N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Saturday, 22 April 2023

మా నండూరి వంశ చరిత్ర

                
మా నండూరి వంశ చరిత్ర


                  అంకితం




F:\Siva Rao Nanduri.png


మా తాతగారు నండూరి శివరావు గారికి, మా బామ్మ నండూరి దుర్గాoబ గారికి




రచయిత నండూరి శ్రీ సాయిరాం


                  ముందు మాట

    మనం ఏ పని చేసినా, మాట్లాడినా, రాసినా, ఏదో ఒక ఉద్దేశ్యంతో ఆ పని చేస్తాం. దానివల్ల ఏమిటీ లాభం? ఎవరికీ లాభం? అనే అంశాలు కూడా ఉంటాయి. మన భారతదేశంలో ప్రతీవారికీ వారి జీవితంలో అప్పుడప్పుడు ఉదయించే ప్రశ్న ఏమిటంటే నేనెవరినీ? ఎక్కడినుంచి వచ్చాను , ఎలా, ఎందుకు వచ్చాను? నా తల్లిదండ్రులు ఎవరు, నా తాత ముత్తాతలు ఎవరు ? వారి పూర్వీకులు ఎవరు? ఇదే ప్రశ్నని నేను పదేళ్ల వయసులో మా అమ్మని ప్రశ్నిస్తూ ఉండేవాడిని. ఇలా పెరిగి పెద్దవుతున్నప్పుడు నా అవగాహనను బట్టి మా అమ్మ అనేక సందర్భాలలో ఎన్నో ఆసక్తికరమైన, అద్భుతమైన  విషయాలు మా మాతామహుల, పితామహుల గురించిన వివరాలు చెప్తూ ఉండేది. మేము నండూరి వంశస్థులమనీ, ఆరుగొలను వాస్తవ్యులమనీ మాకు ముగ్గురు మేనత్తలనీ అలా చెప్తుండేది. మానాన్నగారితో కూడా  నేను చాలా చనువుగా ఉండేవాడిని.B.Sc చదువుతున్నప్పుడు కూడా మా నాన్నగారి ప్రక్కనే పడుకునేవాడిని. ఆయన కూడా  తన చిన్నతనం కబుర్లు చెబుతూ ఉండేవారు. అలాగే 1965 - 66  లో మా రెండో మేనత్త స్వరాజ్య లక్ష్మి అత్తయ్య ఇంట్లో అంటే బందరు లో బచ్చుపేట, కంసాలి కోటయ్య వీధిలో ఉండి హిందూ కాలేజిలో P .U .C చదువుతున్న రోజుల్లో, అత్తయ్య ద్వారా మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు విన్నాను. మా అత్తయ్య నాకు కన్నతల్లి లాంటి ప్రేమను అందించింది. నేను, మామయ్యగారు విద్యాభూషణ రావు గారు మేడ మీద గదిలో చెరో మంచం మీద పడుకునేవాళ్ళం. నాతో చాలా ప్రేమగా, సరదాగా మాట్లాడుతూ ఉండేవారు. ఇలాగే మా అమ్మ కూడా మా అన్నలకి, అక్కచెల్లెళ్లకి  చాలా విషయాలు చెప్తుండేది. కొన్ని విషయాలు మా పెద్దన్నయ్య శివఫణిరాజు, రెండో అన్నయ్య శివ ప్రశాంత్, అక్క ప్రసన్న ద్వారా కూడా తెలుస్తుండేవి.  వీరు ముగ్గురు కూడా మా స్వస్థలమైన ఆరుగొలనులో ఉండటం సంభవించింది. బందరులో స్వరాజ్యం అత్తయ్య దగ్గర పెరిగిన మా రాణి వదిన, అత్తయ్యతో పాటు చాలా సార్లు ఆరుగొలనుకి వెళ్ళిoది. కొన్ని విషయాలు ఆవిడ ద్వారా తెలిసినాయి. కాబట్టి నేను ముందు ముందు చెప్పబోయే విషయాలలో ఎవ్వరూ ఆక్షేపించలేని ప్రమాణాలు ఉన్నాయి. 

ఇకపోతే రెండవ కారణం. నా పిల్లలు కూడా (శివ లాహిరి కాంత్, శివ కమల్ కాంత్ లు) ఎన్నో సందర్భాలలో మా వంశం గురించిన  వివరాలు అడుగుతూ ఉండేవారు.  సరిగా నేను మా అమ్మను అడిగినట్లుగా.  ఇందుమూలంగా కూడా నాకు మా వంశ చరిత్ర రాయాలనే ఆలోచన ఎప్పటినించో ఉన్నా, దానిని వాయిదా వేస్తూ రావడం వలన కార్య రూపం దాల్చ లేదు. 

మూడవ బలీయమైన కారణం . మూడవ బలీయమైన కారణం మా చిన్న తాతయ్య నండూరి సత్యనారాయణ గారి కుమారుల్లో నండూరి పార్థ సారథి బాబాయి గారు. ఈయన కొన్నాళ్ళు ఆంద్ర పత్రికలో పని చేశారు. ఆయన కూడా ఆయన చూడని మా తాతగారి మీద ఒక పెద్ద పరిశోధన, అనేక అభూతకల్పనలతో. ఊహాగానాలతో, అర్థ సత్యాలతో వాళ్ళు వీళ్ళు చెప్పినవి, ఆ పైన ఆయన సొంత తెలిసి తెలియని అసత్యాలను చాలా అందంగా, పాఠకుల నించి ఏదో ఒక ఆసక్తిని రేకెత్తించాలన్న ఉద్దేశ్యంతో (sensation కలిగించాలని) ఆయన మేధాశక్తిని, నకారాత్మకపు విషయాలను ప్రస్తావించారు అవి నిజమో కాదో వారికే తెలియవని  కూడా చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ముందుగా మా ముత్తాత ఆస్తి వివరాలు, ఆ తర్వాత మా తాత గారు తాను సంపాదించి తండ్రికి ఇచ్చినప్పుడు పెరిగిన  ఆస్తుల వివరాలన్నీ కూడా ఉంటాయి కదా ? అప్పుడు కదా ! నిజ  నిర్దారణ జరుగుతుంది. ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే మా చిన్న తాతగారి పిల్లలoతా మా తాతగారు ఆస్తినంతా జామీనుల మూలంగా పాడుచేసారనే ఊహతో ఉన్నారు. నాలుగవ తరంలో ఉన్న మేమందరం కూడా  ఏ అపోహలు, అపార్థాలు  లేకుండా కలిసి ఉన్నాం. నంపాసా  గారి అభూత కల్పనలు, తాతగారి వ్యక్తిత్వం మీద ఆయన చేసిన విశ్లేషణ మూలంగా మా తాతగారి వ్యక్తిత్వం  మీద  దురభిప్రాయం పడకూడదు. అందుకే నాకు మా కుటుంబ పెద్ద అయినా మా ముత్తాత, తాతగార్ల అసలైన వాస్తవాలను  తెలియజేయాలనే బలమైన సంకల్పం నాలో కలిగింది. ఇందుకు కారణమైన నంపాసా గారికి కృతజ్ఞతలు.

నాకు 72 సంవత్సరాలు నిండాయి. నా కంటి చూపులో కూడా సమస్య ఉంది.మొన్న ఈ మధ్యనే పార్థు బాబాయితో మాట్లాడినప్పుడు తన website గురించి చెప్పగా దానిని నా శ్రీమతి సీత చదివి వినిపించింది. అది వింటున్న నేను మొదట దిగ్భ్రాంతి చెందాను. మా ఇంట్లో మా అందరికీ కూడా పార్థు బాబాయి అంటే అమితమైన గౌరవం. మా చిన్నతనం లో మా అమ్మ అయన రాసిన రాంబాబు డైరీని గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉండేది. మా నండూరి వారందరిలో మా తాతగారైన నండూరి శివరావు గారిలోఉన్న రచనా శక్తి. సాహిత్యాభిలాష ప్రస్ఫుటించాయి. ఎందుకంటే ఎక్కడ కూడా మా ముత్తాత వరాహ లక్ష్మి నరసింహం గారు కానీ మా చిన్న తాత సత్యనారాయణ గారు కానీ రచనలు చేసినట్లుగా మాకెవరికి తెలియదు. పార్థు బాబాయి కూడా తన రచనలలో ఎక్కడా తెలియ పరచలేదు ఒక వేళ రాసి ఉంటె చాలా సంతోషం. 

మా నండూరి వంశ చరిత్రలో ముఖ్యంగా మేము మా నండూరి శివరావు తాతగారి వారసులమని అంటే మా నాన్నగారు, మా ముగ్గురు మేనత్తలు వారి సంతానం, తర్వాతి తరాల గురించి మా భావి నండూరి తరాల వారి కోసం వివరంగా రాయటం జరిగింది.ఇంకా వివరించాలంటే మా నాన్నగారు వారి సంతానం అంటే అన్నయ్యలు, అక్కచెల్లెళ్ళు. మా అమ్మ తరఫు వారి గురించి, మేనత్తలు గురించి విస్తారంగా చెప్పే ప్రయత్నం చేశాను. పైన చెప్పిన రెండు పేరాలలో నాకు ఎవరిద్వారా మా వంశస్తుల వివరాలు ప్రామాణిక పూర్వంగా తెలిశాయో (ఆధారంగా) చెప్పాను. అందుకే ఇందులో ఒక దానికొకటి సంబంధం ఉంటుంది. సందర్భానుసారంగా ఉంటుందనే ఈ విశ్లేషణతో మీరు అసలు విషయాలు గ్రహిస్తారని ఆశిస్తాను.                                            

                                                                               

                                         -------- రచయిత నండూరి శ్రీ సాయిరాం

                              


                                             

                    

  

                                  

                                                        కృతజ్ఞతలు 

    మా నండూరి వంశ చరిత్ర రాయడం ఒక మహా తపస్సులాంటిది. దీనికోసం ప్రత్యేకంగా మా పెద్ద చెల్లెలు సూర్యలాలస బొంబాయి నుండి వచ్చి, రాత్రింబగళ్లు తెలుగులో టైపు చేసింది. నేను డిక్టేట్ చేస్తుంటే  రాసింది కూడా. దాదాపు 70  రోజులు పట్టింది. మధ్యలో ఎన్నో అవాంతరాలు. ముందుగా లాలసకి మా ప్రత్యేక అభివందనాలు.

నాకు ప్రత్యేకంగా తెలిసిన విషయాలు అమ్మా, నాన్న, అన్నయ్యలు, అక్కాచెల్లెళ్లు, మా మేనత్తలు స్వరాజ్య లక్ష్మి, శాంత. పెద్ద వదిన ప్రమీలా రాణి, నాన్నగారి స్నేహితులు ఈ విధంగా ఎంతో మంది దగ్గర నుండి వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది. వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు . సహాయ సహకారాలు అందించిన నా  భార్య నండూరి సీతా మహా లక్ష్మికి కూడా నా కృతజ్ఞతలు. నేను చెప్తుంటే తాను రాసింది. కొన్ని సార్లు  విషయాలు రెండు సార్లు రాయడం జరిగింది.  

నన్ను అన్ని విధాలా ఉత్సాహ పరచిన మా రాణి వదిన, నా కొడుకులు,కూతుర్లు.నా మేనల్లుళ్లు, మేనకోడళ్లు, వీరందరికీ నా కృతజ్ఞత


                                                       -------- రచయిత నండూరి శ్రీ సాయిరాం

                                                              


                                                   మనసులో మాట

                  

                                                    


    నేను కలలో కూడా ఎప్పుడూ ఊహించ లేదు నేను కూడా  అంటే మా నండూరి వంశ చరిత్ర లో పాలు పంచుకుంటానని. మధ్య అప్పుడప్పుడు వాట్'స్ అప్ లో కొన్ని కొన్ని నాకు తెలిసిన మా తాత. గారి విషయాలు, మా పూర్వీకుల వియాలు, అలాగే నాకు తెలిసిన మా మామగారి విషయాలు ఇంగ్లీష్ లో టైపు చేసి నా మనమళ్ళకి షేర్ చేస్తుండేదాన్ని. వాళ్ళతో పాటు మా అమ్మాయికి, అబ్బాయి కూడా పంపిస్తూ ఉండేదాన్ని. అప్పుడు నా పిల్లలిద్దరూ కూడా ఇవన్నీ రాసి పెట్టు అని అడిగారు. ఇంతలో మా సాయిరాం అన్నయ్య నండూరి వంశ చరిత్ర రాయడానికి సహాయం చేయమని అడిగితే సరే అని ఒప్పుకుని అన్నయ్య డిక్టేట్ చేస్తుంటే సీత వదినతో పాటుగా రాసి టైపు చేసాను. ఇది రాయడంలో మేమందరం ఎవరికీ తెలిసిన విషయాలు వాళ్ళు చెప్పటం తో మా అందరికి ఎన్నో విషయాలు తెలిసి చాలా ఆసక్తికరంగా ఉండాలి. పని చేయాలన్నా అది ముందు ఒక్కరితో మొదలయి ఎంతో మంది సహాయ సహకారాలతో పూర్తి అవుతుంది అని చెప్పడానికి "మా నండూరి వంశ చరిత్ర " యే ఒక చక్కని ఉదాహరణ. మేము ప్రాజెక్ట్ చాలా ఎంజాయ్ చేసాం.
          నా పిల్లలకి తెలుగు చదవడం రాదు. ఏం రాసావో చెప్పమ్మా  అని మా అమ్మాయి నీరజ అడిగితే మా బామ్మ, చిన్నబామ్మల బావి, డాబా ఫార్సు చెప్పితే పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వింది. చిన్నతనంలో మా అమ్మ కూడా చాలా చక్కగా ఎంతో హాస్యంగా నవ్వుతూ చెప్తుండేది. మా అందరికి కూడా నవ్వు వస్తుండేది. అలాగే ఇంకొక విషయం కూడా అమ్మ నవ్వుతూ సంఘటన ఎలా రక్తి కట్టిచ్చిందో చెప్తాను. మా పెద్ద అన్నయ్య అంటే శివరావు అన్నయ్యకి అప్పుడు 16  లేక 17  ఏళ్ళు ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నాడు. రోజుల్లో అది మూడురోజుల ప్రయాణం. రైల్లో దొంగతనాల గురించి చెప్పి అమ్మ జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ట్రైన్లో టికెట్ కలెక్టర్ వచ్చి అందరి టిక్కెట్లు చెక్  చేస్తూ అన్నయ్య దగ్గరకి వచ్చి టికెట్ అడిగాడు. అన్నయ్య ఏమి మాట్లాడకుండా కాలికి ఉన్న బూటు  లేసుని విప్పటం మొదలు పెట్టాడు. అది చూసి టికెట్ చూపమని అడిగితే బూట్లు ఎందుకు విప్పుతున్నాడు పిల్లాడు? పట్టుకుని తంతాడా ఏమిటి అని భయపడి రైల్వే పోలీస్ ని తీసుకుని వచ్చాడు.తోటి ప్రయాణీకులందరు కూడా విచిత్రాన్ని వినోదంగా  చూస్తూ కూర్చున్నారు. పోలీస్ ని పట్టుకుని వచ్చాక టికెట్ కలెక్టర్ కాస్త ధైర్యం తెచ్చుకుని మళ్ళీ టికెట్ చూపమని అన్నయ్యని అడిగాడు. అన్నయ్య మళ్ళీ షూ లేస్ విప్పటం మొదలు పెట్టాడు. ఏమిటీ బాబూ! టికెట్ అడిగితే కాలి బూట్లు విప్పుతున్నావు? అని గట్టిగా మాట్లాడాడు. అన్నయ్య మారు మాట్లాడకుండా బూట్లు, సాక్సులు విప్పి అందులోనుంచి మెల్లగా టికెట్ తీసి టికెట్ కలెక్టర్ కి ఇచ్చాడు. అది చూసి పోలీస్, టి.సి., తోటి ప్రయాణీకులందరు ఆశ్చర్యంగా అన్నయ్యని ఎందుకలా చేసావు? అని అడిగారు. రైల్లో టికెట్ ఎవరైనా కొట్టేస్తారేమో అని అక్కడ దాచి పెట్టాను. అక్కడైతే  జాగ్రత్తగా ఉంటుందని సమాధానం చెప్పాడు.. టికెట్ అడిగితే నీవు మాట్లాడకుండా బూట్లు విప్పుతుంటే, నీ దగ్గర టికెట్ లేదేమో, నన్ను పట్టుకుని తంతావేమో అని భయపడి  పోలీస్ ని తీసుకొచ్చాను , భలే వాడివే అని వారిద్దరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. తోటి ప్రయాణీకులందరూ అన్నయ్యని మెచ్చుకున్నారుట. మా అమ్మ కొడుకు తెలివితేటల్ని గర్వంగా, నవ్వుతూ చెప్పింది.ఇది రాస్తుంటే నాకయితే మా అమ్మ హావభావాలు, ఆవిడ ముఖం గుర్తుకొచ్చి నవ్వొస్తుంది. ఇలా ఎన్నో ఎన్నో సంఘటనలు వివరించాం. నిజంగా చాలా ఎంజాయ్ చేసాను నేనయితే.
          మా తాతగారి పుట్టుకే ఒక విచిత్రం, ఆయన మా అందరికోసమే బ్రతికారా అని అనిపిస్తుంది. ఆయన రోజుల్లో అంటే యే సౌకర్యాలు లేని రోజుల్లో ఎలా అంత స్టాండర్డ్ అయినా  వైద్య కోర్స్ విషయాలు, వివరాలు  సేకరించారు? ఎంత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ,చక్కగా ప్లాను చేసుకుని, ఐదేళ్లు ఎవ్వరి మీదా ఆధారపడకుండా తనకు తానుగా కష్టపడి, అనుకున్నది సాధించి, విజయవంతంగా ఆరుగొలనుకి తిరిగి వచ్చారో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రోజుల్లో అయితే అన్ని వివరాలు మన చేతి వేళ్ళ మీదనే ఉన్నాయి కానీ అప్పుడు అలా కాదు కదా! అయితే తాత్తగారి స్నేహితుడి గురించి నాకెలా తెలిసిందో చెప్తాను. 1972 లో నాకు బొంబాయిలో ఒక తెలుగు ఫామిలీ పరిచయమయింది. ఆవిడ నేను ఇంకొక ఫామిలీని పరిచయం చేస్తానని ఘంటసాల ప్రసాద్ గారింటికి తీసుకుని వెళ్ళింది. నేను నండూరి వారి ఆడపడుచుని అని తెలియగానే ప్రసాద రావుగారు మహా సంతోషపడి పోయారు. నేను మా తాతగారి పేరు చెప్పగానే ఆయన ఇంకా సంతోషపడి మా నాన్నగారు, మీ తాతగారు ఇద్దరు ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా కలకత్తాకు పారిపోయి డాక్టర్ కోర్స్ పూర్తి చేశారు అని చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరిని ఆరుగొలనులో ఇంట్లోకి రానీయకుండా గొడ్లపాకలో పెట్టడం అన్నీ ఆయనే చెప్పారు. కానీ ఆయన చాలా చిన్నతనంలోనే హార్ట్ అట్టాక్ తో మరణించారు. లేకపోతె ఇంకా బోలెడన్ని వివరాలు వాళ్ళిద్దరి గురించి చెప్పేవారు. వాళ్ళ అమ్మగారు కూడా తాతగారి ప్రాణం పోయినప్పుడు  విజయవాడ నుండి  తాతగారి స్నేహితుడే  మా బామ్మని, అత్తయ్యలని, తాతగారి మృత శరీరాన్ని ఆరుగొలనుకి తీసుకెళ్లారని కూడా చెప్పింది. ఆయనే ఘంటసాల సీతా రామ శర్మ గారు. ఆయన భార్య దుర్గాo కూడా ఆరుగొలను నండూరి వారి ఆడపడుచు  (ప్రసాద రావు గారి తల్లి ). ఇలా అనుకోకుండా నాకు తాతగారి స్నేహితుడి కుటుంబంతో పరిచయం అయింది. తాతగారు, ఘంటసాల గారు ప్రాణ స్నేహితులయితే నేను, వారి కోడలు విజయా ప్రసాద్ అంతకన్నా ప్రాణ స్నేహితులం. మా ఇద్దరికైతే డెప్ప్రెషన్లో ఎప్పుడైనా ఉంటే  telepathy ద్వారా మెసేజెస్ అందుతుంటాయిఅప్పుడు వెంటనే ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటాం ఇండియా లో ఉన్నా అమెరికాలో ఉన్నా.భోపాల్ లో ఉన్నా . ప్రస్తుతం ఆవిడ భోపాల్ లో పెద్ద కొడుకైన మనోజ్ దగ్గర ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న కొడుకైన మహేష్ దగ్గరకి అమెరికా వెళ్తుంది.

 ఇలా రాస్తూ పోతుంటే ఎన్ని మధురమైన స్మృతులు ఉన్నాయో చెప్పలేం. రాస్తున్నప్ప్పుడు ఏదో ఒకటి గుర్తుకి రావడం అరే ! ఇది మర్చి పోయాం 1 అది రాయాలి అని ఇలా  ఇలా ఆలోచించుకుంటూ ముందుకి వెళ్లిపోయాం. అలాగే మా అమ్మ ఎప్పుడూ మాకు ''అవతల వాళ్లకి అది ఉంది అని ఏడిస్తే ఒక కన్ను పోతుంది, అయ్యో ! నా దగ్గర లేద్దని ఏడిస్తే ఇంకొక కన్ను పోయి గుడ్డి వాళ్ళం అవుతాం " అని చెప్తుండేది. జీవితంలో ఎప్పుడూ కంపేర్చేసుకుని బాధపడాలేదు ఎప్పుడు. మా అమ్మ ఏది చెప్పిన ఎంత చక్కగా చెప్పేది అంటే అవి ఎన్ని జన్మలైనా మేము మర్చి పోలేం.

ఇంక మళ్ళీ మన కథకు వస్తే నేను, అన్నయ్య ఆల్మోస్ట్ మా బాల్యావస్థకి వెళ్ళిపోయి, జనగామలో కూర్చుని కథ రాస్తూ, చక్కగా దెబ్బలాడుకుంటూ, (మా వయస్సు గురించి మర్చిపోయాం ), ఒళ్ళు మండి ఒకటి రెండు రోజులు మాట్లాడుకోకుండా ఉండి, మళ్ళీ మర్చిపోయి, చక్కగా మా ప్రాజెక్ట్ పూర్తి చేసాం. పాపం ! మా ఇద్దరి మధ్య చాలా బాలన్స్ గా ఉండి ,చాలా బాగా మా ఇద్దరి తో మేనేజ్ చేసి మాకు తన సహాయ సహకారాలు అందిస్తూ తాను కూడా మాతో పాటు ప్రయాణం చేసింది. మా ప్రాజెక్ట్ పూర్తి అయింది. ఇప్పుడు ఆలోచిస్తే ఎలా పూర్తి చేశామా అని ఆశ్చర్యంగా ఉంటుంది.

                నేనొక్కదాన్నే దూరంగా విసిరేసినట్టు బొంబాయి లో పడ్డాను నా అనేవాళ్ళు ఎవరూ లేకుండా ,భాష కూడా తెలియదు. మా నాన్నగారి మీద నాకు విపరీతమైన నమ్మకం. మాత్రంగా నాలుగు వేళ్ళు నోట్లో పోతున్నాయంటే అది మా అమ్మ, నాన్నగారి పుణ్యం వల్లనే అని ఎప్పుడూ అనుకుంటాను. కానీ మధ్య ఎందుకో ముందు మా అమ్మ నాన్నగార్ల పుణ్యమే కాదు తాతగారు చేసిన పుణ్యం యొక్క ఫలితం కూడా అనే భావన కలిగింది. ఎన్ని కుటుంబాలు తాతగారి మూలంగా ఉద్ధరించబడ్డాయి, ఎంతమందికి జీవనోపాధి కలిగింది. ఖచ్చితంగా వారందరి ఆశీర్వాదాలు  మా అందరికి  అందినాయి. , అందుతున్నాయి, ఇంకా భవిష్యత్తులో కూడా అందుతాయి, మా తల్లిదండ్రుల పుణ్యఫలితం తో పాటు . బాబాయ్ గారు రాసిన మా చరిత్ర చదివాక నా ఆలోచన సరి అయిందని ధ్రువ పడింది. ఎన్నడూ చూడని మా శివరావు తాతగారంటే హీరో వర్షిప్ లాగా అయింది

దీనితో నా ముందు మాట ముగిస్తాను. అందరికి ముఖ్యంగా సాయిరాం అన్నయ్యకి నన్ను చిన్నతనం లోనికి తీసుకు పోయినందుకు కృతజ్ఞలతో.

                                                                                 --------- సూర్యలాలస 



                        

 




                       

                         

               









                          మా నండూరి వంశవృక్షం

 

ఈ నండూరి వంశ వృక్షం, నూరేళ్ళ క్రిందటి ముత్తాత గారి గ్రూప్ ఫోటో మా పార్థు బాబాయ్ గారు రాసిన నండూరి వంశ చరిత్ర నుంచి తీసుకున్నాం. మా బాబాయ్ గారికి మనః పూర్వక కృతజ్ఞతలు                                             








1927 లో తీసిన గ్రూప్ ఫోటో (నాలుగు తరాలు)


F:\vansh Foto.png

 

          మా నాన్నగారు వారి తాత గారు, తాతమ్మ,తల్లిదండ్రులు,బాబాయి, పిన్ని, వాళ్ళతో

          

          కూర్చున్న వరుసలో: ఎడమవైపు నుంచి మా తాతగారు, వారి వెనుక మా బామ్మ 


          క్రింద కూర్చున్న వారిలో: ఎడమవైపు నుంచి మా పెద్ద అత్తయ్య, స్వరాజ్యం అత్తయ్య, శాంత    

          అత్తయ్య, మా నాన్నగారు.         

                                          

                                            

                                         మా నండూరి వంశ చరిత్ర 

                                                     అధ్యాయం 1

పరిచయం

మా ముత్తాత గారు నండూరి వరాహ లక్ష్మి నరసింహం గారు. వీరి దగ్గరనుండి మా కథ ప్రారంభo. వీరికి సూర్యనారాయణ, జానకిరామయ్య అనే ఇద్దరు తమ్ముళ్లు. మా ముత్తాత గారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద నండూరి శివరావు మా తాత గారు. మన కథా నాయకుడు. చిన్న కుమారుడు సత్యనారాయణ గారు, కూతురు వెంకాయమ్మ. మా నండూరి వారు ఆరుగొలను వాస్తవ్యులు. మాకు కరణీకం వంశ పారంపర్యంగా వస్తుండేది.ఇది సాధారణంగా పెద్ద కుమారులకు సంక్రమిస్తుంది. వరాహ లక్ష్మి నరసింహం గారు ఆరుగొలనులో కరణీకం చేస్తుండేవారు. ఈ ఊరు గుడివాడకు దగ్గరలో ఉంది.

                                   ఆరుగొలను - మా ముత్తాతగారి ఇల్లు



                                   



                  మా తాత గారు శివరావు  గారికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. వారు వరసగా సీత, శ్రీ రామారావు, స్వరాజ్యలక్ష్మి,శాంతకుమారి. అంటే మాకు ముగ్గురు మేనత్తలు. సీత అత్తయ్యని భావరాజు సూర్య నారాయణ మూర్తి గారికిచ్చి వివాహం చేసారు. మా సీత అత్తయ్య పెద్ద కూతురు మీనాక్షిని మా సత్యనారాయణ తాతగారి కొడుకు మురళి బాబాయికిచ్చి వివాహం చేసారు. సీత అత్తయ్య రెండవ కూతురు పద్మ వదిన, చివరన రాజు వదిన. 

