విత్తనాలు - సంస్కారాలు
ఒక పౌర్ణమి రోజు రాత్రి నేను భోజనం చేసి తీరిగ్గా ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో పచార్లు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. ఆ పౌర్ణమి వెన్నెల మా ఇంటి ముందున్న రకరకాల మొక్కల మీద, నేల మీద తివాచీలా పరిచి ఉన్న గడ్డి మీద పడి చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది.ఆ సమయంలో నాకు అయస్కాంత వ్యక్తి సాక్షాత్కారం జరిగింది. ఆయనకి నేను వినయంగా నమస్కరించి "మహాత్మా చాలా రోజుల తరువాత దర్శనం ఇచ్చారు.ఈ పౌర్ణమి వెన్నెల చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో, ఇటువంటి ప్రకృతి సౌందర్యానికి మనసు ప్రశాంతతో నిండిపోతుంది, ఏదో ఒక తెలియని ఆనందం అణువణువునా వ్యాపించిపోతుంది. మీ సాక్షాత్కారం జరిగే ప్రతిసారి నాకు ఇటువంటి స్పందనలే కలుగుతుంటాయి" అని అన్నాను.