కణ్వాద మహర్షి పరిచయం
నేను ఒకసారి వృత్తిరిత్యా మొమ్బాసాలో (Mombasa) పని ముగించుకుని నైరోబి వెళుతూ చీకటి పడే సమయానికి మకిండు (Makindu) అనే గురుద్వారాకి వెళ్ళడం జరిగింది. లోగడ నేను ఈ గురుద్వారా గురించి చెప్పడం జరిగింది. నేను అక్కడే ఆ రాత్రి బస చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇక్కడ 24 గంటలు భోజన సదుపాయం ఉంటుంది. నేను కాలకృత్యాలు ముగించుకుని గురుద్వారా లోని ఉద్యానవనంలో నేను ఎప్పుడు కూర్చునే బెంచి మీద వెళ్లి కూర్చుని అక్కడ ఉన్న రకరకాల పూలమొక్కలని చూస్తూ సేద తీరుతున్నాను. ఆ రోజు గురుద్వారాలో పెద్దగా సంచారం లేదు. అక్కడ ఉన్న రకరకాల గులాబి మొక్కలని చూస్తూ "ఈ భగవంతుడి సృష్టి ఎంత విచిత్రమైనది, ఇంత అందమైన గులాబి మొక్కలకి ముళ్ళని కూడా ప్రసాదించాడు కదా" అని నేను ఆలోచిస్తుండగా నా ఎదురుగుండా
ఒక బ్రహ్మాండమైన కాంతిపుంజం ప్రత్యక్షమయ్యింది. "ఈ సారి ఎవరొచ్చారో" అని నేను అనుకుంటుండగా ఆ కాంతిపుంజంలోని మహాత్ముడు "నాయనా నన్ను కణ్వాద మహర్షి అని అంటారు, మనం తినే ఈ ఆహరం మన శరీరం మీద ఎలా పని చేస్తుంది, ఇంకా మానవ శరీరంలోని జన్యుకణాల గురించి చాలా పరిశోధన చేసాను.
అమాని అడవుల్లో జరిగిన సిద్దపురుషుల సమావేశంలో నేను కూడా ఉన్నాను. ఇపుడు నువ్వు ఈ మొక్కల గురించి, అయస్కాంత పురుషుడు చెప్పిన విత్తనాల గురించి చక్కగా విశ్లేషించుకుంటున్నావు. వాటి గురించి మరికొంత వివరణ ఇవ్వడానికి నేను వచ్చాను" అని ఆయన చెప్పారు. నేను కొంత ఆశ్చర్యపడుతూ "ఈయనకి అయస్కాంత పురుషుడు, లోబ్సంగ్ రంపా అందరూ ఎలా తెలుసు" అని అనుకుంటుండగా ఆయన నా మనసులో భావాన్ని పసిగట్టి "నాయనా మేమందరం ఒకే విధమైన దైవిక శక్తితో అనుసంధానం కలిగి ఉంటాము, మాలో మాకు ఏ విధమైన తేడాలు ఉండవు. నీకు అయస్కాంత వ్యక్తి, లోబ్సంగ్ రంపా చెప్పిన విషయాలు నాకు తెలుసు, కాబట్టి నువ్వేమి ఆశ్చర్యపడక్కర్లేదు. మాతో పాటు ఇంకా ఎన్నో వేల మంది ఉన్నారు. మా అందరికి ఈ టైం అండ్ స్పేస్ అంటే కాలము మరియు ప్రదేశముతో ప్రమేయము లేదు" అని నా భావాలకి సమాధానంగా చెప్పారు.
“నాయనా నీకు నేను చెప్పాలనుకున్నది ఒక చక్కని కథ రూపంలో చెప్తాను. శాస్త్రీయ పరిజ్ఞానం పై స్థాయిలో ఉన్నపుడు నేను చెప్పినది ఒక ఉపన్యాస ధోరణిలో ఉంటే అందరికి అర్థం కాకపోవచ్చు. కొద్దిగా తక్కువ భూమికలో ఉన్నవారికి కథల రూపంలో చెప్తే చెప్పే విషయం పై వారికి ఆసక్తి పెరిగి అర్థం చేసుకుంటారు. దానికి సమాధానంగా "మహాత్మా మీరందరూ ఎన్నెన్నో విషయాలు విభిన్న కోణాల నుంచి చెబుతున్నారు ఇవన్ని కూడా జనావళికి చెప్పమని ఆదేశిస్తున్నారు. ఇన్ని వైరుధ్యమైన విషయాలు నేను ఎలా చెప్పగలను" అని ప్రశ్నించగా "మీ మనుషులందరికీ ఏ విషయమైనా చిన్న చిన్న భాగాలుగా చెప్పాలి, అయస్కాంత వ్యక్తి చెప్పిన విషయాలు ఒక శీర్షికలో, లోబ్సంగ్ రంపా చెప్పిన విషయాలు ఒక శీర్షికలో, నేను చెప్పే విషయాలు వేరొక శీర్షికలో విడివిడిగా చెప్పు అప్పుడు జనాల్లో ఎటువంటి తికమకలు ఉండవు". అని చెప్పారు.
“నాయనా ఈ విశ్వమంతా కూడా ఒక బ్రహ్మాండమైన, మానవాతీతమైన ఒక శక్తితో నిండి పోయింది. సోవియట్ రష్యాలో శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాయి. మనం శూన్యం అనుకునేటువంటి ఈ ఆకాశంలో భగవంతుని యొక్క ప్రణాళిక సమాచార రూపంలో ఉంటుంది. ఈ శక్తి ఆకాశంలోనే కాదు, మానవుల చుట్టూ కూడా వ్యాపించి ఉంటుంది. మీరందరూ కూడా ఈ శక్తి అనే ప్రవాహంలోనే తేలుతూ ఉంటారు. కాని దురదృష్టవశాత్తు ఈ శక్తి మీ చేరువలో ఉన్నా కూడా అది మీరు అందుకోలేని పరిస్థితిలో ఉంటారు, ఎందుకంటే దాని గురించి మీకు స్పృహ ఉండదు. భగవంతుడి సృష్టిలో ఎంతో కొంత పక్షపాతం ఉంది, అది మంచి వైపే ఉంది. భగవంతుని సృష్టి అయిన ఈ శక్తి విశ్వమంతా సర్వవ్యాప్తమై ప్రేమతో నిండి ఉంది. ప్రేమ తత్వమే కాకుండా దీనిలో అద్భుతమైన సమాచారం కూడా ఉంది. మీరందరికీ తెలుసు కదా జ్ఞానం అనేది శక్తి అని. (Knowledge is
Power) ఎంతోమంది మహర్షులు, మహానుభావులు, యోగులు తమ సాధన ద్వారా కనుక్కున్నటువంటి ఎన్నో విజ్ఞానపరమైన విషయాలన్నీ కూడా శక్తి రూపంలో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి, అవి మీకు అందుబాటులోనే ఉన్నాయి.
ఎవరైతే స్పృహలో ఉంది వీటి గురించి తెలుసుకోవాలనే కృషి చేస్తుంటారో వారికి ఈ శక్తుల మీద నియంత్రణ లభించి వారు సమాజంలో గురువులుగా, యోగులుగా, సాధకులుగా పేరు తెచ్చుకుంటారు. అయితే ఈ విషయ పరిజ్ఞానం సంపాదించడానికి మనుషులు ఒకే కోణంలో ఆలోచిస్తే ఉపయోగం ఉండదు, ఎప్పుడైతే వారు ఏదో ఒక విషయాన్నిపూర్తిగా నమ్మి, వేరే వాటిని విశ్వసించరో, దీనినే Linear thinking అంటారు వారికి ఈ సమాచారం ఎటువంటి పరిస్థితిలో అర్థం కాదు. ఎవరైతే multi dimensional గా ఆలోచిస్తారో అంటే ఒకటే విషయాన్ని వివిధ కోణాల్లో సమగ్రంగా పరిశీలిస్తారో అటువంటి వారిలోకి మాత్రమె ఈ విజ్ఞానం ఒక ధారలాగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఒకటే విధంగా ఆలోచించే వారు ఒక సిద్ధాంతం ఏర్పరుచుకుంటారు. ఇలాంటి వారు వారి వారి సిద్ధాంతాలను ప్రచారం చేయడం వలన కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే ప్రాధమిక భూమికలో ఉండి ఆలోచిస్తారో, పై భూమికలోకి వెళ్లి విషయ పరిజ్ఞానం గురించి సమగ్రంగా ఆలోచించాలనే తలంపు వారికి ఉండదో మరి వారు తమ వాక్చాతుర్యం తోటి తాము ప్రతిపాదించిన సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవడం దానికి ధనిక వర్గం అండగా ఉండటం వల్ల multi dimensional గా ఆలోచించే వారు పై భూమికలో ఉండటం వల్ల మానవ సమాజంలో ఈ సిద్ధాంతాల వల్ల నిరంతరం ఒక పోరు జరుగుతూ ఉంటుంది.
కాని దాని వల్ల ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకున్నవారికే నష్టం.
ఇటువంటి మీ చుట్టూ ఉన్న సమాచారం అనే విజ్ఞానపరమైన శక్తిని మీరు చక్కగా అధ్యయనం చెయ్యగలిగితే
మీరెన్నో అద్భుతాలని సాధించగలుగుతారు. నేను వాటిని వివరించడానికే నీ ముందుకు వచ్చాను.
నేను ముందే చెప్పాను నేను కణాల మీద ఎంతో పరిశోధన చేసానని. మానవ శరీరం అనేది కొన్ని
వందల కోట్ల కణాలతో తయారు చెయ్యబడి ఉంది. స్థూలంగా మనకి ఏ కణాల మధ్య ఖాళీ ప్రదేశం ఉన్నట్లు
అనిపించదు. కాని మన శరీరంలో ఒక కణానికి ,ఇంకొక కణానికి మధ్య చాలా ఖాళీ ఉంటుంది. నిజానికి
మానవుల శరీరంలో ఎక్కువ భాగం శూన్యమే ఉంటుంది అని నా పరిశోధనలో తేలింది. అదే ఇప్పుడు
మీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ప్రతి కణంలో కూడా న్యూట్రాన్ (neutron) , ప్రోటాన్, ఎలక్ట్రాన్ ల
మధ్యలో కూడా చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది అని
మనం అనుకుంటూ ఉంటాము అయితే ఈ శూన్య ప్రదేశం అంతా కూడా శక్తి తో నింపబడి ఉంది. అయితే
ఈ శక్తిలోనే విజ్ఞానం అనే సమాచారం దాగి ఉంటుంది. ఎన్నో జన్మల నుంచి సంపాదించిన విజ్ఞానం,
అనుభవాలు అన్ని కూడా ఈ ప్రదేశంలో శక్తిమయంగా ఉంటుంది అని మేమేప్పుడో చెప్పాము. అదృష్టవశాత్తు
దీనినే నేటి శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.
మరి ఇటువంటి సూక్ష్మ భూమికలో ఉన్నటువంటి
ఆధ్యాత్మిక, విజ్ఞానపరమైన విషయాలు మానవాళికి చెప్పటం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఇవన్నీ
నమ్మశక్యం కాని విషయాలు. సామాన్యజనులకి ఇవన్నీ అర్థం చేసుకునే విషయపరిజ్ఞానం ఉండదు.
అది ఉండాలంటే ఎంతో కొంత ప్రాధమిక శాస్త్రీయ పరిజ్ఞానం ఉండాలి. లేదా తప్పకుండా ఎంతో కొంత ఆధ్యాత్మిక సాధన చేసినవారై
ఉండాలి. అటువంటి వారు ధ్యాన స్థితిలో ఇటువంటి విషయాలని చాలా తేలికగా గ్రహించగలుగుతారు.
అయినా కూడా నేను ఎంతో విడమరచి తేలికగా అర్థమయ్యేట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను.