. చూశారా ఈ క్రై౦ రిపోర్ట్ ? చూడండి ,  అహ్మాదాబాదులో  క్రైములు ఎంతగా పెరిగిపోయాయో? అదే ప్రక్కనే ఉన్న సౌరాష్ట్ర దేశంలో అసలు నేరాలు గాని ఘోరాలు కాని లేనే లేవు. అక్కడ అంతా శూన్యమే. అంతా ప్రశాంతంగా ఉంది. ఇంత బలగం మన దగ్గర ఉండి కూడా ఈ అహ్మదాబాదులో మనం ఎందుకు ఏమీ చేయలేక పోతున్నాం? అని ఆయన అందర్ని ప్రశ్నించారు. అప్పుడు స్వామి నారాయణ గారి భక్తుడైన ఉదయ్ లేచి సవినయంగా ఇలా వివరించాడు.”అయ్యా ! సౌరాష్ట్రలో మీరు చెప్పినట్టుగానే పోలీసులు కాని సైనికులు గాని చాలా తక్కువ గానే ఉన్నారు. కాని అక్కడ ఉన్నవారు ఇక్కడ లేరు. వారు కనుక ఇక్కడ ఉంటె మనం కూడా సంతోష సౌభాగ్యాలతో ఉండవచ్చును” అని విన్నవించుకున్నాడు.
“అక్కడ ఉన్నది ఇక్కడ ఏం లేదు ? నాకేమీ అర్థం కావడం లేదు కాస్త వివరంగా చెప్పండి” అని గవర్నర్ గారు అడిగారు.

“అయ్యా ! అక్కడ శ్రీ స్వామి నారాయణ గారు అనే సత్పురుషుడు ఉన్నాడు. ఆయన మాటల్లో ప్రేమ, కరుణ, ఒక భగవంతుడి శక్తి ఉంది. అటువంటి దివ్యవాణి విన్న ప్రజలు అహింసా మార్గాన్ని వదిలి వేశారు. వ్యసనాలన్నీ కూడా వదిలివేసి అందరు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ గ్రామం మొత్తం కూడా అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉంటూ సౌరాష్ట్ర మొత్తం కూడా చక్కగా హాయిగా ఉన్నారు. ఆ మహా ప్రభు స్వామి నారాయణ గారు ఇక్కడ లేరు. ఆయన  పోలీసుల సహాయం లేకుండానే ప్రేమ అనే దివ్య వాణితో అందర్నిమార్చివేశారు” అని విన్నవించుకున్నాడు.

అప్పుడు ఆంగ్లేయ అధికారి లేచి డన్లప్ గారికి ఒక సూచన ఇచ్చాడు. అయ్యా ! మీరు అనుమతిస్తే మనం స్వామి నారాయణ గారిని మన ఊరికి ఎందుకు ఆహ్వాని౦చకూడదు?  అని చెప్పాడు. గవర్నర్ గారు ఇదంతా విని చాలా ఆశ్చర్య పడి ఒక్క మనిషి మూలంగా సౌరాష్ట్ర అంతా ఇంత శాంతి గా ఉందా! నేరాలు, ఘోరాలు ఏమీ లేవు. ఇదేమీ  చమత్కారమో మనమూ చూద్దాం ! మీరు నా ఆహ్వానాన్ని ఆయనకి పంపించండి అని ఆదేశించి , ఆయన మన నగరానికి వస్తారా? అనే సందేహాన్ని ప్రకటించారు. ఒక వేళ ఆయన కనుక రాలేకపోతే మనమే స్వయంగా వెళ్లి ఆయన్ని ఆహ్వానిద్దాం అని గవర్నర్ డన్లప్ గారు అన్నారు. లేదండి ఆయన తప్పకుండా వస్తారు అని చెప్పి ఉదయుడు ఆయన ఇచ్చిన  ఆహ్వాన పత్రికను పట్టుకుని ప్రభుశ్రీ దగ్గరకి ప్రయాణమయ్యాడు.