ఆధ్యాత్మిక విశేషాలు అనుభవాలు
అహంభావం
ఇది ఉపనిషత్తు లోని ఒక చిన్న
కథ. పూర్వం ఆర్యావర్తదేశాన్ని ఒక చక్రవర్తిగారు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను చాలా
మంచి వాడు కాని ఒకటే ఒక దుర్గుణం ఉండేది. అదే అహంభావం ఉండేది. అన్నీ “నావి”,”నావి”
అనే భ్రాంతిలో ఉండేవాడు. అంటే ఈ రాజ్యమంతా నాది, ఈ ప్రజలంతా నా వాళ్ళు , ఈ గో సంపద
అంతా నాదే, ఈ ఇల్లు (భవనం) నాదే, ఇలా ప్రతీది “నాది”, “నాది” అనే ఒక భావంలో ఉంటూ
ఉండే వాడు. సజ్జనులందరికీ ఆ చక్రవర్తి అంటే ఇష్టం ఉన్నాఆయనలో ఉన్నఈ ఒక్క దుర్గుణం
వాళ్ళను కలత పెడ్తూ ఉండేది. అందుకని వాళ్ళందరూ కలిసి ఒక సారి యాజ్ఞవల్క్య
మహర్షి దగ్గరకి వెళ్లి , ఓ మహర్షి! “మా చక్రవర్తిగారు ఎంతో మంచి
వాడు కాని అతనిలో చాలా అహంభావం ఉన్నది. ఆ ఒక్క దుర్గుణం కనక నిర్మూలించగలిగితే ఆయన
ఉద్ధరింప బడతాడు. ఈ కార్యానికి మీరే పూనుకోవాలి అని ప్రాధేయ పడ్డారు.”
యాజ్ఞవల్క్య మహర్షి
అలాగే అని చెప్పి ఒక రోజు ఆ చక్రవర్తి దర్బారుకి వెళ్ళగా ఆ చక్రవర్తిగారు ఆయన్ని
ఎంతో ఆదరంగా, సాదరంగా సత్కరించారు. ఒక ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి , చేతులు
జోడించి , “ ఓ మహానుభావా ! రాక రాక మీరు మా దర్బారుకి వచ్చారు. అలాగే మీరు నా
స్వగృహానికి వచ్చి నా భిక్షని స్వీకరించాలి” అని ప్రార్థించారు. అలాగే అని
యాజ్ఞవల్క్య మహర్షి చెప్పి ఆ మరునాడు ఆ చక్రవర్తి గారి ఇంటికి ఆయన భోజనానికి
వెళ్ళారు. అది ఒక పెద్ద రాజ భవనం. ఆ భవనపు గోడలు, కిటికీలు అన్నీ కూడా బంగారు
తాపడంతో చేయబడి ఉన్నాయి. వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు అన్నీ వాటిలో పొదగబడి
ఉన్నాయి. చక్రవర్తి గారు ఎదురేగి ఆయనకి ఘన స్వాగతం చెప్పారు. ఆయన్ని ఉచితాసనం మీద
కూర్చో బెట్టి, “చూశారా మహర్షీ ! నా రాజ సౌధం! నేనెంతో కష్ట పడి దీన్ని
కట్టించాను. ఇందులో గోడలన్నీ బంగారంతో తాపబడి ఉన్నాయి అని మీరు గమనించారా?
అమూల్యమైన రత్నాలతో, మాణిక్యాలతో పొదగబడి ఉన్నాయి. ఇక్కడ స్తంభాలు కూడా అంతే కదా !
“మహర్షీ ! మీరు నా సింహాసనాన్ని
చూశారా? బంగారంతో పూతచేయబడి ఉన్నది. రత్నాలు, మాణిక్యాలతో,
కెంపులతో,వజ్రాలు-వైడూర్యాలతో అది పొదగబడి ఉన్నది. అలాగే క్రింద నెల మీద పరచి ఉన్న
తివాచీ కూడా బంగారు, వెండి దారాలతో చేయబడి ఉన్నది. నేను కూర్చునే ఈ ఆసనం కూడా
బంగారంతో తాపడం చేయబడి ఉన్నది అందులో వజ్రాలు, కెంపులు పొదగబడి ఉన్నాయి.” ఇలా ప్రతి
పదార్థాన్ని ఆయన వర్ణించ సాగాడు. చూశారా ! “మీకు కూడా ఒక బంగారు పీట
వేయించాను , అలాగే బంగారు కంచంలో మధురమైన పదార్థాలు, పంచ భక్ష్య పరమాన్నాలతో
మీకోసం ప్రత్యేకంగా తయారు చేయించాను.”
ఇలా అన్నీ పరి పరి విధాల అన్నీ ఇవి నావే , నా చేతే తయారు చేయబడ్డాయి, ఇవన్నీ నేనే
కొన్నాను, అనే ఒక అహం
భావంతో ఆయన మాట్లాడ సాగాడు. అయితే ఆ ఆహం భావంలో అమాయకత్వం ఉంది కాబట్టి ఆ మహర్షికి
ఏ మాత్రంకోపం రాలేదు. అయితే ఆయన్ని భోజనానికి ఉపక్రమించమని ప్రార్థించగా ఆ మహర్షి
ఇలా అన్నారు. “ఓ చక్రవర్తీ! నా జీవితంలో ఎప్పుడు నేను ఇలాంటి బంగారు ఆసనం మీద
కూర్చుని, బంగారు పళ్ళెంలో ఇన్ని మధురమైన పంచ భక్ష్య పరమాన్నాలు తింటానని నేనేప్పుడూ
కలలో కూడా అనుకోలేదు. నా ఇల్లు చాలా చిన్న కుటీరం. అది ఆకులతో, వెదురుతో కట్టబడి
ఉన్నది. ఇంటి నేలంతా కూడా ఆవు పేడతో అలకబడి ఉంటుంది. చక్రవర్తి గారూ ! నేను
కూర్చునే ఆసనం కూడా దర్భాసనమే! ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళని దర్భాసనం మీదే
కూర్చో బెడతాను. నా దగ్గర బంగారు పళ్ళాలు కాని, బంగారు పాత్రలు కాని లేవు. నేను
అరటి ఆకుల్లోనే భోజనం చేస్తాను. నా దగ్గర వస్త్రాలు కూడా ఎక్కువగా లేవు. రోజూ ఏవో
కంద మూలాలు తిని బ్రతుకుతూ ఉంటాను. అటువంటి నాకు ఈ రోజు అష్టైశ్వర్యాలని చూసే,
అనుభవించే భాగ్యం మీరు నాకు కలిగించారు. నేను దానికి మీకు చాలా కృతజ్ఞుడై
ఉంటాను.” అయితే
చక్రవర్తి గారూ ! “ మీరు చేసిన
ఈ పంచ భక్ష్య పరమాన్నాలు ఘుమ ఘుమలాడి పోతున్నాయి. అవి కళ్ళకి కూడా ఎంతో మధురంగా
కనిపిస్తూ మనస్సునెంతో సంతోష పెడుతూ ఉన్నాయి. మరి
మీ ప్రథమ కబళము మీ కంచం నుండి మీ నోటి వరకూ వెళ్ళగలుగుతుందా?” అని
ప్రశ్నించారు.
ప్రశ్నకి ఆ చక్రవర్తి
గారు చాలా ఆశ్చర్య పడిపోయి, “అదేమిటీ మహర్షి గారూ! మీరు అలా మాట్లాడుతున్నారు? నా
కంచానికి నా నోటికి, నా చేతికి నా నోటికి ఎంత దూరం ? నా చేతులతో, నా నోట్లో
పెట్టుకొనడానికి ఇబ్బంది ఏముంటుంది? ఎక్కువ దూరం కూడా లేదు కదా !” అని
బదులిచ్చారు. దానికి సమాధానంగా
యాజ్ఞవల్క్య మహర్షి నవ్వుతూ , “సరే ! కానీయండి చూద్దాం !”అని
చెప్పారు. తర్వాత అన్నీ పదార్థాలు
వడ్డించడం అయిపోగానే చక్రవర్తి గారు చక్కగా కంచంలో ఉన్న పదార్థాలన్నీ
కలిపివేసి, దానిలో శుద్ధమైన మంచి నెయ్యి కలిపి, ముద్దగా చేసి ఆ ఘుమఘుమలాడే ఆహారపు
ముద్దని చేతిలో పట్టుకొని నోటి దగ్గరకి తీసుకెళ్ళుతూ ఉండగా, సరిగ్గా నోటిదగ్గర
పెట్టబోతున్న సమయానికి ఎక్కడ్నుంచో అమాంతంగా ఒక ఈగ వచ్చేసి ఆ అన్నపు ముద్ద
మీద వాలింది. వెంటనే ఆ చక్రవర్తిగారు గాభరాగా, అసహ్యంగా ఆ ముద్దని
పారవేశారు. అదంతా చూస్తున్నయాజ్ఞవల్క్య మహర్షి , “చక్రవర్తిగారూ !
అదేమిటీ?మీ ప్రథమ కబళం మీ నోటికి చేరే సమయంలోనే మీరెందుకు అలా విసిరివేశారు?” అని అడిగారు.
అదేమిటీ మహర్షిగారూ ! “మీరు చూడ
లేదా? అక్కడ ఒక ఈగ వచ్చి వాలింది. అది నేనెలా తింటాను? అందుకనే పార వేశాను” అని అనగా చక్రవర్తిగారూ ! “మీరు మీ
బంగారు పీట మీద కూర్చున్నారు, మీ బంగారు కంచంలో అన్నం పెట్టుకున్నారు. మీ బంగారు
పళ్ళెంలో వడ్డించిన పదార్థాలన్నీ మీరు మీ మంచి నెయ్యితో ఒక పెద్ద ముద్దగా
కలుపుకున్నారు. మీరు మీ చేతులతో, మీ నోట్లో పెట్టుకునే సమయానికి ఒక ఈగ వచ్చి
వాలింది. ఈ వస్తువులన్నీ మీవే కదా ! మరి అలాంటప్పుడు ఈ ఈగ కూడా మీకు సంబంధించిదే
కదా ! అది మీ రాజ్యంలోనే ఉంది కదా ! అటువంటప్పుడు మీరు ఆ ముద్దని ఎందుకు పార
వేయవలసి వచ్చింది?” అని
ప్రశ్నించాడు.
అప్పుడు ఆ చక్రవర్తిగారికి
మొట్టమొదటిసారిగా తానూ చేస్తున్న పొరబాటు అర్థమయింది. అప్పుడు యాజ్ఞవల్క్య
మహర్షి చక్రవర్తి తో ఇలా అన్నారు. “చక్రవర్తిగారూ ! “ఎప్పటికైనా మానవ సంకల్పం కన్నా దైవ సంకల్పం చాలా గొప్పది”
ఎంతసేపు ఇది నాది, ఇది నేను సంపాదించాను, “నాది”, “నాది” అని మీరెప్పుడూ
ఆలోచిస్తున్నప్పుడు మీ సంకల్పానికి అంత బలం ఉండదు. మీరు తీసుకున్న ప్రథమ కబళం
కంచానికి మీ నోటికి ఎక్కువ దూరం లేక పోయినా ఆ కాస్త దూరం లోనే చూడండి మీ
సంకల్పానికి విఘాతం కలిగింది కదా ! మీ నోటిలోకి వెళ్ళలేక పోయింది. ఏది ఏమైనా మనం
సంపాదించింది, మన దగ్గర ఉన్నది అంతా కూడా దైవానుగ్రహం వల్లే మనకు ప్రాప్తించిందని
ఒక అంకిత సమర్పణ భావంతోనే మనం ఉండాలి. మనం భోజనం చేసే ముందు భగవంతుడ్ని
ప్రార్థించాలి. ఆయన ప్రసాదించిన ఆ భోజనాన్ని మనం తినే ముందు ఆయనకి ధన్యవాదాలు
చెప్పుకోవాలి.”
అంతే కాని మనిషి కేవలం
అహంకారంతో “నావి”, “నావి” అని ఎప్పుడైతే అనుకుంటాడో అతని సంకల్పానికి దైవ సంకల్పం
తోడుగా రాదు. ఇక ముందైనా మీరు మీ అహం భావాన్ని వదిలి వేసి, దేవుని పట్ల ఒక అంకిత,
సమర్పణ భావంతో ఉండండి. “మీకు శుభమగు గాక!” అని ఆశీర్వదించి ఆయన అక్కడనుంచి
వెళ్ళిపోయారు. ఆ తర్వాత చక్రవర్తిగారిలో చాలా మంచి మార్పు వచ్చింది.
అన్ని గుణాలలో ఈ
అహంకారమనే గుణమే చాలా చెడ్డది అని చెప్తుంటారు. సాక్షాత్తు దత్తాత్రేయుడు కార్త్య
వీరార్జునికి కూడా ఇదే చెప్పారు. నాయనా ! “అహంకారమనేది చాప క్రింద నీళ్ళలాగా
ఉంటుంది. అది నిన్ను పూర్తిగా ముంచేసే వరకు అయ్యో ! నేను అహంకారంలో పడి పోయానే అనే
భావన నీకు రాదు, కాబట్టి ప్రతి నిమిషం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి సుమా ! “