Part – 5
ఒక రోజు నేను ఇంట్లో కూర్చుని సావకాశంగా నాకు జరిగినటువంటి నమ్మశక్యం కానటువంటి దివ్య పురుషుని దర్శనం, వారు చెప్పినటువంటి విషయాలు, ఇచ్చిన అనుభవాలను నెమరవేసుకుంటున్నాను. నాకు ఈ జన్మలో దత్తుడి మీద అపారమయిన భక్తి,
ప్రేమ కలిగాయి. 1951 వ సంవత్సరంలో నేను నెలల వయస్సు పిల్లవాడిగా ఉన్నపుడు మా అమ్మగారు ఏ సౌకర్యం లేని ఆ రోజుల్లో అష్టకష్టాలు పడి నన్ను షిర్డీ క్షేత్రానికి తీసుకువెళ్ళారు. ఇంట్లో ఎవరికి ఏ మాత్రం అస్వస్థతగా ఉన్నా,
మా తల్లిగారు షిర్డీ నుండి ప్రతి నెల పోస్ట్ లో వచ్చే విభూతిని వంటికి రాసి, ప్రసాదం నోట్లో వేసి సాయిబాబా కీర్తనలు ఎంతో భక్తిగా శ్రావ్యంగా పాడుతూ ఉండేవారు.
మాకు వెంటనే ఆరోగ్యం కుదుటపడేది.
మధ్యలో అనగా వయసు పెరుగుతున్న కొద్ది ఆటల ధ్యాసలో బాబాని పూర్తిగా మర్చిపోయాము.
కాని ఆయన మాత్రం సర్వదా నా వెంట వుండి చాలాసార్లు మార్గ దర్శకత్వం చేస్తూ నాకు ప్రాణదానం కూడా చేసారు.
మానవుడు సుఖసంతోషాలతో ఉన్నప్పుడు భగవంతుని పూర్తిగా మర్చిపోతాడు.
భగవంతుడు అనేవాడిని ఎక్కడో మారుమూల పెట్టేస్తాము,
కనీసము ఆయనను తలచుకోవటం కూడా జరగదు.
మనిషి యొక్క మనస్తత్వం చాల విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అదే మానవుడు తనకు వచ్చిన సమస్యలను ఎదురుకోలేని కష్టాలుగా భావించినపుడు సమస్త దేవతలను ప్రతిక్షణం గుర్తుతెచ్చుకుంటాడు.
నిరంతరం పూజలు, ప్రార్ధనలు చేస్తుంటాడు.
ఎప్పుడు కూడా దేవాలయాలకి వెళ్ళనివాడు సమస్యలు వచ్చినపుడు అక్కడే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాడు.
కష్టాలు తీరగానే మళ్లీ కథ మామూలే. అందుకే కాబోలు కుంతీ దేవి తనకి ఎప్పుడు కష్టాలు
కలుగుతూ ఉండాలని, నేను నిన్ను ఎప్పుడు తలచుకోవాలని శ్రీ కృష్ణునితో చెప్పడం జరిగింది.
నాకు చిన్నతనం నుండే పుస్తకాలు చదివే అలవాటు ఉంది, ఇది మా తల్లితండ్రుల దగ్గిర నుండి వచ్చింది.
అయితే అది క్రమక్రమంగా స్వాధ్యాయం వైపు మరలింది. ఎన్నో ప్రశ్నలకు తెలియని సమాధానాలు
పుస్తకాల ద్వారా, నా స్వానుభవాల ద్వారా సమాధానాలు దొరికాయి. ముఖ్యంగా నా ఆధ్యాత్మిక వికాసం 17
ఏళ్ళ పాటు ఈస్ట్ ఆఫ్రికాలో
అవిచ్చిన్నంగా కొనసాగింది. ఎంతో మంది సాధకులను కలవటం, ముఖ్యంగా గురుద్వారాలో ఆధ్యాత్మిక అనుసంధానము,
తద్వారా ఆధ్యాత్మిక
అనుభవలాను పొందాను. గురువు ద్వారా అనేకమంది గురుతుల్యులను కలిసాను. అయితే ప్రస్తుతం
నా జీవితంలో జరుగుతున్న అనుభావాలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సుమారుగా గురుచరిత్ర,
సాయి సచ్చరిత్ర,
శ్రీ దత్త దర్శనము
50 సార్లు పైగానే చదవటం
జరిగింది. వాటి యొక్క పుణ్య ఫలం వల్లనే ఇంతమంది మహాత్ములను కలవడం, ఊహాతీతమైన అనుభవాలు
వారు నాకు ప్రసాదించటం జరిగింది. నా ప్రమేయం లేకుండానే నన్ను వారు తీర్చిదిద్దుతున్నారనే
భావన, ప్రగాఢ విశ్వాసం నాకు కలిగాయి. ఇలాగ నా ఆలోచనలు అంతులేని ప్రవాహం మాదిరిగా సాగిపోతున్నాయి.
ముఖ్యంగా అయస్కాంత పురుషుడితో నాకు తెలియకుండా చేసిన ఆకాశగమనం గురించి ఆలోచించసాగాను.
ఒకసారి యధావిధిగా నా కర్తవ్య నిర్వహణలో నైరోబి నుండి కారులో Mombas బయలుదేరాను. దారిలో
makindu అనే ప్రదేశంలో ఉన్న గురుద్వార(సిక్కు మతస్తుల) ను సందర్శించటం నాకు అలవాటు. అక్కడ
ప్రత్యేకత ఏమిటంటే 24 గంటలు కూడా ఏ వేళలో వెళ్ళినప్పటికీ భోజనం సిద్ధంగా ఉంటుంది,
ఉండడానికి వసతి సదుపాయం
ఉంటుంది. అక్కడ అల్పాహారం ముగించి నా ప్రయాణాన్ని కొనసాగించాను. సాయంత్రానికి Mombas
చేరాను.
ఒక రోజు సాయంత్రం ఏమి తోచక బజారులో వాకింగ్ చేస్తున్నాను. నేను స్వతహాగా పుస్తక
ప్రియుడిని కావడం వాళ్ళ నా దృష్టి అక్కడ ఫుట్పాత్
మీద ఉన్న పుస్తకాల షాపు మీద పడింది. నేను దగ్గరగా వెళ్లి పుస్తకాలను చూస్తుండగా నా
దృష్టి అక్కడే ఉన్న Lobsangramp రాసిన పుస్తకాల మీద పడింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈ మహా పురుషుడు నాకు స్వప్న
దర్శనం ఇస్తుండేవారు. ఏవేవో విషయాలు చెప్తుండేవారు. పొద్దున్న లేచేసరికి ఏమి గుర్తుండేది
కాదు. ఎప్పుడో ఒకసారి చాలా ఏళ్ళ క్రితం నేను భారతదేసంలో ఉన్నప్పడు సుమారు 1970-75
మధ్యలో ఈయన పుస్తకాన్ని
చదవటం జరిగింది.
అప్పుడు ఆ పుస్తకం నాకేమి అర్థం కాలేదు. మళ్లీ ఇన్నాళ్ళ తరువాత ఆ మహానుభావుడు రాసిన
పుస్తకాన్ని చూడటం జరిగింది. వెంటనే ఆ పుస్తకాన్ని కొనేసాను. తరువాత నేను నా పనులని
ముగించుకుని మరల నైరోబి రావడం జరిగింది. ఆ పుస్తకం నేను దాదాపు 15 సంవత్సారాల కింద మొట్ట
మొదటిసారి నేను చదివిన పుస్తకమే. ఆ పుస్తకంలో ఆయన ఆకాశగమనాన్ని గురించి చాలా విపులంగా
రాసారు. నేను చాలా సార్లు ఆకాశగమనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ప్రతీ సారి
ఆఖరి క్షణములో నా పక్క మీద నుంచి కిందపడుతున్నట్లుగా అనిపించి ఉలిక్కిపడి లేస్తూ ఉండేవాడిని.
అలా భయపడకూడదని ఆయన ఆ పుస్తకంలో చెప్పేవారు. ఇలా రోజులు గడచిపోతున్నాయి.
ఒక రోజు రాత్రి నాకు అప్రయత్నంగా సుమారు 3 గంటల సమయంలో మెలకువ రావడం, నా ముందుగదిలో ఒక అద్భుతమయిన
కాంతిని గమనించడం జరిగింది. నేను మెల్లగా ఆ ముందు గదిలోకి వెళ్ళాను. అక్కడ
ఒక దివ్య పురుషుడు తేజోమయ శరీరంతో ప్రశాంత వదనంతో, చిరుదరహాసంతో "నేను నీకోసం వచ్చాను,
దగ్గిరికి రా"
అని ప్రేమగా పిలిచారు. నేను వినయంగా నమస్కరిస్తూ సాష్టాంగ ప్రణామం చేసాను. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు అనే Lobsangramp టిబెటియన్. నువ్వు ఆకాశగమనం గురించి కదా ఆలోచిస్తున్నావు,
సరే పదా ఈసారి మనిద్దరం
ఆకాశగమనం చేద్దాం, నేను ఉన్నాను నువ్వేమి భయపడక్కర్లేదు" అని చెప్పారు. ఇద్దరం వెల్లకిలా పడుకుని
నెమ్మదిగా ప్రాణయామం చేస్తూ కళ్ళు మూసుకుని ఒక విధమయిన నిద్రావస్థలో జారుకున్నాము.
నేను ఎంత ప్రయత్నించినా కూడా నా ప్రాణామయ శరీరము బయటకు మాత్రం రాలేకపోతోంది. అప్పుడు
ఆయన మెల్లగా నా శిరస్సు మీద చెయ్యి వేసారు, తక్షణం నా శరీరం దూదిపింజలా తేలినట్లు అనిపించింది.
మేమిద్దరం గాలిలో తేలిపోతున్నాము. నేను, ఆయన ఇద్దరం పైకప్పు దాటుకుని ఆకాశంలో ప్రవేశించాము, నాకంతా ఆశ్చర్యంగా
ఉంది. ధృడంగా సిమెంటుతో తయారు చేయబడిన ఆ పైకప్పులోంచి ఎలా బయటికి వచ్చాము. ఆఘమేఘాలతో
ఆకాశ యానము సాగించాము, ఆయన నా చెయ్యి పట్టుకుని కూడా తీసుకెళ్తున్నారు. కింద పట్టణంలో
వీధి దీపాలు క్రమక్రమంగా దూరం అవుతున్నాయి. ఇంకా పైకి, పైపైకి ఎగర సాగాము. నా శరీరమంతా వెచ్చగా హాయిగా
ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉంది. కొంత సమయం దాటాక మేము ఒక ఎత్తైన కొండ మీద ఉన్న బౌద్ధ
ఆరామం అనుకుంటాను, అక్కడ దిగాము.
ఆయన "ఇది నేను పుట్టినటువంటి పవిత్రమైన దేశము. ఇది అతి పవిత్రమైన బౌద్ధ ఆరామము,
ఇక్కడే నాకు నా గురువులు
ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారు. నా జీవిత లక్ష్యం మానవాళి అందరికి కూడా ఎన్నో విజ్ఞానపరమైన
ఆధ్యాత్మిక విషయాలను తెలియపరచటమే. మా గురువుగారు ఈ జీవితమంతా భరించలేనటువంటి బాధలతో,
అష్టకష్టాలతో అన్యాయంగా
హింసించబడతావు. నరకయాతనను మించి నీకు ఎంతో శారీరక, మానసిక బాధలు కలుగుతాయి, మేమంతా నిన్నే ఎన్నుకున్నాము,
ఇష్టం లేకపోతే నువ్వు
ఈ పనిని మానుకోవచ్చు అయినా కూడా మేము ఎంతో ప్రేమిస్తూ ఉంటాము. ఎంతో మంది మనుష్యుల జీవితాలు
కర్మసహితంగా ఉంటాయి, అంటే కర్మలు చెయ్యటం మూలంగా ఆ కర్మల నివృత్తి కోసం మళ్లీ మళ్లీ మానవ జన్మ ఎత్తవలసి
ఉంటుంది. కాని కొద్దిమంది మానవుల జీవితం కర్మ రహితంగా ఉంటుంది వారు ఏ కర్మలు చేయ్యనప్పటికి
మానవ శ్రేయస్సు కోసం, ఆధ్యాత్మిక జిజ్ఞాస కోసం, మార్గ దర్శకత్వం కోసం ఎదురు చూస్తున్న సత్పురుషుల
కోసం జన్మ ఎత్తవలసి ఉంటుంది అటువంటి వారు అనగా నీలాంటి వారి ద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక
పరిణామ క్రమం వారి వారి పూర్వజన్మల సాధన బట్టి క్రమక్రమంగా వారి స్థాయి పెరుగుతుంది.
ప్రస్తుతం ఈ విశ్వం యొక్క పరిస్థితి మనుష్యుల యొక్క వృత్తి, ప్రవృత్తి మా అందరికి కూడా ఎంతో ఆందోళన కలిగిస్తోంది.
మేము మానవాళి శ్రేయస్సు కోసం చేసే ప్రయత్నాలు, తపస్సు సరిపోవడం లేదు. ప్రస్తుతం మానవాళి
అంతా కూడా అసురీశక్తుల, మాయాశక్తుల ప్రభావంలో ఉంది. ప్రేమతత్వం మనుష్యులలో చాలా తక్కువ
స్థాయిలో ఉంది. ప్రజలను పరిపాలించే నాయకుల సేవా తత్వం పూర్తిగా అడుగంటిపోయింది. రక్షించాల్సిన
ప్రజా నాయకులు, రాజకీయ వేత్తలే ప్రజల పాలిటి రాక్షసులుగా, భక్షకులుగా, దేశద్రోహులుగా మారిపోతున్నారు. సాదు వర్తనులకు,
సామాన్యులకు సత్పురుషులకు
ఇది గడ్డు కాలంగా మారింది.
అత్యున్నతమైనటువంటి మన పూర్వీకుల భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు పూర్తిగా భ్రష్టు పట్టి పోయాయి. కలి పురుషుని శక్తి
ప్రపంచమంతా విజ్రుమ్భిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మేమంతా కూడా మా సర్వశక్తులు
ధారపోస్తున్నాము. ఎంతో మంది జిజ్ఞాసులు, సాదుపురుషులు నీ కోసం, నీలాంటి వారికోసం ఎదురు
చూస్తున్నారు. అటువంటి వారిలో నీవు కాంతి అనే ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని,
ధైర్యాన్ని పెంపొందించి
వారిని కాంతిమయ శరీరదారులుగా చెయ్యాలి. నీవు నీలాంటి వారు నీలోని ఆధ్యాత్మిక కాంతిని, ప్రకాశాన్ని,
దైవత్వాన్ని, ప్రేమతత్వాన్ని సాధనల ద్వారా పెంచుకుంటారు. గాడాంధకారంలో, పెనుతుఫానులో చిక్కి దారి తప్పిపోయిన మహా సముద్రంలోని పడవల మీద
ఉన్న నావికులందరికి ఏ విధంగా అయితే వారి దారిని నిర్దేశిస్తుందో అదే విధంగా ఇటువంటి
అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నవారిని నీవు కూడా ఒక పెద్ద పవర్ హౌస్ లా మారి వారందరికీ మార్గ దర్శకత్వం చేస్తూ వారిని కూడా లైట్ వర్కర్స్ చెయ్యాలి. మరలా ప్రతియొక్క లైట్ వర్కర్ కొన్ని వేల మందిని తమ
విధంగా మార్చాలి.
ఈ విధంగా ప్రపంచం అంతా కూడా ప్రేమతత్వంలో ఏకీకరణ అవుతుంది. అందుకోసం నీలాంటి వారు
ఒక లక్షా పాతికవేల మంది నుంచి ఒక లక్షా నలభై నాలుగు వేల మంది ఈ ప్రస్తుత ప్రపంచాన్ని
మార్చటానికి అవసరం అవుతుంది. నీకు మేమంతా కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ సహాయం చేస్తూ
ఉంటాము అని చెప్పి మా గురువుగారు MIGIYARDOMDO
నాతో చెప్పారు. నేను
నా సమ్మతిని వెంటనే తెలిపాను". ఇక్కడితో
Lobsangramp గారు తన ప్రసంగాన్ని
ఆపి "చాలా సమయం అయ్యింది కదా మనం చక్కటి టిబెటియన్ టీ ని సేవిద్దాం" అనగానే
మా ముందు ఎంతో అందంగా చెక్కబడిన చిన్న బల్ల, దాని మీద అందమైన కప్పులలో పొగలు కక్కుతూ ఒక పానీయం ప్రత్యక్షమయింది. ఆయన ఎంతో శ్రద్ధా
పూర్వకంగా రెండు చేతులల్తో ఒక పాత్రని గ్రహించి తన్మయత్వంతో సేవించసాగారు. నేను కూడా
అదే విధంగా ఆ పానీయాన్ని సేవించాను. శరీరమంత ఒక వెచ్చటి విద్యుత్ ప్రవహించి చలి బారి
నుండి నన్ను రక్షించింది.