స్వర్గీయ బ్రహ్మశ్రీ మల్లాది గోవిందదీక్షితులుగారు స్వయంగా శ్రీ బాపన్నావధానులు వారి వంశంలో 33వ తరంవారు, శ్రీ పాదులవారికి వీరు మేనమామ వరస అవుతారు. ఈయన ఎపుడూ నివురుగప్పిన నిప్పులా తన గురించి ఏమాత్రం బయటికి ఎవరికీ చెప్పుకునేవారు కాదు. పైకి చాలా సామాన్యంగా కనిపించినప్పటికీ ఆయన మహా మేధావి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని మనం చెప్పవచ్చు. అయితే ఆయన చాలా ఉన్నతమైనటువంటి భూమికలో ఉన్న వ్యక్తి కాబట్టి చాలామంది పిఠాపురం వారు ఆయనను ఒక పిచ్చివాడిగానే భావించేవారు. అది వారి ఆధ్యాత్మిక ప్రగతి చాలా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల అలా జరుగుతుంది. అంతేకాక ఆశ్చర్యమయిన విషయం ఏమిటంటే వృత్తిరిత్యా పెద్ద పెద్ద పదవులకు చెందినవారు కాని, శాస్త్రాలు, పురాణాలు చదివినవారు కాని పైకి వారు పెద్ద భూమికలో ఉన్నట్లు కనిపించినా వారు కూడా సామాన్య మానవుని వాలే మాయకి లోనయ్యి చెప్పుడు మాటలు వినడంవల్ల, దీక్షితులుగారు జీవించినంత కాలం కూడా వారు అపార్థం చేసుకుని ఆయనకి దూరంగానే ఉండిపోయారు. అయితే దాంట్లో ఉన్న కొంతమంది సజ్జనులు ఆయన పరమపదించిన తరువాత, ఆయన గురించి తెలుసుకున్నాక “అయ్యో ఆయన బతికున్నపుడు కలవలేకపోయాము, చెప్పుడు మాటలు విని ఆయనను కలుసుకునే భాగ్యం దక్కలేదు కదా” అని బాధపడుతుండేవారు.
అంతేకాక ఎవరి చెప్పుడుమాటలు విని అటువంటి దుష్ప్రభావానికి లోనయ్యారో అటువంటి వ్యక్తుల చేస్తున్నటువంటి ఘరానా మోసాలు, దత్తభక్తులని వంచించిన తీరు ఇవన్ని తెలుసుకున్నాక వారికి గోవిందదీక్షితులు గారి పట్ల మంచి అభిప్రాయం కలిగింది. మరి ఇది దత్తుడి మాయ అని చెప్పటానికి వీలులేదు ఎందుకంటే ఎవరైతే వారి హృదయాన్ని తెరుచుకుని ఉంటారో వారికి మాత్రమే ఇటువంటి మంచివ్యక్తుల గురించి మంచి అభిప్రాయం కలగటం, వారి దగ్గరకి వెళ్ళటం తద్వారా నిజానిజాలు తెలియటం జరుగుతుంది. అలాగే ప్రపంచంలో ప్రతి మనిషిలో కొంచెం మంచి, కొంచెం చెడు ఉంటాయి. అయితే కొంత యోగ సాధనతో ఉన్నవారికి కూడా మంచితనం ఎక్కువ ఉన్నపటికీ కూడా ఒక్కొక్కసారి మాయకి లోనవుతూ ఉంటారు. ఇటువంటి సంఘటనలు అనేకం స్వయంగా శ్రీ దత్తమహాప్రభువు తన త్రిపుర రహస్యంలో పరశురాముడికి బోధించడం జరిగింది. అంతేకాకుండా దత్తాత్రేయుడు కావచ్చు, వారి అంశ అవతారాలు కావచ్చు వారు చెప్పిన అనేక కథలు, లీలలలో ఈ సందేశం ఉన్నపటికీ మనం యాంత్రికంగా పుస్తకాలు చదువుతూ ఉంటాం కాని దానిలో ఉన్న అసలైన తత్వాన్ని మనం గ్రహించలేకపోతుంటాము. దీనివల్ల మనకి తెలుస్తున్నది ఏమిటంటే ఒక్కొక్క సందర్భంలో మనం మంచి స్థితిలో ఉన్నపుడు, మనం పై భూమికలో విహరిస్తునపుడు మన ఆలోచనలు చాలా స్వచ్చంగా, చక్కగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే మనము ఆ పైభూమిక నుండి కిందకి వచ్చినపుడు మనకేదో తెలియని మాయా స్థితిలో పడిపోతుంటాము.
