Part – 7
రోజులు
మరలా యాంత్రికంగానే గడుస్తున్నాయి. నేను నా వృత్తిపరంగా జరిగే కార్యక్రమాలలో మునిగిపోయాను.
కాని ఒక వైపు గురుచరిత్ర, సాయి సచ్చరిత్ర, శ్రీ దత్తదర్శనం మొదలగు గ్రంధాల పారాయణం
నిత్యకృత్యంగా చేస్తున్నాను. నాకు కలుగుతున్న నమ్మశక్యం కాని అనుభవాలు, దాని వల్ల నాలో
కలుగుతున్న ఆధ్యాత్మిక పరిణామాల ప్రభావం గురించి ఒక అంతర్మధనం, ఆత్మ విశ్లేషణ, ఆత్మ
విమర్శ మొదలయ్యింది. నేను ఉన్న ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. ఇంటి ముందు, వెనుక చుట్టుతా
ఖాళీ ప్రదేశం ఉంది. ఇక్కడి వాతావరణంలో మొక్కలు చాలా సహజంగా ఎటువంటి కృత్రిమ రసాయనిక
ఎరువులు లేకుండానే పెరుగుతూ ఉంటాయి. ఇక్కడి ఆఫ్రికాన్స్ చాలా చక్కగా మన దేశపు వంటలు
చెయ్యడమే కాకుండా ఇంటి పని కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. నాకు చిన్నప్పటి నుండి
కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతి శని,
ఆది వారాలలో బుద్ధదేవుని ఆలయానికి మరియు అక్కడ ఉన్న గుడిలో జరిగే సత్సంగాలకి తప్పకుండా
వెడుతూ ఉండేవాడిని.
అక్కడే ఒకసారి గుడిలో అశ్విన్ గణత్ర అనే గుజరాతి మిత్రుని కుటుంబంతో
పరిచయం ఏర్పడింది. నేను ఆఫ్రికా రాకముందు నాకు పరిచయమున్న షిరిడి సాయి బాబాని ఆరాధించే
స్వామీజీ వారి ఆదేశం ప్రకారం రేఖి మరియు ప్రాణిక్ హీలింగ్ చికిత్స విధానాలు అభ్యసించాను.
కాని ప్రత్యేకంగా ఎవరికీ కూడా ఈ చికిత్స చేయ్య్డడం జరగలేదు. నాకు ఈ విద్యలో ప్రవేశం
ఉందని కూడా ఎవ్వరికి ఇంతవరకు చెప్పలేదు. మాటల సందర్భంలో అశ్విన్ గారి పెద్దమ్మాయికి
ఆరోగ్యం సరిగా లేదని చాలా రకాల చికిత్సలు చేయించారని, కాని ఫలితం లేకపోయిందని చెప్పారు.
అప్పుడు వారి అమ్మాయి శేజల్ ని చూస్తే నాకు చాలా బాధ కలిగింది. నేను ఆ అమ్మాయికి నా
చికిత్స ద్వారా సహాయం చేస్తానని చెప్పగా వారు ఎంతో సంతోషించారు. వారితో చాలా ఆధ్యాత్మిక
విషయాలు గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఒక శనివారం అశ్విన్ గారు నా ఇంటికి వచ్చి
వారి కారులో నన్ను వారి ఇంటికి తీసుకు వెళ్లారు.
ఊరికి దూరంగా ఒక ప్రశాంత ప్రదేశంలో ఉంది వారి ఇల్లు.
అది ఒక విశాలమైన భవంతి. మూడు అంతస్తులు ఉంటుంది, చుట్టూరా ఉద్యానవనం, ఆహ్లాదకర వాతావరణం.
మేము వారి ముందు గదిలో సోఫాలో కూర్చుని ఏవో ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము.
