N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Saturday, 12 November 2016

SwamiNarayan - Episode 91



నెయ్యి దొంగతనం

శ్రీ స్వామి నారాయణ గారి ఆదేశం ప్రకారం అహ్మదాబాదు నలుమూలలా దండోరా వేయించబడింది. సర్వ బ్రాహ్మణుల ఇళ్ళకి వృద్ధులు, పిల్లలు అందరు కూడా బ్రహ్మ భోజనానికి, చౌరాసి వ్రతానికి రావాల్సిందిగా ప్రభుశ్రీ స్వామి నారాయణ గారి తరఫున ఆహ్వానాన్ని అందజేస్తున్నామని దండోరావేయించారు. ఆహ్మాదాబాదు నగరమే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న పల్లెటూళ్ళలో కూడా ఈ ఆహ్వానం వెళ్ళింది. ఒక్క రోజులోనే మరి ఇన్ని వేల మంది బ్రాహ్మణులకి సంతర్పణ జరగాలంటే అది సాధ్యమైన పని కాదు కదా ! 


కొన్ని వేలమంది స్వామి నారాయణ గారి భక్తులు, సాధువులు, సంతువులు అందరు కూడా నడుం బిగించారు. గ్రామ గ్రామాలనుంచి  కూరగాయలు, ధాన్యాలు, అంటే  బియ్యం, గోధుమలు, జొన్నలు,కందిపప్పు, నెయ్యి ఇలా మిగతా సామగ్రి అంతా బళ్ల కొద్ది స్వామి నారాయణ గారి భక్తులు తీసుకుని రాసాగారు. ఇక కూరగాయల సంగతి చెప్పక్ఖర్లేదు. బళ్ల కొద్ది రకరకాలైన కూరగాయలు గ్రామస్తులు అన్నీ తీసుకుని కంకర్య అనే సరోవరం దగ్గర అక్కడే వంట ప్రయత్నాలు జరుగుతున్నందు వల్ల అక్కడికే తీసుకుని రాసాగారు. క్షణంలో కొన్ని వేలమంది పాకశాలలో చేరి కొంత మంది లడ్లు తయారు చేయడంలో, కొంత మంది కూరగాయలు తరగడంలో, కొంత మంది వచ్చిన పదార్థాలన్నీ జాగ్రత్తగా ఒక ప్రదేశంలో చేర్చడం, తర్వాత కొన్ని వందల కొద్ది బస్తాల్లో గోధుమలు, జొన్నలు విడిగా గృహాలకి వెళ్ళిపోవడం , మహిళలు, సాధువులు, సంతువులు, పెద్దలు, పిన్నలు  అందరు అక్కడకు చేరి వారి శక్తి కొద్ది వాటిని విసిరి, పిండి చేసి మళ్ళీ బస్తాలు బస్తాల రూపంలో వంట శాలకి పంపించడం ఎక్కడ చూసినా అంత బ్రహ్మాండంగా ఏదో ఎవరికి వారు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఉత్సవంలాగా భావించి భక్తిశ్రద్ధలతో , విశ్వాసంతో, ప్రేమపూర్వకంగా అన్ని పనులు చేయసాగారు. అంత సామగ్రి మరి ఒక్క రోజులో ఎలా చేరింది? ఇన్ని వేలమంది క్రమశిక్షణతో చక్కగా వారి వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా సాక్షాత్తు  భగవంతుడి మీద ఉన్న భక్తి, ప్రేమ , విశ్వాసం అని చెప్పక తప్పదు. 

అందులో సాక్షాత్తు నరనారాయణుని ఆశీర్వాదం కూడా ఉంది కదా ! ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంత మంది బ్రాహ్మణులు రేపు  మనకి చౌరాసి విందు బాగానే ఉంటుంది. ఘుమఘుమలాడే నేతితో లడ్లు, జిలేబీలు తింటాం. తర్వాత మన ఇంట్లో ఎండు రొట్టెలు తినవలసి వస్తుంది కదా !  ఇక్కడ ఆవు నెయ్యి నది లాగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని మనం ఇక్కడ కొన్ని డబ్బాలు తస్కరించినా ఎవ్వరికి తెలియదని ఒక ఆలోచనలో పడ్డారు. వారంతా సమీప గ్రామస్థులే. వారు దారిలో కాచుకుని కూర్చున్నారు. అదే దారిగుండా  నేయి డబ్బాలు బండిలో పెట్టుకుని వస్తున్నటువంటి పటేలుని  ఆపి వంట గది ఇటువైపు ఉంది, వంట ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. నీవు అటువైపు వెళ్ళకు, ఇటు రా అని చెప్పగా పటేల్ అలాగే అని చెప్పి దారి మళ్ళించ బోయాడు. స్వామి నారాయణ గారు శుక్లానంద  మరియూ ఇతర సాధువులకి వస్తువుల దురుపయోగం జరక్కూడదు కాస్త జాగ్రత్తగా చూడండి అని చెప్పడం వల్ల  అక్కడే ఉన్నటువంటి ఒక సాధువు ఆ బండి వాడితో చెప్పాడు “ఏం భాయి ! నీవు తప్పు దారిన వెళ్ళుతున్నావు. వంట శాల అటువైపు లేదు. ఇటువైపు ఉంది” అని సరైన మార్గం చూపించాడు.  అప్పుడు పటేలు కొంచెం ఆశ్చర్య పోయాడు. సాధువు చెప్పడం వల్ల అతను సరైన మార్గం లోకి తన బండిని తీసుకెళ్ల సాగాడు. ఈ లోపల అక్కడ ఆ  బ్రాహ్మణుడు ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఈ సాధు మహారాజు అతన్ని  పట్టుకుని “ఎందుకు నీవు బ్రాహ్మణుడివై ఉండి బండిని తప్పు మార్గం పట్టిస్తావా? మీ గ్రామం అటువైపు ఉంది కదా !” అని అడిగాడు. “మా గ్రామం కాదు మా గ్రామస్థులంతా అక్కడే ఉన్నారు” అని  ఆ బ్రాహ్మణుడు చెప్పగా “ఓహో ! నీ తోడుదొంగలు అక్కడ ఉన్నారా?” అని చెప్పి ఆ సాధువు వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. అతను ఎంత ప్రయత్నించినా సాధువు అతన్ని వదలలేదు. అప్పుడు బ్రాహ్మణుడు కోపంతో సాధువుని గట్టిగా తల మీద కొట్టినా అతను  మాత్రం ఆ బ్రాహ్మణున్ని వదలలేదు. ఆ  బ్రాహ్మణుడిని తీసుకుని మిగతా  బ్రాహ్మణ స్నేహితుల దగ్గరకి వెళ్లి వాళ్ళందరిని కూడా మందలించాడు. వాళ్ళంతా తాము చేయబోయే తప్పుని ఒప్పుకున్నారు. ఆ సాధు మహారాజు గారు వారందరినీ తీసుకుని శ్రీ స్వామి నారాయణ గారి దగ్గరకి తీసుకుని వెళ్లి జరిగిందంతా పూస గుచ్చినట్టుగా వివరించారు. అప్పుడు స్వామి నారాయణ గారు “ఓ బ్రాహ్మణా దేవతల్లారా ! మీకు కావలసినంత ఆవు నెయ్యి, ఇంకా ఏది కావాలన్నా అవి మీకు సమృద్ధిగా దొరుకుతున్నాయి కదా ! అవన్నీ మీరు అనుభవించండి. అవి తినండి కాని మీరు మా సాధువులని మాత్రం తినవద్దు. చూడండి ! మీరు అతన్ని ఎలా కొట్టారో ! అతనికి ఇంకా రక్తం కారుతుంది. సద్బ్రాహ్మణులైన మీరు ఇలా చేయడం తగునా? మీరు భోజనాలు చేశాక మీకు ఏయే పదార్థాలు ఎంతెంత కావాలో యథేచ్చగా మీ గృహాలకు మీరు తీసుకుని వెళ్ళ వచ్చును. అంతే కాని మా సాధువులని మాత్రం మీరు హింసించ వద్దు” అని మందలించారు. ఇంతలో కొంతమంది బ్రాహ్మణులు , సాధువులు వచ్చి “ప్రభుశ్రీ ! ఆహార పదార్థాలు వెంటనే అయిపోతున్నాయి ముఖ్యంగా ఆవు నెయ్యి లో రకరకాల పదార్థాలను ముంచుకుని తింటున్నారు. చలికి తట్టుకోడానికి పాత్రల కొద్ది నెయ్యిని వేడి చేసి ఒంటికి రాసుకుంటున్నారు. కొంత మంది ఆవు నెయ్యిని స్వేచ్చగా త్రాగేస్తున్నారు. ఇలా అందరు ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు” అని చెప్పారు. అది విని ప్రభుశ్రీ “ఏం ఫరవాలేదు . వారు ఎంత ఖర్చు చేసినా కూడా మనకు అన్నీ సమృద్ధిగానే ఉంటాయి, మీరేం కంగారు పడకండి” అని చెప్పి వారిని పంపించి వేశారు. చౌరాసి వ్రతం, అన్న సంతర్పణ, బ్రహ్మ భోజనం చాలా బాగా ‘ నభూతో న భవిష్యతి’ అన్నట్టుగా బ్రహ్మాండంగా జరిగింది. వచ్చిన బ్రాహ్మణ అతిథులంతా సంతుష్టిగా, ఆనందంగా “ఎంతో  బాగుంది”, “ఆహా”, “ఓహో” అనుకుంటూ, సంతృప్తికరంగా భోజనం చేసి ఆశీర్వదించి వెళ్ళారు. ప్రభుశ్రీ గారు చౌరాసి వ్రతం అనుకున్నట్టుగానే చాలా చక్కగా జరిగింది. ఇక్కడ పవిత్రమైన భూమాత కూడా చాలా సంతోషించి ఉంటుంది అని చెప్పగా సత్సంగులందరు ప్రభుశ్రీ !  బ్రాహ్మణులందరు కూడా సంతృప్తికరంగా భోజనం చేశారు. లడ్డులు వాళ్లకి కావలసినంత తిన్నారు. అంతే కాక ప్రతి ఒక్క బ్రాహ్మణ అతిథికి ఐదైదు లడ్ల చొప్పున పంచడం జరిగింది. ఇంత చేసినాక కూడా ఇంకా చాలా లడ్లు మిగిలిపోయాయి అని విన్నవించారు. ఓహో ! అలాగా ! అయితే మీరు ఒక పని చేయండి. గ్రామ గ్రామంలో ఉండే ప్రజలందరికి కూడా వారి వారి ఇంటికి స్వయంగా ఈ లడ్లని పంపిణి చేయండి. అంతే కాకుండా ఆవులకి, ఎద్దులకి, కుక్కలకి, ప్రతి ప్రాణికి ఈ ప్రసాదాన్ని పంచి పెట్టండి. అంతే కాకుండా కంకరియా ప్రదేశంలో కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని వెదజల్లండి. అక్కడ ఉన్న క్రిమి కీటకాదులు, చీమలు ఇవన్నీ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తాయి. అంతే కాకుండా ఈ ప్రసాదాన్ని సరస్సులో కూడా వితరణ చేయండి. దాని మూలంగా సరస్సులో ఉన్న అనేక జలచరాలు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తాయి. మనుష్యులకే కాదు ఈ ప్రసాదం అందరికి చెందవలసిందిగా ఆదేశించారు. అందరు స్వామి నారాయణ గారి యొక్క ఆలోచన అంటే మనుషులే కాకుండా ప్రతి ప్రాణి కోటి మీద ఆయన చూపించిన కరుణ, దయామృత వర్షాన్ని గమనించి ఎంతో సంతోషించారు. అందుకనే స్వామి నారాయణ గారు స్వయంగా నారాయణుడే అని చెప్పి వేనోళ్ళ స్తుతించి జయజయ ధ్వానాలు చేశారు. ఈ విధంగా స్వామి నారాయణ గారి కీర్తి మరొక్కసారి దశదిశలా మారుమ్రోగి పోయింది. ప్రభుశ్రీ సమావేశంలో అందరిని ఉద్దేశించి మనం అనుకున్న విధంగా మీ అందరి సహకారాల వల్ల చౌరాసి వ్రతం చాలా విజయవంతంగా జరిగిపోయింది. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ  మందిర నిర్మాణం కూడా జరిగిపోయింది కాబట్టి భక్తులందరు కూడా రోజూ మందిరానికి వెళ్ళండి .అక్కడ ఉన్నటువంటి ప్రభుశ్రీని, దేవతామూర్తులని మాత్రమే చింతన చేసుకుని ధ్యానం చేసుకోండి, భజన చేసుకోండి , స్తోత్రాలు చదువుకోండి. ఇది ధర్మానికి నిలయం కనుక వేరే కార్యకలాపాలు మాత్రం మీరు చేయకూడదు. హరి భక్తులందరు కూడా వారి వ్యాపారం గురించి కాని ఎటువంటి లౌకిక విషయాల గురించి ఏమీ మాట్లాడకూడదు. కేవలం ధర్మానికి సంబంధించినవే, భగవంతుడికి సంబంధించినవే మీరిక్కడ చర్చించుకొనవలసి వస్తుంది లేక ధ్యానం చేసుకొనవల్సి వస్తుంది లేదా కీర్తనలు పాడు కొనవలసి వస్తుంది. ఇక్కడ దుకాణాలు తెరవడం , వ్యాపారానికి చెందిన వస్తువులు నిలవ ఉంచడం అలాంటివన్నీ మీరు దయ చేసి చేయకండి. అలా చేస్తే మీరు ధర్మం నుంచి, ఆ భగవంతుడి మీద నుంచి శ్రద్ధ పోయి లౌకిక వ్యవహారాల్లో మీ మనస్సు మరలుతుంది. దాని వల్ల ముక్తి కాదు కదా పతనం ఆరంభమౌతుంది జాగ్రత్త ! అలాగే ఈ మందిరం చుట్టుప్రక్కల ఉన్న గృహస్థులందరు కూడా రోజుకి రెండు సార్లు దర్శనం చేసుకొన వచ్చును. 

ఇక్కడ ఈ మందిరంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అడుగు పెడతారో వారికి తప్పకుండా మనఃశాంతి కలుగుతుంది. వారి మనో కామన అంటే వారు కోరుకునే ధర్మపరమైనట్టి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆ హరి నామస్మరణం చేసుకుంటూ నరనారాయణుని ఆశీర్వాదం మీరు పొందుదురు గాక ! ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కాబట్టి ఇక నేను ఇక్కడ్నుంచి సెలవు తీసుకుంటాను. అని చెప్పారు. అక్కడ ఉన్న సత్సంగులందరు ప్రజల నుద్దేశించి ప్రభుశ్రీ దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళ వలసిందిగా ఆదేశించారు. అదేవిధంగా ప్రజలందరు ఒక్కొకళ్ళు క్రమశిక్షణతో వచ్చి స్వామి వారికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుని అక్కడనుంచి వెళ్లి పోయినారు.
                     

అందరు వెళ్ళిపోయాక స్వామి నారాయణ గారు అక్కడే ఉన్న సత్సంగులనుద్దేశించి మీరందరు చక్కగా కార్యక్రమాలని నిర్వహించారు. ఇప్పుడు మన దగ్గర ఏమాత్రం డబ్బులున్నాయి? అని ప్రశ్నించారు. ఏడువేల రూపాయలు ఎనిమిది అణాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్పారు. లాల్ దాస్ గారూ ! మీరు మాకు డబ్బు సాయం చేశారు. మీ డబ్బు మీరు వాపసు తీసుకోండి అని ఆదేశించారు. అప్పుడు వినయంగా లాల్ దాసుగారు చేతులు జోడించి “ ప్రభుశ్రీ ! నేను ఈ ధనాన్ని మంచి కార్యం కోసం , మందిర  నిర్మాణం కోసం సమర్పించాను కాని మీకు అప్పుగా మాత్రం ఇవ్వలేదు. నేను ఈ డబ్బుని వెనక్కి తీసుకోను అని చెప్పాడు. అప్పుడు ప్రభుశ్రీ “మేము సాధు- సంతువులం మాకు ఈ డబ్బు లెక్కలు , ఈ డబ్బు వ్యవహారాలతో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఎటువంటి సంబంధం పెట్టుకోదల్చుకోలేదు ఎందుకంటే మేము చేయవలసిన కార్యక్రమాలు వేరే ఉన్నాయి కనుక ధనంతో ఏమాత్రం సంబంధం మేము పెట్టుకో౦. అందుకని నీవొక పని చేయి. నీవే ఈ మందిరానికి రోజూ జరగబోయే కార్యక్రమాల కోసం ఈ డబ్బుని సద్వినియోగం చేయి” అని చెప్పి ఆదేశించారు. అంతలో కొంత మంది సత్సంగులు “ప్రభుశ్రీ ! మనం చౌరాసి వ్రతం చేశాం కదా ! ఇంకొక వ్రతం మిగిలిపోయింది ఆ వ్రతం కూడా చేస్తే బాగుంటుంది కదా!” అని అన్నారు. “ఎందుకు చేయకూడదు ?  నర నారాయణ జన్మ దిన సందర్భంగా ఆ పుణ్యోత్సవాన్ని మనం చేద్దాం” అని వెంటనే ఆయన అనుమతినిచ్చారు.