మల్లాదిగోవిందదీక్షితులుగారి గొప్పతనాన్ని కేవలం ఆధ్యాత్మికంగా పైస్థాయిలో ఉన్నవారు మాత్రమే గమనించారు. అందుకనే ఎంతోమంది సిద్ధులు, సాధువులు, యోగులు పిఠాపురం వచ్చి గోవిందదీక్షితులుగారిని కలిసి ఆయన్ని ఆశీర్వదించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితేవారు వచ్చినపుడు దీక్షితులు గారు ఎంతో భక్తిభావంతో వారికి పాదనమస్కారం చేయబోయినపుడు ఆయనని వారించి “నీ స్థానం అక్కడ కాదు నాయనా, ఇక్కడ అని” తమ హృదయానికి హత్తుకునేవారు. సాక్షాత్తు దత్తుడియొక్క తత్వాన్ని ఎంతో గొప్పవారే తెలుసుకోలేకపోయినపుడు సామాన్యమానవులకి గోవిందదీక్షితులుగారు పిచ్చివాడిగా కనపడటం సహజమే కదా. కాని ఇదంతా తెలిసినప్పటికీ ఆయన ఎవరిని ఏమి అనేవారు కాదు, విమర్శించే వారు కాదు. కాని శ్రీపాదవల్లభుల గురించి ఎవరైనా కొద్దిగా నిందావాక్యాలు మాట్లాడినపుడు కాని, ఆయన చరిత్రలో కొన్ని భాగాలు తీసేసినపుడు, వారి మీద కాని ఆయనకి కించిత్తు కోపం, బాధ ఉండేవి, అవి సహజమే కదా.
గోవిందదీక్షితులుగారు నాకు మరియొక అద్భుతమయిన సంఘటన ఆయన జీవితంలో జరిగినది చెప్పటం జరిగింది. శ్రీపాదశ్రీ వల్లభుల వారి చరిత్రలో స్వామివారు గృహత్యాగం చేసినపుడు దేశ సంచారంలో ఒకసారి హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి ద్రోణ గిరిపర్వతం దగ్గర ఉన్న శంబల అనే ప్రదేశాన్ని సందర్శించి అక్కడ కొన్ని వేలసంవత్సరరాల నుంచి తపస్సు చేస్తున్న వారిని కలిసి వారిని ఆశీర్వదించారు. అందులో శ్రీ సర్వేశ్వరానందస్వామివారు ఒకరు. ఈయన అప్పటికే 5వేల ఏళ్ళకు పైనుంచి అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. గోవింద దీక్షితులుగారు చాలా పుణ్యక్షేత్రాలు సందర్శించటం, అక్కడ కొంతమంది సాధువులను, యోగులను ఆయన కలుసుకోవటం జరిగినది. కాని ఆ విషయాలన్నీ ఎవరితోనూ పంచుకోలేదు, చాలామటుకు ఆయన గుప్తంగానే ఉంచారు. అయితే ఒక సందర్భంలో ఆయన నాకు ఈ సంఘటన చెప్పారు. ఒకసారి ఆయన హిమాలయయాత్రకి వెళ్దామని సంకల్పం కలిగి, కాశ్మీరులో ఉన్నటువంటి పెహెల్గామ్ దగ్గర ఆయన వెళ్తునప్పుడు దారిలో ఒక బాలకుడి అస్తిపంజరం కనిపించింది. ఆయన ఆశ్చర్యంతో ఇదేమిటి, ఇక్కడ 5 ఏళ్ళ బాలుడి అస్తిపంజరం ఉందేమిటి అని ఆలోచిస్తుండగా ఆ అస్తిపంజరం లేచి నుంచుని ఇలా మాట్లాడింది "అటు కొద్దిగా పైకి వెళ్ళు, నేనెవరో తెలుస్తుంది" అనగా ఆయన కొంత ఆశ్చర్యంతో అదే దిక్కుగా వెళ్ళగా ఒక మహానుభావుడు ఆయనని ఎంతో ప్రేమగా తనవైపు రమ్మని చెప్పడం దీక్షితులు గారు మరింత ఆశ్చర్యంతో ఆయన వద్దకి వెళ్లి ఎంతో వినయంగా ఆయనకి నమస్కరించి ఇలా ప్రశ్నించారు “మహాత్మా మీరెవరు, ఇక్కడ ఎందుకు ఉన్నారు" దానికి ఆయన "నన్ను సర్వేశ్వరానంద స్వామి అంటారు, నేను హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటాను” అనగా వెంటనే దీక్షితులు గారు ఆయనకి పాదనమస్కారం చేయ్యబోగా ఆయన వారించి, నువ్వు పాదనమస్కారం చెయ్యకూడదు. నీ స్థానం నా హృదయంలో ఉందని ఎంతో ప్రేమగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. తరువాత ఆయన దీక్షితులు గారిని ఆశీర్వదించి “నువ్వు సాక్షాత్తు దత్తమహాప్రభువు వంశంలోని వాడివి, స్వామివారు చెప్పినట్లుగానే 33వతరంలో అన్నీ జరుగుతున్నాయి. నీ ద్వారా చాలా విషయాలు జరుగుతాయి" అని చెప్పి వెళ్ళిపోయారు. మరి వాళ్ళిద్దరూ ఇంకేమైనా యోగ రహస్యాలు మాట్లాడుకున్నారో మల్లాది గోవింద దీక్షితులు గారు నాకేమి చెప్పలేదు. అయితే ఒకానొక మిత్రుడుకి ఈ విషయం చూచాయగా చెప్పినపుడు ఎంతో పట్టుబట్టి “నేను కూడా ఆ స్వామిని కలవాలి” అని చెప్పగా దీక్షితులు గారు అతనిని వారించారు, నేను కలవటం అనేది ఆయన సంకల్పం వల్ల జరిగింది, ఆయన నన్ను కలవాలి అనుకున్నారు కాబట్టే అటువంటి సన్నివేశాన్ని సృష్టించి ఆయన దర్శనం ఇచ్చారు. అదే విధంగా ఆయన ఆజ్ఞ లేకుండా అటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుండదు, మనం అటువంటి మహాత్ములని వారి ఏకాంతాన్ని భంగపరచకూడదు. వారి ఆజ్ఞ వచ్చినపుడు మాత్రమే మనం వెళ్ళాలి” అని చెప్పినా అతను వినిపించుకోకుండా తన ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అతను సర్వేశ్వరానందస్వామిని కలవాలని విఫలప్రయత్నం చెయ్యడం, దానివల్ల అతను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి చివరకి దేహం చాలించాడు. కనుక మహాత్ములు, యోగులు, అవధూతల జీవితాలలో మనం జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు అనే సందేశం మనకు తెలిసింది.
అయితే దురదృష్టవశాత్తు మన చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవధూతతత్వం అంటే ఎలా ఉంటుంది అని నేను ఆలోచిస్తున్నపుడు నాకు ఏమనిపించిందంటే అవధూతలు అనగానే పిచ్చివారిలా ప్రవర్తిస్తారని, చుట్ట బీడీ లాంటివి తాగుతుంటారని, బూతులు మాట్లాడతారని, వారేమి చేస్తారో వారికే తెలియని స్థితిలో ఉంటారని ఒక ప్రచారం ఉంది. అయితే నిజంగా వారు అవధూతలు అయితే, వారి లోకంలో వారు నిజంగా ఆనందంగా ఉన్నపుడు అటువంటి వారి జీవితాల్లోకి మనమెందుకు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది.
వారు ఈ లౌకికసుఖాలను త్యజించి కదా వెళ్ళిపోయారు, అటువంటి వారిని ఈ లౌకికప్రపంచంలోకి తీసుకొచ్చి ఒక ప్రదర్శనలాగా అక్కడపెట్టి, వారిని అవధూత అని ప్రచారం చెయ్యడం ఎంత వరకు సమంజసం. అసలైనటువంటి అవధూత తత్వాన్ని స్థాపించినటువంటి మూలపురుషుడైన సాక్షాత్తు దత్తాత్రేయమహాప్రభువుని మరిచిపోయి ఎందుకు ఇలాంటి అవధూతల జీవితాల్లో జోక్యం చేస్కోవడం, వద్దని వారించలేని మానసికస్థితిలో ఉన్నవారిని తీసుకొచ్చి లౌకికప్రపంచంలో పెట్టడం అనేది నిజంగా అది సమాజానికి ఒక మంచి సందేశాన్ని మాత్రం ఇవ్వదు. చాలామంది దత్తభక్తులు దానివల్ల దారి తప్పే ప్రమాదం కూడా ఉంది. అసలైన మూలతత్వాన్ని మనం పట్టుకున్నపుడు సహజంగా ఇటువంటి లోకంలో ఉన్నవారిని వారి లోకంలో మనం వదిలివెయ్యడం శ్రేయస్కరం కదా. అనవసరంగా వారిని ఇబ్బందిపెట్టి ఎక్కడినుంచో వారిని తీసుకొచ్చి వీరు అవధూత అని చెప్పటం, ఎందుకంటే నిజమైన అవదూతకి ఎటువంటి ప్రచారము ఉండవలసిన అవసరం లేదు. ఈరకంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలామంది ఒక గందరగోళ పరిస్థ్తిని సృష్టిస్తున్నారు కదా అని నేను అభిప్రాయపడ్డాను. అయితే దీనికి నాకు ఒక మంచి సామాధానం దత్తాత్రేయ మహాప్రభువే వివరించడం జరిగింది.
అవధూత యొక్క తత్వం:
జమదగ్నిమహర్షి మరణానంతరం ఆయనకి దహనసంస్కారాలు చెయ్యటానికి పరశురాముడి తల్లి రేణుకామాత తన కుమారుడితో “నువ్వు ఒక కావడిని తీసుకుని దానిలో మీ తండ్రిగారి శరీరాన్ని ఉంచి వేరొక కావడిలో నన్ను కూర్చోపెట్టి తీర్థయాత్రలకి బయల్దేరు. ఎక్కడైతే మీ తండ్రిగారి అంత్యక్రియలు చేసే ప్రదేశం వస్తుందో అక్కడ నీకు ఆకాశవాణి వినిపిస్తుంది, అక్కడ నువ్వు ఆగవలసినది. తదుపరి విషయాలు మళ్లీ చెబుతాను” అని చెప్పగా పరశురాముడు తల్లిమాట శిరసావహించి తీర్థయాత్రలకు బయలుదేరి సహ్యాద్రిపర్వతం నుంచి అమలక అనే గ్రామపరిసరాలకి వచ్చినపుడు (ప్రస్తుతం మూహుర్గని అని అంటున్నారు) అతని పాదాలు అప్రయత్నంగా ఆగిపోయాయి, కాలు ముందుకు కదలట్లేదు. అపుడు ఒక దివ్యవాణి ఆయనకి మాత్రం ఇలా వినిపించింది, నాయన నువ్విక్కడే ఆగవలసింది. రేణుకామాత పరశురాముడితో “నాయన ఈ సహ్యాద్రిపర్వతాల్ని నివాసంగా చేసుకుని దత్తమహాప్రభువు ఇక్కడే ఉంటారు, నువ్వు ఆయన్ని కలిసి మీ తండ్రిగారి పితృకర్మలు చెయ్యవలసిందిగా ప్రార్ధించు” అని ఆదేశించగా పరశురాముడు తల్లిఆజ్ఞని అనుసరించి సహ్యాద్రిగుహలలో నివసిస్తున్న స్వామివారిని దర్శించాడు.