ఇంతలో వారి ఇంటిలో నాకు ఒక అందమయిన తెల్లటి పిల్లి కనిపించింది. అది ఒక మంచి జాతి పిల్లి
అని తెలుస్తూనే ఉంది. మేము మా ధోరణిలో ఉండగా, దూరంగా వెళుతున్న ఆ పిల్లి, దాని పేరు
స్వీటీ కాబోలు మెల్లి మెల్లిగా నా దగ్గరకు రాసాగింది.నేను దానిని పెద్దగా పట్టించుకోలేదు.
అంతలో ఆ పిల్లి ఒక్కసారిగా యెగిరి నేను కూర్చున్న
సోఫా మీద కూర్చుంది. అప్పుడు నేను మొదట కొంచెం గాభరా పడ్డ వెంటనే తమాయించుకున్నాను.
అది మెల్లిగా నా ఒళ్లో కూర్చుని హాయిగా ఒళ్ళు విరుచుకుని పడుకుంది. అశ్విన్ గారి కుటుంబ
సభ్యులంతా చాల ఆశ్చర్య పడ్డారు. ఇన్నాళ్ళలో ఎంతో మంది వచ్చి వెళుతున్న కూడా ఈ పిల్లి
ఎవ్వరి దగ్గరికి వెళ్ళేది కాదుట. నాకు ఆ పిల్లి పడుకున్నందు వాళ్ళ చాల చక్కిలిగింతలుగా
అనిపించింది. మనసులోనే వెళ్లి రా అని ఆ పిల్లికి ప్రేమపూర్వకంగా వెళ్ళమని సూచనలు ఇస్తూ
పోయాను. కాసేపటికి ఆ పిల్లి నా ఒళ్లోంచి లేచి వెళ్ళిపోయింది. ఆ తరువాత మళ్లి మేము మా
చర్చలలో మునిగిపోయాము.
భోజనాలు చేసాక సాయంత్రము శేజల్ కి ఒక గంట పాటు చికిత్స చేసాక
రాత్రి భోజనం చేసి మేడ మీద ఉన్న నా గదిలోకి ప్రవేశించాను. అశ్విన్ గారి ఇంట్లో ఇంకొక
పిల్లి ఉందని, అది పూర్తిగా నల్లగా ఉంటుందని, కొంత కోపస్వభావం కలదని చెప్పారు. ఆ రోజు
రాత్రి నేను ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండగా నా మంచం పక్కన ఏదో కొద్దిగా అలికిడి వినిపించింది.
నేను అటు చూసేసరికి వారు చెప్పిన ఆ నల్ల పిల్లి, దాని పేరు నాటీ అంట అది కనిపించింది.
అది మంచం దగ్గర అటు ఇటు తిరిగి నా మంచం మీదకు ఒక్క ఉదుటన ఎగిరి కూర్చుంది. దాని గురించి
ముందే తెలిసిన నేను కొన్ని క్షణాలు భయపడ్డాను. నాకు లామగారు చెప్పిన విషయాలు గుర్తుకు
వచ్చాయి. నేను ప్రేమ పూర్వకమయినటువంటి భావాలను ఆ పిల్లికి ప్రసారం చేసాను. నువ్వంటే
నాకెంతో ఇష్టం , నేను నిన్ను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను మనిద్దరం మంచి మిత్రులం
అని మానసికంగా చెప్తూ పోయాను. అది ఒక్కసారిగా ఎగిరి నా పొట్ట మీద పడుకుంది. మళ్లీ నాకు
కితకితలు మొదలయ్యాయి. మరల నేను దానికి ప్రేమ
పూర్వకమయినటువంటి సూచనలు ఇవ్వడం, ఆ తరువాత ఆ పిల్లి బయటకి దూకి వెళ్ళిపోవటం జరిగింది.
