ఇదివరకే నేను మీకు
చెప్పాను కదా ! సెలవులు కనుక వస్తే మా ఇల్లంతా బంధువులతో నిండిపోయి చాలా
హడావుడిగా, గొడవ గొడవగా ఉంటుందని. ఇలాగే ఒక రోజు మేమందరం మా నాన్నగారు తెప్పించిన
icecream తిని , ఆయన దవాఖానాకి (dispensary) వెళ్ళిపోగానే సావిత్రి బాగుంటు౦దని,
జమున బాగుంటుందని వారు వారు నటించిన సినిమా పేర్లు చెప్పుతూ వాదనలోకి దిగి పోయాం.
మాలో కొందరికి సావిత్రి అంటే కొందరికి జమున అంటే ఇష్టం. “మై గుడ్ నెస్ !” (My
goodness!) “సావిత్రి, జమున అంటే కొంప దీసి ఎవరో అనుకునేరు!” వాళ్ళెవరో
కాదు. మా చిన్నప్పటి పేరు మోసిన ప్రఖ్యాతి నటీమణులు అంటే అందరి అభిమాన
సినిమా తారలు. మా వాదనలు తారాస్థాయిని చేరుకోగానే పాపం ! వంట ఇంట్లో పనిలో
మునిగి ఉన్న మా అమ్మ “ఏమిట్రా ఈ గొడవలు , అరుపులు?” అంటూ పరిగెత్తుకుని వచ్చింది.
మా వాదనలు విని “బాగుందిరా ! వెనకటి జ్యేష్టా దేవి , లక్ష్మీ దేవి దెబ్బలాడుకున్నట్టుగా
మీరంతా దెబ్బలాడుకుంటున్నారు అని అంది. “ఏమిటీ?” “జ్యేష్టా దేవి మరియూ లక్ష్మీ
దేవియా?” “వారు దెబ్బ లాడుకున్నారా?” ఎందుకు ?ఎవరు వాళ్ళు?అసలేమయింది?” చెప్పు
అమ్మా, అత్తయ్యా అంటూ మా అమ్మ ప్రాణం తీశాం. పూర్వం దేవతలు
రాక్షసులు సముద్ర మంథనం చేసినప్పుడు దాంట్లో నుంచి మొదలు అమృతం తర్వాతా లక్ష్మే
దేవి, హాలాహలం అంటే విషం తర్వాత జ్యేష్టా దేవి వెలువడ్డారు. లక్ష్మే దేవి
అంటే అన్నీ శుభ లక్షణాలకు, సిరిసంపదలకు ప్రతీక అయితే జ్యేష్టా దేవి అన్నీ చెడ్డ
లక్షణాలకు, దరిద్రానికి ప్రతీక. ఎలా౦టివారయినా చుట్టూ ప్రక్కల ఉన్న
వాతావరణం మూలంగా ప్రభావం చెందుతారు కదా ! ఇద్దరక్క చెల్లెళ్ళు ఎంత అందంగా ఉన్నా
వారి స్వభావాలు వేరుగా ఉన్నాయి.
సరే ! రాత్రి మీకు ఈ కథ చెప్తాను అని
చెప్పి మళ్ళీ తన పనిలో తానూ మునిగి పోయింది. రాత్రి అవగానే భోజనాలు ముగించి
ఎప్పటిలాగే చక్కగా ఆరుబయట కూర్చుని మా అమ్మ చుట్టూ కథ వినడానికి
చేరాం. మా అమ్మ
ఈవిధంగా కథను మొదలు పెట్టింది.
లక్ష్మీ దేవి మరియూ జ్యేష్టా
దేవి కథ
పూర్వం ఒకప్పుడు లక్ష్మీ దేవికి
మరియూ ఆమె సోదరి అయిన జ్యేష్టా దేవికి వాగ్వివాదం జరిగింది. “జ్యేష్టా ! నేనే
నీకన్నా అందంగా ఉంటాను” అని గర్వంగా లక్ష్మీ దేవి తన చెల్లెలితో అంది. దానికి
సమాధానంగా జ్యేష్టా దేవి, “అక్కా ! నీవు చాలా అందంగా ఉన్నావని మిడిసి పడకు, నేనే
నీకన్నా చాలా అందంగా ఉన్నాను” అంటూ అంతకన్నా గర్వంగా చెప్పింది. ఈ విధంగా లక్ష్మీ
దేవి తానే జ్యేష్టా దేవి కంటె అందగత్తెనని , జ్యేష్టా దేవి కాదు నేనే నీకన్నా
అందగత్తేనని ఇలా ఇద్దరూ ఎంతోసేపు వాదించుకున్నారు. ఇలా రోజు వాళ్ళు వాదించు కుంటూ
ఉండేవాళ్ళు. ఇలా ఎన్నో రోజులు గడిచి పోయాయి. కాని వారిద్దరిలో ఎవరు అందగత్తె
అన్నది తేలలేదు. వారిద్దరికీ ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఎంత ఆలోచించినా అర్థం
కాలేదు. ఇలా ఉండగా ఒక నాడు వాళ్లిద్దరు ఒక కోమటివాడిని (వైశ్యుడు) చూసి అతని
దగ్గరకి వెళ్లి వాళ్ళ సమస్యని పరిష్కరించుకుందామని నిశ్చయించుకుని అతన్ని
సమీపించి ఇలా అడిగారు. “చూడండి వైశ్యుడు గారూ ! నేను లక్ష్మీ దేవిని, ఈమె నా
చెల్లెలు జ్యేష్టా దేవి. మా ఇద్దరిలో నేను అందంగా ఉన్నాను అని నేనంటే కాదు నీకన్నా
నేను అందంగా ఉన్నాను అని ఈమె చెప్తుంది. ఇలా మేమిద్దర౦ పరస్పరం
వాదించుకుంటున్నాం. మా ఇద్దరిలో ఎవరు అందగత్తె అన్నది మీరే నిర్భయంగా, నిస్సంకోచంగా,
నిష్పక్షపాతంగా చెప్పాలి. మీరేం చెప్పినా అది మాకు సమ్మతమే” అని లక్ష్మీదేవి
చెప్పగా ఆమె చెల్లెలు జ్యేష్టాదేవి కూడా తన అంగీకారాన్ని తెలియచేసింది.
“పాపం ! ఆ కోమటివాడికి ఇప్పుడు
ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఏం చెప్పాలి? ఇద్దరూ అందగత్తెలే
! లక్ష్మీ దేవి అందంగా ఉంది అని చెప్తే జ్యేష్టా దేవికి కోపం వస్తుంది. అలాగే
జ్యేష్టా దేవి అందంగా ఉంది అని చెప్పితే లక్ష్మీ దేవికి కోప౦, వస్తుంది. ఏం చేయాలి
ఇప్పుడు?” అని కాసేపు ఆలోచించాడు. అతను పరమ తెలివిగలవాడు, చమత్కారి , మాటల్లో మహా
నేర్పరి, మధుర భాషి, మంచి వాక్చాతుర్యం కలవాడు. అతను లక్ష్మీ దేవి వైపు చూసి
నమస్కరించి, “అమ్మా ! నీవు నా వైపు నడుస్తూ వస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నావు”
అని చెప్పాడు. ఆ మాటలకి లక్ష్మీ దేవి చాలా సంతోషంగా అతన్ని చూసింది. కాని జ్యేష్టా
దేవి ముఖం చిన్నబోయింది. మళ్ళీ అతను జ్యేష్టా దేవిని చూసి ఆవిడకి కూడా నమస్కరించి
ఇలా అన్నాడు. “ అమ్మా ! నీ అందానికి ఏం లోటు లేదు. చాలా చక్కగా ఉన్నావు . నీవు నా
నైపునుంచి వెళ్లిపోతుంటే నీ అందం వర్ణించలేనిది.” అని అన్నాడు. ఆ మాటలకి జ్యేష్టా
దేవి కూడా సంతోషపడింది. తాను చాలా అందగత్తెనని, అందంగా కనిపించాలి అనే ఉద్దేశ్యంతో
లక్ష్మీ దేవి వైశ్యుని వైపు తిరిగి నడవసాగింది. అదేవిధంగా జ్యేష్టా దేవి
తాను లక్ష్మీ దేవి కన్నాచాలా అందంగా కనిపించాలి అనే ఉద్దేశ్యంతో వెనక్కి తిరిగి
వాడివైపు నుంచి దూరంగా వెళ్ళ సాగింది. ఈ విధంగా ఆ లక్ష్మీ దేవి వైశ్యుల ఇంట్లో తిష్ఠ
వేసింది. అప్పట్నుంచి వైశ్యులు బాగా ధనికుల్లాగా ఉంటారు
చూశారా ఆ కోమటివాడి తెలివితేటలు
! మంచి మంచి మాటలతో, చక్కగా వ్యాపారం చేస్తూ ధనవంతులయ్యారు. ఇప్పటికీ కూడా
వ్యాపారం చేయాలన్నా, బాగా డబ్బు గడించాలన్నా వాళ్లకి సాటి ఎవరూ లేరు అర్థమయిందా?
అని అమ్మ అడిగితే అర్థమయింది అన్నట్టుగా మేమందరం తలూపాం. ఈ కథ గురించే ఆలోచిస్తూ
నిద్రలో జారుకున్నాం.
Author : Nanduri Sri Sairam
Story Narrated by Smt. Nanduri
Raja Rajeshvari Devi