ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు
గాయత్రి పరివార్ తో నా పరిచయం - సంజీవని విద్య శిబిరం
నేను 2007 లో టాంజానియా నుంచి శాశ్వతంగా భారత దేశానికి తిరిగి రావడం జరిగింది. నాకు చిన్నప్పట్నుంచి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కాస్త ఎక్కువగా ఉండడం వల్ల నేను ఏ ఉద్యోగం లో కూడా చేరకుండా ఆధ్యాత్మిక విషయాల వైపే నా ధ్యాస మళ్ళించు కున్నాను. ఆ సమయంలో నాకు ఈ గాయత్రి పరివార్ తో పరిచయ భాగ్యం కలిగింది. వీరు హరిద్వార్ లో శాంతి కుంజ్ అనే ప్రదేశంలో 10 రోజుల పాటు సంజీవని విద్య అనే కార్యశాలని (work shop) ఆయోజన చేసారు .అందులో పాల్గొనటానికి నేను హరిద్వార్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ గాయత్రి మంత్ర జపము, గాయత్రి హోమము వగైరా వగైరా ఎన్నోఆధ్యాత్మిక
కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి అవి నేను మీతో పంచుకో దలుచుకున్నాను.
శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఈ గాయత్రి పరివార్ సంస్థ స్థాపించారు. వీరి ఆశ్రమం శాంతికుంజ్ హరిద్వార్ లో ఉన్నది. శ్రీ రామ్ శర్మఆచార్య గారు 24 సంవత్సరాలు, సంవత్సరానికి 24 లక్షల చొప్పున గాయత్రి మంత్రం మహాపునశ్చరణ చేసినటువంటి మహా తపస్వి. ఈ శాంతి కుంజ్ లో హోమానికి కావలసిన సామగ్రి అంతా అంటే మూలికలు వగైరా వగైరాలు హిమాలయాల నుంచి తెస్తారు. అంతే కాకుండా హిమాలయాల నుంచి రక రకాల మూలికలు తెచ్చివాటితో ఆయుర్వేద మందులు ఈ శాంతి కుంజ్ లో తయారు చేస్తారు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు చేసి గాయత్రిమాత సాక్షాత్కారం పొందిన ప్రదేశమే ఇది. ఈ తపో భూమిలోనే సప్తర్షులు కూడా తమ తపస్సు ఇక్కడే చేసుకున్నారు.
ఈ ప్రదేశాన్ని ఈ పుణ్య భూమిని కొనమని శ్రీ రాం శర్మఆచార్యగారి గురువుగారైన సర్వేశ్వారానంద స్వామి ఆదేశించారు అదే ప్ర్తకారంగా ఆచార్య గారు తన ఆస్తి పాస్తులన్ని అమ్మి ఈ పుణ్య భూమిని కొన్నారు . శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతమ్ లో సాక్షాత్తు శ్రీ పాదులవారు హిమాలయాల లోని శంబల అనే ప్రదేశం లో కలిసి ఆయనని ఆశీర్వదించారు. శ్రీ రాం శర్మ ఆచార్య గారు పూర్వ జన్మలో సంత్ కబీర్ దాస్ , మరొక జన్మలో శివాజీ గురువుగారైన సమర్థ రాందాస్ గాను ,మరొక జన్మలోస్వామి వివేకానందగారి గురువైన శ్రీ రామ కృష్ణ పరమ హంస గాను జన్మించారు.
ఈ శిబిరం లో పాల్గొనడానికి వేల కొద్ది ప్రజలు భక్తులు వచ్చారు . అక్కడ నూట అరవై మంది తెలుగు వాళ్ళు నాకు కలిసారు.ఈ శిబిరంలో అన్నీ నిర్దిష్టమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అన్నీవేళ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. క్రమశిక్షణ కూడా అందరూ పాటిస్తుంటారు.
అక్కడ గాయత్రి మాత మందిరం ఉంది. దాని ఎదురుగా విశ్వామిత్రుని యొక్క విగ్రహం ఉంది. సప్తర్షుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడే ఒక ధ్యాన మందిరం కూడా ఉన్నది. తెల్లవారు ఝామునే అయిదు గంటలకి గంట మ్రోగగానే అందరూ లేచి గబ గబా స్నానాలు చేసి అయిదున్నర కల్లా హారతి కార్యక్రమంలో పాల్గొనడానికి
భక్తులందరూ కూడా చక్కగా గాయత్రి మందిరానికి వెళ్లి అక్కడ ఉన్న పెద్ద ఎత్తైన అరుగు మీద స్త్రీలంతా కూడి అమ్మవారి మీద పాటలు పాడుతుంటుంటే పురుషులంతా నించుని భక్తీ శ్రద్ధలతో నమస్కారాలు చేస్తుండేవాళ్ళు. గాయత్రి పూజ అయిన వెంటనే కొన్ని వేలమంది క్రమశిక్షణతో క్యూలో నిలబడతారు. అక్కడే అందరి చేత గాయత్రి హోమం చేయిస్తారు. ఆ వచ్చిన వారిలో దంపతులు కనక ఉంటే ప్రక్క ప్రక్కన కూర్చుని గాయత్రి హోమం చేస్తుంటారు. పూజలు అవి అన్నీ అయినాక అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తుండే వాళ్ళు.
ఆ తర్వాత అక్కడ ఈ శిబిర ప్రాంతంలో ప్రొద్దున్నే 7.30 కల్లా కాంటీన్ తెరుస్తారు. అక్కడ అన్ని ప్రకారాల ఫలహారాలు దొరుకుతాయి. టీలు, కాఫీలు, పళ్ళ రసాలు ఏవి కావాలంటే అవి కొనుక్కోనవచ్చును. కాని అక్కడ అన్ని సాత్విక ఆహారాలే దొరుకుతాయి. ఆ తర్వాత 8 గంటలనుంచి 11 గంటల వరకు జపం గాని ధ్యానం కాని చేసుకొన వచ్చును. అక్కడ గాయత్రి జపం 30 మాలలు తప్పకుండా చేయాలి అనే నియమం ఉన్నది. అది ధ్యాన మందిరంలో కూర్చుని చేయ వచ్చును. లేదా గాయత్రి గుడిలో కూర్చుని చేసు కోన వచ్చును. అక్కడ శ్రీ రాం శర్మ ఆచార్య గారి సమాధి ఉంది అక్కడ కూడా ధ్యానం చేసుకొన వచ్చును. ఒక రోజు మొత్తం లో ఎప్పుడైనా సరే కాని 30 మాలల జపం పూర్తి చేయాలి. ప్రక్కనే గంగా నది కూడా ఉన్నది. అక్కడ కావాలంటే స్నానాలు చేసుకొన వచ్చును అది మన ఇష్టం మీద ఆధార పడి ఉంటుంది. తర్వాత 11 గంటలకే భోజనాలు పెడతారు.భోజనాలు మటుకు ఉచితంగానే ఇస్తారు. భోజనాలయినాక ఒక గంటో రెండు గంటలో మనం విశ్రాంతి తీసుకోన వచ్చును. లేక పోతే హాయిగా గ్రంథాలయంలో కూర్చుని పుస్తకాలతో కాలం గడప వచ్చును. తర్వాత 2 గంటల నుంచి 4 గంటల దాకా ఆధ్యాత్మిక విషయాలమీద, గాయత్రి మంత్రం మీద ఉపన్యాసాలు, ప్రవచనాలు ఉంటాయి. తర్వాత టీ బ్రేక్ . అది అయిపోయినాక ఒక గంట బయట తిరిగేసి రావచ్చును. సాయంత్రం సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కొంతమంది యోగ నేర్పిస్తుంటారు.
ఇలా ఎన్నో వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి. 7 గంటల కల్లా రాత్రి భోజనము తర్వాత మళ్ళీ కొంచెం సేపు ధ్యానము చేసుకున్నాక పదింటికి గంట మ్రోగుతుంది అందరూ లైట్లు ఆర్పేసి పడుకుని మరుసటి రోజు కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా ఈ పది రోజులు కూడా ఎలా గడిచి పోయాయో తెలియకుండా మనం ఆధ్యాత్మిక తరంగాలలో మునిగి తేలుతుంటాము.
అక్కడ ప్రక్కనే "గాయత్రి పరిశోధన సంస్థ"
అనే ఒక పెద్ద విశ్వ విద్యాలయం (యూనివర్సిటీ) స్థాపించారు. ఆ విశ్వ విద్యాలయంలో ఈ గాయత్రి మంత్రం శక్తి మీద పరిశోధనలు చేయడం కోసం విదేశాలనుంచి కూడా పరిశోధకులు వస్తుంటారు. అక్కడ గాయత్రి మంత్రం చదువుతున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ నిగమనిస్తారు. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్ ఎంత ఉంది, ఆ తర్వాత గాయత్రి మంత్రం దీక్ష తీసుకుని గాయత్రి మంత్రం చదివినాక మళ్ళీమన ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని వారు పరిశోధనలు చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను వారు శాస్త్రీయపరంగా పొందు పరచుతూ ఉంటారు. ఆ యూనివర్సిటీ లో మహిళా సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. వారు నిత్యం గాయత్రి మంత్రం సాధన చేస్తూ ఉంటారు. గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి గ్రామోద్యోగ లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ఆ మహిళలకి ఎంతో శిక్షణ ఇస్తుంటారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆ యూనివర్సిటీ లో ఏర్పాట్లు చేసారు. ఇక్కడ ఆయుర్వేద ,హోమియో ,ఎలోపతి క్లినిక్ లు ఉన్నాయి. అందులో ఉచితంగా వైద్యం చేస్తారు. మందులు కూడా ఉచితంగా ఇస్తారు
అక్కడే శ్రీ పాద శ్రీ వల్లభుల అంశావతారమైన శ్రీ రాం శర్మ ఆచార్య గారి ఆశ్రమం కూడా ఉన్నది. అలాగే ఇంకా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఈ గాయత్రి మంత్ర శక్తి / మహిమ గురించి చెప్పాలంటే ఒక్క వాక్యం లో చెప్పడం సాధ్య పడదు. అతి కష్టం కూడా. ఆసక్తి ఉన్న వాళ్ళు హరిద్వారకి వెళ్ళ వచ్చును లేదా ఇక్కడ హైదరాబాద్ లో బాట సింగారం దగ్గర ఉన్న శంబల అనే గ్రామం లో కూడా ఇలాంటి శిబిరాలలో పాల్గొన వచ్చును. నేను కూడా హరిద్వార్ లో అటెండ్ చేసినాక శంబలలో కూడా పాల్గొన్నాను. అందులో శ్రీ రాం శర్మ ఆచార్య గారి ప్రియ శిష్యుడైన మారెళ్ళ రామకృష్ణ గారి భాషణ నన్నెంతో ప్రభావితం చేసింది . ఇది వరకు నేను పుస్తకాలలో చదివినటువంటి విషయాలన్నీ కూడా , నాకు తెలిసిన విషయాలు, నాకు కలిగిన అనుభవాలు ఆయన చెప్పటంతో ఒక నిజ నిర్ధారణకి వచ్చాను. సత్యం ఎవరి నోటి నుంచి వచ్చినా పదాలు వేరుగా ఉంటాయి కాని భాష మాత్రం ఒక్కటే అని. గాయత్రి మాత మీద సాహిత్యం కూడా చాలా ఉంది. అందులో అన్నీ శాస్త్రీయ పరంగా వివరించబడి ఉన్నాయి. శ్రీ రాం శర్మ ఆచార్య గారి ఆత్మ కథ కూడా దొరుకుతుంది.