N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Sunday 31 July 2016

Spiritual Soup-09


నాకు ఇంతకు మునుపు జరిగిన ఎన్నో అనుభవాలలో ముఖ్యమైన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. విపత్కరమైన పరిస్థితులు కాని ప్రమాదాలు కాని జరగబోతునపుడు ఎంతో ఆర్ద్రతతో గాడ మైన భక్తితో మనం దేవుడిని, దత్తశక్తిని ప్రార్ధించినపుడు మనలో ఉన్న ఒక విధమయిన ప్రజ్ఞ (intuition) జాగ్రుతమవుతుంది. దీనినే "in  it  consciousness " అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే దీనినే మనం సర్వాంతర్యామిత్వం అని కూడా చెప్పుకోవచ్చు. 

మనం ప్రార్థించిన భగవంతుడు విశ్వం అంతటా మరియు అపారమయిన ఆ దైవశక్తి నిజమైన భక్తుల యొక్క చైతన్యంలో కలిసిపోతుంది, అంటే మానవ శక్తికి దైవశక్తి తోడవుతుంది. నేను గురుచరిత్ర చదువుతున్నపుడు దత్తుడి మొట్టమొదటి అవతారమయిన శ్రీ పాద శ్రీ వల్లభుల గురించి చాలా తక్కువగా సమాచారం ఉందని అనుకుంటూ ఉండేవాడిని. ఆ స్వామి యొక్క ప్రధమ అవతారం మన ఆంధ్రదేశంలో పిఠాపురంలో అవతరించింది అన్నపుడు ఒక విధమయిన సంతోషం మరియు బాధ కలుగుతూ ఉండేది. ఎందుకింత తక్కువ సమాచారం మనకి లభ్యం అవుతోంది మరియు ఆయనని గురించి ఆంధ్రదేశంలో ఎందుకు అంతగా గుర్తింపు కాని ప్రాముఖ్యం కాని లేదు అని ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని. నేను ఎంతో ఆర్తిగా ఒక విషయం గురించి ఆలోచించినపుడు దానికి తగిన సమాధానం దొరుకుతూ ఉండేది. ఇదే అనుభవం చాలా మందికి కూడా జరుగుతూ ఉంటుందని గ్రహించాను. ఒకసారి సెలవులకు నేను నా స్వస్థలమైన హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఒక రోజు కాకతాళీయంగా ఇద్దరు మిత్రులతో చర్చిస్తున్నపుడు ముగ్గురం కలిసి ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని సంకల్పించుకున్నాము. ఎక్కడకి వెళ్ళాలని చర్చించుకుంటుండగా నేను వెంటనే కురుపురం వెళ్దాము అన్నాను. కాని అది ఎక్కడ ఉందొ మాకు తెలియదు. వివరాలన్నీ కనుక్కుని ఒక రోజు మేము ప్రయాణం మొదలుపెట్టాము.

 అది 1999వ సంవత్సరం అనుకుంటాను. మక్తల్ అనే ఊరు చేరుకున్నాక అక్కడ టీ సేవించి దారి కనుక్కుని పంచదేవపహాడ్ దగ్గర ఉన్న రుక్మిణి సమేత పాండురంగ ఆలయం చేరుకున్నాము. అప్పట్లో ఆ గ్రామంలో ఈ పంచదేవపహాడ్ మాత్రమే చాలా పేరున్నది. మేము చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. ఈ ఆలయం క్రీ.శ.1238వ సంవత్సరంలో కట్టబడింది.ఆ గుడి పరిసర ప్రాంతాలు అంతా కూడా చాలా భీభత్సంగా ఉన్నాయి. గుడి తలుపులు మూసి ఉన్నాయి. అంత గడ్డి మొలచి, మేకల పెంటికలతో చాలా దయనీయ స్థితిలో ఉంది. పిల్లలందరూ పేక ఆడుతూ సంస్కారహీనంగా కనిపించారు. 

ఆ గుడి  యొక్క పరిస్థ్తితి  మా అందరికి కొంచెం బాధ కలిగించింది. పక్కనే ఏదో ఒక పెద్ద భవనం నిర్మాణ దశలో ఉన్నది. వితల్ బాబా అను దత్త భక్తులు దానిని నిర్మాణ కర్త అని తెలిసింది. గుడి వెనుక భాగంలో చిన్న కాలి బాట ఉంది. అలా కొంచెం నడవగానే మమ్మల్ని చూసి ఒక తట్టె నడిపేవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, కృష్ణా  నది దాటిస్తానన్నాడు. తొట్టెలో కొంతదూరం ప్రయాణం చేసాక మధ్య భాగంలో నీరు లోతుగా లేనందు వాళ్ళ నడుచుకుంటూ అటు వైపున ఉన్న కురుపురం చేరుకున్నాము.  

ఇక్కడ శ్రీ పాద శ్రీ వల్లభులు తపస్సు చేసుకునేవారు, పంచదేవపహాడ్ లో ప్రతినిత్యం దర్బారు నిర్వహించి చీకటి పడగానే కురుపురం చేరుకునేవారు. పరమ భక్తుడు, నిష్టాగరిష్టుడు, తపస్సంపంన్నుడు అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి (టెంబే స్వామి)వారి ధ్యానశక్తితో శ్రీ పాద శ్రీ వల్లభులు తపస్సు చేసుకునే స్థలాన్ని కనిపెట్టే నిమిత్తం పంచదేవ పహాడ్ చేరుకున్నారు. అక్కడ పాండురంగ దేవాలయంలో విశ్రమించి వారి తపశ్శక్తితో ద్యానంలో శ్రీ పాద శ్రీ వల్లభులు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని విచ్చేసారుట. ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాంతం అంత కూడా అప్పట్లో దట్టమయిన వృక్షాలతో, లతలతో, ముళ్ళ చెట్లతో పూర్తిగా కప్పబడి ఉండేదిట. 

వారు వారి శిష్య బృందంతో, గ్రామస్తుల సహాయంతో ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి భక్తుల విరాళాలతో ఆలయం కట్టించి, కర్ణాటక దేశం నుంచి శ్రీ పాద శ్రీ వల్లభులు సూచనల ప్రకారం భట్టు సంప్రదాయానికి చెందినా ఒక పూజారి కుటుంబాన్ని రప్పించి, వారి బ్రతుకు తెరువుకు కొన్ని వ్యవసాయభూములను అప్పగించి స్వామివారికి నిత్యపూజకి కావాల్సిన ఏర్పాట్లు చేయించారు. అక్కడే శ్రీ టెంబే స్వామి కొంత కాలం ధ్యానంలో ఉండి అక్కడ ఉన్న గుహలో శివాలయం ప్రతిష్టించారు. మేము కృష్ణా నదిలో కాళ్ళు చేతులు కడుక్కుని ఎంతో భక్తి శ్రద్దలతో ఆలయం ప్రవేసించాము. ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోయాము. గుడి బయట ఇంకా పూర్తిగా నిర్మాణం కాని, గాలి వెలుతురూ లేని ఒక గదిని మాకు కేటాయించారు. వాతావరణం చాల ఆహ్లాదంగా ఉంది. 

అక్కడ పూజ నిర్వహించే భట్టు సోదరులు ఇద్దరు ఎంతో భక్తి శ్రద్దలతో స్వామి వారికి పూజ నిర్వహిస్తున్నారు. ఆ రోజు జరిగిన పవళింపు సేవ, దాని ముందు జరిగిన పల్లకి సేవలో  మేము ముగ్గురం పాల్గొన్నాము. అక్కడ మేము తప్ప అన్య భక్తులు ఎవరు లేరు. భోజన సదుపాయం కూడా సరిగా లేదు. గుడికి ముందు చిన్న వైశ్య దంపతులు నిర్వహిస్తున్న చిన్న దుకాణంలోనే మాకు తినటానికి ఉప్మా లభించింది.

ఆ రోజు రాత్రి నేను గుడి ఆవరణలో కూర్చుని శ్రద్ధగా  పారాయణం మొదలుపెట్టాను. పారాయణం అయిపోతుండగా నేను కూర్చున్న కుడివైపు ఏదో ఒక కదలిక అనిపించింది. చూద్దును కదా ఒక తేలు గబాగబా నా పక్క నుంచి వెళ్ళిపోయింది. మొట్ట మొదటి ఆలోచన దాన్ని చంపాలని, మరుక్షణం పవిత్రమైన ప్రదేశంలో అందులో గురుచరిత్ర పారాయణం చేసేటపుడు హింస పనికిరాదని అనిపించింది. ఇక దాని జోలికి వెళ్ళకుండా నా పారాయణం కొనసాగించాను. 

ఎప్పుడో కంపాలాలో శ్రీ పాడుల గురించి ఆలోచించటం, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించటం, ఆ తదుపరి కురుపురం ప్రయాణం, స్వామి వారి దర్శనం అంత ఒక అద్భుతంలాగా జరిగింది. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించాము. మరునాడు తెల్లవారగానే కృష్ణా నదిలో స్నానం చేసి పట్టు పంచతో ఆలయ ప్రవేశం చేసి స్వామి వారికి అర్చన, అభిషేకాదులు పూర్తి చేస్కున్నాము. నేను గుడికి కుడిపక్కన ఉన్న మహావృక్షం(మర్రి చెట్టు అనుకుంట) దాని కిందనే ఉన్న దత్తాత్రేయ మందిరం దర్శించాను. అక్కడే స్వామి వారు తపస్సు చేసుకునేవారుట. అక్కడ ఒక కొబ్బరి కాయ కొట్టి కాసేపు అక్కడే ధ్యానం చేసుకున్నాను. టెంబే స్వామి గుహ ముందు ఉన్న ఒక రాతి చప్టా మీద కూర్చున్నాను. అక్కడే స్వామి సమర్ధగారి విగ్రహం ప్రతిష్టించబడింది.

అక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తుండగా నాకు ఎదురుగా కొంత దూరంలో ఒక పిల్లి వెళ్తూ నాకు కనిపించింది. నాకు ఎందుకో దాన్ని పిలిచి ఎక్కడ  అయిన పాలు దొరికితే సమర్పించాలని అనిపించింది. ఎంతో ప్రేమగా ఆ పిల్లిని ఆహ్వానించాను. నువ్వంటే నాకెంతో ఇష్టం నా దగ్గిరకి రా అని పిలిచాను. అలా పదే పదే అంటుండగా ఆ పిల్లి ఒక్క క్షణం ఆగి తేరిపార చూసి మెల్లగా నా దగ్గిరకి వచ్చి చటుక్కున చప్టా మీదకి దూకింది.మెల్లి మెల్లిగా నా దగ్గరకి వచ్చి నా వొళ్లోకి గెంతి ఒక రెండు నిమిషాలు విశ్రమించింది. తరువాత నా పక్కన కూర్చో అని నేను ప్రేమగా ఆదేశించగా అలాగే అది నా వోల్లోంచి లేచి నా పక్కన కూర్చుంది. దారిలో వెళ్తున్న ఒక పాలు అమ్మే అతన్ని పిలిచి అతని దగ్గర పాలు కొని ఒక చిన్న మట్టి పాత్రలో పోసి ఆహారంగా ఆ పిల్లికి సమర్పించాను. 

అది తృప్తిగా తాగిన తరువాత నేను వీడ్కోలు చెప్పగానే వెళ్ళిపోయింది. నా పారాయణం మిగింపు దశలో ఉండగా ఈ సంఘటన జరిగినందు వలన శ్రీ పాద శ్రీ వల్లభులు  వారే స్వయంగా వచ్చి నా ఆతిధ్యం స్వీకరించినట్లుగా భావించాను. ఆహా శ్రీ పాద శ్రీ వల్లభులు  వారు తపస్సు చేసుకునే ప్రదేశంలో జంతువులు కూడా ప్రేమపూర్వకమయిన, భక్తి పూర్వకమయిన స్పందనలు కలిగివు న్నాయి, అంతా ఈ స్థల మహిమే కదా అని అనిపించింది. మద్యాహ్నం వరకు అక్కడే ఉండి మళ్లి మేము పంచదేవపహాడ్ అక్కడి నుంచి వెనక్కి బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నాము. ఇలా నా సంకల్పానికి శ్రీ పాద శ్రీ వల్లభులు  వారు అనుకూలంగా స్పందించి నాకు మార్గాదర్శకులయ్యి నన్ను ఆయన అనుగ్రహానికి పాత్రులు చేసారు. ఇది నా మొట్ట మొదటి కురుపురం యాత్ర.