N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Sunday 31 July 2016

Spiritual Soup-01

Part - 1

2012 భూమి అంతం? చర్చలు - కొన్ని ఆసక్తికరమైన నమ్మశక్యంకాని వాస్తవాలు

ఈస్టర్ పండగ సెలవులలో నేను నా మిత్రులతో కలిసి "అమాని" అడవులకి బయలుదేరాను. కారు రోడ్డు మీద వేగంగా పరిగెడుతోంది, దానికన్నా నా మనస్సు ఇంకా వేగంగా పరి పరి విధాలుగా ఆలోచిస్తోంది. రోడ్డుకి ఇరువైపులా పచ్చని ప్రకృతి, మహా వృక్షాలు, ఎత్తైన కొండలు అంతా ఆహ్లాదంగా ఉంది. అమాని అడవులు టాంజానియా దేశంలో ఉన్నాయి. ఇలా హాలిడేస్ వచ్చినప్పుడల్లా సరదాగా నేను, నా మిత్ర బృందం ఎక్కడో ఒకచోటకి వెళ్తూ ఉంటాము.ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది, పని ఒత్తిడి తక్కువ ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా ఆలోచించుకోవడానికి, పుస్తకాలు చదువుకోడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. 

చాలా రోజులుగా చాలామంది ఈ ప్రపంచం అంతా 2012-2013 లో అంతం అవుతుందని మనుష్యుల మనుగడ ఉండదని చర్చలు జరుపుతున్నారు. దాని గురించి  నేను ఎంతో తీవ్రంగా ఆలోచిస్తున్నాను. అమాని అడవులలోని గెస్ట్ హౌస్ చేరేసరికి సాయంత్రం సుమారుగా 3 గంటలు అయ్యింది. ఆ గెస్ట్ హౌస్ పురాతనంగా ఉన్నా, చాలా విశాలంగా పెద్ద పెద్ద గదులతో గాలి వెలుతురూ వచ్చేలాగ  సౌకర్యంగా వుంది. ఎవరి గదులలో వాళ్ళు వెళ్ళిపోయి స్నానం చేసాము. తరువాత వంటవాడు ఇచ్చిన ఒక కప్పు టీ తో బడలిక అంతా తీరిపోయింది.


 ఒక అరగంట విశ్రాంతి తీసుకున్నాక మెల్లగా అందరం బయటకు వచ్చాము. ఎక్కడ చూసినా ఎత్తైన చెట్లు, రకరకాల పూలమొక్కలు, పళ్ళ చెట్లు నేలంతా పచ్చని మెత్తటి గడ్డి తివాచి పరిచినట్లు వుంది. నేను యాంత్రికంగా నడుస్తూ వున్నా, మనసులో చిన్న కలవరం మొదలయ్యింది. ఈ ప్రదేశం అంతా ఇదివరకే నాకు పరిచయం ఉన్నట్లు, నేను ఈ ప్రాంతం అంతా తిరిగినట్లుగా పదే పదే అనిపిస్తోంది. బయటికి ఒక పక్క హాయిగా ఉన్నా మనసు మాత్రం ఒక పక్కన అశాంతిగా అనిపించింది. ఎన్నో ప్రశ్నలు, వాటికి తెలియని సమాధానాలు తెలుసుకోవాలని ఆత్రుత. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏమి చేస్తున్నామో, మన జీవిత గమ్యం ఏమిటి అని రకరకాల పరస్పర విరుద్ధమైన ఆలోచనలు అంతు లేకుండా ప్రవాహంలాగా వెళ్ళిపోతున్నాయి. ఆ రాత్రి భోజనం చేసాక నేను నా గదిలో కాసేపు ధ్యానం చేస్తూ ఉండిపోయాను. కిటికీలోంచి చల్లటి గాలి, వాటితో పాటు అవి మోసుకొచ్చే పూల పరిమళాలు మనసుకి ఒక రకమైన ఆహ్లాదము కలిగిస్తున్నాయి.

 అలాగే నాకు తెలియకుండా నిద్రపోయాను. అలా ఎంతసేపు నిద్రపోయానో తెలియదు, ఎందుకో ఒకసారి ఎవరో నన్ను గట్టిగా స్పర్సించినట్లు అనిపించి కొంచెం ఉలికిపాటుతో నిద్రలేచాను.బయటినుంచి కీటకాలు చేసే ధ్వని, అప్పుడప్పుడు హోరు గాలి తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. నేను మేడ మీద గదిలో మంచం దిగి మెల్లగా లేచి బయట కిటికీ లోంచి చూసాను. నిండు పౌర్ణమి కాబోలు చంద్రకాంతి నేలమీద పడి, ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంది. మెల్లగా వెనక్కి తిరిగేసరికి కింద హాలులో ఒక అద్భుతమైన కాంతి కనపడింది. నేను నెమ్మదిగా తలుపులు తెరిచి మెల్లిగా చప్పుడు చెయ్యకుండా మెట్లు దిగి సరిగ్గా కింద ఉన్నవిశాలమయిన హాలులోకి వచ్చి కర్టెన్ దగ్గిరే నిలిచిపోయాను. కొద్దిగా తెర తొలగించి చూసాను, ఒక అద్భుతమయిన కాంతి ఆ విశాలమయిన గదిలో ప్రసరిస్తోంది. 

సంభ్రమాశ్చర్యాలతో విప్పారిన కళ్ళతో ఒక అద్భుతమయిన దృశ్యం చూసాను, ఆ గదిలో అద్భుతమయిన కాంతిమయ శరీరాలతో కొంతమంది వ్యక్తులు కనిపించారు. వాళ్ళలో నా దృష్టి ఒక వ్యక్తి మీద పడింది. అతను దివ్యమయిన కాంతిలో వెలిగిపోతున్నాడు. ఆ ఆజానుబాహుడు ముఖంలో ఒక రకమయిన ప్రశాంతత, మధురమయిన దరహాసం, ఒక విధమయిన ఆకర్షణ కనిపిస్తోంది. అతనిని చూస్తుంటే మనకు కూడా అంతా ప్రశాంతత కలుగుతుంది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతో ఏవో విషయాలు మాట్లాడుతున్నారు, మిగతా కాంతిమయ శరీరంలో ఉన్న వాళ్ళు శ్రద్ధగా ఆయననే చూస్తూ చెప్పేది వింటున్నారు.

ఇంతలో ఆ వ్యక్తి నా దిక్కుగా చూస్తూ "నాయన లాహిరి కాంత్ నా దగ్గిరికి రా, భయపడనవసరం లేదు" అని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. నాకు ఒక వైపు ఆశ్చర్యం, కొద్దిగా భయం, సంతోషం  అన్ని రకాల మిశ్రమ భావాలు ఉవ్వెత్తున లేచాయి. యాంత్రికంగా నేను ఒక స్వప్నలోకంలో విహరిస్తున్నట్లుగా ఆయన దగ్గరగా వెళ్ళాను. కాని వారి కాంతిమయ శరీరాలను చూడటం నా కళ్ళకి కొంత శ్రమగా అనిపించింది. అది ఆయన గ్రహించి వారి కాంతిని నాకు ఇబ్బంది లేనంతవరకు తగ్గించుకున్నారు. నేను వినయముగా వారి దగ్గరికి వెళ్లి నమస్కరించి "మహానుభావులారా మీ అందరికి నమస్కారం, ఇది కలయా? నిజమా? నాకు ఏమి అర్థం కావటం లేదు. 

దయచేసి మీరంతా ఎవరు? ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవచ్చా?" అని అడిగాను.అందుకు నన్ను పిలిచిన ఆ వ్యక్తి చిరునవ్వుతో "నేను ఈ భూమండలం యొక్క విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని పరిపాలించే నాయకుడను, పరిసోధకుడను. నాకు ప్రత్యేకంగా పేరు అంటూ ఏమి లేదు ఎందుకంటే మాకు మీలాగ పేర్లు ఉండవు, మేమంతా కాంతి రూపాలం. అందుకే మా కాంతిమయ శరీరము స్పందనలతో నిండి ఉంటుంది.వేగంగా స్పందించే మా కాంతిమయ శరీరాలు మీరు చూడలేరు కాబట్టి మేము మీ స్థాయికి తగ్గట్లుగా మా స్పందనలను తగ్గించుకున్నాము. ఈ విశ్వమంతా చైతన్యమయమైన శక్తి తోటి తన ఉనికిని సాగిస్తోంది.మీకు ఏదో ఒక పేరు ఉంటే కాని అర్థం కాదు కాబట్టి నన్ను అయస్కాంత పురుషుడిగా పిలవవచ్చు. నిజానికి మాకు లింగ బేధము లేదు, నీ భాషలో చెప్పాలంటే నేను పురుషుడు కాను, స్త్రీని కాను.పురుష, ప్రకృతి ఈ రెండు శక్తుల సమ్మేళనమే నేను. వీరందరూ కూడా వివిధ గ్రహాల నుండి, నక్షత్ర మండలాల నుండి వచ్చినటువంటి సిద్ధపురుషులు, మహా యోగులు, మహర్షులు. మేమంతా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక సభలు, సమావేశాలు జరుపుతూ ఉంటాము. 

ప్రస్తుతము కొన్ని ఏళ్ళుగా భూమండలము మీద జరుగుతున్నటు వంటి రకరకాల దుష్పరిమానాలు గురించి కొద్దిగా ఆందోళనతో గమనిస్తూ ఉన్నాము. నేను వీరందరితో ఈ భూమండలాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ కొన్నితీర్మానాలను చేస్తున్నాను. నేను ప్రతి 25 సంవత్సరాలకి ఈ భూమండలము యొక్క ధనవిద్యుత్అయస్కాంత శక్తి, ఋణ విద్యుత్ అయస్కాంత శక్తిని ఎలా ఉన్నాయి అని కొలుస్తూ ఉంటాను.  

 అప్పుడప్పుడు నీలాగా ఆలోచించేవారికి కనిపిస్తూ ఉంటాము. మీ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తాము. కాకపోతే మీరు ప్రస్తుతం ఉన్న ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో మీ స్థాయి 3వ దశ వరకు మాత్రమే ఉంది. చాలాసార్లు ఆధ్యాత్మిక విషయాలు విజ్ఞానపరంగా శాస్త్రీయంగా మీ స్థాయికి దిగి వచ్చి సరైన పదాలలో చెప్పడం కొంచెం కష్టమైన ప్రక్రియ; నిజమైన జిజ్ఞాస ఉన్న వాళ్ళు మాత్రమే కొంత సాధనతో వారి స్థాయి క్రమక్రమంగా పెంచుకున్నపుడు మేము చెప్పే నమ్మలేని విషయాలను మీ మానసిక స్థాయికి అతీతంగా ఉన్నా సూక్ష్మమైన విషయాలను అర్థం చేసుకోగలుగుతారు.

ఆధ్యాత్మికత అన్నది ఈ విశ్వములో ఉన్న వివిధమైన విజ్ఞాన శాస్త్రాల యొక్క సమగ్రమైన ఒక సంపుటి. ఆధ్యాత్మికత అన్నది ఒక మహా సముద్రం అయితే మిగతా శాస్త్రాలు అంటే ఈ ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, వృక్ష, జంతు, రసాయన , ఖనిజ శాస్త్రం ఇంకా మిగతా అన్ని శాస్త్రాలు సరస్సులు, నదులు, చెరువులు వంటివి. ఇవన్ని కలిసిపోయి చివరికి ఆధ్యాత్మికమైన మహా సముద్రములో కలుస్తాయి. అంటే అన్ని శాస్త్రముల యొక్క సమ్మేళనమే ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ ఆధ్యత్మికమనే మహా సముద్రములో ఒక చిన్న నీటి బిందువును పరీక్ష చేసిన అది మొత్తము మహా సముద్రం యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది.

సూక్ష్మములో జరిగే ఏ చిన్న మార్పు అయిన అది స్థూల జగత్తులో ప్రస్ఫుటిస్తుంది. అందుకే సూక్ష్మంలోనే స్థూలం ఉన్నది (quantum factor) అందుకే ఆధ్యాత్మికతను మనం Spiritual Soup  అనుకోవచ్చు. నేను నీకు ఊహ తెలిసాక 1987వ సంవత్సరం ఈ భూమి యొక్క విద్యుత్ అయస్కాంత శక్తిని కొలవడానికి వచ్చాను. బహుశా నీకు గుర్తుండి ఉంటుంది, అప్పుడు జనులు అందరు కూడా అష్టగ్రహ కూటమి వచ్చింది, ప్రపంచం అంత సర్వనాసనం అవుతుందని భయపడ్డారు. నీవు కూడా ఒకసారి జ్ఞాపకము చేసుకో అప్పటి విషయాలని. మీరు అనుకున్నట్లు ఏమి జరగలేదు, మీ మనసులో మరి చాల మంది మనసులలో ఒక విధమైన భయం, ఆసక్తి, ఆందోళన మళ్లీ ప్రపంచం అంతం  2012లో అనే చర్చ చుట్టూ తిరుగుతోంది అందుకే నీ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి వచ్చాము. 

నిజానికి 1962 వ సంవత్సరం ఈ భూమండలం మీద పరిస్థితులు  మా అందరికి  కూడా చాలా ఆందోళనకరంగా ఉండేవి. అయితే భూమండలం యొక్క విద్యుత్ అయస్కాంత క్షేత్రం కొలవడానికి వచ్చినప్పుడు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సమతుల్యంగా లేదు. ఋణవిద్యుత్ శక్తి  చాలా ఎక్కువగా, ధన విద్యుత్ శక్తి  చాలా తక్కువగా ఉంది. అంటే చాలా మంది మనుషుల యొక్క మానసిక చైతన్య శక్తి అరిషడ్వర్గాలలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా రసాయనిక కాలుష్యం, భావ కాలుష్యం చైతన్య శక్తిని సహజ పరిణామాలకన్నా తక్కువ స్థాయికి దించి వేసాయి. దీని యొక్క దుష్ప్రభావం గ్రహాంతర వాసులకి,  నక్షత్ర మండలాలకి కుడా తాకింది.అందుకని ఈ భూమిని నాశనం చెయ్యటానికి కొంత ఆలోచన జరిగిన మాట వాస్తవం. 

అయితే ఈ భూమండలం పట్ల జాలి, కరుణ కలిగినటువంటి సిద్ధ పురుషులు, మహర్షులు అందరు కూడా ఆరోజు జరిగిన ఆధ్యాత్మిక సమావేశానికి విచ్చేశారు. వారందరూ కూడా ఒక విన్నపం చేసారు. ఈ భూ మండలాన్ని మేము చేసే నిరంతర తపశ్శక్తి ధారలతో, మా భావ ప్రసారాలతో రక్షించుకుంటాం, భూమి యొక్క ఆధ్యాత్మిక పరిణామక్రమాన్నిపెంచుకుంటాం. దయ చేసి  ఈ భూ మండలాన్ని ఏమి  చెయ్యవద్దు అని ముక్త కంఠంతో అర్థించారు. నాకు ఈ భూమి యొక్క పాజిటివ్ ఎనర్జీ తప్పకుండ పెరుగుతుందని విశ్వాసం కలిగింది. అందుకే నేను  వారికి అభయం ఇచ్చి వెళ్ళాను

నాయన  ఇప్పటికే చాలా పొద్దు పోయింది. మరల మేము తప్ప కుండా ఏదో ఒక రకంగా సరైన సమయంలో నీ మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు  చెప్తాం. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో" అని అన్నారు.నేనింకా ఏదో స్వప్న లోకంలో  ఉన్నట్లు భావించాను. ఎదురుగా కాంతిమయ శరీరాలలో ఉన్న వ్యక్తులు చెప్పే నమ్మశక్యం కాని విషయాలు నన్ను పూర్తిగా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాయి. నేను వారందరికీ వినయంతో నమస్కరించాను " మహానుభావులారా, మరొక్కసారి  నా నమస్కారములు. నేను  వింటున్నది, చూస్తున్నది నిజమా లేక స్వప్నమా అని నేను రూడి చేసుకోలేక పోతున్నాను. నాలో  ఎంతో ఆసక్తి రేకెత్తించారు. నా మనస్సు ఇంకా చాలా ప్రస్నార్ధకంగా మారింది. దయచేసి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గూర్చి, 2012 లో వచ్చే యుగాంతం గూర్చి తెలపవలసిందిగా ప్రార్ధిస్తున్నాను."

 అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, " నాయన ఇటు రా, నువ్వు విన్నది, కన్నది నిజమే స్వప్నం కాదు. దానికి తార్కాణంగా నువ్వు కోరుకున్నట్లు, నీ మనసులో ఎంతో కాలం నుంచి కావాలి అనుకుంటున్న ఒక వస్తువును నీకు బహుకరిస్తున్నాను" అని కుడి చెయ్యి తెరిచి నన్ను దగ్గిరికి పిలిచి తీసుకోమన్నారు. ఆశ్చర్యంలో ఆశ్చర్యం, ఆయన నాకు అద్భుతమైన "ఏకముఖి రుద్రాక్ష" ఇచ్చారు. నేను సంతోషంగా వినయంగా ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాను. మళ్లీ త్వరలో కలుద్దాం అని చెప్పి వారంతా నేను కళ్ళు మూసి తెరిచే లోపు అదృస్యమైపోయారు. నేను నాకు తెలియని ఒక మత్తులో ఉండిపోయాను.

నిద్ర లేచేసరికి నేను నా గదిలో మంచం మీద పడుకున్నాను. పక్షుల కిల కిల రావాలతో నేను పూర్తిగా జాగ్రుదావస్తలోకి వచ్చాక రాత్రి జరిగింది స్వప్నమా, నిజమా అని ఒక మీమాంసలో పడిపోయాను. అప్పుడు గుర్తుకు వచ్చింది రుద్రాక్ష సంగతి, నా కుడి చెయ్యి తెరిచేసరికి ఒక అద్భుతమైన ఏకముఖి రుద్రాక్ష కనిపించింది. ఆ రోజంతా వాళ్ళు చెప్పిన విషయాల గురించే తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. మళ్లీ నా ప్రశ్నలకి సమాధానాలు ఎప్పుడు చెప్తారా అని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.