దేవదత్తుని వృత్తాంతం - 14
ఇలా ఆ స్వామి వారి నుండి. కబురు రాగానే సుమతి తల్లిదండ్రులు వారి కుమార్తె ని తీసుకొని ఆయన దగ్గరకు వెళ్ళటం జరిగింది. అప్పటికే రాత్రి 9:30 కావస్తున్నది. అక్కడ చాలా మంది భక్తులు ఏవో భజనలు పాడుకుంటున్నారు. కొంత మంది ఉన్మాద స్థితి లో ఉండి ఎంతో పరవశంతో రకరకాల హావభావాలతో నాట్యం చేస్తున్నట్టుగా ఊగిపోతున్నారు మరియు పాటలు పాడుతున్నారు. ఎంతో కొంత కవిత్వం తెలిసిన వారు ఆ స్వామి వారి మీద ఎన్నో పాటలు కట్టి మహిమలు పొగుడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ పాడుతున్నారు . ఆ స్వామి వారి మీద ఆఖరికి అష్టోత్తర శత నామావలి చదివి ఆయనకి హారతి ఇచ్చారు. చాలా మంది భక్తులు ఆ హారతి పళ్ళెంలో చాలా డబ్బులు వేయటం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు, టిపినీలు సమర్పించుకున్నాక అందరూ వెళ్లిపోయారు. ఈ తతంగం అయిపోయే సరికి 10:30 అయింది. స్వామి వారు అందర్నీ పంపించివేసి సుమతి తల్లిదండ్రులను బయటికి పంపించివేశారు. మీ కుమార్తె కు వచ్చిన భయం ఏమీ లేదు నా రక్షణలో ఉంటుంది. మీరు సుఖంగా మీ ఇళ్లకు వెళ్ళండి అని చెప్పగా వారు అలాగే స్వామి అని బదులిచ్చి నిష్క్రమించారు. కానీ ఇంటికి వెళ్ళాక రాదమ్మ గారు రహస్యంగా ఆ స్వామి వారు బస చేసిన ప్రదేశం దగ్గరకి వచ్చింది.
ఈ లోపల వల్లభదాసు అనుచరులందరు కూడా నిశ్శబ్దంగా ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా అక్కడే చుట్టుపక్కల తిరుగుతున్నారు. నిద్ర నటిస్తున్నారు. చాలా మంది సిఐడి పోలీసు శాఖ వారు మారువేశాల్లో జనం మధ్యలో తిరుగుతూ, అందరిని గమనిస్తూ, వాళ్ళు కూడా నిశ్శబ్దంగా వారికి వచ్చిన ఆదేశాల విధంగా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంత మంది మహిళ పోలీసులు భజనలు చేస్తున్న వారిలో కలిసిపోయి ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా సుమతి ఉన్న గదిలోనే ఉండటం జరిగింది. ఆ గదిని ఆనుకొని ఉన్న గదిలో ఇంకొక మహిళా పోలీస్ మామూలు సాదాసీదా దుస్తుల్లో ఉండి అన్ని గమనిస్తుంది. అక్కడ ఒక స్త్రీ రహస్యంగా వచ్చి ఎవరు లేరనే ధీమాతో పాలలో పొట్లం లోని మందు కలపటం, ఆ కలిపిన మందు సుమతికి ఇవ్వబోతుందని గ్రహించిన ఆ మహిళ పొలీస్ నిశ్శబ్దంగా ఆ స్త్రీని వెనక నుంచి పట్టుకొని, నోరు నొక్కి ఆమె కాళ్ళు చేతులు కట్టి మామూలు పాలగ్లాసుని తీసుకొని సుమతి ఉన్న గదిలోకి వెళ్లి రహస్యంగా ఏం భయపడకు సుమతి నేను ఉన్నాను నీకు రక్షణగా అని చెప్పటంతో ముందే పథకం అంతా తెలిసిన సుమతి నిబ్బరంగా ఉండిపోయింది. ఆ గది మొత్తం పోలిసు వారు మారు వేశాల్లో ఉండి అంతా గమనిస్తుండగా ఈ లోగా స్వామి వారు సుమతి ఉన్న గదిలోకి ప్రవేశించారు. ఒళ్ళంతా సుగంధ పరిమళాలు చల్లుకుని వచ్చి అతను వచ్చి రాగానే అమ్మాయి నీకు ఏం భయం లేదు నేను సాక్షాత్తు అవదూత స్వామిని కాబట్టి నీ వ్యాధిని నయం చేస్తాను నన్ను మాత్రం నువ్వు సేవించుకో అని సమీపంగా రాసాగాడు. అతని నోటినుంచి గంజాయి వాసన రావటంతో సుమతి తల తిప్పుకున్నది. మనసులో ఆమె శ్రీపాద శ్రీ వల్లభుల స్మరణ చేస్తోంది. ఎప్పుడైతే ఆ స్వామివారు ఎవరు లేరనే ధీమాతో వచ్చి ఇక్కడ నువ్వు ఎంత అల్లరి చేసినా ఎవరు నీ సహాయానికి రారు కాబట్టి మర్యాదగా నేను చెప్పిన మాట విను అని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో ఆ గదిలో లైటు వెలిగి ఆ స్వామి వారికి అర్థం అయ్యే లోపలే పోలీసు వారు అతన్ని చుట్టు ముట్టి బందించివేశారు. అంతకుముందే వారు వచ్చి తమకు కావాల్సిన సాక్షాలన్నీ సేకరించారు. వారి అనుచరులని ముందే గుర్తు పట్టి బందించివేసి, వారిని ప్రశ్నించసాగారు. ఇంతైనా కూడా ఆ స్వామివారి మత్తు ఇంకా దిగలేదు. సుమతి బయట ఉన్న తన తల్లిని కౌగిలించుకుని ఆ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామిని స్మరించకుంటూ ఉన్నది.
ఈ విషయం తెలిసిన ప్రజలంతా, భక్తజనులంతా రావటం అక్కడ చేరిన ప్రజలందరికీ కూడా స్వామివారి అనుచరులు ఒక్కో క్కలు స్వామివారి రహస్యాలు బయట పెట్టటం జరిగిపోయినాయి. సాయిబాబా భక్తునిగా చెప్పుకున్న ఆ జగతాప్ గారు చడీ చప్పుడు లేకుండా మాయమైపోయినాడు. ఆశ్రయం ఇచ్చినటువంటి శ్రీ రంగారావుని విచారించగా ఆయన ఏమీ తెలియని అమాయకుడని ఈ రంగబాబు రంగదాసు అనే ముఖ్య అనుచరుడు స్వామివారి కి లేనిపోని మహిమలు ఆపాదించటం వల్ల అతను తన ఇంటిని ఆ స్వామి వారి బస కింద ఇవ్వటానికి ఒప్పుకున్నాడని తెలిసింది. ఈ కపట అవదూత గారిని సోదా చేసినప్పుడు పది లక్షల పైన రొక్కం, కొన్ని .కిలోల బంగారం, వెండి పోలీసు వారు పట్టుకున్నారు. చాలా గొడవ అయినాక స్వామి వారికి కర్ణాటక దేశంలో కూడా పెద్ద పెద్ద ఆస్థులున్నాయని కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయని ఎన్నో రకాల అక్రమాలు చేశాడని తెలియటంతో అతనికి పడవలసిన కారాగార శిక్ష పడింది. పోలీసు వారు ప్రజాలనందర్ని ఉద్దేశించి ఇటువంటి కపట అవదూతలని, స్వాములని మీరు నమ్మవద్దు అని, పరి పరి విధాల వల్లభదాసు గారిని ఎంతో మెచ్చుకొని ఆయన అక్కన్నించి వెళ్లిపోయారు. అక్కడ ప్రజలందరూ కూడా వల్లభదాసు గారిని చుట్టుముట్టి ఎంతో మెచ్చుకొన్నారు. సుమతి తల్లిదండ్రులు కూడా అభినందించారు.
అయితే వల్లభదాసు నిర్లిప్తంగా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ఇచ్చిన ప్రేరణ తొనే ఈ పనులు చేయగలిగానని తాను నిమిత్తమాత్రుణ్ణి అని ఏమి జరగనట్టుగానే ఆయన మాట్లాడారు. శ్రీ పాద శ్రీ వల్లభ స్వామిని లేదా దత్తాత్రేయ స్వామిని పట్టుకున్నప్పుడు ఇటువంటి మధ్యవర్తుల దగ్గరికి వెళ్లకూడదని సాక్షాత్తూ శ్రీ సాయి సచ్చరిత్ర లో కూడా నీకు నాకు మధ్యలో ఈ అడ్డుగోడలు ఎందుకని సాయి చెప్పినట్టు మరియు శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం అనేక ఘట్టాలని ఆయన వివరిస్తూ అవదూత అనే పదానికి నిర్వచనం అంతా పోయిందని అవదూత అంటే పెంట కుప్పలపై బీడీ చుట్ట సిగరెట్లు ఏరుకొని మురుగు కాలువలో నీళ్లు తాగుతూ బండ బూతులు తిడుతూ జుట్టంతా చింపిరిగా ఉండి చినిగిపోయిన బట్టలతో స్నానం లేకుండా ఉండేవాడు తనలో తాను గొణుక్కుంటూ ఉండేవాడు అని ఈ కలియుగంలో అవదూతలకి నిర్వచనం ఇవ్వబడింది కానీ నిజానికిశ్రీ దత్త పురాణంలో సరె దత్త స్వామి వారునేను అవదూతను అని చెప్పుకోవడం జరగలేదు. అవదూత అంటే కేవలము శ్రీ దత్త స్వాముల వారే తప్ప ఇంకా ఎవరు కాదని, కేవలం దత్త స్వామి ఆశీర్వాదంతో శ్రీ పాద శ్రీ వల్లభుల ఆశీర్వాదంతో మాత్రమే అనన్య భక్తి భావంతో ఉన్న వ్యక్తికి వెంకయ్య స్వామిగా అవదూత తత్వంతో ఉంటావని చెప్పటం తప్పితే , శ్రీ స్వామివారిని మించిన అవదూత రెండోవాడు లేడని, మీరు ఎప్పుడూ మూలాన్నే పట్టుకొని ఉండాలని మాయలు,మర్మాలు, గోసాయి చిటికెలు చేసేవారి దగ్గరికి కనీసం వెళ్ళను కూడా వెళ్లకూడదని , ఎంతో వినయంగా నమ్రతగా అక్కడికి వచ్చిన జనాన్ని అందర్నీ సంబోదిస్తూ చాలా చక్కగా చెప్పటం జరిగింది. అక్కడికి వచ్చిన వారందరు కూడా వల్లభదాసుకి, శ్రీ పాద శ్రీ వల్లభులకి జయ జయ ధ్వనులు పలుకుతూ తాము చేసిన తప్పుకి లెంపలు వేసుకొని, ఇంటికి వెళ్లి ఆ కపట అవదూత ఛాయా చిత్రాలసు అవతల పారవేసి కేవలం ముందు ఇక దత్తస్వామి అవతారాలు మాత్రమే పట్టుకుంటామని ఎంతో భక్తి భావంతో ప్రతిజ్ఞ చేశారు. ఇదంతా గమనిస్తున్న నాగనాథునికి శ్రీ వల్లభ దాసు చేసిన మంచి పనికి ఎంతో సంతోషించారు. అప్పటినుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నేను దత్త భక్తున్ని, అవదూతని అని చెప్పుకునేవారు దరిదాపుల్లో రాలేదు. అంతేకాదు చాలామంది దత్త భక్తులుగా, శ్రీ పాద భక్తులుగా మారిపోవటం జరిగింది.