గోవింద దీక్షితులుగారి పునర్జన్మ - మాతా సుమతీ మహారాణి యొక్క అనుగ్రహం
ఒకసారి పిఠాపురంలో శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి అరికాలికి ఒక పెద్ద గాయం అయింది. ఆయన డయాబ్టీస్ తో చాలా బాధ పడుతుండేవారు. ఆహార విషయాల్లో ఆయన ఏ నియమాలు పాటించక పోయేసరికి ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది. అయినా ఆయన తన దేహ స్థితిని ఏ మాత్రమూ గమనించే వారు కాదు. ఈ అరికాలిలో తగిలిన గాయం ఒక పెద్ద వ్రణమయి కూర్చుంది. ఆఖరికి అది లోపలంతా క్రుళ్లిపోయి gangrene లాగా అయింది . gangrene అంటే డేడ్ టిష్యూ అన్న మాట. అదే సమయానికి ఈ మధు మేహం కూడా ఉండడంతో చాలా అవస్థ పడుతుండే వారు. దానితో కుటుంబ సభ్యులంతా గాభరా పడి పోయారు.
ఇద్దరు ముగ్గురు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి శిష్యులు అంబులెన్స్ పిలవడమూ అది రావడానికి చాలా ఆలస్యంజరగడమూ ,ఇంతలో ఈయనకి ఆయాసం చాలా ఎక్కువ అవడంతో వారి శిష్యులకి ఏం చేయాలో అర్థం కాలేదు. వారు వెంటనే ఒక ప్రైవేట్ టాక్సీ మాట్లాడుకుని అందులో ఆయన్ని కూర్చోబెట్టుకుని కాకినాడ జనరల్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చేర్పించారు. అదృష్టవశాత్తు అక్కడ కూడా శ్రీ దీక్షితులు గారికి తెలిసిన సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నశిష్యుడైన డాక్టర్ గోపాల్ గారు కనిపించారు. ఆ డాక్టర్ గారికి శ్రీ దీక్షితులు గారంటే చాలా ఆభిమానమూ, ప్ర్రేమా , గౌరవమూ ఉన్నాయి. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టి చాలా ఖరీదైన anti - biotics వాడడం మొదలు పెట్టారు. కాని కాలి గాయం మాత్రం ఒక పట్టాన తగ్గటం లేదు. ఈ లోగా శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి అభిమాని ఒక ఆవిడ దీక్షితులు గారికి ఫోన్ చేసారు. వారి అమ్మాయి ఆవిడతో ఫోనులో మాట్లాడింది. ఓహో ! మీరా ! మా నాన్న గారు ఎప్పుడూ మీ గురించే చెప్పతూ ఉంటారు. మా నాన్నగారిని ఇక్కడ కాకినాడ జనరల్ ఆసుపత్రిలో ఒంట్లో బాగా లేకపోతె చేర్పించాము . చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పారు. అప్పుడు ఆవిడ ఎన్ని రోజులయ్యింది ఇక్కడ చేర్పించి ? అని అడిగితే రెండు రోజులనుంచి ఇక్కడే ఉన్నాము. ఇక్కడ మా నాన్న గారి అభిమాన శిష్యులు చాలా శ్రద్ధగా చూసుకుంటూ ,వారి ఇంటినుంచే మాకు భోజనము తీసుకుని వస్తున్నారు. నాన్నగారు ఎప్పుడూ మీ గురించే మాట్లాడుతుంటారు అని ఆవిడ ఎంతో ఏడుస్తూ విషయమంతా చెప్పారు. వెంటనే ఈ సమాచారం ఆయన అభిమానులందరికీ చేరింది. ఈలోగా శ్రీ మల్లాది దీక్షితులుగారు నాకు డాక్టర్ ప్రశాంత్ గారి వైద్యం కావాలిరా. ఆయనతో మాట్లాడండి అని చెప్పగా, డాక్టర్ ప్రశాంత్ గారితో మాట్లాడడం అయింది. డాక్టర్ ప్రశాంత్ గారు హైదరాబాద్ లో పేరు మోసిన హోమియో వైద్యులు. ఆయనతో మాట్లాడితే ఆ కాలి గురించి వివరాలు కావాలి అని అడగ్గా ఆ డాక్టర్ గారిని అడిగి, కాలి వివరాల ఫొటోలన్నీ స్కాన్ చేసి పంపగా ఆయన ఆ వివరాలన్నీ చూసాక ఫలానా ఫలానా మందులు ఇవ్వండి అని చెప్పటమూ, ఆ మందులు కొని వాడడమూ, దీని మూలంగా శ్రీ దీక్షితులుగారు పూర్తిగా స్వస్థతులయినారు. ఈ సంఘటన జరిగినాక ఒక సారి శ్రీ దీక్షితులుగారు నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన చెప్పారు.
అది ఆయన అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు , అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు , ఆయన్ని టాక్సీలో పడుకోబెట్టి కాకినాడ ఆసుపత్రికి తీసుకు వెళ్ళుతున్నప్పుడు ఆయన ఒక విధమైనటువంటి స్పృహ లేని పరిస్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉండగా ఒక అద్భుతమైన దృశ్యం ఆయనకీ గోచరించింది. సాక్షాత్తు సుమతి మహారాణి గారి ఒడిలో ఆయన తల పెట్టుకుని పడుకుని ఉన్నారు. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అంత వరకు పడుతున్న బాధంతా మటుమాయమై పోయింది. ఆయన ఆవిడవైపు ఆరాధనగా చూస్తుండగా, ఆవిడ కరుణ నిండిన కళ్ళతో ఆయన్ని చూస్తూ తల నిమురుతూ , నాయనా ! ఎంత పని చేస్తున్నావు? నీ ఆరోగ్యం నీవెందుకు ఇలా పట్టించుకోకుండా ఆ సిగరెట్లు ఎందుకు త్రాగుతున్నావు? జాగ్రత్తగా ఆరోగ్యం పెట్టుకో నాయనా , నేను నీకోసం పరిగెత్తుకు రావలసి వచ్చింది. ఇకనుంచైనా నీవు ఆ సిగరెట్లు మానేసి నీ ఆరోగ్యం గురించి చూసుకో అని చాలా లాలనగా చెప్పారు. అయితే ఆసుపత్రిలో చేర్చినప్పుడు మాత్రం శ్రీ దీక్షితులుగారి హార్ట్ బీట్స్ ,పల్స్ బీట్స్ మాత్రం మామూలుగానే ఉండాలి. తర్వాత ఆయన కొద్దిగా తేరుకున్నారు. ఈ విధంగా సుమతి మహారాణిగారు నాకు పునర్జన్మని ప్రసాదించారు అని ఆయన నాకు చెప్పటం జరిగింది. ఇది కూడా ఒక అద్భుతమైన సన్నివేశమే.
పంచ దేవ్ పహాడ్ అనఘాష్టమి వ్రతం
పంచ దేవ్ పహాడ్ అనగానే అనఘుడి ఆలయం గుర్తుకి వస్తుంది. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు మాటల సందర్భంలో పంచ దేవ్ పహాడ్ ప్రాంతంలోనే ఆ రోజుల్లో అనఘా అనఘుడి ఆలయం ఉండేది. అక్కడ శ్రీ పాద శ్రీ వల్లభుల వారు అనఘాష్ట వ్రతం చేసుకోవలసిందని తన భక్తులకి ఆదేశం ఇస్తుండేవారు. పంచ తత్వ పంచ భూత యజ్ఞం చేస్తుండే వారు అని ఆ తర్వాత ఆయనక గోవులని చాలా ప్రేమించే వారని శ్రీ దీక్షితులు గారు నాతో చెప్పటంతో నేనెందుకు ఇక్కడ ఈ అనఘాష్టమి వ్రతం చేసుకో కూడదు అని నాకు ఒక విధమైన ప్రేరణ కలిగింది. దాదాపు పదిహేడేళ్ల నుంచి నేను ఈ అనఘాష్టమి వ్రతం చేస్తూ వచ్చాను. దాదాపు 600 ,700ల సంవత్సరాల క్రింద పంచదేవ్ పహాడ్ లో జరుగుతుండే ఆ వ్రతం అక్కడే ఎందుకు చేసుకో కూడదు అనే బలమైన సంకల్పం కలిగింది. శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం రెండవ భాగంలో నాలుగు, ఐదవ అధ్యాయంలో ఉన్న అనఘాష్టమీ వ్రతం ఐదు కథలు శ్రీ దీక్షితులు గారు నాకు కురియర్ లో పంపించారు. నేను వాటిని నాకు తెలిసిన కుర్రాడితో ఆ వ్రతమంతా ఒక కాసేట్ట్ ఫాంలో తయారు చేసాను. ఆ తర్వాత మర్నాడు శ్రీ దీక్షితులు గారిని కలిసి ఆయనతో చెప్పగా నీవు తప్పకుండా పంచ దేవ్ పహాడ్ కి వెళ్ళు. నీకు మంచి సంకల్పం కలిగింది. తప్పకుండా నీవు అక్కడికి వెళ్లి అనఘాష్టమి వ్రతం చేసుకో అని చెప్పారు.నేను నా శ్రీమతి ,నా స్నేహితుడు అతని భార్య మేము నలుగురమూ కలిసి ఈ వ్రతం చేసుకున్నాము. 600ల సంవత్సరాల తర్వాత అక్కడే నేను ఈ అనఘాష్టమి వ్రతం చేసుకోగలగడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది