N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Tuesday 10 December 2013

Sriram Sharma Acharya

Aadhyaatmika Anubhavaalu, Viseshaalu

శ్రీ రామశర్మ ఆచార్యులు

స్వర్గీయ బ్రహ్మశ్రీ మల్లాది గోవిందదీక్షితుల వారికి గాయత్రిపరివార్ వారితో కూడా సత్సంబంధాలు ఉండేవి. దానికి కారణం పండిత శ్రీరామశర్మ అనే మహానుభావుడు. ఆయన జీవితచరిత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. ఆయన గురువుగారే సర్వేశ్వరనాంద. శంబల అనే ప్రాంతంలోనే శ్రీరామశర్మగారికి ఈయన దర్శనమిచ్చారు.  శ్రీరామశర్మ ఆచార్యగారికి ఏడేళ్ల వయస్సులోనే ఉపనయనదీక్ష జరిగింది. పండిత మదనమోహనమాలవ్యగారు గాయత్రీదీక్షను ఇచ్చారు. ఆయన ఏడేళ్ల పాటు నిత్యం గాయత్రి చేసిన తరువాత పద్నాలుగో ఏట సర్వేశ్వరానందగారు ఒక తేజోమయరూపంలో దర్శనమిచ్చారు, పూర్వజన్మ జ్ఞానాన్ని తెలియజేశారు. శ్రీరామశర్మగారు అంతకు ముందు జన్మల్లో మొదట కబీర్ దాస్ గా, తర్వాత సమర్థ రామదాస్ గా (చత్రపతి గురువు), ఆ తర్వాత సాక్షాత్తూ రామకృష్ణ పరమహంసగా జన్మించినట్టు జన్మరహస్యాన్ని తెలియజేశారు.

వెంటనే శ్రీరామశర్మ గారు సర్వేశ్వరానందస్వామి వారిని తమ గురువుగారిగా గుర్తించారు. ఆయన ఆజ్ఞ ప్రకారమే మూడుసార్లు హిమాలయాల యాత్రకు వెళ్లారు. ఇదే సమయంలో సర్వేశ్వరానందులవారు శ్రీరామశర్మకు గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశించారు. 24 లక్షల గాయత్రి చేస్తే ఒక పునశ్చరణ అంటారు. అలాంటి పునశ్చరణను 24 సార్లు చేయాలి. ఆ సమయంలో పూర్తి సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించాలంటూ ఆజ్ఞాపించారు. అలాగే బాలకుడిగా ఉన్న పండిత శ్రీరామశర్మఆచార్య గారు 24 ఏళ్ల పాటు గాయత్రి ఉపాసనా దీక్షను సాగించారు. ఆవులకు పెట్టిన దాణాలో సాధారణంగా కొన్ని బార్లీ, గోధుమగింజలు జీర్ణం కాకుండా పేడలో పడిపోతాయి. ఆయన వాటిని ఏరుకుని శుభ్రంగా కడుక్కొని రొట్టెలు చేసుకుని తినేవారు. ఆయన అధిక శాతం పచ్చి ఆకుకూరలు, మజ్జిగ తాగుతూ 24 ఏళ్లు దీక్ష చేశారు. ఎక్కడైతే సప్తరుషులు తపస్సు చేశారో, ఎక్కడైతే విశ్వామిత్రుడికి గాయత్రిమాత కనిపించిందో  అక్కడ గురువుగారు ఆదేశించిన ప్రకారం శ్రీరామశర్మగారు దీక్ష చేశారు. (ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని శాంతికుంజ్ పేరుతో పిలుస్తున్నారు). ఆయన హిమాలయ యాత్రల్లో జమదగ్ని, పిప్పలాదుడు వంటివాళ్లను సూక్ష్మరూపంలో కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ సాధనతోనే గాయత్రిమంత్రాన్ని అందరికీ ఉపదేశించారు. 

స్త్రీలకు కూడా గాయత్రిని ఉపదేశించడం అక్కడ ఉన్న పండితులకు రుచించలేదు. మహిళలు గాయత్రి చేస్తే వాళ్లు విధవలు అవుతారని, దరిద్రులు అవుతారు అంటూ తిట్టిపోశారు. కానీ శ్రీరామశర్మగారు మాత్రం వాళ్లతో విబేధించారు. తాను గాయత్రి ఉపాసన ఇచ్చిన మహిళలు ఆయురారోగ్యాలతో, సౌభాగ్యంతో విలసిల్లుతున్నారంటూ చెప్పుకొచ్చారు. వేదాల్లో ఇలా చేయకూడదని ఎక్కడ చెప్పబడిందో శాస్త్రనిరూపితం చేయమని ఆయన పట్టుబట్టారు. ఒక ఆధ్యాత్మిక సభ ఏర్పాటు చేసి ఆధారాలు, రుజువులు చూపమని అడిగారు. తాను కూడా ఆ శాస్త్రచర్చలో అందుకు తగ్గ రుజువులు చూపిస్తానని వెల్లడించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన చర్చలో శ్రీరామశర్మగారు చూపించిన ప్రమాణాలను చూసి అక్కడ పాల్గొన్న పండితోత్తములంతా నిశ్చేష్ఠులైపోయారు.

యాజ్ఞవల్క మహర్షి ఒకసారి మైత్రేయి అనే సాధ్వి చేతిలో ఒక సందర్భంలో ఓడిపోయారు. మైత్రేయిని వివాహం చేసుకోవడానికి యాజ్ఞవల్కుడే ఓడిపోయినట్టు కూడా చెబుతారు. మైత్రేయిమాత గాయత్రి ఉపాసన చేసినట్టు శాస్త్రం చెబుతోంది. మరో మాహాసాథ్వి అయినటువంటి గర్గి కూడా గాయత్రి ఉపాసన చేస్తూ ఉండేది. గర్గిని కూడా యజ్ఞవల్కుడు వివాహం చేసుకున్నట్టు చెప్తారు. సీతా, సావిత్రి, ద్రౌపది కూడా గాయత్రిని ఉపాసన చేస్తూ ఉండేవారని శ్రీరామశర్మగారు చెప్తూ ఉండేవారు.

అయినా గాయత్రి మంత్రంలోని అర్థం చాలా సామాన్యం. కానీ ఆడవాళ్లు గాయత్రి ఎందుకు చేయకూడదో ఎవరికీ అంతుబట్టని విషయం. గాయత్రిని ఒక తల్లిగా, అమ్మగా భావించినప్పుడు.. వాటికి ప్రతిరూపమైన స్త్రీ వాటిని చేయకూడదు అని చెప్పడానికి శాస్త్రీయపరంగా, లౌకికపరంగా కానీ తృప్తికరమైన సమాధానం లేదు. సాక్షాత్తూ విశ్వామిత్రుడే ఇటువంటి నిషేధాలు ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదు. సర్వేశ్వరానంద ఆదేశాల ప్రకారమే శ్రీరామశర్మగారు స్త్రీలకు కూడా మంత్రాన్ని ఉపదేశించారు. స్త్రీలను తక్కువ చేసి చూడడం, వాళ్లను మంత్రానుష్టానం నుంచి దూరం చేయడం ఎంత వరకూ సబబో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తే సరిపోతుంది.

అప్పుడు పండిత పరిషత్తులో ఓడినటువంటి వాళ్లంతా ఓటమిని అంగీకరించలేకపోయారు. దీంతో ఒక కిరాయి హంతకుడికి డబ్బిచ్చి శ్రీరామశర్మగారిని చంపించే ప్రయత్నం చేశారు. ఆ హంతకుడు తుపాకీతో శ్రీరామశర్మగారిని దగ్గర నుంచి కాల్చడం, ఒక తూటా ఆయన మెదడు పైభాగం నుంచి రాసుకుంటూ వెళ్లినా ఆయన అలాగే మౌనంగా భరిస్తూ పడిపోయారు. రక్తస్రావాలు కారుతూ నేలకు ఒరిగిన ఆయన శరీరంపై ఆ దుండగుడు మళ్లీ కత్తితో అనేక చోట్ల దాడులు చేసాడు. అయితే హర్షులు అంతా కూడా శ్రీరామశర్మగారిని ముందే వారించారు, దైవికమైన పనులు చేస్తున్నప్పుడు అసురశక్తులు విజృంభించే ప్రమాదం ఉందని. అయినా మీకేం ఫర్వాలేదు మేం దగ్గరుండి కాపాడుకుంటామంటూ చెప్పడం జరిగింది.. వాళ్లు చెప్పినట్టుగానే శ్రీరామశర్మగారు కొన్ని గాయాలతో బయటపడ్డారు. ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఆ దుర్మార్గుడు కత్తితో దాడిచేసిన ప్రతీసారీ ఆ కత్తి నేరుగా వెళ్లకుండా పక్కకు తిరిగిపోయేది. దీంతో హంతకుడు భయపడి పారిపోతుండగా పోలీసులు, స్థానికులు పట్టుకున్నారు. ఆ దుండగుడిని వదిలేయమని శ్రీరామశర్మగారు పెద్దమనసుతో చెప్పారు. ఎవరో డబ్బులు ఇచ్చి ప్రోత్సహించడంతో అతడు ఆ డబ్బుకు ఆశపడి ఇలా చేశాడు కనుక వదిలివేయమని చెప్పినా వాళ్లు వదల్లేదు. పండిత శ్రీరామశర్మగారి ఆత్మకథలో ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈయన విశ్వామిత్రుడి ఆశీస్సులతో ఆయనకంటే అధికంగా గాయత్రిని చేశారు.

నేను మొదటిసారి కెన్యా వెళ్లినప్పుడు కూడా అక్కడ గుజరాతీ మహిళలు ఎంతో భక్తితో గాయత్రిహోమం, జపం, సాధన చేస్తూ ఉండేవారు. మేము కూడా పక్కన ఉన్న గుడికి వెళ్లి ఆ మంత్రజపంలో పాల్గొనేవాళ్లం. అలాగే నేను నైరోబీ వెళ్లినప్పుడు కూడా అక్కడ మహిళలూ గాయత్రిజపం చేసేవారు. టాంజానియాలో అయితే ఉదయమే గాయత్రిహోమం జరుగుతూ ఉండేది.

అక్కడ కొంతమంది ఇంటింటికీ తిరిగి గాయత్రిమాత క్యాసెట్ ను ఇవ్వడం, హోమానికి రమ్మని ఆహ్వానించడం జరుగుతూ ఉండేది. నేను ఇంతకు ముందే చెప్పినట్టు 1987 నుంచి ‘న్యూ ఏజ్’ ప్రారంభమైంది. సంకుచిత భావాలు, వేదాల్లో చెప్పనివి, అంటరానితనం, మూఢాచారం వంటి పాత భావలన్నీ న్యూ ఏజ్ లో మెల్లిమెల్లిగా లయమైపోయి లుప్తమైపోతోంది. పై భూమికలో ఉన్నవారు మెల్లిగా ఒక శాస్త్రీయ, విజ్ఞానపరంగా సమాజాన్ని మారుస్తూ ఉంటారు. ఇటువంటి దైవిక కార్యక్రమాలు చేయాలని అనుకున్నప్పుడు అసురశక్తులు విజృంభిస్తూ ఉంటారు. దత్తభక్తులు ఎవరైతే సర్వశ్యశరణాగతి అని అనుకుంటారో, ఎవరికైతే విశాల దృక్పధం ఉంటుందో, వాళ్లు మాత్రం ప్రజ్ఞాపుత్రులుగా ఏదో ఒక రోజు చేతులు కలపక తప్పదు.

శ్రీపాదశ్రీవల్లభుడిని సాక్షాత్తూ గాయత్రిమాతగా మనమంతా శ్రీపాదవల్లభచరితామృతంలో చదువుకున్నాం కదా. గాయత్రిమంత్రానికి అర్థం కూడా అందులో చెప్పారు కదా. గాయత్రిపరివార్ వారు గాయత్రి మహావిధ్వాన్ పేరుతో మూడు పుస్తకాలు ప్రచురించారు. అందులో కూడా గాయత్రిమంత్రం ఎలా ఉంది, అది ఉచ్ఛరించినప్పుడు ఏం జరుగుతుందో ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా శ్రీపాదవల్లభచరితామృతంలో వివరించినట్లుగానే వివరించడం జరిగింది. తార్కికంగా, శాస్త్రీయంగా ఆలోచిస్తే గాయత్రిమాతే శ్రీపాదవల్లభుడు అని అనుకుంటాం కదా. సర్వేశ్వరానంద, శ్రీరామశర్మ, విశ్వామిత్రుడు, జమదగ్ని వంటి వాళ్ల ప్రేరణ వల్ల కావొచ్చు  ఏ విధంగా గాయత్రియజ్ఞాన్ని శ్రీపాదుడు చేశారో, గాయత్రిపరివార్ వాళ్లు స్వామివారు దర్బారు చేసిన పంచదేవ్ పహాడ్ నందు  నెలకు రెండుసార్లు తప్పకుండా గాయత్రిహోమం చేస్తున్నారు. 

దానికి హోమద్రవ్యాలు విచిత్రంగా హిమాలయాల్లోని పండిత శ్రీరామశర్మ వారి ఆశ్రమం నుంచి అందడం ఆశ్చర్యకరం. మూడేళ్లుగా ఇక్కడ గాయత్రి హోమం క్రమం తప్పకుండా చేస్తున్నారు. గోవింద దీక్షితులు చెప్పినట్టుగానే అక్కడ అనఘాష్టమి వ్రతం, గోపూజ, పితృహోమం కూడా చేస్తారు.  పితృహోమం ఉంటే అదేదో శ్రాద్ధకర్మలని అనుకోకూడదు. పితృదేవులకు ప్రత్యేకంగా ఒక లోకం ఉంటుంది. ఇది చాలా విశిష్టమైన హోమం. అతికొద్దిమందికి మాత్రమే ఈ ప్రక్రియ తెలుసు. ఎవరైనా అడిగినప్పుడు ప్రత్యేకంగా వాళ్ల కోసం ఈ పితృహోమం చేస్తున్నారు. ఇటువంటి క్షేత్రానికి, శ్రీపాదవల్లభుడి దర్బారులో ప్రవేశించడానికి నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాలేం. ఎవరైతే వారి హృదయాన్ని, మనసును తెరిచి ఉంటారో, భేదభావం లేకుండా ఉంటారో, గుణదోషాన్ని చేయకుండా ఉంటారో అటువంటి వాళ్లకు ఈ పంచదేవ్ పహాడ్ ఒక ఆథ్యాత్మిక పురోగతికి ఒక సాధనంగా ఉంటుంది.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ~