ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు
మొక్కలకి ,వృక్షాలకి కూడా భావాలు , అనుభూతులు ఉంటాయా ?
నేను కిర్లిన్స్ కెమెరా గురించి చదవడం, దాన్ని చూడడమూ వీటి గురించి నేను మీకు వివరంగా చెప్పాను. నేను 1977వ సంవత్సరంలో ఒక సారి మద్రాస్ కు ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్ళటం జరిగింది. నాకు సదా పుస్తకాలు చదివే అలవాటు ఉంది. సైకాలజీ ,పర సైకాలజీ, ఆధ్యాత్మిక , పౌరాణిక పుస్తకాలు చదువుతూ ఉంటాను. నేను ఏ ఊరికి వెళ్ళినా తప్పనిసరిగా పుస్తకాల దుకాణానికి వెళ్ళుతూ ఉంటాను. అయితే నాకు మద్రాస్ పుస్తక దుకాణంలో Extra sensory perception అనే ఒక అద్భుతమైన పుస్తకం కనిపించింది. నేను వెంటనే ఆ పుస్తకం కొన్నాను. అందులో నేను చదివిన ఒక అద్భుతమైన విషయం మీతో చెప్పాలని అనుకుంటున్నాను.
ఇది ప్రత్యేకంగా కొంత మంది శాస్త్రజ్ఞులు మొక్కల మీదా , వృక్షాల మీదా వాటికి అనుభూతులు, భావాలు ఉంటాయా అనే విషయం మీద పరిశోధనలు చేసారు. దానికి సంబంధించినట్టి ఒక సంఘటన ఇందులో చాలా చక్కగా వివరించబడింది. ఈ ప్రయోగంలో ఆ శాస్త్రజ్ఞులు నాలుగైదు మొక్కలని మామూలుగా ఒక గదిలో పెట్టారు. దానికి పాలీగ్రాఫ్ (Polygraph) అనే పరికరాన్ని అమర్చారు. దీన్ని లై డిటెక్టర్ (Lie Detector) అని కూడా అంటారు. ఈ పాలీగ్రాఫ్ (Polygraph) అనబడే పరికరం ఎటువంటి స్పందనలైనా మనకి చూపిస్తుంది. ఈ పరిశోధనలో వాళ్ళు ఏం చేసారంటే మామూలుగా నలుగురు అయిదుగురు వ్యక్తులు ఆ గదిలోకి వచ్చారు. ప్రత్యేకంగా ఆ పరికరంలో ఇంకా ఏమైనా అమర్చారేమో తెలియదు కాని ఈ అయిదుగురు వ్యక్తులు గదిలోకి వచ్చినప్పుడు ఆ పరికరంలో ఏ స్పందనలు కనిపించ లేదు. ఆరవ వ్యక్తి ఆ గది లోపల ప్రవేశించాడు. ఆ మొక్కకి హాని చేసే ఉద్దేశ్యంతోనే వచ్చాడు. నీకు నేను హాని చేయ దలచుకున్నాను. నీ ఆకులు కత్తిరించ దలుచుకున్నాను అనే భావం పైకి వ్యక్త పరచగానే వెంటనే ఆ మొక్కలో భయ పడుతున్నట్టుగా కలిగిన స్పందనలు అన్నీ చాలా స్పష్టంగా వాళ్ళు చూసారు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ మొక్క గడ గడా వణికి పోతున్నట్టుగా ఆ స్పందనలు వారికి కనిపించాయి. అది చాలా భయపడి పోతున్నట్టుగా ఉంది. అయితే ఆ ఆరవ వ్యక్తి ఆ మొక్కకి దగ్గరగా వెళ్లి ఒక కత్తెరని పట్టుకుని దాని ఆకులని కత్తిరించాడు. అప్పుడు ఆ మొక్క అంతా గడ గడ లాడి పోయింది . ఆ స్పందనల్ని ఆ శాస్త్రజ్ఞులంతా చూసారు.ఆ తర్వాత ఆ మొక్కలో విపరీత స్పందనలు రావడం , అదీ చూసి వాళ్ళు చాలా ఆశ్చర్య పోయారు.
తర్వాత మరొక ప్రయోగంలో ఆ మొక్కని వేరే మొక్కలతో కలిపి ఒక గదిలో పెట్టారు. మరల ఆ శాస్త్రజ్ఞులు కొంత మంది ఆ గదిలోకి ప్రవేశించారు. అప్పుడు ఆ మొక్కలో ఎటువంటి మార్పు (అంటే స్పందనలు) లేదు. చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న శాస్త్రజ్ఞులంతా మంచి భావనతోనే ఉన్నారు. ఆ మొక్కకి హాని చేయాలనే తలంపు వారెవ్వరిలో లేదు. ఇంతలో ఏ వ్యక్తి అయితే ఆ మొక్కని హాని పరిచాడో ఆ వ్యక్తి మళ్ళీ ఆ గదిలోకి రాగానే ఆ ఐదు మొక్కలతో పాటు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నటువంటి ఆ ఆరవ మొక్క, ఆ వ్యక్తి ఆ గదిలోకి అడుగు పెడుతుండగానే ఇంకా ఆ వ్యక్తి ఆ మొక్క దగ్గరకి కూడా రాలేదు , దాన్ని ముట్టుకోలేదు అయినా కూడా ఎవరో భయంకరమైన హంతకుణ్ణి, సర్వ నాశనం చేసే క్రూరమైన విలన్ ని చూసి భయ పడుతున్నట్టుగా ఆ మొక్కలో విపరీతంగా గడ గడా వణికి పోతున్నట్టుగా polygraph లో కనిపించిన ఆ ప్రకంపనలని చూసి ఆ శాస్త్రజ్ఞులంతా ఆశ్చర్య పోయారు. ఆ వ్యక్తి దగ్గరకు రాకుండానే కేవలం ఆ గదిలో ప్రవేశించినంత మాత్రానే మొక్కలో వచ్చిన కదలికలు గమనించి చాలా ఆశ్చర్య పోయారు. అయితే మన మహానుభావులు , ఋషులూ అందరూ కూడా శాస్త్రజ్ఞులే. కాకపొతే వారికి ఎటువంటి పరికరాల అవసరం లేకుండానే, మానసికంగానే పై స్థాయిలోకి వెళ్లి మరి ఈ ప్రకృతిలో లీనమై పోయి , ఆ ప్రకృతి యొక్క భాషని వాళ్ళు చక్కగా అర్థం చేసుకుని పురాణాల్లొ ఎన్నో విషయాలు, వేదాల్లో ఎన్నోఅద్భుతమైన విషయాలు ఇటువంటి వైజ్ఞానిక విషయాలెన్నో కూడా వారు పొందు పరచడం జరిగింది. కాని ఇప్పుడు శాస్త్రజ్ఞులు ప్రతీ దానికి కూడా మాకు ప్రత్యక్షంగా మీరు అవన్నీ చూపించాలి అని అన్నప్పుడు కష్టం కదా !
మనం ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే ఉంటాము అంటే మన భూమిక ఎప్పుడూ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది కనుక పై స్థాయిలో ఉన్న వాటిని కొలిచే సాధనాలు మన దగ్గర లేవు. పైగా పాశ్చాత్యులకి మన ధార్మిక , ఆధ్యాత్మిక సాహిత్యాల అవగాహన లేనందువలన మన మునులు, మహానుభావులు చెప్పినవన్నీ నమ్మలేదు. వారందరికీ ఏ విషయమైనా కంటికి కనిపించాలి. దాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలి. ఆ ముక్కలని పట్టుకుని పరిశోధించడం, అవే వాస్తవాలని వాళ్ళు చెప్పుతూ ఉంటారు. కాకపొతే ఇప్పుడు కూడా పాశ్చాత్యుల దగ్గర ఉన్న అధునాతన పరికరాలతో ఈ బయో - ఎనర్జీ గురించి కనుక్కుంటున్నారు. ఇలాంటిదే అంటే ఈ మొక్కల గురించి ఆసక్తికరమైనటువంటి మరి కొన్ని విషయాలు లేక అనుభవాలు దీని తరువాత వచ్చే ఎపిసోడ్ లో చెప్తాను.