Part - 3
ఒక ఆదివారం నేను ఒక్కడినే దగ్గరలో ఉన్న బీచ్ కి వెళ్ళాను. కాసేపు ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో గాడంగా ఉన్నప్పుడు నాకు మరల అయస్కాంత పురుషుడు అంతర్నేత్రానికి కనిపించాడు. నా శరీరమంతా ఆనంద తరంగాలలో మునిగిపోయింది. మనసుకి ఎంతో హాయిగా తరంగాలు లేనటువంటి సరస్సు మీద పూర్ణ చంద్రుని కాంతి పడుతున్నట్లుగా హాయిగా అనిపించింది. ఆయన నవ్వుతూ నన్ను స్పృశించారు. నేను నాకు తెలియని ఒక మత్తులో ఉండిపోయాను. శరీరమంతా దూదిపింజలాగా తేలిక అయ్యింది. ఏదో దివ్యానుభూతి నా శరీరాన్ని, మనసుని నింపివేసింది. "భయం లేదు, కళ్ళు తెరు" అని ఆయన ఎంతో మృదువుగా చెప్పారు. నేను కళ్ళు తెరిచేసరికి నేను ఆకాశంలో తేలిపోతున్నాను. ఎందుకో నాకు ఎటువంటి భయం కలగలేదు.
కింద సముద్రతీరం కొద్దిగా దూరంగా కనిపించసాగింది. కాసేపటికి, ఎంతసేపు అయ్యిందో తెలియదు కాని బాహ్య స్థితికి వచ్చాక మేము ఎంతో అందమైన, ఎత్తైన పర్వత శిఖరాల మీద ఉన్నాము. చుట్టూ ప్రకృతి అంతా ఎంతో అందంగా, పెద్ద పెద్ద చెట్లు, పచ్చటి గడ్డి మైదానం, అందమైన పక్షులు, వర్ణించలేనటువంటి మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. ఆ
అందమైన ప్రకృతి ఒడిలో మెత్తటి గడ్డి మీద ఆయన నన్ను కూర్చోమన్నారు.
ఆయన నవ్వుతూ "నాకు తెలుసు, నన్ను కలిసిన తరువాత నీకు ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ప్రతి రోజు వెంటాడుతున్నాయి. ముందుగా ఈ పానీయం తీసుకో" అని ఆయన చెయ్యి చాచగానే ఆయన చేతిలో ఒక బంగారు పాత్రలో ఒక పానీయం ప్రత్యక్షమయ్యింది. దానిని నాకు అందించారు. అది తాగగానే నాలో ఒక నూతన ఉత్తేజం కలిగింది. శరీరమంతా వెచ్చగా అనిపించింది. నేను ఎంతో వినయంగా ఆయనని "మహాత్మా మీరు నాకు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యంగా నమ్మశక్యం కాకుండా ఉన్నాయి. అయితే నేను చూసిన సిద్ధులు, యోగులు, మహర్షులు మానవాళి కోసం అంతగా పాటు పడుతున్నారా? ఇటువంటి ఆధ్యాత్మిక సమావేశాలు
తరచూ జరుగుతూ ఉంటాయా? కొంచెం వివరంగా చెప్పండి" అని ప్రశ్నించాను.
దానికి "నాయన ఎందరో మహాత్ములు విశ్వమానవ
శ్రేయస్సు కోసం చాలా పాటుపడుతుంటారు. మాకు కాలము, దేశము అనే భేద భావం ఉండదు. ఎందుకంటే మా కాంతిమయ శరీరం పరిశుద్దమైనది. ఈ సృష్టిలోని చరాచర ప్రాణులతో, పంచతత్వాలతో, పంచభూతాలతో, వాటిలోని బ్రహ్మ పదార్థముతో అది సాయుధ్యము పొందింది. మేము భూత వర్తమాన, భవిష్య కాలాలను మరియు దేశము ఒకటిగా దర్శించగలము"
అని ఆయన నా భ్రుకుటిని
తాకారు.
"అంతా నువ్వే చూద్దువు కానిలే, అన్ని నీకే అర్థం అవుతాయి" అని చెప్పారు.
ఆశ్చర్యంలో ఆశ్చర్యం, నాకు ఎదురుగుండా ఒక అద్భుతమైన సన్నివేశం కనిపించింది. ఎత్తైన మంచులో కప్పబడిన పర్వత శిఖరాలు, పెద్ద లోయలో ప్రవహించే నది, చూస్తుంటే అది గంగా నది అని నాకు తెలుస్తోంది, అవి హిమాలయా పర్వతాలు. ఆ
ప్రదేశమంతా నాకు ఎంతో పరిచయం ఉన్నట్లు ఉంది. అక్కడ ఒక మహా పురుషుల సమావేశం జరుగుతోంది.
మహర్షులు మానసికంగా పంపించే భావప్రసారాల స్థాయికి నేను చేరుకున్నాను. అందరు ఎంతో అద్బుతమైన
కాంతిమయ శరీరాలతో విరాజిల్లుతున్న తేజస్సుతో కనిపించారు. ఆ సమావేశంలో విశ్వామిత్ర మహర్షితో పాటు వసిష్టుల వారు కూడా కనిపించారు. వారిద్దరి అధ్యక్షతన
ఈ సమావేశం జరుగుతున్నట్లు నాకు తెలిసింది. అది హిమాలయా పర్వతాలలోని ద్రోణగిరి
ప్రాంతం అని నేను గ్రహించాను. వసిష్టుడు, విశ్వామిత్రుడు,
జమదగ్ని, పరశురాముడు, యజ్ఞవల్కుడు, పిప్పలాదుడు, చరకుడు, భారద్వాజుడు, బుద్ధుడు, ఇంకా గ్రహాంతర వాసులు, నక్షత్రమండల వాసులు కొందరు సమావేశంలో పాల్గొన్నారు.
విశ్వామిత్రుడు అందరిని ఉద్దేశించి "ప్రస్తుతం ఈ
విశ్వంలోని పరిస్థితులు ముఖ్యంగా భారతదేశంలోని రాజకీయ, సామాజిక, నైతిక పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. దుష్టశక్తుల విజ్రుమ్బన ఎక్కువయ్యింది. మనుషులందరూ కూడా ప్రకృతి శక్తులను కృత్రిమంగా మారుస్తూ వారి వినాశనమే కాకుండా వేరే గ్రహ వాసులకు కూడా ఎంతో హాని కలుగ జేస్తున్నారు. మంచివారు, సంస్కారవంతులు దుర్భలులచే పీడించబడుతున్నారు.
మనమంతా మన తపశ్శక్తి దారాలతో చాలా మటుకు పరిస్థితులను చక్క పెట్టాము కాని అది ఇంకా సరిపోదు ముఖ్యంగా మనుష్యుల భావ కాలుష్యం వారి మనుగడకే ముప్పు తెస్తున్నది. చెడుని మంచిగా చూపించే ప్రయత్నాలు, దేశాన్ని పరిపాలించే నాయకులు ఎంతో అందముగా చిత్రీకరిస్తున్నారు. మన భారతీయ సంస్కృతి సంస్కారములు, మానవ జాతి విలువలు పరస్పరంగా ఉండవలసిన ప్రేమ, గౌరవము, మర్యాద అన్ని అడుగంటి పోయి వాటి బదులుగా హింస, రాగ ద్వేషాలు, అసూయ ఇంకా అనేక విపరీత పరిణామాలు విజ్రుమ్భిస్తున్నాయి.
మనకి మనందరి పని నిస్వార్ధంగా చేసే కాంతిమయ శరీరధారులు చాలా అవసరము.
వీరందరూ ఇప్పటికే పలు ప్రాంతాలలో, దేశాలలో జన్మలు ఎత్తి ఎంతో మంది వారిలోని కాంతిని చాలామందికి ప్రసరింపచేసి భావ కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. యజ్ఞవల్క మహర్షి గారు చేసే యజ్ఞ ప్రక్రియ ద్వారా విశ్వంలో వారు ప్రసరించే యజ్ఞ తరంగాలు నిరంతరం యజ్ఞాలు చేసే వారి యొక్క పూర్వ జన్మ సంస్కారాలను తట్టి లేపుతున్నాయి. దాని వలన ఎంతో మంది యజ్ఞ యాగాదులు, క్రతువులపై ధ్యాస మళ్ళించారు. ఆ మహర్షి మంత్ర యుక్తంగా చేసే యజ్ఞాల ద్వారా వారు పంపించే భావ స్పందనలు పూర్వ
జన్మలలో ఎవరైతే యజ్ఞ యాగాదులలో చేయించారో, యజ్ఞాల పట్ల ఆసక్తి చూపించారో ఆ యొక్క పూర్వ జన్మ వాసన కలిగి ఉన్నవారిని
చేరుతాయి. అందుకనే ఈ యజ్ఞ ప్రక్రియని ముఖ్యంగా భరతవర్షంలో చాలామంది యజ్ఞ యాగాల ద్వారా మానవాళి పురోగతికి
దోహదపడుతున్నారు. అలాగే మిగత మహర్షులందరూ కూడా వారి వారి సాధనల ఫలితాన్నంత ఈ
మానవాళికి ధారపోస్తున్నారు.
ఈలోగా నాకు మెలకువ వచ్చింది. చూస్తే నేను బీచ్ లో
ఎక్కడున్నానో అక్కడ ధ్యాన స్థితిలో మేల్కొన్నాను. అయస్కాంత పురుషుడు నా వైపు
చూస్తూ చిరునవ్వుతో "నీకు సమాధానాలు బదులు ఇంకా ఎక్కువ ప్రశ్నలు
ఉదయిస్తున్నాయి. వాటి అన్నింటికీ సమాధానాలు తగిన సందర్భంలో తెలుస్తాయి.
ప్రస్తుతానికి నువ్వు చూసింది చాలు".
నేను వారిని ఇలా ప్రశ్నించాను
"మహాత్మా నాకు ఎటువంటి విషయ పరిజ్ఞానం లేనప్పటికీ మహర్షులు పంపించే మానసిక
భావ ప్రసారాలను ఏ విధంగా అర్థం చేసుకున్నాను. అది హిమాలయ పర్వతాలని నాకు ఎలా
తెలిసింది? దయ చేసి వివరించండి".
అప్పుడు ఆయన నవ్వి "నీవు భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి అధిపతిని అయిన నా
సన్నిధిలో ఉన్నావు. నీలోని ఆధ్యాత్మిక స్థాయి చాల పెరిగినది. నీ యొక్క అయస్కాంత
క్షేత్రం మెల్ల మెల్లగా పరిశుద్ధం చెందినది. మనుష్యులలో ఉండే విజ్ఞానము వారి యొక్క
పూర్వ జన్మ అనుభవాలు, వాసనలు అన్ని కూడా అచేతన ప్రాణ శక్తిలో ఉంటాయి. అది వ్యక్తమయినప్పుడు పరా,
పశ్యన్తి, మధ్యమ, వైఖరి, వాక్కు ద్వారా
బహిర్గతమవుతాయి. ఈ ప్రాణ శక్తీ కూడా అయస్కాంత శక్తే సుమా.మామూలు మనుష్యులందరికి
స్థూల వాక్కు ద్వారానే ఆలోచనలు, విషయ పరిజ్ఞానం కలుగుతాయి. ఎవరికైతే వారిలోని అయస్కాంత క్షేత్రం సమంగా ఉంటాయో
వారు అవ్యక్త స్థితిలోని ఆలోచనలు కూడా వినగలుగుతారు. అందువలననే నువ్వు వారి యొక్క
మానసిక భాషను అర్థం చేసుకోగలిగావు, వారి యొక్క కాంతిమయ శరీరాలు శ్రమ లేకుండా చూడగలిగావు.
మహాత్మా "ఇటువంటి ఆధ్యాత్మిక సమావేశాలు తరచూ
జరుగుతూ ఉంటాయా'? ఆయన దానికి సమాధానంగా "మహాత్ములందరూ కూడా వారి
శ్రేయస్సు కన్నా మిగతా వారి శ్రేయస్సునే మొదటగా భావిస్తారు. అందుకనే ఈ భూమండలం మీద
తరచూ ఇటువంటి ఆధ్యాత్మిక సమావేశాలు జరుగుతూ
ఉంటాయి. దక్షిణ పథంలో అగస్త్య మహర్షి ఆధ్వర్యంలో గోబీ ఎడారులలో, హిమాలయాలలో, శంబల గ్రామంలో, పంచదేవ పహాడ్ లో శ్రీ పాద శ్రీ వల్లభుల వారి
ఆధ్వర్యంలో ఇంకా అనేక పుణ్యమయిన ప్రదేశాలలో ఇటువంటి ఆధ్యాత్మిక సమావేశాలు జరుగుతుంటాయి.
మీరనుకున్నట్లుగా మహర్షులు ముక్కు మూసుకుని ఏవో అరణ్యాలలో తపస్సు చేసుకుంటారని,
కాషాయ వస్త్రాలు, గెడ్డలు, మీసాలు, రుద్రాక్షలు
ధరిస్తారని అనుకోవడం వాస్తవం కాదు. వాస్తవం ఏమిటంటే వారు నిరంతరం మనుష్యుల యొక్క
మానసిక ప్రవృత్తులను, రాజ్యాన్ని పరిపాలించే రాజకీయ నాయకులను, సామాజిక పరిస్థితులను గమనిస్తూ సర్వమానవ శ్రేయస్సు కోసమే అహర్నిశలు
పాటు పడుతూ ఉంటారు. అందుకని పూర్వం చక్రవర్తులందరికి రాజ్యదికారులందరికి మహర్షులు
ప్రధాన రాజ పురోహితులుగా ఉండేవారు. వారి ఆదేశాల ప్రకారం రాజులు వారి రాజ్యాన్ని,
ప్రజలను చక్కగా పరిపాలిస్తూ
ఉండేవారు. నువ్వు గమనించే ఉంటావు, వారంతా కూడా ఎంత ఆవేదనతో, ఆర్తితో మీ అందరి గురించి ఎంతగా మదనపడుతున్నారో!
ఇంకా ముందు ముందు చాలా
విషయాలు సాధ్యమయినంత సరళంగా చెప్పడానికి ఎందఱో మహాత్ములు నీకు దర్శనం ఇస్తారు.
నువ్వు మాత్రం రోజు వారి చేసే ధ్యానం జపం మానొద్దు" అని చిరునవ్వుతో మెల్లగ
అదృశ్యం అయిపోయారు.నేను మామూలు పరిస్థితికి వచ్చేసరికి దాదాపుగా ఒక 2
గంటలు పట్టింది. మళ్లీ
మామూలు ప్రపంచానికి వచ్చాను, నా దినచర్య యధా రీతిగా సాగిపోయింది.