N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Sunday 31 July 2016

Spiritual Soup-11


Part 11 - విద్యారణ్య స్వాములవారు

మనలో చాలామందికి విద్యారణ్యస్వాములవారు పరిచయమే అనుకుంటాను. ఈ మహానుభావులే శ్రీ నృసింహ సరస్వతిగారికి కాశీలో గురువుగా ఉండి ఆయనకి మార్గదర్శకత్వం చేసారు. వీరే హిందూ సామ్రాజ్య మరియు హిందూ మత పతనాన్ని నిరోధించి లక్ష్మికటాక్షాన్ని పొంది, హరిహర బుక్కా రాయులుచే విజయనగర మహా సామ్రాజ్యానికి బీజం వేసారు. వీరు శ్రీ విద్య మరియు గాయత్రి ఉపాసకులు.

మహర్షులు, సిద్హులు, యోగులు మరియు గొప్ప మతాధిపతులు వీరందరూ కూడా దేశభక్తిలో అందరి కన్నాకూడా ముందే ఉంటారు. సామాన్య ప్రజానీకంలో మరియు కుటిల రాజకీయ నాయకుల దృష్టిలో పైవర్గం వారందరూ కూడా ముక్కుమూసుకుని అడవులలో సమాజానికి దూరంగా ఉంటూ ఏవో సాధన చేసుకుంటూ ఉంటారు అనే భావన ఉంది. కాని నిజానికి అది పూర్తిగా అబద్ధం అని చెప్పుకోవాలి. పైన చెప్పిన మహానువభావులందరూ కూడా నిస్వార్ధంగా దేశం కొరకు, సమాజం కొరకు సమస్త విశ్వమానవాళి యొక్క శ్రేయస్సు కొరకు  అహర్నిశలు ఎన్నో రకాలుగా సాధనలు చేస్తూ తద్వారా సంప్రాప్తించిన సమస్త పుణ్యాన్ని సమాజానికి ధారపోస్తూ ఉంటారు. 

వారిని మించిన దేశభక్తులు ఎవరు లేరు, అందుకే రాజకీయ నాయకులకే కాకుండా సామాన్య ప్రజానికానికి కూడా ఈ మహానుభావులదరు కూడా ఎందుకు రాజకీయ విషయాలలో జోక్యం చేసుకుంటారు అనే భావన ఉన్నది. తెలుగు భాష క్షుణ్ణంగా వచ్చినవారికి మరియు మన భారత దేశ ఉన్నతమయిన సంస్కృతి సాంప్రదాయాలు, నాగరికత, ఆధ్యాత్మికత, మన దేశ చరిత్రలో ఆసక్తి ఉన్నవారికి మాత్రమే మనకి ఉన్న ప్రామాణిక గ్రంధాల ద్వార ఈ విషయం   అర్థం అవుతుంది.   

విద్యారణ్య స్వాములవారి పూర్వనామం మాధవాచార్యులు. మంచి సంపన్న వర్గంలో పుట్టినవారు. వీరు రాఘవేంద్ర స్వామి మఠానికి  మతాధి కారిగా ఉన్నపుడు గాయత్రి ఉపాసన నియమ నిష్టలతో చాలా కతోరమైన సాధన చేసారు. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి, అక్షరానికి లక్ష చప్పున 24 లక్షలసార్లు జపం చేసినప్పుడు ఈ మంత్రం సిద్ధిస్తుంది, దీనినే మహా పునశ్చరణ అంటారు.

 మంత్రం సిద్ధించినపుడు, ఉపాసన ఫలించినపుడు ఆ గాయత్రి దేవి సాక్షాత్కారం జరుగుతుంది. మాధవాచార్యులు ఇటువంటి మహా పునశ్చరణ చే శాక ఎంతో ఆర్తిగా మాత దర్శనం కోసం తపించినా కూడా ఆయనకి నిరాశే మిగిలింది. అప్పటి చారిత్రాత్మక పరిస్థితులు భారత దేశపు ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉన్నాయి.  హిందూ మతంలో ఇటువంటి భిన్నమయిన సంప్రదాయాలు, అనైక్యత, రాజుల మధ్య అంత:కలహాలు, ఇదే అదనుగా తురుష్కులు భారత దేశం మీద దండయాత్ర చేయడం  భారతదేశాన్ని కొల్లగొట్టడం, హిందువుల ధన, మాన ప్రాణాలను హరించడం, కొన్ని లక్షల మందిని బలవంతంగా భయపెట్టి మతంలోకి మార్చడం, ఇవన్ని కూడా  విద్యారణ్య స్వాములవారిని కలవపరిచాయి. ఎలాగయినా భారతదేశం ఉనికిని, మన సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఆయన ప్రత్యేకంగా శ్రీవిద్య గాయత్రి ఉపాసనలు ప్రారంభించారు.

వీటన్నిటికి కూడా ఎంతో ధనం అవసరం కాబట్టి ఆయన ప్రత్యేకంగా లక్ష్మి సాధన ఎంతో కాలం చేయగా చివరకి లక్ష్మి దేవి ప్రత్యక్షం అయ్యింది. అప్పుడు స్వామి తన కోరికను వివరించగా లక్ష్మి దేవి ఈ జన్మలో అది నీకు సాధ్యం కాదు, వచ్చే జన్మలో అది అనుగ్రహిస్తాను అని చెప్పింది. దానికి ఆయన వెంటనే తన పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని త్యజించి "తల్లి, ఇప్పుడు నేను సన్యసిస్తున్నాను, కాబట్టి నాకిది మరొక జన్మ, నన్ను అనుగ్రహించు" అని ప్రార్ధించారు. ఆవిడ ఎంతో ప్రసన్నురాలై ఆయనకి ఆ శక్తిని ప్రసాదించింది. ఆ శక్తి ప్రభావం వాళ్ళ విద్యారణ్య స్వాములవారికి భూగర్భంలో ఉన్న గుప్త నిధి నిక్షేపాలు, ఖరీదైన రకరకాల నవరత్నాలు కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ఆయన స్వాధీనంలోకి వచ్చేవి. వాటినే ఆయన హరిహర రాయులు, బుక్క రాయులనే ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చి వారి చేత విజయనగర సామ్రాజ్య స్థాపనకి నాంది పలికారు. 

ఈ కారణాల వల్లనే ఆయన గాయత్రి సాధన ఫలించక పోవటం వాళ్ళ చాలా నిరాశ పడ్డారు. చుట్టూ ఉన్న భయంకరమైన దుష్ట రాక్షస, మాయ మరియు అసురి శక్తులను నాశనం చేయడానికి కావలసినంత శక్తిని ఈ సాధన ద్వారా ఆయన సంపాదించటానికి చివరకి గృహస్థాశ్రమం కూడా త్యజించి సన్యాసం పుచ్చుకున్నారు.  ఎంతో బాధతో ఆయన కొంత కాలం కాశీలో గడపడానికి నిశ్చయించి కాశీలో నివాసం  ఏర్పరచుకున్నారు. అక్కడే ఆయనకి ఒక తాంత్రికుడు తారసిల్లాడు, ఆ తాంత్రికుడు "వామాచారం"లో భైరవ సాధనలో భైరవుడి కటాక్షం పొందాడు. ఆయన మాధవచారిని చూసి మహానుభావా మిమ్మల్ని చూడగానే మీరు చాలా గొప్పవారని, మహా తపస్సంపన్నులు అని, మహా యోగులని తెలుస్తున్నది. కాని ఎందుచేతనో మీరు చాలా విచారవదనంతో కనిపిస్తున్నారు, అది నా అంతర్దృష్టికి  గోచరం అవుతున్నది. స్వామి మీరు ఎందుకంత విచారంగా ఉన్నారు, దయ చేసి నాకు చెప్పండి నాకు తోచిన సహాయం తప్పకుండా చేస్తాను" అని అన్నారు. అప్పుడు మాధవాచార్యులు ఈ విధంగా చెప్పారు, "అయ్యా మహానుభావా మీరు కూడా మంచి తాంత్రిక విద్యలో ప్రవీణులని తెలుస్తూనే ఉనాది. మీరనుకున్నట్లుగానే నాకు ఒక మానసిక వ్యధ ఉన్నది. దానికి కారణం నాకు తెలియట్లేదు. 

నేను ఎంతో నియమ నిష్టలతో గాయత్రి ఉపాసన చేసాను. కఠోర మయిన నియమాలతో గాయత్రి మంత్రాన్ని ఒక మహా పునశ్చరణ పూర్తి చేసాను కాని ఎందువల్లో కాని నాకు ఆ తల్లి ప్రసన్నురాలు అవలేదు (ప్రత్యక్షము కాలేదు). కొంత కాలం కాశీవాసం చెయ్యాలని ఇక్కడకి వచ్చాను" అని పలికారు. అప్పుడు ఆ తాంత్రికుడు "మహానుభావా నేను మీకు భైరవ ఉపాసన పద్ధతి చెప్తాను, ఆ సాధన వల్ల భైరవుని ప్రత్యక్షం చేసుకుని మీ సమస్యకి పరిష్కారం అడగండి. తప్పకుండ మీకు పరిష్కారం దొరుకుతుంది. వామాచార సాధనాలు చాల తొందరగా ఫలిస్తాయి, అదే దక్షిణాచార (సాత్విక పూజలు) పద్ధతిలో చాల కాలం పడుతుంది" అని చెప్పారు. మాధవాచార్యులు తాంత్రికుడు చెప్పిన విధంగా అర్థరాత్రి శ్మశానంలో ఒంటరిగా భైరవ ఉపాసన మొదలుపెట్టారు. ఇలా ఆరు నెలలు గడవగా ఒక అర్థరాత్రి సమయంలో "నాయనా మాధవాచార్య , ఎందుకు నా గురించి సాధన చేస్తున్నావు, నీ సాధన ఫలించింది నేను ఎంతో ప్రసన్నుడను అయ్యాను, నీకేమి కావాలో చెప్పు" అని ఒక గంభీర స్వరం వినిపించింది. మాధవాచార్యులు కళ్ళు తెరిచి చూడగా అక్కడ ఆయనకి ఎవరు కనపడలేదు. 

అప్పుడు వారు "భైరవా నీవెందుకు నా వెనుక నుండి మాట్లాడుతున్నావు, ముఖాముఖీ రావచ్చును కదా" అని అడిగారు. దానికి భైరవుడు "స్వామీ, మీరెంతో తపస్సంపన్నులు, శ్రీ విద్య, గాయత్రి ఉపాసకులు. అటువంటి మీ శక్తీ ముందు అల్పశక్తుడను  అయిన నేను మీ ముందుకు రాలేను, మీ శక్తిని నేను తట్టుకోలేను" అని వివరించారు. "మీ కోరిక ఏమిటో చెప్పండి, నాకు సాధ్యం అయితే చేసిపెడతాను కాని నా కన్నా కూడా మీరు చాలా శక్తివంతులు".  

దానికి మాధవాచార్యులు చాలా ఆశ్చర్యపోయారు. "భైరవ మీ అనుగ్రహాన్ని పొందినందుకు చాలా సంతోషం. మీరు చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను మీరు అన్నట్లుగానే ఒక మహా పురశ్చరణ చేసాను కాని ఎందుకో ఆ తల్లి నాకు ప్రత్యక్షం కాలేదు. దానికి కారణం నాకు తెలియట్లేదు, దయచేసి దానికి మీరు సమాధానం చెప్పగలిగితే అదే మీరిచ్చే వరంగా భావిస్తాను" అని అన్నారు. అందుకు భైరవుడు "ప్రతి మనిషి కూడా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటారు, వాటిలో కొన్నిసార్లు దుష్కర్మలు చేస్తుంటారు, మహా పర్వతాల పంక్తితో సమానంగా ప్రారబ్ధ కర్మలు పోగు చేసుకుంటారు.  అవి మహా పర్వత శ్రేణిలాగ వ్యాపించి ఉంటాయి. ఏ సాధన, వ్రతాలు, నోములు చేసినా ప్రారబ్ధ కర్మ పూర్తిగా దగ్ధం కానంత వరకు మీకు ఫలితం దక్కదు. అందుకు దేవుడిని నిందించి లాభం లేదు, మా నవులు మరల కొత్త దుష్కర్మలు మాత్రం చెయ్యకూడదు. ఇంకొక పక్క మంచిపనుల వల్ల, దానాల వల్ల ప్రారబ్ధ కర్మలు తగ్గించుకుంటూ ఉండాలి.

ఇదిగో అటుగా చూడు నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను" అని భైరవుడు చెప్పగా అటు చూడగా మాధవాచార్యులకి ఎదురుగుండా  భగభగా మండుతున్నటువంటి పర్వతశ్రేణుల వలె ఉన్న ఆయన ప్రారబ్ధ కర్మ కనపడటం, అది మొత్తం భస్మం అయిపోవటం కనిపించింది. అపుడు భైరవుడు, "స్వామీ చూసారా ఎంతటి వారికైనా ప్రారబ్ధ కర్మ తప్పదు. ఇపుడు మీ ప్రారబ్ధ కర్మ పూర్తిగా ధ్వంసం అయిపొయింది. మీరిక నిశ్చింతగా మీ సాధన ప్రారంబించండి, ఆ గాయత్రి మాత మిమ్మల్ని తప్పకుండ అనుగ్రహిస్తుంది, వెళ్లి రండి" అని చెప్పారు.



మాధవాచార్యులు మరల మంత్రాలయం వెళ్లి తన దీక్షను పున: ప్రారంబించగా గాయత్రి మాత ప్రసన్నురాలై, ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయనను సంపూర్ణంగా ఆశీర్వదించింది. దీనివల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఆ దత్తకృపకి మనం పాత్రులు అవ్వాలంటే శ్రద్ధ సహనంతో, నిదిధ్యాసతో అనగా ప్రతి వస్తువులో భగవంతుడిని దర్శించాలి. ఆ బ్రహ్మతత్వం సర్వజగత్తులో వ్యాపించి ఉంది అని భావించి నిరంతర సాధన ద్వారా మన ప్రారబ్ధ కర్మను దహించుకుంటూ కొత్త దుష్కర్మలను చెయ్యకుండా ప్రతి క్షణం ఆ దత్త తత్వానికి అనుసంధానంగా మన చిత్తాన్ని లగ్నం చెయ్యాలి. అంతే కాని మనం ఎన్ని మంచి పనులు చేసిన కూడా స్వామివారి అనుగ్రహం కలగట్లేదు అనే సంశయాన్ని, నిరాశని దగ్గరకి రానివ్వకూడదు.

Spiritual Soup-10

Part 10 - గాణగాపూర్ యాత్ర

నేను యుగాండలోఉండగా గురుచరిత్ర పారాయణం చాలా శ్రద్ధగా క్రమం తప్పకుండా చేస్తుండే వాడిని . అప్పుడే నాకు శ్రీ నృసింహ సరస్వతి గారు తపస్సు చేసుకున్న గంధర్వపురం (ప్రస్తుతం గాణగాపూర్) వెళ్ళాలనే సంకల్పము కలిగింది. ఇది కురువపుర యాత్రకి ముందు జరిగింది. కాని అక్కడికి ఎలా వెళ్ళాలి అని వాళ్ల్లని, వీళ్ళని అడగటం సంభవించింది. ఆ రోజుల్లో నేను ధ్యానం ఎక్కువగా చేస్తుండేవాడిని. తెల్లవారు ఝామున 3 గంటలుకు లేచి స్నానం చేసి ఎక్కువగా అమ్మవారి ధ్యానం చేస్తుండేవాడిని. అప్పట్లో నాకు తెలియకుండానే అంతర్గతంగా ఒక మంచి ఆధ్యాత్మిక పరంగా "హీలర్" ని కావలి అనే కోరిక సహజంగా ఉండేది.

 గాణగాపూర్ యాత్ర గురించి నేను ఆలోచిస్తుండగా మా ఆధ్యాత్మిక గురువుగారు స్వామీజీ రమణి గారి ఆంతరంగిక శిష్యుడయిన శ్రీ కులకర్ణి గారు వారి కుమార్తె వివాహం నిమిత్తమై గుల్బర్గా వెళ్తునట్లుగా తెలిసింది. వారు నన్ను కూడా వారితో రమ్మని ఆహ్వానించడం జరిగింది. నా రెండవ కుమారుడైన చిరంజీవి కమల్ కాంత్ ని తోడుగా తీసుకోనివారి వాహనంలో మేము గుల్బర్గా బయలుదేరాము. కులకర్ణి గారు నాకు మంచి మిత్రుడు మరియు గొప్ప దత్త భక్తులు.
ఆ విధంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామీ వారు నా సంకల్పాన్ని చిగురింప చేసారు. గుల్బర్గాలో పెళ్లి వారితో పాటు ఒక రాత్రి మంచి హోటల్ గదిలోనే గడిపాము. 

మరునాడు పొద్దున్నే కులకర్ణి గారు నన్ను, మా అబ్బాయిని బస్టాండు దగ్గర దింపి వెళ్ళిపోయారు. అక్కడినుండి పాసింజర్ బస్సులో కొంత దూరం ప్రయాణించి ఒక కూడలి దగ్గిర దిగి మరల ఒక ఆటో మాట్లాడుకుని గాణగాపురం చేరుకున్నాము. అప్పట్లో బస్సు సౌకర్యము కాని, సత్రాల సౌకర్యము కాని పెద్దగా ఉండేది కాదు. అక్కడకి చేరాక వసతి కోసం వెతగ్గా ఎటువంటి సౌకర్యాలు లేని ఒక గృహస్థు ఇంట్లో వసతి దొరికింది. అక్కడినుంచి ఆలయానికి వెళ్లి చింతామణి గణపతి స్వామి వారిని దర్శించుకుని, అక్కడే కూర్చుని గురుచరిత్ర పారాయణం చేస్తుండగా ఒక అర్చకుడు (భట్టుగారు అనుకుంట) శ్రీ స్వామి వారు మద్యాహ్నం పూట మారువేషంలో వచ్చి  ప్రసాదాన్ని స్వీకరిస్తారని చెప్పి దానికి కొంత డబ్బు తీసుకుని వారి ఇంట్లోనే పెరుగన్నం  ప్రసాదంగా వండి తీసుకొచ్చారు. సరిగ్గా ఒంటిగంట ప్రాంతంలో అనుకుంటాను ఆయన వచ్చి మమ్మల్ని ఒక పెద్ద అరుగు మీద నిలబెట్టారు. చేతిలో ప్రసాదాన్ని ఉంచారు, ఆ సమయాని కి చాలామంది జనం ప్రసాదం కోసం గుంపులుగా వచ్చారు. నాలాగ చాలామంది ప్రసాదాన్ని పట్టుకుని అక్కడ జనానికి పంచడం మొదలుపెట్టారు. ఈ వందలమంది జనసమూహంలో దత్తత్రేయులవారు ఏ రూపంలో వస్తారో అనేది అంతుపట్టని విషయం. ప్రతి వారిని కూడా దత్తస్వామిగానే భావించి ఎంతో భక్తి భావంతో అక్కడ భక్తులు ప్రసాదం పంచుతూ ఉంటారు. ఆ ప్రసాదాన్ని జనమంతా వెళ్ళిపోయాక నేను కొంచెం సేవించాను. నాకు ఏమాత్రం పుల్లగా ఉన్న పెరుగు అస్సలు సహించదు. కాని దత్తుడు వారి భక్తుల చేత వారికి ఇష్టం లేని పనులన్ని చేయిస్తుంటారు. ఆ పెరుగు చెప్పలేనంత పుల్లగా ఉన్నది.

 మాములుగా అయితే ఆ ప్రసాదాన్ని తిరస్కరించేవాడిని కాని ఇక్కడ ఆ పని చెయ్యలేము కదా, అది ఎలాగో అలాగా మింగేసాను. నాకు ఈ రకంగా దత్తుడు చాల రకాలుగా పరీక్షలు పెట్టాడు కొన్ని తెలిసి, కొన్ని తెలియకుండా. వాటి యొక్క రహస్యం చాలా ఏళ్ళకి కాని నాకు తెలియలేదు. జిహ్వ చాపల్యం ఉండకూడదని అన్ని రకాల రుచులను, అన్ని రకాల అనుభవాలను ఆస్వాదించాలని అవన్నీ కూడా ముందు ముందు చాలా చక్కటి మధుర ఫలాలని అందిస్తాయని, ఆ దత్తుడి యొక్క తత్వాన్ని అనుభవ పూర్వకంగా తెలియ చెప్పారు.
ప్రతీవారి జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొంతమంది విమర్శనాత్మకముగా పరిశీలించి దత్తుడి యొక్క తత్వాన్ని తెలుసుకుని కష్టము, సుఖము అనేవి లేవని, అవి కేవలం మనం ఊహించుకునే అవాస్తవాలని తెలుసుకుని కష్టాలు అనుకున్నవి వచ్చినపుడు క్రుంగిపోవటము కాని మనసుకి ఆనందం కలిగినపుడు సంతోషపడటం కాని చెయ్యకుండా  దేని ప్రభావానికి లోనుకాకుండా కేవలం ప్రేక్షకపాత్రనే వహిస్తుంటారు. దత్త మహా ప్రభువు యొక్క బోధనా పద్ధతులన్నీ చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి.

 అనుభవాల ద్వారానే మనకి లౌకిక, అలౌకిక విషయాల గురించి స్వానుభవంగా నేర్పుతుంటారు. మనలో ఉన్న అహంకారం అనే కల్మషాన్ని కొన్నిసార్లు కఠిన పరీక్షల ద్వారా కడిగివేస్తుంటారు.ఎంతో మంది గురుచరిత్ర, సాయి చరిత్ర, దత్త చరిత్రల పారాయణాలు చేస్తుంటారు. కాని వారిలో ఈషణ మాత్రం కూడా మానసికంగా కాని, ఆధ్యాత్మికంగా కాని ఏమాత్రం మార్పు ఉండదు. ఎందుకంటె వారు కేవలం యాంత్రికంగానే చదువుతూ ఉంటారే తప్ప చదివిన ఒక అధ్యాయాన్ని గురించి ధ్యాన స్థితిలోకి వెళ్లి మనస్సు నిశ్చలంగా చేసుకుని స్వామి వారు ఏమి చెప్పదల్చుకున్నారు అనే  దాని గురించి మాత్రం విమర్శన చేసుకోరు. అందువల్ల వారిలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. మనం ఒక పరీక్షలో ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలంటే దాని వెనుక ఎంతో కఠోర పరిశ్రమ, శ్రద్ధ ఏకాగ్రతతో పాటు, ఒకటే ధ్యాసలో చదివే విషయాలని పూర్తిగా ఆకళింపు చేసుకోక తప్పదు. అదే విధంగా దత్త అనుగ్రహ పరీక్షలో మనం ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా ధృడ భక్తితో, విశ్వాసంతో, ఏకాగ్రతతో, నిధి ధ్యాసతో ఆ దత్త మహా ప్రభువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలిగి, ఆయన అనుగ్రహానికి పాత్రులం కావాలి. అంతే కాని మనం పారాయణాలు ఎన్నిసార్లు చేసిన కూడా మనకి ఆశించిన ఫలితం దక్కదు. ఆయన చెప్పిన తత్వాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు మనం ఎక్కువ మార్కులు సంపాదించుకుంటాము. అందుకే శ్రద్ధ, సహనం, ఈ రెండు సూత్రాలను శ్రీ సాయి బాబా చెప్పడం జరిగింది.

దత్త పరీక్ష

"నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ప్రభో
సర్వబాధాప్రసమనమ్ కురుశాన్తిం ప్రయచ్చమే"



అనే ఈ శ్లోకాన్ని శ్రద్ధగా పఠిస్తూ చేతిలో జపమాలతో గుడి పక్కనే ఉన్న పెద్ద వటవృక్షం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసాను. ఎలాగైనా సరే గురుచరిత్ర పారాయణం నేను ఉన్న 2,3 రోజుల్లో పూర్తి చెయ్యాలని ధృడ సంకల్పంతో ఉన్నాను. పట్టువస్త్రం లుంగీగా కట్టుకుని, పట్టు ఉత్తరీయం కప్పుకుని మెడలో రుదాక్షమాల మరియు పద్మ/సరస్వతి మాల ధరించి చాల నిష్టగా ఆలయంలోనే పారాయణం సాగించాను. మరల సాయంత్రం నేను ఉన్న వసతి గృహంలోనే పారాయణం ప్రారంభించాను. అదే ఆవరణలో కూడా ఒక ఔదుంబర వృక్షం ఉంది. ఇంతలో ఆకస్మాత్హుగా విద్యుత్హు పోయింది. దానికి తోడు ఆస్థాన గాయకుల రూపంలో దోమల దాడి విజ్రుంబించింది. పైగా ఉక్కపోత, ఆ రాత్రి అంతా కూడా ఒక్క క్షణం నిద్రపట్టలేదు. 

తెల్లవారి లేచేసరికి విపరీతమైన వొళ్ళు నొప్పులు, దానికి తోడు జ్వరం వచ్చి చాల నిస్సత్తువగా ఉండిపోయాను. పారాయణం అనుకున్నట్లుగా సాగలేదు కాని ఒక మొండి పట్టుదల వచ్చింది. దత్త మహా ప్రభు, నువ్వు పెట్టే పరీక్షలకి నేను తట్టుకునే ధైర్యం కూడా నువ్వే ప్రసాదించాలి అనుకుని కాలకృత్యాలు తీర్చుకుని  గుర్రపు బండి మీద నేను, మా అబ్బాయి సంగమం దగ్గరకి వెళ్ళాము. ఇదే భీమ అమరజా రెండు కలిసే చోటు. అక్కడ చాలమంది, ముఖ్యంగా మహారాష్ట్ర, కన్నడిగులు చిన్న దీపం వెలిగించి ఔదుంబర వృక్షం కింద ఎంతో శ్రద్దగా గురుచరిత్ర పారాయణం చేస్తూ కనిపించారు. వాళ్ళ శ్రద్ధ భక్తులకి నేను నిజంగా ఆశ్చర్య పోయాను. వారి అకుంఠిత దీక్షముందు నేను పడ్డ బాధ చాలా అల్పంగా అనిపించింది. అక్కడే కాసేపు కూర్చుని నా పారాయణ మరల ప్రారంభించాను. 

కొద్దిసేపు గడిచాక మరల ఆలయంలో ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని పారాయణ కొనసాగించాను. అంతా క్రితం రోజు రాత్రి మొట్టమొదటిసారిగా పల్లకిసేవ, ఆ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు, పాట పాడటం, కొంత మంది మనుషులు అక్కడే కింద పడుకుని ఉండడం ఇది అంతా గమనించాను. నాకు  కూడా మనసులో ఈ పల్లకి సేవలో ఒక చిన్న పాత్ర దొరికితే బాగుండేది కదా అని అనిపించింది. అదే రోజు మధ్యాహ్నం గుడి ప్రాంగణంలో చాల మంది ఏదో దయ్యం పట్టినట్లు నేల మీద దొర్లుతూ హృదయవిదారకంగా అరుస్తూ కనిపించారు. తర్వాత నాకు తెలిసింది ఏమనగా ఈ క్షేత్రంలోని శ్రీ నృసిమ్హసరస్వతి స్వామీ వారు ఈ పిశాచ బాధలని నివారిస్తూ ఉంటారని, ఉన్నత  స్థాయిలో ఉన్నదత్త సాధకులకు సాక్షాత్తు దత్త మహాప్రభు తన నోరు పెద్దగా చేసి భూత ప్రేత పిశాచాలను మింగివేస్తూ ఉంటారు అని. ఆ విధంగా వారు పిశాచత్వాన్ని  పోగొడుతూ ఉంటారని తెలుస్తూ ఉంది. ఈలోగా పల్లకి ఉత్సవం ప్రారంభం కాబోతోంది. నేను ఆలయం అరుగు మీద కూర్చుని  తదేకంగా అటే చూస్తున్నాను. పల్లకి సిద్ధంగా ఉంది, దాని ముందు ఇద్దరు వ్యక్తులు రెండు ప్రభలను పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో వారిలో ఒకతను నా దిశగా చూసి రమ్మని  సైగ చేసారు. నేను వెంటనే నా వెనక్కి తిరిగి ఎవరిని పిలుస్తున్నారా అని చూస్తున్నాను.

అపుడు మా అబ్బాయి మిమ్మల్నే పిలుస్తున్నారు అని చెప్పాడు. అప్పటికి నేను అతి కష్టం మీద శ్రద్దగా పారాయణం పూర్తి చేయటం జరిగింది. నేను వెంటనే ఆ వ్యక్తి దగ్గిరకి వెళ్ళగా అతను నా చేతికి ఆ ప్రభను నాకు ఇచ్చాడు, నేను సంబ్రమాశ్చర్యాలతో ఆ పల్లకి ముందు నడుస్తుండగా పల్లకి మా వెంట రాసాగింది. నేల మీద చాలామంది భక్తులు సాష్టాంగ దండ ప్రణామాలతో పడుకుని ఉన్నారు. వాళ్ళందరిని దాటుకుంటూ 2 ప్రదక్షిణాలు చేయడం, ఆ తరువాత నాకు పల్లకిలో ఉన్న స్వామివారిని స్పర్శించాలని అనిపించింది. వెంటనే నా పక్కన అతను నన్ను అదే మాదిరిగా చెయ్యమని సలహా ఇచ్చాడు. నేను, మా అబ్బాయి స్వామి వారి పాదాలకు  నమస్కారం చేసుకున్నాము. నాకిది ఒక అద్భుతమైన లీల, చాలా మాములుగానే జరిగినట్లుగా అనిపించింది. 

నేను నా శారీరక బాధలని అధిగమించి, ఎంతో ఆర్తితో గురుచరిత్ర పారాయణం పూర్తిచేయటం, దాని అనుగ్రహ ఫలంగా స్వామి వారి పల్లకి సేవలో పాలుపంచుకోవటం ఒక మరువలేని అనుభూతి. ఇలాగే చాలాసార్లు దత్త మహా ప్రభు ఇలాంటి పరీక్షలు మనకి పెడుతూ ఉంటారు.అవన్నీ కూడా చివరకి వారి అనుగ్రహఫల సంప్రాప్తికే అని తరువాత తెలుస్తుంది. ఒక్కొక్కసారి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో కాలం పూజించినా కూడా ఫలితము కనిపించదు, అటువంటప్పుడు మనకి తెలియని ఒక సంసాయత్మక స్థితిలో ఉండిపోటాము. దానికి కారణాలు మనకి తెలిసిరావు, దానికి తార్కాణము మనము ముందు చెప్పుకుందాము.

Spiritual Soup-09


నాకు ఇంతకు మునుపు జరిగిన ఎన్నో అనుభవాలలో ముఖ్యమైన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. విపత్కరమైన పరిస్థితులు కాని ప్రమాదాలు కాని జరగబోతునపుడు ఎంతో ఆర్ద్రతతో గాడ మైన భక్తితో మనం దేవుడిని, దత్తశక్తిని ప్రార్ధించినపుడు మనలో ఉన్న ఒక విధమయిన ప్రజ్ఞ (intuition) జాగ్రుతమవుతుంది. దీనినే "in  it  consciousness " అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే దీనినే మనం సర్వాంతర్యామిత్వం అని కూడా చెప్పుకోవచ్చు. 

మనం ప్రార్థించిన భగవంతుడు విశ్వం అంతటా మరియు అపారమయిన ఆ దైవశక్తి నిజమైన భక్తుల యొక్క చైతన్యంలో కలిసిపోతుంది, అంటే మానవ శక్తికి దైవశక్తి తోడవుతుంది. నేను గురుచరిత్ర చదువుతున్నపుడు దత్తుడి మొట్టమొదటి అవతారమయిన శ్రీ పాద శ్రీ వల్లభుల గురించి చాలా తక్కువగా సమాచారం ఉందని అనుకుంటూ ఉండేవాడిని. ఆ స్వామి యొక్క ప్రధమ అవతారం మన ఆంధ్రదేశంలో పిఠాపురంలో అవతరించింది అన్నపుడు ఒక విధమయిన సంతోషం మరియు బాధ కలుగుతూ ఉండేది. ఎందుకింత తక్కువ సమాచారం మనకి లభ్యం అవుతోంది మరియు ఆయనని గురించి ఆంధ్రదేశంలో ఎందుకు అంతగా గుర్తింపు కాని ప్రాముఖ్యం కాని లేదు అని ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని. నేను ఎంతో ఆర్తిగా ఒక విషయం గురించి ఆలోచించినపుడు దానికి తగిన సమాధానం దొరుకుతూ ఉండేది. ఇదే అనుభవం చాలా మందికి కూడా జరుగుతూ ఉంటుందని గ్రహించాను. ఒకసారి సెలవులకు నేను నా స్వస్థలమైన హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఒక రోజు కాకతాళీయంగా ఇద్దరు మిత్రులతో చర్చిస్తున్నపుడు ముగ్గురం కలిసి ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని సంకల్పించుకున్నాము. ఎక్కడకి వెళ్ళాలని చర్చించుకుంటుండగా నేను వెంటనే కురుపురం వెళ్దాము అన్నాను. కాని అది ఎక్కడ ఉందొ మాకు తెలియదు. వివరాలన్నీ కనుక్కుని ఒక రోజు మేము ప్రయాణం మొదలుపెట్టాము.

 అది 1999వ సంవత్సరం అనుకుంటాను. మక్తల్ అనే ఊరు చేరుకున్నాక అక్కడ టీ సేవించి దారి కనుక్కుని పంచదేవపహాడ్ దగ్గర ఉన్న రుక్మిణి సమేత పాండురంగ ఆలయం చేరుకున్నాము. అప్పట్లో ఆ గ్రామంలో ఈ పంచదేవపహాడ్ మాత్రమే చాలా పేరున్నది. మేము చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. ఈ ఆలయం క్రీ.శ.1238వ సంవత్సరంలో కట్టబడింది.ఆ గుడి పరిసర ప్రాంతాలు అంతా కూడా చాలా భీభత్సంగా ఉన్నాయి. గుడి తలుపులు మూసి ఉన్నాయి. అంత గడ్డి మొలచి, మేకల పెంటికలతో చాలా దయనీయ స్థితిలో ఉంది. పిల్లలందరూ పేక ఆడుతూ సంస్కారహీనంగా కనిపించారు. 

ఆ గుడి  యొక్క పరిస్థ్తితి  మా అందరికి కొంచెం బాధ కలిగించింది. పక్కనే ఏదో ఒక పెద్ద భవనం నిర్మాణ దశలో ఉన్నది. వితల్ బాబా అను దత్త భక్తులు దానిని నిర్మాణ కర్త అని తెలిసింది. గుడి వెనుక భాగంలో చిన్న కాలి బాట ఉంది. అలా కొంచెం నడవగానే మమ్మల్ని చూసి ఒక తట్టె నడిపేవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, కృష్ణా  నది దాటిస్తానన్నాడు. తొట్టెలో కొంతదూరం ప్రయాణం చేసాక మధ్య భాగంలో నీరు లోతుగా లేనందు వాళ్ళ నడుచుకుంటూ అటు వైపున ఉన్న కురుపురం చేరుకున్నాము.  

ఇక్కడ శ్రీ పాద శ్రీ వల్లభులు తపస్సు చేసుకునేవారు, పంచదేవపహాడ్ లో ప్రతినిత్యం దర్బారు నిర్వహించి చీకటి పడగానే కురుపురం చేరుకునేవారు. పరమ భక్తుడు, నిష్టాగరిష్టుడు, తపస్సంపంన్నుడు అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి (టెంబే స్వామి)వారి ధ్యానశక్తితో శ్రీ పాద శ్రీ వల్లభులు తపస్సు చేసుకునే స్థలాన్ని కనిపెట్టే నిమిత్తం పంచదేవ పహాడ్ చేరుకున్నారు. అక్కడ పాండురంగ దేవాలయంలో విశ్రమించి వారి తపశ్శక్తితో ద్యానంలో శ్రీ పాద శ్రీ వల్లభులు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని విచ్చేసారుట. ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాంతం అంత కూడా అప్పట్లో దట్టమయిన వృక్షాలతో, లతలతో, ముళ్ళ చెట్లతో పూర్తిగా కప్పబడి ఉండేదిట. 

వారు వారి శిష్య బృందంతో, గ్రామస్తుల సహాయంతో ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి భక్తుల విరాళాలతో ఆలయం కట్టించి, కర్ణాటక దేశం నుంచి శ్రీ పాద శ్రీ వల్లభులు సూచనల ప్రకారం భట్టు సంప్రదాయానికి చెందినా ఒక పూజారి కుటుంబాన్ని రప్పించి, వారి బ్రతుకు తెరువుకు కొన్ని వ్యవసాయభూములను అప్పగించి స్వామివారికి నిత్యపూజకి కావాల్సిన ఏర్పాట్లు చేయించారు. అక్కడే శ్రీ టెంబే స్వామి కొంత కాలం ధ్యానంలో ఉండి అక్కడ ఉన్న గుహలో శివాలయం ప్రతిష్టించారు. మేము కృష్ణా నదిలో కాళ్ళు చేతులు కడుక్కుని ఎంతో భక్తి శ్రద్దలతో ఆలయం ప్రవేసించాము. ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోయాము. గుడి బయట ఇంకా పూర్తిగా నిర్మాణం కాని, గాలి వెలుతురూ లేని ఒక గదిని మాకు కేటాయించారు. వాతావరణం చాల ఆహ్లాదంగా ఉంది. 

అక్కడ పూజ నిర్వహించే భట్టు సోదరులు ఇద్దరు ఎంతో భక్తి శ్రద్దలతో స్వామి వారికి పూజ నిర్వహిస్తున్నారు. ఆ రోజు జరిగిన పవళింపు సేవ, దాని ముందు జరిగిన పల్లకి సేవలో  మేము ముగ్గురం పాల్గొన్నాము. అక్కడ మేము తప్ప అన్య భక్తులు ఎవరు లేరు. భోజన సదుపాయం కూడా సరిగా లేదు. గుడికి ముందు చిన్న వైశ్య దంపతులు నిర్వహిస్తున్న చిన్న దుకాణంలోనే మాకు తినటానికి ఉప్మా లభించింది.

ఆ రోజు రాత్రి నేను గుడి ఆవరణలో కూర్చుని శ్రద్ధగా  పారాయణం మొదలుపెట్టాను. పారాయణం అయిపోతుండగా నేను కూర్చున్న కుడివైపు ఏదో ఒక కదలిక అనిపించింది. చూద్దును కదా ఒక తేలు గబాగబా నా పక్క నుంచి వెళ్ళిపోయింది. మొట్ట మొదటి ఆలోచన దాన్ని చంపాలని, మరుక్షణం పవిత్రమైన ప్రదేశంలో అందులో గురుచరిత్ర పారాయణం చేసేటపుడు హింస పనికిరాదని అనిపించింది. ఇక దాని జోలికి వెళ్ళకుండా నా పారాయణం కొనసాగించాను. 

ఎప్పుడో కంపాలాలో శ్రీ పాడుల గురించి ఆలోచించటం, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించటం, ఆ తదుపరి కురుపురం ప్రయాణం, స్వామి వారి దర్శనం అంత ఒక అద్భుతంలాగా జరిగింది. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించాము. మరునాడు తెల్లవారగానే కృష్ణా నదిలో స్నానం చేసి పట్టు పంచతో ఆలయ ప్రవేశం చేసి స్వామి వారికి అర్చన, అభిషేకాదులు పూర్తి చేస్కున్నాము. నేను గుడికి కుడిపక్కన ఉన్న మహావృక్షం(మర్రి చెట్టు అనుకుంట) దాని కిందనే ఉన్న దత్తాత్రేయ మందిరం దర్శించాను. అక్కడే స్వామి వారు తపస్సు చేసుకునేవారుట. అక్కడ ఒక కొబ్బరి కాయ కొట్టి కాసేపు అక్కడే ధ్యానం చేసుకున్నాను. టెంబే స్వామి గుహ ముందు ఉన్న ఒక రాతి చప్టా మీద కూర్చున్నాను. అక్కడే స్వామి సమర్ధగారి విగ్రహం ప్రతిష్టించబడింది.

అక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తుండగా నాకు ఎదురుగా కొంత దూరంలో ఒక పిల్లి వెళ్తూ నాకు కనిపించింది. నాకు ఎందుకో దాన్ని పిలిచి ఎక్కడ  అయిన పాలు దొరికితే సమర్పించాలని అనిపించింది. ఎంతో ప్రేమగా ఆ పిల్లిని ఆహ్వానించాను. నువ్వంటే నాకెంతో ఇష్టం నా దగ్గిరకి రా అని పిలిచాను. అలా పదే పదే అంటుండగా ఆ పిల్లి ఒక్క క్షణం ఆగి తేరిపార చూసి మెల్లగా నా దగ్గిరకి వచ్చి చటుక్కున చప్టా మీదకి దూకింది.మెల్లి మెల్లిగా నా దగ్గరకి వచ్చి నా వొళ్లోకి గెంతి ఒక రెండు నిమిషాలు విశ్రమించింది. తరువాత నా పక్కన కూర్చో అని నేను ప్రేమగా ఆదేశించగా అలాగే అది నా వోల్లోంచి లేచి నా పక్కన కూర్చుంది. దారిలో వెళ్తున్న ఒక పాలు అమ్మే అతన్ని పిలిచి అతని దగ్గర పాలు కొని ఒక చిన్న మట్టి పాత్రలో పోసి ఆహారంగా ఆ పిల్లికి సమర్పించాను. 

అది తృప్తిగా తాగిన తరువాత నేను వీడ్కోలు చెప్పగానే వెళ్ళిపోయింది. నా పారాయణం మిగింపు దశలో ఉండగా ఈ సంఘటన జరిగినందు వలన శ్రీ పాద శ్రీ వల్లభులు  వారే స్వయంగా వచ్చి నా ఆతిధ్యం స్వీకరించినట్లుగా భావించాను. ఆహా శ్రీ పాద శ్రీ వల్లభులు  వారు తపస్సు చేసుకునే ప్రదేశంలో జంతువులు కూడా ప్రేమపూర్వకమయిన, భక్తి పూర్వకమయిన స్పందనలు కలిగివు న్నాయి, అంతా ఈ స్థల మహిమే కదా అని అనిపించింది. మద్యాహ్నం వరకు అక్కడే ఉండి మళ్లి మేము పంచదేవపహాడ్ అక్కడి నుంచి వెనక్కి బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నాము. ఇలా నా సంకల్పానికి శ్రీ పాద శ్రీ వల్లభులు  వారు అనుకూలంగా స్పందించి నాకు మార్గాదర్శకులయ్యి నన్ను ఆయన అనుగ్రహానికి పాత్రులు చేసారు. ఇది నా మొట్ట మొదటి కురుపురం యాత్ర.   


Spiritual Soup-08


ఒకసారి ఈస్టర్ సెలవలకు నేను  నా స్నేహితుడు రాంబాబు కారులో నైరోబియా నుండి యుగాండ వెళ్లడం జరిగింది. రాంబాబుకి యుగాండలోని  కొంపాల పట్టణంలో మందుల వ్యాపారం ఉంది. ఆయనకి తోడుగా ఆయన ఆహ్వానం మేరకు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను ప్రతినిత్యం క్రమం తప్పకుండ గురుచరిత్ర మరియు  సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తుండే వాడిని. ఈస్ట్ ఆఫ్రికాలో ప్రకృతి చాలా అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఎక్కడ చూసినా రకరకాల వృక్షాలు, పచ్చని మైదానాలు, ఆప్యాయంగా పలకరించే మనుషులు, పక్షులు, జంతువులు ప్రయాణంలోనే ఎదురవుతుంటాయి. ముఖ్యంగా జీబ్రా గుర్రాలు ‘నైవషా’ అనే ఊరు దగ్గర చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మేము నెమ్మదిగా ‘నైవషా’ తరువాత ‘నకూరు’ అనే ఊరిలో జలారాం బాబా మందిరానికి చేరుకున్నాము. జలారాం బాబా గుజరాతి దేశంలో జన్మించినటువంటి మహాత్ముడు. 

ఆయన ముఖ్యంగా అన్నదాన ప్రియుడు. ఆయనకి ప్రపంచం అంతటా లక్షలాది భక్తులు ఉన్నారు. వీరందరూ వారింటికి వచ్చిన అతిధులకు ఏ ప్రతి ఫలం ఆశించకుండా చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నకూరులో బాబా వారికి పెద్ద ఆలయం కట్టించారు. దానిలో మిగిలిన దేవతా మూర్తులు కూడా ప్రతిష్టించబడ్డారు. 24 గంటలు వేళను బట్టి ఆహరం సమృద్ధిగా దొరుకుతుంది, అలాగే విశ్రాంతి గదులు కూడా దూరప్రయాణం చేసేవారికి సౌకర్యంగా లభిస్తుంటాయి. ఈస్ట్ ఆఫ్రికాలో గుజరాతి సంతతి వారు 1900-01 ఆ ప్రాంతంలో వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీరికి వ్యాపార దక్షత, దైవ భక్తి చాల మెండుగా ఉంటాయి. వారి సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఆ ఆలయంలో కాసేపు ధ్యానం చేసాక అల్పాహారం సేవించి ప్రయాణం సాగించాము.

 ఇక్కడి వాతావరణము చాల చల్లగా ఉంటుంది. కెరిచో పట్టణంలోకి ప్రవేసిస్తుండగా ఇరుపక్కల కొన్ని వందల ఎకరాలలో ఉన్న తేయాకు తోటలు ఎంతో సంతోషంగా మాకు స్వాగతం పలికాయి. ఆ తరువాత కిసుము అనే ఊరిలోకి ప్రవేసించాము. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో గుజరాతి వ్యాపారస్తులు స్థిరపడ్డారు. కిసుము పొలిమేరలు దాటగానే ఒక అద్భుతమైన అనుభవం మాకు ఎదురయ్యింది. ఇక్కడ  మేము భూమధ్య రేఖను దాటాము. మెల్లగా బుసియా అనే ఊర్లోకి ప్రవేసిన్చాము. 

ఇక్కడే కెన్యా మరియు యుగాండ దేశపు సరిహద్దు ప్రాంతము ఉంది. గమ్మత్తైన విషయం ఏంటంటే ఇటు కెన్యా దేశం, అటు యుగాండ మధ్యలో ఎవరికీ చెందని ప్రాంతము అది (no  mans  land ). ఇక్కడే విసా ప్రక్రియలు ముగించాక మేము యుగాండ దేశం లోకి ప్రవేసించాము. బుసియా దాటాక ఇగాంగ, తరువాత బోగిరి అనే ఊరిలో టీ తాగి సాయంత్రం కల్లా జింజా మీదుగా కంపాల ప్రవేసించాము. ఈ జింజా పట్టణంలోనే మధ్వాని కుటుంబం ఎన్నో ఏళ్ళ కింద వలసగా వచ్చి పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించారు. కంపాలాలో రాంబాబు కిబులి అనే ప్రాంతంలో విశాలమయిన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మేము వెళ్ళగానే పనివాడు గేటు తీసి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు. ఆ విశాలమయిన ఇంట్లో నాకు విడిగా ఒక గదిని కేటాయించారు. ఆ రోజు హాయిగా విశ్రాంతి తెస్సుకున్నాను.
                         
 కంపాలాలో కూడా చాలామంది తెలుగు వాళ్ళు వ్యాపారం మరియు ఉద్యోగ నిమిత్తం స్థిరపడి ఉన్నారు. రెండు రోజులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళ ఆతిధ్యం తీస్కోడంతో సరిపోయింది. నా పారాయణం మాత్రం నిర్విఘ్నంగా సాగుతోంది. మూడవ రోజు కొన్ని తెలుగు సినిమా వీడియోలు తీస్కుని ఇంటికి వచ్చాము. ఆ రోజు రాత్రి విడిగా ఉన్న గెస్ట్ రూమ్ లో ఉన్న టెలివీడియోలో తీరికగా మేము తెచ్చిన తెలుగు సినిమాలు చూస్తూ ఉండిపోయాము. అలసట వలన రాంబాబు మధ్యలోనే వెళ్ళిపోయాడు. నాకు కూడా నిద్ర రావటంతో నిద్రకు ఉపక్రమించాను. మంచి నిద్రపడుతుండగా నాకు చెవిలో గుసగుసలుగా ఒక హెచ్చరిక వినపడింది. "ఇక్కడ పడుకోవద్దు, లేచి నీ గదిలోకి వెళ్ళు" అని పదే పదే తక్కువ స్థాయిలో ఎవరో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. 

ఒకసారి కళ్ళు తెరిచి లేచి కూర్చుని అంతా నా భ్రమే అని బద్దకంగా మళ్లీ నిద్రకు ఉపక్రమించాను. మరలా అదే హెచ్చరిక. ఇలా 3,4 సార్లు జరిగింది. నాకు నిద్రమత్తు వదిలిపోయింది. ఒక్కసారిగా ఏదో ఒక తెలియని స్థితిలో లేచి నా మెల్లగా నా గదిలోకి వెళ్ళిపోయాను. కాని జాగ్రుదావస్తలో కి వచాను. ఇల్లంతా తిరుగాను, కిటికిలోంచి బయట అంతా  చూసాను. మెదడు చాల చురుకుగా పని చెయ్యడం మొదలుపెట్టింది. ఆ రాత్రి ఏదో ఒక ప్రమాదం జరగబోతోంది అనిపించింది. కాని ఏమి చెయ్యగలను, కాసేపు దత్తుడిని, బాబాని గాధంగా తల్చుకున్నాను. నేను తెచ్చుకున్న రెండు బ్రీఫ్ కేసులు నేను పడుకున్న మంచానికి కాళ్ళ వైపు ఒకటి, తల భాగం వైపు ఒకటి పెట్టుకున్నాను. రాంబాబు గాడంగా నిద్రపోతున్నాడు. ఎం జరుగుతుందో అని ఆలోచిస్తూ తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.

 తెల్లవారగానే రాంబాబు ఇంటిలోని పనివాడు నా గదిలోకి వచ్చి "Mr సాయిరాం, ప్లీజ్ గెట్ అప్" అని కొంత ఆందోళనతో నన్ను నిద్రలేపాడు. అతని అరుపుకి నా నిద్రమత్తు వదిలిపోయింది. వాడు రాంబాబుని లేపడానికి వెళ్ళిపోయాడు. తల భారంగా అనిపించింది, ఒక గమ్మత్తైన వాసన గదిని ఆక్రమించింది. నేను మెల్లగా తూలుతూ మంచం కింద చూసే సరికి నా రెండు పెట్టెలు మాయం అయిపోయాయి. నేను అంతకు ముందు పడుకున్న గదిలోకి వెళ్లేసరికి ఒక విధమైన దిగ్భ్రాంతి చెందాను. 

అక్కడ టెలివీడియో కూడా మాయం అయ్యింది. ఆ తరువాత ఒక పెద్ద మ్యూజిక్ సిస్టం, చిన్న చిన్న వస్తువులు కూడా దొంగతనం చేయబడ్డాయి. ముందు తలుపు బార్ల తెరిచివుంది. అప్పటికి నాకు ఇంట్లో దొంగలు పడ్డారు అనే విషయం బోధపడింది. నేను బయటికి వెళ్లి ఇంటి చుట్టూ వెతకగా నా బ్రీఫ్ కేసులు, రాంబాబు బ్రీఫ్ కేసులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. నేను తెచ్చుకున్న డబ్బులు అన్ని కూడా పోయాయి. అదృష్టం ఏంటంటే నా పాస్ పోర్ట్ మాత్రం ఆ దొంగ నా మీద దయతో వొదిలిపెట్టి వెళ్ళాడు. నేను ఎంతో ఆర్ద్రతతో ఆ దత్తాత్రేయుడికి, బాబాకి  ఎన్నో రకాలుగా కృతఙ్ఞతలు చెప్పుకున్నాను.

 ముందే నన్ను హెచ్చరించి నా గదిలోకి  వెళ్ళేవరకు కూడా ఆ కరుణామయుడు ఊరుకోలేదు. అక్కడే పడుకుని ఉంటే ఆ దొంగల చేతిలో నేను మరణించి ఉండేవాడినేమో. నా ప్రారబ్ధ కర్మ పోగొట్టుకున్న డబ్బుతో కొంత కరిగిపోయింది. ఈ విధంగా ఒక అద్భుతమయిన లీలను ప్రదర్శించి భక్తులను ఆదుకుంటారు ఆ భగవంతుడు. ఈ విధంగా ఆయన నా హృదయంలో నిలచిపోయారు.



Spiritual Soup-07

Part – 7

రోజులు మరలా యాంత్రికంగానే గడుస్తున్నాయి. నేను నా వృత్తిపరంగా జరిగే కార్యక్రమాలలో మునిగిపోయాను. కాని ఒక వైపు గురుచరిత్ర, సాయి సచ్చరిత్ర, శ్రీ దత్తదర్శనం మొదలగు గ్రంధాల పారాయణం నిత్యకృత్యంగా చేస్తున్నాను. నాకు కలుగుతున్న నమ్మశక్యం కాని అనుభవాలు, దాని వల్ల నాలో కలుగుతున్న ఆధ్యాత్మిక పరిణామాల ప్రభావం గురించి ఒక అంతర్మధనం, ఆత్మ విశ్లేషణ, ఆత్మ విమర్శ మొదలయ్యింది. నేను ఉన్న ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. ఇంటి ముందు, వెనుక చుట్టుతా ఖాళీ ప్రదేశం ఉంది. ఇక్కడి వాతావరణంలో మొక్కలు చాలా సహజంగా ఎటువంటి కృత్రిమ రసాయనిక ఎరువులు లేకుండానే పెరుగుతూ ఉంటాయి. ఇక్కడి ఆఫ్రికాన్స్ చాలా చక్కగా మన దేశపు వంటలు చెయ్యడమే కాకుండా ఇంటి పని కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. నాకు చిన్నప్పటి నుండి కూడా ప్రకృతి  అంటే చాలా ఇష్టం. ప్రతి శని, ఆది వారాలలో బుద్ధదేవుని ఆలయానికి మరియు అక్కడ ఉన్న గుడిలో జరిగే సత్సంగాలకి తప్పకుండా వెడుతూ ఉండేవాడిని. 

అక్కడే ఒకసారి గుడిలో అశ్విన్ గణత్ర అనే గుజరాతి మిత్రుని కుటుంబంతో పరిచయం ఏర్పడింది. నేను ఆఫ్రికా రాకముందు నాకు పరిచయమున్న షిరిడి సాయి బాబాని ఆరాధించే స్వామీజీ వారి ఆదేశం ప్రకారం రేఖి మరియు ప్రాణిక్ హీలింగ్ చికిత్స విధానాలు అభ్యసించాను. కాని ప్రత్యేకంగా ఎవరికీ కూడా ఈ చికిత్స చేయ్య్డడం జరగలేదు. నాకు ఈ విద్యలో ప్రవేశం ఉందని కూడా ఎవ్వరికి ఇంతవరకు చెప్పలేదు. మాటల సందర్భంలో అశ్విన్ గారి పెద్దమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదని చాలా రకాల చికిత్సలు చేయించారని, కాని ఫలితం లేకపోయిందని చెప్పారు. అప్పుడు వారి అమ్మాయి శేజల్ ని చూస్తే నాకు చాలా బాధ కలిగింది. నేను ఆ అమ్మాయికి నా చికిత్స ద్వారా సహాయం చేస్తానని చెప్పగా వారు ఎంతో సంతోషించారు. వారితో చాలా ఆధ్యాత్మిక విషయాలు గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఒక శనివారం అశ్విన్ గారు నా ఇంటికి వచ్చి వారి కారులో నన్ను వారి ఇంటికి తీసుకు వెళ్లారు.

ఊరికి దూరంగా ఒక ప్రశాంత ప్రదేశంలో ఉంది వారి ఇల్లు. అది ఒక విశాలమైన భవంతి. మూడు అంతస్తులు ఉంటుంది, చుట్టూరా ఉద్యానవనం, ఆహ్లాదకర వాతావరణం. మేము వారి ముందు గదిలో సోఫాలో కూర్చుని ఏవో ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంతలో వారి ఇంటిలో నాకు ఒక అందమయిన తెల్లటి పిల్లి కనిపించింది. అది ఒక మంచి జాతి పిల్లి అని తెలుస్తూనే ఉంది. మేము మా ధోరణిలో ఉండగా, దూరంగా వెళుతున్న ఆ పిల్లి, దాని పేరు స్వీటీ కాబోలు మెల్లి మెల్లిగా నా దగ్గరకు రాసాగింది.నేను దానిని పెద్దగా పట్టించుకోలేదు. అంతలో ఆ పిల్లి ఒక్కసారిగా  యెగిరి నేను కూర్చున్న సోఫా మీద కూర్చుంది. అప్పుడు నేను మొదట కొంచెం గాభరా పడ్డ వెంటనే తమాయించుకున్నాను. అది మెల్లిగా నా ఒళ్లో కూర్చుని హాయిగా ఒళ్ళు విరుచుకుని పడుకుంది. అశ్విన్ గారి కుటుంబ సభ్యులంతా చాల ఆశ్చర్య పడ్డారు. ఇన్నాళ్ళలో ఎంతో మంది వచ్చి వెళుతున్న కూడా ఈ పిల్లి ఎవ్వరి దగ్గరికి వెళ్ళేది కాదుట. నాకు ఆ పిల్లి పడుకున్నందు వాళ్ళ చాల చక్కిలిగింతలుగా అనిపించింది. మనసులోనే వెళ్లి రా అని ఆ పిల్లికి ప్రేమపూర్వకంగా వెళ్ళమని సూచనలు ఇస్తూ పోయాను. కాసేపటికి ఆ పిల్లి నా ఒళ్లోంచి లేచి వెళ్ళిపోయింది. ఆ తరువాత మళ్లి మేము మా చర్చలలో మునిగిపోయాము. 

భోజనాలు చేసాక సాయంత్రము శేజల్ కి ఒక గంట పాటు చికిత్స చేసాక రాత్రి భోజనం చేసి మేడ మీద ఉన్న నా గదిలోకి ప్రవేశించాను. అశ్విన్ గారి ఇంట్లో ఇంకొక పిల్లి ఉందని, అది పూర్తిగా నల్లగా ఉంటుందని, కొంత కోపస్వభావం కలదని చెప్పారు. ఆ రోజు రాత్రి నేను ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండగా నా మంచం పక్కన ఏదో కొద్దిగా అలికిడి వినిపించింది. నేను అటు చూసేసరికి వారు చెప్పిన ఆ నల్ల పిల్లి, దాని పేరు నాటీ అంట అది కనిపించింది. అది మంచం దగ్గర అటు ఇటు తిరిగి నా మంచం మీదకు ఒక్క ఉదుటన ఎగిరి కూర్చుంది. దాని గురించి ముందే తెలిసిన నేను కొన్ని క్షణాలు భయపడ్డాను. నాకు లామగారు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. నేను ప్రేమ పూర్వకమయినటువంటి భావాలను ఆ పిల్లికి ప్రసారం చేసాను. నువ్వంటే నాకెంతో ఇష్టం , నేను నిన్ను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను మనిద్దరం మంచి మిత్రులం అని మానసికంగా చెప్తూ పోయాను. అది ఒక్కసారిగా ఎగిరి నా పొట్ట మీద పడుకుంది. మళ్లీ నాకు కితకితలు మొదలయ్యాయి. మరల నేను దానికి  ప్రేమ పూర్వకమయినటువంటి సూచనలు ఇవ్వడం, ఆ తరువాత ఆ పిల్లి బయటకి దూకి వెళ్ళిపోవటం జరిగింది. అప్పటి నుండి వారింటికి ఎప్పుడు వెళ్ళిన ప్రతి సారి కూడా స్వీటీ తప్పకుండ కాసేపు నా ఒళ్లో పడుకుని ఒక 4,5 నిమిషాలు తరువాత వెళ్ళిపోయేది. అందుకని నా ఒళ్లో ఒక తలగడ పెట్టుకునే వాడిని నాకు కితకితలు రాకుండా.

 లామ గారిని కలిసాక ఆయన చెప్పిన విషయాలు ముఖ్యంగా ప్రేమతత్వాన్ని గురించి, అది ఎదుట వారిలో తెచ్చే మార్పులు గురించి విన్నాక, ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ఇక్కడ ఆఫ్రికాలో కుక్కల కన్నా పిల్లులు ఎక్కువ కనపడతాయి. నాకు ఒక రకమయిన  ఆలోచన వచ్చింది. ప్రతి సారి నేను నా వంటిల్లు గది తెరిచినపుడు ఎదురుగుండా ఒక పెద్ద నల్ల పిల్లి కనిపిస్తూ ఉండేది. అది నన్ను చూడగానే క్షణంలో పారిపోయేది. నేను ఆ పిల్లికి మానసికంగా ప్రేమ పూర్వకమయినటువంటి భావాలను ప్రసారం చెయ్యడం మొదలుపెట్టాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ, మిత్రత్వం ఉన్నాయి. దయచేసి నా ఆతిధ్యం స్వీకరించు, నిర్భయంగా నా ఇంట్లోకి రా అని పొద్దున్న సాయంత్రం ఈ ప్రక్రియ చేస్తుండే వాడిని.

 ప్రతి రోజు వంటింటి తలుపు తెరవడం, ఆ పిల్లి, దానితో పాటు ఒక పిల్లి కోన నన్ను చూసి భయపడి పారిపోవడం జరుగుతూ ఉండేది. ఒక 4,5 రోజులు అయ్యాక అవి వెంటనే పారిపోకుండా కొన్ని క్షణాలు ఆగి నన్ను తేరిపార చూసి వెళ్లి పోయేవి.ఇలా ఒక 10 రోజులు గడిచాక పిల్లి కూన అక్కడే నిలబడి చూస్తుండేది. ఒక రోజు నేను వంటింటి తలుపు తెరిచేసరికి నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగించే విధంగా పిల్లి కూన నిర్భయంగా లోనికి వచ్చింది. నేను ఇచ్చిన పాలు తాగి మ్యావ్ మ్యావ్ అంటూ నా వెనుక తిరగసాగింది. మరుసటి రోజు తల్లి కూడా నిర్భయంగా, నిస్సంకోచంగా నా ఆతిధ్యం స్వీకరించడానికి లోనికి వచ్చింది. ఆ రోజు నుండి నాకు అవి మంచి మిత్రులుగా మారిపోయాయి. లామా గారు చెప్పినటువంటి ప్రేమ అనే శక్తి ద్వారా జంతువులనే మనం మార్చగలిగినపుడు మరి మనుషులను ఎందుకు మార్చలేకపోతున్నాం. మరి పిల్లి స్వతాహాగా సాదు జంతువే కాబట్టి దాన్ని చేరదీయడం అంత గొప్ప విషయం ఏమి కాదు కదా. నిజంగా భయంకరమైన అడవి జంతువుని మనం ప్రేమ శక్తితో జయించ వచ్చునా? దానిలోని క్రూరత్వాన్ని ప్రేమగా మార్చగలమా? అని ఆలోచన నాలో మొదలయ్యింది. మన మనస్సు ఒక సందేహాల పుట్ట. ఒక విషయం మన అనుభవంలోకి వచ్చినా మళ్లీ ఎన్నో సందేహాలు దానిలోంచి కలుగుతాయి. 

నేను ఒక రోజు రాత్రి అప్రయత్నంగా నిద్రలేచాను. బయట వెన్నెల పిండారపోసినట్టుగా ఉంది. ఏమి తోచక ముందు గదిలోకి వెళ్లి సోఫాలో కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాను. నా కళ్ళ ముందు ఏదో దివ్యమైన కాంతి ఉన్నట్లుగా అనుభూతి కలిగి కళ్ళు తెరిచేసరికి ఎదురుగుండా దివ్యమైన తేజస్సుతో కాంతి మయ శరీరంతో ఒక అందమయిన స్త్రీ మూర్తి కనిపించింది. ఆమె ప్రాణమయ శరీరంలోని విద్యుత్ కణాలు ఎంతో వేగంగా కదులుతున్నాయి. నేను ఆ కాంతిని తట్టుకోలేకుండా ఉన్నాను. ఆవిడ నా వైపు చిరునవ్వుతో చూస్తూ "నీ పరిస్థితి గమనించాను, కాబట్టి నేను నీకు మామూలుగానే కనిపిస్తాను అని తన ప్రకంపనాలను తగ్గించివేసింది. నీకు ఈ మధ్య జరిగిన అనుభవాలు, నువ్వు పిల్లులతో చేస్తున్న ప్రయోగాలు నీలో కలుగుతున్న సందేహాలు అన్ని నేను గమనించాను. ఈ సందేహాలకి సమాధానాలు చెప్పటానికే నేను వచ్చాను. ఈ విశ్వమంతా ఒక పరిశుద్ధమైన బ్రహ్మ పదార్థము, దానిలో బ్రహ్మ చైతన్యముతో నిండి ఉంది. ఈ సకల సృష్టిలో అనగా భూమి, కొండలు, చెట్లు, క్రిమికీటకాలు మానవులు మొత్తం సృష్టి అంతా కూడా వివిధ పరిణామాలతో మరియు చైతన్య స్థాయితో నిండి ఉంటాయి. ఈ సృష్టి అంతా కూడా పరస్పర సంబంధాలతో అనుసంధానం చేయబడింది. ఈ బ్రహ్మ పదార్థాన్ని మనము ప్రాణంగా చెప్పుకుంటాము. దీనిలో పురుష ప్రకృతిలో శక్తి పరంగా కలిసి ఉంటాయి. శక్తి జడంగా ఉన్నపుడు బయట జడంగా కనిపిస్తున్న దానిలోపల శక్తి వాటి కక్ష్యలలోనే ఉన్నపుడు దానిని అవ్యక్తస్థితి అంటారు.

 నీ సందేహాలకి సమాధానంగా నా కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంబించింది. నేను ఒక సాధారణ కుటుంబంలో ఒక చిన్న గ్రామంలో నా తల్లిదండ్రులతో పాటు నివసిస్తూ ఉండేదాన్ని. మా గ్రామం చుట్టు పక్కల అంతా కూడా చాల పెద్ద అడవి ఉండేది. అక్కడ చాలా సాదు జంతువులు, క్రూర జంతువులు విహరిస్తూ ఉండేవి. నేను మా అమ్మ నాన్నలకు ఒక్కర్తే కూతుర్ని కావడం వల్ల చాలా గారాబంగా పెంచారు. వ్యవసాయం  చేసుకుంటూ, ఆవులను పెంచుకుంటూ, పంట మీద వచ్చే ధాన్యం, ఆవు పాలమీద వచ్చే డబ్బుతో మేము చాలా సంతృప్తిగా జీవించే వాళ్ళం. నాకు యుక్త వయస్సు వచ్చేసరికి నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మా బంధువులలో ఒకడికి ఇచ్చి నా పెళ్లి జరిపించారు నా తల్లిదండ్రులు. మేము ఇద్దరం ఎంతో సంతోషంగా, ఆనందంగా అడవులలో తిరుగుతో కాలం గడపసాగము. మేము ఇద్దరం ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరం ఉండే వాళ్ళం కాదు.

 ఇలా కాలం గడుస్తుండగా ఒక పెద్ద అవాంతరం వచ్చింది. మా దేశాన్ని పరిపాలించే రాజుగారికి మా ప్రక్కనే ఉన్న రాజుతో వైరం మొదలయ్యింది. దానితో రాజుగారు మా దేశంలో ఉన్న యువకులందరినీ దేశ రక్షణ కోసం తమ సైన్యంలో చేరాలని ఆజ్ఞ జారీ చేసారు. నా భర్త నన్ను విడిచి తప్పనిసరి పరిస్థితులలో సైన్యంలో చేరడానికి వెళ్ళిపోయాడు.నేను ప్రతి రోజు అతనినే తలుచుకుంటూ ఎంతో ఆత్రుతగా యుద్ధం ఎప్పుడు అయిపోతుందా, నా భర్త తిరిగి ఎప్పుడు వస్తాడ అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇలా 1 సంవత్సరం గడిచాక నా భర్త యుద్ధం పరిసమాప్తం కావడంతో మా ఊరికి వచ్చేసాడు. నేనెంతో ఆత్రుతగా ఆనందంగా ఆయన దగ్గిరికి వెళ్ళాను.కాని అతనిలో చాలా మార్పు వచ్చిందని గ్రహించాను. ఒక విధమయిన ఉదాసీనత, నిరుత్సాహం, అనాశక్తి అతనిలో గమనించాను. నన్ను, నా ప్రేమను కూడా పట్టించుకోని స్థితిలో ఉండిపోయాడు. నేను ఎన్నో రకాలుగా అతనిని మార్చే ప్రయత్నం చేసాను, కాని ఫలితం కనపడలేదు. నా పరిస్థితిని గమనించిన ఒక పెద్దావిడ నాకొక సలహా ఇచ్చింది. ఇక్కడికి ఉత్తర దిక్కున ఒక 5 మైళ్ళ దూరంలో ఒక గుట్ట ఉంది. అక్కడ ఒక మహా యోగి ఉన్నారు, ఆయన దర్శనం చేసుకో ఆయన నీ జీవితంలో మళ్లి సుఖశాంతులు నింపుతారు. ఎంతో మంది వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు, వారి సమస్యలన్నీ తీరుతున్నాయి. నువ్వు కూడా వెళ్ళు అని చెప్పింది.

ఆమె సలహా ప్రకారంగా నేను ఒక బుట్టలో పాలు, పళ్ళు తీసుకుని తెల్లవారు ఝామునే లేచి నెత్తి మీద బుట్ట పెట్టుకుని ఆ కొండ ప్రాంతానికి బయలుదేరాను. మా తల్లిదండ్రులు నన్ను వెళ్ళద్దు అని ఎంతో వారించారు, ఎందుకంటే వెళ్ళే దారిలో ఎన్నో క్రూర మృగాలు, విష సర్పాలు ఉంటాయని ఒంటరిగా వెళ్లకూడదని నానా విధాలుగా చెప్పిచూసారు. నేను మాత్రం నా పట్టుదల వదలలేదు. ఆ కొండ మీద ఉన్న యోగిని దర్శనం చేసుకుని ఆయనకి నేను తెచ్చిన పాలు, పళ్ళు సమర్పించుకున్నాను. ఆ మహాత్ముడు నా వైపు చూసి "ఏవమ్మా నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఈ భీకరమైన అరణ్యంలో ఎలా వచ్చావు, నీకు భయం వెయ్యలేదా? సాధారణంగా నా దగ్గరికి జనం గుంపులుగా వస్తారు మరి నువ్వు ఒక్కదానివే వచ్చావే" అని ప్రశ్నించారు. “మహాత్మా మీరు అడిగేవరకు నాకు ఏది కూడా స్ఫురణలో లేదు. నా ధ్యాస అంతా కూడా నా భర్త మీదే ఉంది” అని నా పరిస్థితి ని వివరించాను. అందుకు ఆయన అమ్మ నీ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను. దాని వాళ్ళ నీ భర్త ఇదివరకు లాగే మళ్లీ నీతో అన్యోన్యంగా ఉంటాడు. కాని నేను చెప్పే పరిష్కారానికి నువ్వు చాలా సాహసం చెయ్యాలి, నీకు ఆ ధైర్యం ఉందా" అని ప్రశ్నించారు. "ఇక్కడ గుహలలో పెద్ద పులులు తిరుగుతూ ఉంటాయి. అందులో ఒక పెద్దపులి మీసపు వెంట్రుక నువ్వు తీసుకురాగలిగితే నేను నీ సమస్యకు పరిష్కారం చెప్తాను, ముందు నువ్వు అది తీసుకురా" అని నన్ను పంపించారు.

నేను ఆ దగ్గరలో ఒక కొండగుహలో ఒక ఆడపులి ప్రసవించిందని మా గ్రామస్తుల ద్వారా విని వున్నాను. ఎవరికి చెప్పకుండా ఒక గంపలో పాలు తీసుకుని అతికష్టం మీద ఆ పులి ఉన్న గుహని కనిపెట్టి మెల్లగా ఆ గుహ మొదలుకి చేరుకున్నాను. ఆ గుహ లోపల ఒక ఆడపులి పిల్లలకి పాలు ఇస్తూ నిశ్చింతగా కూర్చుంది. అలికిడి విని నా వైపు దృష్టి సారించింది. నేను మనసులోనే "తల్లి నీ మీద చాలా ప్రేమతో ఎంతో దూరం నుంచి వచ్చాను, నీ పిల్లలకి ఆహారంగా పాలు తెచ్చాను. నా సమస్యకి పరిష్కారం నీ దగ్గిరే ఉంది నన్ను అనుగ్రహించు" అని మనసులో పదే పదే అనుకుంటూ నేను తెచ్చిన పాలని మట్టి పాత్రలో పోసి దూరంగా వెళ్ళిపోయాను. ఇలా ఒక 15 రోజులు జరిగాక ఆ పెద్దపులి మెల్లగా నేను ఉండగానే వాటి పిల్లలతో నేను పెట్టిన పాలు తాగడం మొదలుపెట్టింది. ఇలా ఒక నెల రోజులు అయ్యాక వాటి పిల్లలు నా దగ్గిర నిస్సంకోచంగా తిరగడం మొదలుపెట్టాయి. ఒక 2నెలలు గడిచేసరికి ఆ పులికి నాకు ఎంతో స్నేహబంధం ఏర్పడింది. దాని వొళ్ళు నిమురుతూ ప్రేమగా సంభాషణ మొదలు పెట్టేదాన్ని. వొల్లంత శుభ్రం చేసేదాన్ని. ఒక రోజు ధైర్యంగా ఆ పెద్దపులితో "తల్లి నీ మూతిమీద ఒక వెంట్రుక నాకు కావాలి" అని ప్రేమపూర్వకంగా అర్థిస్తూ నేను తెచ్చిన కత్తెరతో ఒక పొడుగాటి వెంట్రుకను కత్తిరించి చాలా భద్రంగా ఒక కాగితంలో పొట్లం కట్టుకుని ఆ పెద్దపులికి నమస్కరించి ఇంటికి వచ్చేసాను.

ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు. పొద్దున్నే లేచి 4,5 నెలల తరువాత మరల ఆ కొండలోని యోగిని దర్సించుకున్నాను. భక్తిగా పాలు, పళ్ళు సమర్పించాను. నేను తీసుకువచ్చిన ఆ పులి వెంట్రుకను కూడా సమర్పించాను. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. "తల్లి, ఇంత శీఘ్ర కాలంలోనే నేను చెప్పిన అసాధ్యమైన పనిని నువ్వు సాధించుకు వచ్చావు, నాకు సంతోషంగా ఉంది" అన్నారు. "మహాత్మా మీరు చెప్పినట్లే చేసాను, తదుపరి ఉపాయం నా సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలి" అన్నాను.

అప్పుడు ఆయన నవ్వుతూ "తల్లి ఇంకా గ్రహించలేదా, నీ సమస్యకి పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది. నీ హృదయంలోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది.ఎంతో భయంకరమైన ఒక పెద్దపులిని, అందునా పిల్లలతో ఉన్న ప్రమాదకరమైన పులిని నువ్వు ప్రేమ అనే శక్తితో స్వాధీనం చేసుకున్నావు. దానిలోని క్రూరత్వాన్ని ప్రేమతత్వంగా మార్చగలిగావు. అటువంటి సాధ్వీమణివి, సాదువర్తనగల నీ భర్తని ఇటువంటి ప్రేమశక్తితో నువ్వే మార్చుకోగలవు. దానికి కొంత సహనం, ఓర్పు కావాలి, క్షేమంగా వెళ్లిరా" అని ఆశీర్వదించి నన్ను పంపించారు. నేను ఆయన చెప్పిన దాని పూర్తిగా అర్థం చేసుకుని అదే విధంగా అనతి కాలంలోనే నా భర్తని మామూలు స్థితికి తీసుకురాగాలిగాను. మళ్లీ మా జీవితంలో మునుపటిలాగా సుఖశాంతులు వెల్లివిరిశాయి. అదే ప్రేమతత్వంతో ప్రకృతిలో ఉన్న సమస్త ప్రాణులు మమెకమైపొయి మేము ఈ స్థితికి రాగాలిగాము. నాయన పరిశుద్దమయిన ప్రేమతో గాఢమయిన  సంకల్పంతో మనం ఎటువంటి కార్యాన్ని ఐన సాధించగలము. ఆలోచన అనేది ఒక శక్తి. ఆ ఆలోచనలో మనము ప్రేమతత్వాన్ని ఎదుటివారిపట్ల నింపుకుంటే అది వాక్కురూపంలో వ్యక్తమయినపుడు దుష్ట స్వభావాన్ని కూడా మనం మార్చివేయవచ్చు. మన ఆలోచనలలో పరిశుద్ధమైన ప్రేమ ఉన్నపుడు దానిలోంచి వచ్చే భావతరంగాలు అవి ఎవరిని తాకినా ఆ వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. దానికి నా జీవితమే తార్కాణం".

 నేను ఈ వింత పరిణామానికి నాకు కలుగుతున్న సందేహాలకి ఈ రకంగా సమాధానాలు దొరకడం నా జీవితంలో మరపులేని మరపురాని సత్యాలుగా గ్రహించాను. ఆమెకి భక్తి పూర్వకంగా నమస్కరించాను. ఆమె క్షణంలో అదృశ్యమైపోయింది. దత్త స్వామి చెప్పినట్లు "యద్భావం తద్భవతి" అన్నది నిరూపించబడింది. నా భావాలలో ఉన్నటువంటి గాఢమైన సందేహాలకు సమాధానం ఈ రకంగా దొరకడం పరిపాటిగా మారింది. ఇలా ఆలోచిస్తూ ప్రశాంతంగా నిదురపోయాను. ఏదో చెప్పలేని సంతోషం, మొత్తం విశ్వం పట్ల ఒక విధమైన కృతజ్ఞత భావం నా కణకణాలలో  నిండిపోయింది.



Spiritual Soup-06

Part – 6


"మహాత్మా మీరు పదే పదే  ప్రేమతత్వాన్ని గూర్చి చెప్తున్నారు, ఆ ప్రేమలో అంతా శక్తి ఉందా" అని అడిగాను. అప్పుడు ఆయన నేను చెప్పడం ఎందుకు, నీవే ఆ దృశ్యాన్ని చూడు అదిగో అటువైపు " అని వేలుతో చూపించారు. "నేను నిన్న గడిచిపోయిన కాలంలోకి తీసుకువెళ్తున్నాను, నీవు అక్కడ జరుగుతున్నా విషయాలు గ్రహించే శక్తిని ఇస్తున్నాను" అని అన్నారు. నేను ఎంతో ఆసక్తిగా కింద కనిపిస్తున్న దృశ్యం చూడసాగాను. అది ఒక పట్టణంలా కనిపిస్తోంది. జనం అంతా ఎత్తుగా, బలిష్టంగా, తెల్లగా శరీరం అంతా ఉన్ని బట్టలు ధరించి కనపడ్డారు. అది రష్యా దేశంలోని సరిహద్దు ప్రాంతం అని తెలుస్తోంది. ఎందుకంటే చాలామంది చీకట్లో భయం భయంగా సరిహద్దు దగ్గిర ఉన్న తలుపు వైపు మెల్లగా చీకటి ముసుగులో వెళ్తున్నారు. రష్యన్ సైనికులు మద్యం సేవిస్తూ, చుట్టలు తాగుతూ వికటాట్ట హాసాలు చేస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వారి దగ్గర చాలా ఎత్తైన పెద్ద విశాలమైన ఉక్కు కంచతో ఏర్పాటు చేసిన ఒక పంజరం ఉంది. సర్కస్ లో మాదిరిగానే దానిలో భయంకరమైన, ఎత్తైన ఒక 30 కుక్కలు మొరుగుతూ కనిపించాయి. రష్యన్ సైనికులు బైనాక్యులర్ సహాయంతో ఆ రాత్రి పూట సరిహద్దు దాటుతున్న అమ్మయక ప్రజలను గమనిస్తున్నారు. అంతలో వారి దృష్టి కొంతమంది దురదృష్టవంతుల మీద పడింది. వారు సరిహద్దు ప్రాంతానికి చేరేలా ఉన్నారు.

రష్యన్ సైనికులు దుర్మార్గంగా నవ్వుతూ వారి దగ్గర ఉన్న శునకాలను ఈ అమాయకుల మీదకి వదిలేసారు. అవి భయంకరంగా మొరుగుతూ ఆ శరణార్థుల మీద పడ్డాయి. వారు శక్తిహీనంగా పడుతూ లేస్తూ రోదిస్తూ పరిగెడుతున్నారు. క్షణంలో ఆ ప్రదేశం అంతా శరణార్థుల హాహాకారాలతో, శునకాల యొక్క భయంకరమైన అరుపులతో నిండిపోయింది. ఆ శునకాలు వారిని చీల్చి చెండాడి వారి శరీరం అవశేషాలు మిగలకుండా పూర్తిగా తినేశాయి.  ఆ ప్రాంతం అంతా రక్తసిక్తం అయిపొయింది. కానీ రష్యన్ సైనికులు చప్పట్లు చరుస్తూ, పైశాచిక నృత్యం చెయ్యసాగారు. వారంతా కూడా శరణార్థుల నుండి జారిపడిన వాచీలు, పర్సులు, ఇంకా చిన్న చిన్న వస్తువులు వారి జేబుల్లో వేసుకున్నారు. ఆ భయంకర దృశ్యం చూడలేకపోయాను. మనుష్యులలో ఇంత క్రూరత్వం,పైశాచికత్వం, రాక్షసత్వం ఉన్నదా అని చాలా మధనపడసాగాను. కానీ లామా గారు నిర్వికారంగా ప్రేక్షక పాత్ర వహించారు. మరల నా దృష్టిని ఇంకో దిశగా ఆయన ఆదేశం మేరకు చూడసాగాను. అది సరిహద్దుకి కొంత దూరంలో ఉన్న ఒక కుగ్రామము. ఒక రైతు ఇంట్లో లామా గారు కనపడ్డారు. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శరీరం శిధిలావస్థలో ఉంది. ఒంటి నిండా కట్లతో చాలా నీరసంగా కనపడ్డారు. ఆ రైతు ఏదో పానీయాన్ని, కొంత ఆహారాన్ని ఇచ్చి మీరేమి దిగులు పడవద్దు, నేను మీకు చూపించే రహస్య మార్గం ద్వారా సరిహద్దుకి చేరుకొంది, ఇంకా 1 గంటలో వెన్నెల చాలా మటుకు తగ్గిపోతుంది, అపుడు మీరు బయలుదేరవచ్చు అని ఉన్ని దుస్తులు, ఒక ధృడమైన కర్ర ఇచ్చాడు.లామ గారు ఆ రైతు సోదరుని వైపు కృతజ్ఞతా భావంతో చూసారు. కాసేపటికి లామా గారు అతనికి వీడ్కోలు చెప్పి చీకటిలో కనుమరుగయ్యారు. సుమారు ఒక గంట తరువాత అతి కష్టం మీద పడుతూ, లేస్తూ రైతు చెప్పిన మార్గం గుండా ఆ సరిహద్దు వైపు చేరుకున్నాడు. ఆతిధ్యం ఇచ్చిన ఆ రైతు విషపూరితమైన నవ్వుతో ఇంటి నుండి బయటపడి ఒక అరగంటలో రష్యన్ సైనికులు ఉన్న ప్రదేశానికి చేరాడు. అక్కడ వికృతమైన హావాభావాలతో పశ్చిమ దిక్కు చూపిస్తూ ఏదో మాట్లాడాడు.  నాకు ఆ రైతు పన్నిన కుట్ర అర్థం అయిపొయింది. తోటి టిబెటియన్ వాడు అయ్యి ఉంది కూడా డబ్బు కోసం కక్కుర్తి పడి దొంగ ప్రేమ నటిస్తూ అసలు విషయం ఆ రష్యన్ ముష్కురులకి చెప్పి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకున్నాడు. రష్యన్ సైనికుల ఆనందానికి హద్దు లేదు మరో కాలక్షేపం దొరికిందని. ఆ భయంకరమైన కుక్కలతో కొంత దూరం వెళ్లి వాటిని వదిలేసారు. అతి భయంకరంగా మొరుగుతూ సుమారు ఒక 10 కుక్కలు మనిషి వాసన పసిగడుతూ లామా గారి వైపు పరిగెత్తసాగాయి.

లామా గారు కుక్కల రాకను పసిగట్టారు, ఆయనకీ రైతు పన్నిన కుట్ర తెలిసిపోయింది. క్షణాలు గడిచే కొద్ది కుక్కలు ఆయన దరిదాపుల్లోకి వచ్చేసాయి. కాని లామా గారు మాత్రం స్థిరంగా పద్మాసనంలో కూర్చుని రెండు చేతులతో నమస్కారం పెట్టి తన మనస్సులో ఒక గట్టి సంకల్పంతో ప్రేమపూరితమయిన భావ ప్రసారాలను కుక్కలను ఉద్దేశించి పంపించారు. "నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను మీరు నా మిత్రులు, నా అనుచరులు కాబట్టి మనమంతా ప్రేమపూర్వకంగా ఉందాం. నేను మిమ్మల్ని ప్రేమించే మీ నాయకుడను, నా ఆదేశాన్ని మీరు శిరసావహించాలి" అని మానసిక భావ ప్రసారాలను ప్రేమ, స్నేహ తత్వంతో జోడించి కొద్దిగా అధికార దర్పంతో ఆయన తన సంకల్ప సిద్దితో సందేశాన్ని పంపించ సాగారు. అటువైపు రష్యన్  సైనికులు ఈలలు, చప్పట్లు కొడుతూ ఆనందంగా గంతులు వేయసాగారు. దానికి తోడు గ్రామ ప్రజలు వారితో చేరారు. భయంకరంగా, భీకరంగా మనిషి రక్తం రుచి మరిగిన కుక్కలు దాదాపు ఆయనను చుట్టి వేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాని లామా  గారు చాల నిశ్చలంగా ధైర్యంగా కళ్ళతో వాటిని చూస్తూ తన సందేశాలను పంపిస్తూనే ఉన్నారు. నాకు వారు ఇచ్చిన దివ్యదృష్టితో చూసినపుడు కాంతి పరివేష్టాన్ని చూసే శక్తి కలిగింది. రష్యన్ సైనికుల చుట్టూ ఉన్న కాంతి పరివేష్టం మలినమైనదిగా, మట్టి రంగు వాసన వేస్తోంది. అది చాలా మందంగా, దళసరిగా ఉంది. అదే మాదిరిగా పరిగెత్తుతున్న శునకాల చుట్టూ అదే విధమయిన రంగులో ఉన్న కాంతి వలయాలు కనిపించాయి. లామా గారు చుట్టూత లేత నీలి రంగు కాంతి పరివేష్టం క్షణ క్షణానికి పెరుగుతూ శునకముల యొక్క కాంతి వలయాన్ని తాకింది. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. లామగారి నీలి రంగు కాంతి శునకాల యొక్క కాంతిని తాకినపుడు అద్భుతంగా ఒక లేత నీలి రంగు వలయం  సమూహం చుట్టూ ఏర్పడింది. అంతలో ఒక అద్భుతం జరిగింది. కుక్కలు తమ వేగాన్ని తగ్గించాయి. భయంకరమైన అరుపులు ఆగిపోయాయి. మరుక్షణం అవి తోకలాడిస్తూ చిన్న కుక్క పిల్లలుగా కేరింతలు కొడుతున్నట్లు ప్రేమగా అరుస్తూ ఆయనను ప్రేమగా నాకసాగాయి. అద్భుత దృశ్యాన్ని చూసేసరికి గ్రామస్థులు, సైనికులు నిశ్చేష్టులైపోయారు.                                                                                               
  
అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అతి భయంకరమైన కుక్కలు అంత సాధువులుగా మారడం, ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ తోకలాడించడం, నాకడం చూసి వారు నమ్మలేకపోయారు. లామగారు నవ్వుతూ కుక్కలని ప్రేమగా నిమరసాగారు. నెమ్మదిగా లేచి కుక్కలతో పాటు వారి నాయకులైన రష్యన్ సైనికుల వైపు నడుస్తూ వారిని సమీపించారు. ఒక్కసారిగా ప్రాంతం అంత చప్పట్ల ధ్వనితో జనం అంత ఆయనకీ స్వాగతం పలికారు.వారందరిలో ఒక విధమయిన ప్రేమతో కూడిన భయం, భక్తి ఏర్పడ్డాయి. వారు లామగారిని వారి అతిధి గృహంలోకి తీసుకు వెళ్లి ఆయనకి భోజన సదుపాయాలు చేసి ఆయన భుజం తట్టి "మీరు ఒక అసాధారణ వ్యక్తి అని మేము గ్రహించాము. మా జీవితంలో ఇటువంటి  అద్భుతాన్ని చూడలేదు. మీరు మాకొక సహాయం చెయ్యాలి. ఇనప పంజరంలో ఉన్న కుక్కలకి ఒకడు గేటు ఎక్కి వాటి ఆహారాన్ని లోని విసురుతూ పట్టు తప్పి లోనికి పడిపోయాడు. కుక్కలన్నీ కూడా అతని ప్రాణం తీసాయి. మాలో ఎవరికీ లోనికి వెళ్లి విడిపోయి ఉన్న వాడి శరీర భాగాలు తెచ్చే ధైర్యం లేదు. పని మీరు మాత్రమే చేయగలరు" అని ప్రాధేయపడ్డారు. రష్యన్ సైనికుల కాంతి వలయంలో మాత్రం మార్పు లేదు. లోపలి వారి ఆలోచనలు క్రూరంగానే ఉన్నాయి. మాత్రం జాలి, కరుణ అనేవి వారి భావ స్పందనలలో లేవు. ఒక వేళ కుక్కలు వారిని తినేసిన వారికి నష్టం లేదు. లామగారి జీవితం అంతా ఇంత కన్నా ఘోరమైన పరిస్థితులను, బాధలను తోటి మానవుల చేష్టల ద్వారా అనుభవించారని నాకు అర్థం అయ్యింది. లామగారిని వారు బోను దగ్గరికి తీసుకువెళ్ళారు. లోపల వార్త గ్రామం అంతా కూడా పాకింది. గ్రామస్తులందరూ కూడా బోను దగ్గిరకి వచ్చేశారు. వాళ్ళలో తోటి మనిషి పట్ల మాత్రం జాలి, కరుణ, ప్రేమ, సానుభూతి మచ్చుకి కూడా కనిపించట్లేదు. అందరు తాగిన మత్తులో పందాలు వెయ్యసాగారు. కొంతమంది లామగారు ప్రాణాలతో బయటికి వస్తారు అని, కొంతమంది రారని భారీగా పందాలు కాయడం మొదలు పెట్టారు. నేను ఒక్క క్షణం ఆలోచించాను. ఇప్పటి పరిస్థితి కూడా అదే కదా, మనం ఆడే అన్ని ఆటలలో కూడా మనుష్యులలో ఇదే కుసంస్కారం ఇంకా ఎన్నోరెట్లు పెరిగింది. ఇంతలో లామగారు నిర్విచారంగా ధైర్యంగా నడుస్తూ బోను గేటు తెరిచి లోనికి నడిచారు.

అక్కడ కుక్కలు విశ్రాంతిగా పడుకుని ఉన్నాయి, మనుషులు చేసే రణగొని ధ్వనులను పట్టనట్లు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇంతలో అవి లామగారి రాకను, ఆయన వాసనను పసిగట్టాయి. కాని అవి కొంచెం తికమక పడుతున్నట్లు కనిపించాయి. వాటి చుట్టూ ఉన్న కాంతి వలయం ఎర్ర మట్టి రంగు, కొంత నీలి రంగుతో కనిపించింది. దానికి కారణం వాటిలో కొన్ని ఇదివరకు లామగారిని తాకి, నాలికతో ఎంగిలి చేయడం జరగడం వల్ల. కాని సామూహికంగా ఉన్న కుక్కల చైతన్యంలో క్రూరం ఎక్కువగా ఉంది. అవి ఒక్క సారిగా ఆయన వైపుకి దూసుకురాసాగాయి. లామాగారు మాత్రం నిర్వికారంగా, ధైర్యంగా మరల పద్మాసనంలో కూర్చుని కుక్కలను ఉద్దేశించి మానసిక భావ ప్రసారాలను ప్రేమతత్వంతో మిళితం చేసి ఆదేశాల రూపంలో పంపించారు. మరల అదే అద్భుతం జరిగింది. కుక్కలలో వేగం తగ్గింది. వాటి యొక్క కాంతి వలయం రంగు మారుతున్నట్లు కనిపించింది.మట్టితో కూడిన ఎరుపు రంగు ఈర్ష్య, అసూయ, క్రోధంను ప్రస్ఫుటిస్తే నీలి రంగు కాంతి శాంతి, ప్రేమ, జాలి, కరుణ తత్వాన్ని కలిగి ఉంటుంది. కుక్కలన్ని తోకలు ఊపుకుంటూ ఆయనని చుట్టుముట్టి నాకసాగాయి. ఆయన వాటిని దూరంగా కూర్చోమని ఆదేశాన్ని ఇచ్చారు, అవి అలానే చేసాయి. ఒక కుక్క మాత్రం తన ధోరణి మార్చుకోలేదు, దాని తీవ్రత తగ్గింది కాని ధోరణి మారలేదు. అది కుక్కల నాయకుడు కాబోలు అది లామగారి మీదకి దూకింది.

లామగారు మెల్లిగా లేచి, మానసికంగా కుక్కకి నేను నీ నాయకుడని అని ఆదేశాలు ఇస్తూ, బలంగా ఆయన దాని డొక్కలో తన కుడి కాలితో తన్నారు. దెబ్బకి అది యెగిరి 10 గజాల దూరంలో పది కుయ్యో మొర్రో అని మూలగసాగింది. సంఘటనతో మిగతా కుక్కలకి లామగారి మీద భయంభక్తి కలిగి ఆయనే తమ నాయకుడు అన్న నిశ్చయానికి వచ్చాయి. చీమ చిటుకు  మన్నా వినపడే అంత నిశ్శబ్దం ప్రదేశమంతా వ్యాపించింది. బయట గందరగోళం, అరుపులు మాయమయ్యాయి, అందరూ నిశ్చేష్టులయ్యారు. కొంతసేపటికి జనాలంతా తేరుకుని చప్పట్లు, ఈలలతో లామ గారిని అభినందించసాగారు.  ఇవేవి  చాలా  పట్టించుకోకుండా లామగారు తనకు ఇచ్చిన బ్యాగ్గులో అభాగ్యుడి అవశేషాలు వేసుకుని ధైర్యంగా గేటు తెరిచి బయటికి అడుగుపెట్టారు. అక్కడితో నేను చూసిన దృశ్యం ఆగిపోయింది. నాకు మనుషుల పట్ల మొదటి సారి చాలా అసహ్య భావం కలిగింది. జంతు చైతన్య స్థితి కన్నా మనుష్యుల తత్వం ఎన్నో రెట్లు చాలా హీనంగా ఉంది. మానవాళి కోసం మహానుభావుడు పడ్డ కష్టానికి మన మానవులు రకంగా కృతజ్ఞత చూపగాలుగుతున్నారు అని అనిపించింది. ప్రస్తుతం ఉన్న మానవులకి, మానవాళి శ్రేయస్సు కోసం నిస్వార్థంగా తెర వెనుక వర్ణింపరానటువంటి కష్టాలు పడుతున్న మహాత్ముల గురించి ఎలా తెలుస్తుంది అనిపించింది.

రోజుల్లో ఎవరి స్వార్థంతో వారు, ధన కాంక్షతో , స్వార్థపూరితమైన వారి హీనమయిన కోరికలతో సొంత తల్లితండ్రులను, అన్నదమ్ములను, స్నేహితులనే వంచిస్తూ ఉన్న మానవ సమాజం ఎప్పుడు బాగుపడుతుందో అని అనుకుంటూ నేను కన్నీటి ధారలతో మహాత్మునికి సాష్టాంగ దండ ప్రణామం చేసాను. నా మాటలను, భావాలను ప్రకటించలేక నేను తడబడుతూ వెక్కి, వెక్కి ఏడ్చాను. "మహాత్మా, తుచ్చమైన, నీచమైన ప్రస్తుతం ఉన్న మానవాళి కోసం మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు. మహర్షులు, యోగులు, సిద్ధులు అన్నవారు ఏదో అడవులలో ఏకాంతంగా ముక్కు మూసుకుని తపస్సులు చేసుకుంటూ ఉన్నారు అనే భావం ప్రస్తుతం మానవులకి ఉంది. వారు దేశాన్ని పట్టించుకోరని, దేశ రాజకీయాలలో వారు రాకూడదని ఒక వేళ వచ్చినా వారిని ఎన్నో కష్టాలకి గురి చేస్తూ అవహేళనలతో, అపనిందలతో నానా రకాలుగా హింసిస్తున్నారు. సాధువుల మీద అధికారులు, ప్రజా నాయకులు దాడి చేస్తున్నారు. కాని ఒక్కరికి కూడా మీరంతా నిస్వార్థంగా దేశం గురించి, మనుషులు గురించి ఇంతగా బాధపడుతున్నారని తెలియదు. లోపల నాకు దుఖం తెరలు తెరలుగా వస్తోంది, నేను చూసిన దృశ్యాలు మనుష్యుల యొక్క రాక్షసత్వం నన్ను కలచి వేస్తోంది".

అప్పుడు లామ గారు చిరునవ్వుతో "మేము అహర్నిశలు దేశమే కాకుండా, విశ్వంలో జరిగే ప్రతి రాజకీయ పరిణామాన్నీ చూస్తున్నాం. మా శాయశక్తులా అయస్కాంత పురుషునికి ఇచ్చిన వాగ్దానంతో విశ్వం, దేశంను రక్షించుకునే ప్రయత్నంలో ఉంటాం. భారతీయ స్వాతంత్ర్యం రావటానికి కూడా మేము ముఖ్యమైన పాత్ర వహించం. అయితే మాకెటువంటి ప్రచారంతో సంబంధం లేదు. మానవులలో కూడా రాక్షసులతో పాటు దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. వారు మా దగ్గర నుండి మార్గదర్శకత్వాన్ని, సూచనలను వారికి తెలియకుండానే గ్రహిస్తూ ఉంటారు. మా సూచనల ప్రకారం రక రకాల ఆధ్యాత్మిక సాధనాలలో ఉండి వారిలోని కాంతిని పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వారి కాంతి పరివేష్టం వారి చుట్టూ పక్కలవారి ద్వేష భావాలను కూడా ప్రేమపూర్వితంగా మార్చివేస్తాయి. అందుకే సజ్జన సాంగత్యం ప్రస్తుతం అమోఘమయిన ఫలితాలను సాధిస్తోంది. ఇపుడు నువ్వు చూసినట్లుగా అతి భయంకరమయిన రాక్షస ప్రవృత్తి ఉన్న కుక్కలు కూడా నా కాంతి పరివేష్టిత క్షేత్రంలోకి రాగానే సాధు జంతువులుగా మారిపోయాయి కదా, ఇది నీకు ప్రత్యక్ష అనుభవం. నీ ద్వారా తోటి మానవులందరికీ విజ్ఞానం పంచబడుతుంది. అయస్కాంత పురుషుడు చెప్పిన మాదిరిగా నీకు నీ ఆధ్యాత్మిక పరిణామ వికాసాన్ని బట్టి కావలసిన విషయ పరిజ్ఞానం సాదు పురుషుల ద్వారా చెప్పబడుతుంది.


ఒకటి మాత్రం మానవులందరూ గుర్తుపెట్టుకోవాలి, మేము మీకు మార్గూపదేశం మాత్రమె చెయ్యగలం, పర్వతశిఖరాన్ని మీరు మీ సాధన ద్వారానే చేసుకోవాలి. మనం మళ్లీ కలుద్దాం " అని చెప్పి మరల ఆకాశ మార్గాన అదృశ్యం అయ్యారు. నేను ఆకాశ మార్గాన అప్రయత్నంగానే నా ఇంటిలోని శరీరంలోనికి దూరటానికి ఇబ్బందిపడి మరలా ఎలాగో అలా మానవ శరీరంలో చేరిపోయాను. ఒళ్ళంతా తిమ్మిరి ఎక్కినట్లు అయింది. కాళ్ళు, చేతులు నొప్పులు ఉన్నాయి. కాసేపటికి ఉచ్చాస నిశ్వాసలు మామూలుగానే ఉన్నాయి. అవయవాలు స్వాధీనం అయ్యాక మంచం మీద గాఢమైన నిద్రలోకి జారిపోయాను.