శ్రీ మల్లాది గోవింద దీక్షితులుగారు నాతొ చాలా సన్నిహితంగా ఉండేవారు . క్రమం తప్పకుండా ప్రతి రోజూ నాతొ మాట్లాడుతుండేవారు .ఒక సారి ఆయన శ్రీపాద శ్రీ వల్లభుల గారి గురించి ఒక అద్భుతమైన కథ చెప్పడం జరిగింది
శ్రీపాద శ్రీ వల్లభులు స్వామి సమర్థ సాక్ష్యం ఇచ్చుట
బహుశా ఇది మల్లాది గోవింద దీక్షితులుగారి ముత్తాత తరంలోఅంటే సుమారు 1910 -15 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనఅని చెప్పారు. అప్పుడు మల్లాదివారి కుటుంబీకులు పిఠాపురంలో ఉంటుండేవారు.ఒక సారి గుంటూరు నుంచి ఒక వైశ్య వర్తకుడు పిఠాపురం వచ్చాడు. అతనికి అక్కడ కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. అక్కడ భూములు కొనుక్కుని అక్కడే వ్యవసాయం చేస్తూ స్థిర పడి పోవాలి అనే ఉద్దేశ్యంతో ఆయన వచ్చాడు. చుట్టూ ప్రక్కల అంతా వెతుక్కుని కొన్ని పొలాలను చూసుకున్నాడు. వాటికోసం ఆయనకి కొంత పైకము అడ్వాన్స్ గా ఇవ్వాల్సి వచ్చింది.
అది ఇచ్చి ఆయన గుంటూరు కి తిరిగి వెళ్లి అక్కడ ఉన్న ఆస్తి-పాస్తులు అమ్ముకుని ఆ వచ్చిన ధనముతో ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే తలంపు అతనికి కలిగింది. కాని అతని దగ్గర అడ్వాన్స్ చెల్లించడానికి అంత డబ్బు లేక పోవడముతో అక్కడే పిఠాపురంలో ఉన్న ఒక సంపన్న వర్తకుని దగ్గరకి వెళ్లి ప్రామిసరీ నోటు వ్రాసి ఇచ్చి కొంత డబ్బు అప్పు తీసుకుని ఆ వ్యవసాయదారునికి అడ్వాన్స్ చెల్లించి గుంటూరు వెళ్ళిపోయాడు. అక్కడి ఆస్తి-పాస్తులు అమ్మేసుకుని ఆ ధనం తో పిఠాపురానికి వచ్చేసి ఆ ధనిక వర్తకుని బాకీ తీర్చేసాడు. కాని యేవో కారణాలవల్ల ఆ ప్రామిసరీ నోటు ఆ ధనికుడు వాపసు ఇవ్వలేదు. ఆ వర్తకుడు కూడా అంత పట్టించుకోలేదు. ఇలా కొన్ని రోజులైనాక ఆ వర్తకునికి రాజమండ్రి హైకోర్ట్ నుంచి ఒక నోటీసు వచ్చింది. దాని సారాంశం ఏమంటే ఫలానా తేదీన ఈ వర్తకుడు నా దగ్గర్నుంచి ధనం అప్పు తీసుకుని ఇన్ని నెలలైనా బాకీ తీర్చలేదు. తక్షణమే ఆ డబ్బు వడ్డీతో సహా వాపసు ఇవ్వవలసినదిగా కోర్ట్ నోటీసు ఇప్పించాడు. ఇది చదివిన ఆవర్తకుని గుండె చెదిరి పోయింది. చాలా భయపడి పోయాడు. ఆ ధనికుడు ఆ పట్టణంలో మంచి పేరున్నవాడే. ఏదో పొరబాటు జరిగి ఉంటుంది అని ఆలోచించి ఆ ధనికుడి దగ్గరకి వెళ్ళాడు."నేను అప్పుడే మీ బాకీ తీర్చేసాను కదా ! ఈ సంగతి మీకు తెలిసీ కూడా నాకిలా ఎందుకు కోర్ట్ నోటీసు పంపించారు ?" అని అడిగాడు. "మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి పనులు చేయరు అని నాకు నమ్మకం ఉంది. ఎక్కడో, ఏదో పొరబాటు జరిగి ఉంటుంది అని కనుక్కోవడానికి వచ్చాను" అని చెప్పాడు.
దానికి ఆ అప్పు ఇచ్చిన ధనికుడు, "భలేవారే ! ఏమిటీ ఇలా మాట్లాడుతున్నారు? మీరు నాకు అసలు ఎప్పుడు డబ్బు వాపసు ఇచ్చారు? మీరు వాపసు ఇచ్చి ఉంటె ఆ ప్రామిసరీ నోట్ మరి నా దగ్గరే ఎందుకు ఉంది? అది మీ దగ్గరే ఉండాలి కదా ! అయినా ఎవరైనా సాక్ష్యం ఉన్నారా?" అని అడిగాడు.
