Part 10 - గాణగాపూర్ యాత్ర
నేను
యుగాండలోఉండగా గురుచరిత్ర పారాయణం చాలా శ్రద్ధగా క్రమం తప్పకుండా చేస్తుండే వాడిని
. అప్పుడే నాకు శ్రీ నృసింహ సరస్వతి గారు తపస్సు చేసుకున్న గంధర్వపురం (ప్రస్తుతం గాణగాపూర్)
వెళ్ళాలనే సంకల్పము కలిగింది. ఇది కురువపుర యాత్రకి ముందు జరిగింది. కాని అక్కడికి
ఎలా వెళ్ళాలి అని వాళ్ల్లని, వీళ్ళని అడగటం సంభవించింది. ఆ రోజుల్లో నేను ధ్యానం ఎక్కువగా
చేస్తుండేవాడిని. తెల్లవారు ఝామున 3 గంటలుకు లేచి స్నానం చేసి ఎక్కువగా అమ్మవారి ధ్యానం
చేస్తుండేవాడిని. అప్పట్లో నాకు తెలియకుండానే అంతర్గతంగా ఒక మంచి ఆధ్యాత్మిక పరంగా
"హీలర్" ని కావలి అనే కోరిక సహజంగా ఉండేది.
గాణగాపూర్ యాత్ర గురించి నేను
ఆలోచిస్తుండగా మా ఆధ్యాత్మిక గురువుగారు స్వామీజీ రమణి గారి ఆంతరంగిక శిష్యుడయిన శ్రీ
కులకర్ణి గారు వారి కుమార్తె వివాహం నిమిత్తమై గుల్బర్గా వెళ్తునట్లుగా తెలిసింది.
వారు నన్ను కూడా వారితో రమ్మని ఆహ్వానించడం జరిగింది. నా రెండవ కుమారుడైన చిరంజీవి
కమల్ కాంత్ ని తోడుగా తీసుకోనివారి వాహనంలో మేము గుల్బర్గా బయలుదేరాము. కులకర్ణి గారు
నాకు మంచి మిత్రుడు మరియు గొప్ప దత్త భక్తులు.
ఆ
విధంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామీ వారు నా సంకల్పాన్ని చిగురింప చేసారు. గుల్బర్గాలో
పెళ్లి వారితో పాటు ఒక రాత్రి మంచి హోటల్ గదిలోనే గడిపాము.
మరునాడు పొద్దున్నే కులకర్ణి
గారు నన్ను, మా అబ్బాయిని బస్టాండు దగ్గర దింపి వెళ్ళిపోయారు. అక్కడినుండి పాసింజర్
బస్సులో కొంత దూరం ప్రయాణించి ఒక కూడలి దగ్గిర దిగి మరల ఒక ఆటో మాట్లాడుకుని గాణగాపురం
చేరుకున్నాము. అప్పట్లో బస్సు సౌకర్యము కాని, సత్రాల సౌకర్యము కాని పెద్దగా ఉండేది
కాదు. అక్కడకి చేరాక వసతి కోసం వెతగ్గా ఎటువంటి సౌకర్యాలు లేని ఒక గృహస్థు ఇంట్లో వసతి
దొరికింది. అక్కడినుంచి ఆలయానికి వెళ్లి చింతామణి గణపతి స్వామి వారిని దర్శించుకుని,
అక్కడే కూర్చుని గురుచరిత్ర పారాయణం చేస్తుండగా ఒక అర్చకుడు (భట్టుగారు అనుకుంట) శ్రీ
స్వామి వారు మద్యాహ్నం పూట మారువేషంలో వచ్చి
ప్రసాదాన్ని స్వీకరిస్తారని చెప్పి దానికి కొంత డబ్బు తీసుకుని వారి ఇంట్లోనే
పెరుగన్నం ప్రసాదంగా వండి తీసుకొచ్చారు. సరిగ్గా
ఒంటిగంట ప్రాంతంలో అనుకుంటాను ఆయన వచ్చి మమ్మల్ని ఒక పెద్ద అరుగు మీద నిలబెట్టారు.
చేతిలో ప్రసాదాన్ని ఉంచారు, ఆ సమయాని కి చాలామంది జనం ప్రసాదం కోసం గుంపులుగా వచ్చారు.
నాలాగ చాలామంది ప్రసాదాన్ని పట్టుకుని అక్కడ జనానికి పంచడం మొదలుపెట్టారు. ఈ వందలమంది
జనసమూహంలో దత్తత్రేయులవారు ఏ రూపంలో వస్తారో అనేది అంతుపట్టని విషయం. ప్రతి వారిని
కూడా దత్తస్వామిగానే భావించి ఎంతో భక్తి భావంతో అక్కడ భక్తులు ప్రసాదం పంచుతూ ఉంటారు.
ఆ ప్రసాదాన్ని జనమంతా వెళ్ళిపోయాక నేను కొంచెం సేవించాను. నాకు ఏమాత్రం పుల్లగా ఉన్న
పెరుగు అస్సలు సహించదు. కాని దత్తుడు వారి భక్తుల చేత వారికి ఇష్టం లేని పనులన్ని చేయిస్తుంటారు.
ఆ పెరుగు చెప్పలేనంత పుల్లగా ఉన్నది.
మాములుగా అయితే ఆ ప్రసాదాన్ని తిరస్కరించేవాడిని
కాని ఇక్కడ ఆ పని చెయ్యలేము కదా, అది ఎలాగో అలాగా మింగేసాను. నాకు ఈ రకంగా దత్తుడు
చాల రకాలుగా పరీక్షలు పెట్టాడు కొన్ని తెలిసి, కొన్ని తెలియకుండా. వాటి యొక్క రహస్యం
చాలా ఏళ్ళకి కాని నాకు తెలియలేదు. జిహ్వ చాపల్యం ఉండకూడదని అన్ని రకాల రుచులను, అన్ని
రకాల అనుభవాలను ఆస్వాదించాలని అవన్నీ కూడా ముందు ముందు చాలా చక్కటి మధుర ఫలాలని అందిస్తాయని,
ఆ దత్తుడి యొక్క తత్వాన్ని అనుభవ పూర్వకంగా తెలియ చెప్పారు.
ప్రతీవారి
జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొంతమంది విమర్శనాత్మకముగా పరిశీలించి
దత్తుడి యొక్క తత్వాన్ని తెలుసుకుని కష్టము, సుఖము అనేవి లేవని, అవి కేవలం మనం ఊహించుకునే
అవాస్తవాలని తెలుసుకుని కష్టాలు అనుకున్నవి వచ్చినపుడు క్రుంగిపోవటము కాని మనసుకి ఆనందం
కలిగినపుడు సంతోషపడటం కాని చెయ్యకుండా దేని
ప్రభావానికి లోనుకాకుండా కేవలం ప్రేక్షకపాత్రనే వహిస్తుంటారు. దత్త మహా ప్రభువు యొక్క
బోధనా పద్ధతులన్నీ చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి.
అనుభవాల ద్వారానే మనకి లౌకిక, అలౌకిక
విషయాల గురించి స్వానుభవంగా నేర్పుతుంటారు. మనలో ఉన్న అహంకారం అనే కల్మషాన్ని కొన్నిసార్లు
కఠిన పరీక్షల ద్వారా కడిగివేస్తుంటారు.ఎంతో మంది గురుచరిత్ర, సాయి చరిత్ర, దత్త చరిత్రల
పారాయణాలు చేస్తుంటారు. కాని వారిలో ఈషణ మాత్రం కూడా మానసికంగా కాని, ఆధ్యాత్మికంగా
కాని ఏమాత్రం మార్పు ఉండదు. ఎందుకంటె వారు కేవలం యాంత్రికంగానే చదువుతూ ఉంటారే తప్ప
చదివిన ఒక అధ్యాయాన్ని గురించి ధ్యాన స్థితిలోకి వెళ్లి మనస్సు నిశ్చలంగా చేసుకుని
స్వామి వారు ఏమి చెప్పదల్చుకున్నారు అనే దాని
గురించి మాత్రం విమర్శన చేసుకోరు. అందువల్ల వారిలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. మనం
ఒక పరీక్షలో ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలంటే దాని వెనుక ఎంతో కఠోర పరిశ్రమ, శ్రద్ధ
ఏకాగ్రతతో పాటు, ఒకటే ధ్యాసలో చదివే విషయాలని పూర్తిగా ఆకళింపు చేసుకోక తప్పదు. అదే
విధంగా దత్త అనుగ్రహ పరీక్షలో మనం ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా ధృడ భక్తితో, విశ్వాసంతో,
ఏకాగ్రతతో, నిధి ధ్యాసతో ఆ దత్త మహా ప్రభువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలిగి, ఆయన
అనుగ్రహానికి పాత్రులం కావాలి. అంతే కాని మనం పారాయణాలు ఎన్నిసార్లు చేసిన కూడా మనకి
ఆశించిన ఫలితం దక్కదు. ఆయన చెప్పిన తత్వాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు మనం ఎక్కువ
మార్కులు సంపాదించుకుంటాము. అందుకే శ్రద్ధ, సహనం, ఈ రెండు సూత్రాలను శ్రీ సాయి బాబా
చెప్పడం జరిగింది.
"నమస్తే
భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ప్రభో
సర్వబాధాప్రసమనమ్
కురుశాన్తిం ప్రయచ్చమే"
అనే
ఈ శ్లోకాన్ని శ్రద్ధగా పఠిస్తూ చేతిలో జపమాలతో గుడి పక్కనే ఉన్న పెద్ద వటవృక్షం చుట్టూ
108 ప్రదక్షిణాలు చేసాను. ఎలాగైనా సరే గురుచరిత్ర పారాయణం నేను ఉన్న 2,3 రోజుల్లో పూర్తి
చెయ్యాలని ధృడ సంకల్పంతో ఉన్నాను. పట్టువస్త్రం లుంగీగా కట్టుకుని, పట్టు ఉత్తరీయం
కప్పుకుని మెడలో రుదాక్షమాల మరియు పద్మ/సరస్వతి మాల ధరించి చాల నిష్టగా ఆలయంలోనే పారాయణం
సాగించాను. మరల సాయంత్రం నేను ఉన్న వసతి గృహంలోనే పారాయణం ప్రారంభించాను. అదే ఆవరణలో
కూడా ఒక ఔదుంబర వృక్షం ఉంది. ఇంతలో ఆకస్మాత్హుగా విద్యుత్హు పోయింది. దానికి తోడు ఆస్థాన
గాయకుల రూపంలో దోమల దాడి విజ్రుంబించింది. పైగా ఉక్కపోత, ఆ రాత్రి అంతా కూడా ఒక్క క్షణం
నిద్రపట్టలేదు.
తెల్లవారి లేచేసరికి విపరీతమైన వొళ్ళు నొప్పులు, దానికి తోడు జ్వరం
వచ్చి చాల నిస్సత్తువగా ఉండిపోయాను. పారాయణం అనుకున్నట్లుగా సాగలేదు కాని ఒక మొండి
పట్టుదల వచ్చింది. దత్త మహా ప్రభు, నువ్వు పెట్టే పరీక్షలకి నేను తట్టుకునే ధైర్యం
కూడా నువ్వే ప్రసాదించాలి అనుకుని కాలకృత్యాలు తీర్చుకుని గుర్రపు బండి మీద నేను, మా అబ్బాయి సంగమం దగ్గరకి
వెళ్ళాము. ఇదే భీమ అమరజా రెండు కలిసే చోటు. అక్కడ చాలమంది, ముఖ్యంగా మహారాష్ట్ర, కన్నడిగులు
చిన్న దీపం వెలిగించి ఔదుంబర వృక్షం కింద ఎంతో శ్రద్దగా గురుచరిత్ర పారాయణం చేస్తూ
కనిపించారు. వాళ్ళ శ్రద్ధ భక్తులకి నేను నిజంగా ఆశ్చర్య పోయాను. వారి అకుంఠిత దీక్షముందు
నేను పడ్డ బాధ చాలా అల్పంగా అనిపించింది. అక్కడే కాసేపు కూర్చుని నా పారాయణ మరల ప్రారంభించాను.
కొద్దిసేపు గడిచాక మరల ఆలయంలో ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని పారాయణ కొనసాగించాను.
అంతా క్రితం రోజు రాత్రి మొట్టమొదటిసారిగా పల్లకిసేవ, ఆ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు,
పాట పాడటం, కొంత మంది మనుషులు అక్కడే కింద పడుకుని ఉండడం ఇది అంతా గమనించాను. నాకు కూడా మనసులో ఈ పల్లకి సేవలో ఒక చిన్న పాత్ర దొరికితే
బాగుండేది కదా అని అనిపించింది. అదే రోజు మధ్యాహ్నం గుడి ప్రాంగణంలో చాల మంది ఏదో దయ్యం
పట్టినట్లు నేల మీద దొర్లుతూ హృదయవిదారకంగా అరుస్తూ కనిపించారు. తర్వాత నాకు తెలిసింది
ఏమనగా ఈ క్షేత్రంలోని శ్రీ నృసిమ్హసరస్వతి స్వామీ వారు ఈ పిశాచ బాధలని నివారిస్తూ ఉంటారని,
ఉన్నత స్థాయిలో ఉన్నదత్త సాధకులకు సాక్షాత్తు
దత్త మహాప్రభు తన నోరు పెద్దగా చేసి భూత ప్రేత పిశాచాలను మింగివేస్తూ ఉంటారు అని. ఆ
విధంగా వారు పిశాచత్వాన్ని పోగొడుతూ ఉంటారని
తెలుస్తూ ఉంది. ఈలోగా పల్లకి ఉత్సవం ప్రారంభం కాబోతోంది. నేను ఆలయం అరుగు మీద కూర్చుని
తదేకంగా అటే చూస్తున్నాను. పల్లకి సిద్ధంగా
ఉంది, దాని ముందు ఇద్దరు వ్యక్తులు రెండు ప్రభలను పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో
వారిలో ఒకతను నా దిశగా చూసి రమ్మని సైగ చేసారు.
నేను వెంటనే నా వెనక్కి తిరిగి ఎవరిని పిలుస్తున్నారా అని చూస్తున్నాను.
అపుడు మా అబ్బాయి
మిమ్మల్నే పిలుస్తున్నారు అని చెప్పాడు. అప్పటికి నేను అతి కష్టం మీద శ్రద్దగా పారాయణం
పూర్తి చేయటం జరిగింది. నేను వెంటనే ఆ వ్యక్తి దగ్గిరకి వెళ్ళగా అతను నా చేతికి ఆ ప్రభను
నాకు ఇచ్చాడు, నేను సంబ్రమాశ్చర్యాలతో ఆ పల్లకి ముందు నడుస్తుండగా పల్లకి మా వెంట రాసాగింది.
నేల మీద చాలామంది భక్తులు సాష్టాంగ దండ ప్రణామాలతో పడుకుని ఉన్నారు. వాళ్ళందరిని దాటుకుంటూ
2 ప్రదక్షిణాలు చేయడం, ఆ తరువాత నాకు పల్లకిలో ఉన్న స్వామివారిని స్పర్శించాలని అనిపించింది.
వెంటనే నా పక్కన అతను నన్ను అదే మాదిరిగా చెయ్యమని సలహా ఇచ్చాడు. నేను, మా అబ్బాయి
స్వామి వారి పాదాలకు నమస్కారం చేసుకున్నాము.
నాకిది ఒక అద్భుతమైన లీల, చాలా మాములుగానే జరిగినట్లుగా అనిపించింది.
నేను నా శారీరక
బాధలని అధిగమించి, ఎంతో ఆర్తితో గురుచరిత్ర పారాయణం పూర్తిచేయటం, దాని అనుగ్రహ ఫలంగా
స్వామి వారి పల్లకి సేవలో పాలుపంచుకోవటం ఒక మరువలేని అనుభూతి. ఇలాగే చాలాసార్లు దత్త
మహా ప్రభు ఇలాంటి పరీక్షలు మనకి పెడుతూ ఉంటారు.అవన్నీ కూడా చివరకి వారి అనుగ్రహఫల సంప్రాప్తికే
అని తరువాత తెలుస్తుంది. ఒక్కొక్కసారి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో కాలం పూజించినా
కూడా ఫలితము కనిపించదు, అటువంటప్పుడు మనకి తెలియని ఒక సంసాయత్మక స్థితిలో ఉండిపోటాము.
దానికి కారణాలు మనకి తెలిసిరావు, దానికి తార్కాణము మనము ముందు చెప్పుకుందాము.