మా నండూరి వంశ చరిత్ర

మా తాతగారు నండూరి శివరావుగారు & వారి సంతానం

                  

        మా నాన్నగారు నండూరి శ్రీ రామారావు గారు                                          

ఎడమవైపునుంచి : శాంత అత్తయ్య , మా బామ్మ దుర్గాoబ,  సీత అత్తయ్య ,స్వరాజ్యం అత్తయ్య



నండూరి శివరావుతాత గారి జన్మ వృత్తాంతం : మా తాత గారు కారణజన్ములు. వాడుక  భాషలో చెప్పాలంటే గట్టి పిండం. ఏడవ నెలలోనే అంటే prematured  బేబీ గా పుట్టారు. మా ముత్తవ్వ సీతారామమ్మకి  21 .03.1890 సం.లో జన్మించారు. ఆ రోజుల్లో మంత్రసానులు ఇంటికి వచ్చి ప్సవాలు చేస్తుండేవారు.  వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండేవి. శిశువులో చలనం లేకపోయేసరికి మృత శిశువుగా భావించి, చెత్తకుండీలో పారవేసారుట. అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి. చెత్తకుండీలో విస్తరాకులు, చెత్తా చెదారం వంటివి ఉండడంతో అనేక రకాల కీటకాలు, చీమలు, కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు వగైరా వగైరా చేరతాయి. రాత్రంతా తాతగారు అందులో గడిపారు. ఆ చెత్తకుండీలో ఉన్న మా తాతగారిని కుక్కలు, ఎలుకలు, ఇతర హానికరమైన కీటకాలు  ఏ హాని చేయకుండా సలక్షణంగా ఉన్నారంటే ఏదో ఒక అద్భుతమైన అదృశ్య శక్తి కాపాడింది అనే ఈ విషయం అక్షర సత్యం. తెల్లవారుఝామున రోడ్డు సఫాయి చేస్తుండే మనిషికి చంటిపిల్లవాని రోదన (ఏడుపు) వినిపించింది. వెంటనే వారు ఆ పిల్లవాడిని బయటకు తీసి, రాత్రి కరణం గారింట్లో ప్రసవం జరిగింది మృతశిశువని బయట పడేసి ఉంటారని భావించి, మా ముత్తాతగారికి ఆ శిశువుని అప్పగించారు. ఏడో నెలలోనే పుట్టినప్పట్నుoచే మా తాతగారికి కష్టాలు, సవాళ్లు మొదలయ్యాయి.  

                 నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మృత శిశువు జన్మించినప్పుడు బ్రాహ్మణులలో సర్వసాధారణంగా ఎంతో కొంత కర్మకాండము జరిపించి భూమిలో పాతి  పెట్టడం జరుగుతుంది. రాత్రి పూట జరపరు. ఇక్కడ మా తాతగారికి భగవంతుడి స్వరూపమైన ప్రకృతి చాలా సహాయం చేసింది. ఎందుకంటే మా ముత్తాత వరాహ లక్ష్మి నరసింహంగారు మృత శిశువని భావించి పాతిపెట్టినట్లయితే మేమంతా ఈ రోజు ఉండేవాళ్ళం కాదు. ఇలా నండూరి వంశ చరిత్ర రాసే అవకాశం కూడా ఉండేది కాదు.

           మా తాతగారికి చిన్నప్పుడే మేనమామ కూతురునిచ్చి వివాహం చేసారు. అంటే  చిన్న తాతగారైన సత్యనారాయణ గారికి కూడా మా బామ్మ దుర్గాoబగారు మేనమామ కూతురు. మా బామ్మ గారు ఆయన కంటే పెద్దదవటం వల్ల చనువుగా "సత్తయ్యా " అని పిలిచేదిట.

మా తాతగారి కలకత్తా ప్రయాణం ; మొదటి సంఘటన : మరి ఎక్కడో మారుమూల ఆరుగొలను అనే కుగ్రామంలో పుట్టిన మా తాతగారు కలకత్తా వెళ్ళడానికి కారణం ఏమిటి? అని నేను మా అమ్మని అడిగినప్పుడు, మా అమ్మ చెప్పిన విషయం విని విస్మయం చెందాను. మా నాన్నగారి ద్వారా మా అమ్మకి తెలిసిన విషయాలు అడపా దడపా మేము అడిగినప్పుడు చెప్తూ ఉండేది. ఒక రోజు మా తాతగారు వారి తండ్రి వరాహలక్ష్మి నరసింహం గారిని ఒక కాణి అడిగారట. ఆయన దానికి సవాలక్ష ప్రశ్నలు అడిగి చివరకి ఇవ్వ లేదు. అంటే మరి ఆ రోజుల్లోకొడుకులకి పెళ్లిళ్లయినా, ఎటువంటి ఆర్ధిక స్వాతంత్య్రం కాని వాక్ స్వాతంత్య్రం లేక తల్లిదండ్రుల చెప్పు చేతల్లో ఉండేవారు.

ఇక రెండవ సంఘటన : మా బామ్మ మా తాతగారు భోజనం చేసిన తరువాతే తాను తినేది. రోజూ మా తాతగారు నువ్వు తిన్నావా? అని అడిగేవారట. ఒక రోజు మా తాతగారికి ఎందుకో అనుమానం వచ్చి, అన్నం గిన్నె తీసి చూసేసరికి దానిలో అడుగంటిన మాడిపోయిన అన్నం చూసి ఆయన కళ్ళవెంట నీళ్లు వచ్చాయట. మేనకోడలు (స్వయానా అన్నగారి కూతురు) అయినప్పటికీ తన తల్లి పెద్ద కోడలైన తన భార్యని చాలా రకాలుగా బాధలు పెడ్తున్నదన్న విషయం మా  తాతగారికి అర్థమైంది. ప్రతీ మహానుభావుల జీవితచరిత్ర లో వారి మనస్సుని బాధ పెట్టే విషయాలు జరిగినప్పుడు అంటే ఘోరమైన అవమానాలు, అన్యాయాలు జరిగినప్పుడు వారిలోని స్వాభిమానం  తిరుగుబాటు చేసి, ప్రపంచంలోనే వారు ప్రఖ్యాతులు అవుతారు. ఉదాహరణకి ఒక అంబెడ్కర్, మహాత్మా గాంధీ, ఈశ్వర వరప్రసాద్ రెడ్డి(Shanta Biotech), జయంతి ధర్మ తేజ, ముళ్ళపూడి వెంకటరమణ, నండూరి రామ్మోహన రావు గారి లాంటి వారెందరో మహానుభావులు. వీరందరిలో కూడా నివురు కప్పిన నిప్పు మాదిరిగా ఆత్మస్థైర్యం, ఆత్మబలం, ప్రతిభాపాటవాలు దాగి ఉండి, విపరీత పరిస్థితులు వచ్చినప్పుడు ఒక తెగింపు ధోరణిలో వారు గమ్యాన్ని వెతుక్కుంటూ బయటకి వెళ్ళిపోతారు. ఈవిధంగానే తాత గారికి ఇంట్లోని ప్రతికూల పరిస్థితులు ఆయనని బయటకి వెళ్లే పరిస్థితిని కల్పించాయి. కన్న తల్లిదండ్రుల ప్రవర్తన ఆయనకీ తరువాతి జీవితం లో ఆశీర్వాదాలు, అనుగ్రహాలుగా మారాయి. అందుకు మేము మా ముత్తాత, ముత్తవ్వలు వరాహ లక్ష్మి నరసింహం, సీతారామమ్మగార్లకి ఎంతో ఋణపడి ఉంటాం. అప్పటికే తాత గారికి సాహిత్యాభిలాష చాలా ఉండేది. కఠినమైన ఛందస్సుతో ఎన్నో పద్యాలు రాసేవారు. అప్పటికే తాత గారు తండ్రిని బ్రతిమిలాడి, ప్రాధేయపడి బందరులో మిత్రుల సహాయ సహకారాలతో F.A  చదివారు. ఆ రోజుల్లో తెలివైన విద్యార్థులే కింది తరగతుల వారికి, తోటి విద్యార్ధులకి ట్యూషన్స్ చెప్పి కొంత సంపాదించి తమ చదువులకు ఖర్చు పెట్టుకునేవారు. ఇది ఆ కాలం లో సర్వసాధారణమైన విషయమే. ఈ విధంగా తాతగారు వారి తండ్రికి ఆర్ధిక భారాన్ని తగ్గించారు. 

    సాహిత్యాభిలాష, రచనా సామర్థ్యం  వారి పిల్లలకే కాక వారి తమ్ముడి పిల్లలకు కూడా వారసత్వంగా  వచ్చాయి. తాత గారి కొడుకుకే కాక వారి మనమలు, మునిమనమలు కూడా సాహిత్యాభిలాష, పఠనాభిలాష, రచనాకౌశలం వారి వద్దనుంచే పుణికి పుచ్చుకున్నారని చెప్పడం గర్వం గా ఉంది. తాత గారు, ఇంకొక ప్రాణమిత్రుడు శ్రీ ఘంటసాల సీతారామ శర్మగారు తోడుగా కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కలకత్తాలో వైద్యవిద్య చదవాలని వెళ్లిపోయారు. తండ్రి లక్ష్మి నరసింహం గారు పిసినారి కావడం వల్ల  ఆయన వద్ద నుండి ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండానే విద్యార్థులకి ట్యూషన్స్ చెప్తే వచ్చిన డబ్బుతో ముందే ఒక ప్రణాళిక వేసుకుని, బయటి ప్రపంచంలో తన భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్లిపోయారు

     కలకత్తా అంటే సుదూరమైన, అపరిచితమైన ప్రాంతానికి వెళ్లారు తాత గారు. ఆ రోజుల్లో బెంగాలీ రచయితల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఎంతో మంది మేధావులు తమ రచనలతో , కవిత్వాలతో, దేశంలోని యువకులనెందరినో, ముఖ్యంగా సాహిత్యాభిలాష ఉన్న వారిలో ఒక ప్రేరణని, దేశభక్తిని పెంపొందిస్తూ, సమాజం లోని దురాచారాలని ఖండిస్తూ ఎన్నో అద్భుతమైన రచనలు చేయటం, వాటిని అన్ని భాషలలో అనువదించటం, ఈ కారణాల వల్ల కలకత్తా (అప్పటి బ్రిటిష్ రాజధాని) సహజంగానే మాతాత గారిని ఆహ్వానించింది.

     ఈ విధంగా కలకత్తా చేరిన తాత గారు, వారి మిత్రుడు ఘంటసాల సీతారామశర్మ గారు చాలా కష్టపడి ఏం తిన్నారో, ఏం తినలేదో, ఎక్కడున్నారో తెలియదు. చాలా కష్టపడి బెంగాలీ భాషను నేర్చుకుని, ట్యూషన్స్ చెప్పుకుంటూ L.C.P.S (Licentiate of the College of Physicians and Surgeons) is a medical Degree of historical importance during the British rule in India. Some Universities conferred this qualification) వైద్యవిద్య, అక్కడ చాలా (హై స్టాండర్డ్) ఉన్నత ప్రమాణాల్లో విద్య బోధించబడింది. వీరికి సర్జరీలు కూడా చేసే ప్రావీణ్యం, అర్హత ఉంటుంది. ఈ కారణాల వల్ల మాతాతగారు కలకత్తాకు ఈ వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్ళటం జరిగింది. నాయకత్వపు లక్షణాలున్న తాతగారు అనతి కాలం లోనే సాహితీపరులైన బెంగాలీ రచయితలను, కళాకారులను ప్రభావితం చేయగలిగారు. అప్పట్లో ఎం బి బి ఎస్ అన్న విద్య ఇంకా రాలేదు. కలకత్తా చేరిన కొద్దీ కాలానికి ఆరుగొలనులో ఉన్న తన తండ్రికి తన క్షేమ సమాచారాలు, తన విద్యా వివరాలను తెలుపుతూ కొంత డబ్బుని పంపమని రాసారు. దానికి సమాధానంగా ప్రోనోటు మీద అప్పుగా కొంత డబ్బు పంపారు. తాతగారు ఆరుగొలనుకి రాగానే తండ్రి వద్ద తీసుకున్న అప్పుని పూర్తిగా తీర్చి వేశారు. అంటే తాత గారు తండ్రి ఆర్ధిక సహాయం లేకుండా, ట్యూషన్స్ చెప్పుకుంటూ, అనేక రకాలుగా కష్ష్టపడి, నెలకు పదిహేను రూపాయలు సంపాదించుకుంటూ, ఇద్దరు మిత్రులు ఒకరికొకరు తోడుగా సహాయ సహకారాలతో, కష్టసుఖాలను పంచుకుంటూ, వైద్యవిద్యను పూర్తి చేసారు. క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యారు. మా తాతగారు, సామ్రాట్ చంద్రగుప్త వంటి ఎన్నోబెంగాలీ నాటకాలను  తెలుగులో అనువాదం చేసారు. ఎన్నో ఛందోబద్ధమైన పద్యాలనూ కూడా ఆయన రాసారు. ఇవన్నీ నా చిన్నతనం లో జనగామలో చూసాను. కాకపోతే ఈ పద్యాలూ రాసిన పుస్తకం అప్పటికే శిథిలావస్థలో ఉండింది. అవి ఏమయ్యాయో తెలియదు. వాటిని కాపాడుకోలేక పోయామని బాధ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది.  మా తాతగారు కొన్ని తెలుగు సినిమాలకు మాటలు కూడా రాసారని, "పల్లెటూరి పిల్ల" అనే తెలుగు సినిమాని ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ నవల ఆధారంగా రాసారని, బహుశా బి.A . సుబ్బారావు అనే ఆయన దాన్ని మా తాతగారి పేరు  బదులు తన పేరు రాసుకోవడం జరిగింది అని మా అమ్మగారు నాకు చెప్పటం గుర్తుంది. మా తాతగారు చాలా భోళా మనిషి. అందరిని చాలా తొందరగా నమ్మేవారు. చాలామంది ఆయనకి మిత్రులుగా నటిస్తూ, ఆయనలోని కళాభిమానాన్ని, సాహిత్యాభిలాషని గమనించి, రకరకాల వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న నాటక సమాజాలని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఈ విధంగా చాలా ధనాన్ని వారు కాజేయడం జరిగింది. ఆ రోజుల్లో నాటక సమాజాలు విరివిగ, తెలుగునాడు లో లెక్కకు మించి ఉండేవి. చాలా మంది బ్రాహ్మణులు ఈ సమాజాలు స్థాపించి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అభాసుపాలై అపనిందలు పడినవారు కూడా ఉన్నారు. సమాజంలో అన్ని రకాలవారు ఉంటారు కదా! మా ఇంకొక తాతగారు నండూరి రామచంద్రరావుగారి రెండవ కుమారుడైన నండూరి  సుబ్బారావు బాబాయి గారు కూడా ఇటువంటి నాటక సమాజంలో నటిస్తూ ఉండేవారు. తానే స్వయంగా ఒక నాటకాన్ని రచించి, ఆయన పెద్ద కుమారుడు ప్రభాకర్ అన్నయ్య చేత నటింపజేసి, బందరులో ప్రదర్శించి, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నారు. వారిఛ్చిన కప్పుని ఆరుగొలను స్కూల్ లో ఇచ్చినట్లుగా ఆయన చెప్పారు. అంత  చిన్న కుగ్రామంలో పుట్టి, తగినంత ఆర్ధిక స్థోమత లేక పోయినప్పటికీ, ఆయన తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చేసుకుంటూ, నాటకాలు వేసుకుంటూ, ప్రైవేట్ పాఠాలు చెప్పుకుంటూ, అక్కడే co -operative సొసైటీ లో ఉద్యోగం చేస్తూ, ఎన్నో అద్భుతాలు చేస్తూ, అవకాశాలని ఆయనే సృష్టించుకున్నారు. తరువాత ఆకాశవాణి లో (అల్ ఇండియా రేడియో) విజయవాడ లో తన ప్రతిభతో ఉద్యోగాన్ని సంపాదించుకుని, ముఖ్యంగా హాస్యరసం లో మకుటం లేని మహారాజుగా ప్రపంచ ఖ్యాతిని పొందారు. దీని వల్ల, All India రేడియో లో నండూరి సుబ్బారావుగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, సమాజానికి ముఖ్యంగా యువతకి స్ఫూర్తినిచ్చే విధంగా, తన జీవితంలో చిన్న కుగ్రామం నుంచి వచ్చినా, ఆయన ఏ విధంగా సవాళ్లని చక్కటి అవకాశాలుగా ఎలా మలచుకోవాలో తెలిపారు. ఈ విధంగా ఆరుగొలను నుండి చాలా మంది మా నండూరి వారు దేశవిదేశాలలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఇక్కడ మా నండూరి సుబ్బారావు బాబాయిగారి విషయం లో తండ్రినుంచి చక్కని సహకారం లభించింది. అప్పటికే సుబ్బారావు బాబాయి గారు తల్లిని కోల్పోయారు. రామచంద్ర రావు తాతగారు ఆరుగొలను దగ్గర ఉన్న ఒక కుగ్రామానికి కరణీకం చేస్తుండేవారు. వారి పెద్ద కుమారుడు నండూరి శ్రీరాంమూర్తి, సుబ్బారావు గారి అన్నయ్య B.Com చదివి, స్టేట్ బ్యాంకు లో ఉద్యోగం సంపాదించుకున్నారు. అంతే కాక ఆయన తన చిన్న తమ్ముడైన కృష్ణమూర్తి గారిని స్కూల్ ఫైనల్ వరకు చదివించి స్టేట్ బ్యాంకు లో ఉద్యోగం ఇప్పించారు. సుబ్బారావు బాబాయిగారు ఒక్కరే తండ్రికి తోడుగా వ్యవసాయ పనులలో సహాయంగా ఉంటూ ఉండేవారు. పైన చెప్పిన విధంగా అనేక పనుల చేస్తూ ఉండేవారు. బంధువులు ఒకరు రామచంద్ర రావుగారిని సుబ్బారావు గారి విషయంలో మందలించారు. ఎంతో సహృదయంతో ఆయన నండూరి సుబ్బారావు బాబాయి గారికి స్వేచ్ఛనిచ్చారు. ముందుగా మా సుబ్బారావు బాబాయ్ గారు తనకి ఆల్ ఇండియా రేడియోలో అవకాశం ఇప్పించమని మా నర్సు బాబాయ్ గారు అంటే చిన్న తాతగారైన సత్యనారాయణ గారి పెద్ద కొడుకు నరసింహా రావు గారిని అడిగారు. కాని నిజానికి బందా కనక లింగేశ్వర్ రావు గారి ప్రోత్సాహంతో ఆయన ఆలిండియా రేడియోలో చేరటం జరిగింది. మరి దీనికి భిన్నంగా మరి చాలా మంది తమ చుట్టూ ఉన్న చీకటిని తోటి మనుషులని, పరిస్థితులని, నిందిస్తూ ఉంటారు. ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగిస్తే చుట్టూ ఉన్న అంధకారం పటాపంచలవుతుంది. ఇటువంటి కొవ్వొత్తులెన్నో నండూరి సుబ్బారావు గారు, నండూరి రామ్మోహన రావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, మా తాత గారు వెలిగించి సమాజం లో ఉన్న అంధకారాన్ని కూడా పటాపంచలు చేసి, వెలుగుతో నింపారు. ఒక ఆశావాది తనలోని దోషాలను సవరించుకుంటూ ప్రతికూల పరిస్థితులని కూడా తనకు అనుకూలంగా మలచుకుంటాడు.

ఇక మన కథకు వస్తే మా తాత గారు డాక్టర్ పట్టా పుచ్చుకుని ఆరుగొలను వచ్చాక, తల్లిదండ్రుల నుంచి  ఎటువంటి స్వాగత సత్కారాలు లేనే లేవు. అందుకు భిన్నంగా ఆయనని ఇంటిలోనికి రానీయకుండా, పశువుల కొట్టంలోనే ఉంచారు. స్నానం వగైరాలు బయటే , భోజనం, పడక గొడ్లపాక లోనే. అంటే బయటి ప్రాంతానికి వెళ్లి వచ్చినందు వల్ల ప్రాయశ్చిత్తం అనే పేరుతొ ఒక విధంగా వెలి వేశారు. కానీ ఆయన దీనిని మౌనంగానే భరించారు. తాతగారి స్నేహితుడైన సీతారామ శర్మగారికి కూడా వారి ఇంటిలోఇదే విధమైన చేదు అనుభవం కలిగింది. మనం ప్రకృతికి ఏమిస్తామో, అది మనకు పది రెట్లు వెనక్కి తిరిగి ఇస్తుంది. మంచైనా చెడైనా అదే సిద్ధాంతం. దానికి ఉదాహరణగా ఈ సంఘటన  జరిగింది. మా తాతగారు పోయేనాటికి మా స్వరాజ్య లక్ష్మి, శాంత అత్తయ్యల వివాహాలు  కాలేదు. మా ముత్తాత అయిన వరాహ లక్ష్మి నరసింహం గారు ఆయనే స్వయంగా ఒక ముసలి వాడితో మా స్వరాజ్యమత్తయ్య వివాహం నిశ్చయించారు. ఆ పెళ్లి కొడుకుని మా అత్తయ్య కానీ, మా నాన్నగారు, మా బామ్మ ఎవరూ చూడలేదు. తీరా పెళ్ళివారు విడిదిలో దిగినప్పుడు మిగతా పెద్దవాళ్లందరితో వాళ్ళని ఎదుర్కొనడానికి వెళ్ళినప్పుడు, ఆ వణికిపోతున్న ముసలి పెళ్లి కొడుకుని చూసి ఏం చేయాలో మా నాన్నగారు ఇంటికి వచ్చి నిరుత్సాహంగా ఆ పెళ్ళికొడుకు ముసలివాడని మా బామ్మకి చెప్పారు. ఇలా స్వయానా సొంత  

                 

                    పెళ్ళి అప్పుడు మా స్వరాజ్యం అత్తయ్య

తాతగారే మనమరాలు గొంతు ఇంత నిర్దాక్షిణ్యంగా కోస్తారని మా బామ్మ, అత్తయ్య , మా నాన్నగారు కానీ ఎవ్వరూ ఊహించలేదు. అప్పటికే మా అత్తయ్య పెళ్లికూతురిగా తయారయి ఉండాలి. ఆవిడ అందరిలో చాలా ధైర్యవంతురాలు. ఆవిడకి చాలా కోపం వచ్చింది. ఆవిడ ధైర్యస్తురాలు. వెంటనే ఆవిడ వరాహా లక్ష్మి నరసింహం తాతతో ," నేను ఈ ముసలివాడ్ని ఛస్తే పెళ్లి చేసుకోను,” అని కోపావేశంతో గట్టిగా అరిచింది. అక్కడ ఉన్నవాళ్ళంతా హడలిపోయారు”.  అప్పుడు మా బామ్మ కూడా కాస్త ధైర్యం తెచ్చుకుని కూతురుని సమర్థిస్తూ “అవును మామయ్యా! నేను బావిలో దూకి నా ప్రాణమైనా తీసుకుంటాను కానీ నా కూతుర్ని ముసలివాడికిచ్చి పెళ్లి చేయను" అని గట్టిగా ప్రతిఘటించడంతో ఆ సంబంధం తప్పి పోయింది. మా నాన్నగారు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని మా స్వరాజ్యమత్తయ్య రాణి వదినకి, నాకు చెప్పింది. ఈ విషయాన్ని నాకు చాలా చమత్కారంగా చెప్పింది. మా బామ్మ గారి ధైర్యాన్నిమెచ్చుకోవాలి. కూతురి మీద ఉన్న ప్రేమాభిమానాలని సమాజానికి భయపడి వదులుకోలేదు. ఆ రోజుల్లో సమాజాన్ని ఎదురించడం అంటే మాటలు కాదు. మా తాతగారు లేకపోయినా ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ఇద్దరు కూతుర్లకి, కొడుకుకి  అండగా నిలిచింది. ఓపికగా మంచి సహృదయత కలిగిన పరివారాలను, ఈడుజోడు సరిగ్గా ఉన్న వారితో పెళ్లిళ్లు చేయించింది. అప్పటికే మా తాతగారు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ఎన్నో కార్యాలు తలపెట్టారు.  విదేశీ మా బామ్మ గారి ధైర్యాన్ని, కూతురి మీద ఉన్న ప్రేమాభిమానాలని సమాజానికి భయపడి వదులుకోలేదు. ఆ రోజుల్లో సమాజాన్ని ఎదురించడం అంటే మాటలు కాదు. మా తాతగారు లేకపోయినా ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ఇద్దరు కూతుర్లకి, కొడుకుకి  అండగా నిలిచింది. ఓపికగా మంచి సహృదయత కలిగిన పరివారాలను, ఈడుజోడు సరిగ్గా ఉన్న వారితో పెళ్లిళ్లు చేయించింది. 

                           

 స్వరాజ్యమత్తయ్య పెళ్లి విద్యాభూషణ్ రావు మామయ్య గారితో బామ్మ తమ్ముడు గూడూరు సుబ్బారావు తాతగారు కుదుర్చిన సంబంధం

అప్పటికే మా తాతగారు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ఎన్నో కార్యాలు తలపెట్టారు. మా బామ్మ గారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కూతురి మీద ఉన్న ప్రేమాభిమానాలని సమాజానికి భయపడి వదులుకోలేదు. ఆ రోజుల్లో సమాజాన్ని ఎదురించడం అంటే మాటలు కాదు. మా తాతగారు లేకపోయినా ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ఇద్దరు కూతుర్లకి, కొడుకుకి  అండగా నిలిచింది. ఓపికగా మంచి సహృదయత కలిగిన పరివారాలను, ఈడుజోడు సరిగ్గా ఉన్న వారితో పెళ్లిళ్లు చేయించింది. అప్పటికే మా తాతగారు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ఎన్నో కార్యాలు తలపెట్టారు.  విదేశీవస్తు బహిష్కరణలో పాల్గొని ఇంట్లో ఉన్న విదేశీ వస్తువులన్నీ మంటలకి ఆహుతి చేసారు. మా నాన్నగారు మా బందరు అత్తయ్య దగ్గర ఉన్న మంచి మంచి బట్టలు మంటల్లో పడవేశారు. తాతగారు ఇలా తన ఆస్తిని కాంగ్రెస్ పార్టీకోసం స్వాతంత్య్ర ఉద్యమం కోసం కూడా ఖర్చు పెట్టారు. అలాగే ఆయన స్నేహితుడు సీతారామశర్మ గారు కూడా సంపాదించిందంతా దేశం కోసం ఖర్చు చేసారు. ఈ విధంగా మా తాతగారి మూలంగా కూడా బామ్మ లో ఆధునిక భావాలు అంకురించి ఆ ముసలి సంబంధాన్ని తిరస్కరించడంతో కనిపించాయి. మా బామ్మ ఒక ఆదర్శాన్ని మాకు చూపించింది. బామ్మకి మనమళ్ళందరి అభినందనలు. ఈ విషయంలో నాకు రేడియో నాటకం "వరవిక్రయం" గుర్తుకు వచ్చింది. అప్పటి సమాజంలో ఇటువంటి బ్రాహ్మణుల వల్ల జరిగిన అన్యాయాలను గురించి బ్రాహ్మణులలోనే, కొంతమంది మహానుభావులు తిరుగుబాటు చేసారు. ఇటువంటి అన్యాయాలను, అక్రమాలను, ఎండగట్టారు. అందులో ఒక బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే చాలా మంది అత్తగార్లు కోడళ్ళని, బాలవితంతువుల్ని నానా రకాలుగా కష్టాలు పెట్టేవారు. దానికి ఉదాహరణే మా బామ్మ దుర్గంబగారు. మరి మా తాతగారు కలకత్తాలో ఉన్నన్నాళ్ళు ఇక్కడ తిరస్కారాలు, అవమానాలు మాత్రమే బహుమానం గా అందాయి మా బామ్మకి. ఆ రోజుల్లోనే స్వాభిమానం, ఆర్ధిక స్తోమత  ఉన్న కోడళ్ళు  అత్తగారి సాధింపుల ధోరణికి నిరసనగా  శాశ్వతంగానే అత్తగారింటికి రావడం మానేసేవారు. దీనికి  భర్తల సహకారం కూడా ఉండేది. అప్పటి బ్రాహ్మణ సమాజంలో ఉన్న ఇటువంటి దుర్మార్గాలు ఒక విధంగా చెప్పాలంటే బాధాకరమైన ప్రవర్తనలు గురించి, నేను నా చిన్నతనంలోనే అనేక గ్రంథాలు చదివాను. గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నో రచనలు చేసారు. దగా పడిన బ్రాహ్మణ స్త్రీలకూ అండగా నిలిచారు. వితంతు వివాహాలని ప్రోత్సాహించారు. శారదా చట్టాన్ని తీసుకు రాగలిగారు. వారికి బ్రాహ్మణ సమాజం ఎదురుదాడులు చేయటం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, బ్రాహ్మణ సమాజం నుండి వెలివేయటం వంటివి ఎన్నో జరిగాయి. అందువల్లే కాబోలు ఈ రోజుల్లో బ్రాహ్మణులకి సరిఅయిన గౌరవం సమాజంలో లేనేలేదు. నిజంగా మా తాతగారు నండూరి శివరావుగారు, మా బామ్మ దుర్గాoబ గారిని ఎంతో గౌరవంతో మేము గుర్తు చేసుకుంటున్నాం. వారు హంస లాగా తక్కువ కాలం జీవించినా మహోన్నతంగా గడిపారు. ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన విషయం ఏమిటంటే మా తాతగారి వంశంలోని మేమందరం కూడా జీవితంలో ఎంతో వృద్ధిలోకి వచ్చాము. అలాగే మా చిన్న తాతగారైన సత్యనారాయణ గారి కుటుంబంలోని వారందరూ కూడా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి, చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే మిగతా నండూరి వంశం వారందరూ కూడా స్వయంకృషి తో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. నండూరి సూర్యనారాయణ గారి కుమార్తె వరలక్ష్మిగారు (బామ్మ అంటాము) ప్రపంచ ఖ్యాతి పొందిన ఇరిగేషన్ రంగం లోని డా. కే.ఎల్. రావు గారిని వివాహం చేసుకున్నారు. ఆయనే మన నాగార్జున సాగర్ డాం రూపకల్పన చేసారు. కేంద్రమంత్రి వర్గంలో మంత్రి పదవిని కూడా నిర్వహించారు. నేను 1967 వ సంవత్సరంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా శాంతత్తయ్య తో వారింటికి వెళ్లడం జరిగింది. ఆవిడ ఎంతో ఆప్యాయంగా "మా రాముడి కొడుకువా? “శివరావు అన్నయ్య మనమడివా?” అంటూ ఆనంద పడిపోయారు. దీనిని బట్టి మా తాతాగారన్నా, మా నాన్నగారన్నా వీరికి ప్రేమ,గౌరవాభిమానాలు ఉన్నాయని తెలిసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. 

                                          అధ్యాయం 2

తాతగారు నండూరి శివరావుగారి స్వతంత్ర జీవనం 

ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రతివారికి వారి జీవితంలో, బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనల మూలంగా ఏదో ఒక విద్యలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని సంకల్పం చేసుకుంటారు. మా తాతగారు జన్మించిన అప్పటి కాల పరిస్థితులలో సరిఅయిన వైద్య సదుపాయాలు లేకుండా గ్రామంలో ఉండే ప్రజలు చాలా ఇక్కట్ల పాలవుతుండేవారు. అందుకని తాను కష్టపడి, వైద్య విద్యాభ్యాసం చేసి, ఇటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకి తనవంతుగ వైద్యాన్ని అందించాలన్న సంకల్పం మా తాతగారికి కలిగిoది. సరిగ్గా మా చిన్న అన్నయ్య శివ ప్రశాంత్ కి కూడా ఇదే సంకల్పం కలిగి, హోమియో వైద్య విద్యను అభ్యసించారు. తాను చిన్నప్పుడు రుమాటిజం తో బాధపడుతుండగా హోమియో మందు అద్భుతంగా పని చేసింది. ఆ ప్రేరణతో గుడివాడలో APH మెడికల్ కాలేజీ లో చేరి, డొమినియన్ ఫస్ట్ గా పాసు అయ్యాడు. 3 goldmedals ని సాధించాడు. ఇంటర్నేషనల్ లెవెల్ లో తాను సమర్పించిన పరిశోధనకు సంబంధించిన పేపర్లు ఎంతో ప్రశంసలు అందుకున్నాయి. (మెదడువాపు వ్యాధికి (Encephalitis) కి బెల్లడోనా (Belladona) చాలా బాగా పని చేస్తుందని తమ పరిశోధన పత్రాన్ని, ఇంటర్నేషనల్ హోమియో అసోసియేషన్, జర్మనీ వాళ్ళు అంగీకరించారు. అయితే దీనిలో డా.జి.ఎల్.ఎన్ శాస్త్రి గారు, మా ప్రశాంత్ అన్నయ్య, ఇంకొక స్టూడెంట్ కలిసి పరిశోధన చేశారు. అది వేలాది మంది ప్రాణాలను కాపాడింది),

మా తాతగారి గుడివాడ కాపురం

మా తాతగారు తన వైద్య విద్యనభ్యసించి, ఆరుగొలను వచ్చాక, మా నండూరి బంధువర్గమంతా,అంటే తాతయ్యలు, అన్నదమ్ముల పిల్లలు, వగైరా అంతా కూడా చాలా సంతోషించారు. మా తాతగారు పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎక్కడో కుగ్రామం ఆరుగొలను నుండి కలకత్తా వెళ్లిన నండూరి వంశాంకురం అప్పట్లో అత్త్యుత్తమమైన వైద్య పట్టా L C P S చదివి వచ్చినందుకు ఆరుగొలనులో పండుగ వాతావరణం తెచ్చింది. మా తాతగారి శాంతస్వభావం, పెద్దల పట్ల వారు చూపే వినయవిధేయతలు, అందరినీ ఆకర్షించాయి. తమ్ముడి ఆనందానికి  అవధులు లేవు. నండూరి వారందరూ మాకు ఇంక భయం లేదు, మా శివరావు ఉండగా మాఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు అని గర్వంగా చెప్పుకున్నారు. మరి ఆ రోజుల్లో ఇదొక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. భర్తకి చాలా ఏళ్ళు దూరంగా ఉన్న మా బామ్మ కూడా చాలా సంతోషించారు. మా తాతగారు గుడివాడలో కాపురం పెట్టారు. గుడివాడ చుట్టుపక్కల అనేక గ్రామాలనుండి వందలాది రోగులు వస్తుండేవారు. మా తాతగారు హోమ్ విజిట్స్ కి ఒక సారి గుర్రబ్బండిలో, ఇంకొక సారి కారులో, మరొక సారి నడుచుకుంటూ వెళ్లేవారు. కొద్దికాలం లోనే మా తాతగారి పేరు మారుమ్రోగింది. ఆయనకి వస్తున్న డబ్బునోట్లని లెక్కపెట్టలేనంత బిజీ గా ఉండేవారు. అసిస్టెంట్లుగా ఉన్న కాంపౌండర్లు తమ చేతివాటం ప్రదర్శించే వారు. మా తాతగారిది సాధు స్వభావం కావటంతో అందరినీ నమ్మేవారు. వైద్యులకు ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదు కదా! పగలనకా, రాత్రనకా రోగులు వస్తుండేవారు. మా తాతగారు ఎన్నో స్థిరాస్తులని కూడబెట్టారు. రైస్ మిల్స్, ఆయిల్ మిల్స్ , ముప్పైకి పైగా మలిగీలు అంటే దుకాణాలు, డెబ్బై ఎకరాలకు పైగా మాగాణీ, యాభై ఎకరాలకు పైగా మెట్ట భూములు కొన్నారు. అంతే కాక తమ్ముడు కుటుంబాన్ని కూడా తన కుటుంబoగానే భావించేవారు. అన్నదమ్ములిద్దరూ ఎంతో ప్ర్రేమగా ఉండేవారు. తనవంతు కర్తవ్యంగా అవసరాలకు డబ్బుని తండ్రికి ఇస్తుండేవారు. మా ముత్తాత వరాహ లక్ష్మి నరసింహం గారికి. ప్రత్యేకంగా రెండవ కొడుకు గురించి బెంగగా ఉండేది. పెద్ద కొడుకు లెక్కలేనంత డబ్బు సంపాదిస్తున్నాడు, ఎన్నో ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడు. చిన్న కుటుంబం, ఒక్కడే కొడుకు, చిన్న కొడుక్కేమో బోలెడు మంది పిల్లలు. అందుకని ఆయన, మా తాతగారిని చాలా సార్లు కొడుకు సంపాదించిన స్థిరాస్తులన్నీ కూడా తన పేరు మీద బదలాయింపు (ఉమ్మడి ఆస్తిగా) చేయమని అడుగుతుండేవారు. అంతే కాక, నీ తమ్ముడు పెద్దగా చదువుకోలేదు, సంపాదన లేదు, పైగా కుటుంబం పెద్దది. అందుకని వంశ పారంపర్యంగా నా తర్వాత నీకు వచ్చే కరణీకాన్ని కూడా తమ్ముడు పేరు మీద రాసివ్వమని కూడా అడుగుతుండేవారు. ఆ రోజుల్లో కరణాలకి జీతం  అంతంత మాత్రమే ఉండేది. కానీ హోదా, ఊళ్ళో గౌరవము, పలుకుబడి హెచ్చు. కరణం గారు వస్తున్నారంటే అందరూ లేచి నిలబడాల్సిందే.

మా తాతగారు తండ్రి ప్రతిపాదనకు అంగీకరించి, సంతోషంగానే తాను సంపాదించిన ఆస్తిని తండ్రి పేరున బదలాయింపు చేశారు. అలాగే తనకి వారసత్వంగా సంక్రమించే కరణీకాన్ని కూడా, తమ్ముడికి రాసి ఇచ్చారు. ఈ ఆస్తి వివరాలన్నీ మా ముత్తాత లక్ష్మి  నరసింహం గారు,  తాతగారు,  చిన్నతాత సత్యనారాయణ గారు, మా బామ్మలు, మేనత్తలు, అతిముఖ్యంగా మా నాన్నగారి మేనమామ గూడూరు సుబ్బారావు గారికి మధ్యనే ఉన్నాయి అన్నమాట. అంతే  కాకుండా మా నండూరి పెద్దవాళ్లందరికి కూడా ఆస్తి తాతగారు డాక్టర్ అయి ప్రాక్టీస్ పెట్టి రెండు చేతులా సంపాదించిన తర్వాత ఉమ్మడి ఆస్తి ఎలా పెరిగిందో , అంతకు ముందు ముత్తాత ఆస్తి ఎంత ఉందో మా బంధువర్గంలో పెద్దవాళ్ళందరికి తెలుసును. గమనిస్తూనే ఉన్నారు. అందుకే వారందరికీ కూడా మా తాతగారంటే ప్రత్యేకమైన అభిమానం. కాలక్రమేణా ఈ వివరాలన్నీ కూడా మా నాన్నగారికి తెలియచేయడం జరిగింది.  

            తాత గారు గూడూరు మైకా గనుల్లో స్నేహితులని నమ్మి భారీగానే పెట్టుబడులు పెట్టారు. ఆయన వారినందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్మారు, అది వారి మంచితనమూ, భోళాతనం . ఎటువంటి రాతకోతలు, పత్రాలు లేవు. దీనిలో బహుశా ఇద్దరు ముగ్గురు భాగస్వాములు ఉండి ఉంటారు. స్వరాజ్యం అత్తయ్య ఆ మైకా గనుల మట్టి నిండిన గాజు సీసాని తన జ్ఞాపకంగా పెట్టుకుంది. తాత గారు పరమపదించాక,  మా నాన్నగారు నండూరి శ్రీ రామారావుగారు తమ వాటాని గురించి అడిగినప్పుడు ఆ భాగస్తులు  కేవలం 1500/-  మాత్రమే ఇచ్చారట. మా నాన్న గారు ఆ డబ్బుని వారి ముఖం  మీద కొట్టి వెళ్లిపోయారు.

          తాత గారు విజయవాడకు దగ్గరలో ఉన్న గన్నవరంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అక్కడ కూడా ఆయన ప్రాక్టీస్ కొన్నాళ్ళ వరకు సజావుగానే సాగింది.  మా నాన్నగారు బందరులో హిందూ కాలేజీ లో F.A /ఇంటర్ చదివారు. చాలా స్టైలిష్ గా దర్జాగా ఉండేవారు. లాన్ టెన్నిస్, హాకీ చాలా బాగా ఆడేవారు. తాలింఖానాలో బహుశా గుడివాడలో కాబోలు వ్యాయామం చేస్తుండేవారు. తాలింఖానాలో దిగిన ఒక ఫోటోని జనగాం లో ఉన్న ఆల్బం లో చూసాను.  తాటి చెట్టంత ఎత్తునుంచి, గాలిలో మూడు పల్టీలు కొట్టి, కాలువలోకి దూకి ఈత కొట్టేవారట. అదేవిధంగా మేము కూడా జనగాం లోని మర్రి బావి, పెద్ద వ్యవసాయ భూమిలోని బావి. అక్కడ అమర్చిన మోటారుగది మీద  ఎక్కి, అక్కడ్నుంచి, మా అన్నయ్యలు, నేను బావిలోకి దూకి, బావిలో ఈతలు కొట్టేవాళ్ళం. ఆ సందర్భం లో మా నాన్నగారు తెలియచెప్పారు. అలాగే మా రెంటాల రాఘవరావు మామయ్యగారు కూడా మంచి ఈతగాడని చెప్పారు. ఒకవైపు తాతగారి ప్రాక్టీసు చక్కగా నడుస్తుంది. ఇంకోవైపు గూడూరు మైకా గనుల్లో భాగస్తులు విపరీతం గా డబ్బులు గుంజుతూ ఉండేవారు. ఈలోగా మా తాతగారికి ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటంటే తాను గూడూరులో వైద్యవృత్తి ని కొనసాగిస్తూ, అక్కడికి దగ్గరలో ఉన్న మద్రాసు లోని మెడికల్ కాలేజీ లో కొడుకుని చేర్పిస్తే, మైకాగనుల వ్యవహారాలు, తన వైద్యవృత్తి చూసుకుంటూ, అడపా దడపా మద్రాసుకి వెళ్లి కొడుకుని చూసి రావచ్చని భావించారు. అప్పటికే తాతగారు మైకా గనులలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని గ్రహించారు. మైకా అంటే అభ్రకం అన్నమాట.

డా.నండూరి తాత గారి స్వయంకృషి - దానశీలత : 

మా తాతగారు (తాతగారు) బాహ్య ప్రపంచంలో అనేకమంది జీవితాలను స్పృశించారు. ముఖ్యంగా చాలా మంది బీదవారు డబ్బుల్లేక, వైద్య సదుపాయాలు అందక, అనాథలుగా చనిపోతూ ఉండేవారు. అందువలన కొన్ని వేలమంది బీదవారికి ఉచితంగానే వైద్య సహాయం చేసి ఎంతో కొంత డబ్బు కూడా వారి అవసరాలకు తిరుగు ప్రయాణాలకు చేతిలో పెడుతుండేవారు. మా రెండో అన్నయ్య గుడివాడ APH medical  కాలేజీ లో చదువుతున్నప్పుడు ఎంతో మంది మా తాతగారి మంచితనాన్ని గురించి , ఆయన సంపాదించిన ఆస్తిపాస్తుల గురించి చెప్తుండేవారు. ముఖ్యంగా మా నాన్నగారి classmate డా.కామేశ్వర రావు గారు ఎన్నో సంగతులు   

        

లాలస, పిల్లలు నీరజ, ముందు శ్రీకాంత్, సాయి, అక్కయ్య, అమ్మ, వెనుక సాయిరాం, విజ్జి,(కొడుకు సుధీర్, గోపాల్ బావ, నాన్నగారు, బిందు, దుర్గ, రమణి, వెనుక పెద్దన్నయ్య, రామ్ అన్నయ్య

మా తాతగారికి సంబంధించిన స్థిరాస్తుల  గురించి, రైస్ మిల్లులు, వ్యవసాయ భూముల గురించి  తరచూ చెప్తుండేవారు. నేను కూడా ఒక సారి మా ప్రశాంత్ అన్నయ్యతో వారింటికి వెళ్లడం, అక్కడే భోజనం చేయడం, ఈ వివరాలన్నీ వినటం  జరిగింది. అప్పటివరకూ  ఈ విషయాలన్నీ మాకు అంత స్పష్టంగా  తెలియవు. మా చిన్న అన్నయ్య  ఈ విషయాలన్నీ మా నాన్నగారిని అడిగినప్పుడు అవన్నీ నిజమే అని నిర్ధారించారు. ఈ  విషయాన్ని మా స్వరాజ్యం అత్తయ్య, రాణి వదిన ధృవీకరించారు. మా నాన్నగారికి ఎప్పుడో గతించిన వైభవాన్ని, మిగతా సంగతులని తలచుకుంటూ, ఎప్పుడూ నిందారోపణ చేయటం ఇష్టం ఉండేది కాదు. మా తాతగారు  ఎంతో మందికి చేసిన ఉచిత వైద్య సేవల వలన మేలు పొందిన వారందరి ఆశీర్వాదాలు మాకెంతో లభించాయి.

మా తాతగారి ఆఖరి మజిలీ 

మా తాతగారు గుడివాడ నుండి విజయవాడకి వెళ్ళటం జరిగింది. అక్కడే మిత్రుల ప్రోద్బలంతో గన్నవరం లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టారు.అయితే మరి గుడివాడలో అంత మంచి ప్రాక్టీసుని వదిలి అక్కడకు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, ఆంధ్ర దేశానికి విజయవాడ నడిబొడ్డు. పెద్ద రైల్వే జంక్షను. ప్రయాణ సౌకర్యాలు చాలా ఎక్కువ మా నాన్నగారికి కూడా వైజాగ్ వెళ్ళటం చాలా సులువు. ఆయన పెరుగుతున్న తన కుటుంబ బాధ్యతతో పాటు ఆరుగొలను బాధ్యత కూడా, ఆయన సంపాదన మొదలు పెట్టినప్పట్నుంచీ కూడా ఉండేది. గూడూరు మైకా గనులలో భాగస్తులు మా తాతగారిని తెలివిగా మోసం చేసి బోలెడంత డబ్బు రాబడుతుండేవారు. వారు(భాగస్వాములు) చేసిన అప్పులకి కూడా ఈయన జమానతుగా ఉంటె భాగస్వాములు అప్పు తీర్చలేకపోతే మా తాతగారు బాధ్యులవుతారు అన్నమాట. అప్పటికే ఆయన ముందుగా చెప్పినట్లు గూడూరుకు మైకా గనుల వ్యవహారాలూ చూసుకోవచ్చన్న భావనతో, గూడూరుకు మకాం మార్చాలనుకున్నారు. అదే సమయానికి వారికి అశనిపాతంగా ఒక దుర్వార్త వచ్చింది. గూడూరు మైకా త్రవ్వకాలలో ఎటువంటి అభ్రకం బయట పడలేదని, అంతవరకూ పెట్టిన డబ్బంతా మట్టిపాలయిందని తెలిసింది. అప్పటికి మా తాతగారికి యాభై (50) ఏళ్ళు. బాగా సంపాదిస్తున్న రోజులు. సంపాదన పేరు ప్రఖ్యాతులు ఏమీ తగ్గలేదు. ఒకరోజు మే నెలలో పడక్కుర్చీలో కూర్చుని మామిడిపండు తినాలని, తీసుకురమ్మని మా స్వరాజ్యం అత్తయ్యకు చెప్పారు. ఆయనకి మామిడిపళ్లంటే చాలా ఇష్టం. మా అత్తయ్య మామిడిపండు కోసి ముక్కలు తీసుకుని వచ్చేసరికి మా తాతగారు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారని అన్నది మా చిన్న తాతగారి సభ్యులు ఒకరు అయ్యో! మా చిన్న తమ్ముడికి అన్యాయం చేసానే ! నా మూలంగా ఆస్తి అంతా పోయిందనే దిగులుతో మరణించారని రాశారు. కానీ అది పూర్తిగా అవాస్తవం. మా తాతగారు నండూరి తాత గారు చాలా ఆరోగ్యంగా, అందంగా, బలంగా, చురుకుగా ఉండేవారు. జీవిత సమరంలో పుట్టినప్పట్నుంచే ఆయన ధైర్యంగా పోరాడారు. బందరు వెళ్లి చదువుకోవడం, ఎక్కడో దూరాన ఉన్న కలకత్తాకు ఒంటరిగా ప్రయాణం చేయటం, ఇంటికి వచ్చాక ఆయనని తండ్రి వెలివేసిన తీరు, ఆయన సంపాదించిన సంపాదనలో సింహభాగం తండ్రికి ఇవ్వటం, తండ్రి చెప్పిన విధంగానే తాను సంపాదించిన ఆస్తుపాస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తిగా రాసివ్వటం, తనకి వంశ పారంపర్యంగా వచ్చే ఎంతో అధికారాన్నీ, పెద్దరికాన్ని, హోదాని కలిగించే కరణీకాన్నితండ్రి ఒత్తిడికి, మరియూ తమ్ముడి మీద ప్రేమతో తృణపాయంగా వదిలివేసిన మహానుభావుడు. ఇటువంటి మనోనిబ్బరం కలిగిన మా తాతగారు మా దురదృష్టవశాత్తు యాభై ఏళ్ళ చిన్న వయసులోనే పోవటం చాలా బాధాకరం. మా తాతగారికి వారి తండ్రి దగ్గర నుండి పితృవాత్సల్యం కానీ, తల్లి దగ్గర నుండి మాతృవాత్సల్యం కానీ ఏమాత్రమూ లభించలేదన్నది రూఢి. మా ముత్తవ్వ కూడా ఈ విషయం లో మా ముత్తాతగారి అడుగుజాడల్లో నడిచింది. స్వంత మేనకోడలైన మా బామ్మ దుర్గామ్బగారిని చాలా రకాలుగానే బాధలు పెట్టింది. పెత్తనం అంతా ఆవిడదే. ఆశావాదులు ఎప్పుడూ కూడా తిరస్కారాలు, అపనిందలూ, అవమానాలు వేటినీ వారు ఎప్పుడూ లెక్కచేయరు. తమ గమ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకే మా తాతగారు పరమ శాంతచిత్తులు, సాదు స్వభావం కలవారని ఆయనని తెలిసినవారందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ముక్కామల నాగభూషణం గారు అప్పట్లో జర్నలిస్ట్ , విజయవాడలో ప్రతిభ/ ప్రగతి  అనుకుంటా ఆయన నిర్వహిస్తుంది. ఆయన మా తాతగారి గురించి, ఆయన గుణగణాల గురించీ, ఆయన సంపాదించినా ఆస్తిపాస్తుల గురించి మా అక్కయ్యకి ఎన్నో విషయాలు చెప్పారు. మా తాతగారి ప్రాణాలు సహస్రారం అంటే శిరస్సు ఊర్ధ్వముఖంగా పోయినాయి. రక్తపు చారలు ఆధారంగా ఈ విషయం తెలిసింది. ఈ విషయం కూడా నాగభూషణం గారి మూలంగా మాకు తెలిసింది. ఎంతో పుణ్యాత్ములకు కానీ ఇటువంటి మరణం లభించదు.

                                       అధ్యాయం 3

 చీఫ్ జస్టిస్ వల్లూరి సూర్యనారాయణ రావు గారి తో పరిచయం - ఆసక్తికరమైన విశేషాలు

మా మాతామహులు వల్లూరి సూర్యనారాయణరావు గారు హైదరాబాద్ లో వకీలుగా ప్రాక్టీస్ చేస్తుండేవారు. ఆయన అఖండ మేధావి. మహా ధైర్యస్థులు. దబ్బపండు ఛాయలో ఉండేవారు. ఆయన సికింద్రాబాద్ లోని 

పారడైస్ ఎదురుగా ఉన్న వెస్లీ బాయ్స్ హై స్కూల్ లో మొదటి బ్యాచ్ లో డిస్టింక్షన్  లో పాస్ అయి గోల్డ్ మెడల్ సంపాదించారు. ఎన్నో క్లిష్టమైన క్రిమినల్ కేసులు సమర్థవంతంగా పరిష్కరించిన ఘనత వారిది. ఆయన చేతికింద ఎంతోమంది జూనియర్ లాయర్లు , టైపిస్టులు, మున్షీలు పని చేస్తూ ఉండేవారు.ఆయన అప్పటి రోజుల్లో పదివేల వెండి రూకలు సంపాదిస్తూ ఉండేవారు. క్షణం తీరిక లేకుండా ఉండేవారు. పేరు ప్రఖ్యాతులున్న ఎంతో మంది స్వామీజీలు, సాహితీపరులు, రాజకీయవేత్తలు వస్తూ పోతూ ఉండేవారు. అందులో పప్పా రాందాసుగారు, పాండురంగడి భక్తుడు విఠల్ బాబా గారు  తరచుగా వస్తుండేవారు. మాడపాటి హనుమంత రావు, మందుముల నరసింగ రావు , బూరుగుల రామకృష్ణ  రావు గారు వంటి వారందరు కూడా, తఱచుగా అనేక మంది


                                                    

మా తాతగారు వల్లూరి సూర్యనారాయణ రావు గారు

తాతగారి సలహాలు తీసుకుంటూ ఉండేవారు. ఈ కుటుంబాల మధ్య చాలా మైత్రి ఉండేది. అప్పట్లో మా తాతగారు సూర్యనారాయణ రావు గారు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో పేరుమోసిన వకీలుగా, శ్రీమంతుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. జీవితాంతం ఆయన నిజాయతీపరుడిగానే ఉన్నారు. ఎంతోమంది అమాయకమైన వారికి వారి తరఫున ఏమాత్రం డబ్బు తీసుకోకుండా వాదించి, మరణ శిక్ష పడిన అమాయకులని కూడా ఆయన రక్షించారు. అందుకు ఉదాహరణ మా నర్సింహులు తాత. 

నర్సింహులు తాతతో మా అనుబంధం 

యితడు కడు బీదవాడు. నల్గొండవాసి. అమాయకంగా ఒక హత్యకేసులో ఇరికించబడ్డాడు. అతడు మా తాతగారి కాళ్లావేళ్లా పడ్డాడు. అతడు నిర్దోషి అని గ్రహించేసిన మా తాతగారు అతని తరఫున వాదించి నిర్దోషిగా నిరూపించారు. అప్పటినుంచి అతడు జీవితాంతం “దొరా ! నీ దగ్గరే ఉంటాను”, అని చెప్పి తాతగారి దగ్గరే ఉండిపోయాడు. మా అమ్మ నండూరి రాజరాజేశ్వరికి వివాహమై జనగామలో కాపురం పెట్టినప్పుడు ఈ నర్సింహులు తాత మాతో పాటుగా జనగామకు వచ్చి చాలా సంవత్సరాలు మాతోనే ఉన్నాడు. మేమందరం "తాతా","తాతా" అంటూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. అతని వద్ద చిన్న లెథర్ సంచి ఉండేది. దానిలో ఒక అరలో పొగాకు పొడి, ఇంకొక అరలో సన్నటి దూది, మూడో అరలో రెండు చెకుముకి రాళ్లు ఉండేవి. అతను చుట్ట  కాల్చడం చాలా గమ్మత్తుగా, గొప్పగా అనిపించేది. అతను తలపాగాలోంచి సంచిని తీసేవాడు. కోన్ షేపులో ఉన్న ఒక ఎండిన ఆకు (అది ఏమిటో తెలియదు) దానిలో ఈ పొగాకు, దూది కోరేవాడు. రెండు చెకుముకి రాళ్లు తీసి మధ్యలో కొంత దూదిని నేర్పుగా అమర్చి, చెకుముకి రాళ్లను ఒక దానితో ఒకటి దమ్ము కొడుతూ ఉండేవాడు. మధ్య మధ్యలో తగ్గిపోతున్న మంటని కొట్టినప్పుడు, రాపిడికి నిప్పురవ్వలు వచ్చి, దూది అంటుకునేది. ఈ దూది ఆకులో  రాజేస్తూ ఉండేవాడు. ఈ ప్రక్రియ అంతా చాలా తమాషాగా ఉండేది. తాత నర్సింహులుని బ్రతిమిలాడి ఆ చెకుముకి రాళ్లను తీసుకుని ఆడుతుండేవాడిని. నిప్పురవ్వల మాట దేవుడెరుగు నా చేతి వేళ్ళని గాయపరచుకుంటూ ఉండేవాడిని. దీపావళి పండగ వస్తే, అతను మాతో సమానంగా ఆటంబాంబులు కాలుస్తూ ఉండేవాడు. బాంబులు చేతిలో పట్టుకుని, దీపాలనుంచి, బాంబులు వెలిగించి చేత్తో పైకి ఆకాశం లో ఎగురవేస్తూ ఉండేవాడు. మేము ఆటంబాంబులు కాల్చే విధానాన్ని చూసి మమ్మల్ని వేళాకోళం చేస్తూ ఉండే వాడు. మా తాతగారి గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని తనని ఏవిధంగా కాపాడారు  వంటి  కబుర్లు కూడా చెప్తుండేవాడు. అలా చెప్తున్నప్పుడు చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకుంటుండేవాడు. మా దొర నన్నూ, మా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు అని చెప్తుండేవాడు. మా అమ్మ అంటే నర్సింహులు తాతకి ఎంతో గౌరవం, ఇష్టం. రాజమ్మ దొరసాని అని ఎంతో ప్రేమగా, గౌరవంగా పిలుస్తుండేవాడు. మా అమ్మ కూడా చాలా ధారాళంగానే ఆయనకి కావలసినవన్నీ ఏర్పాటు చేసి డబ్బులు కూడా ఇస్తుండేది. పొట్టుపొయ్యి మా ఇంట్లో ఇతనే వెలిగిస్తూ ఉండేవాడు. అప్పట్లో చెక్కపొట్టు (saw dust ) ఒక బస్తా రంపపు పొట్టు మూడణాలకి గుండా అంజయ్య గారి టింబర్ మిల్లునుండి కొనేవాళ్ళం. ఒక ఇనప కుంపటి క్రిందభాగంలో చిన్న చదరపు  ద్వారం ఉంటుంది. ఈ కుంపటి మధ్యలో రోకలిని పెట్టి దాని చుట్టూ చెక్కుపొట్టుని బాగా దట్టంగా నింపేవాడు. తరువాత మెల్లగా ఆ రోకలిని బయటకి లాగే వాడు. కుంపటి మీద పాత్రలు అమర్చడానికి వీలుగా కొన్ని అమరికలు ఉండేవి. క్రింద ఉన్న చదరపు ద్వారంలో కట్టెని ఉంచి అగ్గిపుల్లతో వెలిగించినప్పుడు, ఈ కట్టెతో పాటు పొట్టులో నిప్పంటుకునేది. వంట పాత్రని కుంపటి మీద పెట్టి వంట చేయటం, వేణ్ణీళ్ళు కాచుకోవటం వంటివి అమ్మ చేస్తుండేది. ఈవిధంగా నర్సింహులు తాత, ఇంట్లో చేదోడువాదోడుగా ఉంటూ తన వయసుకు తగ్గ పనులు చేస్తూ ఉండేవాడు. వృద్ధాప్యం వచ్చాక ఆయన కుటుంబ సభ్యులు వచ్చి ఆయన్ని వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్లారు. అప్పటి సమాజంలో ప్రజలు అమాయకంగా, నీతిబద్ధంగా, ధర్మబద్ధంగా అన్నింటికీ మించి నమ్మకంగా మసలుకునేవారు. ఇటువంటి ఉన్నతమైన వ్యక్తుల గురించి మనం భావి తరాల వారికి  తెలియ పరచటం మన బాధ్యత అని భావించి, మా వంశచరిత్ర లో నర్సింహులు తాతని మా కుటుంబ సభ్యుడిగా చెప్పటం జరిగింది. ఇటువంటి పాత్రలను చూసినప్పుడు నాకు విశ్వనాథ సత్యనారాయణగారు రాసిన "వీరవల్లడు " నవలలోని ఆ వల్లడు గుర్తుకొస్తాడు. సమాజం అంటే మరి అనేక మంది ప్రజలయొక్క సమూహమే కదా ! ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే కదా సమష్టి చైతన్యం ముందుకు సాగేది.

     మా తాతగారు వల్లూరి సూర్యనారాయణ రావు గారు ఈ విధంగా చాలా మందికి ఎటువంటి ఫీజు తీసుకోకుండా రక్షించిన సందర్భాలు కోకొల్లలు. మా తాతగారు తన జీవితంలో అనేక ఒడిదుడుకులతో సహవాసం చేస్తూ, చాలా కష్టపడి M.A.B.L చదివి,  జీవితంలో పైకి వచ్చారు. నేను గమనించింది ఏమిటంటే కష్టాలు, సమస్యలు, సవాళ్ల మధ్య పెరిగిన వారికి ఒక సంపూర్ణ మానసిక వ్యక్తిత్వం, విశాల దృక్పథం కలిగి ఉంటారు. అందులో మా ఇద్దరి తాతగార్ల వృత్తిలో వారికి కష్టాలు చెప్పుకున్న వాళ్ళే ఉంటారు కదా ! ఇన్ని వందల మంది  కష్టాలు, కన్నీళ్లు తుడిచే సందర్భంలో వీరికి (ఇద్దరి తాతగార్లకి) ఎంతో విశాలమైన సానుభూతితో కూడిన దృక్పథం కలగటం అనేది సహజమే కదా! మా తాతగారు వల్లూరి సూర్యనారాయణ రావుగారు నిజాo దర్బారు లో హై కోర్టు జడ్జిగా నియమింపబడినప్పుడు, వెస్లీ బాయ్స్ హై స్కూల్ యాజమాన్యం మా తాతగారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఎంతో ఘనమైన సత్కారం చేసారు. మా తాతగారు శ్రీవిద్య, దేవీ ఖడ్గమాల ఉపాసకులు. ఆయన మడిబట్టలు ఆరవేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన పూజగది ఉండేది. ఆయన మడిపంచలు ఆరవేయడానికి పైన చెక్కతో కూడిన దండెం ఉండేది. ఒక పొడవాటి కర్ర సహాయంతో మడిబట్టలని ఆరవేసేవారు. ఆయన కూర్చోవడానికి ఇత్తడితో తాపడం చేసిన పీట ఉండేది. చాలా నిష్ఠగా ఆయన ఉపాసన చేసేవారు. ఎన్నో అద్భుతమైన కీర్తనలు అమ్మవారి మీద రాశారు. వాటిని మా అమ్మగారు తన శ్రావ్యమైన కంఠంతో రాగాలు కట్టి పాడుతూ ఉండేవారు. మా అందరికి కూడా ఆ పాటలు బాగానే జ్ఞాపకం. ఈ విధంగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. హార్దికర్ బాగ్,  హిమాయత్నగర్ ఇంట్లో వచ్చే పోయే ప్రముఖుల కోసం కొన్ని ప్రత్యేకమైన గదులు కట్టించారు. పనివాళ్ళకి కూడా ఇటువంటి సౌకర్యాలు కల్పించారు. మా తాతగారికి ఇద్దరు కొడుకులు. అశోక్ మామయ్య, ఈయన కూడా న్యాయవాది వృత్తిని చేపట్టారు. శశి భూషణ్ మా రెండో మామయ్య. ఈయన నేవీ లో చేరారు 

     మా అమ్మ రాజరాజేశ్వరి దేవి, నాన్నగారు డా.శ్రీ రామారావు  



                   
\
                                 అశోక్ మామయ్య సావిత్రత్తయ్య               

                                     

           లక్ష్మి పిన్ని, మురళీ కృష్ణ బాబాయ్ గారు

   

సుశీల పిన్ని, కామేశ్వర రావు బాబాయ్ గారు          వేదమ్మ పిన్ని, శర్మ బాబాయ్ గారు                    

   

     శశి మామయ్య,                 లలిత అత్తయ్య    





 
పద్మ పిన్ని ,చంద్రం బాబాయ్ గారు

అందరిలో పెద్ద మా అమ్మగారు నండూరి శ్రీ రాజరాజేశ్వరి, తరువాత వరుసగా వేదవతి, సుశీల, పద్మ, వరలక్ష్మి. మొత్తం ఏడుగురు సంతానం.

తెలుగు వారందరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిoపదగిన సంఘటన

 మా తాతగారు న్యాయం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయని ధైర్యగుణ సంపన్నుడు. ఒకసారి నిజాం నవాబుకు సంబంధించిన ఒక అధికారి ఒక హిందువు మీద దౌర్జన్యం చేసి ఆయనని అన్యాయంగా పెద్ద కుట్ర కేసులో ఇరికించాడు. మా తాతగారు తెలుగువాళ్ళలో ప్రముఖ న్యాయవాది. దగా పడిన వారికి సహాయం చేసే గుణమున్నది కాబట్టి ఆ బాధితుడు ఈయన్ని ఆశ్రయించాడు. ఎందుకంటే మిగతా న్యాయవాదులంతా ఈయన తరఫున వకాల్తా పుచ్చుకోవటానికి భయపడ్డారు. మరి నిజాం నవాబుని ఎదుర్కొన్నట్లే కదా! మా తాతగారు ఈయన తరఫున వాదించటానికి ఒప్పుకున్నారు. మా తాతగారి శ్రేయోభిలాషులందరూ, “సూర్యనారాయణ గారూ ! ఈ కేసుని తీసుకోకండి. పరిణామాలు దారుణంగా ఉండవచ్చని” హెచ్చరించారు. అందుకు మా తాతగారు "నేను న్యాయం, ధర్మం, సత్యం కోసమే పోరాడాలని ఈ వృత్తిని స్వీకరించాను. నేను అన్యాయాన్ని ఎదుర్కోవటానికి న్యాయబద్ధమైన పోరాటాన్ని చేస్తున్నాను. అంతే కానీ వ్యక్తుల కోసం కాదు. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కోవటానికి నేను సిద్దమే అని జవాబిచ్చారు. అప్పట్లో మా తాతగారి మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడి కూడా ఉండేది. నిజాం పరిపాలనలో హిందువులకి న్యాయం ఎప్పుడూ జరిగేది కాదు. ఈ వ్యక్తిని రక్షించడానికి మా తాతగారు రాత్రిoబవళ్ళు పని చేశారు. అప్పట్లో ఇన్ ట్లోవారంతా కూడా చాలా భయపడ్డారు. మొత్తానికి అద్భుతమైన వాదనలతో ఈ కేసుని గెలిచారు. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనం కలిగించింది. అందరూ భయపడ్డారు కానీ నిజాంకి అతిసన్నిహితుడైన కిషన్ పర్షాద్, మరి కొంతమంది ఈ న్యాయవాది చాలా తెలివితేటలు కలవాడు. ఆయనని మన సంస్థానంలో ప్రధాన న్యాయమూర్తి గా (చీఫ్ జస్టిస్) నియమిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అందుకు నిజాం నవాబుగారు అంగీకరించారు. ఇది మావంశ చరిత్రలోనే కాకుండా తెలుగు వారందరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిoపదగిన సంఘటన. మా తాతగారు చేసిన శక్తి ఉపాసన, శ్రీ లలిత, ఖడ్గమాలా దేవీదేవతలు న్యాయ పోరాటం చేస్తున్న మా తాతగారికి అండగా నిలిచారు. బూరుగుల రామకృష్ణా రావు గారు, మాడపాటి హనుమంత రావు గారు తదితర ప్రముఖులందరూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు.వకీలుగా మా తాతగారి సంపాదన సామాన్య అంచనాలకి అందనంత ఎత్తులో ఉండేది. మరి ఆ రోజుల్లో వకీలుగా పదివేల వెండి రూపాయలంటే అసామాన్యం. ఆయన హైద్రాబాదులో ఐదు భవనాలని కొన్నారు. అన్నిటికన్నా పెద్ద ఇల్లు బేగంపేట లోని నేచర్ క్యూర్ ఆస్పత్రి వద్ద ఎత్తైన ప్రదేశంలో ఉండేది. విశాల ఆవరణ, అనేక ఫలవృక్షాలతో, పనివాళ్ళు, తోటమాలి, కాపలాదారులు, మందీ మార్బలంతో వైభవోపేతంగా ఉండేది. ఈ 

Valluri  tails  

Valluri Tails: Grand children  and  Great  grandchildren and great great  grandchildren of Valluri Thatha gaaru 

ఇంట్లోనే మా అమ్మమ్మ మేమంతా కక్కి అని పిలిచేవాళ్ళం. మా సీత కక్కి ఎన్నో సాహసాలు చేశారు. ఇంకొక ఇల్లు హైదరబస్తీలో ఉండేది. అదే జీరాప్రాంతం ఇంకొక ఇల్లు కోటి బ్యాంకు వీధిలో ఉండేది. మరో ఇల్లు నిజామ్ కాలేజీ వెనక బషీర్ బాగ్ లో ఉండేది. నేను నా చిన్నతనంలో మేమంతా గడిపిన ఇల్లు హిమాయత్ నగర్ హార్దికర్ బాగ్ లో ఉండేది. అది కూడా రాజభవనం లాగా ఉండేది. విశాలమైన ఆవరణ . మొదట్లో ఒక పెద్ద కొబ్బరి చెట్టు , ఎన్నో సపోటా చెట్లు, మామిడి చెట్లు, వంటవాడు నాయర్ కోసం ఇల్లు  మామిడి చెట్లను ఆనుకుని పనివాళ్ళకోసం క్వార్టర్స్ . దానెదురుగా పెద్ద జామచెట్టు. సర్వెంట్ క్వార్టర్స్ కి ఎదురుగా ఒక బావి, పక్కనే ఉసిరి చెట్టు , ఆ ప్రక్కనే గుండ్రంగా సిమెంటుతో నిర్మింపబడ్డ పెద్ద నీటి హౌస్ ఉండేది. నిజానికి మా తాతగారు తన కుటుంబాన్నే కాకుండా, వారి అన్నగారి కుటుంబ భారం కూడా మోస్తూ ఉండేవారు. ఎందుకంటే వారి పెద్ద అన్నగారు వల్లూరి జగన్నాథ రావు గారికి ఎటువంటి చదువు అబ్బలేదు. బద్ధకస్తుడు కూడా. మా తాతగారు ఎన్ని ఉద్యోగాలు వేయించినా పట్టుమని మూడు నెలలు కూడా ఉద్యోగంలో ఉండేవారు కాదు. తమ్ముడు సంపాదిస్తూ ఉంటె ఆయన యథేచ్ఛగా కాలం గడుపుతూ, తమ్ముడి పిల్లలమీద అజమాయిషీ చేస్తూ ఉండేవారు. మా సీత కక్కి (అమ్మమ్మ) వారి స్వగ్రామం రొయ్యూరు. వారి తండ్రిగారికి కరణీకం. మా సీత కక్కి అన్నలు ఎవరికీ చదువులు అబ్బలేదు. కేవలం పెద్ద అన్నగారు అచ్యుత రామయ్య గారు మాత్రమే బాగా చదువుకున్నారు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు. ఒడ్డూ పొడుగ్గా ఉండేవారు. ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెసు నాయకత్వం లో ఎన్నో ఉద్యమాలు చేశారు. ఎప్పుడూ ఖద్దరు దుస్తులే ధరించేవారు. మా సీత కక్కి తండ్రి గారు కృష్ణారావు గారు (కృష్ణయ్య) వారికి రొయ్యూరు కరణీకం ఉండేది. ఈయన గురించి ఆసక్తికరమైన విషయం మా అమ్మగారు చెప్తుండేవారు. మా తాతగారికి ఐదు కార్లు ఉండేవి (Plimath,Ford,Humber,Cimca,Vaxhaul). అప్పట్లో ఆయన ప్రఖ్యాతి గాంచిన పేరు గుర్తు లేదు ఒక కారు Humber కారు అనుకుంటాను. అంటే కేవలం ఆ కారు హైద్రాబాదులో నిజాం నవాబు తర్వాత మా తాతగారి దగ్గరే (వల్లూరి సూర్యనారాయణ రావు) ఈ విలువైన కారు ఉండేది. అందులో ఒక కారు

డ్రైవరు ఉత్తర్ భారత దేశానికి చెందినవాడు. ఒకసారి ఈ కృష్ణయ్య గారు (మా అమ్మ తాతగారు) హైద్రాబాదు వచ్చినప్పుడు బంధువుల ఇళ్ళకి ఎంత దూరమైనా నడచుకుంటూ వెళుతూ ఉండేవారట. ధాన్యపు బస్తా నెత్తి 

                                         

మా సీత కక్కి తల్లిదండ్రులు శ్రీ రొయ్యూరు వేంకట కృష్ణయ్య,శ్రీమతి రత్నమాంబ

మీద పెట్టుకుని నాంపల్లి స్టేషన్ నుండి హిమాయత్ నగర్ లో ఉన్న హార్దికర్ బాగ్ ఇంటికి నడుచుకుని వెళ్తుండేవారట. ఒక సారి ధాన్యపు బస్తాలని ఈ కారు డ్రైవరు మోయలేక అవస్థ పడుతుంటే ఈయన ఆ మాత్రం బరువు మోయ లేకపోతున్నావేమిట్రా? అని అంటే ఆ డ్రైవరు తిరిగి కృష్ణయ్యగారితో, “మీరు బ్రాహ్మణులు, పప్పు తినేవాళ్లు. మీకేం బలం ఉంటుంది? ఇంత బరువు మోయగలరా?” అంటూ వేళాకోళంగా అన్నాడుట. ఆ డ్రైవరుని పక్కకి నెట్టి వేసి ఆ బస్తా ధాన్యాన్నిఅవలీలగా భుజానికెత్తుకొని, సామాను కొట్టులో పడేసారు. అలా ఆయన నాలుగైదు బస్తాలని ఎత్తి మోసుకెళ్లి సామాన్ల గదిలో పెట్టటం జరిగింది. ఆ డ్రైవరు మోహన్ సింగ్ కి నోట మాట రాలేదుట.  ఆ డ్రైవర్ కృష్ణయ్య గారికి (మా ముత్తాత గారు) ఇంకొక సవాలు విసిరారు. మోహన్ సింగ్ స్టీరింగ్ ముందు కూర్చుని ఉండగా కృష్ణయ్య గారు రెండు చేతులతో కారు ముందు సిద్ధంగా నిలబడ్డారు. మోహన్ సింగ్ కారు స్టార్ట్ చేసి ఆక్సిలరేటర్ని నొక్కినా, కారు మాత్రం ఒక్క అంగుళం కూడా ముందు కదలలేదుట. ఆ డ్రైవర్ మోహన్ సింగ్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. ఆయన అంత బలశాలి. ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఒంటరిగా ఎవరూ లేకుండా చేసేవారట. మంచి తిండిపుష్టి కలిగి, బలమైన ఆహారం తింటూండేవారట. మా అమ్మ, అమ్మమ్మ ఈ విషయాలు చెప్తుంటే ఆసక్తిగా ఆశ్చర్యo తో  వింటూ ఉండేవాళ్ళం. 

   మా తాతగారికి ఉన్న ఐదు కార్లలో ఒక కారు మా తాతగారు వాడుకునే వారు. ఇంకో కారు మా సీతకక్కి  (అమ్మమ్మ)వాడుకునేది. మూడో కారు పిల్లల కోసం. మా తాతగారికి హైద్రాబాదు లోని అతి ధనవంతులైన బెలిదే జగదీశ్వరయ్య, పాట్నీలాంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, క్లైంట్స్ గా ఉండేవారు. మా అమ్మగారి వివాహం పశ్చిమ మారేడుపల్లి, బెలిదే జగదీశ్వరయ్య గారింట్లో ఐదు రోజులు అతి వైభవంగా జరిగింది. వివాహానికి వచ్చిన అందరికి కూడా వెండి కుంకుమ భరిణెలు తాంబూలం లో పెట్టి ఇచ్చారు అని అమ్మ చెప్పింది. నా చిన్నతనంలో నేను ఈ కుంకుమ భరిణెను చూసాను.  చార్మినార్ బొమ్మ ఉంటుంది. బహుశా అది వెండి రూక అయి ఉండవచ్చును. అప్పటి పెళ్లిపత్రిక కూడా శిథిలావస్థలో ఉండగా చూడటం తటస్థించింది. మా తాతగారు సంపాదించిన ఆస్తి విలువని ప్రస్తుతం అంచనా వేస్తె కొన్ని వేల కోట్ల పైనే ఉంటుంది. ఆయన విరివిగా ఎన్నో గుప్తదానాలు చేస్తుండేవారు. ఆధ్యాత్మిక సంస్థలకి వేలల్లో విరివిగా విరాళాలు ఇస్తుండేవారు. తెలుగు వారికి పాఠశాలలు ఉండాలనీ, బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఉండాలనీ బూరుగుల రామకృష్ణారావు గారు, మాడపాటి హనుమంత రావు గార్లు చేసిన ఉద్యమానికి తనవంతు మాట సాయం తో పాటు, ఆర్ధిక సాయం కూడా చేసారు. ఎంతోమంది పేద విద్యార్థులైన బ్రాహ్మణులకి చదువు చెప్పించారు. అందుకు ఉదాహరణ శర్మ గారు. ఆయనని మేము పంతులుగారు అని పిలిచేవాళ్ళం. ఆయన పేద బ్రాహ్మణుడు, మంచి తెలివితేటలు కలవాడు. మా తాతగారి సహాయం అర్థించినప్పుడు, ఆయనకి తన ఇంట్లోనే అన్ని వసతులు కల్పించి , అతనికి  ఇంజనీర్ విద్యను పూర్తిగా చదివించి, తన పలుకుబడితో బిర్లా గ్రూపులో మంచి ఉద్యోగం కూడా ఇప్పించారు. ఒకసారి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.

    నేను 1966-67 లో ఢిల్లీ కి వెళ్ళినప్పుడు మా రెంటాల రాఘవ రావు మామయ్య గారు ప్రెసిడెంట్ ఎస్టేట్ లో ఉండేవారు. 

నాకు జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన : 

ఒక ఆదివారం నేను ముందు గదిలో కూర్చుని ఉండగా ఒక తెలుగు ఆయన వచ్చారు. వయసు 70  ఏళ్ళు పై చిలుకే. యథాలాపంగా నన్ను ఆయన ఎక్కణ్ణుంచి వచ్చావు?అని వివరాలు అడిగినప్పుడు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, రాఘవ రావు గారు మా మామయ్య అని చెప్పగానే  ఓహో ! నిజాం వాడివా? మరి నీకు హై కోర్ట్ జడ్జి వల్లూరి సూర్యనారాయణ రావు గారు తెలుసా? అని అడిగారు. నేను ఆయన మా తాతగారు అని చెప్పగానే ఆయన అమాంతం నా కాళ్ళ మీద పడ్డారు. నేను బిత్తర పోయాను. అందుకు ఆయన “బాబూ ! మీ తాతగారు ఎంతో ధర్మాత్ముడు. ఎంతో మంది బీద

                           

                         శాంత అత్తయ్య, మా రెంటాల రాఘవరావు మామయ్య గారు

బ్రాహ్మణులకి చదువు చెప్పించారు, ఉద్యోగాలు ఇప్పించారు. అందులో మా తమ్ముడు శర్మ కూడా ఉన్నాడు. ఆయన పెట్టిన భిక్ష వల్ల కోటీశ్వరుడయ్యాడు. మీలో మీ తాతగారిని చూసాను, చూసి కృతజ్ఞాత భావంతో నమస్కారం చేశాను ” అంటూ గద్గద స్వరంతో చెప్పాడు. అప్పుడు నాకు పదహారేళ్లు. ఇలాంటి సంఘటనలు నాకు చాలా జరిగాయి. నండూరి ఇంటి పేరు చెప్పగానే నండూరి రామ్మోహన రావు గారు, నండూరి సుబ్బారావు గారు మీకేమవుతారు అని ఎంతో మర్యాదగా అడుగుతూ ఉండేవారు. అలాగే తాత గారు, వల్లూరి సూర్యనారాయణ రావు గారి గురించి కూడా అడుగుతూ ఉండేవారు. ఈ శర్మ అనే పంతులుగారిని  నేను చాలా సార్లు చూడటం జరిగింది. ఈయన మద్రాసులో ఉండేవాడు. తరచూ హైదరాబాదులోని   హార్దికర్  బాగ్  ఇంటికి  వస్తుండేవారు.

                                         అధ్యాయం 4

మా పెద్దిల్లు - హార్దికర్ బాగ్ ఇల్లు వర్ణన

 మేము వేసవి  కాలం  సెలవులకి  తరచూ హార్దికర్  బాగ్  ఇంటికి వెళ్ళుతుండేవాళ్ళం. అలాగే మా వేదమ్మ పిన్ని పిల్లలు, మా మేనమామ అశోక్ మామయ్య పిల్లలు జనగామకు అంటే మా ఇంటికి  వస్తుండేవారు. బేగం పేటలో ఉన్న మా తాతగారి ఇల్లు చాలా పెద్దదని మా మూడో బావగారు బ్రహ్మాండం గోపాలకృష్ణ గారు చెప్పారు. దాదాపు ఒక ఎకరం పైన ఖాళీ స్థలం ఉండేదనీ, మధ్యలో విశాలమైన రాజభవనం లాంటి ఇల్లు ఉండేదని మా అన్నలు కూడా చెప్పారు. ఇక్కడ హార్దికర్ బాగ్ లోని ఇల్లు కూడా 

                           

                పెద్దింట్లో పోర్టికోలో మెట్ల మీద కిషోర్ , ఖడ్గమాల, చందన్ మా అశోక్ మామయ్య పిల్లలు  

చాలా విశాలంగా ఉండటం వలన మేము, మా మామయ్య, పిన్నిగార్ల పిల్లలు, మా ఆఖరి పిన్ని వరలక్ష్మి, మేమందరమూ కూడా రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇంటి వెనక గుండ్రంగా నీటి హౌసు ఇంట్లో పని వాళ్ళు అందరి బట్టలు ఉతకడానికి కట్టించారు. దానిలోనే నీళ్లు నింపి మగపిల్లలందరూ, పొట్టి లాగులు వేసుకుని, ఆ నీళ్లలో ఆడుకుంటూ ఉండేవారు. ఇల్లు చాలా పెద్దది కావటం వల్ల మా అల్లరి బయటకు తెలిసేది కాదు. హౌసు పక్కనే ఒక మల్బరీ చెట్టు ఉండేది. దాని ప్రక్కనే ఒక మామిడి చెట్టు ఉండేది. మేమంతా ఈ బొంత చెట్టుపళ్ళు తింటూ ఉండేవాళ్ళం. చాలా రుచిగా ఉండేవి. మామిడి చెట్టు వెనక భాగాన ఉన్న ఒక రెండు గదుల వాటాలో ఒక కోమటి కుటుంబం ఉండేది. వాళ్లకి దోమలగూడ లో ఒక దుకాణం ఉండేది.వారింటి ముందు పెద్ద అల్ల నేరేడు చెట్టు ఉండేది. బోలెడన్ని అల్లనేరేడు పళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉండేవి. ఊరిస్తూ ఉండేవి. ఇంట్లో పనివాళ్ళు బాలమ్మ, రాములమ్మ, పెంటమ్మ, ఇంకో ఇద్దరు ఉండేవారు. ఈ బాలమ్మ కూతురు దాని అసలు పేరు మాకు తెలియదు కానీ బోడీ అని పిలుస్తుండేవాళ్ళం. చాలా హుషారుగా ఉండేది. అదే, మా కిషోర్ బావ (అశోక్ మామయ్య రెండవ కొడుకు) , వీళ్ళిద్దరూ చకచకా అంత పెద్ద చెట్టుని ఎక్కేసి , ఆ పళ్ళన్నీ కోసి, జేబుల్లో కుక్కుకుని, మిగతావి మా కోసం క్రింద పడేస్తూ ఉండేవారు. ఆ రోజు నాకు బాగా గుర్తు. నేను ధైర్యం కూడగట్టుకుని ఆ చెట్టు ఎక్కాను. అంతా బాగానే ఉంది. నాకు దిగేటప్పుడు మాత్రం కళ్ళు తిరిగాయి. రెండు కొమ్మల మధ్య కూర్చుండి పోయాను. క్రింద ఉన్నవాళ్ళందరూ నాకు ధైర్యం చెప్పగా, ధైర్యం చేసి ఎలాగో అలా కిందకు దిగాను. అప్పటినుంచి నన్ను అందరూ వేళాకోళం చేస్తూ ఉండేవారు. ఆ అల్లనేరేడు చెట్టు వెనక పక్కింటి వారి ప్రహారీ గోడ ఉండేది. ఆ ఇల్లు అమ్మాణమ్మ అనే తమిళుల ఇల్లు. మా సీత కక్కి, ఆవిడ ఆ గోడ దగ్గరే మాట్లాడు కుంటూ  ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం ముందుకి వెళ్ళితే ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఎండిన కాయ పగలగానే లోపల  ఉన్న గింజలు గాలిలో తేలుతూ ఉండేవి. ఒక గింజ, దానిపైన అంతా చాలా పలచటి దారపు పోగుల్లాంటివి ఉండేవి. వాటిని పట్టుకోవడానికి మేమంతా పరుగులు పెడుతుండేవాళ్ళం. దీనికి ఎదురుగానే, భవనానికి ఎడమవైపున ఇంట్లోకి వెళ్ళడానికి పక్క ద్వారం, మెట్లు ఉండేవి. ఇంకా కొంచెం ముందుకి వెళ్ళితే, ఒక మూల కారు గారేజీ ఉండేది. దాని పక్కన ఒక పెద్ద అశోక వృక్షం, దానికి ఎదురుగా విశాలమైన పోర్టికో ఉండేది. ఇక్కడే ఇంకొక కారు పెట్టేవాళ్ళు. మొత్తం ఇల్లంతా కూడా చల్లగా ఉండేది. వేసవిలో అయినా అలాగే ఉండేది. ఇది రెండoతస్థుల భవనం గ్యారేజీ ని ఆనుకుని ఇంకొక చిన్న వాటా ఉండేది. ఆ వాటాలో కొన్నాళ్ళు మలయాళీ నాయర్ వంటవాడు, తోటమాలి కం డ్రైవరు అంజయ్య ఉండేవారు. ఆ భవనం చుట్టూతా ఎంత విశాలమైన జాగా ఉండేదంటే మేము సైకిళ్ళ మీద ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళం. మొత్తం నాలుగు ప్రవేశ ద్వారాలు ఉండేవి. ముందుగా సింహద్వారం, ఎడమవైపు, కుడివైపు, పెరటివైపు కూడా ద్వారాలు ఉండేవి. ఈ సింహద్వారానికి ముందు భాగం ఎడమవైపు, చాలా విశాలమైన ఓపెన్ విండోస్ ఉండేవి. భవనానికి కుడివైపున వెళ్తే ఎడమ దిక్కున ఒక బాల్కనీ ఉండేది. మల్లె తీగ ఉండేది. మేము ఈ బాల్కనీ  ఎక్కి అక్కడ్నుంచి లోపల విశాలమైన హాలులోకి దుంకుతూ ఉండేవాళ్ళం. ఇది చాలా పెద్ద హాలు. దీనిని టెలిఫోన్ గది అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే టెలిఫోన్ అందులోనే ఉండేది. ఈ టెలిఫోను గదిలోనే ఒక చివర ఒక విచిత్రమైన టేబుల్ ఉండేది. అది పియానో బల్లలా ఉండేది. లోపల ఎన్నో అరలు ఉండేవి. అంటే మా తాతగారు, ఆ  అరల్లో ముఖ్యమైన కాగితాలు పెట్టుకునేవారన్నమాట. ఈ అరలన్నీ కప్పుతూ ఒక ప్రత్యేకమైన స్లయిడింగ్ కవర్ ఉండేది. దానికి తాళం వేసే సౌకర్యం ఉండేది. ఎడమ పక్కన ఒక స్లయిడింగ్ వుడెన్ ప్లాంక్ ఉండేది. ఎడమవైపు, కుడివైపు, చెరో మూడు సొరుగులు ఉండేవి.ఈ సొరుగులు తెరవడానికి వీలు లేకుండా పొడవాటి చెక్కలు ఉంది, పైన తాళం వేస్తె, మిగిలిన సొరుగులు కూడా తీయటానికి వీలు లేకుండా ఉండేది. టేబుల్ అంతా ప్రత్యేకమైన రెక్సిన్ కవరుతో కప్పబడి ఉండేది. ఆ తరువాత ఈ టేబుల్ నా దగ్గర చాలా సంవత్సరాలు ఉండాలి. ఖరీదైన, నాణ్యమైన టేకు తో తయారు చేసినది. ఇటువంటి ప్రత్యేకమైన, ఖరీదైన, నైపుణ్యంతో సౌకర్యంగా చేసిన బల్ల నేను ఎక్కడా చూడలేదు. 

                          

         పెద్దింట్లో పోర్టికోలో మెట్ల మీద కిషోర్ , ఖడ్గమాల, చందన్ మా అశోక్ మామయ్య పిల్లలు  

ఇప్పుడు సింహద్వారం దగ్గరకు వద్దాం.ఈ భవనాన్ని పరిచయం చేస్తాను. పోర్టికో దగ్గర ఉన్న నాలుగైదు మెట్లెక్కితే పెద్ద వరండా.లోగడ నేను చెప్పినట్టుగా కుడివైపు, ఎడమవైపు పెద్ద ఓపెన్ విండోసున్దేవి. ఎవ్వరూ ఊహించలేనంత విశాలంగా ఉండేవి. సుమారుగా 14 అడుగుల ఎత్తు గవాక్షాలు ఉంటాయి. కుడివైపు, ఎడమవైపు, అటు పక్కకి నాలుగేసి చువ్వల్లేని పెద్ద కిటికీలు ఉండేవి. మెట్లెక్కి వస్తుండగా కుడివైపు చెక్క పోస్ట్ బాక్స్ ఉండేది. మెట్లెక్కగానే ఎదురుగుండా కచేరీ హాలు ఉండేది. మెయిన్ తలుపులు రెండూ బలిష్ఠముగా చాలా ఎత్తుగా ఉండేవి.కచేరీ తలుపులని తోయడం చాలా కష్టంగా ఉండేది. ఆ హాలులో L- shape లో ఖరీదైన సోఫా ఉండేది. సులభంగా 25  మంది కూర్చొనవచ్చును. ఆ హాలు సుమారు 2500 చదరపు అడుగులు ఉండేది. చుట్టూ గోడను ఆనుకుని ఎన్నో అద్దాల బీరువాలు ప్రత్యేకంగా తయారు చేయించినవి ఉండేవి. వీటిలో వందల కొద్దీ లెథర్ బౌండ్ తో చేసిన Law పుస్తకాలు ఉండేవి. మా తాతగారు విశాలమైన కుర్చీలో కూర్చునేవారు. ఎదురుగుండా ఖరీదైన విశాలమైన బల్ల ఉండేది. ఆ పక్కనే మున్షి టేబుల్ మీద ఒక రెమింగ్టన్ టైపు రైటర్ మీద టైపు చేస్తుండేవాడు. వెనుక గోడలమీద రవి వర్మ గారి అద్భుతమైన, అతి ఖరీదైన, లైఫ్ సైజు పెయింటింగ్స్ ఉండేవి. ఆ రోజుల్లోనే వాటి ఖరీదు లక్షల్లో ఉండేది.  ఒకటి యశోదా కృష్ణ, ఇంకొకటి ప్రకృతికి సంబంధించిన చిత్రం. దానిలో చెట్లు, నది, రెండు పెద్ద పులులు. నీళ్లు త్రాగుతున్నట్లుగా ఉంది. ఇలాంటి చాలా అందమైన ఆకర్షణీయమైన పెయింటింగ్స్ తో ఆ హాలంతా అలంకరించి ఉండేది. ఇవే కాకుండా చాలా ఖరీదైన, ప్రత్యేకమైన,అందమైన చైనీస్ పాట్స్ ఉండేవి. రాస్తుంటే దానికి అంతు ఉండదు.  ఇలాంటి ఖరీదైన వస్తువులన్నీ మా తాతగారి మిత్రులైన జాగీర్దార్ల వద్ద ఉండేవి. దీనిని బట్టి మా తాతగారికి ఎంతటి కళాత్మకమైన హృదయం, ఆ సున్నిత్వం ఉందొ మనకి యిట్టె తెలిసిపోతుంది. కచేరీ హాలులో అడుగు పెట్టగానే రసజ్ఞులకి ఆయన యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గమనించి గ్రహించగలుగుతారు. గదుల యొక్క పై కప్పు చాలా ఎత్తుగా ఉండేది. కచేరీ హాలు దాటగానే కుడివైపు నేను చెప్పిన టెలిఫోను హాలు అంటే అది ఒక పెద్ద బెడ్ రూమ్  క్రింద వాడేవారు. ఆ గదిలో ప్రత్యేకమైన మంచం ఉండేది (ప్రస్తుతం అమెరికా లో వాడుతున్న క్రిబ్ లాంటిది చిన్న పిల్లలు అటూ ఇటూ వెళ్లకుండా ముందు జాగ్రత్త కోసం దీన్ని వాడేవారు). పెద్దవాళ్ళు లేనప్పుడు మేము దీనిలో దిగి చాలా అల్లరి చేస్తూండేవాళ్ళం. కచేరీకి ఎడమవైపు వస్తే మేడ మీద వెళ్ళడానికి మెట్లు ఉండేవి. మెట్ల గదిని ఆనుకుని ఒక విశాలమైన గది ఉండేది. ఇది కూడా ఒక పడక గది (bedroom ) ఈ గదిలో మొట్టమొదటిసారిగా నేను గ్రామఫోను చూడటం జరిగింది. చదరపు పెట్టె లాగా ఉండేది. దానికి ఒక హేండిల్ కూడా ఉండేది. ఒక రెడ్ బాక్స్ లో గ్రామఫోను రికార్డులు అమర్చారు. మేమంతా చాలా ఆశ్చర్యంగా చూస్తూండేవాళ్ళం. ఆ పెట్టెలో ఎవరో కూర్చుని పాడుతున్నారని అనుకునేవాళ్లం. ఆ రికార్డు మీద ఒక కుక్క బొమ్మ ఉండేది. ఈ కుక్క కూడా ఎలా పాడుతుందబ్బా! అని అనుకునేవాళ్లం. అందులో రకరకాల హిందీ, తెలుగు పాటలు వినేవాళ్ళం.శాంతారాం ఝణక్ ఝణక్ పాయాలు బాజే , నవరంగ్ "అరె జారే హట్ నట్ ఖట్, చోడ్ మేరా గూంగట్, పలట్ కె దుంగి ఆజ్ తుఝే గాలీ రే ...., బెగానీ షాదీ మే అబ్దుల్లా దీవానా, ప్రియా  మిలన్ కో జానా, ప్రేమ్ నగర్ మే ఘర్ .., ,సైగల్, పంకజ్ మల్లిక్, మీరాబాయి పాటలు ఎన్నోఉండేవి.  అలాగే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం, కుంతీ విలాపం,ఘంటసాల గాత్రం వింటూ ఉండేవాళ్ళం.                        

                                    మా భవాని అక్కయ్య

 ఒక్కొక్కసారి కచేరీ హాల్లో మా అశోక్ మామయ్య, మా అమ్మ,  వేదమ్మ పిన్ని, సీత కక్కి వీరందరూ కలిసి సంగీత కచేరీ మహా హుషారుగా చేస్తూండేవాళ్లు. మేమంతా చుట్టూతా కూర్చుని వింటూ ఉండేవాళ్ళం. మా అమ్మ గారు, వేదమ్మ పిన్ని పై స్థాయిలో మీరాబాయి భజన గీతాలు పాడుతుండేవాళ్లు.మా వేదమ్మ పిన్ని గొంతు చాలా పై స్థాయిలో ఉండేది. అదే పోలిక మా భవాని (వేదమ్మ పిన్ని కూతురు) అక్కయ్యకు వచ్చింది. 'జాయియే ఆప్ కహా జాయేంగే .., కహీ దీప్ జలే, కహి దిల్.., మొహబ్బత్ కె ఝూఠీ కహానీ పే రోయె.. పాటలు చాలాబాగా పాడుతూ ఉండేది. మా మామయ్య పంకజ్ మల్లిక్, సైగల్, సి. హెచ్ ఆత్మా, పాటలు అద్భుతంగా పాడేవాడు.పనిలో పని మా సీత కక్కి కూడా అంతే హుషారుగా పాడుతుండేది. మా సావిత్రత్తయ్య (అశోక్ మామయ్య భార్య)వీరందరికి చిరుతిళ్ళూ, కాఫీలు, టీలు సరఫరా చేస్తూ ఉండేది. మెట్లకి కుడివైపున ఇంకొక గది ఉండేది. ఆ గది పక్కన మా తాతగారి ప్రత్యేకమైన పూజా మందిరం ఉండేది. ఈ గదిలో ఎవరికీ ప్రవేశం ఉండేది కాదు. ఒక ప్రత్యేకమైన శ్రీ చక్రం ఉండేది. మా తాతగారు పోయినాక శ్రీ చక్రాన్ని సికింద్రాబాదు మహంకాళి గుడిలో ఇవ్వటం జరిగింది. ఈ గదికి కుడివైపున ఓపెన్ డైనింగ్ హాల్ ఉండేది. ఇక్కడ పెద్దవాళ్ళంతా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఈ డైనింగ్ హాల్ కి ఎదురుగుండా పెద్ద వంట గది ఉండేది. డైనింగ్ హాలు, కిచెన్ ద్వారం ఎడమవైపు భూమిలో పాతిపెట్టిన రోలు ఉండేది. దీనిలోనే మా సావిత్రత్తయ్య నా పుట్టిన రోజు కి తొక్కుడు లడ్లు చేయడానికి ఉపయోగిస్తూ ఉండేది. ఈ డైనింగ్ హాలుకి కుడివైపున ఓపెన్ స్పేస్ ఉండేది. అక్కడ బట్టలు ఆరేసుకోవటానికి ఉక్కుతో చేసిన సెమి సర్కిల్ ఆకారం లో స్టాండ్ ఉండేది. ఇది భవనం యొక్క అంతర్భాగంలోనే ఉండేది. అక్కడ తలుపు తీయగానే మనం జామ చెట్టు ఉన్న ప్రదేశానికి చేరుతాం. వంట గది చాలా విశాలంగా ఉండేది. మా సావిత్రత్తయ్య గట్టు మీద వంట చేస్తుంటే పొగ పోవడానికి పైన పెద్ద చిమ్నీ ఉండేది. అప్పట్లో వంట, వంట చెరుకు మీదే సాగేది. ఆ బాత్రూమ్ లో మేము నలుగురైదుగురు పిల్లలo చిన్న చెడ్డీలు వేసుకుని , అక్కడే కింద ఉన్న  బాత్ టబ్ లో మేమంతా ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ,సర్రుమని (స్లయిడింగ్) దానిలో జారుతూ ఉండేవాళ్ళం. ఈ బాత్రూమ్ తరువాత విశాలమైన వాష్ బేసిన్, దాన్ని ఆనుకుని టాయిలెట్ ఉండేది. అప్పట్లో నీళ్లు పుష్కలంగా లభిస్తుండేవి. గండిపేట నీళ్లు తియ్యగా ఉండేవి. హార్దికర్ బాగ్ లో ఉన్న ఇంటిని మేమంతా "పెద్దిల్లు" అని పిలుస్తుండేవాళ్ళం. మా వేదమ్మ పిన్ని అంటే మా అమ్మ పెద్ద చెల్లెల్ని, తెనాలి లోని ప్రముఖ అడ్వొకేట్ కొండముది శ్రీరాములు గారి రెండవ కుమారుడైన రామ లింగేశ్వర్ గారికిచ్చి వివాహం చేయటం జరిగింది. ఆయన దోమలగూడ లో రెండు పెద్ద ఇల్లు కొన్నారు. మా పెద్దింటి సరిగ్గా ఒకఁ ఐదు నిమిషాలు నడక. ఎండాకాలం వస్తే మా సీత కక్కి బంధువులు, జనగాం నుండి మేము, మా వేదమ్మ పిన్ని పిల్లలు,అందరం ఇక్కడ చేరేవాళ్ళం. గుంటూరు నుండి మా అన్నపూర్ణ కక్కి (సీత కక్కి అక్క) తాటాకు బుట్టలో రక రకాల మామిడి పండ్లు తెస్తుండేది. వచ్చే వాళ్ళు, పోయేవాళ్లతో ఇల్లంతా మహా సందడిగా ఉండేది.మా పెద్ద ఇంటి పక్కన బోలెడంత ఖాళీ స్థలాన్ని మా తాతగారు కొన్నారు. డా. రంగాచారి గారు కొంత స్థలాన్ని కొనుక్కుని మా తాతగారి  ఇంటి పక్కనే ఇల్లు కట్టుకున్నారు.ఈయన క్లినిక్ ఫిల్ఖానా లో ఉండేది.ఆయన కూడా వైద్యంలో చాలా సంపాదించారు. ఎదురుగా ఉన్న ఖాళీస్థలాన్ని చెరువు పార్థ సారథి గారు కొనుక్కున్నారు. అప్పట్లో ఆయన ఎలెక్టీసిటీ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్.డా. రంగాచారి గారి ఇంటి పక్కన కోకా రామచంద్ర రావు, పేరు మోసిన లాయరు గారు ఉండేవారు. అక్కడ దగ్గర్లోనే A. P. స్పీకర్ అయ్యదేవర కాళేశ్వర్ రావుగారు ఉండేవారు. ఆయన భార్య మాలతి గారు. ఒకటి రెండు సార్లు నేను మా సావిత్రత్తయ్యతో, మా అమ్మతో వారి ఇంటికి వెళ్ళటం జరిగింది.ప్రతి రోజు మా పెద్దింట్లో డా. రంగాచాగారి గారి పిల్లలు, కృష్ణాజీ, రాంజీ, కోకా రామచంద్ర రావు గారి పిల్లలు గౌతమ్, సుధాకర్,రవి, మా రామన్నయ్య,కశ్యప్, (వేదమ్మ పిన్ని pillalu), మా అశోక్ మామయ్యా పిల్లలు బోసు, కిషోర్, నేను అందరమూ చేరి లట్టు (తాడు బొంగరం ఆట) ఆడుతూ ఉండేవాళ్ళం. చెక్క బొంగరం రకరకాల రంగులతో , కింద ములికి, బొంగరం నెత్తి మీద మెరుస్తున్న పూర్ణిమ, జాలీ అంటే తాడు ఇవన్నీ కలిసి మూడణాలకి వచ్చేది. ఈ బొంగరం తో మేము రకరకాల విన్యాసాలు చేస్తూండేవాళ్ళం. గాలిలో తిప్పి అరచేతిలో బొంగరాన్ని తిప్పడం, అరచేతి నుండి మోచేయి వరకు తీసుకొచ్చేవాళ్ళం. Udantar అంటే బొంగరాన్ని కప్పగంతుల్లాగా గాలిలో దూరంగా కొడితే ఎంతో దూరం వెళ్లి అక్కడ గిర్రున తిరుగుతూ ఉండేది. ఓడిపోయిన వాడి లట్టుని నేల మీద పెట్టి వేగంగా బొంగరపు ములికి కాలికి తగిలేట్టుగా కొట్టేవాళ్ళం. ఈ విద్యలో రాంజీ చాలా నేర్పరి. అతని ధాటికి బొంగరాలు ముక్కలై పోయేవి. ఆ తర్వాత క్రికెట్టు ఆడేవాళ్ళం. కొబ్బరి మట్టంని క్రికెట్ బాటుగా, కొబ్బరి చెట్టుని స్టంప్స్ గా, చెక్క బంతి తో ఆడుతూ ఉండేవాళ్ళం. తర్వాత క్యాంపు అంటే పిక్నిక్ ఆట ఆడేవాళ్ళం. అంటే ఒక డేరా వేసుకుని మాకు తోచిన వంటకాలు చేస్తూండేవాళ్ళం. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు భవాని అక్కయ్య, వరలక్ష్మి పిన్ని, ప్రసన్నక్కయ్య, రామన్నయ్య, బోసు, కిషోర్, పెద్దపాప(మా చెల్లెలు), ఖడ్గ మాల (మా మామయ్య కూతురు) కశ్యప్, చందన్ (మామయ్య ఆఖరి కొడుకు)కలిసి “ఐస్ బాయ్” (దాగుడుమూతలు) ఆడుకునేవాళ్ళం. దొంగలని పట్టుకోవటం ఆ విశాల స్థలం లో కష్టంగా ఉండేది. గోటీల ఆట, నాలుగు స్తంభాల ఆట, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? అనే ఆట, గాలి గాలి నమస్తే అనే ఆట, తర్వాత గిల్లి దాండు ఆట, చెట్లు ఉన్నాయి కాబట్టి కోతికొమ్మొచ్చి, అష్టచెమ్మా వగైరా వగైరా ఈవిధంగా చాలా సరదాగా, హాయిగా, మధ్యాహ్నమువరకు ఆడుకునేవాళ్ళం. భోజనాలు చేసాక మమ్మల్నందరినీ కచేరి హాలులో పడుకోపెట్టేవారు. మేమందరమూ హాయిగా నేలమీదనే పడుకునేవాళ్ళం. పెద్దవాళ్లందరికి కాళ్ళు పడుతుండేవాళ్ళం. అరగంటయ్యాక (అశోక్ మామయ్య), ఈ పెద్దవాళ్ళందరూ ఇక్కడ కాదు ఇక్కడ అంటూ మా అందరి చేత సేవలు చేయించుకుంటూ ఉండేవాళ్ళు. మా సీత కక్కి ప్రతిఫలంగా తన Godrej బీరువాలో ఉన్న గాజు సీసాలలోంచి బఠాణీలు, పల్లీలు ఇస్తుండేది. 

                                   మా సావిత్రత్తయ్య, అశోక్ మామయ్య

 మా సావిత్రత్తయ్య సాయంత్రం 3, 4 గంటల మధ్యలో మమ్మల్ని లేపి వంటింట్లో , పెద్ద కంచంలో అన్నం, పప్పు, కూర కలిపి మా చేతిలో ముద్దలు పెడ్తుందేది. మా అత్తయ్య వంటలన్నీ చాలా రుచిగా చేసేది. వల్లూరి స్పెషల్ ఆలూభాత్ మహారుచిగా ఉండేది. కొబ్బరిపాలతో చేసిన అన్నం ఇంకా రుచిగా ఉండేది. పసిమి ఛాయ, గుండ్రటి ముఖం, ముదురు గులాబీ రంగు కుంకుమ బొట్టుతో కళ కళలాడుతూ, ఎప్పుడూ నవ్వుతూ కడిగిన ముత్యం లాగా చాలా అంటే చాలా అందంగా ఉండేది. అలాగే చాలా మంది ప్రముఖుల ఇళ్ళకి పార్టీలకి వెళ్తూ చాలా హుందాగా ఉండేది. అలాగే చాలా మంది ప్రముఖులు ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వంటలు చేస్తుండేది. మేమందరమూ ఇప్పటికి కూడా ఎప్పుడూ తల్చుకుంటూనే ఉంటాం. మా అత్తయ్య చేతి వంటలు మధురంగా  ఉండేవి. మా మనస్సులో ఇప్పటికి కూడా ఆ వాసనలు ఉబాళిస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు ప్రేమతో చేసే చిన్న చిన్న పనులు జీవితాంతం మనకు తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి కదా ! ఇంకొక విషయం ఏమిటంటే మా ఇంట్లో పని చేసే రాములమ్మ, పెంటమ్మ, యాదమ్మ,పార్వతమ్మ వీళ్ళందరూ రాత్రి మాకు జొన్న రొట్టెలు చేస్తూ వేడి వేడిగా మాకు పెడుతుండేవాళ్లు. అవి మహా రుచిగా ఉండేవి. తోటమాలి కం డ్రైవరు అంజయ్య పెద్ద బట్టల షాపుని పెట్టుకుని జీవితంలో పైకి వచ్చాడు. అలాగే శంకర్ రావు , సత్యం అనే వీరిద్దరినీ కూడా పెద్ద శిక్షనుంచి మా తాత గారు తప్పించారు. వీళ్ళు అబిడ్స్ సెంటర్ లో విజయా స్వీట్ భండారు అనే పెద్ద మిఠాయి దుకాణం పెట్టుకున్నారు. జనగామకు వస్తుండేవారు. పేజీలు, రకరకాల స్వీట్లు పట్టుకుని వస్తుండేవారు. మునిసిపల్ కమిషనేరు హరిశంకర్ గారు కూడా జనగామకి  వచ్చి తాతగారి గురించి కబుర్లు చెప్తుండేవారు. 

       ఇప్పుడు మిమ్మల్ని మేడ మీదకు తీసుకుని వెళ్తాను. రండి ! ఇప్పుడు మీద మీదకి వెళదాం. మెట్లెక్కి వెళ్ళగానే ముందుగా పెద్ద వరండా ఉంటుంది. మెట్లెక్కగానే కుడి వైపు విశాలమైన హాలు , దాన్ని ఆనుకుని ఒక గదిరెండు పెద్ద వాటర్ తాంక్స్ ఉండేవి. , దాని తర్వాత బాల్కనీ, బాల్కనీ నుంచి చూస్తే అశోకా చెట్టు, ముందు భాగం అంతా కనిపించేది. వరండా చివర కుడి వైపు న విశాలమైన గదులు ఉండేవి. అవి మా సీత కక్కి గదులు.

పెద్దింట్లో మీద మీద సీత కక్కి గది ముందు ఎడమవైపు నుంచి : పద్మ పిన్ని, సావిత్రత్తయ్య, సీత కక్కి, సుశీల పిన్ని, లాలస(చంటి పిల్ల)

                          

 వెనక భాగంలో స్టోర్ రూమ్ ఉండేది. అక్కడ ఐస్ తయారు చేసే ప్రత్యేకమైన ఒక బాక్స్ ఉండేది. పైన టెర్రస్ రెండు భాగాలుగా ఉండేది. ఎడమవైపు మెట్లు దిగగానే టెర్రస్ ఉండేది. అక్కడ నిలబడి చూస్తే పంజాబీ వారి ఇల్లు, అమ్మాణమ్మగారి ఇల్లు కనిపిస్తుండేది. టెర్రస్ చివర వాష్ రూమ్స్ ఉండేవి. కిషోర్ బావ ఈ వాటర్ ట్యాంక్ మీదకెక్కి మామిడి కాయలు కొస్తుండేవాడు. ఆ సాహసం మేమెవ్వరం చేసేవాళ్ళం కాదు. టెర్రస్ పైభాగానికి వెళ్ళడానికి మెట్లు ఉండేవి కావు. మా పెద్ద అన్నయ్య(శివరావు), చిన్న అన్నయ్య ప్రశాంత్ , కిషోర్, వీళ్లంతా ఎంతో  ధైర్యంతో అక్కడ ఉన్న సిమెంట్ స్తంభాలు పట్టుకుని మిద్దె మీదకు వెళ్లి అక్కడ పతంగులు ఎగిరేస్తుండేవాళ్లు. ఇప్పుడు నేను రాసిన సంగతులన్నీ కూడా మా తాతగారుపోయినాక జరిగినవి. ఆయన 16  జూన్ 1900  లో జన్మించారు . 21 . 06 .1952  లో పరమపదించారు. 

ఉమ్మడి కుటంబం - బాధ్యతలు 

చాలా ఏళ్ళ వరకు మా తాతగారు వారి అన్నయ్య జగన్నాథ రావు గారు కలిసే ఉండేవారు. అమ్మమ్మ తాలూకు వారందరూ కూడా హైద్రాబాదు లోకే మకాం మార్చారు. మా పెద్ద తాతగారి కుటుంబ సభ్యులందరూ కూడా మా తాతగారి మీదే   ఆధారపడి ఉండేవారు.మా సీత కక్కికి పోటీగా మా పెద్ద కక్కి వాళ్ళ తమ్ముళ్ళందరినీ హైద్రాబాదు కి పిలిపించుకుంది. వీళ్లందరి భారమంతా మా తాతగారిదే. ఆ తర్వాత హైదరబస్తీ లోని ఇంటిని వారి అన్నగారికి రాసి ఇచ్చారు. వారి పిల్లలందరినీ కూడా మా తాతగారే చదివించి స్థిర పరచారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు. పెద్ద తాతగారైన జగన్నాథ రావు గారికి ఇద్దరు మగపిల్లలు . పెద్దబాబు మామయ్యా అని పిలుస్తాం.

                     

 పెద్ద కక్కి(వల్లూరి పెద్ద తాతగారి భార్య) తో మా నాన్నగారు, అమ్మ,వేదమ్మ పిన్ని, అశోక్ మామయ్య, సుశీల పిన్ని, చందన్, పెద్ద తాతగారి పిల్లలు, మాచెల్లెలు రమణి, మాలతి (పద్మ పిన్ని కూతురు), ఆ చిన్న పిల్లలంతా మా వేదమ్మ పిన్ని మనుమలు

ఈయనని మా తాతగారు S.B.H లో చేర్పించారు. బుచ్చి బాబు మామయ్యని R.T.C ఫైనాన్స్ మేనేజర్ గా ఉద్యోగం వేయించారు. కుమార్తెలు వరుసగా రామ్ పిన్ని, రాధమ్మ పిన్ని, లలిత పిన్ని, కృష్ణ పిన్ని. ఇందులో రామ్ పిన్నిని ఆరుగొలను మాస్టారు గారు నండూరి రామచంద్ర రావు గారి పెద్ద కుమారుడైన నండూరి శ్రీ రామ్ మూర్తి గారికి ఇచ్చి వివాహం చేశారు.

 రజాకారు ఉద్యమం

నిజాం నవాబు తన సంస్థానాన్ని భారత దేశంలో విలీనమడానికి ఒప్పుకోలేదు. నిజాం సంస్థానంలో హిందువులు అధిక శాతం. హిందువులందరినీ ఒక పథకం ప్రకారం గా చంపాలని "కాసిం అలీ రజ్వి" అనేవాడు నిజాంని రెచ్చగొట్టాడు. నిజాం అప్పటికే పాకిస్థాన్ ని సహాయం అర్థించాడు. అందుకు పాకిస్తాన్ ప్రభుత్వం తన నిస్సహాయతను ప్రకటించింది. చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు అప్పటి గృహమంత్రి శ్రీ సర్దార్ వల్లభ్ పటేల్ గారికి, ప్రధాన మంత్రి నెహ్రు గారికి తమని కాపాడమని ఎన్నో ఉత్తరాలు రాశారు. స్వామి  రామానంద తీర్థ, కమ్యూనిస్ట్ నాయకులు గ్రామ గ్రామాలు తిరిగి విప్లవాగ్నిని ప్రజ్వలించారు. లక్షలాది హిందువులని , మహిళల పై అత్యాచారాలు చేయటం, గ్రామాలు తగలబెట్టడం ఇవన్నీ కూడా కాసిం అలీ రజ్వి నాయకత్వంలో తెలంగాణా అంతా భగ్గుమంది. దీనినే రజాకార్ మూవ్మెంట్ అంటారు. ఇటువంటి భయంకర పరిస్థితులలో మా తాతగారిని నిజాం సంస్థానంలో ఉన్న అధికారులు ,"జడ్జీ సాహెబ్ ! ఆప్ జనానా కో బాహర్ భేజియే ! మామలా గంభీర్ హై ఇదర్ !" అని సలహా ఇచ్చారు. అప్పుడు మా తాతగారు మొత్తం కుటుంబ సభ్యులని ట్రైన్ లో విజయవాడ పంపించారు. రక్షణగా నిజాం పోలీసులతో ఒక ఫర్మానా పత్రాన్ని జారీ చేశారు. ప్రత్యేకమైన బోగీ లో రైలు ప్రయాణం సాగింది. గార్లా స్టేషన్ దగ్గరకి వచ్చేసరికి రజాకార్లు దాడి చేయడానికి వచ్చారు. అప్పటికే స్టేషన్లో  పెద్ద సంఖ్యలో నిజాం సైనిక అధికారులు ఒక హెచ్చరిక జారీ చేశారు. నిజాం గారి ఉత్తరువు వినిపించారు. వారందరూ వెంటనే వెళ్లి పోయారు. అందరూ  ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా రైల్లోని ప్రయాణీకులందరూ రక్షించ బడ్డారు.తాతగారు విజయవాడ పున్నమ్మ తోటలో ఒక బంగళా కొన్నారు. బంగళాకి రెండువైపులా రోడ్డు. హైద్రాబాదు లో అల్లర్లు తగ్గేవరకూ అందరూ అక్కడే ఉన్నారు. ఆ బంగళాని తర్వాత అమ్మేశారు. 

         మా తాతగారు  నిజాం దర్బారులో  చీఫ్ జస్టిస్ గా నియమించ బడ్డారు. ఆ ప్రోటోకోల్ చాలా గమ్మత్తుగా ఉంది. మా తాతగారు షేర్వానీ, పైజామా, రూమీ టోపీ పెట్టుకుని, ఒక పళ్లెంలో వెండి రూకలు, దానిపైన ఒక సిల్క్ బట్ట కప్పి,రాజ దర్బారుకి వెళ్ళాలి. దీన్ని నజరానా అంటారు.  వేదిక దగ్గరగా వెళ్లి సిద్ధంగా ఉండాలి. నిజాం నవాబు గారు రెండు చేతులు వెనక్కి కట్టుకుని పచార్లు చేస్తూ ఈ నజరానని స్వీకరిస్తారు. ఆయన అధికారులు నియామక (అప్పోయింట్మెంట్ లెటర్) ఉర్దూ భాషలోనే రాసి ఇస్తారు. ఆ పత్రం తీసుకుని నవాబు గారికి వీపు చూపించకుండా వెనక్కి వెనక్కి నడుచుకుంటూ ఆ దర్బారుని విడవాలి.ఈ విధంగా మా తాతగారు ఆ అధికార పత్రాన్ని స్వీకరించారు. అప్పుడు చాలామంది తెలుగు ప్రముఖులు అందరూ , " అదేమిటండీ ! తెలుగువారై నిజాం దగ్గర ఎందుకు పని చేస్తున్నారు? అని ప్రశ్నించారు. “చూడండి ! నాకు పదవి వ్యామోహం ఏమీ లేదు. నా ప్రైవేట్ ప్రాక్టీస్ తో నెలకు నేను పదివేల (10,000 సిల్వర్ కాయిన్స్)వెండి రూకలు సంపాదించుకుంటున్నాను. ఇక్కడ నాకు కేవలం 4000 వెండి రూకలు మాత్రమే ఇస్తున్నారు, కాకపోతే ఇంత పెద్ద హోదాలో ఉన్న నేను మీ అందరికీ సహాయం చేసే స్థితిలో ఉన్నాను” అని సమాధానం చెప్పారు. మా తాతగారికి ఉర్దూ, అరబ్బీ, పర్షియా భాషలలో చాలా ప్రావీణ్యం ఉంది. ఆయన హొలీ ఖురాన్ గ్రంథాన్ని అరబ్బీ భాషనుండి ఇంగ్లీష్ భాష లోకి అనువాదం చేసారు. ఆ పుస్తకం ఖరీదైన అట్టతో, పేజీల చివర బంగారు రంగులతో ఉండేది. ఒక సిల్క్ తాడు బుక్ మార్క్ గా ఉండేది. అది నేను నా చిన్నతనం లో చూసాను. కోర్ట్ లావాదేవీలన్నీ కూడా ఉర్దూ భాషలోనే ఉండేవి. ఇవన్నీ కూడా మా తాతగారు చదివి, అర్థం చేసుకుని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసేవారు. ఎందుకంటే న్యాయ శాస్త్రం Law books ఇంగ్లీష్ లో ఉండేవి. మా అశోక్ మామయ్య, మా అమ్మ గారు ఉర్దూలో మాట్లాడేవారు. నాకు గుర్తు ఉన్నవి, మా అమ్మ, సీత కక్కి, అశోక్ మామయ్య, మా ఆన్నయ్యలు ఈ విషయాలన్నీచెప్తుంటే మా అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. ఇంతటి మహానుభావుడు, ధర్మపరాయణుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మా తాతగారి జీవితం 21 జూన్ 1952 వ సంవత్సరంలో ముగిసింది. అప్పటికే మా అశోక్ మామయ్య లా కోర్స్ పూర్తి చేసారు.

                                                         అధ్యాయం 5

మా సీత కక్కి సాహసకృత్యాలు       

                                  

 మా  సీత కక్కి కుటుంబ నేపథ్యం లోగడ చెప్పాను. రొయ్యూరు లో అన్న (అచ్యుత రామయ్య) దగ్గర వీధి బడిలో చదువుకుంది. అప్పట్లో భారతం, భాగవతం విధిగా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సీత కక్కి చలాకీగా, హుషారుగా ఎన్నో కథలు, సామెతలు, పద్యాలు పాడుతూ చక్కగా అభినయం చేస్తుండేది. తన పెద్ద గోద్రెజ్ అల్మారాలో ఎన్నో తిను బండారాలు గాజు సీసాల్లో పెట్టుకునేది. మా తాతగారు ఉన్న రోజుల్లో చేతిలో పుష్కలంగా డబ్బు ఉండేది. ఒంటినిండా బంగారు నగలు, చంద్రహారం, రవ్వల గాజులు, బంగారపు గాజులు ఇలా ఎన్నో నగలు వేసుకుని ఠీవిగా కారులో బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి వెళ్లి వస్తుండేది. తాతగారితో పాటు ప్రముఖుల ఇళ్ళకి వెళ్ళటం, వారితో సమానంగా అనేక విషయాలు మాట్లాడటం చేస్తూ, తెలుగు, హిందీ, ఉర్దూ ధారాళంగా మాట్లాడేది. మాడపాటి హనుమంత రావు, బూర్గుల రామకృష్ణా రావు గారు తరచూ వారి వారి కుటుంబాలతో వస్తూ పోతుండేవారు. సాధువులు, సన్యాసులు, రచయితలు, రాజకీయ నాయకులు ఇలా ఎంతోమంది వస్తూ పోతుండే వారితో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. అజమాయిషీ అంతా మా సీత కక్కిచేస్తూ ఉండేది. 

వెనుక వరుసలో; కామేశ్వర బాబాయ్ గారు, సుశీల పిన్ని(కుటుంబం)

శశి, శ్రీదేవి.(అల్లుడు,కూతురు) కార్తీక్ నందన్, ఉమ, విజయ్(మనమడు, కోడలు,కొడుకు)

          

దొంగల కథ 

బేగంపేట ఇంట్లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బంగళా చుట్టూ పెద్ద ఆవరణ, అందులో బోలెడన్ని మామిడి చెట్లు ఉండేవి. మా సీత కక్కి ఒకసారి రాత్రిపూట తల నొప్పితో బాధపడుతూ అమృతాంజనం బాగా తలకు రాసుకుని, తలా చుట్టూతా బట్ట కట్టుకుని, నిద్ర పట్టక, గదిలో పచార్లు చేస్తుంటే బయట ఏదో అలికిడి వినిపించింది. కిటికీ లోంచి చూస్తే ముగ్గురు దొంగలు మామిడికాయలు కోస్తూ కనిపించారు. అంతా నిర్మానుష్యంగా ఉండాలి. చుట్టుపక్కల జనసంచారం ఉండేది కాదు. మా కక్కి నెమ్మదిగా, చప్పుడు చేయకుండా టార్చి లైటుని పట్టుకుని , చాలా ధైర్యంగా, దొంగలకు కనిపించకుండా వారి వెనక నీడలో నిశ్శబ్దంగా నుంచుంది. ఆ రోజు చౌకీదారు రాలేదు. దొంగల్లో  ఒకడు చకచకా కాయలు  కోసి కింద పడేస్తుంటే, కింద ఉన్న ఇద్దరు దొంగలు అవి బస్తాల్లో నింపుతున్నారు. బస్తాలు నిండడం చూసి హఠాత్తుగా కక్కి టార్చిలైటు వేసి, "ఒరేయ్ ! చాలా కష్ట పడ్డావు. ఆవకాయకు సరిపడా కాయలు కోశారు. ఇక చాలు  దిగు అని గట్టిగా అరిచింది. అంతే కాకుండా “చోర్ ! చోర్!పకడో!  పకడో ! ఏ  రాంసింగ్ ! కహా మర్ గయా?”

“జల్దీ ఆవో !” అని గట్టిగా అరిచేసరికి  హడలిపోయిన దొంగ  ఒక్కసారి అమాంతంగా కింద పడ్డాడు. ఒకడికి కాలు బెణికినట్టుంది; కుంటుకుంటూ పారిపోయాడు. అంతకుముందే ఇంకొక దొంగ కూడా మాయమై పోయాడు. ఆ మరుసటి రోజు ఆ మామిడికాయలు ఇంట్లోకి తెచ్చి చక్కగా ఊరగాయలు పెట్టుకున్నారు. ఇది నిజంగానే ఒక సాహసకృత్యమే.ఎందుకంటే చుట్టుపక్కల దగ్గరలో ఎటువంటి ఇల్లు కూడా లేవు. మా కక్కి హావభావాలతో నవ్వు వచ్చేవిధంగా చెప్తూ ఉండేది. ఒరేయ్ సాయిరాం ! నా గురించికథలు రాయరా అని ఎప్పుడూ చెప్తుండేది. అందుకనే కాబోలు నాచేత రాయించుకుంటుంది ఇప్పుడు. నిజానికి రాసేది మా చెల్లలు సూర్యలాలస, చెప్పేది నేను. ఈ కథ మా ఇంట్లో అందరికీ తెలుసు.

రెండవ సాహసం : ఒకసారి మా తాతగారిని బెంగళూరు హాస్పిటల్ లో చేర్పించారు. అది నిర్మానుష్యమైన ప్రదేశం లో ఉండాలి. హాస్పిటల్ కి కొంచెం దూరం లో ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో కక్కి ఉండేది. తనతో పాటు మా అమ్మ కూడా ఉండాలి.  మా తాతగారికి మా అమ్మ అంటే చాలా ప్రేమ. రోజూ కక్కి, మా అమ్మ తాతగారిని చూడడానికి హాస్పిటల్ వెళ్లడం ఎవరో ఇద్దరు దొంగలు బహుశా గమనించి ఉంటారు. ఆ రోజూ చీకటి పడింది. ఇద్దరూ హాస్పిటల్ నుంచి బయటకి ఆలస్యంగా వచ్చి గెస్ట్ హౌస్ వైపు వెళ్ళుతున్నారు. మా కక్కి కి  కూడా ఆ ఇద్దరు వ్యక్తుల మీద అనుమానంగా ఉండింది. ఆ ఇద్దరు దొంగలు వారిద్దరినీ వెంబడించి సాగారు.  మా కక్కి చాకచక్యంగా ఒంటిమీద నగలన్నీ కనపడకుండా దాచుకుని , జుట్టు విరబోసుకుని , పకపకా నవ్వుతూ , పిచ్చిదానిలాగా అరుపులు, కేకలు పెట్టుతూ, మట్టి తీసి వాళ్ళ మీద విసిరి కొడుతూ చాలా అద్భుతంగా, నిజంగా పిచ్చిదాని లాగా నటించింది. మా కక్కి పెట్టిన అరుపులకి, కేకలకి భయపడి వీళ్ళు పిచ్చి వాళ్ళని నిర్ధారించుకుని

                                                             

                           సావిత్రత్తయ్య, ఖడ్గ మాల, సీత కక్కి పెద్దింట్లో

పారిపోయారు. ఇలాగే ప్రవర్స్తిస్తూ మా కక్కి, అమ్మ ఇద్దరూ గెస్ట్ హౌస్ చేరుకుని పదే పదే ఆ సంఘటనని తలుచుకుని నవ్వుకున్నారు. కచేరీ హాలులో మా కక్కి అందరి ముందు ఈ పాత్రకి రక్తి కట్టించింది. మా పినతల్లులు, మేము, అందరమూ వింటున్నప్పుడు ముందు భయపడ్డా, ఆ తరువాత పగలబడి నవ్వాo.

 మూడవ సాహసం : అది పెన్షన్ సంపాదించుకోవడం : కార్య దక్షత 

ఎవరూ ఊహించలేనంత అసాధ్యమైన పనిని మా సీత కక్కి సాధించింది. మా తాత గారు వల్లూరి సూర్య నారాయణ రావు గారు 21  జూన్ 1952  లో దేహం చాలించారు. మరి మా కక్కికి పెన్షన్ రావలసి ఉన్నది. కానీ వేరే ఇతరత్రా కారణాల వల్ల ఎవరూ దానిని పట్టించుకోలేదు. మరి మా కక్కికి కూడా ప్రోసిజర్ అవగాహన లేదు. ఒక్క సారిగా అశోక్ మామయ్య మీద ఎన్నో సంసార బాధ్యతలు పడ్డాయి.ముగ్గురు చెల్లెళ్ళ, తమ్ముడి చదువు, పెళ్లి బాధ్యతలు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఒక్కడు కష్ట పడి  సంపాదిస్తే ఎటువంటి పనీ పాటా చేయకుండా తినే వాళ్ళు ఎక్కువ ఉండేవారు. పైగా ఎంతో  కొంత  ఈర్ష్యాసూయలతో తమని సరిగ్గాచూసుకోవటం లేదని వంకలు పెడుతుండే వారు. ఎన్ని ఏళ్ళైనా పెన్షన్ రాలేదని తెలిసి ఒక ప్రముఖుడు ఆశ్చర్య పడ్డాడు. ఆ ప్రొసీజర్ అంతా వివరించి చెప్పాడు. మా కక్కి కార్య రంగంలోకి దూకింది. బంధువులందరూ నిరుత్సాహ పరిచారు. ఎక్కడో అట్టడుగున ఉన్న ఫైల్ ఎవ్వరూ తీయరు. పైగా ఆ ఫైల్ ఉందో లేదో కూడా తెలియదు. ప్రభుత్వం లో నీతి, నిజాయితీ ఉన్నవాళ్లు ఏనాడో మటుమాయమై పోయారు. మనిషికి పదవి, సంపాదన ఉన్నప్పుడే గౌరవిస్తారు. చుట్టూ మూగుతారు. అది లేకపోతె దగ్గరి బంధువులు కూడా పట్టించుకోరు, లెఖ్ఖ చేయరు. కానీ కార్య దీక్ష , ఆత్మ విశ్వాసం ఉన్న వాళ్ళు  తాము అనుకున్న దాన్ని సాధిస్తారు.మా అమ్మమ్మ దాదాపు ఎన్నో సంవత్సరాలు చెప్పులు అరిగేలా సచివాలయం చుట్టూ తిరిగింది చివరి సారిగా తెగించి ముఖ్య మంత్రి గారిని కలిసే ప్రయత్నం చేసింది. అడ్డు వచ్చిన అధికారులను తోసి పారేసింది. ముఖ్య మంత్రి గారితో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో అనర్గళంగా తన వాదనతో మెప్పించింది. ఆయన ముందుగా మా కక్కిని శాంత పరచి, కుర్చీలో 

                      

కూర్చో పెట్టి, మంచినీళ్లు, కాఫీని ఇప్పించి చాలా ఓపికగా విన్నాడు. పెద్ద పెద్ద అధికారులందరూ చేతులు కట్టుకుని వింటున్నారు. వారం రోజుల తర్వాత రమ్మని చెప్పారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పారు. మా అమ్మమ్మ శాంతించింది. అప్పుడు వారే కారిచ్చి ఇంట్లో దింపారు. ఒక రెండు రోజులు మా కక్కి ఆయాస పడుతుండేది. అప్పటికే ఇంకా మా తాత గారికి ఎంతో పరిచయమున్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ముఖ్య మంత్రి గారు మా తాత గారికి సంబంధించిన భోగట్టా అంతా సేకరించారు. ఇంత నిజాయతీ పరుడు, ధర్మాత్ముడు , అందులో తెలుగువారి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ప్రభుత్వపు కారులో మా సీత కక్కి, అశోక్ మామయ్యా వెళ్లారు. వారికి ఘన స్వాగతం లభించింది. అంతకు ముందు వేధించిన అధికారులందరూ క్షమాపణలు చెప్పుకున్నారు. ముఖ్య మంత్రి గారు మా కక్కికి నమస్కారం చేసి వెంటనే పెన్షన్ వచ్చే విధం గా ఉత్తరువు  జారీ చేశారు. అప్పటికే మా కక్కి అధికార లాంఛనాలన్నీ ముందుగానే పూర్తి చేసి ఇచ్చినందు వల్ల, అప్పటికప్పుడే కక్కి సంతకాలు తీసుకున్నారు. పెన్షన్ ఎరియర్స్ తో సహా వచ్చి, అప్పట్నుంచి ప్రతి నెలా మా అమ్మమ్మకి పెన్షన్ రావటం మొదలయ్యింది. ఈ విధంగా మా కక్కి అసాధ్యాన్ని సాధ్యం చేసింది. ఇప్పటికీ కూడా ఈ సంఘటనని మా కక్కి గుర్తు వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటనే మా అత్తగారు కీ.శే.మంత్రిప్రగడ కనకదుర్గాoబ గారు కూడా ఎంతో పోరాడి,  తన భర్త పెన్షన్ ని సంపాదించుకున్నారు. ఆ పెన్షన్ డబ్బులన్నీ కూడా పిల్లల కోసమే ఖర్చు చేశారు. నేను మా వృత్తి రీత్యా ఈస్ట్ ఆఫ్రికా లో కెన్యా, ఉగాండా, టాంజానియా దేశాల్లో వందల కొద్దీ గ్రామాలు తిరిగాను. నా ఉద్దేశం లో ఒక మహిళ కుటుంబానికే ఒక బలమైన మూల స్తంభం. కుటుంబం లో చదువు సంస్కారాలు సకారాత్మకమైన (పాజిటివ్  థింకింగ్) ఆలోచనా విధానం, ఒక బలిష్టమైన వ్యక్తిత్వం వారి అనుభవాల పునాదుల మీద నిర్మించబడుతుంది. నా జీవితం లో ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు

                               

                             సీత కక్కి, సావిత్రత్తయ్య, ఖడ్గ మాల, పెద్దింట్లో

నాలో కలిగే నిర్వేదన (డిప్రెషన్) మా అమ్మమ్మ, అమ్మ, మా అత్త గారు, ఈ ముగ్గురి కార్య దక్షత కి సంబంధించిన ఇటువంటి సంఘటనలు గుర్తు తెచ్చుకుంటే వెంటనే నాలో ఒక నూతన ఉత్సాహాం, ఆత్మ విశ్వాసం  కలిగేవి. మా అమ్మ సంగతి ప్రత్యేకంగా చెప్తాను. మా పెద్దబ్బాయి లాహిరి కాంత్ స్వీడన్  లో ఎం. ఎస్ . బయోటెక్నాలజీ చేసాడు. నేను టాంజానియా నుంచి వీడియొ చాట్ చేస్తుండేవాడిని. అక్కడ వాతావరణం మైనస్ లో ఉంటుంది. దాని వల్ల ఆత్మహత్యలు సర్వ సాధారణం. వాడికి ఎప్పుడు డిప్రెషన్ కలిగినా,  వెంటనే ఈస్ట్ ఆఫ్రికా లో నా లోన్లీ లైఫ్  వాడికి ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ గా ఉంటుంది అనేవాడు. అంటే మన పిల్లలందరూ కూడా మన వ్యక్తిత్వాలని చిన్నప్పట్నుంచీ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారన్న మాట. అందుకనే మనం మన పెద్దవారి వ్యక్తిత్వం లోని ఇటువంటి విషయాలని మన భావితరo వారికి తప్పకుండా చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అంతు ఉండదు. ఇది కేవలం చాలా సంక్షిప్తం. ఇవి మా అమ్మమ్మ సాహసకృత్యాలు .

                                                 అధ్యాయం 6

మా నాన్నగారు నండూరి శ్రీ రామారావు గారి జీవిత విశేషాలు.  

మా నాన్నగారి పేరు  నండూరి  శ్రీ రామారావు. వారి నాన్నగారు నండూరి శివరావు గారు, ఈయన మా ముత్తాత వరాహ లక్ష్మి నరసింహం గారి పెద్ద కుమారుడు. ఆరుగొలనులో దాదాపు చాలా మంది నండూరి  

                   

1956 లో జనగామలో డాక్ బంగళా లో తీసుకున్న ఫోటో అప్పుడు మా విజ్జి చంటి పాప

చిన్న అన్నయ్య విజ్జిని ఎత్తుకున్నాడు పక్కన పెద్ద అన్నయ్య క్రింద వరుసలో అక్కయ్య, లాలస, సాయిరాం

 నండూరి వారే ఉండే వారు. అక్కడ ఆరు కొలనులు ఉండేవి  కాబట్టి ఆరుగొలను అనే పేరు వచ్చింది అని మా నాన్నగారు చెప్పుతుండేవారు. మా ముత్తాత గారికి కరణీకం ఉండేది. ఆ రోజుల్లో కరణీకం అంటే చాలా పెద్ద హోదా, పలుకుబడి, గౌరవం ఉండేది. ప్రతిభ ఉన్నవాళ్లు, తెలివితేటలూ, జీవితంలో పైకి రావాలనే దృఢసంకల్పం ఉన్నవారు చాలా మంది నండూరి వారు బయటకి వెళ్లి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. నండూరి రాంమోహన్ బాబాయ్ గారు, పార్థు  బాబాయిగారు, నర్సు బాబాయ్ గారు, మల్లు బాబాయ్ గారు, రామచంద్ర రావు తాతగారి కొడుకులైన నండూరి శ్రీ రామ మూర్తి బాబాయ్ గారు, నండూరి సుబ్బారావు బాబాయ్ గారు, కృష్ణ మూర్తి బాబాయ్ గారు, డాక్టర్ బాబాయ్, ఇలా చాలా మంది ఆరుగొలనుకి ఒక గుర్తింపు తెచ్చారు. దీనికి  మా తాతగారు శ్రీ కారాన్ని చుట్టి వీరందరికి ప్రేరణ ఇచ్చారు. వీరందరికి స్ఫూర్తినిచ్చిన మా తాతగారు అంటే మాకు దైవంతో సమానం.మా  తాతగారు కలకత్తా లో L.C.P.S (లైసెంటిట అఫ్ ది కాలేజీ అఫ్ physicians అండ్ surgeons)  ఈ కారణం వల్ల మా తాత గారు కలకత్తా వెళ్ళటం జరిగింది. అక్కడ చాలా హై స్టాండర్డ్ ఉన్నత విద్య బోధించ బడింది. వీరికి సర్జరీలు కూడా చేసే ప్రావీణ్యం, అర్హత ఉంటుంది. 

మా నాన్న గారి జీవితాన్ని రెండు భాగాలుగా చెప్ప వచ్చును.మొదటి భాగం : మా తాత గారు తన తండ్రి నుంచి ఎటువంటి ప్రోత్సాహం కానీ ఆర్ధిక సహాయం లేకుండానే చాలా కష్టపడి చదువుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మా తాత గారు తన వివరాలన్నీ చెప్పి కొంత డబ్బు కావాలని ముత్తాత గారిని అడిగినప్పుడు  ప్రామిసరీ నోటు మీద సంతకం తీసుకుని డబ్బు అప్పుగా ఇచ్చారు. మా తాత గారు అప్పు తీర్చి వేసి ఆ ప్రామిసరీ నోటుని చింపి వేశారు. మా తాత గారు గుడివాడ లో ప్రాక్టీస్ పెట్టగానే చుట్టూ పక్కల గ్రామాల నుండి వందలాది రోగులు వస్తుండే వారు. క్షణం తీరిక లేకుండా ఉండేదిట. గుడివాడలో ఎన్నో స్థిరాస్తులు సంపాదించారు.  మా ముత్తాత గారి పొలాలు చాలా వరకు వివాదాల్లో ఉండేవి కానీ మా తాత గారి భూములు వివాదరహితమైనవి అని పెద్దలు తెలిపారు. అయితే మా ముత్తాత గారు పదే పదే చెప్పి ఆయన సంపాదించిన స్థిరాస్తులన్నీ ఉమ్మడి ఆస్తిగా మార్చి, వరాహ లక్ష్మి నరసింహం గారి పేరు మీదా కలిపేసుకున్నారు. కరణీకాన్ని కూడా తమ్ముడి కోసం వదులుకోమని చెప్పారు. మా  చిన్న తాతగారు, మా తాతగారు చాలా అభిమానంగా, ప్రేమగా ఉండేవారు. తమ్ముడి కుటుoబాన్ని తన కుటుంబoగానే భావించే వారు. మా చిన తాతయ్య చాలా సంస్కార వంతుడు . అన్నదమ్ములిద్దరూ కూడా తండ్రకి ఎదురు చెప్పే వారు కాదు. అందుకని మా తాతగారు తాను సంపాదించిన స్థిరాస్తులన్నీ కూడా తండ్రికి అప్ప చెప్పారు. అయితే మా తాత గారు శివ రావు గారు గూడూరు మైకా గనుల్లో అధిక మొత్తం లో బాగస్వాములని నమ్మి చాలా డబ్బుని ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు, ఆ భాగ స్వాములు మా తాత గారిని ఒప్పించి వాళ్ళు ఎంతో డబ్బు అప్పుగా తెచ్చి , దానికి తాత గారిని జామీనుగా (guarantor) సంతకాలు చేయించు కున్నారు. మా తాత గారు బ్రతికి ఉన్నంత కాలం ఎటువంటి సమస్యలు రాలేదు.      


                                      

 అమ్మా నాన్నలతో మేము ఎనిమిది మంది పిల్లలంవెనుక నిల్చున్నవారిలో : నాన్నగారి వెనుక ప్రశాంత్ అన్నయ్య, ప్రసన్న అక్కయ్య, శివరావు అన్నయ్య,నాన్నగారి ఒడిలో దుర్గ, అమ్మ ఒడిలో రమణి. కూర్చున్న వారిలో సాయిరాం, మధ్య విజయలక్ష్మి, సూర్య లాలస

                       మా నాన్న గారు శ్రీ రామారావు గారిని బందరు హిందూ కాలేజీ లో ఇంటర్ చదివించాక వైజాగ్ మెడికల్ కాలేజీ లో చేర్పించారు. మా నాన్న గారు చాలా  దర్జాగా రాజా కుమారుడి లాగ పెరిగారు. హిందూ కాలేజీ లో లాన్ టెన్నిస్ , హాకీ, బ్యాడ్మింటన్ , క్రికెట్, వీటిల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. జనగామ వచ్చిన కొత్తలో మా నాన్న గారు లాన్ టెన్నిస్ ఆడేవారు. మా నాన్న గారి అక్కయ్య సీత , చెల్లెల్లు స్వరాజ్యం, శాంతలకి  మా నాన్న గారంటే అమితమైన ప్రేమ. ఆయన ఎంతో అందంగా ఉండే వారు. ప్రతి రోజు తాలిమ్ ఖానా (జిం) వెళ్లడం, కర్ర సాము సాధన చేయడం, కాలువల్లో రాఘవరావు మామయ్యా గారి తో ఈతలు కొట్టడం, సర్వ సాధారణం గా జరుగుతుండేవి. అదృష్టం ఏమిటంటే నేను కూడా మా తాత గారు, నాన్న గారు చదువుకున్న హిందూ కాలేజీ లోనే P.U.C చదువు కున్నాను. ఆ ఏడాది బచ్చు పేట, కంసాలి కోటయ్య వీధిలో, బందరులో మా స్వరాజ్యం అత్తయ్య ఇంట్లో ఉన్నాను. నేను కూడా కాలేజీ క్రికెట్ టీం లో సెలెక్ట్ అయ్యాను. అప్పటికి నాకు పదహారేళ్లు . ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ , స్లో పేస్, బౌలింగ్ చేసే వాడిని. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్లిప్ ఫీల్డింగ్ చేసే వాడిని. మిడిల్ ఆర్డర్ బాట్స్మన్ ని, చాలా అద్భుతంగా ఆడేవాడిని. కానీ స్వరాజ్యం అత్తయ్య , " ఏరా! చంటీ ! నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చదువుకోవడానికా?  లేక  ఆడుకోవడానికా?´’ అని నిల దీసి నప్పుడు మళ్ళీ నేను క్రికెట్ జోలికి వెళ్ళ లేదు. మా నాన్న గారికి తండ్రి గారు బ్రతికి ఉన్నంత కాలం కష్టాలంటే ఏమిటో తెలియదు. 

మా అమ్మ వల్లూరి  శ్రీ రాజ రాజేశ్వరి గారి తో వివాహ నిశ్చయం 

                                         

ఎక్కడో మారు మూల చిన్న కుగ్రామం ఆరుగొలను. ఆరుగొలను లో మా నాన్న గారు, మహా పట్టణమైన హైదరాబాదు లో మా అమ్మ గారు ఎలా కలిశారు? చాలా ఆశ్చర్యం ! అసలేం జరిగిందంటే?

ఆరుగొలను లోని వారందరూ మాకు తాతయ్యలు, బాబాయిలు, పెద్ద నాన్న గార్లు, అందరి తో ఏదో విధం గా సంబంధం ఉంది.  ఆరుగొలను లో నండూరి రామ చంద్ర రావు తాత గారి పెద్ద కొడుకు నండూరి శ్రీ రామ్ మూర్తి గారికి హైద్రాబాదు సంబంధం  కుదిరింది. ఈయన స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ లో పని చేస్తుండే వాడు. ఈయన తమ్ముళ్లే నండూరి సుబ్బా రావు బాబాయ్, కృష్ణ మూర్తి బాబాయ్. పెళ్లి కూతురు ఎవరంటే మా పెద్ద కక్కి  అంటే మా సీత కక్కి తోటి కోడలి పెద్ద కూతురు. రాo పిన్ని అంటాం. మా పెద్ద కక్కి గుండ్రటి ముఖం తో ఎప్పుడు గల గలా మాట్లాడుతూ ఉండేది. మా రాo పిన్ని పొడుగ్గా, గుండ్రటి ముఖం తో చాలా అందంగా ఉండేది. మా రాo పిన్ని కూతుళ్లు స్వర్ణ అక్కయ్య, శ్యామల, సుధా, వరలక్ష్మి, అందరూ చాలా అందంగా ఉంటారు. స్వర్ణ అక్కయ్య తర్వాత S B H లో పని చేసింది. ఈ పెళ్లి కోసం ఆరుగొలను నుండి మా బంధువుల తో పాటు మా తాత గారు నండూరి శివరావు గారు, మా నాన్నగారి తో పాటు హైదరాబాద్ వచ్చారు. ఆ పెళ్లి లోనే మా తాత గారు, మిగిలిన పెద్దలందరూ మా అమ్మని చూసి ముచ్చట పడ్డారు. మా దగ్గరి బంధువులు మా ఇద్దరి తాత గార్ల తో పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చారు. అందరూ ఈ సంబంధానికి ఇష్ట పడ్డారు. అయితే మా సూర్య నారాయణ తాత గారికి, మా నండూరి తాత గారి పేరు ప్రఖ్యాతులు, ఆస్తి పాస్తుల వివరాలన్నీ ఆరుగొలను లో ఉన్న పెద్దవాళ్ళు, మధ్యవర్తులు గొప్పగా చెప్పారు. మా సూర్య నారాయణ తాత గారు మా శివ రావు తాత గారితోటి ఎంతో వినయంగా , " ఏమండీ ! శివ రావు గారూ ! మీ అంతస్తుకి, మీ హోదాకి మేము తూగ గలమా?" అని సందేహాన్ని వెలిబుచ్చారు. దీనికి సమాధానం గా మా తాత గారు ఎంతో వినయం గా "మీరు విన్న మాట నిజమే. కానీ ప్రస్తుతం నా ఆర్ధిక లావాదేవీల్లో చిక్కు సమస్యలు ఉన్నాయి. మీరు నా సంపాదన చూసి  మీ అమ్మాయిని  మా ఇంటి కోడలిగా చేయ వద్దు. మా అబ్బాయి వైజాగ్ మెడికల్ కాలేజీ లో మెడిసిన్ కోర్స్ లో చదువుతున్నాడు. ఇందుకు ఇష్టమైతే మీరు ఈ సంబంధం ఒప్పుకోండి." అని చెప్పారు. మా తాతగారి నిజాయతీ, ఆయన సంస్కారాన్ని మెచ్చుకుని మా సూర్య నారాయణ తాత గారు ఈ సంబంధం ఖాయం చేసు కున్నారు. 18 ఏప్రిల్ 1938 న బెల్ దే జగదీశ్వరయ్య గారి రాజభవనం లాటి ఇంట్లో ఐదు రోజులు వైభవోపేతం గా వివాహం జరిగి, వేలాది మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, తాత గారి పెద్ద పెద్ద క్లైంట్స్, తురక వారిలో ప్రముఖులు ఎంతో మంది వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి అయ్యాక కూడా మా బంధువుల్లో కొందరు హైదరాబాదు లోని విశేషమైన ప్రదేశాలు చూడటానికి ఇక్కడే ఉండిపోయారు.

మా చిన్న బామ్మ గారి మంకు పట్టు: మా అమ్మా నాన్నల పెళ్ళికి రావాలంటే నాకు నాలుగు జతల బంగారు గాజులు కొనిస్తే కానీ రానని మా చిన్న బామ్మ  లక్ష్మి నరసమ్మ గారు పట్టుబట్టారు. పాపం మా చిన్న తాత గారి నిస్సహాయ స్థితిని చూసిన మా తాత గారు నాలుగు జతల బంగారు గాజులు మరదలికి కొని పెట్టారు. ఈ విషయం

                   

ఆరుగొలనులో మా నాన్నగారు తన బంధువులతో కలిసి తీసుకున్న ఫోటో

ఎడమవైపునుంచి :నడింపల్లి శేషగిరి రావు గారు నండూరి సుబ్బారావు బాబాయ్ గారికి బావగారు మా నాన్నగారికి బావగారు , మా నాన్నగారు, సుబ్బారావు తాతయ్య గారు మా నాన్నగారికి బాబాయ్, నండూరి నర్సింహారావు బాబాయ్ గారు మా నాన్నగారి తమ్ముడు

స్వరాజ్యం అత్తయ్య , మా రాణి వదినల ద్వారా తెలిసింది. ఇలాంటి తెలియని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అంటే మా తాత గారి దగ్గర ఎంతో చనువు ఉండేది. వీటిని మనం సరదాగానే తీసుకోవాలి. ఇచ్చే వాళ్లనే కదా మనం అడుగుతాం. ఇక్కడ మా తాత గారి మహోన్నతమైన వ్యక్తిత్వం గోచరిస్తుంది. అదే పోలిక మా నాన్న గారికి, మా అందరికీ వచ్చింది. పెళ్లి తరువాత మా నాన్న గారు తన విద్యాభ్యాసం కొన సాగించడానికి విశాఖ పట్టణం వెళ్లి పోయారు. మా నాన్న గారు శెలవులకి హైదరాబాదు మామ గారింటికి వచ్చేటప్పుడు బోల్డంత లగేజీ తో  వచ్చే వారట. అప్పట్లో ట్రంకు పెట్టెలు, హోల్డాలు  వంటివి ప్రయాణం లో ఉపయోగించే వారు. ఒక్కడే కొడుకు కావటం తో తాత గారు చాలా గారాబం గా పెంచారు. ఈ డాబు, ఈ దర్జా అంతా చూసిన మా జడ్జీ తాత గారు , " ఏమే రాజూ ! హై కోర్ట్ జడ్జీనైన నా వద్దే ఇంత హంగామా లేదు. ఇన్ని రకాల చెప్పులు, బూట్లు, సాక్సులు, జేబు రుమాళ్ళు, టైలు , బౌలు, తెల్లటి దుప్పట్లు, సూట్లు", అంటూ ఆశ్చర్య పడుతూ, సరే కానీ ! అల్లుడి గారి జేబు రుమాలు ఒకటి ఇవ్వు అనే వారు. మా నాన్న గారు వచ్చారంటే ఇల్లంతా హడావుడే మా అశోక్ మామయ్యా మా నాన్న గారి కొత్త చొక్కా తొడుక్కుని    " అక్కయ్యా ! ఈ చొక్కా ఎంత బాగుందో చూడు నాకు ", అని హడావుడి చేస్తుండే వాడు. అయితే మా నాన్న గారు ఆ చొక్కాని తిరిగి వాడే వారు కాదు. మామయ్య కే ఇచ్చే వారు. మా నాన్న గారు వాడే వస్తువులన్నీ ప్రత్యేకమైనవి, ఖరీదైనవి ఉండేవిట. ఒక సారి నాన్నగారు గుడివాడ లో చదువుకుంటున్నప్పుడు ఒక ప్రత్యేకమైన బ్లాంకెట్ కావాలని మంకు పట్టు పెట్టారట. మా తాత గారు ఇప్పుడు దుకాణాలన్నీ మూసి వేశారు. రేపు ఉదయం కొని పెడతాను అని చెప్తే మా నాన్న గారు వినలేదు. మా తాత గారు విసుక్కోకుండా అప్పటికప్పుడు ఆ బట్టల వ్యాపారికి ఫోన్ చేసి, దుకాణం తెరిపించి, నాన్నగారడిగిన బ్లాంకెట్ కొని ఇచ్చారు. ఈ రకం గా మా నాన్నగారు తాత గారు బ్రతికి ఉన్నంత కాలం ఒక రాజ కుమారుడి లాగా పెరిగారు. ఆయనకి  కష్టాలంటే ఏమిటో తెలియవు.  కాలం ఎప్పుడూ ఒక్క మాదిరిగా ఉండదు కదా ! మా తాత గారు మరణించే సమయానికి నాన్న గారికి 21 ఏళ్ళు. మెడిసిన్ రెండవ సంవత్సరంలో చదువుతున్నారు. బహుశా ఆ సమయానికి మా నాన్న గారు వేసవి సెలవులకి హెదరాబాదులో ఉన్నారు. ఈ వార్త వినగానే దిగ్భ్రాoతి చెందారు. మిన్ను విరిగి నెత్తి మీద పడినట్లయింది. అప్పట్నుంచి కష్టాలు ఒక్క సారిగా చుట్టు  ముట్టాయి. మా ముత్తాత  వరాహ లక్ష్మీ నరసింహం గారికి ఉమ్మడి ఆస్తి మీద ఉన్నంత ధ్యాస చెట్టంత కొడుకు పోయాడని కానీ అనాథ అయిన పెద్ద కోడలు స్వయానా మేన కోడలైన మా బామ్మ పట్ల, పెళ్లి కాని  ఇద్దరు మనమరాళ్లు స్వరాజ్యం, శాంత అత్తయ్యలు, మెడిసిన్ చదువుతున్న మనమడు, వీళ్ళకి ఓదార్పు, ఆదరణ ఏమీ లభించ లేదు.మెడిసిన్ విద్య కష్టం తో కూడినది. అందు కోసం గూడూరి సుబ్బా రావు  తాత గారు (మా చిన్న తాత గారికి కూడా ఆయన స్వయానా మేనబావ అవుతారు ), మా నాన్న గారి తరఫున పవర్ పట్టా తీసుకుని మా నాన్న గారి వంతు వచ్చిన వ్యవసాయ భూములను అమ్మి, ఆ డబ్బు తో మా నాన్న గారి విద్యాభ్యాసం, అప్పులు తీర్చడం, ఇద్దరు అత్తయ్యలు పెళ్లిళ్లు , ఆరుగొలను కుటుంబ ఖర్చులకి వాడారు, ఈ విధంగా మా నాన్న గారి చదువు , ఆర్ధిక ఇబ్బందులతో నే సాగింది. మా  నాన్న గారికి కానీ, మా మేనత్తలకి కానీ మా ముత్తాత గారి నుంచి ఎటువంటి ఆదరణ, ఆప్యాయత లభించ లేదు. ఒక సారి నేను మా అమ్మతో  “అమ్మా ! మా సూర్యనారాయణ తాత గారు అంత ధనవంతుడు కదా ! మరి మా నాన్న గారికి ఎందుకు సహాయం చేయ లేదు?" అని అడిగాను.  "మీ నాన్న గారికే తన తండ్రి సంపాదించిన ఆస్తి ఎంతో ఉంది. కాబట్టి ఆ అవసరం ఆయనకి  కలగ లేదు. అయినా మీ నాన్న గారికి స్వాభిమానం ఎక్కువ ", అని చెప్పింది.

                                          




                                                  అధ్యాయం 7

ఆరుగొలను లో మా అమ్మ గారు

మా అమ్మ గారి పెళ్లి ఐన రెండేళ్లకే మా తాత గారు పోయారు.  ఆరుగొలను ఇల్లు రెండు వాటాలుగా చేశారు. డాబా మీదకు వెళ్లే మెట్ల గది మా బామ్మ వాటాకి, బావికి వెళ్లే గది మా చిన్న తాత గారి వాటాకి వచ్చింది. మా చిన్న బామ్మ గారికి వాళ్ళు మా తాతగారి మూలంగా ఏదో నష్టపోయారని అపోహ ఉండేది. కానీ మా చిన్న తాతగారు నెమ్మదస్తుడు.  కొంతమంది అలాగే ఉంటారు. ఆవిడకి కోపం వచ్చినప్పుడల్లా బావి దారికి వెళ్లే గదికి తాళం వేస్తుండేది. మా బామ్మ గారు దానికి సమాధానం గా మెట్ల గదికి తాళం వేసేవారు. బావి గదికి తాళం వేయటం వల్ల మా అమ్మ, మా మేనత్తలు అందరూ కూడా బిందెలతో బయటనుండి చుట్టూతా తిరిగి, దాదాపు ఒక ఫర్లాన్గ్ దూరం నడిచి, బావినుంచి నీళ్లుతోడుకొని తెచ్చుకునే వారు. నీళ్లు లేకుండా గడపటం చాలా కష్టం. సాయంత్రాలు డాబా మీదకి వెళ్లక పోయినా 

                             

నష్టం లేదు. నీళ్లు తోడుకోకుండా అడ్డు పడటం మానవత్వమేనా? అటువంటి సందర్భం, ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలలో జరగటం పరిపాటి. మా అమ్మ ఆగర్భ శ్రీమంతురాలు. స్కూలుకి కూడా కార్లలోనే వెళ్లేది. ఇంటిలో నౌకర్లు - చాకర్లు బోలెడంత మంది ఉండేవారు. ఇక్కడ ఆరుగొలనులో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నా కూడా మా అమ్మ చాలా చక్కగా సర్దుకు పోయారు. ఒక సారి మా చిన్న అన్నయ్య (ప్రశాంత్ అన్నయ్య) చంటి పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆరుగొలను లో జ్వరం వచ్చి పాలకోసం ఏడుస్తుండగా పాలు పట్టడానికి ఆ రోజు పాలవాడు రాలేదు. ఇంట్లో పాలు లేవు. మా అమ్మ గారికి తప్పనిసరిగా మా చిన్న బామ్మగారి తలుపు తట్టవలసి వచ్చింది.  మా చిన్న బామ్మ గారి తలుపు తట్టి , " అత్తయ్య గారూ ! మా చంటి పిల్లవాడికి జ్వరం వచ్చింది. పాలవాడు రాలేదు. అందుకని కొంచెం పాలు ఇస్తారా?" అని అడిగింది. పాలు లేవని మా చిన్న బామ్మ విసురుగా  అంది. అక్కడే పడక్కుర్చీ లో కూర్చున్న చిన్న తాత గారు సానుభూతిగా ," పోనీ లేవే !  కొంచెం పాలు ఇవ్వు . పిల్లవాడు ఏడుస్తున్నాడు. పైగా జ్వరం గా ఉంది అని నచ్చ  చెప్పితే , ఆవిడ విసా విసా లోపలి వెళ్లి  సరిగ్గా ఒక ఉగ్గు గిన్నెడు పాలు తెచ్చి "ఢాం" అని క్రింద పెట్టి , ఇంకొకసారి అడగ వద్దు అని గట్టిగా అరిచినట్టు చెప్పి విసుగ్గా తలుపు మూసి వేసింది. ఆ విసురుకి సగం పాలు కింద పడి పోగా, ఆ మిగిలిన కొంచం పాలలో నీళ్లు కలిపి అవి మా అన్నయ్య చేత తాగించింది. మా అమ్మది కూడా చిన్న వయస్సే. చిన్నప్పట్నుంచి దయా గుణం, దానగుణం పుష్కలంగా ఉండేది. ప్రతి రోజూ ఇంటికి కొంత మంది యాచకులు మా అమ్మ వేసే భిక్ష కోసం వస్తుండే వాళ్ళు. ప్రతి రోజూ మా అమ్మ వారందరికీ  బియ్యం  ఇస్తుండేది. మా అమ్మ పెద్ద నాన్న గారు చాలా సందర్భాల లో తిట్టడం, కొట్టటం చేస్తుండే వాళ్ళు. ఇది గమనించిన తాత గారు నెలకి ఒక బస్తా బియ్యం ప్రత్యేకంగా దానం చేసుకోవడానికి మా అమ్మకి కేటాయించారు. అందుకని మా అమ్మకి ఒక గుక్కెడు పాల కోసం జరిగిన రాద్ధాంతం చాలా ఆశ్చర్యం, బాధను కలిగించాయి. ఈ విషయాన్ని మాకు చెప్తున్నప్పుడు మా అమ్మ కళ్ళు చెమర్చేవి. 

మా చిన్న తాత గారి పిల్లలందరూ కూడా అంటే మా నర్సు బాబాయ్, రాంమోహన్ బాబాయ్, మురళీ బాబాయ్, మల్లు బాబాయ్, సీత అత్తయ్య, సుబ్బారావు బాబాయ్ వీళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయం గా "వదినా" అంటూ చుట్టూతా కూర్చుని మా అమ్మ చేత హిందీ పాటలు పాడించుకుంటూ ఉండేవాళ్ళు. మా అమ్మ చాలా శ్రావ్యంగా పాడుతుండేది. వీళ్లంతా చిన్న వాళ్ళే కాబట్టి ఆ పసి హృదయాలలో స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత, వదిన అనే ఒక గౌరవ భావం ఉండేది. అంతే ప్రేమగా వీళ్ళు మా స్వరాజ్యం, శాంత అత్తయ్య, నాన్నగార్లతో ఉండే వారు. మా నాన్న గారిని "రాముడన్నయ్య" అని ఎంతో అభిమానం తో పిలుస్తుండే  వాళ్ళు. మా చిన్న తాత గారు కూడా పిల్లలతో చాలా సరదాగా ఉండేవారట. అలాగే మా మేనత్తలన్నా కూడా మా సత్యం తాత గారికి చాలా అభిమానం. ఒక మహా కవి రాసిన " పిల్లలూ దేవుడూ చల్లని వారే, కల్ల కపటమెరుగని కరుణామయులే", పాట గుర్తుకి  వస్తుంది. పెద్ద వాళ్లందరికీ ముసుగులు ఉంటాయి., కాని  చిన్న పిల్లలకి ఉండవు. చిన్న చిన్న తగాదాలు వచ్చినా వెంటనే వారు మరచి పోతారు. మా అమ్మ అత్తగారింట్లో  పడుతున్న అవస్థలను చూసిన మా చిన్న తాత గారు మా అమ్మను ఉద్దేశించి, " రాముడూ !   కోడలి అవస్థ నేను చూడ లేక పోతున్నానురా ! హైదరాబాదు కి పంపివేసెయ్ ! అని మా నాన్న గారికి చెప్తూండే వారు. ఏది ఏమైనా మా అమ్మకి ఆరుగొలను లో తన మరుదులతో సరదాగా గడిపిన తీపి గుర్తులున్నాయి. మా రామ్మోహన్ బాబాయ్ చాలా సున్నితమైన , నిర్మలమైన మనస్సు కలవాడు. చక్కటి కవితలు రాస్తుండే వాడు. ఆయన ఆధ్యాత్మిక స్థాయి చాలా ఎక్కువ.  బాబాయ్ గారు రాసిన  " మా భాష గానమ్ము లేక గంభీర మౌనమ్ము ", " యవ్వనమా ! ఓ ....ఓ.....పూ వనమా .. "      ఇవి మా అమ్మ ఎంతో శ్రావ్యంగా పాడుతుండేది. సుబ్బారావు బాబాయ్ గారు , " వదినా !  పాటలు పాడుతూ , డాన్సులు చేస్తూ నేను బోలెడంత డబ్బు సంపాదిస్తాను నీవు చూస్తుండు" అని అనేవారట. నండూరి వారి జన్యు కణాల్లో రచనా కౌశల్యం, ఆధ్యాత్మికత, కళాభిరుచి, బహుముఖ ప్రజ్ఞలు పుష్కలం గా ఉన్నాయి.

హైదరాబాదులో మా నాన్నగారు ప్రాక్టీసు పెట్టడం - అబిడ్స్ 

నాన్న గారు విద్యాభ్యాసం పూర్తి అయ్యాక ప్రాక్టీస్ హైదరాబాదులో అబిడ్స్ లో ప్రారంభించారు. ఎదురు గుండానే మూడు గదుల ఇల్లు తీసుకున్నారు. అతి త్వరలోనే ప్రాక్టీస్ వేగం పుంజుకుంది. మా తాత గారి లాగానే మా నాన్నగారి హస్తవాసి కూడా చాలా బాగుండేది. మా జడ్జీ తాత గారికి కూడా మా నాన్న గారె వైద్యం చేస్తుండేవారు. బొగ్గుల కుంట (రామ్ కోటి) లో మా నాన్న గారి క్లాస్ మెట్ ప్రాక్టీస్ చేస్తుండే వారు. అప్పుడప్పుడు మా నాన్న గారు ఆయన క్లినిక్ కి వెళ్తుండే వారు. ఆ డాక్టర్ గారి దగ్గరకి ఒక సారి మా నాన్న గారు వెళ్ళినప్పుడు జనగామ నుండి అల్లాడి రామయ్య  అనే ఒక వైశ్య ప్రముఖుడు వచ్చాడు. ఆయన " మా ఊరు జనగామ లో M.B.B.S  డాక్టర్లు లేనే లేరు. చుట్టుపక్కల నలభై, యాభై గ్రామాలకి జనగామ ఒక కేంద్రం. ఇక్కడికి రైళ్ల, బస్సుల సర్వీసులు కూడా ఉన్నాయి. సరి అయినా వైద్యం అందుబాటులో లేక చాలా మంది, ముఖ్యం గా పేదవారు చాలా అవస్థ  పడుతున్నారు. వైద్యం కోసం వాళ్ళు హైదరాబాదు రావలసి వస్తుంది. M.B.B.S డాక్టర్లెవరైనా మా జనగామ కి వస్తే వారు మాకు ఎంతో మేలు చేసినట్లుగా భావిస్తాం. దవాఖాన, ఇల్లు అన్నీ చూసి పెడతాం”.  అని చెప్పారు. కాక పోతే పట్టణం లో ఉండే సౌకర్యాలు ఈ ఊరికి అందుబాటు లో లేవు. అంటే విద్యుచ్ఛక్తి  లేదు. సౌకర్యవంతమైన మంచి ఇండ్లు లేవు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు లేవు. అందుకని ఎవ్వరూ ఇక్కడికి రావడానికి ఇష్ట పడరు అని వివరించారు, మా నాన్న గారి స్నేహితుడే నీవు అక్కడకి వెళ్లకూడదా? అని సలహా ఇచ్చాడు. మా నాన్న గారు వెంటనే నిర్ణయం తీసుకో లేక పోయారు. హైదరాబాదుకి దూరం గానే స్వతంత్రం గా ప్రాక్టీస్ పెట్టి బామ్మని తీసుకు రావాలని అనుకున్నారు. అప్పటికే తెలంగాణా లో కొన్ని ప్రాంతాలు చూసి వచ్చారు. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల పట్టణం లో ఒక క్లినిక్ కోసం అడ్వాంస్ ముందుగానే ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డారు. నిజానికి జగిత్యాల జనగామ కన్నా పెద్ద ఊరే. కాకపొతే రైళ్ల సౌకర్యం లేదు. ఇక్కడ అబిడ్స్ లో ప్రాక్టీస్ బాగానే ఉంది.అన్నయ్యలిద్దరూ కూడా అబిడ్స్ లోనే మెథడిస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నారు. మా అక్కయ్య అప్పుడు చిన్న పిల్ల. ఈ విధం గా పరిస్థితులు కుదుట పడుతున్న సమయం లో మా జడ్జీ తాత గారు 1952 వ సంవత్సరం లో జూన్  21  న హఠాత్తు గా 52  ఏళ్ళ వయస్సులో కన్ను మూశారు.  

    మా నాన్న గారిని జనగామ వాస్తవ్యుడు అల్లాడి రామయ్య  గారు పదేపదే జనగామకు రమ్మని ప్రాధ్యేయ పడ్డారు. హైదరాబాదులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. జనగామ ఒక పెద్ద పల్లెటూరు. సరైన స్కూళ్ళు, ఇల్లు కూడా ఉండవు. చివరకి ఆ పల్లెటూరి ప్రజలకే వైద్యం చేయాలి అని ఆయన నిశ్చయించుకుని అక్కడికి వెళ్లారు ప్రాక్టీస్ పెట్టడానికి. జనగామ వాసులు నాన్న గారి దగ్గర వైద్యం తీసుకున్న వారందరికీ నాన్న గారి హస్తవాసి మీద గురి కుదిరింది. అప్పుడు మా నాన్నగారికి  తాత గారు చెప్పిన, ఇచ్చిన సలహా గుర్తుకి వచ్చింది. మనం వైద్య సేవ ముఖ్యంగా పేదవారి కోసం , డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టలేని వారి  కోసం చేయాలి. మరీ ముఖ్యంగా మన దేశం లో వేలాది కుగ్రామాల్లో కనీస వైద్య సౌకర్యాలు లేక ఎంతో మంది చని పోతున్నారు. వైద్య వృత్తి అన్నది సమాజ సేవ కోసమే తప్ప , డబ్బు సంపాదించడం ముఖ్య లక్షణం కాకూడదు. అని ఆయన చెప్పిన సలహాలు, తండ్రి గారి జీవితం లోనే ప్రత్యక్ష అనుభవాలను దగ్గరగా చూసారు. తండ్రి వద్దకు వైద్యసేవ కోసం వచ్చిన వారికి తాత గారు చేస్తున్న సేవనే, దుఃఖంతో వచ్చిన రోగులు, నవ్వుతూ వెళ్తూ, వారిచ్చిన ఆశీర్వాదాలు  “డాక్టర్ బాబూ ! మీరు , మీ కుటుంబం అంతా చల్లగా నూరేళ్లు బతకాలి. మా లాంటి పేద వారి కి మీరు కొండంత అండ," అని చెప్తూ ఉండడం వంటివి మా నాన్న గారి మనోఫలకం మీద మెదిలాయి . ఆయన చివరకి జనగామ వెళ్లాలని  నిశ్చయించుకున్నారు. జనగామ వాస్తవ్యులు అందరూ కూడా చాలా సంతోష పడ్డారు. చివరకి ఆయన జనగామ కి వెళ్లాలని కానీ మా నాన్న గారు  తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాదు లోని అత్తగారి వైపు బంధువులెవరికీ కూడా నచ్చ లేదు. “మేమంతా ఇక్కడే ఉన్నాం.

హైదరాబాదు లో సౌకర్యాలు మెండు.  అబిడ్స్ సెంటర్ లో మీ ప్రాక్టీస్ కూడా చక్కగా వృద్ధి చెందుతుంది.  ఆ చిన్న కుగ్రామం లో ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఎలా బ్రతుకుతారు?  మా అమ్మాయి ఇన్ని సౌకర్యాల మధ్య పెరిగింది. ఆ పల్లెటూళ్ళో ఎన్ని ఇబ్బందులు పడుతుందో?" అంటూ నానా రకాలుగా నిరుత్సాహ పరిచారు. మా అమ్మ మాత్రం నాన్న గారి నే  సమర్థించింది. చిన్నప్పట్నుంచీ మా అమ్మకి  బీదవాళ్లంటే చాలా జాలి. ఇంట్లో ఏది కనిపిస్తే అది అవసరమైన వారికి ఇచ్చేస్తూ ఉండేది. చివరకి మా నాన్న గారి నిర్ణయమే  నెగ్గింది. 1953 వ సంవత్సరం జూన్ నెలలో జనగామ లో కాపురం పెట్టారు. పోలీస్ స్టేషన్ ఎదురు గుండానే క్లినిక్ కి మంచి ఇల్లు దొరికింది. ఉన్న ఇళ్లలో ఒక ఇల్లు  ప్రముఖ బట్టల వ్యాపారి చీలా రాజయ్య గారిది  అద్దెకు దొరికింది. జనగామ గ్రామం రెండు భాగాలు గా చెప్పు కోవచ్చును.

                                              

జనగామలో డాక్ బంగళా లో తీసిన ఫోటో:    

సుశీల పిన్ని, చేతిలో విజ్జి ,పద్మ పిన్ని శశి మామయ్య

ప్రశాంత్ అన్నయ్య, కిశోర్ బావ, రాం అన్నయ్య, కాశ్యప్,శివరావు అన్నయ్య

వరలక్ష్మి పిన్ని, ప్రసన్న అక్కయ్య, సూర్యలాలస, సాయిరాం , భవాని అక్కయ్య

 రైల్వే స్టేషనుకి ఇవతల ఒక భాగం, అటువైపున ఇంకొక భాగం గా చెప్పుకో వచ్చును. రైల్వే స్టేషనుకి వెనుక బాగానే బస్టాండు ఉంది . హైదరాబాదు నించి, వరంగల్  వైపు వెళ్లే బస్సులు ముఖ్యం గా పాసెంజర్ బస్సులు హై వే నించి లోపలి కి వచ్చేవి. కొన్ని ఎక్స్ ప్రెస్  బస్సులు ఊళ్లోకి రాకుండానే వెళ్లిపోయేవి . రైల్వే స్టేషనుకి వెనుక భాగాన్నే రైల్వే క్వార్టర్లు ఉన్నాయి మార్కెట్టు అంతా ఇటువైపే ఉంది. అంటే హోటళ్ళూ, కిరాణా, ఫాన్సీ దుకాణాలు , పుస్తకాల దుకాణాలు, గవెర్నమెంటు, ప్రైవేటు స్కూళ్ళు, ఇంకొక గవర్నమెంటు స్కూలు జిల్లా పరిషత్ స్కూల్ గా  మారింది. చుట్టూ పక్కల గ్రామాల నుండి , చాలా మంది వైశ్యులు వచ్చి ఇక్కడ స్థిర పడ్డారు. అన్ని వ్యాపారాలు వాళ్ళే నిర్వహిస్తూ ఉండే వారు. పోలీసు స్టేషనుకి ఎడమ పక్క ఉన్న సందు నుంచి వెళ్ళితే, అక్కడ రాజశ్రీ టాకీసు ఉంది. మురళీ బాబాయ్ నవయుగ  ఫిలిమ్స్ లో పని చేస్తున్నప్పుడు, వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు వస్తుండేవారు. కుర్చీలు, బెంచీలు, నేల తరగతులు ఉండేవి శనివారాలు స్టూడెంట్లకి కన్సెషన్ ఇచ్చేవారు.  మూషిక రాజులు యథేచ్ఛగా తిరుగుతుండేవి. సింగల్ ప్రొజెక్టర్ కావటం వల్ల రీలు మార్పు కోసం విరామాలు ఉండేవి . అక్కడ టెక్నీషియన్ బషీర్, మాకు డాక్టరు గారి పిల్లలని చెప్పి ప్రొజెక్టర్ రూము లోకి తీసుకెళ్లి అన్నీ చెప్తుండేవాడు. మధ్య మధ్య లో ఆ ఫిలిం రోలు తెగి పోతున్నప్పుడల్లా తెర మీద " రీలు మార్పు , నిశ్శబ్దం " అని వచ్చేది. మళ్ళీ బషీరు దానిని అతుకుపెట్టి సినిమాని నడుపుతుండే వాడు. ఆయనే మా జనగామ లో ఏకైక రేడియో  రేపైరు షాపు ఓనరు. ఆ తెగి పోయిన రీళ్లను మాకు ఇస్తుండే వాడు. దానిని వెలుతురు లో పెట్టి చూస్తే, సినిమా వాళ్ళ ముఖాలు కనిపిస్తూ ఉండేవి. ఆ తర్వాత వ్యూ మాస్టర్ అనే ఒక చిన్న బొమ్మ ప్రొజెక్టర్ అమ్మే వారు. ఈ తెగి పోయిన ఫిలిం ముక్కలని ఒక సైడుకి అమర్చి, ఈ వ్యూ మాస్టర్ నొక్కినప్పుడు , కన్నం గుండా చూస్తే బొమ్మలు స్పష్టంగా కనిపించేవి. అంతే కాకుండా ఊళ్లోకి అప్పుడప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రొజెక్టర్ (Bi-scope) లో తమాషా పాటలు పాడుతూ ఈ సినిమా (రీళ్లు) బొమ్మలు చూపిస్తుండే వారు. ఇదంతా మాకు చాలా తమాషా గా ఉండేది . ఈ మార్కెట్టు ప్రాంతం లోనే బీటు బజారు . ఇక్కడ ధాన్యం కొని అమ్మే వాళ్ళు ఏజెంట్ల తో చాలా హడావుడి గా ఉండేది . పోలీసు స్టేషన్ పక్క సందు లో ఇంకొంచెం ముందుగా వెళ్తే  ఎడమ వైపున బుచ్చి రామయ్య పంతులు గారి పాఠశాల ఉండేది. దాని తర్వాత చిన్న కేశవ స్వామి ఆలయం. ఈ ఆలయానికి నేను మా అమ్మతో తరుచూ వెళ్తుండే వాడిని. ఆ గుడి పూజారీ గారు  మా అమ్మ గారు రాగానే పరిగెత్తుకు వచ్చే వారు. మా అమ్మని అందరూ డాక్టరమ్మ గారు, డాక్టర్ దొరసాని అని పిలిచే వారు. ఇంకాస్త పైకి వెళ్తే , Z.P.H.S లో పని చేసే మాస్టర్ల ఇళ్లన్నీ వరుసగా ఉండేవి.  అంత వరకే నేను వెళ్తుండే వాడిని . అక్కడే అల్లాడి రామయ్య  గారి రైసు మిల్లు పెద్దది ఉండేది. మా నాన్న గారి క్లినిక్ పోలీసు స్టేషన్ కి ఎదురుగానే ఉండేది. నాన్న గారు రివాల్వింగ్ చైర్ లో కూర్చునే వారు . పోలీసు స్టేషన్  పక్కనే దిగువ భాగాన మెట్లు దిగి వెళ్తే చాకలి వాళ్ళు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళుంటారు. మా ఇంటి చాకలి నరసింహులు , అబ్బ సాయిలు , తర్వాత చాకలి లక్ష్మి, ఆమె కూతురు చంద్రి వస్తుండే వారు. వీరంతా మా ఆస్థాన చాకలి వాళ్ళు. లక్ష్మి, చంద్రి మా ఇంట్లో స్వతంత్రం గా ఉండేవారు. మా అమ్మ వాళ్లకి ధారాళం గా చీరలు, డబ్బులు, వారి ఇంట్లోకి కావలసిన సామాన్లు, పండగలకి, పబ్బాలకి డబ్బులు ఇస్తుండేది. క్లినిక్ కి  కొంచెం ముందుగా వెళ్తే నెహ్రూ  పార్క్ వస్తుంది. అక్కడ నెహ్రూ గారి బొమ్మ ఉంటుంది. ఎడమ వైపు వెళ్తే వరంగల్, కుడి వైపు వెళ్తే హైదరాబాదు `హై వే వస్తుంది. అక్కడే ఎడమ వైపు వెళ్తే అల్ సెయింట్స్ స్కూల్ బ్రాంచ్ ప్రిస్టిన్స్టిట్యూట్ స్కూల్ ఉంది. చాలా పెద్ద భవనం. ఇంగ్లాండు నుంచి క్రైస్తవ మత ప్రచారకులు ఇక్కడే ఉండేవారు. నేను  1964 - 65  లో నా H.S.C (11th class) పరీక్ష అక్కడే రాసాను. అదే మార్గాన కొంచెం పైకి వెళ్తే వసంత వాగు బ్రిడ్జి వస్తుంది. ఈ బ్రిడ్జి మీదనే అతి ఘోరమైన రైలు ప్రమాదం అర్ధ రాత్రి సమయం 1955 లో జరిగింది . అర్ధ రాత్రి వర్షా కాలం, ఎడ తెరిపి లేకుండా కుండపోత వర్షం. ఇంజను తో పాటు రెండు బోగీలు, ఆఖరి రెండు బోగీలు తప్ప మిగిలిన అన్ని బోగీలు పడిపోయాయి. నిజానికి అది చాలా చిన్నవాగు. అక్కడ జలప్రవాహ వేగానికి బోగీలు కొట్టుకు పోయాయి. హృదయవిదారకంగా దృశ్యాలు ఆర్తనాదాలు జనగామ అంతా ప్రకంపనలు, పెద్ద చప్పుళ్ళు అందరూ  ఉలిక్కి పడ్డారు. మా నాన్నగారు, ఇంకా ఊళ్లోని ప్రజలందరూ కూడా హుటాహుటీన ప్రమాద స్థలానికి వెళ్లారు. మా నాన్న గారు ఆ రోజు రాత్రంతా, ఆ మర్నాడు సాయంత్రం వరకూ వైద్య సహాయం చేస్తూనే ఉన్నారు. జనగామ రైలు ప్రమాదం అనే శీర్షిక తో అన్ని పత్రికలలో (వార్తల్లో) వచ్చాయి. అది మా పాఠ్య పుస్త్తకాల్లో కూడా మేము చదువుకున్నాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం లో రైల్వే శాఖ మంత్రి గా పని చేస్తున్న లాల్ బహాదుర్ శాస్త్రి  గారు తన పదవికి ఈ దుర్ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేశారు. అందుకే ఇంత వివరం గా చెప్పవలసి వచ్చింది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. మర్నాడు మా పని వాడు జెమ్మయ్య తన భుజాల మీద కూర్చో పెట్టుకుని నన్ను ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. అప్పట్లో నాకు అంత అవగాహన లేదు. లీలగా కొన్ని దృశ్యాలు గుర్తు ఉన్నాయి. మా నాన్నగారి కంపౌండర్ శంకరయ్య పెద్ద మొత్తం లో బోలెడన్ని మందులు, ఇతరత్రా సామాన్లు చేరవేస్తూనే ఉన్నాడు  అక్కడ ఉన్న M.B.B.S  డాక్టర్లు ఇద్దరే. మా నాన్నగారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు. చాలా మందికి నాన్న గారు సమయానికి వైద్యం చేసి ఎంతో మందికి ప్రాణ దానం చేశారు. ఈ విధం గా మా నాన్న గారు ఈ జనగామ అనే చిన్న గ్రామానికి రావడం బహుశా ఇంత మందికి వైద్య సేవ చేసి, ప్రాణ దానం ఇవ్వడానికే కాబోలు ! దాదాపు ఒక వారం రోజులపాటు నిద్రాహారాలు మాని జనగామ హాస్పిటల్ లో చేరిన శరణార్థు లందరికీ  వైద్య సేవ అందించారు. ఈ సంఘటనతో మా నాన్నగారి పేరు మారు మ్రోగింది. అల్లాడి రామయ్యగారు, ఇతర ప్రముఖులందరూ 

           

నాన్నగారు ,ఒళ్ళో నీరజ, పక్కన శ్రీకాంత్ (లాలస పిల్లలు )              నాన్నగారు, శ్రీకాంత్ 

వచ్చి, మా నాన్నగారికి ప్రత్యేకం గా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాదులో స్థిర పడిన తన ప్రాక్టీసుని, అన్ని సౌకర్యాలను కూడా వదులుకొని, మా తాతగారు చెప్పిన విధంగా తండ్రి బాటలో నడిచి తన త్యాగశీలతను నిరూపించుకున్నారు. మా తాత గారు నండూరి శివ రావు గారు, ఆయన కుమారుడిగా మా నాన్న గారి వంశం లో జన్మించిన మేమంతా చాలా అదృష్టవంతులం. మా నాన్న గారు తన పూర్వ వైభవాన్ని ఎప్పుడో ఆరుగొలను లోనే  వదిలి  వేశారు. జనగామ లో చాలా నిరాడంబరంగా జీవించారు. మా ఇల్లు స్టేషన్ కి ఇవతల వైపు ఉంది. రైల్వే స్టేషన్ కి ఇవతల వైపు పెద్ద పెద్ద రావి చెట్లు వరసగా ఉంటాయి. తిన్నగా వెళ్తే మెయిన్ రోడ్డుకు కుడి వైపున సేల్స్ టాక్స్ (కమర్షియల్ టాక్స్) ఆఫీసు . ఎడమ వైపు బేకరీ మలయాళీ ముస్లిం అతనిది, డబల్ రొట్టి తయారు చేస్తుండే వాడు. బన్ను ఒక అణా, డబల్ రొట్టి డబల్ డెక్కర్ లాగా ఉంటుంది  నాలుగు  అణాలు . ఒక కుర్ర వాడు బుట్టలో ఇవి పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉండే వాడు.ఈ బేకరీ పక్కనే రామయ్యర్ గారి హోటల్ ఉండేది. దాని పక్కన ఐస్ క్రీం తయారు చేసే దుకాణం ఉండేది. దానిలో రంగు రంగుల ఐస్ ఫ్రూట్లు రెండు పైసలకు ఒకటి , పాల ఐస్ ఫ్రూట్ ఒక అణాకి, కప్ ఐస్ క్రీం నాలుగు అణాలకి అమ్ముతుండే వారు. ఈ ఐస్ ఫ్రూట్ నే ఐస్ క్యాండీ అంటారు. మేము రోజూ  ఎన్ని తింటూ ఉండే వాళ్ళమో ! ఇక పొతే మా జనగామ లో మేమున్న వైపే గవర్నమెంటు  ఆసుపత్రి, గవర్నమెంటు  ఆడ పిల్లల బడి , తహసీల్దారు  ఆఫీసు, పిల్లల ఆట స్థలం, యువజన గ్రంథాలయం, స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్, B.D.O ఆఫీసు, ఆంధ్ర భాషాభివర్ధిని ఉన్నత పాఠశాల అనే ప్రైవేటు స్కూలు, రంగప్ప చెరువు, గీతాశ్రమము, బాణాపురం ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. అయితే జూన్ 1953 లో మా నాన్నగారు ఈ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టినప్పుడు కరెంటు లేదు. మా చిన్నతనం లో మేము గుడ్డి దీపాల్లో, పెట్రోమాక్స్ లైటు లో చదువుకున్నాం బహుశా 1959  లో మా ఇంట్లో మొట్ట మొదటి సారిగా కరెంటు వచ్చింది. ఇప్పుడు మన ఇంటికి వెళదాం. పెద్ద చౌరస్తా , చిన్న చౌరస్తా దాటినాక మా ఇల్లు రోడ్డుకు కుడి వైపున, స్టేషన్ నుంచి ఐదు నిమిషాల దూరం లో ఉంటుంది.. మొత్తం ఐదు గదులు. ఇంటికి రెండు వైపులా అరుగులు, ముందు పెద్ద గది దానికి రెండు దృఢమైన తలుపులు, అది మా నాన్న గారు పేషెంట్లనీ చూడ దానికి కావలసిన ఏర్పాట్లు, ఆడ పేషెంట్లనీ చూడడానికి పెద్ద టేబుల్ , పరదా ఉంది. నాన్న గారి విక్రమార్క సింహాసనం, టేబుల్, కొన్ని కుర్చీలు కూర్చోవడానికి ఉన్నాయి. అక్కడే గోడలో బీరువా పుస్తకాలు పెట్టుకోవడానికి, ఆ పెద్ద బల్లకి కూడా మూడు బీరువాలు లాగా ఉండేవి. ముగ్గురు పిల్లల పుస్తకాలు పెట్టు కోవడానికి. తరువాత మండువా గది . పెద్ద మండువా అక్కడ ఎప్పుడు ఒక బకెట్ లో నీళ్లు ఉండేవి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి. మేమందరం అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు జంప్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ గదిలో మేము పడుకునే వాళ్ళం. నాన్న గారి మందుల బీరువా పెద్దది, ఆయన బట్టల బీరువా, మంచాలు ఒక వైపు, ఇంకొక వైపు  చిన్న బీరువా నాది, దాని పైన కూడా నాన్న గారి మెడికల్ ఎక్విప్మెంట్స్, గోడ అల్మారా లో రేడియో ఉండేది. మండువాకి నాలుగు స్తంభాలు ఉండేవి. తరువాత గదిని మధ్య గది అనేవాళ్ళం. అక్కడ ఒక మంచం అది మా అమ్మా నాన్నగార్ల గది, దానిని ఆనుకుని స్టోర్ గది కం పూజ గది. రక రకాల దేవుళ్ళ ఫోటోలు ఉండేవి. అన్ని వెచ్చాలు (provisions), ఊరగాయలు అంటే పచ్చళ్ళు వగైరా వగైరా ఉండేవి. మా అమ్మ అక్కడ కూర్చుని గంటలు గంటలు ధ్యానం చేస్తుండేది. మధ్య గదిని ఆనుకుని ఒక పెద్ద మెట్టు దిగి కిందకి వెళ్తే వంట ఇల్లు. దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. మంచి నీళ్ల  బిందెలు పెట్టుకోడానికి గట్టు,గిన్నెలు, డబ్బాలు పెట్టుకోవడానికి షెల్ఫులు ఉన్నాయి.ఇంకొక వైపు  గట్టు మీద పొట్టు పొయ్యిల మీద, బొగ్గుల కుంపటి మీద అమ్మ వంట చేసేది మడి కట్టుకుని, అక్కడే మేము పీటల మీద కూర్చుని భోజనాలు