N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Wednesday, 7 September 2016

SwamiNarayan - Episode 90

విగ్రహ ప్రతిష్ఠ

భగవాన్ స్వామి నారాయణ గారు తన అనుచరులని, సాదు-సన్యాసులని అందరిని సమావేశ పరచి ఏ విగ్రహాలు ఏ స్థలంలో ఉండాలో స్థల నిర్దేశన చేశారు. తన తల్లిదండ్రులు భక్తి మాతా, ధర్మదేవుని విగ్రహాలు, తన విగ్రహం అంటే స్వామి నారాయణ గారి విగ్రహం ( ఎక్కడ భక్తి, ధర్మం ఉంటాయో అక్కడ తానూ ఉంటానని స్వామి నారాయణ గారు ఎన్నో సార్లు చెప్పారు),  నర నారాయణ విగ్రహాలు, రాధా కృష్ణ విగ్రహాలు, అన్నీ ఏ ప్రదేశంలో ప్రతిష్టించాలో చెప్పడం జరిగింది. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ నారా నారాయణుల దివ్యమైన అనుగ్రహం, ఆశీస్సులు ఉంటాయి, వాటి యొక్క రక్షణ కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. 


అలాగే సాక్షాత్తు నర నారాయణుల యొక్క శక్తి ఏ విధంగా బదరికా వనంలో ఉందో అదే విధంగా ఆయన యొక్క దైవత్వం ఈ విగ్రహాలలో మూర్తీభవించి ఉంటుందని , అలాగే బదరికా వనంలో ఉన్నట్టి పుణ్యమైన స్పందనలు ఇక్కడ కంకర్య ప్రదేశంలో ఉంటాయి, అటువంటి ప్రదేశంలో అవి ప్రతిస్ఫటిస్తూ ఉంటాయి అని ఆ మహాత్మ్యం కూడా హెచ్చిస్తుందని సెలవిచ్చారు. అంతే కాకుండా సృష్టిలో రాధాకృష్ణుల యొక్క భక్తి చెప్పుకోవలసినది. రాధామాయి శ్రీ కృష్ణ పరమాత్ముని చైతన్యాన్ని పొందుతూ ఆయన మాదిరిగానే అయిపోతూ ఉండేది. ఆయన తత్వంలో లీనమైపోతూ ఉండేది. అంత భక్తిపారవశ్యంలో ఉండేది. అలాగే శ్రీ కృష్ణ పరమాత్ముడు కూడా రాధాదేవి యొక్క తత్వంలో పూర్తిగా కలిసి పోతూ ఉండేవాడు. అందుకనే వారి భక్తి ముఖ్యంగా రాధాబాయి యొక్క భక్తి శ్రద్ధలు ఇవన్నీ భక్తులకి స్ఫూర్తి కలిగించే విధంగా ఆ ప్రతిమలని ఇక్కడ ప్రతిష్టించడం మనందరికి మంచిదని చెప్పారు. ఇక్కడికి ఎవరు వచ్చి పూజ చేసినా, జపం చేసినా, నామజపం చేసినా. అర్చి౦చినా, ధ్యానం చేసినా వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. వారికి సాక్షాత్తు నరనారాయణుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని ఆయన ఆనతిచ్చారు. అందరు కూడా “జై స్వామి నారాయణ మహారాజ్ కీ “ జై నరనారాయణ మహారాజ్ కీ” ,“భక్తిమాతా ధర్మదేవ్ కీ జై” అని జయజయధ్వానాలు చేశారు.

విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చక్కగా , సక్రమంగా జరిగిపోయింది. ప్రభుశ్రీ పండితోత్తములని ఉద్దేశించి మీ అందరి సహకారంతో ప్రాణప్రతిష్ఠ చాలా చక్కగా జరిగిపోయింది. మీకెంత కావాలో అంత దక్షిణ స్వీకరించండి అని చెప్పి బంగారు నగలు, నాణాలు, ధనం  వారికి సమర్పించగా వార౦దరు వారికి తోచినంత వారు దక్షిణగా స్వీకరించారు. ప్రభుశ్రీ అంతా జయప్రదంగా జరిగిపోయింది. రెండు పనులే ముగిలాయి. ఒకటి ధ్వజస్తంభం నిలబెట్టడం, ఇంకొకటి గోపురం మీద కలశ ప్రతిష్ఠ ఈ రెండు  మాత్రమే మిగిలిపోయాయి అని చెప్పగా ఒక భక్తుడు ముందుకి వచ్చి “నా పేరు మీద  నేను మీకు 750 రూపాయలు దక్షిణగా ఇస్తున్నాను. ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి నా వంతు సాయం నేను చేయదలచుకున్నాను, నా ద్వారా అది అయితే బాగుంటుంది స్వామీ !” అని అన్నాడు. ఇంకొకరు దులాని అనే అతను “స్వామీజీ ! నేను వేయి రూపాయలు దక్షిణగా ఇస్తాను. 

నాకు కలశ ప్రతిష్ఠ కార్యానికి అనుమతి ఇవ్వండి , నేను కలశ ప్రతిష్ఠ చేస్తాను” అని చెప్పాడు. ప్రభుశ్రీ వారిని ఆశీర్వదించి ‘తథాస్తు’ అని చెప్పారు. ప్రభుశ్రీ “అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగాయి. త్వరలోనే ధ్వజ స్తంభ ప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠ కూడా అయిపోతుంది. ఇంతకి ప్రజలందరూ మందిర నిర్మాణం గురించి ఏమనుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. అందరు ఏక కంఠం తో ప్రతింశలు కురిపిస్తున్నారు. చాలామంది గుడికి మేము స్వేచ్చగా వస్తున్నాం . ఎవరు మమ్మల్ని అడ్డు పెట్టడం లేదు. చాలా మందిరాలలో ముందు దక్షిణ ఇవ్వమని వేధిస్తూ ఉంటారు. ఇక్కడ కులమతభేదాలు లేకుండా ఎవరైనా సరే యథేచ్చగా మందిర ప్రవేశం చేయవచ్చును. కొంత  మందికి ఇక్కడ అలౌకికమైన ఆనందం కలుగుతుంది. మందిరంలో అడుగు పెట్టగానే వారి మనస్సు ఎంతో శాంతిని అనుభవిస్తుంది. కొంతమందికి ఆ మూర్తులను చూస్తుంటే సజీవ కళ ఉట్టిపడి, మహా తేజస్సు బయటకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఆధ్యాత్మికంగా మంచి మంచి అనుభవాలు కలుగు తున్నాయి. శ్రీ  స్వామి నారాయణ గారు ఏపని చేసినా చాలా చక్కగా చేస్తుంటారు” అని అందరు ప్రశంసా వర్షాలు కురిపిస్తున్నారు కా..... ని .......
“ఏమీ సందేహించకుండా చెప్పండి సంగతి ఏమిటో” అని స్వామి నారాయణ గారు అన్నారు.
“ప్రభుశ్రీ ! బ్రాహ్మణులకి మాత్రం తృప్తిగా లేదు” అని చెప్పారు.

“అదేమిటీ? నేను బ్రాహ్మణులకి వాళ్ళకెంత కావాలో అంత దక్షిణ కూడా ఇచ్చాను కదా ! వారికి ఎంత దానం కావాలో అంత తీసుకొమ్మని చెప్పాను కదా ! మరి ఎందుకు తృప్తిగా లేదు?” అని ప్రభుశ్రీ అడిగారు.

అప్పుడు వారు “అంతా అయిపోయినాక వారికి బ్రహ్మభోజనం పెట్టాలి కదా ! అది జరగలేదే, అన్న సంతర్పణ జరగలేదే” అని వాళ్ళు బాధ పడుతున్నారు స్వామీ !” అని చెప్పారు.

“అవును వారు చెప్పింది నిజమే ! మనం తప్పకుండా బ్రహ్మ భోజనాలు ఏర్పాట్లు చేయాల్సిందే” అని ప్రభుశ్రీ గారు దానికి ఒప్పుకున్నారు. దానికి తగిన ప్రయత్నాలు చేయవలసిందిగా ఆదేశించారు. మర్నాడు ప్రభుశ్రీ సమావేశానికి ఏర్పాటు చేయగా దాంట్లో కొంత మంది సంత మహారాజులు మరి  మనం బ్రహ్మ భోజనం ఏర్పాటు చేద్దామని అనుకున్నాం కదా ఏదో ఒక రోజుని చాలా ముందుగానే మనం నిర్ణయించుకుని చౌరాసివ్రతం కూడా చేద్దాం అని అంటే ఇంకొక సత్సంగి   “ప్రభుశ్రీ ! ఈ చౌరాసి వ్రతం చాలా కఠినమైనది. చాలా ఏళ్ళ క్రితం ఆహ్మదాబాదు నగరాన్నిపరిపాలించే రాజుగారు ఆరు నెలల ముందుగానే సామగ్రిని సమకూర్చుకుని అప్పుడు బ్రాహ్మణులందరిని పిలిచి ఆయన అన్నవితరణ చేశాడు కాబట్టి చౌరాసివ్రతమనేది ఎంత సమర్థులకైనా చాలా కష్టం. ఎన్నో నెలల ముందే మనం దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి ఎందుకంటే 35 వేల మంది బ్రాహ్మణులు వచ్చి భోజనం చేయడం అంటే  మాటలు కాదు కదా !” అని చెప్పి విన్నవించుకున్నాడు. ప్రభుశ్రీ అవేవీ పట్టించుకోకుండా మనం చౌరాసి వ్రతమంటే అంత మంది బ్రాహ్మణులకి విందు మాత్రమే మనం ఏర్పాట్లు చేయాల్సివస్తుంది అని సెలవియ్యగా అందరి గుండెలు గుభేలుమన్నాయి. అందరు గాభరా పడ్డారు. అదేమిటీ? ఇంత తక్కువ వ్యవధిలో ఇంత పెద్ద ప్రయత్నం ఎలా సాధ్యమవుతుందా అని వారు పరిపరివిదాలా ఆలోచించ సాగారు. చాలా మంది సత్సంగులు ముక్త కంఠంతో ‘ఇది అసంభవం’ ఈ రెండు రోజుల్లో ఇంత పెద్ద ప్రయత్నం చేయడం చాలా కష్టం అని అందరు చెప్పారు. కొంత మంది భక్తులు మాత్రం స్వామి వారు తలచుకుంటే ఏ కార్యమైనా చేయగలరు అని అన్నారు. ఇలా అందరు ఒకళ్ళతో ఒకళ్ళు చర్చలు జరపసాగారు. అప్పుడు ప్రభుశ్రీ మీరంతా ఎందుకంత తర్జనభర్జనలు చేస్తున్నారు? మీ అందరిలో ఎవరు వంట చేస్తారో వారందరూ ఎల్లుండి ప్రాతఃకాలంలోనే వంట శాలకి , ఆ తటాకం దగ్గరకి వెళ్ళండి. నేను మీకు భోజనానికి కావాల్సిన సామాగ్రి అంతా సమకూరుస్తాను. మీ పని లడ్డులు తినడం మాత్రమే మిగితాదంతా నేను చూసుకుంటాను అని స్వామి వారు సెలవిచ్చారు. అందరు కూడా ఇదే చర్చ ‘కొంతమంది సాధ్యం’ అని ‘కొంతమంది అసాధ్యం’ అని వాళ్ళు చర్చలు జరపసాగారు. కాని స్వామి నారాయణ గారు మాత్రం నిర్లిప్తంగానే అక్కడనుంచి వెళ్ళిపోయారు.   

చౌరాసి వ్రతం 
మర్నాడు సమావేశంలో ప్రభుశ్రీ గారు ఎవరి దగ్గర ఎంతెంత ధనం ఉందో చెప్పమని పేరు పేరునా అడిగారు ఎందుకంటే చౌరాసివ్రతం ధనం లేకుండా జరగదు కదా ! దాంట్లో అక్కడే ఉన్నటువంటి సత్సంగి సూరదాస్ గారిని మీ దగ్గర ఎంత ధనం ఉంది అని అడగ్గా “స్వామీజీ ! నా దగ్గర దాదాపు ఏడు వేల రూపాయలు ఉంటాయి. అది మరి నేను దానం చేయాలి అని అనుకుంటే ఇంకొకరిని అడగవలసి వస్తుంది. వారి అనుమతిని తీసుకుని నేను వస్తాను అని చెప్పి హుటాహుటీన తన భార్య దగ్గరకి వెళ్లి ఇలా స్వామీజీ చౌరాసి వ్రతం చేయబోతున్నారు దానికి డబ్బు సహాయం చాలా అవసరం. నీ దగ్గర ధనం ఎంత ఉంది అని అడిగాడు. మీరు నాకు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులో నేను కొంత దాచి పెట్టాను. ఏడు వేల రూపాయల దాకా ఉన్నాయి. అయినా ఇంత సత్కార్యానికి స్వామి నారాయణ గారు చేయబోయే పుణ్య కార్యా నికి నా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా ! ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి పైసా కూడా స్వామి వారు ప్రజల శ్రేయస్సు కోసం, జగత్కల్యాణ౦ కోసం ఉపయోగిస్తారు కదా ! అటువంటప్పుడు మీరు దీనికోసం ప్రత్యేకంగా నా అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు” అని మందలించి ఎంతో సంతోషంగా ఆ ఏడు వేల రూపాయలని ఆయనకి ఇచ్చింది. అతడు తిరిగి ప్రభుశ్రీ దగ్గరకి వచ్చి ప్రభుశ్రీ ! నేను చెప్పినట్టుగానే మీకు ఏడు వేల రూపాయలిస్తున్నాను అని చెప్పి ఆయనకి సమర్పించగా ఆయన ఈ విధంగా అడిగారు. మీరు  మీ శ్రీమతిగారిని అడిగారా?అంటే ఆ అడిగాను స్వామీ ! ఎందుకంటే గృహంలో జరిగే కార్యాలన్నీ స్త్రీ నిర్వహిస్తూ ఉంటుంది. మరి నేను అది ఆవిడని అడక్కుండా ఇస్తే దొంగతనం క్రింద పరిగణించబడుతుంది కాబట్టి అడగవలసిన ధర్మ౦ నాది కదా !  అందుకనే నేను అడిగాను ప్రభుశ్రీ గారు!”

 మరి ఆవిడ నిస్సంకోచంగానే, మనస్ఫూర్తిగానే ఇచ్చారా? అని అడిగారు. ఆవిడ మహా సంతోషంగా, మనస్ఫూర్తిగా ఇచ్చారు. మనం ఇచ్చే ప్రతి పైసా కూడా స్వామి వారు జగత్కల్యాణ౦ కోసమే, ప్రజల శ్రేయస్సు కోసమే వినియోగిస్తారు కదా అని చెప్పి ఆవిడ ఇచ్చారు. కాకపోతే కొంచెం చివాట్లు కూడా తినాల్సి వచ్చింది ప్రభుశ్రీ ! అని చెప్పాడు.


ప్రభుశ్రీ నవ్వి ఏమిటీ ? ఎందుకు చివాట్లు తినాల్సివచ్చింది? అని అడిగారు. సాక్షాత్తు భగవాన్ స్వామి నారాయణ గారు అలా అడిగినప్పుడు మీరు తటపటాయించి నా అనుమతి తీసుకోవలసిన అవసరం ఏమొచ్చింది?మనకి తెలుసు కదా స్వామి నారాయణ గారు అన్ని మంచి పనులు చేస్తారని అంటూ నన్ను మందలించింది ప్రభుశ్రీ ! అని చెప్పాడు. అప్పుడు ప్రభుశ్రీ ఎంతో సంతోషించి ప్రతివాళ్ళు కూడా ఇంత శ్రద్ధా , భక్తి పూర్వకంగా ఉంటె మన సంస్కృతి, మన సంస్కారాలు సజీవంగా నిలబడుతాయి అని చెప్పి ఆయన ఎంతో మెచ్చుకున్నారు. వెంటనే వారు అందరికి ఆదేశాలు ఇచ్చారు. దానిలో ఒక సత్సంగి ప్రభుశ్రీ ! మనకి సమయం కూడా లేదు, రేపు ఒక్క రోజే ఉంది ఇన్నివేల బ్రాహ్మణులకి మనం సంతర్పణ ఎలా చేస్తాం? చాలా కష్టం కదా స్వామీ ? అని అంటే ఆయన “ఏం ఫరవా లేదు. మీరంతా సమిష్టి కృషితో చేస్తే ఎటువంటి పనైనా మనం సాధించగలం. అందుకని మీరంతా మీ డబ్బులు తీసుకుని భోజన సామగ్రి అంతా కొని ఆ తటాకం దగ్గర, ఆ సరోవరం దగ్గర అన్నీ చేర్చండి. పెద్ద పెద్ద పాత్రలు, నెయ్యి , చక్కెర, గోధుమలు, మిగతా సమస్త వస్తువులు కూడా మీరు వెంటనే అక్కడ ఈ రోజే చేర్చండి. ప్రొద్దున్నే వంట మొదలు పెట్టాలి. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. ఆ భగవంతుడు మనం ఏ పనులైనా భక్తిమార్గంలో, ధర్మ మార్గంలో చేసినా సాక్షాత్తు నరనారాయ ణుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఏ విషయమైనా మనం సందేహంతో ప్రారంభిస్తే ఎంత మంచి పనైనా అడ్డంకులు చాలా వస్తాయి సుమా !” అని హెచ్చరించారు. ఈ విధంగా అందరు కూడా చౌరాసీ సందర్భంగా ఎవరికి వారు అన్ని పనులలో మునిగిపోయారు