మంత్రాలకు చింతకాయలు రాలతాయా ?
ఇదివరకు నేను మీతో చెప్పినట్టుగానే డా. భార్గవగారు కిర్లిన్స్ కెమెరాతో (Kirlean's Camera)చేసిన పరిశోధనలన్నింటినీ కూడా స్లైడ్స్ లోకి మార్చి ఒక సారి హైదరాబాద్ లో హిమాయత్ నగర్ లో స్లైడ్స్ ప్రదర్శనలు ఇచ్చారు.నేను ఆ ప్రదర్శన చూడడానికి వెళ్లాను .ఆ సందర్భములో ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి మాకు ఆయన చెప్పారు. అదే నేను మీతో పంచుకోదలిచాను .
చిన్నప్పటినుంచి ఈ డాక్టర్ గారికి పరిశోధనలమీద చాలా ఆసక్తి గా ఉండేది. ముఖ్యంగా బయోఎనర్జీ అంటే జీవ శక్తి మీద చాలా పరిశోధనలు చేస్తుండే వారు. ఒకసారి ఆయన విదేశాలకి వెళ్ళినప్పుడు ఒకానొక సందర్భములో ఈ మంత్రాల గురించి, మిగతా ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సభకి వచ్చిన మన భారత దేశపు రాయబారి అందరి ముందు చాలా వెక్కిరింపుగా ఏమిటీ మంత్రాల గురించీ , వీటి గురించీ ఏవో చెప్పుతున్నారు. అవన్నీ ఎప్పుడో పూర్వకాలపు మాటలు పూర్వకాలం వాళ్ళవి. వాటికి సరి అయిన ఆధారాలు కూడా లేవు .అయినా మీ పిచ్చి గాని మంత్రాలకు చింత కాయలు రాలతాయా? అని హేళనగా మాట్లాడారు. ఆ మాటలకి మన డాక్టర్ గారు చాలా బాధ పడ్డారు .
అనుకోకుండా కొన్నాళ్ళకి ఆయన ఈ కిర్లిన్స్ కెమెరాని సంపాదించడం జరిగింది . వెంటనే ఆయన దానితో అనేక రకాలుగా పరిశోధనలు మొదలు పెట్టారు. మొట్టమొదటి సారిగా ఆయన ఒక రాయిని ఈ కిర్లిన్స్ కెమేరాతో ఫోటో తీసారు. అది డెవలప్ చేసినప్పుడు అది మామూలు రాయిలాగానే కనిపించింది. అదే రాయిని ఒక చోట పెట్టి దాని ముందు కూర్చుని ఓంకారాన్ని నాభిలోంచి వచ్చేటట్టుగా కొన్నిసార్లు గట్టిగా ఉచ్చరించి , ఫోటో తీసి , డెవలప్ చేసి, చూసినప్పుడు అద్భుతంగా ఆ రాయి చుట్టూ ఒక కాంతి వలయాన్ని ఆయన గమనించారు. ఇంకొకసారి ఓంకారాన్ని బయటకి అనకుండా మనస్సులోనే నిశ్చలముగా కొన్నిసార్లు అనుకుని ఆ రాయిని మరొకసారి ఫోటో తీసి డెవలప్ చేసి చూస్తే అప్పుడు కూడా అద్భుతంగా ఆ రాయి చుట్టూ కాంతి వలయం కనిపించింది. ఆయన ఈ రకంగా ఎన్నోధ్వనులతో పరిశోధన చేసి "ఓంకారానికి" ఉన్నటువంటి అద్భుతమైన శక్తి మరి ఏ ధ్వనులలో కూడా లేదని ఆయన కనుక్కున్నారు.
ఒక సారి ఆయన పరిచయస్తులు ఎవరో మద్రాసులో లక్ష్మి యజ్ఞం చేస్తుంటే అది చూడడానికి వెళ్ళారు. అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ యజ్ఞాన్ని గమనిస్తున్నారు.ఆసక్తి గల వ్యక్తిత్వం ఉన్నందువల్ల డా.భార్గవ గారు కూడా తన కెమేరాతో ఫోటోలు తీయడం మొదలు పెట్టారు అక్కడే ఫోటోలు తీస్తున్నవీడియో గ్రాఫర్కి మరి ఏమనిపించిందో తెలియదు కాని ఈ డాక్టర్ గారిని పిలిచి, "అయ్యా ! నాకు కడుపు నొప్పిగా ఉంది. నేను ఫోటోలు తీయలేను" అని చెప్పి వెళ్లి పోయాడు. రెండు, మూడు రోజుల తర్వాత డాక్టర్ గారు అటువైపు వెళ్ళుతుంటే ఆ వీడియోగ్రాఫర్ చూసి స్టూడియో కి రమ్మని పిలిచాడు. సరే అని ఆయన స్టూడియో కి వెళ్ళినప్పుడుఆ వీడియో గ్రాఫర్ వేసుకున్న ఆ శబరిమలై యాత్రకి వేసుకున్న దుస్తులు చూసి ఆశ్చర్య పోయారు. అప్పుడు అతను, "సార్ ! నేను మీకు ఒక విషయం చెప్పాలి" అని అన్నాడు. నన్ను అక్కడికి ఫోటోలు తీయమని పిలిచారు. నేనోమో జన్మతః క్రైస్తవుణ్ణి. ఇలాంటి యజ్ఞాలలో కాని పూజల్లో కాని నాకు నమ్మకాలు లేవు . అక్కడ జరిగే తతంగాలు నాకుఏ మాత్రమూ ఇష్టమవ్వలేదు. అందుకనే కడుపు నొప్పి వంకతో నేను అక్కణ్ణుంచి వచ్చేసాను. తీసిన కొన్ని ఫోటోలు ప్రింట్ చేసి మీకిద్దామని డెవలప్ చేసాను. అయితే ఆ ఫోటో లన్నిట్లో అద్భుతంగా ఆ హోమగుండం అగ్నిలో ఆ మహా లక్ష్మి ఆకారం స్పష్టంగా నాకు కనిపించింది. అనుకోకుండా నాకు సాక్షాత్తు లక్ష్మీ దేవి ప్రత్యక్షమయింది అనే భావన నా మనస్సులో కలిగి నాలో మార్పు వచ్చింది. ఆ యజ్ఞం ఫోటోలు పూర్తిగా తీయకుండానే మధ్యలోనే వచ్చేసినందుకు నేను చాలా పశ్చాత్తాప పడుతున్నాను. నేను ఇప్పుడు దీక్ష తీసుకుని శబరిమలైకి వెళ్ళుతున్నాను అని చెప్పాడు. అలాగే మన డాక్టర్ గారు తీసిన ఫోటోలన్నిట్లో కూడా డెవలప్ చేసినప్పుడు ఆ హోమగుండం అగ్ని సాక్షాత్తు లక్ష్మీ దేవి ఆకారంలోనే కనిపించింది. ఈ పరిశోధనలన్నీ అంటే ఈ ఫోటోలన్నింటినీ కూడా స్లైడ్స్ లాగా ఆయన మార్చేసారు.
ఎక్కడైతే మన భారత దేశపు రాయబారి హేళనగా మాట్లాడాడో అదే దేశానికి ఈయన మరొక్కసారి వెళ్ళడం తటస్థించింది. అక్కడ జరిగిన ఆ సభలో ఆయన తయారు చేసిన స్లైడ్స్ సహాయంతో, ఆయన చేసిన పరిశోధనలన్నీ అక్కడికి వచ్చిన వారందరికీ మంత్రాలతో చింతకాయలు రాలడమే కాదు ఇంకా ఎన్నోఅద్భుతమైన విషయాలు జరుగుతాయి దేవీ, దేవతలు కూడా ప్రత్యక్షమవుతారు అని ఆ రాయబారి ముందే స్లైడ్స్ ప్రదర్శన ద్వారా ఆయన ఋజువు చేసారు. ఆ భారత దేశపు రాయబారి శాస్త్రీయంగా వివరించబడిన ఈ విషయాలన్నీ చూసాక సిగ్గుతో తల దించుకున్నాడు.మన భారతదేశపు రాయబారి అయి ఉండీ కూడా, మన సంస్కృతిమరిచి పోయి మన మహర్షులు చెప్పిన విషయాలని అపహసించి విదేశీయుల ముందు అవమానించడం అంటే అది మన దేశానికే దౌర్భాగ్యము కదా ! అక్కడికి వచ్చిన విదేశీయులు అందరూ కూడా ఈ శాస్త్రీయపరమైన ప్రయోగాలను చూసి హర్షద్వానాలతో డాక్టర్ గారిని ఎంతో అభినందించారు. ఈ ప్రదర్శన చూసిన ఆ విదేశీయుల కోరికమీద ఆ దేశములో ఎన్నో చోట్ల ఆయన తన స్లైడ్స్ ప్రదర్శనలు చేసారు. వారందరి అభినందనలు పొందారు
యజ్ఞాలు చేస్తున్నప్పుడూ,మనం ఏ దేవీ దేవతకి సంబంధించిన మంత్రాలు చడువుతామో, ఏ దేవీ దేవతకి సంబంధించిన ఉపాసన చేస్తామో, వాటికి సంబంధించిన దేవుడు ,దేవత ఆ హోమగుండము అగ్నిలోఅదృశ్యంగా ఉంటారు. ప్రత్యక్షంగా దర్శనమిస్తారు .అక్కడే ఉండి మనం ఇచ్చే ఆహుతిని స్వీకరిస్తారు. అప్పట్లో విజ్ఞాన పరికరాలు లేవు కాబట్టి మన మహర్షులు చెప్పిన విషయాలు నమ్మడం కష్టంగా ఉండేది. కాకపొతే ఇప్పుడు ఈ కిర్లిన్స్ కెమెరా మూలంగా, డాక్టర్ భార్గవ గారి లాంటి ఆసక్తి కల ఆధ్యాత్మిక వైజ్ఞానికుల మూలంగా మన ఋషులూ, మహాత్ములు చెప్పిన వన్నీ సత్యాలే అని నేను తెలుసుకున్నాను. మరి ఇప్పుడైతే కిర్లిన్స్ కెమెరాని మించిన అధునాతనమైన కెమెరాలు వచ్చాయి. ఇంకా మనం ఎన్ని అద్భుతాలు వింటామో ! చూస్తామో !