దానికి గుంటూరు నుంచి వచ్చిన వర్తకుడు ఇలా అన్నాడు. మీరేమో పెద్ద మనుష్యులు. ఇలా అన్యాయం చేయడం ఏమి బాగా లేదు . ఈ విషయం మన ఇద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియదు అని మీకు బాగా తెలుసు అని ఆ వర్తకుడు అన్నాడు . అప్పుడేమో ఆ ధనికుడు మీరు అప్పు తీర్చేసి ఉంటే ఆ ప్రామిసరీ నోటు నేను మీకు వాపసు ఇచ్చేవాడిని. అది నా దగ్గరే ఉన్నది. మీరు నా అప్పు తీర్చలేదు. ముందు నా బాకీ తీర్చండి అని గట్టిగా మందలించి ఆ వర్తకున్ని పంపించేసాడు.
దీనితో పాపం ! ఆ వర్తకుడు దిక్కు తోచక గాభరా పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. డబ్బులు వాపసు ఇచ్చినప్పుడు సాక్షులు కూడా ఎవ్వరూ లేరు . పైగా ఎవరూ నా మాటలు నమ్మరు. పరిస్థితి చాలా విషమంగా ఉంది అని సతమతమవుతూ ఉంటే అతని స్నేహితులు ఒక ఉపాయం చెప్పారు. ఈ ఊళ్లోనే శ్రీ పాద శ్రీ వల్లభుల వంశానికి చెందిన మల్లాదివారి కుటుంబం ఉంది. పై ఊరినుంచి వచ్చిన ఎవరినైనా సరే దత్త స్వరూపులుగా భావించి ఆతిథ్యం ఇస్తారు. నీవు అక్కడికి వెళ్ళు. తప్పకుండా నీ సమస్య తీరిపోతుంది అని సలహా ఇచ్చారు. ఇక దిక్కు తోచని స్థితిలో ఆ వర్తకుడు శ్రీ పాద శ్రీ వల్లభులని నమ్ముకుని ఆయన మీదే భారం వేసి మల్లాది వారింటికి వెళ్ళాడు. ఆ ఇంటి సాధ్వీమణి అతనిని చూసి మీరు పై ఊరినుంచి వచ్చినట్టున్నారు. బాగా అలసి పోయినట్టు కనిపిస్తున్నారు. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని రండి. భోజనం వడ్డిస్తాను అని అన్నది.సరే అని ఆయన కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు. అన్యమనస్కంగా భోజనం చేస్తున్న అతన్ని చూసి ఆ సాధ్వీమణి , "ఏమిటీ నాయనా ! అలా ఉన్నావు ?నిన్ను చూస్తుంటే ఏదో చాలా బాధ పడుతున్నట్టుగా ఉన్నావు. అసలు విషయమేమిటీ? అని అడిగింది. ఆయన భోరున ఏడుస్తూ జరిగిన సంగతి అంతా చెప్పాడు విషయం విని ఆవిడ కూడా చాలా బాధ పడింది . మరి సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు ఎవరూ లేరా? అని అడిగింది. నిన్ను చూస్తే మంచి సాధు స్వభావం ఉన్న వాడిలా కనిపిస్తున్నావు. నీవు చెప్పింది నిజమైతే మా శ్రీపాదుడే వచ్చి సాక్ష్యం చెప్తాడులే అని అన్నది. మంచి మనస్సు ఉన్నవాళ్ళు ఏమీ ఆలోచించకుండానే వారి మనస్సులో ఉన్నది మనస్పూర్తిగా బయటకి చెప్పేస్తారు. ఆవిడ మాటలు వినగానే ఆ వర్తకునికి ధైర్యం వచ్చింది. ఈలోగా ఆ సాధ్వీమణి ఈ విషయం తన భర్తకి చెప్పితే ఆయన లబోదిబోమని మొత్తుకున్నారు.
నీవెందుకు శ్రీపాదుడు సాక్ష్యం ఇస్తాడు అని చెప్పావు ? శ్రీపాదుడేమిటి ? సాక్ష్యం ఏమిటీ? ఇది జరిగే పనేనా? ఇలాంటి అసాధ్యమైన హామీలు ఎందుకు ఇస్తున్నావు? అని మందలించారు. ఆవిడ మటుకు ధైర్యంగా మరి దేవుడైన శ్రీపాద శ్రీ వల్లభుడు భక్తులైన వారికి సహాయం చేయాలి కదా ! మరి ఆ మనిషిని చూస్తే నిజమే చెప్తున్నాడని నాకనిపిస్తుంది. అటువంటి మంచి ,నిజాయతిపరుడైన వ్యక్తికి శ్రీపాద శ్రీ వల్లభుడు సహాయం చేయకపోతే మన మాట పోదా ? ఏమో ! నాకేమీ తెలియదు. నేనైతే మాట ఇచ్చేశాను. నా మాట నిలబెట్టడం ఆ శ్రీ పాదుని బాధ్యతే అని చెప్పేసి తన పనిలో ఆవిడ మునిగిపోయింది.
ఇక్కడ గుంటూరు నుంచి వచ్చిన వర్తకుడు తన లాయరు దగ్గరకి వెళ్ళాడు. నీకెవరైనా సాక్ష్యం ఉన్నారా అని లాయరుగారు అడిగితే ఉన్నారు అని బదులు చెప్పాడు. ఆ లాయరుగారు కూడా అంత పట్టించుకోలేదు.రాజమండ్రి హై కోర్టులో తారీఖు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కోర్ట్ కి వెళ్ళారు. ఆ రోజుల్లో బ్రిటిషువారి పరిపాలన మూలంగా అక్కడ ఒక ఆంగ్లేయుడే న్యాయమూర్తిగా ఉన్నాడు. కేసు విచారణకి వచ్చిన రోజున ఆ వర్తకుని లాయరుగారు సాక్షి గురించి ఎప్పుడు వస్తాడు? ఎక్కడ ఉన్నాడు? అని అడిగితే శ్రీ పాద శ్రీ వల్లభులే సాక్ష్యం ఇస్తారు అని ఆ సాధ్వీమణియే చెప్పారు అని సమాధానం చెప్పాడు. అది విని లాయరుగారు బిత్తర పోయారు. అదేమిటండీ! శ్రీ పాద శ్రీ వల్లభుల వారేమిటీ? సాక్ష్యం చెప్పడానికి రావడ మేమిటీ? నాకంతా గందరగోళంగా ఉంది. మీరు నాకు ముందే చెప్పాల్సింది కదా ! ఆయన ఎలా వస్తారు? అని గాభరా పడ్డారు.
ఇంతలో " శ్రీ పాద శ్రీ వల్లభుల వారు హాజరు కావాలి " అని బంట్రోతు గట్టిగా పిలిచాడు. అక్కడ సాక్ష్యం చెప్పే బోనులో స్వామి సమర్థ వారి ఆకారం ప్రత్యక్షమయింది. కోలాహలంతో కోర్ట్ హాలు దద్దరిల్లి పోయింది. జడ్జిగారు కూడా చాలా ఆశ్చర్య పోయారు. ఇదంతా ఏదో దైవిక శక్తి లాగా ఉంది. ఇది ఎలా సాధ్యం? అయినా ఒక్క నిమిషం ఆలోచించి తన విధి తానూ చేయాలి కాబట్టి "స్వామీ ! మీరు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు కదా ! మీ పేరేమిటీ ? అని స్వామి సమర్థవారిని అడిగారు.
ఇదేమి ప్రశ్నరా బాబూ ! నేనేమిటీ ? నా పేరేమిటీ ? అన్ని పేర్లు నావే. నేను అంతటా ఉన్నాను. అందరిలో ఉన్నాను అని స్వామి సమర్థవారు బదులు చెప్పటం జరిగింది.
ఆ మాటలు విని ఆ జడ్జిగారు ఇతనెవరో సాధారణమైన వ్యక్తి కాదు. అందరి లాగా కాదు అని భావించుకుని నెమ్మదిగా, "స్వామీ ! తమరి కులమేమిటీ?" అని అడిగారు.
"నేను చర్మకారుణ్ణి. మాదిగవాణ్ణి "అని స్వామి సమర్థవారు గట్టిగా అరిచి చెప్పారు
.అప్పటికే హాలులో ఉన్న జనమంతా హడలిపోయి ఉన్నారు.అక్కడ జరుగుతున్నదంతా విచిత్రంగా ఏదో మహా శక్తి ఆవరించుకున్నట్టుగా అనిపించింది. ఈ అప్పిచ్చిన ధనికుడు గడగడా వణికి పోసాగాడు.అటువంటి మహా దైవిక శక్తి ముందు తను చేసిన ఈ అమానుష పనికి లోపల్లోపలే పశ్చాత్తాప పడడం మొదలు పెట్టాడు. శ్రీపాద శ్రీ వల్లభుడు సాక్ష్యం చెప్పడానికి వస్తాడు అని నేనెప్పుడూ అనుకోలేదు. అనవసరంగా అబద్ధమాడాను. ఇప్పుడు నాగతేమిటీ? ఏమన్నా శిక్ష పడుతుందో ఏమో అని పరిపరి విధాలా ఆలోచించ సాగాడు.
తదుపరి ప్రశ్న "మీ తల్లిదండ్రులేవరూ?" అని జడ్జిగారు అడిగారు.
"నా తలిదండ్రులా? నాకు పుట్టుక ఏమిటీ? చావేమిటీ? నా తల్లిదండ్రులంటూన్నావేమిటీ ? అసలు నీ పుట్టుక గురించి నువ్వాలోచించుకో. నీ తండ్ర్రెవరో నీకు తెలుసా?" అనిగర్జించారు.
ఆ స్వామివారి మేఘ గర్జనకి ఆ జడ్జి గారేమిటీ, లాయర్లేమిటీ, అందరూ కూడా నిశ్చేష్టులై పోయారు. గడ గడా వణికి పోవడం మొదలు పెట్టారు.
పాపం ! ఆ జడ్జీ గారు దెబ్బకి క్రింద పడిపోయారు. ఇదేమిటీ? నేను అనాథున్ని, అక్రమ సంతానాన్ని (లావారిస్),నా తండ్రెవరో ఏమో నాకే కాదు మరెవ్వరికీ కూడా తెలియదు అని ఈయనకి ఎలా తెలిసి పోయిందీ? అని గాభరా పడి పోయారు. కోర్టులో అందరూ కూడా ఏమవుతుందా అని భయపడి పోయారు. ఇతనెవరో సామాన్య మానవుడు కాదు. మహానుభావుడు అయి ఉంటాడు అని అనుకున్నారు.
ఇక్కడ ఆ ధనికుడు పశ్చాత్తాప పడుతూ జడ్జీ గారి దగ్గరకి పరిగెత్తుకుని వచ్చాడు. గుంటూరు నుంచి వచ్చిన ఆ వర్తకుడికి మాత్రం ఆశ్చర్యంతో నోట మాట రాకుండా అలాగే ఉండి పోయాడు. అక్కడ అందరి పరిస్థితి అలాగే ఉండింది. ఆ ధనికుడు గబా గబా జడ్జీగారి దగ్గరకి వెళ్లి , నేను చాలా పొరబాటు చేసాను.ఆ వర్తకుడు చాలా మంచివాడు, నిజాయతిపరుడూ,నా బాకీ అప్పుడే తీర్చేసాడు. నేను ఆ ప్రామిసరీ నోటు అతనికి వాపసు ఇవ్వకుండా,అతన్ని మోస పుచ్చి, మళ్ళీ డబ్బు అతని దగ్గర్నుంచి లాక్కోవాలనే దురాశతో ఇలా చేసాను నన్ను క్షమించండి. మీరు ఏ శిక్ష విధించినా నాకు అంగీకారమే అని ప్రాధేయ పడ్డాడు. ఈ విధంగా ఆ ధనికుడు తన తప్పు ఒప్పుకున్నాడు. ఆ జడ్జిగారు ఆ ధనికున్ని కోప్పడి బాగా జరిమానా వేసి అక్కణ్ణుంచి పంపించేసారు. ఆ గుంటూరు నుంచి వచ్చిన వ్యాపారి మాత్రం శ్రీ పాద శ్రీ వల్లభులవారి మహిమ ఏమిటీ ఇలా జరిగింది. నిజంగా వారి వంశం వారు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టారు కదా ! అని అనుకుని శ్రీ పాద శ్రీ వల్లభులవారి పరమ భక్తాగ్రేసర చక్రవర్తి లాగా మారి పోయాడు. అయితే ఈ వృత్తాంతమంతా ఆ జడ్జీ గారు తన డైరీలో వ్రాసుకున్నట్టుగాలేక స్పెషల్ గా నోట్ చేసుకున్నారు. అది ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ లో ఉన్నది అని శ్రీ గోవింద దీక్షితులు గారు చెప్పారు.
అంతే కాకుండా మొట్టమొదటిసారిగా వెలువడిన"సాయి సచ్చరిత్ర" వావిళ్లవారు ప్రచురించినప్పుడు ఈ వృత్తాంతమంతా ఆఖరి అధ్యాయములో కలిపి ప్రచురిస్తాము, మాకు అనుమతి కావాలి అని కోరితే శ్రీ గోవింద దీక్షితులు గారు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ ఎడిషన్ కోసం శ్రీ గోవింద దీక్షితులు గారు ఎంత ప్రయత్నించినా వారికి దొరకలేదు అని నాతొ చెప్పారు.