అప్పటి నుండి వారింటికి ఎప్పుడు వెళ్ళిన ప్రతి సారి కూడా స్వీటీ తప్పకుండ కాసేపు నా
ఒళ్లో పడుకుని ఒక 4,5 నిమిషాలు తరువాత వెళ్ళిపోయేది. అందుకని నా ఒళ్లో ఒక తలగడ పెట్టుకునే
వాడిని నాకు కితకితలు రాకుండా.
లామ గారిని కలిసాక
ఆయన చెప్పిన విషయాలు ముఖ్యంగా ప్రేమతత్వాన్ని గురించి, అది ఎదుట వారిలో తెచ్చే మార్పులు
గురించి విన్నాక, ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ఇక్కడ ఆఫ్రికాలో
కుక్కల కన్నా పిల్లులు ఎక్కువ కనపడతాయి. నాకు ఒక రకమయిన ఆలోచన వచ్చింది. ప్రతి సారి నేను నా వంటిల్లు గది
తెరిచినపుడు ఎదురుగుండా ఒక పెద్ద నల్ల పిల్లి కనిపిస్తూ ఉండేది. అది నన్ను చూడగానే
క్షణంలో పారిపోయేది. నేను ఆ పిల్లికి మానసికంగా ప్రేమ పూర్వకమయినటువంటి భావాలను ప్రసారం
చెయ్యడం మొదలుపెట్టాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ, మిత్రత్వం ఉన్నాయి. దయచేసి
నా ఆతిధ్యం స్వీకరించు, నిర్భయంగా నా ఇంట్లోకి రా అని పొద్దున్న సాయంత్రం ఈ ప్రక్రియ
చేస్తుండే వాడిని.
ప్రతి రోజు వంటింటి తలుపు తెరవడం, ఆ పిల్లి, దానితో
పాటు ఒక పిల్లి కోన నన్ను చూసి భయపడి పారిపోవడం జరుగుతూ ఉండేది. ఒక 4,5 రోజులు అయ్యాక
అవి వెంటనే పారిపోకుండా కొన్ని క్షణాలు ఆగి నన్ను తేరిపార చూసి వెళ్లి పోయేవి.ఇలా ఒక
10 రోజులు గడిచాక పిల్లి కూన అక్కడే నిలబడి చూస్తుండేది. ఒక రోజు నేను వంటింటి తలుపు
తెరిచేసరికి నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగించే విధంగా పిల్లి కూన నిర్భయంగా లోనికి వచ్చింది.
నేను ఇచ్చిన పాలు తాగి మ్యావ్ మ్యావ్ అంటూ నా వెనుక తిరగసాగింది. మరుసటి రోజు తల్లి
కూడా నిర్భయంగా, నిస్సంకోచంగా నా ఆతిధ్యం స్వీకరించడానికి లోనికి వచ్చింది. ఆ రోజు
నుండి నాకు అవి మంచి మిత్రులుగా మారిపోయాయి. లామా గారు చెప్పినటువంటి ప్రేమ అనే శక్తి
ద్వారా జంతువులనే మనం మార్చగలిగినపుడు మరి మనుషులను ఎందుకు మార్చలేకపోతున్నాం. మరి
పిల్లి స్వతాహాగా సాదు జంతువే కాబట్టి దాన్ని చేరదీయడం అంత గొప్ప విషయం ఏమి కాదు కదా.
నిజంగా భయంకరమైన అడవి జంతువుని మనం ప్రేమ శక్తితో జయించ వచ్చునా? దానిలోని క్రూరత్వాన్ని
ప్రేమగా మార్చగలమా? అని ఆలోచన నాలో మొదలయ్యింది. మన మనస్సు ఒక సందేహాల పుట్ట. ఒక విషయం
మన అనుభవంలోకి వచ్చినా మళ్లీ ఎన్నో సందేహాలు దానిలోంచి కలుగుతాయి.
నేను ఒక రోజు రాత్రి
అప్రయత్నంగా నిద్రలేచాను. బయట వెన్నెల పిండారపోసినట్టుగా ఉంది. ఏమి తోచక ముందు గదిలోకి
వెళ్లి సోఫాలో కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాను. నా కళ్ళ ముందు ఏదో దివ్యమైన
కాంతి ఉన్నట్లుగా అనుభూతి కలిగి కళ్ళు తెరిచేసరికి ఎదురుగుండా దివ్యమైన తేజస్సుతో కాంతి
మయ శరీరంతో ఒక అందమయిన స్త్రీ మూర్తి కనిపించింది. ఆమె ప్రాణమయ శరీరంలోని విద్యుత్
కణాలు ఎంతో వేగంగా కదులుతున్నాయి. నేను ఆ కాంతిని తట్టుకోలేకుండా ఉన్నాను. ఆవిడ నా
వైపు చిరునవ్వుతో చూస్తూ "నీ పరిస్థితి గమనించాను, కాబట్టి నేను నీకు మామూలుగానే
కనిపిస్తాను అని తన ప్రకంపనాలను తగ్గించివేసింది. నీకు ఈ మధ్య జరిగిన అనుభవాలు, నువ్వు
పిల్లులతో చేస్తున్న ప్రయోగాలు నీలో కలుగుతున్న సందేహాలు అన్ని నేను గమనించాను. ఈ సందేహాలకి
సమాధానాలు చెప్పటానికే నేను వచ్చాను. ఈ విశ్వమంతా ఒక పరిశుద్ధమైన బ్రహ్మ పదార్థము,
దానిలో బ్రహ్మ చైతన్యముతో నిండి ఉంది. ఈ సకల సృష్టిలో అనగా భూమి, కొండలు, చెట్లు, క్రిమికీటకాలు
మానవులు మొత్తం సృష్టి అంతా కూడా వివిధ పరిణామాలతో మరియు చైతన్య స్థాయితో నిండి ఉంటాయి.
ఈ సృష్టి అంతా కూడా పరస్పర సంబంధాలతో అనుసంధానం చేయబడింది. ఈ బ్రహ్మ పదార్థాన్ని మనము
ప్రాణంగా చెప్పుకుంటాము. దీనిలో పురుష ప్రకృతిలో శక్తి పరంగా కలిసి ఉంటాయి. శక్తి జడంగా
ఉన్నపుడు బయట జడంగా కనిపిస్తున్న దానిలోపల శక్తి వాటి కక్ష్యలలోనే ఉన్నపుడు దానిని
అవ్యక్తస్థితి అంటారు.
నీ సందేహాలకి సమాధానంగా
నా కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంబించింది. నేను ఒక సాధారణ కుటుంబంలో
ఒక చిన్న గ్రామంలో నా తల్లిదండ్రులతో పాటు నివసిస్తూ ఉండేదాన్ని. మా గ్రామం చుట్టు
పక్కల అంతా కూడా చాల పెద్ద అడవి ఉండేది. అక్కడ చాలా సాదు జంతువులు, క్రూర జంతువులు
విహరిస్తూ ఉండేవి. నేను మా అమ్మ నాన్నలకు ఒక్కర్తే కూతుర్ని కావడం వల్ల చాలా గారాబంగా
పెంచారు. వ్యవసాయం చేసుకుంటూ, ఆవులను పెంచుకుంటూ,
పంట మీద వచ్చే ధాన్యం, ఆవు పాలమీద వచ్చే డబ్బుతో మేము చాలా సంతృప్తిగా జీవించే వాళ్ళం.
నాకు యుక్త వయస్సు వచ్చేసరికి నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మా బంధువులలో
ఒకడికి ఇచ్చి నా పెళ్లి జరిపించారు నా తల్లిదండ్రులు. మేము ఇద్దరం ఎంతో సంతోషంగా, ఆనందంగా
అడవులలో తిరుగుతో కాలం గడపసాగము. మేము ఇద్దరం ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరం ఉండే
వాళ్ళం కాదు.
ఇలా కాలం గడుస్తుండగా ఒక
పెద్ద అవాంతరం వచ్చింది. మా దేశాన్ని పరిపాలించే రాజుగారికి మా ప్రక్కనే ఉన్న రాజుతో
వైరం మొదలయ్యింది. దానితో రాజుగారు మా దేశంలో ఉన్న యువకులందరినీ దేశ రక్షణ కోసం తమ
సైన్యంలో చేరాలని ఆజ్ఞ జారీ చేసారు. నా భర్త నన్ను విడిచి తప్పనిసరి పరిస్థితులలో సైన్యంలో
చేరడానికి వెళ్ళిపోయాడు.నేను ప్రతి రోజు అతనినే తలుచుకుంటూ ఎంతో ఆత్రుతగా యుద్ధం ఎప్పుడు
అయిపోతుందా, నా భర్త తిరిగి ఎప్పుడు వస్తాడ అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇలా 1 సంవత్సరం
గడిచాక నా భర్త యుద్ధం పరిసమాప్తం కావడంతో మా ఊరికి వచ్చేసాడు. నేనెంతో ఆత్రుతగా ఆనందంగా
ఆయన దగ్గిరికి వెళ్ళాను.కాని అతనిలో చాలా మార్పు వచ్చిందని గ్రహించాను. ఒక విధమయిన
ఉదాసీనత, నిరుత్సాహం, అనాశక్తి అతనిలో గమనించాను. నన్ను, నా ప్రేమను కూడా పట్టించుకోని
స్థితిలో ఉండిపోయాడు. నేను ఎన్నో రకాలుగా అతనిని మార్చే ప్రయత్నం చేసాను, కాని ఫలితం
కనపడలేదు. నా పరిస్థితిని గమనించిన ఒక పెద్దావిడ నాకొక సలహా ఇచ్చింది. ఇక్కడికి ఉత్తర
దిక్కున ఒక 5 మైళ్ళ దూరంలో ఒక గుట్ట ఉంది. అక్కడ ఒక మహా యోగి ఉన్నారు, ఆయన దర్శనం చేసుకో
ఆయన నీ జీవితంలో మళ్లి సుఖశాంతులు నింపుతారు. ఎంతో మంది వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు,
వారి సమస్యలన్నీ తీరుతున్నాయి. నువ్వు కూడా వెళ్ళు అని చెప్పింది.
ఆమె సలహా
ప్రకారంగా నేను ఒక బుట్టలో పాలు, పళ్ళు తీసుకుని తెల్లవారు ఝామునే లేచి నెత్తి మీద
బుట్ట పెట్టుకుని ఆ కొండ ప్రాంతానికి బయలుదేరాను. మా తల్లిదండ్రులు నన్ను వెళ్ళద్దు
అని ఎంతో వారించారు, ఎందుకంటే వెళ్ళే దారిలో ఎన్నో క్రూర మృగాలు, విష సర్పాలు ఉంటాయని
ఒంటరిగా వెళ్లకూడదని నానా విధాలుగా చెప్పిచూసారు. నేను మాత్రం నా పట్టుదల వదలలేదు.
ఆ కొండ మీద ఉన్న యోగిని దర్శనం చేసుకుని ఆయనకి నేను తెచ్చిన పాలు, పళ్ళు సమర్పించుకున్నాను.
ఆ మహాత్ముడు నా వైపు చూసి "ఏవమ్మా నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఈ భీకరమైన అరణ్యంలో
ఎలా వచ్చావు, నీకు భయం వెయ్యలేదా? సాధారణంగా నా దగ్గరికి జనం గుంపులుగా వస్తారు మరి
నువ్వు ఒక్కదానివే వచ్చావే" అని ప్రశ్నించారు. “మహాత్మా మీరు అడిగేవరకు నాకు ఏది
కూడా స్ఫురణలో లేదు. నా ధ్యాస అంతా కూడా నా భర్త మీదే ఉంది” అని నా పరిస్థితి ని వివరించాను.
అందుకు ఆయన అమ్మ నీ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను. దాని వాళ్ళ నీ భర్త ఇదివరకు లాగే
మళ్లీ నీతో అన్యోన్యంగా ఉంటాడు. కాని నేను చెప్పే పరిష్కారానికి నువ్వు చాలా సాహసం
చెయ్యాలి, నీకు ఆ ధైర్యం ఉందా" అని ప్రశ్నించారు. "ఇక్కడ గుహలలో పెద్ద పులులు
తిరుగుతూ ఉంటాయి. అందులో ఒక పెద్దపులి మీసపు వెంట్రుక నువ్వు తీసుకురాగలిగితే నేను
నీ సమస్యకు పరిష్కారం చెప్తాను, ముందు నువ్వు అది తీసుకురా" అని నన్ను పంపించారు.
నేను ఆ
దగ్గరలో ఒక కొండగుహలో ఒక ఆడపులి ప్రసవించిందని మా గ్రామస్తుల ద్వారా విని వున్నాను.
ఎవరికి చెప్పకుండా ఒక గంపలో పాలు తీసుకుని అతికష్టం మీద ఆ పులి ఉన్న గుహని కనిపెట్టి
మెల్లగా ఆ గుహ మొదలుకి చేరుకున్నాను. ఆ గుహ లోపల ఒక ఆడపులి పిల్లలకి పాలు ఇస్తూ నిశ్చింతగా
కూర్చుంది. అలికిడి విని నా వైపు దృష్టి సారించింది. నేను మనసులోనే "తల్లి నీ
మీద చాలా ప్రేమతో ఎంతో దూరం నుంచి వచ్చాను, నీ పిల్లలకి ఆహారంగా పాలు తెచ్చాను. నా
సమస్యకి పరిష్కారం నీ దగ్గిరే ఉంది నన్ను అనుగ్రహించు" అని మనసులో పదే పదే అనుకుంటూ
నేను తెచ్చిన పాలని మట్టి పాత్రలో పోసి దూరంగా వెళ్ళిపోయాను. ఇలా ఒక 15 రోజులు జరిగాక
ఆ పెద్దపులి మెల్లగా నేను ఉండగానే వాటి పిల్లలతో నేను పెట్టిన పాలు తాగడం మొదలుపెట్టింది.
ఇలా ఒక నెల రోజులు అయ్యాక వాటి పిల్లలు నా దగ్గిర నిస్సంకోచంగా తిరగడం మొదలుపెట్టాయి.
ఒక 2నెలలు గడిచేసరికి ఆ పులికి నాకు ఎంతో స్నేహబంధం ఏర్పడింది. దాని వొళ్ళు నిమురుతూ
ప్రేమగా సంభాషణ మొదలు పెట్టేదాన్ని. వొల్లంత శుభ్రం చేసేదాన్ని. ఒక రోజు ధైర్యంగా ఆ
పెద్దపులితో "తల్లి నీ మూతిమీద ఒక వెంట్రుక నాకు కావాలి" అని ప్రేమపూర్వకంగా
అర్థిస్తూ నేను తెచ్చిన కత్తెరతో ఒక పొడుగాటి వెంట్రుకను కత్తిరించి చాలా భద్రంగా ఒక
కాగితంలో పొట్లం కట్టుకుని ఆ పెద్దపులికి నమస్కరించి ఇంటికి వచ్చేసాను.
ఆ రోజు నా ఆనందానికి
అవధులు లేవు. పొద్దున్నే లేచి 4,5 నెలల తరువాత మరల ఆ కొండలోని యోగిని దర్సించుకున్నాను.
భక్తిగా పాలు, పళ్ళు సమర్పించాను. నేను తీసుకువచ్చిన ఆ పులి వెంట్రుకను కూడా సమర్పించాను.
