N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Sunday 20 April 2014

ఆధ్యాత్మిక పానీయము - 19



విత్తనాలు - సంస్కారాలు

ఒక పౌర్ణమి రోజు రాత్రి నేను భోజనం చేసి తీరిగ్గా ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో పచార్లు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. పౌర్ణమి వెన్నెల మా ఇంటి ముందున్న రకరకాల మొక్కల మీద, నేల మీద తివాచీలా పరిచి ఉన్న గడ్డి మీద పడి చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. సమయంలో నాకు అయస్కాంత వ్యక్తి సాక్షాత్కారం జరిగింది. ఆయనకి నేను వినయంగా నమస్కరించి "మహాత్మా చాలా రోజుల తరువాత దర్శనం ఇచ్చారు. పౌర్ణమి వెన్నెల చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో, ఇటువంటి ప్రకృతి సౌందర్యానికి మనసు ప్రశాంతతో నిండిపోతుంది, ఏదో ఒక తెలియని ఆనందం అణువణువునా వ్యాపించిపోతుంది. మీ సాక్షాత్కారం జరిగే ప్రతిసారి నాకు ఇటువంటి స్పందనలే కలుగుతుంటాయి" అని అన్నాను.
దానికి ఆయన "అవును, ప్రకృతి ఎప్పుడు అందంగానే ఉంటుంది. ప్రకృతిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అది సమస్త మానవాళికి ఎంతో శ్రేయస్సుని ఇస్తుంది. మనం అందమైన పూల మొక్కలని చూసినపుడు మనసుకి సంతోషం కలుగుతుంది. చెట్ల ద్వారా మనకి పళ్ళని, కూరగాయలని ప్రకృతే అందిస్తుంది కదా. ప్రక్రుతి మానవాళి మనుగడకి ఎన్నో రకాలుగా తోడ్పడుతూ ఉంటుంది. ఈ ప్రకృతిలో ఎన్నో రహస్యాలు ఇమిడి ఉన్నాయి" అని అనగా "మహాత్మా ఆ రహాస్యాలేమిటో దయచేసి వివరించండి" అని నేను ప్రార్ధించగా ఆయన ఈ విధంగా సెలవిచ్చారు. 

"ఈ సృష్టి మొత్తం కూడా ప్రకంపనల మయం. ఉదాహరణకి ఒక మామిడి టెంకను తీసుకున్నామనుకోండి, దానిలో ఎటువంటి కదలికలు మనకి కనిపించవు. కాని దానిలో ఉన్నటువంటి లక్షల కణాలు వాటి కక్ష్యలలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయి. మీ అధునాతన యుగంలో డాల్టన్ అనే శాస్త్రవేత్త తన డాల్టన్ అటామిక్ థియరీలో అదే చెప్పాడు కదా. బాహ్యంగా చూసినపుడు మామిడి టెంకలోని కదలికలు మనకి తెలియవు కాని వాటిలో ప్రాణశక్తి అచేతనంగా ఉంటుంది. కాబట్టి దానిలో ప్రాణం ఉంటుంది అనే విషయం మనకి తెలుస్తోంది కదా. ఇదే విధంగా మన మానవుల శరీరంలో కొన్ని లక్షల కోట్ల రసాయనిక చర్యలు జరుగుతుంటాయి కాని అటువంటి కదలికలు జరుగుతున్నట్లు మనకి తెలియదు. అలాగే ఈ ప్రాణ శక్తి అనేది విత్తనంగా ఉన్నపుడు ప్రాణం ఉంటుంది కాని చైతన్యం ఉండదు. అదే విత్తన్నాన్ని మనం సారవంతమయిన భూమిలో పాతి పెట్టి చక్కగా దానికి నీరు పోస్తూ, సూర్య రశ్మి తగిలే ప్రదేశంలో కనుక ఉంచినట్లయితే ఇటువంటి మంచి సంస్కారాల తాకిడికి ఆ టెంక లోపల అచేతనంగా ఉన్న ప్రాణశక్తి లో కదలిక ఏర్పడి అది మెల్లగా పెరుగుతూ కొంత భాగం భూమి పైకి వస్తుంది. దానిలో కొన్ని కణాలు భూమిలోకి చొచ్చుకు పోయి వేళ్ళ రూపంలో తయారవుతాయి. మరి కొన్ని కణాలు పైకి వచ్చి ఒక కాండంగా ఏర్పడుతాయి. ఇంకా పెరుగుతూ పోయి కొన్ని కణాలు కొమ్మలుగా కొన్ని కణాలు ఆకులుగా, పూవులు, పళ్ళుగా ఏర్పడతాయి. దీని అర్థం ఏమిటి ఒక విత్తనంలో ఉన్నటువంటి ప్రాణశక్తికి ఇతర శక్తులు అనగా సూర్యరశ్మి అనే శక్తి, వాయువులో ఉన్న శక్తి, నీటిలో ఉన్నటువంటి శక్తి , భూమిలో ఉన్నటువంటి శక్తి వంటి మంచి సంస్కారాలు కలిగిన శక్తులు అచేతనంగా ఉన్న ఒక విత్తనాన్ని ఎప్పుడైతే స్పృశిస్తాయో దానిలో లోపల కొన్ని కణాలు భూమి కిందకి వెళ్లి వేళ్ళుగా మారటం, కొన్ని కణాలు కాండాలుగా, కొన్ని పూవులుగా, కొన్ని పళ్ళుగా, కొన్ని ఆకులుగా మారడం ఇదంతా అద్భుత విషయం కదా. దీని అర్థం ఏమనగా ఒక మామిడి టెంకని మనం మంచి సారవంతమైన భూమిలో పెట్టి దానికి నీరు, గాలి సమృద్ధిగా అందించినపుడు అది ఒక మంచి మామిడి చెట్టుగా ఎదిగి మంచి రుచి కలిగిన మామిడి ఫలాలని ఇస్తుంది. మన చుట్టు పక్కల ఉన్న వాతావరణం చక్కగా ఉన్నట్లయితే పెరిగేటువంటి విత్తనం మంచి సంస్కారాలతో ధృడంగా ఆరోగ్యంగా ఉంటుంది. అదే కదా నువ్వు కిర్లేన్స్ కెమెరా గురించి విశ్లేషించి చెప్పావు. ఒక ఆరోగ్యమైన మొక్కని కిర్లేన్స్ కెమేరాతో ఫోటో తీసినపుడు దాని చుట్టూ ఉన్న  కాంతి పరివేష్టితం చాలా ధృడంగా, బలంగా ఉంటుంది అని చెప్పావు కదా.  అదే విధంగా మానవ మొక్కలు (మానవులు)  కూడా ఇదే సూత్రం ప్రకారంగా పెరుగుతాయి. అదే ఒక మంచి విత్తన్నాన్ని నిస్సారమైన భూక్షేత్రంలో, సూర్యరశ్మి సరిగా తగలని ప్రదేశంలో  పాతిపెట్టి, నీరు సరిగా అందివనపుడు అది ఎంత ధృడమైన విత్తనమైనా పెరిగే సరికి బలహీనంగానే తయారవుతుంది. దానికి తొందరగా అంటు వ్యాధులు వస్తుంటాయి. ఆకులకి తొందరగా చీడ పట్టడం, మాడిపోవటం జరుగుతుంటాయి. ఒక వేళ అది పండ్లు ఇచ్చినా కూడా అవి తొందరగా కుళ్ళిపోవడం లేదా రసహీనంగా ఉండటం జరుగుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి అర్థమైందేమిటంటే విత్తనం ఎంత మంచి జాతిదైనా కూడా దాని చుట్టుపక్కల వాతావరణం సరిగా లేకపోతే అది మంచి మొక్కగా మారటానికి ఆస్కారం ఉండదు. అదే విధంగా మనుష్యులు కూడా అంతే.

శుక్రదానము జరిగినపుడు ఆ శుక్రకణాలు అండాన్ని కలిసి ఫలదీకరణ జరిగినపుడు అండము మరియు శుక్రకణాలు కలిసి జైగోట్ అనే ఒక కణముగా ఏర్పడుతుంది. ఈ పిండాన్ని కూడా మనం ఒక మంచి విత్తనంగానే భావించాలి. వాటికి తల్లి నుంచి మంచి సంస్కారాలు అంటే సాత్వికమయిన ఆహరం,  తల్లి ప్రశాంతమయిన మనస్సు వల్ల కలిగే మంచి ఆలోచనలు వంటి మంచి స్పందనలన్నీ  కూడా పెరుగుతున్న ఈ పిండాన్ని చాలా ధృడంగా తయారుచేస్తాయి. పుట్టిన పాప చాలా ఆరోగ్యంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ మానవ విత్తనాల్ని కూడా పిండ దశలో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందుకనే పూర్వకాలం మహారాజులు వారి రాణులు గర్భం దాల్చినపుడు మునుల ఆశ్రమాలకు పంపిస్తుండేవారు. ఎందుకంటే ఈ ఆశ్రమాలలో ఎంతో ప్రశాంతత లభిస్తుంది, అక్కడ నిరంతరం వేదపఠనమ్ మరియు భగవన్నామ స్మరణ జరుగుతూ ఉంటుంది. అంతే కాక వారు తీసుకునే ఆహారం కూడా చాలా సాత్వికంగా ఉంటుంది. దీనివల్ల గర్భంలో పెరుగుతున్న పిండానికి మంచి సంస్కారాలు అలవడతాయి. అందుకనే మన పూర్వీకులు ఈ విధానాన్ని పాటించారు. కాని దురదృష్టవశాత్తు ఈ అధునాతన యుగంలో తల్లులు ఇటువంటి నియమాలేమి పాటించడం లేదు. వారు భయంకరమైన దృశ్యాలు చూడటం, ఎలక్ట్రానిక్ పరికరాలనుంచి వచ్చే హానికరమైన స్పందనలను వారు గ్రహించటం అవి లోపల ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని కలుషితం చెయ్యడం, దీని వల్ల  తల్లికి, పుట్టే పిల్లలకి ఎంతో హాని కలుగుతుంది. వీరి వల్ల సమాజానికి మేలు కూడా ఏమాత్రం కలుగదు ఎందుకంటే ప్రకృతి ద్వారా సహజంగా ఏర్పడే అయస్కాంత క్షేత్రాలు చాలా బలంగా ఉంటాయి, సాత్వికంగా ఉంటాయి. అటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ఎలక్ట్రిక్ పరికరాల వల్ల వచ్చే స్పందనలు కాని, వెలుగు కాని పాడు చెయ్యటం వల్ల రకరకాల జబ్బులు రావటం, కంటి చూపు తగ్గిపోవడం వంటి అనర్ధాలు జరుగుతాయి. కనుక ఈ మానవ మొక్కల్ని కూడా మనం ఎంతో జాగ్రత్తగా పెంచవలిసివస్తుంది.  ఒక పిల్లవాడు సమాజానికి పనికి రాకుండాపోయాడు అంటే ఆ బాధ్యత అతని తల్లితండ్రులది మాత్రమే. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు  కూడా మనిషి యొక్క మనస్తత్వాన్ని ప్రబావితం చేస్తుంటాయి అని ఈ మధ్యనే పరిశోధనల వల్ల కనుగొన్నారు” అని ఈ విధంగా ఆయన ఎంతో విజ్ఞానపరంగా విశ్లేషించారు.
దానికి సమాధానంగా "మహాత్మా మీరెంతో అద్భుతమైన విషయాలు చెప్పారు, మరి కొంచెం వివరించి చెప్పగలరా, తల్లి యొక్క మనసు ప్రశాంతంగా ఉండాలి అని అన్నారు, దానికి లోపల పెరిగే పిండానికి సంబంధం ఏమిటి మరికొంచెం వివరించి చెప్పండి"  " అని అడిగాను. “తప్పకుండా చెబుతాను” అని “మనం తినే ఆహారం సాత్వికంగా ఉన్నపుడు మన ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయి. మన ఆలోచనలు ఎప్పుడైతే సాత్వికంగా ఉంటాయో అవి వ్యక్తీకరించేటప్పుడు మనం ఉపయోగించే భాష కూడా చాలా సాత్వికంగా ఉంటుంది. ఆహారమే మనస్సు అవుతుంది అనేది అందరూ అంగీకరించిన విషయమే కదా. ఇటువంటి సాత్విక భావాలు ఎప్పుడైతే వ్యక్తీకరిస్తామో వాటికి చాలా ప్రభావం ఉంటుంది. ఒక కోపస్వభావం కల వ్యక్తి తన భావాలను కోపంగా  వ్యక్తీకరించినపుడు వాటికి కూడా చాలా ప్రాణశక్తి ఉంటుంది, కాని వాటివల్ల ఎదుటి మనిషికి హాని చేసేట్లుగా ఉంటుంది. దానివల్ల ఎదుట వ్యక్తి అయస్కాంత క్షేత్రం దుష్ట ప్రభావానికి లోనైనట్లుగా ఉంటుంది.  అదే సాత్విక భావాలతో ప్రేమగా మాట్లాడినపుడు ఎదుటి వ్యక్తిలో కూడా స్పందన చాలా చక్కగా ఉంటుంది వారి అయస్కాంత క్షేత్రంలో కూడా మంచి స్పందనలు కలుగుతాయి. మనం జాగ్రత్తగా గమనించినట్లైతే కోపిష్టి స్వభావం ఉన్న వారి దగ్గరకు తొందరగా ఎవరు వెళ్లరు, ఒకవేళ అటువంటి వారు ఎదుటివారి మీద కోపం ప్రదర్శించినపుడు శాంత స్వభావులు అక్కడనుండి దూరంగా వెళ్ళిపోతారు. ఇది కూడా ఒక ప్రతిచర్యే కదా. అదే శాంత స్వభావులు, సత్పురుషుల వద్దనుండి ఎవరు తొందరగా వెనక్కి వచ్చేయాలనుకోరు, ఇంకా కాసేపు వారితో సమయం గడపాలనే అనుకుంటారు. ఆలోచనలకి అంత శక్తి ఉందన్నమాట. ఒక 3 నెలల పిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడికి మన భాష తెలియదు. మనం వాడితో లాలనగా ప్రేమగా మాట్లాడినపుడు మన భాషలోని ప్రేమ భావం వాడి అయస్కాంత క్షేత్రానికి చేరి వాడు హాయిగా నవ్వుతూ కేరింతలు కొడతాడు. అదే పసిపాప తో మీరు కోపంగా మాట్లాడినపుడు ఏడుపు మొదలుపెడతాడు.. ఇక్కడ భాష ప్రధానం కాదు, మన స్పందన ప్రధానం, ప్రేమగా మాట్లాడినపుడు ఒకలాగా కోపంగా మాట్లాడినపుడు ఒకలాగా పిల్లవాడు స్పందిస్తున్నాడు అంటే మనం మాట్లాడే వాక్కుకి అంత శక్తి ఉంటుంది, అది ఎదుటివారి అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక గర్భధారణ జరిగినపుడు తల్లి తన ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాత్వికమైన పోషక ఆహారము తీసుకోవడం, మనసు ఎపుడు ప్రశాంతంగా ఉండటం, దైవధ్యానం చేస్తూ ఎంతో కొంత సేపు తన గర్భంలో ఉన్న శిశువుతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే పుట్టే ఆ బిడ్డ అద్భుతమైన వ్యక్తిత్వంతో పెరుగుతాడు". అనగా "నేను మహాత్మా మీరు చెప్పేది చాలా సబబుగా ఉండి, ప్రహ్లాదుడే దీనికి ఉదాహరణ కదా" అనగా "అవును" అని ఆయన అన్నారు.

మన మనసులో ఉండే ఆలోచనలు కూడా శక్తి రూపమే. దాన్ని ఒక పాతిపెట్టనటువంటి ఒక విత్తనంతో పోల్చవచ్చు. విత్తనం పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కాని అందులో ఒక బ్రహ్మాండమైన వృక్షం దాగి ఉంది, అది ఎంతో శక్తివంతమైనది. అలాగే ఆలోచన కూడా ఒక బ్రహ్మాండమైన శక్తి రూపం అన్నమాట. దాన్ని మనం ప్రయోగించే పధ్ధతి బట్టి దాని శక్తి మారుతూ ఉంటుంది. మొత్తానికి ఆలోచనకి చాలా శక్తి ఉంటుంది అది వాక్కు రూపంలో బయటపెట్టినపుడు అది ఇంకొక శక్తిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనం మాట్లడుతునపుడు కిర్లేన్స్ కెమేరాతో ఫోటోలు తీసినపుడు ఆ వాక్కులు కూడా వెలుగు రవ్వలుగా కనపడుతుంటాయి. వాక్కు అనేది ఒక విద్యుత్ ప్రవాహము. అది ఒక అయస్కాంత క్షేత్రం కలిగి ఉండి వేరొక అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కనుక మనం ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలి మనం ఆలోచించే విధానం కూడా జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడే మాటలు కూడా మంచిగా ఉండాలి. వీటిని బట్టే మన కాంతి పరివేష్టితం ఆధారపడి ఉంటుంది” అని ఆయన వివరించారు. ఇంకేమైనా ఉదాహరణలు ఉంటే దయ చేసి వివరిస్తారా అని నేను అడుగగా ఈ అధునాతన కాలంలో కూడా చాలా మంచి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఉన్నారు. కాలిఫోర్నియాలో లూథర్ బర్మాంక్ అనే శాస్త్రవేత్త మొక్కల మీద చాలా  పరిశోధన చేసారు. ఆయన ఉద్యానవనంలో గులాబి, కాక్టస్ వంటి చాలా మొక్కలు ఉండేవి. ఆయన ప్రతీ రోజు వాటిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయన వాటితో "మీరెందుకు ముళ్ళని పెంచుకుంటున్నారు రక్షణ కోసమే కదా, ఆ రక్షణ నేనిస్తాను. మిమ్మల్ని నేనెంతో ప్రేమగా చూసుకుంటాను" అని చెబుతుండేవారు. కొన్ని రోజులకి ఒక అద్భుతం జరిగింది. తరువాత మొలిచిన పిల్ల మొక్కలు ముళ్ళు లేకుండానే బయటికి రావడం జరిగింది. ఇది ఆధ్యాత్మిక జగత్తులో  ఒక సంచలనాన్నే సృష్టించింది. ఇదంతా వాక్కు యొక్క శక్తే అన్నమాట. ఎంత ప్రేమగా మనం మాట్లాడతామో మొక్కలు కూడా వాటికి స్పందిస్తాయి అని ఆయన వివరించారు.  "తల్లితండ్రులు వివాహం చేసుకున్నాక పిల్లలు అనే విత్తనాల్ని చాలా జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఉంది, మంచి సంస్కారాలని వారికి అలవాటు చెయ్యవలసి ఉంది. అలా చేసినట్లైతే ఒక మామిడి చెట్టు ఏ విధంగా అయితే కొన్ని వందల మధుర ఫలాలని ఇస్తుందో, తిరిగి ఆ మామిడి టెంకల ద్వారా తిరిగి కొన్ని లక్షల చెట్లు ఉత్పన్నమయ్యి సమాజానికి ఉపయోగపడుతుందో, అదే విధంగా మానవ మొక్కల్ని కూడా జాగ్రత్తగా పెంచినట్లయితే అవి కూడా సమాజానికి ఎంతో మేలు చేస్తాయి" అని ఆయన వివరించారు. 

నేను లోగడ చదివిన పురాణ కథలు, రాణులు గర్భవతులుగా ఉన్నపుడు ఆశ్రమాలకి వెళ్ళడం, మన పెద్దవారు ఇంట్లో ఎవరైనా గర్భం ధరించినపుడు మనసు ప్రశాంతంగా పెట్టుకోమ్మా అని చెబుతూ ఉండడం, ఆహార నియామాలు చెప్పడం వీటిలో ఎంత విజ్ఞానం ఉందో కదా అని నాకు అనిపించింది. కాని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నాం కాబట్టి మనమే కాదు మన పిల్లల అయస్కాంత క్షేత్రాలు అసహజంగా, ప్రతికూలంగా  ఉన్నందువల్లనే  మన ఆలోచనలలో హింస, ద్వేషాలు పెరిగి ఈ దాడులు యుద్ధాలు జరుగుతున్నాయి. మన సంస్కృతిని మరచిపోయి వేరొకరి సంస్కృతిని మనం స్వీకరించినపుడు ఇటువంటి విపరీత పరిణామాలు తప్పవు కదా అని నేననుకున్నాను. ఈ లోపల ఆయన అదృశ్యమైపోయారు. ఇంకాసేపు నేను ఆ పౌర్ణమి వెన్నలను ఆస్వాదిస్తూ ఆయన చెప్పిన విషయాలను మననం చేసుకున్నాను.