N. Sairam Garu : +91 7901268716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.Monday, 1 August 2016

SwamiNarayan - Episode 87అహ్మదాబాదులో మందిర నిర్మాణ అంకురణ
స్వామి నారాయణ గారు అహ్మదాబాదు నగరానికి విచ్చేసిన సందర్భంలో అహ్మదాబాదు ప్రజలందరూ, ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఉన్న గ్రామస్థులందరు కూడా ఎంతో సంతోష పడిపోయారు. సరిగ్గా స్వామి నారాయణ గారు చెప్పినట్లే ఆయన వాగ్దానం మేరకు ఆయన అనతికాలంలోనే అహ్మదాబాదు నగరానికి విచ్చేశారు. ప్రజలందరిలో కూడా ఆయన పట్ల భక్తివిశ్వాసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధు  సన్యాసులే కాకుండా గృహస్థులు కూడా ఆయన సత్సంగులుగా మారి సాధువుల వలె ప్రవర్తించ సాగారు.గృహస్థాశ్రమంలో ఉన్నా, వారు స్వామి నారాయణ గారి ఆదేశం ప్రకారమే, ధర్మ ప్రవచనాల ప్రకారమే, ధర్మ మార్గంలో జీవితాలు గడుపుతున్నారు. వ్యసనాల నుంచి విముక్తి పొందారు. సామాజిక స్పృహ కలిగి ఆడపిల్లలకి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించడం, స్వామి నారాయణ సంప్రదాయాల్ని నేర్పించడం వగైరా వగైరా మొదలు పెట్టారు. స్వామి నారాయణ గారి సత్సంగులకి అంటే గృహస్థులకి, సాధువులకి ఏమాత్రం తేడా లేకుండా అందరు కలిసి సమిష్టిగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఏదైనా కుటుంబలో పెద్దదైనా చిన్నదైనా పండుగ కాని, వివాహ౦ కాని ఏ కార్యక్రమమైనా జరుగుతుంటే అది వారి ఇంట్లోనే జరుగు తున్నట్టుగా ఆ ఊరి గ్రామస్థులందరూ కలిసిమెలిసి సమిష్టిగా పని చేస్తూ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అభిమానాలు పెరిగి ఆ గ్రామస్థులంతా ఒక కుటుంబం లాగా ఉంటూ ఉండడం మూలంగా వారి గ్రామం ప్రక్క గ్రామాలకి ఆదర్శ గ్రామం లాగా మారిపోయింది. అన్ని గ్రామాల్లో  కూడా ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించ సాగారు. ఉన్న వాళ్ళు , లేనివాళ్ళు ఏమీ ఆశించకుండా గ్రామ వ్యవస్థ పూర్వకాలంలో ఎలా ఉండేదో అదే మాదిరిగా స్వామి నారాయణ గారి ప్రభావంతో అన్నీగ్రామాల్లో కూడా సమృద్ధిగా సుఖ శాంతులతో జీవిస్తున్నారు. కాబట్టి అక్కడ ఎవ్వరికి కూడా దొంగతనం చేయవలసిన అవసరం ఉండేది కాదు. అందరు స్వచ్చందంగానే వారి దగ్గర ఉన్నది పంచుకుంటు సహజీవనం చేస్తుండేవాళ్ళు. ప్రజలందరు స్వామి నారాయణ గారి సాంప్రదాయంలో ఉన్న ఔన్నత్యాన్ని గ్రహించి మనసా, వాచా, కర్మలా వారి శిష్యుల్లాగే మారిపోయారు. అలాగే భ్రూణహత్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విధంగా అహ్మదాబాదు నగరంలోనే ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా రోజు స్వామి నారాయణ గారి దర్శనం కోసం రావడం , ఆయన చెప్పే ధర్మప్రవచానాలు వినడం, ఇవన్నీ పరిపాటిగా జరిగిపోయినాయి. అందులో సాక్షాత్తు భగవత్స్వరూపుడైన స్వామి నారాయణ గారు, గవర్నర్ గారు అయన దర్శనానికి వస్తానన్నప్పుడు గవర్నర్ అంటే రాజుగారని, తాను కూడా రాజుగారి ప్రజల్లో ఒకడినని అందుకని తానే ప్రత్యేకంగా గవర్నర్ గారిని కలుసుకోవడానికి బయలుదేరడంలో ఆయనలోని నిరాడంబరత, ఎటువంటి అహంకారం, దర్పం లేని దేవి సంపద ఈ లక్షణాలన్నీ కూడా భగవంతుని లక్షణాలే అని అందరూ చర్చించుకోసాగారు. స్వామి గారు ఎక్కడ భూమి మీద పాదం మోపుతారో అక్కడ వెంటనే మంచి మార్పులు రావడం జరుగుతున్నాయి. ఈ విధంగా ప్రజలంతా స్వామి నారాయణ గారిని వేనోళ్ళతో పొగడుతూ, ఎంతో భక్తిభావంతో ఉన్నారు. బీదా బిక్కి, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, గొప్పవాళ్ళు, బీదవాళ్ళు, రాజులు, సామంతులు అందరు కూడా ఆయన్ని వేనోళ్ళ పొగడుతూ స్వచ్చందంగానే ఉన్నారు. సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు అక్కడకి సామంతుడైన ఒక సత్సంగి వచ్చి కలవరపడ సాగాడు. “ప్రభుశ్రీ ! నా అమూల్యమైన కరవాలం దొంగిలించబడింది. ఏం చేయాలో నాకర్థం కావడం లేదు” అని చెప్పగా స్వామి వారు నవ్వుతూ “ఇది పెద్ద పట్టణం కనుక ఉపాధి కోసం జనులు ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఉంటారు. జనసంఖ్య ఎప్పుడైతే గుణ సంఖ్యలో ఎక్కువగా ఉంటారో అన్ని రకాల ప్రవృత్తి ఉన్నవాళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ చోరభయం ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. పోయింది కరవాలమే కదా మళ్ళీ ఇంకొక కరవాలం చేయించుకో” అని స్వామి వారు చెప్పగా అతను “ప్రభూ ! నా కరవాలం బహుమూల్యమైనది. బంగారు తాపిడితో , రత్నాలు పొదిగి ఉన్నాయి మరి నాకు దొరుకుతుందా?” అని ఆత్రుతగా అడిగాడు. “నాయనా ! ఎవరో బీదవాడు ఆశ పడి ఆ కరవాలం దొంగిలించి ఉంటాడు. అతడే దాన్ని అమ్ముకుని తన భార్యాబిడ్డల కోసం ఎన్నో  సౌకర్యాలని కలిగించి ఉంటాడు. దాని గురించి నీవు బాధ పడకు. ఈ విధంగానైనా నీకు పుణ్యం లభిస్తుంది. ఇక దీని గురించి బాధ పడకుండా ఇంకొక కరవాలం చేయించుకో!” అని సలహా ఇచ్చారు.

అక్కడ గవర్నర్ జనరల్ , మిగతా ఆంగ్లేయ ఉద్యోగులందరూ కూడా వారి సమావేశంలో ఈ స్వామి నారాయణ గారి గురించే మాట్లాడుకుంటున్నారు. ఎటువంటి ఆయుధం కాని, సైన్యం కాని లేవు. ప్రభుశ్రీ గారు ప్రజల్లో ఇటువంటి  మార్పు ఎలా తీసుకుని రాగలుగుతున్నారు? అన్న విషయం వారికి ఏమాత్రం అంతు పట్టడం లేదు. ఒకసారి వాళ్ళు ప్రభుశ్రీని దర్శించుకుని ఇదే ప్రశ్న అడిగారు. “స్వామీ ! మా దగ్గర చాలా పోలీసు బలగ౦ ఉంది. సైనికులు కూడా చాలామంది ఉన్నారు. ఇంత మంది ఉంది కూడా మేము ఇక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలని , ఘోరాలని కాని దొంగతనాలని కాని ఏమాత్రం తగ్గించలేక పోతున్నాం. ఇలా రోజురోజుకి మితిమీరి పోతున్నాయి. మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏమీ చేయలేక పోతున్నాం. ప్రభుశ్రీ ! మీ దగ్గర ఏమీ లేవు కదా ! మీరు సామాన్యంగానే ఉంటారు. ఎటువంటి ఆయుధాలు కూడా లేవు. మీరు ఏ విధంగా ప్రజల్లో మార్పు తెస్తున్నారు? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది “ అని కర్నల్ వాకర్ గారు, గవర్నర్ డన్లప్ గారు సెలవియ్యగా స్వామి వారు విని “ నిజమే మీరు చెప్పింది. దాంట్లో అబద్ధమేమీ లేదు. మా దగ్గర కూడా సైన్యం ఉంది. వారు నిర్మల హృదయులైన సత్సంగులు , ధర్మమార్గంలో నడిచే సైన్యం నా దగ్గర ఉంది. వాళ్ళంతా సామాన్య ప్రజలే. వారి దగ్గర ఆయుధాలేమీ లేవు. వారి దగ్గర ఉన్న ఆయుధాలు కేవలం సామాజిక స్పృహ, ప్రజలని మంచి మార్గంలో తీసుకుని రావాలనే తపన, వాళ్ళ దగ్గర ఉన్నవి లేనివారికి పంచడం, వాళ్ళలో మంచి సంస్కారం అనే బీజాలు నాటడం, ఉన్నది అందరు కలిసి తృప్తిగా పంచుకోవడం, ఒక కుటుంబంలో జరుగుతున్న శుభకార్యం తమ కుటుంబంలో జరుగుతున్నట్టుగా భావించుకుని కలిసికట్టుగా పని చేసుకోవడం, ఇవన్నీ వాళ్ళు చేస్తున్న మంచిపనులు. అవే వారి వారి ఆయుధాలు. అంత కన్నా మించి మా దగ్గర ఏమీ లేవు. తోటివారి పట్ల ప్రేమ, జాలి, దయ అనే ఆయుధాలు మాత్రమే మా సత్సంగుల దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అంతా ఈ జపమాల లోనే ఉంది అని చెప్పారు.

డన్లప్  గారు ఇది విని ఆశ్చర్య పడి “స్వామీ ! ఈ జపమాల ఏమిటీ? ఇందులో అంత మహాత్మ్యం ఏముంది ?” అని అడిగారు. దానికి స్వామి నారాయణ గారు చిరునవ్వు నవ్వుతూ “మీరు ప్రత్యక్షంగానో , పరోక్షంగానో వింటున్నారు కదా! మా సత్సంగులు ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటారు. చాలా నిరాడంబరంగా ఉంటారు. మెడలో ఒక జపమాల ఉంటుంది. ఆ జపమాలతో వాళ్ళు ప్రతినిత్యం చాలా భక్తిగా ప్రభు నామజపం చేస్తుంటారు. ఆ అక్షరాలలో చాలా మహత్తు ఉంది. ఆ అక్షరాలనుంచి వెలువడుతుండే దైవిక శక్తి దానవ శక్తిని జయిస్తూ ఉంటుంది. ఇటువంటి దైవిక శక్తి ముందు దానవ శక్తి కూడా దైవిక శక్తిగా మారిపోతుంది.

 మేమెవరినీ శిక్షించం, నిందిచం కాని ఈ నామజపంతో మా సత్సంగులందరు కూడా గ్రామ గ్రామాలకి వెళ్లి ధర్మప్రచారం చేస్తూ ఉంటారు. ఎవరైతే నామజపం చేస్తుంటారో వారిలో కల్మషమైన అరిషడ్వర్గాలన్ని కామ, క్రోధ, లోభ,మద,మోహ మాత్సర్యాలన్నీ మెల్ల మెల్లగా అంతం అయిపోతూ ఉంటాయి. చివరకి వార౦దరు కూడా పవిత్రాత్ములుగామారిపోతారు. మేము పాపాత్ములని కాని, దొంగలని కాని , ఈ నేరస్థులని కాని మేము శిక్షించం. వారిని ప్రేమతోనే మారుస్తుంటాం. ఆ మార్పుకి తగిన సాధనమే ఈ జపమాల! ఎవరైతే రోజు కనీసం మూడు మార్లు నామజపం చేస్తారో వాళ్ళలో మెల్లమెల్లగా మంచిమార్గం వైపు పరివర్తన వస్తూ ఉంటుంది. దానివల్ల ప్రజల్లో తాము చేస్తున్న పని నేరాలు కాని చోరీలు కాని ఇటువంటి దుష్క్రుత్యాలు కాని మనం చేయడం తప్పు అనే భావన వస్తుంది. అందులో  మేము ప్రత్యేకంగా అందరికీ అన్నదానం కార్యక్రమం చేస్తుంటాం. పవిత్రమైన మనస్సుతోటి, హృదయంతోటి మేము ఆహారం వండేటప్పుడు నిర౦తరం ఈ నామజపం చేసుకుంటూ మంచి భావనతోటి మేము ఆహారంవండుతాం. ఆహారమే కదా మనుష్యులు తినేది. తామసప్రవృత్తి గల  ఆహార౦ కనుక తింటే మనలో తామస ప్రవృత్తి పెరిగిపోతుంది దాని వల్ల మనం నేరాలు చేయవలసి వస్తుంది. అహంకారం అనేది చాప క్రింద నీరు వలె ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని భోజనానికి మేము చాలా ప్రాముఖ్యతనిస్తాం. కేవలం సాత్విక ఆహారమే, శాకాహారమే మేము సత్సంగులకి భోజన పదార్థాలుగా ఇస్తూ ఉంటాం. దానివల్ల కూడా ప్రజల్లో మెల్లమెల్లగా మార్పు వస్తూ ఉంటుంది”   ఎన్నో విధాలుగా తాము చేస్తున్న పనులన్నీ వివరించారు.

       అదంతా విన్న గవర్నర్ డన్లప్ గారికి స్వామి నారాయణ గారి పట్ల విపరీతంగా అభిమానం, భక్తి, అనురాగం విపరీతంగా కలిగాయి. అతను చేతులు జోడించి, నమస్కరించి, “ స్వామీ ! మీరు చేస్తున్న కార్యాలు, చేస్తున్న విధానాలు నాకు ఎంతో నచ్చినాయి. బలంతో, శక్తితో మేము చేయలేని పనులు కూడా మీరు ప్రేమ అనే శక్తితో ప్రజల్లో మార్పులు తెస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. స్వామీ ! మరి అహ్మదాబాదు పట్టణంలో ఇక్కడ హిందువుల మందిరాలు, ముస్లిం ల మసీదులు, ఆశ్రమాలు ఉన్నాయి కాని మీ మందిరం స్వామి నారాయణ గారి మందిరం  ఇక్కడ లేదు. ఎందుకో నాకర్థం కావడం లేదు. ప్రజల్లో ఇంత మంచి మార్పు తెస్తున్న మీరు మందిర నిర్మాణానికి ఎందుకు ముందుకు రాలేదు, ఎందుకు ఆలోచించలేదు ? అని అడిగారు. అంతలో కుబేర్ గారు ముందుకు వచ్చి “గవర్నర్ మహాశయా ! ఈ అహ్మదాబాదు నగరంలో మాకు మందిరానికి కావలసినంత స్థలం ఎక్కడుంది చెప్పండి? మందిర నిర్మాణానికి చాలా స్థలం కావల్సివస్తుంది కదా !’అని అన్నాడు. అదేమిటీ మన వాణీ చౌక్ ఉంది కదా ఇక్కడున్నటువంటి సముదాయం, వర్తక సముదాయం వర్తక కేంద్రాలు, ఈదుకాణాలు మీరు ఇక్కడ మందిర నిర్మాణం చేయిస్తారంటే ఈ వాణీ చౌక్ ప్రాంతమంతా ఇచ్చేస్తాను  మీకు, ఇక్కడే మీరు మందిర నిర్మాణం చేయండి. పైగా నగరమధ్యలోనే ఉంటుంది అని గవర్నర్ గారు సెలవిచ్చారు. స్వామి నారాయణ గారు చిరునవ్వు నవ్వుతూ “గవర్నర్ గారూ ! ఒకరు నివసిస్తున్నటువంటి వాస గృహాలు మేము ధ్వంసం చేసి అక్కడ మందిర నిర్మాణం చేయం. ఒకరికి దుఃఖాన్ని కలిగించి మేము మందిర నిర్మాణం చేయం. వారు కార్చే కన్నీళ్ళ మీద మా మందిర నిర్మాణమెప్పుడు జరగదు. మేము చేసే మందిర నిర్మాణం  ఎవ్వరికి బాధ కలిగించకుండా , ఎవ్వరికి కష్ట నష్టాలు లేకుండా మందిర నిర్మాణం చేయాలి. ఇదే మా సంకల్పం’’ అని చెప్పగా గవర్నర్ గారు మరింత ఆశ్చర్య పడిపోయారు.

“భగవాన్ స్వామి నారాయణ గారూ ! అయితే మీరందరు కూడా కలిసి మాట్లాడుకుని, నిర్ణయించుకుని మీకు స్థలం ఎంత , ఎక్కడ కావాలో నాకు కనుక చెప్పితే తప్పకుండా నేను ఆ స్థలాన్ని మీకు కేటాయించే ప్రయత్నంలో నేను ఉంటాను అని చెప్పి వారంతా మరొక్కసారి స్వామి నారాయణ గారికి వినయంతో నమస్కారం చెప్పి వెళ్ళిపోయారు. స్వామి నారాయణ గారు చెప్పినటువంటి మాటలు మననం చేసుకుంటూ ఆంగ్లేయులందరూ కూడా ఆయన సంస్కారానికి, ఆలోచనా విధానానికి , ఆయన ప్రజల్లో తెచ్చే మార్పుఇవన్నీ తలచుకుని ఎంతో సంతోష పడిపోయినారు