ఆయన చాలా ఆశ్చర్యపోయారు. "తల్లి, ఇంత శీఘ్ర కాలంలోనే నేను చెప్పిన అసాధ్యమైన పనిని
నువ్వు సాధించుకు వచ్చావు, నాకు సంతోషంగా ఉంది" అన్నారు. "మహాత్మా మీరు చెప్పినట్లే
చేసాను, తదుపరి ఉపాయం నా సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలి" అన్నాను.
అప్పుడు ఆయన నవ్వుతూ "తల్లి
ఇంకా గ్రహించలేదా, నీ సమస్యకి పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది. నీ హృదయంలోనే ఉంది, నీ
ఆలోచనలోనే ఉంది.ఎంతో భయంకరమైన ఒక పెద్దపులిని, అందునా పిల్లలతో ఉన్న ప్రమాదకరమైన పులిని
నువ్వు ప్రేమ అనే శక్తితో స్వాధీనం చేసుకున్నావు. దానిలోని క్రూరత్వాన్ని ప్రేమతత్వంగా
మార్చగలిగావు. అటువంటి సాధ్వీమణివి, సాదువర్తనగల నీ భర్తని ఇటువంటి ప్రేమశక్తితో నువ్వే
మార్చుకోగలవు. దానికి కొంత సహనం, ఓర్పు కావాలి, క్షేమంగా వెళ్లిరా" అని ఆశీర్వదించి
నన్ను పంపించారు. నేను ఆయన చెప్పిన దాని పూర్తిగా అర్థం చేసుకుని అదే విధంగా అనతి కాలంలోనే
నా భర్తని మామూలు స్థితికి తీసుకురాగాలిగాను. మళ్లీ మా జీవితంలో మునుపటిలాగా సుఖశాంతులు
వెల్లివిరిశాయి. అదే ప్రేమతత్వంతో ప్రకృతిలో ఉన్న సమస్త ప్రాణులు మమెకమైపొయి మేము ఈ
స్థితికి రాగాలిగాము. నాయన పరిశుద్దమయిన ప్రేమతో గాఢమయిన సంకల్పంతో మనం ఎటువంటి కార్యాన్ని ఐన సాధించగలము.
ఆలోచన అనేది ఒక శక్తి. ఆ ఆలోచనలో మనము ప్రేమతత్వాన్ని ఎదుటివారిపట్ల నింపుకుంటే అది
వాక్కురూపంలో వ్యక్తమయినపుడు దుష్ట స్వభావాన్ని కూడా మనం మార్చివేయవచ్చు. మన ఆలోచనలలో
పరిశుద్ధమైన ప్రేమ ఉన్నపుడు దానిలోంచి వచ్చే భావతరంగాలు అవి ఎవరిని తాకినా ఆ వ్యక్తులను
ప్రభావితం చేస్తాయి. దానికి నా జీవితమే తార్కాణం".
నేను ఈ వింత పరిణామానికి నాకు కలుగుతున్న
సందేహాలకి ఈ రకంగా సమాధానాలు దొరకడం నా జీవితంలో మరపులేని మరపురాని సత్యాలుగా గ్రహించాను.
ఆమెకి భక్తి పూర్వకంగా నమస్కరించాను. ఆమె క్షణంలో అదృశ్యమైపోయింది. దత్త స్వామి చెప్పినట్లు
"యద్భావం తద్భవతి" అన్నది నిరూపించబడింది. నా భావాలలో ఉన్నటువంటి గాఢమైన సందేహాలకు సమాధానం ఈ రకంగా దొరకడం
పరిపాటిగా మారింది. ఇలా ఆలోచిస్తూ ప్రశాంతంగా నిదురపోయాను. ఏదో చెప్పలేని సంతోషం, మొత్తం
విశ్వం పట్ల ఒక విధమైన కృతజ్ఞత భావం నా కణకణాలలో నిండిపోయింది.