దత్తమహాప్రభువు ఒక్కొక్కసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టకుండా తన భక్తులని పరీక్షిస్తుంటాడు. అలాగే ఆయన ఒక చేతిలో మధుపాత్రతో, ఒక యువతిని దగ్గరపెట్టుకుని పరశురామునికి కనిపించాడు. అపుడు పరశురాముడు “ప్రభూ, నీ గురించి నాకు తెలుసు, నీ మాయలీలలు నా ముందు ఎందుకు ప్రదర్శిస్తున్నారు, అక్కడ మా తల్లిగారైన రేణుకాదేవి మీకోసం నిరీక్షిస్తున్నారు, ఆమె ఆజ్ఞ ప్రకారమే నేను మీ వద్దకు వచ్చానని చెప్పగా” వెంటనే ఆయన తన నిజస్వరూపంతో దర్శనమిచ్చి “అవునా రేణుకామాత ఎదురు చూస్తున్నారా, పద” అని గబగబా వెళ్లి రేణుకామాతను దర్శించి నమస్కరించి “తల్లి ఏమి చెయ్యాలో సెలవియ్యి” అని అడుగగా ఆమె సంగతి చెప్పి, “మీరు జమదగ్ని మహర్షి అంత్యక్రియలు జరిపించి ఒక యజ్ఞాన్ని చేసి ఆ యజ్ఞ ప్రధానరుత్వికునిగా ఉండమని” ప్రార్ధించింది. తరువాత ఆమె జమదగ్ని మహర్షితో పాటు సహగమనం చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తదుపరి అదే విధంగా శ్రీ దత్తమహాప్రభూ తను రుత్వికుడిగా ఉండి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించే ముందు ఆయన “నాయన పరశురామా, యజ్ఞం నిర్వహించడానికి గంగాజలము, మిగతా పుణ్యనదుల యొక్క జలము కావాలి, అది నువ్వు తెచ్చిపెట్టాలి” అనగా పరశురాముడు స్వామికి నమస్కరించి తన విల్లుని ఎక్కుపెట్టి భూమిలో కొట్టగా అక్కడనుంచి జలప్రవాహం ప్రారంభం అయ్యింది. దీనినే ఇప్పుడు మాతృతీర్ధంగా వ్యవహర్సిస్తున్నారు. ఆ తరువాత స్వామివారు యధావిధిగా యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం చూడటానికి ఎంతోమంది మహర్షులు దేవతలు, సిద్ధులు, అక్కడకి వస్తుండేవారు.
యజ్ఞంలో ఒక చిన్న పని నిమిత్తం సద్బ్రాహ్మణుడైన పింగళనాగుడు అనే అతనిని నియమించడం జరిగింది. ఇతను కొంచెం అమాయకుడు, యజ్ఞం చేసే పరిస్థితిని చూస్తుంటే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇంత పవిత్రమైన యజ్ఞం, ప్రధమరుత్వికునిగా సాక్షాత్తు దత్తమహాప్రభువు ఉన్నాడు, మరి ఆయనకి ఏమిటింత అనాచారము, ఈ యజ్ఞం నిర్వహిస్తున్న అతను కుక్కలని ముట్టుకుంటున్నాడు, అదే చేత్తో యజ్ఞం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆశ్రమంలో ఒక గదిలో ఒక యువతితో ఉంటున్నాడని అందరు చెప్పుకుంటున్నారు. అపుడప్పుడు ఆయన మధువుని కూడా సేవిస్తున్నాడు, ఈయనకి ఒక ఆచారం ఏమిలేదు, ఏమిటీయన. ఇంకొక వైపు ఆయన మొహం చూస్తే ఒక రకమైన ప్రశాంతత కలుగుతోంది మరి దేవతలు సాధువులు, యోగులు ఎంతమంది ఆయనకి నమస్కరించి వెళ్తున్నారు.
ఆయన్ని చూస్తూ తదేకంగా ఉండిపోతున్నారు, మరి దీంట్లో ఏదో రహస్యం దాగి ఉంది. ఇంత జరుగుతున్నా వారు ఇలా వస్తున్నారంటే ఆ రహస్యం ఏమితో నాకర్థం కావట్లేదు అని ఆ బ్రాహ్మణుడు ఆలోచిస్తున్నాడు. ఒక రోజు ఆమ్లక వృక్షం కింద దత్తాత్రేయుడు విశ్రాంతిగా కూర్చున్నపుడు దూరంగా నిలబడి చేతులు జోడించి వినయంగా మహాత్మా “నాకు ఒక చిన్న సందేహం ఉన్నది, మీరు పెద్దవారు, కోప్పడనంటే నేను ఆ విషయాన్ని అడుగుదామనుకుంటున్నాను” అనగా స్వామి అతనిని దగ్గరకి పిలిచి “పింగళనాగా, నీ ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన బాధ్యతా నాకుంది, కనుక నిర్భయంగా ఆ ప్రశ్నలు అడుగు, నేను సమాధానం ఇస్తాను” అనగా అపుడు తాను చూస్తున్న దృశ్యాలని అతను వివరించాడు.
“స్వామీ మరి ఈ అనాచారం ఏమిటి, ఇవన్ని చూస్తుంటే మీరేదో అద్భుతమైన క్రీడని సృష్టిస్తున్నట్లుగా నేను భావిస్తున్నాను, లోకంలో మరి సాంఘిక నియమాలు, కట్టుబాట్లు, ఆచారాలు ఇవన్ని 4 ఆశ్రమాలుగా విభజించారు కదా వాటిలో మీదియే ఆశ్రమం స్వామీ? మీ పధ్ధతి ఏమిటో నాకు అర్థం కావట్లేదు. చాలామంది మిమ్మల్ని అవధూత అని పిలుస్తుంటారు, ఏమిటి స్వామీ మీ నిజస్వరూపం, మీ తత్వం ఏమిటి? దయచేసి నా సందేహనివృత్తి చెయ్యండి” అనగా అపుడు స్వామివారు నవ్వి “పింగళనాగా నువ్వు బ్రాహ్మణోత్తముడివి, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. అయితే ఈ ప్రపంచంలో పెద్దవారు వారి కాలానికి తగ్గట్లుగా ఈ సాంఘిక నియమాలు పొందుపరిచారు . వాటిని మీరు తప్పకుండా పాటించాలి. అటువంటి నియమాల్తోనే ధర్మరక్షణ జరుగుతుంది. అయితే ఎలాగైతే ఏవిధంగా కుటుంబానికి యజమాని అయినవాడు తన సత్ప్రవర్తనతో, మంచి సంస్కారంతో సంఘానికి శ్రేయస్సు కలిగే విధంగా కట్టుబాట్లకి లోబడి మంచిపనులు చేస్తునపుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ అటువంటి సంస్కారాలనే పొందుతారు, తోటివారికి కూడా ఇలాగే సహాయం అందిస్తారు. ఇలా ఒక కుటుంబం వేరే కుటుంబాన్ని ప్రభావితం వంటి చేస్తున్నపుడు తద్వారా గ్రామాలు ప్రభావితం అవుతాయి. గ్రామాల ప్రభావం పట్టణాల మీద, పట్టణాల ప్రభావం దేశాల మీద పడుతుంది. ఈ విధంగా విశ్వం అంతా కూడా చక్కగా ఒక ప్రేమమాయమైన స్పందనలతో నిండిపోతుంది. కనుక మీరు అటువంటి నియమాలని పాటించాలి. అయితే నువ్వు నన్ను ఏ ఆశ్రమం వాడివని అడిగావు. నేను మీరు చెప్పిన నాలుగు ఆశ్రమాలని దాటి దానికతీతంగా 5వ ఆశ్రమంలో ఉంటాను.
మీరందరూ నన్ను అవధూతగా అనుకుంటుంటారు, అవధూత అనగా ఏమంటే నేను ఇపుడు మీ అందరికి అనాచారంగా కనిపిస్తున్నాను, అయితే నేను ఒక చేత్తో ఆ సూర్యుడిని ముట్టుకోగాలను, మరొక చేత్తో భూమ్మీద ఉన్న ఆశుద్ధాన్ని ముట్టుకోగాలను. నాకు రెండిటికి ఎటువంటి భేదభావం లేదు. ఎవరైతే నాలాగే చేయగలుగుతారో, వారే కేవలం నా 5వ ఆశ్రమంలో నన్ను చేరుకుంటారు. నా తత్వాన్ని తెలుసుకుంటారు. అలా కాకుండా స్వామివారు ఇలా మధువు తాగుతున్నారు, చెడ్డపనులు చేస్తున్నారని వారు కూడా ఇలానే చేస్తే వారుమాత్రమే భ్రష్టుపట్టకుండా వారి సహచరమంతా భ్రష్టుపడతారు. కాబట్టి నాయొక్క తత్వం పైకి ఒక రకంగా కనిపిస్తుంది, తక్కువ భూమికలో ఉన్నవారు అట్లా నేను చేస్తున్న బాహ్యమైన పనులని అనుకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారికి పతనం మాత్రమే కలుగుతుంది, వారితో పాటు చేరినవారు కూడా దత్తమార్గం నుంచి బయటికొచ్చినట్లే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త” అని చెప్పి స్వామి పింగళనాగుడికి వివరణ ఇచ్చారు.
ఈ రకంగా నేను ఏదైనా ప్రశ్నకి సమాధానం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నపుడు నాకు ఈ రకంగా దత్తమహాప్రభువు జవాబులు ఇస్తుంటాడు. అయితే మనం పుట్టిన ఈ లౌకికప్రపంచంలో మన సమాజవ్యవస్థలో ఉన్నటువంటి కట్టుబాట్లను, కర్మసిద్ధాంతాలను, ఈ పురాణాలలోని బాహ్యంగా కనిపించే విషయాలనే మనం పట్టించుకుంటాము కాని దానిలో ఉన్న గూఢమైన అర్ధాన్ని పట్టించుకోము. దానివల్ల మనం సమాజానికి మంచికన్నా ఒక రకంగా దుష్టప్రభావాన్నే కలిస్తున్నట్లుగా నేననుకుంటున్నాను. అయితే ఒక పద్ధతిలో కొన్నివందల ఏళ్ళుగా మనం ఒక విధానానికి అలవాటు పడినప్పుడు ఆ విధానంలో ఉన్నటువంటి కొన్ని మార్పులని చెయ్యవలసిన అవసరం వచ్చి కొంత నూతనమార్పులు వచ్చినపుడు ఆ కొత్తపద్ధతులని అనుసరించడానికి చాల కష్టపడతాము. ఎన్నాళ్ళ నుంచో వస్తున్నవిశ్వాసాలు, ఆచారాలు మన సంస్కారంలో జీర్ణించుకుపోవడంవల్ల కొత్త విషయాలను విశాల హృదయంతో అర్థం చేస్కోవడం ఎంతైనా అవసరం. మారుతున్న కాలం ప్రకారంగా మనం కొన్ని పద్ధతులను మార్చుకోక తప్పదు. అపుడే మానవశ్రేయస్సుకి మనం పాటుపడినట్లుగా అవుతుంది. 1987వ సంవత్సరంలో అయస్కాంత క్షేత్రం మారిన తరువాత, పై భూమికలలో ఉన్నవారు జన్మలు తీసుకుని భూమి మీదకి వస్తారో వారు ఇటువంటి విషయాలని కూలంకషంగా పరిశోధించి వారు ఏదో ఒక రోజు మాములుగా ఉండే మానవులను దైవమానవులుగా మార్చే కాలం ఎంతో దూరంలో లేదు. ఇది సందియుగం కాబట్టి మరి విపరీత పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ నిజమైన సాధకులకి, దత్తునితత్వాన్ని తెలుసుకున్నవారు ఈ నూతనపద్ధతులు, దానిలో ఉన్న శాస్త్రీయతను గమనించి వారిలో మార్పు వచ్చినపుడు ఈ సమాజం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అని నా విశ్వాసం.
Courtesy: Nanduri Sri Sairam
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే