హైదరాబాద్ కి బ్రహ్మశ్రీ స్వర్గీయ గోవింద దీక్షితులు గారి ఆగమనం
బహుశా 2009 డిసెంబర్ లో ఒక సారి శ్రీ గోవింద దీక్షితులు గారు హైదరాబాద్ రావడం జరిగింది. అప్పటికే నేను ఆయన్ని పిఠాపురంలో కలవడం జరిగింది. సాధారణంగా నేను దీక్షితులు గారు ఎప్పుడు కలిసినా ఆధ్యాత్మిక విషయాలన్నీ వైజ్ఞానిక దృష్టి కోణంతో చర్చిస్తుంటే గంటలు నిమిషాలలాగా గడిచి పోతూ ఉండేవి. సత్సంగ్ లో కూడా వివిధ విషయాలు మాట్లాడుతుండేవారు. ఆయన వ్రాసిన శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంగురించీ, దీక్షితులుగారి గురించి నాకు తెలిసిన దత్త బంధువులందరికీ నేను చెప్పాను. శ్రీ గోవింద దీక్షితులుగారి గురించీ, శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం గురించి ప్రచారం చేసినందు వల్ల దీక్షితులుగారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోవడానికి చాలా మంది వస్తుండేవాళ్ళు. ఆయనతో ఎంతో ఆసక్తికరమైన, ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తుండేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు ఎంతో భక్తితో ఎంతో కొంత దక్షిణ ఇస్తుండేవాళ్ళు. ఆ వచ్చిన దక్షిణతో వెంటనే చీరలు, రవిక బట్టలూ, గాజులూ ,పసుపు-కుంకుమ వగైరాలు తెప్పించి వచ్చిన స్త్రీలందరికీ పంచి పెడుతుండేవారు. ఆయన ప్రతీ స్త్రీని కూడా సుమతీ దేవి లాగా భావిస్తుండేవారు అని చెప్పటం జరిగింది.
పంచ దేవ్ పహాడ్ లోదర్బార్ ప్రతిష్ట - సంపూర్ణ శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం హిందీ పుస్తక ఆవిష్కరణ
ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఒక సారి నాసిక్ నుంచి రాంబాబాగారు అనే యోగి వచ్చి హైదరాబాద్ లో ఆయన భక్తుల ఇంట మకాం చేసారు. నేను మొట్ట మొదటి సారిగా ఆయన్ని కలుసుకోవడానికి అందరితో పాటువెళ్లాను. అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చిన ఎంతో మంది భక్తులు విగ్రహాలని తీసుకుని చాలా తన్మయత్వంతో ఆడుతూ పాడుతూ కన్పించారు. అందరి భోజనాలయ్యాక సత్సంగ్ నిమిత్తం హాలులో చేరాము. శ్రీ గోవింద దీక్షితులు గారు హిందీలో కూడా చాలా చక్కగా మాట్లాడగలిగే వారు. ఆ వచ్చిన మరాఠీ వారికోసం ఆయన హిందీలోనే ఉపన్యాసాన్నిచ్చారు. ఆ సందర్భములో నన్ను రాంబాబాగారికి పరిచయం చేయడంతో నేను ధైర్యం చేసి మీరెందుకు ఈ విగ్రహాలని తెచ్చారు ? చాలా చక్కగా ఉన్నాయి. దీని అంతరార్థం ఏమిటో చెప్తారా ? అని అడిగాను. బాబాగారు దానికి నేను శ్రీ పాద శ్రీ వల్లభ స్వామివారి సేవకున్నిమాత్రమే. ఆయన ఆదేశం ప్రకారం ఆయన ఏం చెప్పితే నేను అది చేస్తూ ఉంటాను అని చెప్పారు. ఒక సారి నేను పాండు రంగ విఠల్ గుడి దగ్గర ఉన్న చెట్టు క్రింద నిద్ర పోతూఉంటే నాకు కలలో శ్రీ పాదులవారు కనిపించి పంచదేవ్ పహాడ్ లో 1238 వ సంవత్సరంలో కట్టించిన ఒక పురాతన ఆలయముంది , దాని ఎదురుగుండా ఒక దర్బార్ ని ప్రతిష్టించమని చెప్పారు. అక్కడ ప్రతిష్టించడానికే ఈ విగ్రహాలని నేను తీసుకు వచ్చాను. విజయనగర సామ్రాజ్య పరిపాలనలో పంచ దేవ్ పహాడ్ లోనే చాలా ఎత్తైన అనఘాదేవి ఆలయం ఉండేది. అంత ఎత్తు గల ఆలయం నేను కట్టలేను కాబట్టి దానికి తగ్గట్టుగా అక్కడ కూడా అనఘుడి ప్రతిష్ట కోసం విగ్రహాలు తీసుకుని వచ్చాను అని అన్నారు. అంతే కాకుండా అనఘుడి అనఘాదేవి పెద్ద ఫోటోలు కూడా చూపించారు.
ఆ తర్వాత శ్రీ గోవింద దీక్షితులుగారు , మరి కొంతమంది విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడానికి పంచ దేవ్ పహాడ్కి బయలు దేరారు. నేను మటుకు జనవరి 31వ తారీఖున వెళ్లాను. అదే రోజున మొట్ట మొదటిసారిగా శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం యథాతథంగా హిందీ లో ప్రసన్న కుమారి ద్వారా రచించ బడిన పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది. అయితే బయట ఉన్న హిందీ పుస్తకం లో లేనటువంటి చాలా విషయాలు శ్రీ గోవింద దీక్షితులు గారి ద్వారా ఈ పుస్తకంలో ప్రకటితమైనాయి. అంతా ముగిసినాక నేను, శ్రీ గోవింద దీక్షితులు గారు పాండురంగ గుడి ముందున్న చెట్టు క్రింద కూర్చుని ఇష్టాగోష్టి చేస్తుంటే శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారు రోజూ ప్రొద్దున ఆ కురువపురం నుంచి పంచ దేవ్ పహాడ్ కి కృష్ణా నది పాయ నుంచి నడుచుకుంటూ వచ్చి, ఆవుల గొట్టం దగ్గర దర్బార్ చేసి, భక్తుల యొక్క సమస్యలు తీరుస్తుండేవారు అని దీక్షితులు గారు చెప్పారు. అంతే కాకుండా అక్కడ 30వ తారీఖున జరిగిన ఒక అద్భుతమైన సంఘటన కూడా చెప్పారు. అదేమిటంటే యజ్ఞం చేసి విగ్రహ ప్రతిష్ట చేసే సమయానికి సరిగ్గా ఆకాశము నుంచి విభూతి రాలిందని. మహారాష్ట్రనుంచి వచ్చిన భక్తులంతా చుట్టూ ప్రక్కలా ఎక్కడ కూడా కర్మాగారం లేకుండా ఈ విభూతి ఎక్కడ్నుంచి వచ్చిందని ఆశ్చర్య పడి పోయారు. అప్పుడు శ్రీ గోవింద దీక్షితులు గారు ఇక్కడ సిద్ద పురుషులూ, సాధు పురుషులూ స్వయంగా విగ్రహ ప్రతిష్ట చూడడానికి అశరీర రూపంలో వచ్చి సంతోషంతో విభూతి వర్షం కురిపించారని చెప్పారు. ఆ మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ఆ విభూతిని భక్తితో పొట్లాలు కట్టుకున్నారు.
శ్రీ గోవింద దీక్షితులు గారు చెప్పిన పథకాలు
ఈ సందర్భంలో శ్రీ గోవింద దీక్షితులు గారు నాతో మాట్లాడుతూ ఇక్కడ శక్తిపాతం జరిగింది. శ్రీ పాదుల వారి శక్తి ఇక్కడ జాగృతీకరమైంది. ఇక్కడ జఠరాగ్నిప్రజ్వలించి విజ్రుంభించింది కనుక మనం ఇక్కడ ఎంత అన్నదానం, ఎంత అన్నశాంతి చేసి మానవ జఠరాగ్నిని మనం ఎంత శాంత పరచ గలుగుతామో అంత విశ్వ జఠరాగ్నికూడా శాంత పడి ఈ ప్రాంతమంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మరి అని అన్నారు. మనం ఇక్కడ ఏదో అన్నదాన కార్యక్రమం చేయాలి ఇక్కడ విపరీత పరిస్థితులు కూడా విజ్రుంభిస్తాయి. మరి ఒక మంచి శక్తి ఉద్భవించినప్పుడు దానికి పది రెట్లు మాయా శక్తులు, అసుర శక్తులు కూడా విజ్రుంభిస్తుంటాయి. వాటిలో కూడా మంచి చెడూ ఉంటాయి. అవి మనకనవసరం. నువ్వేం చేస్తావంటే, నీతో పాటు మరి కొందరిని చేర్చి తప్పకుండా మరి ఇక్కడ అన్నదాన ప్రక్రియ చేయాలి. అంతే కాకుండా ఇక్కడ ధనం లోటు కూడా చాలా ఉంది. ధనం లేకుండా ఏ పని జరగదు కదా నీవు ఒక పని చేయి ఇక్కడ చుట్టూ ప్రక్కల ఏవైనా పొలాలుంటే కొని పంచదేవ్ పహాడ్ లో రైతులకి కౌలు కిస్తే బాగుంటుంది . మీరు కూడా బ్రతకాలి కదా కాబట్టి ఎంతో కొంత 50% కాని 60% కాని పెట్టుకుని, మిగతాది మాకిస్తే మేము ఇక్కడ అన్నదానాలకి అది ఉపయోగిస్తాము. అంతే కాకుండా ఇక్కడ ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. మహిళా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఇక్కడున్నప్రజలు అమాయకులు. వీరికేమో ఎటువంటి ఆదాయము లేదు. వీరి పిల్లలు అంతా గ్రామాలు వదిలి పెట్టి దగ్గర ఉన్నటువంటి పట్టణాలకు వెళ్లి పోయారు. అయితే ఇక్కడ బీదా బిక్కి ఉన్నారు. వారికైతే భూములు ఉన్నాయి కాని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేంత స్తోమత లేదు. ఇక్కడ వాళ్ళు అవన్నీ అమ్మేసుకునే ప్రయత్నం లో ఉన్నారు. మనం ఎలాగైనా సరే కొంత ప్రభుత్వ భూమి తీసుకుని అక్కడ ఈ ఆయుర్వేద వైద్యానికి సరి పడే మొక్కలు తెప్పిస్తే బాగుంటుంది. వాటి యొక్క విషయాలు అన్నీ నాకు తెలుసు. మరి ఇలా చేయాలని చాలా రకమైన పథకాలు ఆయన నాతొ చర్చించడం జరిగింది. తదుపరి నేనదే కార్య క్రమంలో ఉండి పోయాను.
శ్రీ పాద శ్రీ వల్లభ స్వామీ ! మరి నేనొక్కడినే అయిపోయాను. ఆఫ్రికా నుంచి నన్ను ఉద్యోగం నుంచి విరమణ చేసి ఇక్కడకి రప్పించుకున్నారు. నా ఒక్కడి వల్ల ఇది ఎలా సాధ్యమవుతుంది ? మరి అన్నదాన కార్యక్రమాలంటే మరి చాలా కష్టం కదా ! అని ఆలోచిస్తుంటే అక్కడే సేవ చేస్తుండే ఒక సాధకున్ని చూసాను. ఆ సాధకుడు వచ్చి నమస్కారం పెట్టడమూ, అతను అక్కడ యేవో అన్నదాన కార్యక్రమాల కోసం వచ్చినట్టుగా నాకు తెలిసింది. తదుపరి నేను ఈ కార్యక్రమాలని ఎలా చేయాలి అనే ఆలోచనలో పడిపోయాను.
నాకు ఒక రకంగా చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే నాకు సాక్షాత్తు శ్రీ పాద శ్రీ వల్లభ స్వామీ వారు దర్బార్ చేసిన ప్రదేశానికి నేను రాగలగడమూ, మరి మా ద్వారా శ్రీ గోవింద దీక్షితులు గారి ఆశీర్వాదంతో మేము రికార్డు చేసిన ఆయన వాయిస్ డీవీడీలు, అంతే కాకుండా ప్రసన్న కుమారి ద్వారా హిందీ భాషలో బయటకు వచ్చిన అసలు సిసలైన శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం యొక్క ఆవిష్కరణ జరగడమూ, అక్కడ నేను ఉండడమూ, ఎంతో మంది మహానుభావుల్ని, బాబాగారిని కలవడమూ, ఇవన్నీ నాకెంతో సంతోషాన్ని కలిగించాయి. అయితే ఆ రకంగా ఆ రోజెంతో సంతోషంతో గడిచి పోయింది. మేము కూడా తర్వాత హైదరాబాద్ కి మామూలుగా వాపసు వచ్చేసాము.